
సాక్షి, గుంటూరు: నగరంలో ఎల్‌ఈడీ బల్బుల వ్యవస్థను చీకట్లు కమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో శివారు కాలనీలు, విలీన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అధికంగా బిల్లుల చెల్లింపు పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టు సంస్థకు గతంలో పనిచేసిన కొందరు అధికారులు ఎక్కువ మొత్తంలో బిల్లులు చెల్లించారు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు నిలిపివేసి నోటీసులు జారీ చేయడంతో వారికి చిర్రెత్తుకొచ్చింది. నగరపాలక సంస్థకు విద్యుత్ బిల్లులు ఎంత ఆదా అవుతుందనేది తమకు సంబంధం లేదని, లోడును బట్టి బిల్లులు చెల్లించాల్సిందేనంటూ కాంట్రాక్ట్ సంస్థ పట్టుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తమకు విద్యుత్ బిల్లు ఎంత ఆదా అవుతుందో అంత మాత్రమే చెల్లిస్తామని నగరపాలక సంస్థ అధికారులు తేల్చి చెప్పేశారు.
మూడేళ్లు దాటుతున్నా పూర్తి కాని పనులు
గుంటూరు నగరంలో విద్యుత్ ఆదా చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఎంఎస్ జీవో నంబరు 74 ప్రకారం ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసు లిమిటెడ్ సంస్థతో 2015లో అగ్రిమెంట్ నగరపాలక సంస్థ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 25,008 ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతోపాటు ఏడేళ్ళపాటు నిర్వహణ, రిపేర్లు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పనుల్ని పది వారాల్లో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ మూడేళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కైన అప్పటి అధికారులు కొందరు 2017 జనవరి నుంచి నెలకు రూ. 30 లక్షలు చొప్పున బిల్లులు చెల్లించేశారు. నిర్వహణ బాధ్యతలు, రిపేర్లు అయినా చేస్తున్నారా? అంటే అది లేదు.
శివారు కాలనీలో చీకట్లు
నగర శివారు కాలనీలైన జన్మభూమి నగర్, స్వర్ణభారతినగర్, ఏటుకూరు రోడ్డు, సుద్దపల్లి డొంక, చండ్రరాజేశ్వరరావు నగర్ వంటి పలు కాలనీలతోపాటు విలీన గ్రామాల్లోసైతం ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీలు, గ్రామాల ప్రజలు అంధకారంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై జన్మభూమి కార్యక్రమాల్లో సైతం నగరవాసులు అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన అక్రమ బిల్లుల చెల్లింపును గుర్తించిన అధికారులు 2017 ఆగస్టు నుంచి కాంట్రాక్ట్ సంస్థకు బిల్లులు నిలిపివేశారు. అంతేకాకుండా నిర్వహణ, రిపేర్లతో పాటు గతంలో తీసుకున్న బిల్లులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు రావాలంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు నోటీసులు జారీ చేశారు. దీనిపై జనవరి 19వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘వెలుగు చూసిన చీకటి కోణం’’ అనే కథనానికి స్పందించిన కాంట్రాక్ట్ సంస్థ ఐదు రోజుల క్రితం జీఎంసీ అధికారులతో సమావేశమైంది.
చేతులెత్తేసిన కాంట్రాక్టర్
ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు తరువాత బల్బులకు సగం లోడు మాత్రమే పడుతుందని, దాన్ని బట్టి తమకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ పట్టుబట్టింది. లోడుతో తమకు సంబంధం లేదని, అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ బిల్లులో ఎంత ఆదా అవుతుందో అంత మొత్తం మాత్రమే చెల్లించే వీలుందని నగరపాలక సంస్థ అధికారులు తేల్చి చెప్పారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల అగ్రిమెంట్ మార్చుకుని వస్తామని, అప్పటి వరకు తాము రిపేర్లు, నిర్వహణ బాధ్యతలు నిర్వహించలేమని చేతులెత్తేసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం వేసిన లెక్కల ప్రకారం సుమారుగా 3వేల బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈసంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు సంస్థ చేతులు ఎత్తేయడంతో కొత్త బల్బులు ఏర్పాటు చేయలేక వాటి నిర్వహణ, రిపేర్లు ఎవరు చూడాలో తెలియక నగరపాలక సంస్థ అధికారులు సతమతమవుతున్నారు.
డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం
ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసు లిమిటెడ్ సంస్థకు అగ్రిమెంట్ ప్రకారం బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. అయితే వారు అందుకు అంగీకరించకుండా అగ్రిమెంట్ మార్చుకుని వస్తామని వెళ్లారు. ఈవిషయాన్ని డీఎంఈ కన్నబాబు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు కొత్త ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు చేస్తాం. – చల్లా అనురాధ, కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment