తూర్పుగోదావరి జిల్లాలోని ఊనగట్ల గ్రామం
గ్రామాల్లో పూర్తి స్థాయిలో కానరాని సంక్రాంతి సందడి
మందగించిన వ్యాపారాలు
తగ్గిన పిండివంటల ఘుమఘుమలు
గత వైఎస్సార్ సీపీ పాలనలో విస్తృతంగా సంక్షేమం
జనం చేతిలో పుష్కలంగా డబ్బు
సాక్షి, రాజమహేంద్రవరం/చాగల్లు: సంక్రాంతి వస్తోందంటే గోదావరి వాసుల అతిథి మర్యాదలే గుర్తుకొస్తాయి. గోదారోళ్లా మజాకా అనిపిస్తారు. అందుకే ఎక్కడున్నా ఈ పెద్ద పండగకు వారం నుంచి మూడు రోజుల ముందే స్వగ్రామాలకు వచ్చేస్తారు. ఆటపాటలు, కోడి పందేలు, బావామరదళ్ల అల్లర్లతో అసలు తగ్గేదేలే అన్నట్టుగా సంబరంగా ఈ పండగ నిర్వహించుకుంటారు. నచ్చిన వంటకాలు చేసుకుంటారు. కుటుంబమంతా ఒక్కచోటకు చేరి సంతోషంగా గడుపుతారు. కొత్త అల్లుళ్లకు పదుల సంఖ్య వంటలు వండి విందుభోజనం పెడతారు. గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంక్రాంతి సందడి ఈ ఏడాది ఆశించిన మేర కనిపించడం లేదు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా.. జనం కష్టపడి సంపాదించుకున్నదానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ఫలితంగా గత ఏడాది సంక్రాంతి పండగను ప్రజలు ఎంతో సంబరంగా నిర్వహించుకున్నారు. కానీ, ఈ ఏడాది ఆ సందడి కానరావడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. వరుస విపత్తులతో ఖరీఫ్ పంటలు దెబ్బ తినడం.. ఆర్థిక సమస్యలు.. పెరిగిన ధరలు వంటి కారణాలతో ప్రజల వద్ద డబ్బు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది దాదాపు ఏ వ్యాపారమూ ఆశించిన మేర జరగడం లేదు. గ్రామీణ ప్రజల్లో పండగ జోష్ కూడా కనిపించడం లేదు.
ఊనగట్ల.. పండగ కనబడటంలే..
మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉన్న ఊనగట్ల జనాభా 7,500. గ్రామంలో 5,300 మంది ఓటర్లున్నారు. ఉదయం 9 గంటల సమయంలో ‘సాక్షి’ బృందం ఆ గ్రామంలోకి అడుగు పెట్టింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విస్తృతంగా పర్యటించింది. కనబడిన ప్రతి ఒక్కరినీ పలకరించింది. గత ఏడాది ఈపాటికే గ్రామంలో కొద్ది రోజుల ముందే సంక్రాంతి సందడి కనిపించేది. కానీ ఈసారి భోగి పండగ ముందు రోజు కూడా వీధుల్లో సంక్రాంతి ముగ్గులు, ఇళ్లల్లో బంధువుల సందడి కనిపించలేదు. గొబ్బెమ్మల కోలాహలమే లేదు. దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో పిండివంటలు వెతికినా దొరకని పరిస్థితి. అదేమని గ్రామస్తులను ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. ‘గత ఏడాదే నయం. చేతి నిండా డబ్బుండేది. పండగ ధూం ధాంగా చేసుకునే వాళ్లం’ అంటూ నిట్టూర్చారు.
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.51.07 కోట్ల మేర సంక్షేమం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. ఈ క్రమంలో ఊనగట్ల గ్రామానికి 33 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ , పరోక్ష చెల్లింపుల విధానంలో ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డీబీటీ ద్వారా రూ.33,70,37,857, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.14,28,32,390 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇవి కాకుండా నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. అమ్మ ఒడి, పింఛన్లు, చేయూత, జగనన్న విద్యా, వసతి దీవెన వంటి అనేక పథకాలతో ఆర్థిక ఆసరా కల్పించారు. పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో అప్పట్లో సంక్రాంతి పండగను సంతోషంగా నిర్వహించుకునే వారమని పలువురు ‘సాక్షి’కి చెప్పారు.
వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – మట్టా వెంకట్రావు, ఊనగట్ల,సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment