గ్రామాలే మన బలగం | Budget focuses on rural roads and employment generation | Sakshi
Sakshi News home page

గ్రామాలే మన బలగం

Published Sun, Feb 2 2025 4:38 AM | Last Updated on Sun, Feb 2 2025 4:55 AM

Budget focuses on rural roads and employment generation

మోదీ 3.0... గ్రామాలకు మహర్దశ

సొంతింటికి రాచ ‘బాట’... 

తాగునీటికి నిధుల ‘కుళాయి’... 

స్కూళ్లు, పీహెచ్‌సీలకూ బ్రాడ్‌బ్యాండ్‌ యోగం...

న్యూఢిల్లీ :  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా మోదీ 3.0 సర్కారు తాజా బడ్జెట్లో పూర్తి అండదండలు అందించింది. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు పుష్కలంగా నిధులు కేటాయించారు. అలాగే,  ఉపాధికి ఢోకా లేకుండా.. గ్రామీణ రోడ్లు పరుగులు తీసేలా.. బడ్జెట్లో ఫోకస్‌ చేశారు. 

ఇక తాగునీటి పథకం.. జల్‌ జీవన్‌  మిషన్‌ను 100% పూర్తి చేసేందుకు మరో మూడేళ్లు  పొడిగించి, నిధుల వరద పారించారు. భారత్‌నెట్‌ గొడుగు కింద ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ సెకండరీ స్కూళ్లు, పీహెచ్‌సీలకు సైతం  హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం దక్కనుంది.  

సొంతింటికి ఫుల్‌ సపోర్ట్‌ (పీఎంఏవై) 
2025–26 కేటాయింపులు:  రూ.74,626 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.46,096 కోట్లు (సవరించిన అంచనా)
పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి ఫుల్‌ సపోర్ట్‌ లభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని పీఎంఏవై 2.0 స్కీమ్‌ కింద చేపట్టనున్నట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించడం తెలిసిందే. పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అదనంగా కోటి ఇళ్లు అందించే పీఎంఏవై (అర్బన్‌)కు ఈ బడ్జెట్లో రూ.19,794 కోట్లు కేటాయించారు. 

2025–26లో గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసిన లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ స్కీమ్‌ కింద 10 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చనున్నారు. ఇందుకు మొత్తం రూ.3,500 కోట్లను కేటాయించారు. పీఎంఏవై (గ్రామీణ్‌)కు రూ.54,832 కోట్లు దక్కాయి. 2029 మార్చికల్లా రూ.3.06 లక్షల నిధులతో 2 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 2024–25లో 40 లక్షల ఇళ్ల లక్ష్యానికి గాను డిసెంబర్‌ నాటికి 18 రాష్ట్రాల్లో 27.78 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.  

గ్రామీణ రోడ్లు.. టాప్‌ గేర్‌
2025–26 కేటాయింపులు: రూ.19,000 కోట్లు
2024–25  కేటాయింపులు: రూ.14,500 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్‌ స్కీమ్‌ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్‌ నాలుగో దశను గత బడ్జెట్లో సీతారామన్‌ ప్రకటించగా.. ఇప్పుడు జోరందుకుంటోంది. 

25,000 ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు దృష్టిపెట్టుకుని పక్కా రోడ్లతో అనుసంధానించనున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 17,570 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం సర్వే పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 35,000 కిలోమీటర్ల పొడవైన పక్కా రోడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘గ్రీన్‌’టెక్నాలజీతో 18,000 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు.

‘ఉపాధి’కి ఢోకా లేదు
2025–26 కేటాయింపులు: రూ.86,000కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.86,000కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈసారీ నిధుల ‘హామీ’దక్కింది. అయితే, 2024– 25 సవరించిన అంచనాల (రూ.86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో కేటాయించారు. రా ష్ట్రాల్లో లక్ష్యాలు, అవసరాలను బట్టి అవసరమైతే మరి న్ని నిధులను కేటాయించే అవకాశం ఉంది. 2023– 24లో రూ.60,000 కోట్లు కేటాయించగా, వాస్తవ వ్యయం రూ.89,153 కోట్లు కావడం గమనార్హం.

జల్‌జీవన్‌ మిషన్‌... మరో మూడేళ్లు పొడిగింపు
2025–26 కేటాయింపులు: రూ.67,000 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ.22,694 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రా>మ్‌ను అమలు చేస్తున్నారు. 2024 నాటికి ఇది సాకారం కావాల్సి ఉండగా.. 100 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఏకంగా మూడు రెట్లు నిధులు పెంచారు. 

కాగా, ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళాయి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా. 2025–26లో 1.36 కోట్ల కనెక్షన్లు అందించాలనేది బడ్జెట్‌ లక్ష్యం. కాగా, ‘జన్‌ భాగీధారీ’ద్వారా నీటి సరఫరా మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై దృష్టి పెట్టున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

కనెక్ట్‌ టుభారత్‌ నెట్‌..  
2025–26కేటాయింపులు: రూ.22,000 కోట్లు
2024–25  కేటాయింపులు: రూ. 6,500 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను (దాదాపు 2.5 లక్షలు) హైస్పీడ్‌ బ్రాండ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌ చేయాలనేది ఈ స్కీమ్‌ ఉద్దేశం. ఇప్పటిదాకా 2,14323 పంచాయితీలను కనెక్ట్‌ చేశారు. 6,92,676 లక్షల కి.మీ. పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ వేశారు. అదనంగా 1,04,574 వైఫై హాట్‌ స్పాట్స్, 12,21,014 ఫైబర్‌–టు–హోమ్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 పంచాయతీలకు కొత్తగా బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించనుండగా... 64,000 పంచాయతీల్లో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనున్నారు.

స్వచ్ఛ భారత్‌.. విస్తరణ
2025–26 కేటాయింపులు: రూ. 12,192 కోట్లు
2024–25 కేటాయింపులు: రూ. 9,351 కోట్లు  (సవరించిన అంచనా)
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్‌) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్‌ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

స్వచ్ఛ భారత్‌ (అర్బన్‌) కింద పట్టణ ప్రాంతాల్లో 2025–26లో 2 లక్షల వ్యక్తిగత టాయిలెట్లు, 20,000 కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించనున్నారు. 98 శాతం వార్డుల్లో ఇంటింటికీ ఘన వ్యర్థాల సేకరణను అమలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 89,000 గ్రామాలను ఘన వ్యర్ధాల నిర్వహణలోకి తీసుకురానున్నారు. 60,000 గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు. 

అలాగే 800 బ్లాక్‌లలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నెలకొల్పనున్నారు. కాగా, స్వచ్ఛభారత్‌ 2.0 కింద తాగునీరు, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల కోసం 100 నగరాలను గుర్తించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement