మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు | Tax relief for Indian middle class | Sakshi
Sakshi News home page

మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు

Published Mon, Feb 3 2025 12:53 PM | Last Updated on Mon, Feb 3 2025 1:16 PM

Tax relief for Indian middle class

ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. 
ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్‌ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. 

  • బేసిక్‌ లిమిట్‌ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారు

  • కొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. 

 

  • ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. 

  • వేతనజీవులకు ఈ లిమిట్‌ను రూ. 12.75  లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. 

  • ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. 

  • ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్‌ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. 

  • సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్‌ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం.  

  • ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్‌ ఉంది. ఇక నుంచి టీడీఎస్‌ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్‌లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్‌ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్‌ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్‌ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు.  

  • మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్‌ కంపల్సరీ. ఆ లిమిట్‌ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్‌ లేకుండా. అయితే, ‘‘సోర్స్‌’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. 

  • ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్‌ వేల్యూ నిల్‌గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి.  

ఆర్థిక మంత్రి సీతారామన్‌గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు.  
వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement