tax experts
-
Income Tax: పాత విధానమా.. కొత్త విధానమా..?
ఆర్థిక సంవత్సరం 2020–21 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మీకు ఇష్టమైతే ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. గడువు తేదీలోపల ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే, కొత్త విధానమే పాటించాలి. పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.. ఇలా ఉన్నాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. రేట్లు 5,10, 15, 20, 30 శాతంగా ఉన్నాయి. పైన చెప్పినవన్నీ వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. ఏ ప్రాతిపదికన ఎంచుకోవాలి? » మీ ఆదాయ స్వభావం » మీ ఆదాయం » సేవింగ్స్ » పెట్టుబడులు » సొంతిల్లు రుణం – రుణం మీద వడ్డీ » మెడికల్ ఖర్చులు, కొన్ని జబ్బుల మీద ఖర్చులు » జీతం మీద ఆదాయం ఒక్కటే ఉంటే ఒకలాగా ఆలోచించాలి » జీతంతో పాటు ఇతర ఆదాయాలు ఉంటే మరొకలాగా ఆలోచించాలి » వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు .. వారి ఇన్వెస్ట్మెంట్ విధానం » ఉద్యోగస్తులు వారికి ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చుకోవచ్చు. » వ్యాపారస్తులకు అలా మార్చుకునే వెసులుబాటు లేదు » ఒకరితో ఒకరు పోల్చుకోకండి. మీ విధానం మీదే. మీ ఆదాయం మీదే. మీ పన్నుభారం మీదే.ఎటువంటి సేవింగ్స్ లేకపోతే కొత్త పద్ధతిలో రూ. 29,900 పన్ను భారం తగ్గుతుంది. సుమారు రూ. 30,000 మిగులు. అయితే, మీ చేతిలో ఎంతో నిలవ ఉంటుంది. దీన్ని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మీరిచ్చే ప్రాధాన్యత, మీ అవసరం మొదలైన వాటి ప్రకారం మీ ఇష్టం.మరో కేసులో కేవలం జీతం రూ. 7,00,000 కాగా సేవింగ్స్ లేవు అనుకుందాం. అప్పుడు..కొత్త పద్ధతిలో ట్యాక్స్ పడదు. పాత పద్ధతిలో పడుతుంది. పాత పద్ధతిలో పన్ను పడకూడదంటే, ఆ మేరకు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అంటే మీ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఆటోమేటిక్‌గా అందరూ కొత్త దాని వైపే మొగ్గు చూపుతారు. అయితే ఉద్యోగంలో కంపల్సరీగా పీఎఫ్ మొదలైన సేవింగ్స్ ఉంటాయి. ముందు జాగ్రత్తగా మనం సేవ్ చేస్తుంటాం. మన అవసరాలను, కలలను, ఆలోచనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులంటే, ఒకరు సేవ్ చేసి మరొకరు మానేసి.. ఇద్దరూ కొంత చేసి.. ఇలా ఎన్నో ఆలోచనలే మీ ట్యాక్స్ ప్లానింగ్‌కి దారి తీస్తాయి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదాయాన్ని నిర్ధారించేవి.. ఈ మూడే..
మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే.. 1. రెసిడెన్షియల్ స్టేటస్ 2. ఆదాయం వచ్చే సమయం 3. ఆదాయానికి మూలం (సోర్స్) ఇక వివరాల్లోకి వెళ్దాం.1. రెసిడెన్షియల్ స్టేటస్ .. ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.2. ఆదాయం ఏర్పడే సమయం సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.3. ముచ్చటగా మూడోది..మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు. a) జీతాలు, వేతనాలు b) ఇంటి మీద ఆదాయం c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు d) క్యాపిటల్ గెయిన్స్ e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పాన్ 2.0 ప్రాజెక్ట్ మంచిదే..
డిజిటల్ ప్రపంచంలో ప్రభంజనం.. మరో ముందడుగు. ఆదాయపు పన్ను శాఖవారు .. అత్యంత ముఖ్యమైనదైన.. అనువైనదైన.. అవసరమైనదైన అడుగువేశారు. ఇక నుంచి పాన్.. అంటే పర్మనెంట్ అకౌంట్ నంబరు, టాన్.. అంటే టాక్స్ నంబరుకి సంబంధించి అన్ని సర్వీసులు ఒకే గూటి కింద ఉంటాయి. వివిధ ప్లాట్‌ఫాంలకు వెళ్లడం ఉండదు.పాత పద్ధతికి స్వస్తి పలికారు. త్వరితగతి విధానం.. పేపర్ సహాయం లేకుండా ఉండటం, ఈ మార్పులన్నీ మనకు అనుగుణంగానే కాకుండా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. పాన్‌కి దరఖాస్తు చేయడం, వాటిలో సమాచారం అప్డేట్ చేయడం, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం .. ఈ మూడింటిని మూడు ప్లాట్‌ఫాంల మీద చేయాల్సి వచ్చేది. ఇకనుంచి మూడూ ఒకే ప్లాట్‌ఫాం మీద చేయొచ్చు. అదే.. పాన్ 2.0 ప్రాజెక్టు. వివరాల్లోకి వెళితే..» ఇక నుంచి పాన్, టాన్, రెండూ ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటాయి » ఇది వరకులాగా మూడు ప్లాట్‌ఫాంలకు వెళ్లనక్కర్లేదు » అనేక వెబ్సైట్లను సందర్శించనక్కర్లేదు » కాలం వృధా కాదు .. శ్రమ తక్కువ » క్షణాల మీద వేలిడేషన్ జరుగుతుంది » సెక్యూరిటీ పెరుగుతుంది » మోసాలను తగ్గించవచ్చు » అన్ని సర్వీసులు ఉచితం » ఫిజికల్ కార్డు కావాలంటే రూ. 50 చెల్లించాలి » ఈ–పాన్‌ను మీ మెయిల్‌కి పంపుతారు. తక్షణం అందినట్లు లెక్క. లేటు ఉండదు. » వివిధ ఫిర్యాదులకు చెక్ పెట్టినట్లు అవుతుంది » యాక్సెసబిలిటీ .. అంటే .. అందుబాటులో ఉంటుంది » డాక్యుమెంట్లు అవసరం లేదు » ఈ–పాన్ వల్ల డూప్లికేట్ కార్డులను ఏరిపారేయొచ్చు » డూప్లికేట్ కార్డుల వల్ల జరిగే మోసాలను అరికట్టవచ్చు » ఈ–పాన్ ఇక నుంచి యూనివర్సల్ ఐడెంటిటీ కార్డుగా చలామణీ అవుతుంది » అటు అసెసీలకు, ఇటు వృత్తి నిపుణులకు శ్రమ తగ్గుతుంది. కాలం వృధా కాదు » సెంట్రలైజ్డ్, సింగిల్ విండో విధానం వల్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించగలరుచివరగా ఇప్పుడున్న పద్ధతిలో డూప్లికేట్ కార్డుల వల్ల మోసాలు జరుగుతున్నాయి. రుణ సౌకర్యం, క్రెడిట్ కార్డులు పొందటం, ఒకే వ్యక్తి మరో వ్యక్తిగా చలామణీ అవడం.. వేరే అవతారమెత్తడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం జరిగినప్పటికీ మోసాల వెల్లువ తగ్గలేదు.ఒక సమాచారం ప్రకారం.. 780 మిలియన్లు అంటే 78 కోట్ల మందికి పాన్ కార్డులున్నాయి. కానీ ఆధార్ కార్డులు దేశంలో 138 కోట్ల మందికి ఉన్నాయి. ఆధార్ కార్డున్న ప్రతి వ్యక్తి అసెస్సీ కానక్కర్లేదు. ఆదాయపు పన్ను పరిధిలోకి రానవసరం లేదు.. రారు. 78 కోట్ల మంది పాన్హోల్డర్లు ఆధార్ కార్డుతో అనుసంధానం అయితే మోసాలు తగ్గుతాయి. అయితే, ఇందులో డూప్లికేట్ కార్డులు ఎన్ని ఉన్నాయో అంచనా తెలీదు.కానీ చాలా ఏజెన్సీలు..ప్రకటనల ద్వారా ఊరించి.. యాప్‌ల ద్వారా జనాలను ఆకట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ 2.0 ప్రాజెక్టు మోసాలను అరికట్టేలా అడుగువేస్తుందని ఆశిద్దాం . మీరు వెంటనే అప్లై చేయనక్కర్లేదు. పాతవి కూడా కొత్త విధానంలో పని చేస్తాయి. మీరు ఆన్లైన్లో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఈ–కార్డు.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేద్దాం..
ట్యాక్స్ ప్లానింగ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఈ వారం ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి సూచనలను తెలుసుకుందాం.చట్టాన్ని తెలుసుకోండి. చట్టాన్ని గౌరవించండి. చాలా పెద్ద పుస్తకం. ఎన్నో సెక్షన్లు, సబ్ సెక్షన్లు, వివరణల ఫారంలు, ఎనెక్జర్లు, మార్పులు, చేర్పులు, టెక్నికల్ భాష అని భయపడకండి. నిజానికి ఇది గ్రీక్ అండ్ లాటిన్ కాదు. సులువుగా తెలుసుకోవచ్చు. కొంచెం శ్రద్ధ, ఇష్టం ఉండాలి. మీ ఇల్లు కట్టిన మేస్త్రీ వంద ఇంగ్లీషు పదాలు పలుకుతాడు. ఇంగ్లీషు రాదు. అలాగే మీ కార్పెంటర్.. రోడ్డు మీదే కాపురం చేసే పంక్చర్లు వేసే వ్యక్తి ఎన్నో ఇంగ్లీషు పదాలు వాడతారు. ప్రస్తుతం సెల్ఫోన్లు వాడే కోట్లాది మందికి ఇంగ్లీషు రాదు. కానీ మన ఇష్టం, కోరిక, అభిలాష, బాధ్యత, చట్టాన్ని గౌరవించే సంప్రదాయం.. ఇవి చాలు. దీనికి తోడుగా ఉందిగా ‘గూగుల్ తల్లి’.. సమాచారాన్ని వెదజల్లి మిమ్మల్ని సన్నద్ధం చేసే కల్పవల్లి.అన్ని భాషల్లోని యూట్యూబ్‌లు, ఎన్నెన్నో లింకులు, వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల్లో పుస్తకాలు, ప్రచురణలు, డెమో సెషన్లు, సభలు, సమావేశాలు, చర్చావేదికలు, వర్క్‌షాప్‌లు, ట్యాక్స్ కాలమ్‌లు, వ్యాసాలు, అవగాహన సదస్సులు ఉంటున్నాయి. ఇంకేం కావాలి. డిపార్టుమెంట్ వారు సర్క్యులర్స్ ఇస్తున్నారు. అధికారులు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్నో యాప్‌లు, రెడీ రెకనర్లు, ప్రశ్నలకు జవాబులు. వీటిని అందిపుచ్చుకుంటే మీరు పండితులైనట్లే లెక్క.మీ హక్కులు, బాధ్యతలు తెలుసుకోండి.. మసలుకోండి.. ఆత్మబంధువు రూపంలో సి.నా.రె. గారి సూటి ప్రశ్నించారు ‘ఏమి చదివి పక్షులు పైకెగరగలిగేను’ అని .. అలాగే ‘ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని’ అని కృష్ణశాస్త్రిగారు ప్రశ్నించారు. కాబట్టి తెలుసుకుంటే రానిదంటూ ఉండదు.. ఈనాటి ఈ చట్టం ఏనాటిదో అని భయపడకండి. మీరేమీ తక్కువ కాదు.. ఎవరికీ తీసిపోరు. మీ ఫోన్ స్మార్ట్. మీరు స్మార్ట్. మీ ఫోన్ ఏ ప్లాన్‌లో ఉందో తెలుసు. టారిఫ్ ప్లాన్ తెలుసు, వైఫై వివరాలు తెలుసు, బ్యాంకు అకౌంట్ పాస్వర్డ్లు తెలుసు. బంగారం ధర తెలుసు. షేర్లు ఎంతకు కోట్ అవుతున్నాయో తెలుసు.ఇలా ఎన్నో తెలుసు. అలాంటిది ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ అనేవి బ్రహ్మపదార్థాలు కావు కదా తెలియకుండా ఉండటానికి. మీరు పట్టించుకోలేదు అంతే. ఇక నుంచి అవి తెలుసుకోండి. వివిధ రకాలైన గడువు తేదీలను తెలుసుకోండి. గుర్తుంచుకోండి. రూల్స్ తెలుసుకోండి. మినహాయింపులు, తగ్గింపులు తెలుసుకోండి. మీ సహోద్యోగులను సంప్రదించండి. మార్నింగ్ వాక్‌లో మీ పక్కింటాయనతో మాట్లాడండి.ఇప్పుడు ప్లాన్ చేయండి.. ముచ్చటగా మూడోది.. ప్లాన్ చేసుకోండి. మొదటి పాయింటు ప్రకారం సమగ్ర సమాచారం ఉంది. రెండో పాయింటు ప్రకారం సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. తెలుసుకున్నారు. ఇక ప్లానింగ్. ఈ సంవత్సరం అనుకోకుండా ఆదాయం వచ్చింది. ఆ మేరకు ఆదాయం తగ్గించుకోవాలనుకుంటే దాన్ని సేవింగ్స్ చేయండి. ఉదాహరణకు రూ. 40,000 బోనస్ వచ్చింది. పరిమితులు దాటకుండా ఉంటే 80సి ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. స్థిరాస్తి క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. మరో ఇల్లు కొనండి. లేదా బాండ్లు కొనండి.ఇంటద్దె అలవెన్స్ పూర్తిగా మినహాయింపు రావాలంటే.. ఇంటి అద్దె ఎక్కువ ఇచ్చి పెద్ద ఇంట్లో ఉండండి. అయితే, ఆఫీసుకు దూరంగా ఉండి రవాణా ఖర్చు రానుపోను చాలా ఎక్కువయితే మరోలా ప్లాన్ చేయండి. చివరిగా ట్యాక్స్ప్లానింగ్ అంటే కేవలం పన్నుభారం తగ్గించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం కాదు. ఇతరత్ర కుటుంబ ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, నైతిక విలువలు, చట్టాన్ని గౌరవించటం, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, వృత్తి మీద ప్రేమ, సొంతూరిమీద ప్రేమ మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
పన్ను ఎగవేత.. పలు రకాలు..
పన్ను ఎగవేత చట్టరీత్యా నేరం. అనైతికం. ఆర్థికంగా సంక్షోభం తయారవుతుంది. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సినిమాలో ‘విలన్’ మనకు ఆది నుంచి చివరి వరకు కనిపిస్తాడు. నిజజీవితంలో ‘విలన్’ విలన్‌లాగా కనిపించడు. ఓ పరోపకారి పాపయ్యలాగా, ఓ మర్యాద రామన్నలాగా అనిపిస్తాడు. వినిపిస్తాడు. కనిపిస్తాడు. ఎంతో మోసం చేస్తాడు. మనం తెలుసుకునే లోపల తెరమరుగవుతాడు.‘‘మీరు ఇప్పుడే మోసపోయారు’’ పుస్తకంలో రచయిత.. మనం ప్రతి రోజూ వైట్‌కాలర్ క్రైమ్ ద్వారా ఎలా మోసపోతున్నామో కళ్ళకి కట్టినట్లు తెలియజేశారు. ‘‘డబ్బుని ఎలా సంపాదించాలి’’ అనే పుస్తకంలో రచయిత ’అంకుర్ వారికూ’ ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవాలని మొదలైన విషయాల మీద ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తారు. అలాగే తెలుగు రచయతలు వీరేంద్రనాథ్‌గారు, బీవీ పట్టాభిరాం గారు తమ పుస్తకాల ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఇంత మంది చెప్పినా, ఇన్ని విషయాలు తెలిసినా, షరా మామూలే!ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!ఒకరిని చూసి ఒకరు. ఆశతో, ప్రేరేపణతో. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు మోసం చేస్తున్నారు. పన్ను ఎగవేస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలున్నట్లు..అకౌంట్స్ బుక్స్ నిర్వహించపోవడం, నిర్వహణలో అవకతవకలు, ఆదాయాన్ని తక్కువగా చూపించడం, ఖర్చులను పెంచేయడందురాలోచనలతో బంగారాన్ని .. అంటే ఆభరణాలు, రత్నాలు, డైమండ్లు, వెండి విషయాల్లో సెంటిమెంటు పేరు మీద, పసుపు–కుంకాల పేరు మీద, పెళ్లిళ్ల పేరు మీద కొంటున్నారు. అమ్ముతున్నారు. మళ్లీ కొంటున్నారు. పెట్టుబడికి సోర్స్ చెప్పరు. లాభాన్ని లెక్కించరు. ఆస్తిగా చూపించరు. ‘‘భర్తకే చెప్పం’’ అంటారు కొందరు మహిళలు. మీకు గుర్తుండే ఉంటుంది. రైళ్లలో బోగీ ఎక్కే ముందు ఇదివరకు ప్రయాణికుల జాబితా ఉండేది. పేరు, వయస్సు, లింగం, పాన్ నంబరు, మొదలైనవి అందులో ఉంటాయి. బంగారం షాపులవాళ్లు వారి సిబ్బందిని పంపించి ఆ వివరాలను సంగ్రహించేవారు. ఆ జాబితాను తీసుకుని, షాపునకు వచ్చి, అందులోని పేర్ల మీద ఇతరులకు అమ్మేవారు.వ్యవసాయ భూమి అంటే ఏమిటో ఆదాయపు పన్ను నిర్వచించినా, గ్రామాల పేరు మార్చి, సరిహద్దులు మార్చి అమ్మకాల్లో మోసం. అలాగే ఆదాయం విషయంలో ఎన్నో మతలబులు.. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం, భూమి అమ్మకాల మీద పన్ను లేదు.ఇక రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పనక్కర్లేదు. నేతి బీరకాయలో నేయి లేదు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ‘‘రియల్’’ గానే పన్ను ఎగవేత ఉంది.అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు, స్టాక్స్, క్రయవిక్రయాల్లో ఎన్నో అక్రమమార్గాలు అవలంబిస్తున్నారు.పబ్లిక్ కంపెనీల్లో షేరు ప్రీమియం పేరుతో మోసాలు.. అలాగే షేర్స్ అలాట్మెంట్కి ముందుగా అప్లికేషన్‌తో పాటు వసూలు చేసే మనీతో మోసాలు.వ్యాపారంలో సర్దుబాటు హుండీలు సహజం... వీటి మార్పిడి... ఇదొక సరిహద్దుల్లేని వ్యాపారం అయిపోయింది.డమ్మీ సంస్థలు.. ఉనికిలో లేనివి.. ఉలుకు లేని..పలుకు లేని.. కాగితం సంస్థలు. కేవలం ఎగవేతకే ఎగబాకే సంస్థలు. దొంగ కంపెనీలు. డొల్ల కంపెనీలు. బోగస్ వ్యవహారాలు. బోగస్ కంపెనీలు.క్రిప్టోకరెన్సీల్లో గోల్మాల్..ఇలా ఎన్నో.. ముఖ్యంగా సోర్స్ చెప్పకపోవడం, పెట్టుబడికి కానీ.. రాబడికి కానీ వివరణ ఇవ్వకపోవడం, పన్ను ఎగవేతకు పన్నాగం చేయడం. వీటి జోలికి పోకండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
గడువు తేదీ గడిచిపోయిందా..
రెండు రోజులు ఆలస్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా అందరికీ అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటూ.. ‘‘గడువు తేదీ’’ని కేవలం ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్నులు వేసే కోణంలోనే పరిశీలిద్దాం. 2024 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరపు రిటర్నులు వేయడానికి గడువు తేదీ 2024 జూలై 31. మీలో చాలా మంది సకాలంలో వేసి ఉంటారు. ఈసారి రిటర్నులు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపార్టుమెంటు వారు చెప్తున్నారు. అనారోగ్యం కానివ్వండి. విదేశాయానం కానివ్వండి. కారణం ఏదైనా కానివ్వండి. మీరు రిటర్ను ఇంకా వేయలేదా? చింతించకండి. బెంగ వద్దు. ఇలాంటి వారికి చక్కని రాజమార్గం ఉంది. లేటు ఫీజు కట్టాలి. ఇలా లేటు ఫీజు చెల్లించినవారికి 2024 డిసెంబర్ 31 వరకు గడువు తేదీ ఉన్నట్లు లెక్క. అంటే మరో రెండు నెలల పదిహేను రోజులు. అలా అని ఆలస్యం చేయకండి.ఎంత లేటు ఫీజు చెల్లించాలి.. ఆలస్యమైన నెలలతో సంబంధం లేకుండా రెండు రకాల నిర్దేశిత రుసుములు ఉన్నాయి. పన్నుకి గురయ్యే ఆదాయం.. రూ. 5,00,000 లోపల ఉంటే రూ. 1,000 చెల్లించాలి. పన్నుకి గురయ్యే ఆదాయం రూ. 5,00,000 దాటి ఉన్నట్లయితే, ఫీజు రూ. 5,000 ఉంటుంది. ఇవి మారవు. అంటే మీరు ఆగస్టు 1 నుండి డిసెంబర్ 31 లోపల ఎప్పుడు దాఖలు చేసినా రుసుములంతే. అయితే, పన్ను చెల్లించాల్సి ఉంటే వడ్డీ విధిస్తారు. ఇది నెలకు 1 శాతం చొప్పున వడ్డిస్తారు.రిఫండు క్లెయిమ్ చేసినా అప్పటికి పన్ను చాలా చెల్లించినట్లయితే, ఈ వడ్డీ పడదు. పన్ను చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటే మీరు తొందరపడాల్సి ఉంటుంది. వడ్డీని తగ్గించుకోవచ్చు. మీరు బయటి నుంచి 1 శాతం వడ్డీతో అప్పు తెచ్చి పన్ను భారం చెల్లించే బదులు ఆ వడ్డీ మొత్తం ఏదో ‘సీతమ్మగారి పద్దు’లో పడేలా ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక వనరులను ప్లాన్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి. ఈ వెసులుబాటనేది ‘తత్కాల్’ టిక్కెట్టు కొనుక్కుని రైల్లో ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అయితే, రిటర్ను గడువు తేదీలోగా దాఖలు చేయకపోవడం వల్ల రెండు పెద్ద ఇబ్బందులు తలెత్తుతాయి. వీటి విషయంలో ఎలాంటి వెసులుబాటు లేదు. గడువు తేదీ లోపల రిటర్ను వేసేవారికి డిపార్టుమెంటు రెండు ప్రయోజనాలు పొందుపర్చింది. ఆ రెండు ప్రయోజనాలూ లేటు విషయంలో వర్తించవు. ఇంటి మీద ఆదాయం లెక్కింపులో మనం లోన్ మీద వడ్డీని నష్టంగా పరిగణిస్తాం.ఆ నష్టాన్ని పరిమితుల మేరకు సర్దుబాటు చేసి, ఇంకా నష్టం మిగిలిపోతే దాన్ని రాబోయే సంవత్సరాలకు బదిలీ చేసి, నష్టాన్ని.. ఆదాయాన్ని సర్దుబాటు చేస్తాం. దీని వల్ల రాబోయే సంవత్సరంలో పన్ను భారం తగ్గుతుంది. ఇది చాలా ప్రయోజనకరంగా, ఉపశమనంగా ఉంటుంది. లేటుగా రిటర్ను వేస్తే ఈ ‘బదిలీ’ ప్రయోజనాన్ని ఇవ్వరు. ఈ సదుపాయాన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి ఉంటుంది.ఇక రెండోది.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతి లేదా కొత్త పద్ధతుల్లో.. మనం ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. సాధారణంగా పన్ను తగ్గే పద్ధతి ఎంచుకుంటాం. మనం గడువు తేదీ లోపల రిటర్ను వేయకపోతే, ఇలా ఎంచుకునే అవకాశం ఇవ్వరు. కంపల్సరీగా కొత్త పద్ధతిలోనే పన్నుభారాన్ని లెక్కించాలి. అయినా, రిటర్ను వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.1. ఇది మీ ఆదాయానికి ధృవపత్రం అవుతుంది 2. రుణ సౌకర్యం లభిస్తుంది 3. విదేశీయానం అప్పుడు వీసాకి పనికొస్తుంది 4. చట్టంలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు 5. పెనాల్టీ మొదలైనవి ఉండవు కాబట్టి రిటర్నులు వేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఐటీ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.. ఎందుకంటే..
ప్రతి రోజూ కాకపోయినా వారానికొకసారైనా ఇన్‌కంట్యాక్స్ వెబ్‌సైట్‌ని చూస్తూ ఉండండి. రోజు, తిథి, వారం, నక్షత్రాల్లాగా, వాతావరణం రిపోర్ట్లాగా, బంగారం రేట్లలాగా, షేర్ మార్కెట్ల ధరల్లాగా, చూడక తప్పదు. సైటు తెరవగానే హోమ్‌పేజీలో ఇంపార్టెంట్ విషయాలు ఇరవై ఉంటాయి. వీటిని తెరిస్తే మీకు ఉపయోగపడే సమాచారం కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి.. ఈ–వెరిఫికేషన్ స్టేటస్, పాన్ స్టేటస్, చెల్లించిన పన్ను స్టేటస్, మీ అధికారి ఎవరు, మీ రిఫండ్ స్టేటస్, ఆధార్‌తో అనుసంధానం వివరాలు, నోటీసు వివరాలు.మీకు అవసరమైన విండోని ఓపెన్ చేస్తే అందులో ఉన్న కాలాలు అన్నీ పూరిస్తే, వివరాలు తెలుస్తాయి. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రిఫండ్ ఇంకా రాలేదేంటి అని ప్రశ్నించడం మొదలెడతారు. అలాగే, అసెస్మెంట్ స్టేటస్‌కు సంబంధించి సాధారణంగా మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఓటీపీతో మొదలు అన్ని స్టేజీల్లోనూ మీకు సమాచారం అందుతూనే ఉంటుంది. ఆ సమాచార స్రవంతిని ఫాలో అవ్వండి. ఒకరోజు టీవీ, సీరియల్స్‌ని మిస్ అయినా ఫర్వాలేదు. ఈ ట్రాక్‌ని వదలకండి. పోస్టులో మీ ఇంటికి వచ్చి, తలుపు కొట్టి నోటీసులు ఇచ్చే రోజులు కావివి. అంతా ఆన్లైన్. అంతే కాకుండా నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ మెయిల్స్‌ని ట్రాక్ చేయండి. అప్పుడప్పుడు నోటీసులు, సమాచారాలు ఈమెయిల్ బాక్సులో స్పామ్‌లోకి వెళ్లిపోతాయి. అలా పోయినా మనకు నోటీసు ఇచ్చినట్లుగానే భావిస్తారు డిపార్ట్మెంట్ వారు. ఫోన్లో మెసేజీ వచ్చిన వెంటనే మెయిల్ రాకపోవచ్చు. పది, పదిహేను రోజులు ఆగండి.టాక్స్ కాలెండర్ఇవన్నీ కాకుండా ‘టాక్స్ కాలెండర్’ కనిపిస్తుంది. అందులో ప్రతి తేదీని క్లిక్ చేస్తూ పోతే, ఆ రోజు మీరేం చేయాలో తెలుస్తుంది. ఉదాహరణకు సెప్టెంబర్ 15 అనుకోండి.. ఈ తేదీలోపల మీరు ఏయే ఫారాలు వెయ్యాలో, మీ ఎన్నో వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో చెబుతుంది. మీకు ఏ విషయంలో వారి సహాయం కావాలో, ఆ సలహా, సహాయం అందిస్తారు. మార్గదర్శకాలను కూడా చెబుతారు. ఫైలింగ్, టీడీఎస్, ట్యాక్స్, పాన్, టాన్, వార్షిక సమాచార నివేదికకి సంబంధించిన తప్పొప్పులు.. ఇలాంటి వాటి గురించి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. ఇవన్నీ ఫ్రీ కాల్స్! మీరు దాఖలు చేసే ప్రతి ఫారం 1,2,3,4,5,6,7.. ఇలాంటి వాటికి సంబంధించి ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. మీరు నేరుగా సంప్రదించవచ్చు. సంప్రదించే ముందు మీ వివరాలు, అంటే పాన్, పేరు, పుట్టిన తేదీ, పన్నుకి సంబంధించిన వివరాలు ఉండాలి. అప్పటికప్పుడే మీకు సమాచారం దొరుకుతుంది. అలాగే మీ మెయిల్స్‌కి రెస్పాన్స్ వస్తుంది.ఇంకొక మంచి అవకాశం ఏమిటంటే, మీరు ఫిర్యాదులు కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఐటీ రిఫండ్ విషయం ఉంటుంది. అవసరం అనిపిస్తే ఫిర్యాదులు చేయండి. మీ ఫిర్యాదుని నమోదు చేసుకుంటారు. ఎక్నాలెడ్జ్ చేస్తారు. దానికో నంబర్ కేటాయిస్తారు. ఆ ఫిర్యాదుల స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. వెంటనే దర్శించి, అన్నీ తెలుసుకోండి. మీ పాన్ నంబరు, పాస్వర్డ్ మీ దగ్గరుండాలి. ఈ సైట్ స్నేహపూర్వకమైనది. చాలా సులభతరమైనది. మీకు అన్నీ అర్థమయ్యేలా ఉంటుంది. ఇది ఉచితం. త్వరగా పని పూర్తవుతుంది. రెస్పాన్స్ బాగుంటుంది. వృత్తి నిపుణుల సహాయం అక్కర్లేదు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ సైట్ డైనమిక్ అండోయ్!! పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆస్తి అమ్మిన డబ్బుతో.. అలా వద్దండి!
అన్ని జాగ్రత్తలు తీసుకుని, సంబంధిత కాగితాలు భద్రపర్చుకుని, బ్యాంకులో జమ అయిన మొత్తంతో ఏం చేయాలి అనేది ఆలోచించాలి. కాస్సేపు ఇలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని ‘ప్రతిఫలం’ అని అందాం. ఈ ప్రతిఫలం నగదు రూపంలో వద్దండి! బ్యాంకులోనే జమ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఈ సమాచారం వెనువెంటనే కాకపోయినా .. త్వరగా కాకపోయినా.. అంతిమంగా సబ్ రిజిస్ట్రార్‌కి విధించిన గడువులోగా ఇన్‌కంట్యాక్స్ డిపార్టుమెంటు వారికి చేరుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతిఫలాన్ని ఏం చేయాలన్న ప్రశ్నకు జవాబుగా ఆదాయపు పన్ను చట్టప్రకారం మరీ ఎక్కువగా ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యుల అవసరం ఏమిటి అనే దానికే ప్రాముఖ్యత ఇచ్చి హాయిగా కాలం గడుపుతున్న కొంత మందిని ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాం. ➤ ఆ ఊళ్లో సాంబశివరావుగారు మంచి టీచర్. మానవతా విలువలతో పాటు విద్యావిలువలు తెలిసిన పెద్ద మనిషి. స్థిరాస్తి అమ్మకంతో వచ్చిన ప్రతిఫలంతో ఏర్పడ్డ పన్ను భారాన్ని చెల్లించేసి, మిగతా మొత్తంతో పిల్లల పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని వారి వారి చదువులకు ఖర్చు పెట్టి వారిని వృద్ధిలోకి తీసుకొచ్చారు. అందరూ భారత్‌లోనే ఉన్నారు. ➤ పిల్లలను విదేశాల్లో చదివించాలన్న విశ్వేశ్వరరావు కూడా అదే బాటని ఆశ్రయించారు. పన్ను భారం చెల్లించాక మిగిలిన మొత్తంతో కొడుకుని విదేశాల్లో ఉన్నత విద్యల కోసం పంపించి హాయిగా ఉన్నారు. ➤ చెల్లి పెళ్లి అప్పులతో తండ్రి చేశాడు. క్రమేణా కాలం కలిసొచ్చింది కల్యాణరావుకి. మావగారు ఇచ్చిన ఇల్లుకి రింగ్ రోడ్ ధర్మమా అని రేటు రాగానే అమ్మేశాడు, పన్ను కట్టాకా మిగిలిన మొత్తంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసి, మనవళ్ళతో ఆడుకుంటున్నాడు. ➤ శివరావుగారి తాతగారు ఎప్పుడో గుడి కట్టించారు. అది శిథిలం అయ్యింది. తండ్రి ఏమి చేయలేకపోయాడు. కానీ గుడిని పునరుద్ధరించాలనేది ఆయన చిరకాల కోరిక. శివరావుగారు తనకు వచ్చిన ‘ప్రతిఫలం’లో మిగిలిన మొత్తంతో గుడిని బాగుచేయించారు. తన శ్రమ శక్తి వల్ల ఏర్పడ్డ స్థిరాస్తి అమ్మకం.. శివభక్తికి అలా ఉపకరించింది. భార్య పార్వతమ్మ సంతోషం అంతా ఇంతా కాదు. ➤ తన స్కూలు చదువంతా ఎండా, వానల్లోనే. కాలేజీకి వచ్చే వరకు బెంచీలు చూడని విద్యాధరరావు డబ్బు సంపాదించి, ఇల్లు కొన్నాడు. అమ్మవలసినప్పుడు, అన్ని బాధ్యతలను తీర్చివేసి ఊళ్లో స్కూల్లో అన్ని తరగతులవారికి బెంచీలు కొన్నాడు. ➤ బంగార్రాజు పేరుకే బంగార్రాజు. పెళ్లాం లక్ష్మీ ప్రతిరోజూ పేచీయే బంగారం కొనమని. అనుకోకుండా అన్నదమ్ముల స్థిరాస్తి పంపకాల్లో ఆస్తి అమ్మాల్సి వచ్చింది. పన్ను కట్టేసి మిగిలిన మొత్తంతో పెళ్లాం లక్ష్మమ్మని ఏడువారాల నగలు, వడ్డాణం కొని ‘లక్ష్మీదేవి’గా చేశాడు బంగార్రాజు. ➤ అమీర్‌పేటలో ఇరుకు ఇంట్లో నలభై ఏళ్లు కాపురం చేసి విసిగిపోయిన రాజారావు.. ’ప్రతిఫలం’తో ఓ విల్లా కొనుక్కుని, నార్సింగిలో సరదాగా ఉన్నాడు. పన్ను మినహాయింపులు కూడా పొందాడు. ➤ మొదటి నుంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండటం వల్ల ’ప్రతిఫలం’ మొత్తాన్ని నిర్దేశిత బాండ్లలో ఇన్వెస్ట్ చేసి, ఆ వడ్డీలతో ఏ అప్పు లేకుండా పబ్బం గడుపుతున్నాడు ’లక్ష్మీపతి’. ➤ పాత ఇండస్ట్రీ షెడ్డుని అమ్మేసి, ఆ డబ్బుతో కొత్త షెడ్డు కొని వ్యాపారం చేస్తున్నారు నాయుడుగారు. ➤ అన్ని ఆస్తులు అమ్మినా, సరైన ప్లానింగ్ లేకుండా అప్పుల పాలైన అప్పారావూ ఉన్నారు. ఏదేమైనా ‘ప్రతిఫలం’ మొత్తాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఆలోచించాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదాయ వెల్లడి పథకంతో ఆస్తులకు చట్టబద్ధత
నిడమర్రు: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం (ఇన్‌కంటాక్స్ డిక్లరేషన్ స్కీం–2016) ద్వారా లెక్కల్లో చూపని ఆదాయాలను చట్టబద్ధం చేసుకుని పన్ను చెల్లింపుదారులు నిశ్చింతగా ఉండవచ్చని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. లెక్కల్లో చూపని ఆదాయానికి నిర్దేశిత పన్ను చెల్లించడం ద్వారా ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అంటున్నారు. పథకం వివరాలు మీ కోసం.. ఆదాయ పన్ను నెట్లోకి వచ్చేవారు : రూ.రెండు లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, సంస్థలు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (అవిభాజ్య కుటుం బాలు), అసోసియేషన్లకు ఆదాయ వెల్లడి పథకం వర్తిస్తుంది. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న అసెసీలు, ఇతర పన్ను చెల్లించని వారందరూ కూడా ట్యాక్స్ నెట్లోకి వస్తారు. ఈ పథకం కింద 2015–16కు ముందు ఆదాయ వివరాలు వెల్లడించి ఉండాలి. సెక్షన్ 142(1), 143(2), 153(ఎ), 153(సి) కింద ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు ఈ పథకంలో స్వచ్ఛందంగా ఆస్తులు వెల్లడించి రాయితీ పొందడానికి అనర్హులు. సంపద పన్ను నుంచి మినహాయింపు : ఈ పథకంలో ఆదాయం వెల్లడించే వారికి సంపద పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. స్వచ్ఛందంగా ఆదాయాలను వెల్లడించేవారికి ఆదాయ పన్ను శాఖ నుంచి స్క్రూట్నీ, విచారణ వంటి ఇబ్బందులు ఉండవు. ఇన్‌కంటాక్స్, వెల్త్ ట్యాక్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ ఉండదు. బినామీ ఆస్తులను వెల్లడించి కొన్ని షరతులకు లోబడి బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్–1988 నుంచి విముక్తి పొందవచ్చు. ఈ పథకంలో వెల్లడించిన ఆదాయాన్ని సెక్షన్ 138 కింద పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఆదాయ వివరాలను వెల్లడించాలనుకునేవారు వారు నేరుగా ఆశాఖ ప్రధాన కమిషనర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు. వెల్లడించిన ఆదాయంపై 45 శాతం పన్ను : స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించిన ఆదాయంపై వెల్లడించిన మొత్తంలో 45 శాతం పన్నును చెల్లించాలి. నిర్దేశించిన ఈ పన్ను మొత్తాన్ని ఏకమొత్తం లేదా విడతల వారీగా చెల్లించే వెసులుబాటు ఉంది. సాధారణంగా సకాలంలో సరైన రీతిలో ఆదాయాన్ని వెల్లడించిన వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. అదేగోప్యంగా ఉంచి ఇన్‌కంటాక్స్ దాడులలో పట్టుబడితే 60 శాతం నుంచి 90 శాతం వరకూ అపరాధ రుసుం వసూలు చేస్తారు. ఈ పథకంలో 45 శాతం చెల్లించి వెసులుబాటు పొందవచ్చని టాక్స్ నిపుణులు చెబుతున్నారు. వెల్లడించేందుకు చివరి అవకాశం : నల్లధనం, రహస్య ఆస్తులను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. ఈ పథకంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడించాలి. అటుపై పెనాల్టీ, సర్‌చార్జీలతో కలిపి నిర్దేశిత 45 శాతం పన్నును ఒకే మొత్తంగా గానీ విడతల వారిగా గానీ చెల్లించాలి. ఐటీ అధికారులు చెల్లింపునకు సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. స్థిరాస్తులను ఎప్పటివైనా ప్రస్తుత రిజిస్టర్ విలువకు ఆస్తులను మదింపు చేసుకోవచ్చు. టెక్నాలజీ ఊతంతో పన్ను ఎగవేతదారుల వివరాలన్నీ ఐటీ శాఖ సేకరించి దాడులు చేపట్టక ముందే వారంతా ఈ పథకం వినియోగించుకోవడం శ్రేయస్కరమని ఐటీ అధికారులు సూచిస్తున్నారు.