ఆదాయ వెల్లడి పథకంతో ఆస్తులకు చట్టబద్ధత
Published Sun, Jul 17 2016 9:54 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
నిడమర్రు: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం (ఇన్‌కంటాక్స్ డిక్లరేషన్ స్కీం–2016) ద్వారా లెక్కల్లో చూపని ఆదాయాలను చట్టబద్ధం చేసుకుని పన్ను చెల్లింపుదారులు నిశ్చింతగా ఉండవచ్చని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. లెక్కల్లో చూపని ఆదాయానికి నిర్దేశిత పన్ను చెల్లించడం ద్వారా ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అంటున్నారు. పథకం వివరాలు మీ కోసం..
ఆదాయ పన్ను నెట్‌లోకి వచ్చేవారు : రూ.రెండు లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, సంస్థలు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (అవిభాజ్య కుటుం బాలు), అసోసియేషన్‌లకు ఆదాయ వెల్లడి పథకం వర్తిస్తుంది. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న అసెసీలు, ఇతర పన్ను చెల్లించని వారందరూ కూడా ట్యాక్స్ నెట్‌లోకి వస్తారు. ఈ పథకం కింద 2015–16కు ముందు ఆదాయ వివరాలు వెల్లడించి ఉండాలి. సెక్షన్ 142(1), 143(2), 153(ఎ), 153(సి) కింద ఇప్పటికే నోటీసులు అందుకున్నవారు ఈ పథకంలో స్వచ్ఛందంగా ఆస్తులు వెల్లడించి రాయితీ పొందడానికి అనర్హులు.
సంపద పన్ను నుంచి మినహాయింపు : ఈ పథకంలో ఆదాయం వెల్లడించే వారికి సంపద పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. స్వచ్ఛందంగా ఆదాయాలను వెల్లడించేవారికి ఆదాయ పన్ను శాఖ నుంచి స్క్రూట్‌నీ, విచారణ వంటి ఇబ్బందులు ఉండవు. ఇన్‌కంటాక్స్, వెల్త్ ట్యాక్స్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ ఉండదు. బినామీ ఆస్తులను వెల్లడించి కొన్ని షరతులకు లోబడి బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్–1988 నుంచి విముక్తి పొందవచ్చు. ఈ పథకంలో వెల్లడించిన ఆదాయాన్ని సెక్షన్ 138 కింద పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఆదాయ వివరాలను వెల్లడించాలనుకునేవారు వారు నేరుగా ఆశాఖ ప్రధాన కమిషనర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు.
వెల్లడించిన ఆదాయంపై 45 శాతం పన్ను : స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించిన ఆదాయంపై వెల్లడించిన మొత్తంలో 45 శాతం పన్నును చెల్లించాలి. నిర్దేశించిన ఈ పన్ను మొత్తాన్ని ఏకమొత్తం లేదా విడతల వారీగా చెల్లించే వెసులుబాటు ఉంది. సాధారణంగా సకాలంలో సరైన రీతిలో ఆదాయాన్ని వెల్లడించిన వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. అదేగోప్యంగా ఉంచి ఇన్‌కంటాక్స్ దాడులలో పట్టుబడితే 60 శాతం నుంచి 90 శాతం వరకూ అపరాధ రుసుం వసూలు చేస్తారు. ఈ పథకంలో 45 శాతం చెల్లించి వెసులుబాటు పొందవచ్చని టాక్స్ నిపుణులు చెబుతున్నారు.
వెల్లడించేందుకు చివరి అవకాశం : నల్లధనం, రహస్య ఆస్తులను వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇదే చివరి అవకాశంగా పేర్కొంది. ఈ పథకంలో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆదాయం, ఆస్తుల వివరాలు వెల్లడించాలి. అటుపై పెనాల్టీ, సర్‌చార్జీలతో కలిపి నిర్దేశిత 45 శాతం పన్నును ఒకే మొత్తంగా గానీ విడతల వారిగా గానీ చెల్లించాలి. ఐటీ అధికారులు చెల్లింపునకు సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేస్తారు. స్థిరాస్తులను ఎప్పటివైనా ప్రస్తుత రిజిస్టర్ విలువకు ఆస్తులను మదింపు చేసుకోవచ్చు. టెక్నాలజీ ఊతంతో పన్ను ఎగవేతదారుల వివరాలన్నీ ఐటీ శాఖ సేకరించి దాడులు చేపట్టక ముందే వారంతా ఈ పథకం వినియోగించుకోవడం శ్రేయస్కరమని ఐటీ అధికారులు సూచిస్తున్నారు.
Advertisement