
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.
ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?
ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం..
1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్
ఉండదు.
2. టైం కలిసి వస్తుంది.
3. మానసిక ఒత్తిడి ఉండదు
4. ఆర్థిక ప్రమాదం ఉండదు
5. బ్యాంకు అకౌంటు అటాచ్‌మెంట్ ఉండదు
6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు
7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది
8. ఇది అతి పెద్ద ఉపశమనం
వివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.
ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.
చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
👉 బిజినెస్ వ్యక్తులు
👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు
👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు
👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు
👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లు
ఎలా చేయాలి:
వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.
రాజీకి వెళ్లకపోతే
షరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు.
కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.