
మీ అందరికీ తెలిసిందే. వ్యవసాయం మీద ఆదాయం చేతికొస్తే, ఎటువంటి పన్ను భారం లేదు. ఈ వెసులుబాటు 1961 నుంచి అమల్లో ఉంది. చట్టంలో నిర్వచించిన ప్రకారం వ్యవసాయ భూమి ఉంటే, అటువంటి భూమి మీద ఆదాయం/రాబడికి ఆదాయపు పన్ను లేదు. కేవలం వ్యవసాయం మీదే ఆధారపడి ఎటువంటి ఏ ఇతర ఆదాయం లేకపోతే, వచ్చిన ఆదాయం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా మినహాయింపులోనే ఉంటుంది. ఎటువంటి పన్నుకి గురి కాదు. భూమి, ఆదాయం ఈ రెండూ, తూ.చా. తప్పకుండా ఆదాయపు పన్ను చట్టంలో నిర్వచించిన ప్రకారం ఉండాలి. ఎటువంటి తేడాలు ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే మినహాయింపు ఇస్తారు.
కొంత మందికి అటు వ్యవసాయ ఆదాయం, ఇటు వ్యవసాయేతర ఆదాయం రెండూ ఉండొచ్చు. వారు రిటర్న్ వేసేటప్పుడు రెండు ఆదాయాలను జోడించి వేయాలి. దానికి అనుగుణంగా ఆ ఆదాయాలపై పన్ను లెక్కించి, అందులో మినహాయింపులు ఇవ్వడమనేది .. ఇదంతా ఒక రూలు. దాని ప్రకారం లెక్క చెప్తే పన్నుభారం పూర్తిగా సమసిపోదు కానీ ఎక్కువ శాతం రిలీఫ్ దొరుకుతుంది.
పై రెండు కారణాల వల్ల, రెండు ఉపశమనాల వల్ల ట్యాక్స్ ఎగవేసే వారు.. ఎప్పుడూ ఎలా ఎగవేయాలనే ఆలోచిస్తుంటారు. ట్యాక్స్ ప్లానింగ్‌లో ప్రతి ఒక్కరికి అనువుగా దొరికేది వ్యసాయ ఆదాయం. అక్రమంగా ఎంతో ఆర్జించి, దాని మీద ట్యాక్స్ కట్టకుండా బైటపడే మార్గంలో అందరూ ఎంచుకునే ఆయుధం ‘వ్యవసాయ ఆదాయం’. దీన్ని ఎలా చూపిస్తారంటే..
👉 తమ పేరు మీదున్న పోరంబోకు జాగా,
👉 ఎందుకు పనికిరాని జాగా.
👉 వ్యవసాయ భూమి కాని జాగా
👉 సాగుబడి చేయని జాగా
👉 తమ పేరు మీద లేకపోయినా చూపెట్టడం
👉 కౌలుకి తీసుకోకపోయినా దొంగ కౌలు చూపడం
👉 కుటుంబంలో తాత, ముత్తాతల పొలాలను తమ పేరు మీద చూపెట్టుకోవడం
👉 బహుమతులు, ఇనాముల ద్వారా వచ్చిన జాగా
👉 దురాక్రమణ చేసి స్వాధీనపర్చుకోవడం
మరికొందరు నేల మీదే లేని జాగాని చూపెడతారు. ఇలా చేసి ఈ జాగా.. చక్కని మాగణి అని.. బంగారం పండుతుందని బొంకుతారు. కొంత మంది సంవత్సరానికి రూ. 50,00,000 ఆదాయం వస్తుందంటే ఇంకొందరు ఎకరానికి రూ. 5,00,000 రాబడి వస్తుందని చెప్పారు. ఈ మేరకు లేని ఆదాయాన్ని చూపించి, పూర్తిగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లోకి పాకింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కొనసాగింది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల మీద లెక్కలేనంత ఆదాయం చూపించారు.
అధికారులు, మామూలుగానే, వారి ఆఫీసు రూమ్‌లో అసెస్‌మెంట్ చేస్తేనే అసెస్సీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అధికారులు అడిగే ప్రశ్నలకు, ఆరా తీసే తీరుకు కళ్లు బైర్లు కమ్ముతాయి. అలాంటిది, ఈసారి అధికారులు శాటిలైట్ చిత్రాల ద్వారా వారు చెప్పిన జాగాలకు వెళ్లారు. అబద్ధపు సర్వే నంబర్లు, లేని జాగాలు, బీడు భూములు, అడవులు, చౌడు భూములు, దొంగ పంటలు, దొంగ కౌళ్లు, లేని మనుషులు, దొంగ అగ్రిమెంట్లు.. ఇలా ఎన్నో కనిపించాయి.
ఇక ఊరుకుంటారా.. వ్యసాయ ఆదాయాన్ని మామూలు ఆదాయంగా భావించి, అన్ని లెక్కలూ వేశారు. ఇరుగు–పొరుగువారు ఎన్నో పనికిమాలిన సలహాలు ఇస్తారు. వినకండి. ఫాలో అవ్వకండి. ఒకవేళ ఫాలో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎగవేతకు ఒక మార్గమే ఉంది. కానీ ఇప్పుడు ఎగవేతలను ఏరివేసి, సరిచేసి, పన్నులు వసూలు చేసే మార్గాలు వందలాది ఉన్నాయి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment