ట్యాక్స్ ప్లానింగ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఈ వారం ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి సూచనలను తెలుసుకుందాం.
చట్టాన్ని తెలుసుకోండి. చట్టాన్ని గౌరవించండి.
చాలా పెద్ద పుస్తకం. ఎన్నో సెక్షన్లు, సబ్ సెక్షన్లు, వివరణల ఫారంలు, ఎనెక్జర్లు, మార్పులు, చేర్పులు, టెక్నికల్ భాష అని భయపడకండి. నిజానికి ఇది గ్రీక్ అండ్ లాటిన్ కాదు. సులువుగా తెలుసుకోవచ్చు. కొంచెం శ్రద్ధ, ఇష్టం ఉండాలి. మీ ఇల్లు కట్టిన మేస్త్రీ వంద ఇంగ్లీషు పదాలు పలుకుతాడు. ఇంగ్లీషు రాదు.
అలాగే మీ కార్పెంటర్.. రోడ్డు మీదే కాపురం చేసే పంక్చర్లు వేసే వ్యక్తి ఎన్నో ఇంగ్లీషు పదాలు వాడతారు. ప్రస్తుతం సెల్‌ఫోన్లు వాడే కోట్లాది మందికి ఇంగ్లీషు రాదు. కానీ మన ఇష్టం, కోరిక, అభిలాష, బాధ్యత, చట్టాన్ని గౌరవించే సంప్రదాయం.. ఇవి చాలు. దీనికి తోడుగా ఉందిగా ‘గూగుల్ తల్లి’.. సమాచారాన్ని వెదజల్లి మిమ్మల్ని సన్నద్ధం చేసే కల్పవల్లి.
అన్ని భాషల్లోని యూట్యూబ్‌లు, ఎన్నెన్నో లింకులు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికల్లో పుస్తకాలు, ప్రచురణలు, డెమో సెషన్లు, సభలు, సమావేశాలు, చర్చావేదికలు, వర్క్‌షాప్‌లు, ట్యాక్స్ కాలమ్‌లు, వ్యాసాలు, అవగాహన సదస్సులు ఉంటున్నాయి. ఇంకేం కావాలి. డిపార్టుమెంట్ వారు సర్క్యులర్స్ ఇస్తున్నారు. అధికారులు ఫ్రెండ్లీగా ఉంటారు. ఎన్నో యాప్‌లు, రెడీ రెకనర్లు, ప్రశ్నలకు జవాబులు. వీటిని అందిపుచ్చుకుంటే మీరు పండితులైనట్లే లెక్క.
మీ హక్కులు, బాధ్యతలు తెలుసుకోండి.. మసలుకోండి..
ఆత్మబంధువు రూపంలో సి.నా.రె. గారి సూటి ప్రశ్నించారు ‘ఏమి చదివి పక్షులు పైకెగరగలిగేను’ అని .. అలాగే ‘ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని’ అని కృష్ణశాస్త్రిగారు ప్రశ్నించారు. కాబట్టి తెలుసుకుంటే రానిదంటూ ఉండదు.. ఈనాటి ఈ చట్టం ఏనాటిదో అని భయపడకండి. మీరేమీ తక్కువ కాదు.. ఎవరికీ తీసిపోరు. మీ ఫోన్ స్మార్ట్. మీరు స్మార్ట్. మీ ఫోన్ ఏ ప్లాన్‌లో ఉందో తెలుసు. టారిఫ్ ప్లాన్ తెలుసు, వైఫై వివరాలు తెలుసు, బ్యాంకు అకౌంట్ పాస్‌వర్డ్‌లు తెలుసు. బంగారం ధర తెలుసు. షేర్లు ఎంతకు కోట్ అవుతున్నాయో తెలుసు.
ఇలా ఎన్నో తెలుసు. అలాంటిది ఇన్‌కం ట్యాక్స్ రూల్స్ అనేవి బ్రహ్మపదార్థాలు కావు కదా తెలియకుండా ఉండటానికి. మీరు పట్టించుకోలేదు అంతే. ఇక నుంచి అవి తెలుసుకోండి. వివిధ రకాలైన గడువు తేదీలను తెలుసుకోండి. గుర్తుంచుకోండి. రూల్స్ తెలుసుకోండి. మినహాయింపులు, తగ్గింపులు తెలుసుకోండి. మీ సహోద్యోగులను సంప్రదించండి. మార్నింగ్ వాక్‌లో మీ పక్కింటాయనతో మాట్లాడండి.
ఇప్పుడు ప్లాన్ చేయండి..
ముచ్చటగా మూడోది.. ప్లాన్ చేసుకోండి. మొదటి పాయింటు ప్రకారం సమగ్ర సమాచారం ఉంది. రెండో పాయింటు ప్రకారం సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. తెలుసుకున్నారు. ఇక ప్లానింగ్. ఈ సంవత్సరం అనుకోకుండా ఆదాయం వచ్చింది. ఆ మేరకు ఆదాయం తగ్గించుకోవాలనుకుంటే దాన్ని సేవింగ్స్ చేయండి. ఉదాహరణకు రూ. 40,000 బోనస్ వచ్చింది. పరిమితులు దాటకుండా ఉంటే 80సి ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. స్థిరాస్తి క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది. మరో ఇల్లు కొనండి. లేదా బాండ్లు కొనండి.
ఇంటద్దె అలవెన్స్ పూర్తిగా మినహాయింపు రావాలంటే.. ఇంటి అద్దె ఎక్కువ ఇచ్చి పెద్ద ఇంట్లో ఉండండి. అయితే, ఆఫీసుకు దూరంగా ఉండి రవాణా ఖర్చు రానుపోను చాలా ఎక్కువయితే మరోలా ప్లాన్ చేయండి. చివరిగా ట్యాక్స్‌ప్లానింగ్ అంటే కేవలం పన్నుభారం తగ్గించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడం కాదు. ఇతరత్ర కుటుంబ ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, నైతిక విలువలు, చట్టాన్ని గౌరవించటం, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, వృత్తి మీద ప్రేమ, సొంతూరిమీద ప్రేమ మొదలైనవి పరిగణనలోకి తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment