మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని నిర్ధారించేవి ముఖ్యంగా మూడు అంశాలు. అవేంటంటే..
1. రెసిడెన్షియల్ స్టేటస్
2. ఆదాయం వచ్చే సమయం
3. ఆదాయానికి మూలం (సోర్స్)
ఇక వివరాల్లోకి వెళ్దాం.
1. రెసిడెన్షియల్ స్టేటస్ ..
ఆదాయపు పన్ను చట్టంలో పన్ను భారాన్ని నిర్ధారించేది మీ రెసిడెన్షియల్ స్టేటస్ .. అంటే మీరు భారత్‌లో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎన్ని రోజులు ఉన్నారనే విషయం. పౌరసత్వానికి, పన్ను భారానికి ఎటువంటి సంబంధం లేదు. పౌరుడైనా, పౌరుడు కాకపోయినా ఆ వ్యక్తి స్టేటస్ .. అంటే ఇండియాలో ఎన్ని రోజులున్నాడనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
ఆదాయానికి మూలం కింద .. జీతం, ఇంటి మీద అద్దె, వ్యాపారం మీద ఆదాయం .. మొదలైనవి ఉంటాయి. ఈ స్టేటస్ ప్రతి సంవత్సరం మారొచ్చు. మారకపోవచ్చు. అందుకని ప్రతి సంవత్సరం ఈ షరతుని లేదా పరిస్థితిని లేదా కొలబద్దని కొలవాలి. లెక్కించాలి. వ్యక్తి విషయానికొస్తే.. 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుంటే, అటువంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. సాధారణంగా మనందరం రెసిడెంట్లమే.
మరో ప్రాతిపదిక ఏమిటంటే, గడిచిన నాలుగు సంవత్సరాల్లో 365 రోజులు లేదా పైగా ఉంటూ, ఆ ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండాలి. ఇలాంటి వ్యక్తిని రెసిడెంట్ అంటారు. ఈ లెక్కింపులకు మీ పాస్‌పోర్ట్‌లలో ఎంట్రీలు ముఖ్యం. రెసిడెంటుకు, నాన్–రెసిడెంటుకు ఎన్నో విషయాల్లో భేదాలు ఉన్నాయి. మిగతా వారి విషయంలో ఇండియాలో ఉంటూ ‘‘నిర్వహణ, నియంత్రణ’’ చేసే వ్యవధి మీద స్టేటస్ ఆధారపడి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
2. ఆదాయం ఏర్పడే సమయం
సాధారణంగా ఆ ఆర్థిక సంవత్సరంలో మీ చేతికి వచ్చినది, మీరు పుచ్చుకున్నది, మీ ఖాతాలో జమ అయినదాన్ని మీ ఆదాయం అంటారు. దీన్నే రావడం ... అంటే ARISE అంటారు. కానీ చట్టంలో ఒక చిన్న ఇంగ్లీష్ పదం ‘ACCRUE’ మరో అర్థాన్ని సూచిస్తుంది. ‘‘ఆదాయాన్ని’’ నిర్వచించే విధానం చూస్తే, వాడే భాష చూస్తే, ఆదాయ పరిధిని ‘‘వామన అవతారం’’లో ‘‘మూడు అడుగుల’’ను స్ఫురింపచేస్తుంది. ఎన్నో వివరణలు, తీర్పులు, పరిధులు ఉంటాయి. ‘‘ఇందుగలడందు కలడు’’ అనే నరసింహావతారం గుర్తుకు రాక తప్పదు.
స్థూలంగా చెప్పడం అంటే మేము ‘సాహసం’ చేయడమే! పాతాళభైరవిలో నేపాల మాంత్రికుడి మాటల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, చేతికొచ్చింది .. చేతికి రావాల్సినది, హక్కు ఏర్పడి రానిది, హక్కు ఉండి అందనిది, ఆదాయంలా భావించేది, భావించతగ్గది, భావించినది, ఆదాయం కాకపోయినా తీసుకోక తప్పనిది (Deemed), కొన్ని సందర్భాల్లో మీకు కలిపేది (Included) అని చెప్పొచ్చు.
3. ముచ్చటగా మూడోది..
మూలం. అంటే Source. చట్టప్రకారం మనకు ఏర్పడే ఆదాయాల్ని ఐదు రకాలుగా, 5 శీర్షికల కింద వర్గీకరించారు.
a) జీతాలు, వేతనాలు
b) ఇంటి మీద ఆదాయం
c) వ్యాపారం/వృత్తి మీద లాభనష్టాలు
d) క్యాపిటల్ గెయిన్స్
e) పై నాలుగింటిలోకి విభజించలేక మిగిలినవి .. ఏ మూలమైనా, ఏ మూల నుంచి వచ్చినా ఈ శీర్షిక కింద పరిగణనలోకి తీసుకుంటారు. అవశేష ఆదాయం అని అనొచ్చు.
ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ట్యాక్స్ ప్లానింగ్‌కి శ్రీకారం చుడదాం.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment