గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం.
♦డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి.
♦ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్‌ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు.
♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్ మీద అద్దె అని ప్లానింగ్ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు.
♦ ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు.
♦ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి.
♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు.
♦నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు.
♦అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు.
వ్యక్తిగత ఖర్చులు
♦క్యాపిటల్ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి.
♦ఆస్తి పన్ను (మున్సిపల్ పన్ను కాదు)
♦విదేశంలోని ఖర్చులు
♦విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు
♦లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు.
♦చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు.
Comments
Please login to add a commentAdd a comment