taxation
-
ఏపీకి రూ 7,211 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 28 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన రూ.1,78,173కోట్ల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తంలో 2024 అక్టోబరులో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా రూ.89,086.50కోట్లు కూడా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211కోట్లు, తెలంగాణకు రూ.3,745కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్కురూ.31,962కోట్లు ఉండగా, అత్యల్పంగా గోవాకు రూ.688కోట్లు ఇచ్చింది. పండుగల సీజన్ దృష్ట్యా రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడం, అభివృద్ధి, సంక్షేమ తదితర వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందస్తు వాయిదాలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. -
ఎన్ఫోర్స్మెంట్.. సెటిల్మెంట్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పట్టుకొమ్మ లాంటి పన్నుల శాఖ.. కొన్నిరోజులుగా ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులతో కునారిల్లుతోంది. ముఖ్యంగా ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తున్న అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న వారిపై ఏకంగా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పన్నుల శాఖలో పాలన గాడి తప్పడం, ఎవరు ఏం చేస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ కొరవడటంతో.. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అధికారులు, వ్యాపారుల జేబుల్లోకి వెళుతున్నాయని అంటున్నాయి. మరోవైపు శాఖలోని అంతర్గత లావాదేవీల్లో కూడా అవినీతి గుప్పుమంటోందని, ఇటీవల జరిగిన ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ.. ఈ ఆరోపణలు, విమర్శలపై ఫోకస్ చేశారు. మూడు రోజులుగా అన్నిస్థాయిల్లోని అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విభాగమే కీలకం పన్నుల శాఖ అదనపు కమిషనర్ నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు, సీటీవోలు, డీసీటీవోలు, ఏసీటీవోలు కలిపి 20 మంది వరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తుంటారు. రాష్ట్రంలో పన్ను కట్టాల్సిన వ్యాపారాలన్నింటిపై ఈ విభాగం నిఘా పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు వేబిల్లులు చూపించి లేదా బిల్లులు లేకుండా జీరో వ్యాపారం చేస్తున్నవారు, వ్యాపార లావాదేవీలను తక్కువగా చూపించే డీలర్లు, తప్పుడు బిల్లులతో ఐటీసీ క్లెయిమ్ చేసుకునేవారు, కోట్ల టర్నోవర్ చేసి అకస్మాత్తుగా మాయమయ్యే వ్యాపారులపై నిఘా పెట్టి.. వారి నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ అధికారులదే. అయితే గత పదేళ్లలో ఈ విభాగంలో పనిచేసిన వారిలో చాలా మంది అధికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అవినీతి మరకలు కొత్తేమీ కాదు. కానీ ఈ విభాగంలో పనిచేస్తూ రిటైరైన ఏడేళ్ల తర్వాత కూడా ఓ అధికారి పింఛన్ ఇంతవరకు సెటిల్ కాలేదంటే.. ఏ స్థాయిలో ఆరోపణలు వచ్చాయో, ఎన్ని కేసులు అయ్యాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు దెబ్బకొడుతూ.. పెద్ద పెద్ద వ్యాపారులపై ఫోకస్ చేసి, వారి పన్ను చెల్లింపుల్లో తప్పులను పట్టుకుని, విచారణ పేరిట బెదిరించడం.. నామమాత్రంగా పన్ను కట్టించి, మిగతా మొత్తంలో కొంత కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బందికి పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వారు ఎక్కడా దొరక్కుండా మ్యాన్యువల్ నోటీసులు ఇవ్వడం.. షోకాజ్ నోటీసు, డిమాండ్ నోటీసు వంటి వాటికి కూడా ఆన్లైన్ ఆథరైజేషన్ లేకుండా చేయడం ద్వారా తమ తతంగాన్ని పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన క్షేత్రస్థాయి పరిశీలనలు, దాడులు, వాహనాల తనిఖీలు వంటివి పన్నుల శాఖలో మచ్చుకైనా కనిపించవు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ విభాగంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఇద్దరు అధికారుల అవినీతి లీలలను వివరిస్తూ, చర్యలు తీసుకోవాలంటూ పన్నుల శాఖలోని వారే ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేసిన టీకే శ్రీదేవి అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా చిన్న ప్రయత్నం చేస్తేనే నెలకు రూ.200 కోట్ల వరకు పన్ను రాబడి పెరిగిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అదే ఎన్ఫోర్స్మెంట్ పనితీరు సరిగ్గా ఉంటే ఏటా ఏడెనిమిది వేల కోట్ల మేర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావొచ్చని అంటున్నాయి. అందరూ హైదరాబాద్ చుట్టూనే.. పన్నుల శాఖ పరిధిలో సర్కిల్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే సీటీవోల వ్యవహారం మరింత విస్తుగొలుపుతోంది. పదోన్నతులు పొంది శిక్షణలో ఉన్న వారు కాకుండా ప్రస్తుతం 85 మంది వరకు పన్నుల శాఖలో సీటీవోలుగా ఉన్నారు. వీరిలో 80 మందికిపైగా హైదరాబాద్‌లోనే పనిచేస్తుండటం గమనార్హం. కేవలం నలుగురైదుగురు సీటీవోలు మాత్రమే జిల్లాల్లో పనిచేస్తున్నారని.. హైదరాబాద్ తర్వాత పన్ను రాబడికి ప్రధాన కేంద్రాలైన వరంగల్, కరీంనగర్‌లలోనూ రెగ్యులర్ సీటీవోలు లేరని సమాచారం. హైదరాబాద్‌లో ఉంటే అటు ఆదాయం పెరగడంతో ఇటు శాఖాపరమైన ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఇక్కడే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారనే చర్చ పన్నుల శాఖలో జరుగుతోంది. కొనుగోళ్లలోనూ అవకతవకలు! పన్నుల శాఖలోని అంతర్గత లావాదేవీల్లోనూ భారీగా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కొనుగోలు చేసిన 200 ల్యాప్‌టాప్‌ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, దీనిపై కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ ప్రత్యేక దృష్టి సారించారని తెలిసింది. ‘శాఖ ఆడిట్‌లోని లోపాలతోపాటు, ఆదాయం తక్కువ వచ్చేందుకు కారణాలు, ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నారు? ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం తీసుకువచ్చారు?’అనే అంశాలపై ఆయన మూడు రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందినకాడికి దండుకుంటున్న అధికారుల వివరాలు సేకరిస్తున్న ఆయన.. త్వరలోనే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని పన్నులశాఖ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడిట్లను పునఃసమీక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని అంటున్నాయి. -
బడ్జెట్లో సామాజిక న్యాయం ఉందా?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు, అక్షరాలు అపురూపంగా ఉన్నాయి. కానీ దళిత, బహుజన, మైనారిటీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పక తప్పదు. ప్రధానంగా బడ్జెట్‌కు ఉండే రాజ్యాంగ స్పృహ తగ్గింది. దళితులకు భూమి, ఉపాధి, సాంకేతిక జ్ఞానం, నైపుణ్యం అందించి నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.భారతదేశ ఆర్థిక ఉత్పత్తిలో దళిత బహుజనులను భాగస్వామ్యం చేసినప్పుడే దేశ సంపద పెరుగుతుందనిఅంబేడ్కర్ అన్నారు. వారికి బడ్జెట్లో చేసిన కేటాయింపులు వారి జీవనాభివృద్ధిని నిర్లక్ష్యం చేసేలాగానే ఉన్నాయి. మురుగువాడల నిర్మూలనకు, నూత్న పారిశ్రామిక వాడల నిర్మాణానికి పథకాలు లేవు. వ్యవసాయం, విద్య, ఉపాధి లాంటివాటి విషయంలోనూ బడ్జెట్ ఏ దూరదృష్టినీ కనబరచలేదు.2024–25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెలు, అక్షరాలు అపురూపంగా ఉన్నాయి. కానీ దళిత, బహుజన, మైనారిటీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారని చెప్పక తప్పదు. పన్నుచెల్లింపు దారులకు బడ్జెట్ అనుకూలంగా ఉంది. ప్రధానంగా బడ్జెట్కుఉండే రాజ్యాంగ స్పృహ తగ్గింది. భారతదేశ ఆర్థిక ఉత్పత్తిలో దళిత బహు జనులను భాగస్వామ్యం చేసినప్పుడే దేశ సంపద పెరుగుతుందని అంబేడ్కర్ అన్నారు. దళితులు శ్రామిక శక్తులు. వారికి భూమి, ఉపాధి, సాంకేతిక జ్ఞానం, నైపుణ్యం అందించినప్పుడే భారతదేశసంపద పెరుగుతుంది. భారతదేశం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయిక దేశం. ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి గ్రామాల్లో ఊరు వేరుగా ఉంది, దళితవాడ వేరుగా ఉంది. దళిత వాడకు విద్యుత్ సౌకర్యం లేదు. మంచినీటి సదుపాయం లేదు. మురుగు నీటి వ్యవస్థ లేదు. రోడ్లు లేవు. దళితులు 3, 4 కుటుంబాలు ఒక్క సెంటులో జీవిస్తున్నారు. భారత గ్రామాలను చూసిన విదేశీ పరిశోధకులు ఇది స్పృశ్య భారతమా? అస్పృశ్య భారతమా? అని అడుగుతున్నారు. గ్రామాల్లో ఉన్న వృత్తికారులు పట్టణాలకు వెళ్ళి మురుగువాడల్లో జీవిస్తున్నారు. నివాసానికి ఇళ్ళులేక మురుగు కాలువల మీద చెక్కబద్దలు వేసుకొని వాటిమీద బతుకుతున్నారు. ఈ మురుగువాడల నిర్మూలనకు, నూత్న పారిశ్రామిక వాడల నిర్మాణా నికి పథకాలు లేవు. గ్రామీణాభివృద్ధి పథకం కింద 25 వేల గ్రామీణ జనావాసాలు ఉన్న దగ్గర శాశ్వత రహదారులు నిర్మిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అనేక దళితవాడలు, గిరిజన వాడలకు ఇంత జనాభా ఉండదు. అందుకే ఇది పన్ను కట్టేవారి బడ్జెట్ గానే మన ముందుకు వచ్చింది. నిజానికి గిరిజన గ్రామాలు ఇంకా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సంక్షోభంలోనే ఉన్నాయి. గర్భవతిగా ఉన్న వారిని డోలీల్లో మోసుకొచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు. వారికి కేటాయించిన అతి స్వల్ప నిధి వారి జీవనాభివృద్ధిని నిర్లక్ష్యం చేసే లాగానే ఉంది.ఇకపోతే వ్యవసాయ రంగానికి ఇచ్చిన కేటాయింపుల్లో దూరదృష్టి లేదనీ, రైతులకు మేలు జరిగే అంశాలు లేవనీ రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధతపై ఎలాంటి ప్రకటన చేయలేదని కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) నాయకుడు సర్వన్ సింగ్ పంఢేర్ అన్నారు. సంయుక్త కిసాన్ మెర్చా నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ స్పందిస్తూ, వ్యవసాయ రంగానికి కేటాయింపు పెరగాల్సిందన్నారు. రైతులకు సంబంధించినంత వరకు ఇది ఫ్లాప్ బడ్జెట్ అని మరొక రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ వ్యాఖ్యానించారు. పంజాబ్ రైతులకు మొండిచేయి చూపిందనీ, వ్యవసాయ వైవిధ్యత ప్యాకేజీగానీ, ఆగ్రో–ఇండస్ట్రియల్ ప్యాకేజిగానీ ప్రకటించలేదని అన్నారు. మరో విషయం. బడ్జెట్లో భారతదేశంలో నిరంతరంగా వస్తున్న తుఫాన్లు, వరదలు, అతి ఉష్ణోగ్రతలు, అతి శీతలాలను పరిష్కరించే విధానాలకు, కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదు.ఇకపోతే భారత దేశానికి ఊపిరిలాంటి విద్యా రంగానికి భారీగా కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటా యించగా, ఈసారి రూ.1.20 లక్షల కొట్లే ఇచ్చి, తొమ్మిది వేల కోట్లు తగ్గించారు. భారతదేశంలో నిరక్షరాస్యత పెరగడానికి కారణం వయో జన విద్యకు అక్షరాలు రాయాల్సిన స్త్రీలు టీవీలకు బుర్రల్ని అప్ప జెప్పడం! కేంద్ర విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా ల్యాబులు, లైబ్రరీలు లేవు. పరిశోధకులకు సరైన స్కాలర్షిప్లు లేవు. భారత దేశంలో ఉన్నత విద్య సరిగా లేక విద్యార్థులు విదేశాలకు వలస పోతున్నారు. నిజానికి విద్యారంగాన్ని దెబ్బతీసే అనేక కోతలు జరిగాయి. ఉన్నత విద్య నియంత్రణ మండలి యూజీసీకి 60 శాతానికి పైగా నిధులు తగ్గించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కేటాయింపులు తగ్గించారు.ఇకపోతే మరోపక్క నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ బడ్జెట్లో ఉద్యోగ వసతికి ప్రాధాన్యం బాగా తగ్గించారు. భారత దేశాన్ని యువ భారతం అని పిలుస్తున్నారు. యువత దేశ భవిష్యత్‌కు సజీవ శక్తి లాంటిది. కానీ ఈ బడ్జెట్ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను నిరాకరిస్తోంది. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక మత్తు మందులకు, గంజాయికి అలవాటుపడుతున్నారు, నేరాలకు పాల్పడు తున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగ వసతి కలిగించినట్లయితే వారు నేరస్థులుగా, అర్ధ నేరస్థులుగా జీవించరు. వారిలో వ్యక్తిత్వ నిర్మాణ దక్షత పెరుగుతుంది. ఒక యువకుని వ్యక్తిత్వ నిర్మాణానికి లౌకికవాద భావజాలం, లౌకికవాద దృష్టి, సామాజిక స్ఫూర్తి అన్నీ అవసరం. స్కిల్ నైపుణ్యం ఒక్కటే చాలదు, జీవన నైపుణ్యం కావాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం అమరావతికి ఇచ్చిన 15 వేల కోట్లను గ్రాంట్‌గా కాక రుణంగా ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అసలు రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ఈ రోజున ఇచ్చే నిధులన్నీ అప్పుగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ఆశ్చర్యంగా ఉంది. మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), స్టాలిన్ (తమిళనాడు), రేవంత్ రెడ్డి (తెలంగాణ), విజయన్ (కేరళ), సిద్ధరామయ్య (కర్ణాటక) లాంటి ముఖ్య మంత్రులందరూ రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వాన్నీ, ఆర్థిక ప్రజాస్వా మ్యాన్నీ దెబ్బతీసేదిగా ఈ బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సైతం బడ్జెట్లో సామాజిక న్యాయం లేదనీ, భారతదేశ ఆర్థిక ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఈ బడ్జెట్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతోందనీ అన్నారు. ఇకపోతే ఉపాధి హామీ రంగానికి ఈ బడ్జెట్లో కోతలు విధించి బుద్ధిపూర్వకంగా శ్రామికుల ఆదాయ మార్గాన్ని దెబ్బతీశారని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అంబేడ్కర్ బడ్జెట్ నిర్మాణంలో తప్పకుండా భూమి పంపకం ఉండాలనీ, కుల నిర్మూలనా భావం ఉండాలనీ అన్నారు. కులాన్ని నిర్మూలించే భావ చైతన్యం కోసం, ఆచరణాత్మక కార్యక్రమం కోసం బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉన్నప్పుడే, దేశంలో సామరస్యత, శాంతి ప్రజ్వ రిల్లుతాయనీ చెప్పారు. దేశానికి మత సామరస్యం, లౌకికవాద భావన, సామ్యవాద సిద్ధాంత స్ఫూర్తి చాలా అవసరం అని నొక్కి చెప్పారు. దళితులు, ఆదివాసీల సమస్యలను వారి ఎంపీలే మాట్లాడితే అందులో సానుభూతి కాకుండా స్వీయ అనుభవపు గొంతుక విన బడుతుంది. ఒక జగ్జీవన్‌రావ్‌ు, ఒక దామోదరం సంజీవయ్య, ఒక ప్రగడ కోటయ్య లాంటివాళ్ల గొంతులు లోక్‌సభలో, రాజ్యసభలో వినిపించేవి. ఇప్పుడు రెండు సభల్లోనూ ఆధిపత్య కులాల ప్రతినిధులే మాట్లాడుతున్నారు. చివరకు రాహుల్ గాంధీని ‘నీది ఏ కులం?’ అనే దాక పరిస్థితి వెళ్ళింది. వాళ్ళ తాత ఫిరోజ్ గాంధీ ఒక పార్శీ, ఇందిరా గాంధీ కశ్మీరీ బ్రాహ్మణుడైన నెహ్రూ కుమార్తె. అది వర్ణాంతర వివాహం. వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలది దేశాంతర వివాహం. మూడు తరాలు వర్ణాంతరం చేసుకుంటే వారికి కులంఉండదు. రాబోయే కాలం కులాంతర సమాజం. అది అందరం తప్పకుండా అర్థం చేసుకోవలసిన విషయం. ఇప్పుడు దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీవాద, లౌకికవాద మేధావులంతా పార్టీలకు అతీతంగా అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. సామ్యవాద, లౌకికవాద భారతాన్ని నిర్మించడం కోసం నడుం కట్టాలి. అప్పుడే భారతదేశంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసం కలుగుతుంది.- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695- డా‘‘ కత్తి పద్మారావు -
‘పన్ను’లపైనే గంపెడాశలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల ఆదాయంపైనే గంపెడాశలు పెట్టుకుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారా ఆదాయం రాబట్టుకోవడంపై కాంగ్రెస్ సర్కారు దృష్టిపెట్టినట్టు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రూ.2.91లక్షల కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం.. అందులో ఏకంగా రూ.1.64 లక్షల కోట్లను (50 శాతానికిపైగా) పన్నుల రూపంలోనే సమీకరించుకుంటామని పేర్కొంది. ఇది గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే.. రూ.29 వేల కోట్లు (20 శాతం) అదనం కావడం గమనార్హం. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా కింద వచ్చే రూ.26,216 కోట్లు పోను మిగతా రూ.1.38 లక్షల కోట్లను అమ్మకపు పన్ను, ఎక్సైజ్, ఇతర పన్నుల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది రూ.14,295.56 కోట్లురాగా.. ఈసారి రూ.18,228.82 కోట్లు వస్తాయని అంచనా వేశారు. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనే భూముల విలువల సవరణ చేసే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్ ఆదాయాన్ని గత ఏడాది సవరించిన అంచనాల్లో రూ.20.298 కోట్లుగా చూపగా.. ఈసారి రూ.5వేల కోట్లు అదనంగా రూ.25,617 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. ఎక్సైజ్ ఆదాయ లక్ష్యం పెంపు నేపథ్యంలో.. ఈసారి మద్యం ధరలు పెరగొచ్చన్న చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద అమ్మకపు పన్ను ద్వారా గత ఏడాది రూ.57,394.46 కోట్లురాగా, ఈసారి 18శాతం అదనంగా రూ.68,273.73 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించారు. జీఎస్టీ, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, వాహనాలు, సరుకులు, ప్రయాణికుల రవాణా, ఇతర పన్నుల రూపంలో ఈ మొత్తం సమకూరనుంది.భూముల అమ్మకంపై చర్చ!ఈసారి పన్నేతర ఆదాయం ఏకంగా రూ.35,208.44 కోట్ల మేర వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. గత ఏడాది ఇది రూ.23,819.50 కోట్లుకాగా.. ఈసారి 50శాతం అదనంగా ప్రతిపాదించారు. అంతకుముందు 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.8,857.42 కోట్లు మాత్రమే. అప్పుడు పన్నేతర ఆదాయం పెంచిన తరహాలోనే ఇప్పుడూ పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టిని ప్రశ్నించగా.. భూములు అమ్ముతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆదాయం పెంపు కోసం తమకు అనేక మార్గాలున్నాయని, అవన్నీ ఇప్పుడు వెల్లడించలేమని పేర్కొన్నారు.ఆశల పల్లకి దిగని ‘గ్రాంట్లు’కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు బడ్జెట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాంట్ల కింద ఈసారి రూ.21,636 కోట్లు వస్తాయని చూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏడెనిమిదేళ్లుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను ఆశించడం, కేంద్రం మొండిచేయి చూపడం రివాజుగా మారింది. గత ఏడాది కేంద్రం రూ.13,179.21 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా.. రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు ఏడాది రూ,.8,619.26 కోట్లు మాత్రమే అందాయి. అయినా ఈసారి భారీగా అంచనా వేయడం గమనార్హం. (నోట్: పన్నుల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లను కలిపి మొత్తం రాబడుల కింద పరిగణిస్తారు. తాజా బడ్జెట్లో రూ.2,21,242.23 కోట్లు రాబడులు వస్తాయని ప్రతిపాదించారు. ఇది 2023–24లో రూ.1,69,089.59 కోట్లు, 2022–23లో రూ.1,27,468.63 కోట్లు మాత్రమే) -
‘ఒకే పన్ను’కు పెద్ద రంగాలే దన్ను
జీఎస్టీని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను రేటు అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతి పెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి. ఒకే పన్ను అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి, దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధి కోసం జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.దేశంలో ఏడేళ్ల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తొలిసారి ప్రవేశపెట్టినప్పుడు దాని అమలుపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాల నివృత్తి జరక్కుండానే జీఎస్టీ అమలుకు నిర్ణయం తీసుకోవడం దుందుడుకు చర్యగా కొందరు అభివర్ణించారు కూడా!అంతకు ఏడాది క్రితమే పెద్దనోట్ల రద్దు జరిగిందని, ఆ నష్టం నుంచి తేరుకోకముందే అరకొరగా జీఎస్టీని అమలు చేయడం సరికాదని వాదించారు. ఆర్థికవేత్తలు, పన్ను నిపుణులు చాలామంది జీఎస్టీ అమలు విఫలం కాక తప్పదన్న హెచ్చరికలూ జారీ చేశారు. అయితే అన్ని అభ్యంతరాలను తోసిరాజని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముందడుగు వేయడం తెలివైన పనే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అనుమానాలు తీర్చడంలో, జీఎస్టీలో భాగస్వాములైన వారందరి అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో ఏళ్లు పూళ్లు అవడం ఖాయం. కానీ ఒక్క విషయమైతే ఇక్కడ చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను ఉండాలన్న జీఎస్టీ లక్ష్యం పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలనూ దీని పరిధిలోకి తీసుకు రాగలిగితేనే నెరవేరుతుంది.జీఎస్టీపై సాధికార కమిటీదేశవ్యాప్తంగా ఒకే పన్ను అన్న అంశంపై సుమారు 18 ఏళ్లు చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నులు, రాష్టాల పన్నుల స్థానంలో ఒకటే పన్ను ఉండాలన్నది 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఆలోచన. విజయ్ కేల్కర్ నివేదిక ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా పన్ను వసూళ్లు మెరుగవుతాయని, ఆర్థిక వ్యవస్థల ఏకీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. జీఎస్టీ అమల్లో ఉన్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు బాగున్నట్లు అప్పటికే జరిగిన పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి కూడా. జీఎస్టీపై 2000లో ఆర్థిక మంత్రులతో కూడిన ఒక సాధికార కమిటీ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి అసిమ్‌దాస్ గుప్తా ఆ కమిటీకి నేతృత్వం వహించారు. ఇప్పటి జీఎస్టీ కౌన్సిల్ తొలి రూపం ఆ కమిటీనే. దాని సిఫారసులను అనుసరించి అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఆదాయ వ్యవహారాల్లో ఏకాభిప్రాయ సాధన సూత్రాలుగా జీఎస్టీ కౌన్సిల్ పని చేస్తుంది. చర్చోపచర్చల తరువాత ఈ కమిటీ జీఎస్టీ బిల్లు తొలి ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఇరవై ఏళ్లు పట్టింది. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు ఉండగా... 2016 నాటికి గానీ స్థూలమైన ఏకాభిప్రాయం కుదరలేదు.మెరుగుపడిన పన్ను వసూళ్లు!ఒకే ఒక్క పన్ను అన్న లక్ష్యంతో మొదలైన జీఎస్టీలో సంక్లిష్టతలు వచ్చేందుకు ఒక కారణం... తమ ఆదాయం పడిపోతుందన్న రాష్ట్రాల బెంగ. ఫలితంగా... ఒకే పన్ను స్థానంలో పలు రకాల పన్ను రేట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ, అంతర్రాష్ట్ర రవాణాపై సమీకృత జీఎస్టీ ఇలా పలు రకాల పన్నులు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా... ఐదు నుంచి 28 శాతం వరకూ నాలుగు విభాగాల పన్ను రేట్లను నిర్ధారించారు. అంతేకాదు... తమకు అత్యధిక ఆదాయాన్నిచ్చే పెట్రోలు, మద్యం జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండాలని రాష్ట్రాలు పట్టుబట్టాయి. జీఎస్టీ అమలు సమయంలో ఈ పన్ను ద్వారా తగినంత ఆదాయం వస్తుందా? అన్న అనుమానాలు రాష్ట్రాలకు ఉండేది. అయితే ఈ అనుమానాలు వట్టివేనని తేలిపోయింది. వాస్తవానికి పన్ను వసూళ్లు మునుపటి కంటే బాగా మెరుగయ్యాయి. జీఎస్టీ తాజా గణాంకాలను పరిశీలిస్తే గత జూన్ నెలలో వసూళ్లు 1.74 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన తొలి ఏడాది ఈ మొత్తం నెలకు 90 వేల కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్రాల సొంత ఆదాయం కూడా జీఎస్టీ అమలు తరువాత పెరిగినట్లు ఆర్బీఐ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. అంటే... రాష్ట్రాలు జీఎస్టీ విషయంలో ఏర్పాటు చేసిన కాంపెన్సేషన్ లేకుండా సొంత ఆదాయాలతోనే వ్యవహారాలు చక్కబెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ కాంపెన్సేషన్ అనేది ముందు ఐదేళ్లు ఉంటుందని అనుకున్నారు కానీ... కోవిడ్ కారణంగా 2026 వరకూ పొడిగించారు. ఆదాయం ఇప్పటి మాదిరే పెరుగుతూ ఉంటే ఈ ఏర్పాటును రద్దు చేయవచ్చు.చిన్న వ్యాపారులకు మేలే జరిగింది!మొత్తమ్మీద జీఎస్టీ అమలులో కొన్ని ఆటుపోట్లు ఉన్నాయన్నది వాస్తవం. పద్ధతులను సులువు చేసే విషయంలో, మరీ ముఖ్యంగా రెడ్టేప్ను తగ్గించడంలో! అయితే ఇతర సమస్యలేవైనా వచ్చినా వాటి పరిష్కారం కోసం రాష్ట్రాలు తరచూ జీఎస్టీ కౌన్సిల్ రూపంలో సమావేశమవుతూండటం గమనార్హం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం ఎలా అనే సవాలును కంప్యూటర్ల సాయంతో అధిగమించారు. జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులకు నష్టం జరుగుతుందని కొంతమంది భయపడ్డారు కానీ.. వాస్తవానికి జరిగింది మేలే. లక్షలాది చిన్న వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైపోయారు.జీఎస్టీ పరిధిలోకి పెట్రోలుజీఎస్టీ అమలుతో సామాన్యులపై పన్ను భారం ఎక్కువ అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కానీ దీనికి కూడా సరైన హేతువు ఏదీ లేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. వినియోగమవుతున్న వస్తువుల్లో 60 శాతం వాటికి అతి తక్కువ పన్ను రేట్లు (సున్నా లేదంటే ఐదు శాతం) ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కేవలం మూడు శాతం వస్తువులపై మాత్రమే 28 శాతం అత్యధిక పన్ను పడుతోంది. అయినా ఒక్క విషయాన్ని మాత్రం మనం అంగీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ పన్ను రేట్లను మరింతగా హేతుబద్ధీకరించాలి. ఒకే పన్ను రేటు అన్నది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా ఇప్పుడున్న పన్ను స్లాబ్‌లను తగ్గించి దీర్ఘకాలంలో పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేయవచ్చు.ఇక రెండో అంశం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉంది. విద్యుత్తు, భూమి వంటి వాటిని కూడా చేర్చాలన్న వాదన ఉంది. తొలి దశలో భాగంగా వైమానిక ఇంధనం, సహజవాయువులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోలు, డీజిళ్లను కూడా చేర్చడం ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి. రాష్ట్రాలకు సంబంధించి అతి పెద్ద ఆదాయ వనరుగా ఉండటం వల్ల మద్యం అమ్మకాలపై జీఎస్టీ అనేది కొంచెం సున్నితమైన అంశం అవుతుంది. అయితే నేడు కాకపోతే రేపు అయినా సరే... ఈ మార్పు అనివార్యం.అప్పిలేట్ ట్రిబ్యునల్ అవసరంజీఎస్టీ కౌన్సిల్ ఇటీవలి సమావేశాల్లో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు జరిగాయి. జీఎస్టీకి ముందు కాలం నాటి వివాదాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. అదే సమయంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరాన్ని కూడా కౌన్సిల్ గుర్తించింది. జీఎస్టీ అమలును మరింత సమర్ధంగా మార్చేందుకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, విధానాన్ని సులభతరం చేయడం వీటిల్లో కొన్ని చర్యలు మాత్రమే. అదే సమయంలో ఒకే పన్ను అన్న అసలు లక్ష్యాన్ని అందుకోవాలంటే ఆర్థిక వ్యవస్థలోని అతిపెద్ద రంగాలైన పెట్రోలియం వంటి వాటిని జీఎస్టీ పరిధిలోకి చేర్చడం తప్పనిసరి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు కూడా హేతుబద్ధమైన, దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా జీఎస్టీ లక్ష్యానికి దన్నుగా నిలవాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ -
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్‌లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్‌లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్‌కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
భారత్‌కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్ చెప్పారు. ‘భారత్ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్ వేల్యుయేషన్‌ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్‌లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్‌మార్ట్, టెన్సెంట్ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
ఏయే ఆదాయానికి ట్యాక్స్ మినహాయింపులిస్తారో..ఇవ్వరో మీకు తెలుసా!
గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం. ♦డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి. ♦ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్‌ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు. ♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్ మీద అద్దె అని ప్లానింగ్ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు. ♦ ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు. ♦ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి. ♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు. ♦నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ♦అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. వ్యక్తిగత ఖర్చులు ♦క్యాపిటల్ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి. ♦ఆస్తి పన్ను (మున్సిపల్ పన్ను కాదు) ♦విదేశంలోని ఖర్చులు ♦విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు ♦లాటరీలు, క్రాస్‌వర్డ్ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు. ♦చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు. -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
ఆదాయ పన్ను: ఇతర ఆదాయం ఉంటే
సాక్షి,హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అసెస్సీకి ఐదు రకాల ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని ఈ కింద పేర్కొన్న శీర్షికల కింద విభజించారు. ⇒ జీతాలు ⇒ ఇంటిపై అద్దె ⇒ వృత్తిపై, వ్యాపారంపై లాభాలు ⇒ మూలధన ఆస్తులపై లాభాలు ⇒ ఇతర ఆదాయాలు ఏ వ్యక్తికైనా వచ్చే ఆదాయాన్ని పైవిధంగా వర్గీకరించి, పన్ను భారాన్ని లెక్కిస్తారు. పై జాబితాలో మొదటి నాలుగింటి విషయంలో నిర్దిష్టంగా, స్పష్టంగా చట్టం అన్ని అంశాలూ చెప్పింది. మనం గతంలో ఎన్నోసార్లు వాటిని ప్రస్తావిస్తూ వచ్చాం ఇక ఆఖరుదీ అయిదో అంశం ప్రత్యేకత ఏమిటంటే.. ఏదేని ఆదాయం, మొదటి నాలుగింటిలోనూ ఇమడ్చలేకపోతే/వర్గీకరించకపోతే/ విభజించలేక పోతే.. అటువంటి ఆదాయాన్ని ‘‘ఇతర ఆదాయం’’ కింద పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఆదాయం.. జీతం కాదు, ఇంటి మీద అద్దె కాదు, వృత్తి .. వ్యాపారం వల్ల వచ్చిన లాభం కాదు, మూలధన లాభాలు కాదు .. ఇక మిగిలింది .. చివరిది ఇతర ఆదాయం. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ శీర్షిక కింద పన్ను వేస్తారు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అన్న సామెతలాగా ఎలాంటి మొహమాటం లేకుండా పట్టుకుంటారు. మీరు దొరక్క తప్పదు. పన్ను చెల్లించక తప్పదు. ఇది కాకుండా చట్టప్రకారం ఈ కింద పేర్కొన్న వాటిని ‘‘ఇతర ఆదాయం’’గా పరిగణిస్తారు. ⇒ భూమిపై అద్దె ⇒ సబ్-లెట్టింగ్పై ఆదాయం ⇒ బ్యాంకు డిపాజిట్లు (ఫిక్సిడ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ) ⇒ డైరెక్టర్లకు వచ్చే సిట్టింగ్ ఫీజు ⇒ విదేశీ గడ్డ నుండి వచ్చే వ్యవసాయంపై ఆదాయం ⇒ డైరెక్టరుగా సంపాదించే గ్యారంటీ కమీషన్ ⇒ పరీక్షల నిర్వహణకు వచ్చే ఆదాయం, వేల్యుయేషన్ ఫీజు, ఇన్విజిలేషన్ ఫీజు ⇒ ఫ్యామిలీ పెన్షన్ (ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్ మీద .. జీతంలాగానే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది. 1/3వ వంతు లేదా రూ. 15,000. ఈ రెండింటిలో తక్కువ మినహాయింపు ఇస్తారు) ⇒ పార్లమెంటు, శాసన సభ సభ్యుల జీతాలు ⇒ బుక్స్ రాసినందుకు వచ్చే రాయల్టీలు ⇒ వారసులకొచ్చే రాయల్టీలు (బుక్స్‌పై) ⇒ హోటల్స్‌లో సర్వర్స్కి వచ్చే టిప్స్, డ్రైవర్లకు వచ్చే టిప్స్ ⇒ క్యాజువల్ ఆదాయం ⇒ యాన్యుటీలు ⇒ మధ్యవర్తిత్వం చేసినందుకు వచ్చే కమీషన్ ⇒ అండర్‌రైటింగ్ కమీషన్ ⇒ బహిర్గతం చేయలేని సోర్స్ నుండి ఆదాయం ⇒ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయం ⇒ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇతరుల ఆదాయం, కొన్ని ఖర్చులు, లెక్క చెప్పని నగదు, లెక్క చెప్పని ఇన్వెస్ట్మెంట్ .. మొదలైన వాటి విలువ. ఈ జాబితా ఇక్కడితో పూర్తవలేదు. ఇవి అంతంకాదు ఆరంభం లాగా కేవలం మచ్చుతునకలే. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ఫండ్స్ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా?
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి? – బ్రిజ్ మోహన్‌లాల్ గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌ను 2021 డిసెంబర్లో సుందరం మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబాస్‌లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్ ఫండ్‌కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్ ఫండ్స్ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్ ఏ, ఫండ్ బీని తీసుకుందాం. ఫండ్ ఏను తీసుకెళ్లి ఫండ్ బీలో విలీనం చేశారు. ఫండ్ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్ బీ ఎన్ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
టాక్స్ ఆడిట్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు..
టాక్స్ ఆడిట్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం.. ఈ వారం ఎలా చేయించాలో తెలుసుకోండి. - ముందుగా ఆర్ధిక సంవత్సరం చివరికి టర్నోవరు లేదా అమ్మకాలు లేదా బ్యాంకులో వసూళ్లు విలువ తెలుసుకోండి. చివరి దాకా వేచి ఉండక్కర్లేదు. మీ అనుభవం .. వ్యాపార సరళి, జీఎస్టీ రికార్డులను బట్టి తెలుస్తుంది. టర్నోవరు కోటి రూపాయలు దాటింది అంటే మీ కేసు టాక్స్ ఆడిట్ పరిధిలోనిది అన్నమాట. - వెంటనే ఒక ప్రాక్టీస్ లో ఉన్న సీఏని సంప్రదించండి. - సదరు సీఏని అపాయింట్ చేసుకోండి. అలాగే ఫీజు కూడా ముందుగానే పేర్కొనండి. - సీఏని మీరే నియమించినా ఆ వ్యక్తి ఇటు మీ తరఫున అటు ఇన్‌కం ట్యాక్స్ విభాగం తరఫున తన విధులకు న్యాయం చేస్తారు. - ఏం చేయాలన్నది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. - ఆడిట్ పరిధిలో ఏయే రికార్డులు వెరిఫై చేయాలన్నది ప్రస్తావించారు. - ఒక అస్సెస్సీకి సంబందించిన వందలాది అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇవ్వాలి. - ఉదాహరణకు వ్యాపారంలో సొంత ఖర్చులు ఉన్నాయా? క్యాపిటల్ ఖర్చులు మామూలు ఖర్చుల్లో కలవడం జరగలేదు కదా? బిజినెస్‌కి సంబంధం లేని ఖర్చులు విడిగా రాయడం చేశారా? సొంత వాడకాన్ని విడిగా చూపించారా? విరాళాలు విడిగా రాశారా? ఇలాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. - పైవన్నీ తప్పు అని అనటం లేదు... కొన్ని వ్యాపారాల్లో చాలా సహజం... జరిగింది జరిగినట్లు రాయండి.. ఆడిటర్ ఆ వ్యవహారాలను జల్లెడ బట్టి తన వృత్తి నైపుణ్యంతో విడగొడతారు. - ఆదాయాన్ని, ఖర్చులను సరిగ్గా నిర్ధారించడంపైనే ఈ ఆడిట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కొన్ని విధులు సరిగ్గా నిర్వహించడం జరిగిందా లేదా అన్నది రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా టీడీఎస్ లాంటివాటికి సంబంధించి చట్టప్రకారమే ప్రయోజనం పొందారా లేదా అన్నది పరిశీలిస్తుంది. - ఇందుకోసం ఆదాయపు పన్ను విభాగం నిర్దేశి ంచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. - అప్పుడు పూర్తి అవుతుంది.. ఆడిట్.. ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్‌పై ఇద్దరు సంతకం పెడతారు. దీన్ని గడువు తేదీ లోపల దాఖలు చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ భారీగా వడ్డీస్తారు. ఈ రిపోర్ట్ మీకూ శ్రీరామ రక్ష. 31మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఫిబ్రవరి 15 దాకా పొడిగించారు. కాబట్టి కాస్త త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసేసి ఉంటే 31 మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం రిటర్నుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
నాలుగుసార్లు లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్‌సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్‌ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ
-
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి లబ్ధి : మోదీ
సాక్షి, ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. సెప్టంబర్ 25 నుంచి ఫేస్‌లెస్ అప్పీల్ సేవలను ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్‌లకు కమిటీలో చోటు కల్పించారు. -
వేతన జీవులకు షాక్: కొత్త ఐటీఆర్..ఎన్నో మార్పులు
ఐటీఆర్–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. ►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ విషయంలో మార్పుల వలన, లిస్ట్ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్’ విలువను సీఏ, మర్చంట్ బ్యాంకర్‌తో ధ్రువీకరించాలి. ►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి. ►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి. ►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్ ‘జెండర్’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు. ►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్ వివరాలను తెలియజేయాలి. ►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. ► అలాగే నాన్ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు విదేశీ బ్యాంక్ వివరాలిస్తే.. ఆబ్యాంక్ ఖాతాకు రిఫండ్ ఇస్తారు. ► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే). ►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్‌ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్‌తో, జీఎస్టీ టర్నోవర్‌ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. ►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు ఇవ్వాలి. ►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018. ఆన్లైన్లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది. -
పాక్ వింత నిర్ణయం కోళ్లు, ఆవుల మీద పన్ను
-
కోళ్లు, ఆవులపై పాక్ వింత నిర్ణయం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్‌లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు. ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
మధ్యతరగతికి కొంత ఊరట!
► 5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు ► రిబేట్ మాత్రం రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు ► బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులూ చేయని జైట్లీ ► పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ ► రూ.5 లక్షలలోపు వేతన జీవులకు సింగిల్ పేజీ ట్యాక్స్ రిటర్నులు ► తొలిసారి రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి స్క్రూటినీ ఉండదు ఎవరి ఆదాయంపై ఎంత పన్ను ఉంటుందో చూస్తే... అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రేట్లు భారీగా తగ్గుతాయని ఆశించిన వేతన జీవులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరీ ఎక్కువగా కాకున్నా కొంత ఊరటనిచ్చారు. బేసిక్ లిమిట్ జోలికి వెళ్లకపోయినా... ఏడాదికి రూ.10 లక్షల వరకూ వేతనం ఉండే మధ్య తరగతి వేతన జీవులందరికీ మరికొంత మొత్తం జేబులో మిగిలేలా చర్యలు తీసుకున్నారు. మినహా యింపులన్నీ పోను... పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.2.5 లక్షలు దాటి రూ.5 లక్షల మధ్యలో ఉంటే... దానిపై ఇప్పటిదాకా విధిస్తున్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆ రకంగా వారు చెల్లిస్తున్న పన్ను లో 50 శాతాన్ని మిగిల్చారు. అయితే ఒకచేత్తో ఇస్తూనే మరో చేత్తో తీసుకున్న మాదిరిగా సెక్ష న్ 87ఏ కింద ఇస్తున్న ట్యాక్స్ రిబేట్‌ను (చెల్లించాల్సిన పన్నును తగ్గించడం) సగానికి సగం తగ్గించేశారు. పైపెచ్చు దాని పరిధిని కూడా కుదించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ. 5,000 ట్యాక్స్ రిబేట్ లభించేది. అంటే చెల్లిం చాల్సిన పన్నులోంచి రూ.5,000 మినహా యించి మిగిలింది చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.2,500కు కుదించారు. పైపెచ్చు ఈ రిబేటు కేవలం రూ.3.50 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు. ఇప్పుడు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను భారం పడదు. కానీ వీరు రిటర్నులు తప్పనిసరిగా వేయాలి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.3 లక్షలు దాటి రూ.3.50 లక్షల లోపు ఉంటే వారిపై రూ.2,500 పన్ను పడుతుంది. ఇదివరకు వీరు రిబేటు పోను రూ.5,000 చెల్లించాల్సి వచ్చేది. సెక్షన్ 80సీ కింద పొదుపు, వ్యయాలపై లభించే రూ.1.50 లక్షల మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.4.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ పడే అవకాశం లేదు. రూ.5,00,000 దాటిన వారందరికీ రూ.12,500 వరకు పన్ను భారం తగ్గుతుంది. అధికాదాయం... సర్‌చార్జీ వడ్డింపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం కనుక రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటే 10 శాతం సర్‌చార్జీని కొత్తగా వడ్డించారు. గతేడాది కోటి రూపాయలు దాటిన వారిపై విధించిన 15 శాతం సర్‌చార్జీని కొనసాగి స్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు సులభంగా రిటర్న్స్ దాఖలు చేసేలా సింగిల్‌పేజీ రిట ర్న్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి ప్రక టించారు. అదే విధంగా తొలిసారి రిటర్నులు దాఖలు చేసిన వారిని స్క్రూటినీ చేయబోమని ఆర్థికమంత్రి హామీనిచ్చారు. బేసిక్ లిమిట్ రూ. 4 లక్షల వరకు పెరుగుతుందని, సెక్షన్ 80సీ పరిమి తితో పాటు గృహ రుణాలకు చెల్లించే వడ్డీపై లభించే రాయితీ పరిమితిని పెంచుతారని ఉద్యోగులు వేసిన అంచనాలేవీ నిజం కాలేదు. కాగా ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కేంద్రం నికరంగా రూ.15,500 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని జైట్లీ చెప్పారు. కాగా, ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీ ఆర్)లు ఆలస్యమైతే పదివేల రూపాయల జరిమానా విధించాలని బడ్జెట్లో ప్రతిపాదిం చారు. అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే...! ఉద్యోగులతో పాటు వ్యాపారేతర ఆదాయం కలిగిన వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి వృత్తి నిపుణులకు కూడా ఈ పన్ను శ్లాబులు వర్తిస్తాయి. అయితే ఈ పన్ను విధించేది ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌పైనే. అంటే... మీరు సంపాదించే మొత్తం ఆదాయం నుంచి తొలుత వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపుల్ని తీసేస్తారు. అంటే పీఎఫ్‌కు చెల్లించేది, హెచ్ఆర్ఏ/ ఇంటి అద్దెగా మినహాయించేది, ఇక సెక్షన్ 80సీ కింద వివిధ పథకాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్లు (గరిష్ఠంగా ఇది రూ.1.5 లక్షల వరకూ చేయొచ్చు), ఇతర సెక్షన్ల కింద వర్తించే వైద్యబీమా ఖర్చులు, వైద్య ఖర్చులు... ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనుక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, 5 నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
బడ్జెట్‌కు ముందు జైట్లీ కీలక సంకేతాలు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 'పోటీతత్వపు వాతావరణంలో తక్కువ పన్నులతో ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరముంది. పోటీతత్వం దేశీయంగా కాకుండా అంతర్జాతీయస్థాయిలో ఉండాలి. ఇది ఎంతో కీలకమైన మార్పు' అని ఆయన పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో కనీస ఆదాయపన్ను పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తక్కువ పన్నుల గురించి ఆయన మాట్లాడినట్టు భావిస్తున్నారు. జైట్లీ మాట్లాడుతూ 'చట్టబద్ధమైన పన్ను చెల్లించడం పౌరుడి బాధ్యత. పన్ను చెల్లించకపోవడం వల్ల ఎన్నో దుశ్ప్రరిణామాలు ఉంటాయి. పన్ను చెల్లించకపోతే నష్టమేమీ లేదు, అనైతికమేమీ కాదన్న అభిప్రాయం గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో నెలకొని ఉంది. అలా చేయడం వాణిజ్య తెలివితేటలుగా మారిపోయింది. ఈ ధోరణి వల్లే ఇప్పుడు కొందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు' అని అన్నారు. కానీ రానున్న దశాబ్దిలో స్వచ్ఛందంగా పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరీదాబాద్‌లో 68వ బ్యాచ్ ఐఆర్ఎస్, సీ అండ్ ఈసీ అధికారుల శిక్షణ ప్రారంభోత్సవంలో జైట్లీ ప్రసంగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని భావిస్తున్నారు.