బడ్జెట్‌కు ముందు జైట్లీ కీలక సంకేతాలు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
'పోటీతత్వపు వాతావరణంలో తక్కువ పన్నులతో ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరముంది. పోటీతత్వం దేశీయంగా కాకుండా అంతర్జాతీయస్థాయిలో ఉండాలి. ఇది ఎంతో కీలకమైన మార్పు' అని ఆయన పేర్కొన్నారు.
వచ్చే బడ్జెట్‌లో కనీస ఆదాయపన్ను పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తక్కువ పన్నుల గురించి ఆయన మాట్లాడినట్టు భావిస్తున్నారు. జైట్లీ మాట్లాడుతూ 'చట్టబద్ధమైన పన్ను చెల్లించడం పౌరుడి బాధ్యత. పన్ను చెల్లించకపోవడం వల్ల ఎన్నో దుశ్ప్రరిణామాలు ఉంటాయి. పన్ను చెల్లించకపోతే నష్టమేమీ లేదు, అనైతికమేమీ కాదన్న అభిప్రాయం గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో నెలకొని ఉంది. అలా చేయడం వాణిజ్య తెలివితేటలుగా మారిపోయింది. ఈ ధోరణి వల్లే ఇప్పుడు కొందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు' అని అన్నారు. కానీ రానున్న దశాబ్దిలో స్వచ్ఛందంగా పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరీదాబాద్‌లో 68వ బ్యాచ్ ఐఆర్ఎస్, సీ అండ్ ఈసీ అధికారుల శిక్షణ ప్రారంభోత్సవంలో జైట్లీ ప్రసంగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని భావిస్తున్నారు.