సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్‌డీఏ కూటమి అధికారం చేపట్టనుందంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలు భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పడితే ఆర్థికమంత్రిగా ఎవరు ఉంటారు? అనారోగ్య సమస్యలతో ఇటీవల ఇబ్బందులు పాలైన ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన పదవిని నిలబెట్టుకుంటారా? ఈ ప్రశ్నలు ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మోదీ కాబినెట్‌లో కీలకమైన నాయకుడు, న్యాయవాది, ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీకే మళ్లీ ఆర్థికమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం వుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా, అనుకోని పరిస్థితుల్లో రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ (54)కు ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలిచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని అంచనా.
ప్రధానమంత్రి కార్యాలయం ద్వారానే కీలక నిర్ణయాలుంటాయి గనుక, ఆర్థికమంత్రి ఎవరనే పట్టింపు పెద్దగా ఉండదని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నావిస్ అభిప్రాయపడ్డారు. ఎన్‌డీఏ లేదా ఎన్‌డీయేతర ప్రభుత్వమా అనేదే స్టాక్‌మార్కెట్లకు కీలకమన్నారు.
మరోవైపు ఆర్థికమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టినా..కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో తక్కువ చమురు ధరలు పెరగడంతో, 2018 చివరి నాటికి వృద్ధిరేటు 6.6 శాతానికి పడిపోయింది. ఇంకా గ్రామీణ వినియోగ డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా 2019 లోక్‌సభ ఎన్నికలు ఏడుదశల్లో పూర్తి చేసుకుంది. ఈ నెల 23, గురువారం వెలువడనున్న ఈ ఫలితాలపై స్వర‍్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment