Budget 2017
-
జైట్లీ బడ్జెట్ జువెలరీ ఇండస్ట్రీకి నచ్చలేదా?
ముంబై : బడ్జెట్లో అన్ని రంగాలను అంతో ఇంతో పట్టించుకుంటూ వచ్చిన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జువెలరీని పూర్తిగా విస్మరించారు. కనీసం వారి డిమాండ్లు పట్టించుపోగా, ఆభరణ వర్తకులకు మరింత దెబ్బకొట్టేలా నగదు లావాదేవీలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జెమ్స్, జువెలరీ ఇండస్ట్రి పెదవి విరుస్తోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని అధిక స్థాయిలో ఉన్న 10 శాతం నుంచి తగ్గించాలని ఎన్నో రోజులుగా ఇండస్ట్రి అడుగుతున్న ప్రతిపాదనను జైట్లీ కనీసం పట్టించుకోనే లేదు. మరోవైపు రూ.3,00,000 మించి నగదు లావాదేవీలను అనుమతించబోమని అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయం గ్రామీణ ఆభరణ వ్యాపారాలకు మరింత దెబ్బకొడుతుందని వర్తకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముందు వరకు నగదు లావాదేవీలపై ఎలాంటి నిబంధనలు లేవు. కానీ రూ.5,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగితే మూలం వద్ద పన్ను వసూళ్లు పేరుమీద 1 శాతం చార్జీని వసూలు చేసేవారు. కానీ ప్రస్తుత బడ్జెట్ లో రూ.3,00,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలను అనుమతించబోమనే జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని జువెలరీ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడనుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్) సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు చెక్‌ల సౌకర్యం, డిజిటల్ కంప్లైంట్ లేవని పేర్కొంటున్నారు. ఆభరణాల విక్రయాలకు గ్రామీణ ప్రాంత విక్రయాలే మంచి లాభాలను చేకూరుస్తున్నాయన్నారు. -
ఐటీ రిటర్న్స్ లేటు చేశారో ఇక అంతే!
న్యూఢిల్లీ : నిర్దేశించిన గడువు లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్స్) దాఖలు చేయకుండా జాప్యం చేశారో ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234ఎఫ్ కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. రెండు స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదేరోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల చార్జీలను కట్టాల్సి ఉంటుంది. మరేదైనా సందర్భాల్లో అయితే రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల దాటని వారికి కేవలం 1000 రూపాయలే జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఈ మెమోరాండం పేర్కొంది. -
తెలుగు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన బడ్జెట్
-
ఐటీ మినహాయింపు 5 లక్షలు చేయాలి
రూ.2.50 లక్షలకు సెక్షన్ 80సీ మినహాయింపు పెంచాలి డెలాయిట్ బడ్జెట్ ముందస్తు సర్వేలో అభిప్రాయాలు న్యూఢిల్లీ: రానున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ఆ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆదాయపన్ను మినహాయింపును ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలంటూ ట్యాక్స్ సలహా సేవల సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో బలమైన అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే, సెక్షన్ 80సీ కింద ప్రస్తుతమున్న రూ.1.50 లక్షల అదనపు మినహాయింపును సైతం రూ.2.50 లక్షలకు పెంచాలని కూడా సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... అందరిదీ ఒకటే మాట... ఆదాయపన్ను మినహాయింపును గణనీయంగా పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ కోరగా... 58 శాతం మంది అయితే పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం ఇలా చేయడం వల్ల వినియోగదారుల చేతుల్లో మరింత నగదు ఉంచినట్టు అవుతుంది. దీంతో డిమాండ్ ఊపందుకుంటుంది. శ్లాబ్ రేటును మార్చడం వల్ల పొదుపును ప్రోత్సహించినట్టు అవుతుంది. ఫలితంగా వ్యవస్థలో పెట్టుబడులు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది’’ అని డెలాయిట్ నివేదిక పేర్కొంది. రూ.2.50 లక్షలు చేయాలి... సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం వివిధ రకాల సాధనాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు ఇస్తున్న పన్ను మినహాయింపును రూ.2.50 లక్షలు చేయాలని సర్వేలో 71 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ‘‘ఆదాయ స్థాయిలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత పరిమితి సహేతుకంగా లేదు. దీన్ని పెంచడం వల్ల గృహస్థుల పొదుపు... బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లుతుంది. దీంతో మౌలిక రంగంపై మరింత పెద్ద మొత్తంలో వ్యయానికి ఊతమిచ్చినట్టు అవుతుంది’’ అని సర్వే నివేదిక వెల్లడించింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను 18%కి తగ్గించాలి:సీఐఐ కార్పొరేట్ పన్నును బడ్జెట్లో 18 శాతానికి తగ్గించాలని సీఐఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు వినతిపత్రాన్ని అందించింది. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి ఇచ్చిన సూచనల్లో కార్పొరేట్ పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని, అన్ని సర్‌చార్జీలు, సెస్ కూడా కలిపి ఈ మేరకే ఉండాలని సీఐఐ సూచించింది. అదే సమయంలో పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకాలను తొలగించాలని కోరినట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. -
బడ్జెట్‌కు ముందు జైట్లీ కీలక సంకేతాలు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 'పోటీతత్వపు వాతావరణంలో తక్కువ పన్నులతో ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరముంది. పోటీతత్వం దేశీయంగా కాకుండా అంతర్జాతీయస్థాయిలో ఉండాలి. ఇది ఎంతో కీలకమైన మార్పు' అని ఆయన పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో కనీస ఆదాయపన్ను పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తక్కువ పన్నుల గురించి ఆయన మాట్లాడినట్టు భావిస్తున్నారు. జైట్లీ మాట్లాడుతూ 'చట్టబద్ధమైన పన్ను చెల్లించడం పౌరుడి బాధ్యత. పన్ను చెల్లించకపోవడం వల్ల ఎన్నో దుశ్ప్రరిణామాలు ఉంటాయి. పన్ను చెల్లించకపోతే నష్టమేమీ లేదు, అనైతికమేమీ కాదన్న అభిప్రాయం గత ఏడు దశాబ్దాలుగా భారత్‌లో నెలకొని ఉంది. అలా చేయడం వాణిజ్య తెలివితేటలుగా మారిపోయింది. ఈ ధోరణి వల్లే ఇప్పుడు కొందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు' అని అన్నారు. కానీ రానున్న దశాబ్దిలో స్వచ్ఛందంగా పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరీదాబాద్‌లో 68వ బ్యాచ్ ఐఆర్ఎస్, సీ అండ్ ఈసీ అధికారుల శిక్షణ ప్రారంభోత్సవంలో జైట్లీ ప్రసంగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని భావిస్తున్నారు.