ఐటీ రిటర్న్స్ లేటు చేశారో ఇక అంతే!
ఐటీ రిటర్న్స్ లేటు చేశారో ఇక అంతే!
Published Thu, Feb 2 2017 9:37 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
న్యూఢిల్లీ : నిర్దేశించిన గడువు లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్స్) దాఖలు చేయకుండా జాప్యం చేశారో ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్స్ రిటర్న్స్ను ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు. కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234ఎఫ్ కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి గడువు లోపు రిటర్న్స్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్సియల్ బిల్లు 2017 మెమోరాండంలో పేర్కొన్నారు.
రెండు స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదేరోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల చార్జీలను కట్టాల్సి ఉంటుంది. మరేదైనా సందర్భాల్లో అయితే రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మెమోరాండంలో పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల దాటని వారికి కేవలం 1000 రూపాయలే జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఈ మెమోరాండం పేర్కొంది.
Advertisement
Advertisement