సాక్షి,హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అసెస్సీకి ఐదు రకాల ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని ఈ కింద పేర్కొన్న శీర్షికల కింద విభజించారు.
⇒ జీతాలు
⇒ ఇంటిపై అద్దె
⇒ వృత్తిపై, వ్యాపారంపై లాభాలు
⇒ మూలధన ఆస్తులపై లాభాలు
⇒ ఇతర ఆదాయాలు
ఏ వ్యక్తికైనా వచ్చే ఆదాయాన్ని పైవిధంగా వర్గీకరించి, పన్ను భారాన్ని లెక్కిస్తారు. పై జాబితాలో మొదటి నాలుగింటి విషయంలో నిర్దిష్టంగా, స్పష్టంగా చట్టం అన్ని అంశాలూ చెప్పింది. మనం గతంలో ఎన్నోసార్లు వాటిని ప్రస్తావిస్తూ వచ్చాం ఇక ఆఖరుదీ అయిదో అంశం ప్రత్యేకత ఏమిటంటే.. ఏదేని ఆదాయం, మొదటి నాలుగింటిలోనూ ఇమడ్చలేకపోతే/వర్గీకరించకపోతే/ విభజించలేక పోతే.. అటువంటి ఆదాయాన్ని ‘‘ఇతర ఆదాయం’’ కింద పరిగణిస్తారు.
ఒక వ్యక్తి ఆదాయం.. జీతం కాదు, ఇంటి మీద అద్దె కాదు, వృత్తి .. వ్యాపారం వల్ల వచ్చిన లాభం కాదు, మూలధన లాభాలు కాదు .. ఇక మిగిలింది .. చివరిది ఇతర ఆదాయం. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ శీర్షిక కింద పన్ను వేస్తారు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అన్న సామెతలాగా ఎలాంటి మొహమాటం లేకుండా పట్టుకుంటారు. మీరు దొరక్క తప్పదు. పన్ను చెల్లించక తప్పదు. ఇది కాకుండా చట్టప్రకారం ఈ కింద పేర్కొన్న వాటిని ‘‘ఇతర ఆదాయం’’గా పరిగణిస్తారు.
⇒ భూమిపై అద్దె
⇒ సబ్-లెట్టింగ్‌పై ఆదాయం
⇒ బ్యాంకు డిపాజిట్లు (ఫిక్సిడ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ)
⇒ డైరెక్టర్లకు వచ్చే సిట్టింగ్ ఫీజు
⇒ విదేశీ గడ్డ నుండి వచ్చే వ్యవసాయంపై ఆదాయం
⇒ డైరెక్టరుగా సంపాదించే గ్యారంటీ కమీషన్
⇒ పరీక్షల నిర్వహణకు వచ్చే ఆదాయం, వేల్యుయేషన్ ఫీజు, ఇన్విజిలేషన్ ఫీజు
⇒ ఫ్యామిలీ పెన్షన్ (ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్ మీద .. జీతంలాగానే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది. 1/3వ వంతు లేదా రూ. 15,000. ఈ రెండింటిలో తక్కువ మినహాయింపు ఇస్తారు)
⇒ పార్లమెంటు, శాసన సభ సభ్యుల జీతాలు
⇒ బుక్స్ రాసినందుకు వచ్చే రాయల్టీలు
⇒ వారసులకొచ్చే రాయల్టీలు (బుక్స్‌పై)
⇒ హోటల్స్‌లో సర్వర్స్‌కి వచ్చే టిప్స్, డ్రైవర్లకు వచ్చే టిప్స్
⇒ క్యాజువల్ ఆదాయం
⇒ యాన్యుటీలు
⇒ మధ్యవర్తిత్వం చేసినందుకు వచ్చే కమీషన్
⇒ అండర్‌రైటింగ్ కమీషన్
⇒ బహిర్గతం చేయలేని సోర్స్ నుండి ఆదాయం
⇒ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయం
⇒ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇతరుల ఆదాయం, కొన్ని ఖర్చులు, లెక్క చెప్పని నగదు, లెక్క చెప్పని ఇన్వెస్ట్‌మెంట్ .. మొదలైన వాటి విలువ.
ఈ జాబితా ఇక్కడితో పూర్తవలేదు. ఇవి అంతంకాదు ఆరంభం లాగా కేవలం మచ్చుతునకలే. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment