Sources of income
-
ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా కొత్త ఏడాది.. కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్‌లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్‌పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు. -
ప్రజలపై భారం మోపం
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్ 2024–25 ప్రతిపాదనల రూపకల్పనలో భాగంగా గురువారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోకలిసి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత జౌళి, ఉద్యాన వన, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార /ప్రజాసంబంధాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, వాటితో వచ్చే ఆదాయా న్ని ప్రజలకు పంచడానికి కృషి చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, గడువు ముగిసిన భూముల లీజుపై దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ భూములపై నివేదిక ఇవ్వాలి.. గత ప్రభుత్వం ధరణిలో ‘కాస్తు’ కాలమ్ తొలగించడంతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, మాన్యం, ఎండోమెంట్, కొన్ని పట్టా భూములను పార్ట్–బీలో పెట్టి రైతుల హక్కులను కాలరాసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేసేవారని, 2014 తర్వాత ఈ విధానానికి స్వస్తి పలకడంతో రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ధరణితో ప్రభుత్వ భూములు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, వాటిని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. 2014 వరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు, గత ప్రభుత్వం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూములను ఏ అవసరాల కోసం వాడారు.. వెనక్కి తీసుకున్న భూముల్లో మిగిలి ఉన్న భూమి ఎంత? వంటి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆపద్బంధు, పిడుగుపాటు మృతులకు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలను గత ప్రభుత్వం అమలు చేయలేదని అధికారులు వివరించారు. కేంద్రం ఈ పదేళ్లలో రాష్ట్రంలో 1.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి మాత్రమే నిధులిచ్చిందని, 2023–24లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిందని మంత్రులకు తెలిపారు. 2024–25లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2లక్షల గాను 67 వేల ఇళ్లు పూర్తి చేశామని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అరికట్టాలని, నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని మంత్రులు ఆదేశించారు. బతుకమ్మ చీరలు, విద్యా ర్థుల యూనిఫామ్‌ల తయారీపై ఆరా తీశారు. ఈ సమీక్షలో ఆర్థిక, రెవెన్యూ(విపత్తు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అర్వింద్ కుమా ర్, నవీన్‌మిత్తల్ పాల్గొన్నారు. -
పటిష్ట ఆర్థిక వనరులపై దృష్టి
ముంబై: మునిసిపల్ కార్పొరేషన్లు (ఎంసీ) తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి వినూత్న రీతిలో వివిధ బాండ్, ల్యాండ్ ఆధారిత ఫైనాన్సింగ్ యంత్రాంగాలను అన్వేషించాల్సిన అవసరం ఉంద ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. ఆస్తిపన్ను వసూళ్లు, ప్రభుత్వ ఉన్నత శ్రేణుల నుండి పన్నులు, గ్రాంట్ల పంపిణీ మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయాలకు ప్రస్తుతం ప్రధా న వనరులు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ అంశాల కు సంబంధించి ఎంసీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడిందని ఈ అంశంపై విడుదల చేసిన నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మునిసిపల్ బడ్జెట్ల పరిమాణం ఇతర దేశాల్లోని కార్పొరేషన్లతో పోల్చి తే చాలా తక్కువగా ఉందని కూడా సూచించింది. అన్ని రాష్ట్రాల్లోని 201 ఎంసీల బడ్జెట్ డేటా సంకలనం, విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ‘మునిసిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యామ్నాయ వనరుల’ థీమ్‌గా ఈ నివేదిక రూపొందింది. నివేదికలో మరికొన్ని అంశాలు పరిశీలిస్తే.. ► వివిధ ఆదాయాలు, వ్యయ అంశాలపై ఎంసీలు సరైన పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్‌తో మంచి, పారదర్శకమైన అకౌంటింగ్ పద్ధతులను అవలంబించాలి. తమ వనరులను పెంచుకోవడానికి విభిన్న వినూత్న బాండ్, భూమి ఆధారిత ఫైనాన్సింగ్ విధానాలను అన్వేషించాలి. ► తమ వనరుల లోటును పూడ్చుకోడానికి పలు ఎంసీలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలపై ఆధారపడుతున్నాయి. మునిసిపల్ బాండ్ల వంటి పటిష్ట మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పరిస్థితులు లేని లోటు ఇక్కడ కనిపిస్తోంది. ► వ్యవస్థీకృత, పాలనా వ్యయాలు, వడ్డీ, ఫైనాన్స్ చార్టీల రూపంలో వ్యయాలు పెరుగుతున్నాయి. మూలధన వ్యయం తక్కువగా ఉంటోంది. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎంసీల రెవెన్యూ వ్యయాలు–మూలధన వ్యయాల నిష్పత్తి 2.4 శాతం. కేంద్రం విషయంలో 7.1 శాతం, రాష్ట్రాల విషయంలో 5.9 శాతంగా ఈ నిష్పత్తులు ఉన్నాయి. ► మునిసిపల్ కార్పొరేషన్ల పరిమాణం, జనాభా సాంద్రత, సొంత రాష్ట్ర ప్రభుత్వ వ్యయ స్వభావం వంటి వివిధ అంశాలు దేశంలోని మునిసిపల్ కార్పొరేషన్ల వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయి. ► 2017–18లో ఎంసీల రాబడి (స్వంత పన్ను రాబడి, స్వంత పన్నుయేతర ఆదాయం, ప్రభుత్వాల నుంచి బదిలీ అయిన మొత్తం) జీడీపీలో 0.61 శాతంగా అంచనా. అయితే ఇది 2019–20లో కేవలం 0.72 శాతానికి ఎగసింది. ► అధ్యయన కాలంలో ఎంసీల మొత్తం ఆదాయంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, టోల్ పన్ను, ఇతర స్థానిక పన్నులు 31–34% శ్రేణిలో ఉన్నాయి. ► ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎంసీలు దేశంలోని ఇతర ఎంసీలతో పోలిస్తే అధిక పన్నులను వసూళ్లు జరుపుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. -
ఆదాయ పన్ను: ఇతర ఆదాయం ఉంటే
సాక్షి,హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అసెస్సీకి ఐదు రకాల ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని ఈ కింద పేర్కొన్న శీర్షికల కింద విభజించారు. ⇒ జీతాలు ⇒ ఇంటిపై అద్దె ⇒ వృత్తిపై, వ్యాపారంపై లాభాలు ⇒ మూలధన ఆస్తులపై లాభాలు ⇒ ఇతర ఆదాయాలు ఏ వ్యక్తికైనా వచ్చే ఆదాయాన్ని పైవిధంగా వర్గీకరించి, పన్ను భారాన్ని లెక్కిస్తారు. పై జాబితాలో మొదటి నాలుగింటి విషయంలో నిర్దిష్టంగా, స్పష్టంగా చట్టం అన్ని అంశాలూ చెప్పింది. మనం గతంలో ఎన్నోసార్లు వాటిని ప్రస్తావిస్తూ వచ్చాం ఇక ఆఖరుదీ అయిదో అంశం ప్రత్యేకత ఏమిటంటే.. ఏదేని ఆదాయం, మొదటి నాలుగింటిలోనూ ఇమడ్చలేకపోతే/వర్గీకరించకపోతే/ విభజించలేక పోతే.. అటువంటి ఆదాయాన్ని ‘‘ఇతర ఆదాయం’’ కింద పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఆదాయం.. జీతం కాదు, ఇంటి మీద అద్దె కాదు, వృత్తి .. వ్యాపారం వల్ల వచ్చిన లాభం కాదు, మూలధన లాభాలు కాదు .. ఇక మిగిలింది .. చివరిది ఇతర ఆదాయం. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ శీర్షిక కింద పన్ను వేస్తారు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అన్న సామెతలాగా ఎలాంటి మొహమాటం లేకుండా పట్టుకుంటారు. మీరు దొరక్క తప్పదు. పన్ను చెల్లించక తప్పదు. ఇది కాకుండా చట్టప్రకారం ఈ కింద పేర్కొన్న వాటిని ‘‘ఇతర ఆదాయం’’గా పరిగణిస్తారు. ⇒ భూమిపై అద్దె ⇒ సబ్-లెట్టింగ్పై ఆదాయం ⇒ బ్యాంకు డిపాజిట్లు (ఫిక్సిడ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ) ⇒ డైరెక్టర్లకు వచ్చే సిట్టింగ్ ఫీజు ⇒ విదేశీ గడ్డ నుండి వచ్చే వ్యవసాయంపై ఆదాయం ⇒ డైరెక్టరుగా సంపాదించే గ్యారంటీ కమీషన్ ⇒ పరీక్షల నిర్వహణకు వచ్చే ఆదాయం, వేల్యుయేషన్ ఫీజు, ఇన్విజిలేషన్ ఫీజు ⇒ ఫ్యామిలీ పెన్షన్ (ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్ మీద .. జీతంలాగానే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది. 1/3వ వంతు లేదా రూ. 15,000. ఈ రెండింటిలో తక్కువ మినహాయింపు ఇస్తారు) ⇒ పార్లమెంటు, శాసన సభ సభ్యుల జీతాలు ⇒ బుక్స్ రాసినందుకు వచ్చే రాయల్టీలు ⇒ వారసులకొచ్చే రాయల్టీలు (బుక్స్‌పై) ⇒ హోటల్స్‌లో సర్వర్స్కి వచ్చే టిప్స్, డ్రైవర్లకు వచ్చే టిప్స్ ⇒ క్యాజువల్ ఆదాయం ⇒ యాన్యుటీలు ⇒ మధ్యవర్తిత్వం చేసినందుకు వచ్చే కమీషన్ ⇒ అండర్‌రైటింగ్ కమీషన్ ⇒ బహిర్గతం చేయలేని సోర్స్ నుండి ఆదాయం ⇒ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయం ⇒ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇతరుల ఆదాయం, కొన్ని ఖర్చులు, లెక్క చెప్పని నగదు, లెక్క చెప్పని ఇన్వెస్ట్మెంట్ .. మొదలైన వాటి విలువ. ఈ జాబితా ఇక్కడితో పూర్తవలేదు. ఇవి అంతంకాదు ఆరంభం లాగా కేవలం మచ్చుతునకలే. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
అజ్ఞాత విరాళాలతో రూ. 3,370 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్నౌన్ సోర్సెస్) నుంచి సమీకరించాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫా మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం 70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్(రూ.526కోట్లు), ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్పీ ఉన్నాయని తెలిపింది. మొత్తం సొమ్ములో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా రూ. 2,993.82 కోట్లు లభించాయని ఏడీఆర్ వెల్లడించింది. 2004–05 నుంచి 2019–20 మధ్య కాలంలో ఈ అంతుచిక్కని మార్గాల్లో పార్టీలు సమీకరించిన మొత్తం రూ. 14,651. 53కోట్లని వివరించింది. 2019–20 కాలంలో పార్టీలు సేకరించిన నగదు రూపంలో సేకరించిన మొత్తం రూ.3.18లక్షలు మాత్రమే కావడం గమనార్హం. రూ.20వేలకు పైబడిన విరాళాలకు పార్టీలు రసీదులు జారీ చేయాల్సిఉంటుంది. అయితే రూ.20వేల లోపు ఇచ్చే విరాళాల దాతల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా రూ. 20వేల లోపు విరాళాన్ని ఇచ్చే వర్గాలను అజ్ఞాత వర్గాలంటారు. వీటిని ఐటీ పత్రాల్లో అన్నౌన్ సోర్సుగా పేర్కొంటారు. ఈ నిధులు ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల వివరాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల విక్రయాలు, రిలీఫ్ పండ్ లాంటివన్నీ ఈ అజ్ఞాత మార్గాల కిందకు వస్తాయి. -
ఆదాయ వనరులపై మంత్రుల సమీక్ష
ఏలూరు టౌన్: పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖమంత్రి కె.నారాయణస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మంత్రి నారాయణస్వామి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని సంబంధిత శాఖ అధికారులతో ఏలూరు డివిజన్ ఆదాయ వనరులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల చెల్లింపులో జాప్యం వహిస్తున్న వారిని గుర్తించి రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. పాత బకాయిలు రాబట్టేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఏలూరు డివిజన్ పరిధిలోని 9 సర్కిల్ కార్యాలయాలలో ఆకివీడు, భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు–1, తణుకు–2లలో భీమవరం సర్కిల్లో పన్నుల వసూళ్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. మిగతా సర్కిల్స్‌లో సిబ్బంది కూడా పోటీతత్వంతో పనిచేసి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణం, కేబుల్ నెట్వర్క్, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఎరువులు, పురుగుమందులు, సిరామిక్, టైల్స్‌తో పాటు ఇతర ఆదాయ రంగాల నుంచి వసూలు అయిన మొత్తం ఎంత, ఇంకా ఎంతవసూలు కావాలి, గత మూడు నెలల రాబడి ఎంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ డి.శ్రీలక్ష్మి జిల్లాలో ఆదాయ వనరులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమీక్షలో డిప్యూటీ కమిషనర్స్ హర్షవర్ధన్, స్వప్నదేవి, చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఖైదీలతో మసాజ్ సెంటర్లు
రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న ఆలోచన ఆదాయ మార్గాలపై దృష్టి హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే పెట్రోల్‌బంకులు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న జైళ్ల శాఖ తాజాగా నేచర్‌క్యూర్ హాస్పిటల్ (ప్రకృతి చికిత్సాలయం) మాదిరిగా మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం జైళ్లలో ఎంపిక చేసిన ఖైదీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కొన్ని హెర్బల్ కంపెనీల సహకారంతో బయట లభించే ధరల కంటే సగం రేటుకే చికిత్సలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రయోగాన్ని మొదట చంచల్‌గూడ జైల్లో ప్రారంభించి ఇక్కడ విజయవంతమైతే మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 14న చంచల్‌గూడలో తొలి మసాజ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్కరణల బాటలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఖైదీల చేత పనులు చేయిస్తూ వారు ఆదాయం పొందడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోలు బంక్‌లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌లో పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఏటా రూ.200 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. భారీ లాభాలు వస్తుండటంతో మిగతా చోట్ల కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.