అన్నదొకటి... అయ్యిందొకటి! | Many small businesses closed after being brought under GST | Sakshi
Sakshi News home page

అన్నదొకటి... అయ్యిందొకటి!

Published Sat, Feb 15 2025 4:06 AM | Last Updated on Sat, Feb 15 2025 4:06 AM

Many small businesses closed after being brought under GST

కాలక్రమంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలు అర్థం కోల్పోతాయని, పైగా వాటికి పూర్తి విరుద్ధమైన అర్థాలు పుట్టుకొస్తాయని ప్రముఖ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ అంటారు. 8 ఏళ్ల క్రితం ‘ఒకే దేశం ఒకే పన్ను’ అన్నది లక్ష్యంగా, చక్కని సరళతరమైన పన్ను (గుడ్‌ అండ్‌ సింపుల్‌ టాక్స్‌– జీఎస్‌టీ)గా చెప్ప బడిన ‘జీఎస్‌టీ’ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) క్రమంగా తన అర్థాన్ని మార్చుకొంది. 2017 జూలై 1న ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీఎస్‌టీ చిన్న, సన్నకారు వ్యాపారుల సమస్యలను తీర్చకపోగా వారికి అనేక చిక్కుముళ్లను తెచ్చి పెడుతోంది.

జీఎస్‌టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణ నీయంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్‌టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. 

దాంతో సహజంగానే పన్ను వసూళ్ల మొత్తం పెరుగుతుంది. ఇపుడు జరుగుతున్నది అదే! ఒక దశాబ్ద కాలంలో దేశస్థూల ఉత్పత్తి గణనీ యంగా పెరిగింది. ప్రజల తలసరి ఆదాయమూ హెచ్చింది. కనుక కేవలం జీఎస్‌టీ అమలు కారణంగానే పన్ను ఎగవేతలు తగ్గాయని, కేంద్రం చెబుతున్నట్లు జీఎస్‌టీ వల్ల దేశంలో ‘పన్ను ఉగ్రవాదం’ సమసిపోయిందని చెప్పడం అర్ధసత్యమే. 

దేశంలో 8 ఏళ్ళుగా అమలవుతున్న జీఎస్‌టీ వల్ల అనేక సమ స్యలు వస్తున్నాయని పలు వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ, వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. సరళతరమైన పన్నుగా జీఎస్‌టీని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆ పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో కేంద్రం, రాష్ట్రాల నడుమ ఇంకా ఏకాభిప్రాయం కుద రకపోవడం గమనార్హం. 

ముఖ్యంగా, రాష్ట్రాలకు అతి పెద్ద ఆదాయ వనరులుగా ఉన్న పెట్రోల్, డీజిల్, మద్యం వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి చేర్చడానికి మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికి 50కి పైగా సమావేశాలు జరిపినప్పటికీ పలు అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. 

చిక్కుముళ్లు
జీఎస్టీ అమలులో అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఇందులో పన్ను రేట్ల హేతుబద్ధీకరణ ప్రధానమైనది. జీఎస్‌టీలో 5, 12, 18, 28 శాతాలుగా పన్ను రేట్లు ఉన్నాయి. 1400 పైబడిన వస్తువులు; 500 రకాల సేవలను ఈ 4 శ్లాబులలో సర్దుబాటు చేశారు. భారీ కసరత్తు అనంతరం రేట్లను ఖరారు చేశామని చెప్పారుగానీ అందులో హేతు బద్ధత, మానవత్వం కనుమరుగయ్యాయన్న విమర్శల్ని సాక్షాత్తూ బీజేపీ నేతలే చేస్తున్నారు. 

ఉదాహరణకు జీవిత బీమా (లైఫ్‌ ఇన్సూ రెన్స్‌), ఆరోగ్య బీమా (హెల్త్‌ ఇన్సూరెన్స్‌) ప్రీమియంలపై 18% జీఎస్‌టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తన సహచర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ సంధించడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై 18% జీఎస్‌టీ వేయడం వల్ల... వారందరూ జీవితం, ఆరోగ్య రక్షణకు దూరం అవుతారని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. 

ఇక, శ్లాబుల విషయంలో స్పష్టత లోపించడం వల్ల చెల్లింపుదారులకు, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య వివాదాలు తలెత్తి చివరకు అవి న్యాయస్థానాలకు చేరుతున్నాయి. అలాగే, కోవిడ్‌ ప్రబలిన 2020, 2021 సంవత్సరాలలో రాష్ట్రాలకు  కేంద్రం అందించిన ఆర్థిక సహకారాన్ని తిరిగి రాబట్టుకొనేందుకు ‘సెస్సు’ విధించి ప్రజలపై అదనపు భారాన్ని మోపింది. ఈ సెస్సును ఉపసంహరించు కోవాలన్న అభ్యర్థనను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది.

జీఎస్‌టీ పరిధిని క్రమంగా విస్తరిస్తూ పోతున్నారు. శ్లాబ్‌లను మారుస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులపైన, ప్రాణాలు నిలబెట్టే ఔషధాలపైన కనిష్ఠంగా 5% జీఎస్‌టీని మాత్రమే వేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తు న్నారు. వెన్న, నెయ్యి, పాలు వంటి పాల ఉత్పత్తుల పైన, ప్యాకింగ్‌ చేసిన కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల పైన 18% జీఎస్‌టీ విధించడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. చివరకు పెన్నులపైన కూడా జీఎస్‌టీ విధిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్‌టీ మండలి సమావేశంలో... పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పాప్‌ కార్న్‌పై 3 రకాల జీఎస్‌టీని విధించడాన్ని ప్రజలు తప్పుబట్టారు.  
ఎంఎస్‌ఎంఈలకు శరాఘాతం
జీఎస్‌టీ అమలులో స్పష్టత, హేతుబద్ధత లోపించడం వల్ల దెబ్బ తిన్న ప్రధాన రంగాలలో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగం ఒకటి. దేశీయ తయారీరంగంలో దాదాపు 70% మేర ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగం జీఎస్‌టీ కారణంగా కుదేలైందన్నది ఓ చేదు వాస్తవం. చిన్న చిన్న వ్యాపారాలను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చాక... అవి చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్ను వేయడం వల్ల... దేశంలో దాదాపు 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది. 

వాటి సప్లయ్‌ చెయిన్‌ తెగిపోయిందని ఆ రంగంపై అనేక ఏళ్లుగా జీవనం సాగిస్తున్నవారు మొత్తుకొంటున్నారు. ఒకవైపు వస్తుసేవలను అంతి మంగా వినియోగించుకొనే వారే పన్ను చెల్లించాలని చెబుతూ... మరో వైపు బహుళ పన్నులు వేస్తున్న పరిస్థితి కొన్ని రంగాల్లో ఉంది. వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకోవడానికి జీఎస్‌టీ అప్పీ లేట్‌ ట్రిబ్యునల్‌ను అందుబాటులోకి తెచ్చిన మాట నిజమే గానీ... చిన్న వ్యాపారులు ఎంతమంది దానిని ఆశ్రయించగలరు? ఇక, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆ యా ఉత్ప త్తులపై పన్నులు విధించే హక్కు గతంలో రాష్ట్రాలకు ఉండేది.

ప్రజలకు జవాబుదారీతనం ఎక్కువగా వహించేది రాష్ట్రాలే. కానీ, రాష్ట్రాలకు తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే అవ కాశం జీఎస్‌టీ వచ్చాక తగ్గిపోయింది. రాష్ట్రాల వినతులకు జీఎస్‌టీ కౌన్సిల్‌లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదన్న వాదన ఉంది. జీఎస్‌టీకి  సంబంధించి ఏ యే రాష్ట్రాలు ఎన్నెన్ని అభ్యర్థనలు అంది స్తోంది? అందులో వేటికి ఆమోదం తెలుపుతున్నారు? ఎన్నింటిని బుట్టదాఖలా చేస్తున్నారన్న సమాచారాన్ని వెల్లడించడం లేదు.  
 
నిజానికి, తగిన సన్నద్ధత లేకుండా జీఎస్‌టీని అమలులోకి తేవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. జీఎస్‌టీ అమలు లోకి వచ్చి 8 ఏళ్లు గడిచాయి. జీఎస్‌టీ మండలి 55 పర్యాయాలు సమావేశమైంది. అయినా అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. జీఎస్‌టీ వసూళ్లల్లో కనబడుతున్న వృద్ధిని చూసి మురిసి పోవడమే తప్ప... ఎదురవుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తొంద రగా పరిష్కరించలేకపోవడం వైఫల్యంగానే పరిగణించాలి. పుట్టుక తోనే లోపాలు ఉన్న బిడ్డగా జీఎస్‌టీని కొందరు అభివర్ణించారు. 

మరి కొందరు జీఎస్‌టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. ఈ రెండూ నిజమే కావొచ్చు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం. రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ చెప్పినట్లు కొన్ని పదాలు అర్థం కోల్పోవడమే కాక వాటికి పూర్తి భిన్నమైన అర్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ‘సంస్కరణ’ అనే పదం. 

ప్రపంచీకరణ తర్వాత ఈ పదా నికి అర్థం మారిపోయింది. సంస్కరణ అంటే ఆర్థిక భారంగా ప్రజలు భావిస్తు న్నారు. జీఎస్‌టీ అంశంలో కూడా సరళతరమైన పన్ను అనే భావన పోయి జీఎస్‌టీ అంటేనే మోయలేని భారం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

» జీఎస్‌టీ అమలులోకి వచ్చాక దేశంలో పన్ను వసూళ్లు గణనీ యంగా పెరిగిన మాట వాస్తవం. ఏటా దాదాపు 8 నుంచి 11 శాతం పైబడి జీఎస్‌టీ వసూళ్లలో వృద్ధిరేటు కనబడుతోంది.

» పుట్టుకతోనే లోపాలున్న బిడ్డగా జీఎస్‌టీని కొందరు అభివ ర్ణించారు. మరికొందరు జీఎస్‌టీ వల్ల దేశానికి అసలైన ఆర్థిక స్వాతంత్య్రం లభించిందంటున్నారు. కానీ, అంతిమంగా ప్రజ లకు మేలు జరుగుతున్నదా లేదా అన్నదే కొలమానం.

» చిన్న వ్యాపారాలను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చాక... చాలా వరకు మూతపడ్డాయి. ముడి సరుకులపై పన్ను విధించడం, మళ్లీ అంతిమ ఉత్పత్తులపై పన్నువల్ల... దాదాపు 20 కోట్ల మంది ఆధా రపడ్డ సూక్ష్మ–మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం కలిగింది.

- వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి
- డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement