ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సానుకూలంగా కొత్త ఏడాది..
కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్‌లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్‌నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్‌పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment