రాష్ట్ర జైళ్లశాఖ వినూత్న ఆలోచన ఆదాయ మార్గాలపై దృష్టి
హైదరాబాద్: రాష్ట్ర జైళ్లశాఖ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే పెట్రోల్‌బంకులు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న జైళ్ల శాఖ తాజాగా నేచర్‌క్యూర్ హాస్పిటల్ (ప్రకృతి చికిత్సాలయం) మాదిరిగా మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం జైళ్లలో ఎంపిక చేసిన ఖైదీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. కొన్ని హెర్బల్ కంపెనీల సహకారంతో బయట లభించే ధరల కంటే సగం రేటుకే చికిత్సలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రయోగాన్ని మొదట చంచల్‌గూడ జైల్లో ప్రారంభించి ఇక్కడ విజయవంతమైతే మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ 14న చంచల్‌గూడలో తొలి మసాజ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్కరణల బాటలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఖైదీల చేత పనులు చేయిస్తూ వారు ఆదాయం పొందడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోలు బంక్‌లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. ప్రస్తుతం జైళ్లశాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్‌లో పెట్రోల్ బంకులున్నాయి. వీటిలో ఏటా రూ.200 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. భారీ లాభాలు వస్తుండటంతో మిగతా చోట్ల కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఖైదీలతో మసాజ్ సెంటర్లు
Published Fri, Oct 9 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM
Advertisement