ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి!
ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్‌లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్‌లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్‌లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి.
అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్‌కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్‌ఎస్‌సీలు, ఎఫ్‌డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు.
స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment