Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ.. | Sakshi
Sakshi News home page

Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..

Published Mon, Apr 15 2024 9:22 AM

Who Has To Submit Income Tax Returns In What Form - Sakshi

‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్‌ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్‌ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు.

మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్‌ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్‌ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి.  

  • ఫారం 1 లేదా సహజ్‌ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. 
  • ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. 
  • ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. 
  • నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్‌ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. 
  • ఇక ఐటీఆర్‌ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్‌ లేదా అసోసియేషన్, ఎల్‌ఎల్‌పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. 
  • మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి.  
  • చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్‌ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్‌జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. 

ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి.

వెనకటికి కుప్పుస్వామీ మేడ్‌ ఇట్‌ డిఫికల్ట్‌ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్‌ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్‌ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్‌ చేయండి.

ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా

Advertisement
Advertisement