Taxation experts
-
Business: సారూ.. మీరు.. మీ ఐటీఆరూ..
‘సారూ’ అని మాత్రమే సంబోధిస్తున్నారు.. మా సంగతేమిటి అని ఎదురుప్రశ్న వేయకండి.. మేడమ్‌గారు!! ఇది అందరికీ వర్తించే విషయమే. ఈ రోజు, ఈ కాలమ్‌లో.. ఎవరు ఏ ఫారంలో ఆదాయపు పన్ను రిటర్నులను సబ్మిట్ చేయాలనేది ప్రస్తుతపు ప్రశ్న. అసెస్సీలు వారి వారి ఆదాయాన్ని ఒక నిర్దేశించిన ఫారంలోనే తెలియజేయాలి. ఈ ఫారంలో అన్ని కాలమ్‌లు సంపూర్ణంగా నింపి, రిటర్నుని లేదా ఫారంని ఫైల్ చేయాలి. ఫారం చాలా ముఖ్యమైన డాక్యుమెంటు. మీ ఆదాయాన్ని బట్టి, ఏ ఫారం ఎవరు ఫైల్ చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. మీ క్యాటగిరీని బట్టి.. అంటే స్టేటస్ .. అంటే మీరు వ్యక్తులా, కంపెనీయా, ఉమ్మడి కుటుంబమా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఏడు రకాల ఫారమ్‌లు అమల్లో ఉన్నాయి. ఫారం 1 లేదా సహజ్ని వ్యక్తులు, రెసిడెంట్లు, కేవలం జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం మాత్రమే ఉంటేనే వేయాలి. ఈ రూపంలో వచ్చే ఆదాయం రూ. 50,00,000 దాటని వారు వేయొచ్చు. ఫారం 2 ని వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం కూడా వేయొచ్చు. జీతం, పెన్షన్, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉండి, మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితేనే వెయ్యాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు ఈ ఫారం వేయకూడదు. ఇక ఫారం 3. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబం.. వ్యాపారం, వృత్తి మీద ఆదాయం/లాభం ఉన్న వారు, ఇతరత్రా అన్ని ఆదాయాలతో పాటు ఈ ఫారం వేయొచ్చు. నాలుగో ఫారం తీసుకుంటే.. దీన్నే సుగమ్ అని కూడా అంటారు. వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు, వ్యాపారం.. వృత్తిపరమైన ఆదాయాలు, ఇతరత్రా ఆదాయాలు ఉన్నవారు దీన్ని వేయాలి. లెక్కలతో నిమిత్తం లేకుండా కేవలం టర్నోవరు మీద నిర్దేశించిన శాతం కన్నా ఎక్కువ లాభం చూపించే వారు ఈ ఫారం వేయొచ్చు. ఇక ఐటీఆర్ 5. ఇది వ్యక్తులకు, ఉమ్మడి కుటుంబాలకు వర్తించదు. ట్రస్టులు, వ్యక్తుల కలయిక అంటే గ్రూప్ లేదా అసోసియేషన్, ఎల్ఎల్పీలు, కంపెనీలు మొదలైన వారు వేయొచ్చు. మరొకటి ఫారం 6. కంపెనీలు మొదలైనవి, కంపెనీల చట్ట ప్రకారం నమోదు అయినవి వేయాలి. విదేశీ కంపెనీలు కూడా వేయొచ్చు. కొన్ని సంస్థలను కంపెనీగా పరిగణిస్తారు. అటువంటివి కూడా ఈ ఫారం వేయాలి. చివరగా ఫారం 7. మతపరమైన ధారి్మక సంస్థలు, హాస్పిటల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ సంస్థలు, ఎన్జీవోలు మొదలైన సంస్థలు ఈ ఫారం వేయాలి. ఈ ఫారాల సంగతి ఇది.. స్థూలంగా చెప్పాలంటే వేతన జీవులకు ఫారం 1 లేదా ఫారం రెండు వర్తిస్తుంది. అయితే, వీరికి వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉంటే ఫారం 3 లేదా ఫారం 4 వేయాలి. జీతమే ఉంటే ఫారం 1 లేదా 2, వ్యాపారమే ఉంటే ఫారం 3 లేదా 4 వేయాలి. వెనకటికి కుప్పుస్వామీ మేడ్ ఇట్ డిఫికల్ట్ (kuppuswamy made it difficult) అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే ఉన్నాయి ఈ ఫారాలు కూడా. ఏ కేటగిరిలో ఎవరు వేశారు, ఎంత ఆదాయం డిక్లేర్ చేశారు మొదలైన సమాచారం కోసం వెసులుబాటుగా ఉండాలని ఇన్ని ఫారాలు. ఈ కాలమ్ ద్వారా ప్రతి వారం మీకు మీ సంశయాలు తీరుస్తాం. ఓపిగ్గా వెయిట్ చేయండి. ఇవి చదవండి: మార్చిలో ఎంఎఫ్‌లు డీలా -
పాత పన్ను బకాయిలు రద్దు.. సీతమ్మ పద్దు...
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్‌నే ప్రస్తావిద్దాం. అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం. పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్‌లో కేవలం ఇన్‌కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం. మినహాయింపులు లేవు తగ్గింపులు లేవు తాయిలాలు లేవు బేసిక్ లిమిట్ పెంచలేదు శ్లాబులు, రేట్లు యధాతథం ఒక పక్కన ట్యాక్స్‌పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్‌పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి. వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్‌పేయర్స్‌కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త. ➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు.. ➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు. ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి. రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!
ఇదే ప్రశ్నని పూర్తిగా అడుగుతున్నాం. మీకు రెండు పర్మనెంట్ అకౌంట్ నంబర్లు ఉన్నాయా? అదేనండి.. రెండు పాన్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్ శాశ్వతం. ప్రత్యేకం. మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్మెంట్ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీ కట్టాల్సిందే.. ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. సరెండర్ చేయండి.. మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఎక్కడా ఆ నంబరును ప్రస్తావించకండి. తెలియజేయకండి. డిక్లేర్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదు. అంతటితో ఆగిపోకుండా వెంటనే ఆ నంబరును సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయాలి.. సరెండర్ అంటే కార్డుని ఫిజికల్‌గా డిపార్ట్మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్లైన్లోనూ చేయవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్లోడ్ చేయండి. కొత్త పాన్ కోసం, మార్పుల కోసం దీన్ని వాడవచ్చు. కారణం అడగరు. వివరణ అక్కర్లేదు. విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు. దరఖాస్తు చాలు. వెంటనే సరెండర్ చేయండి. పెనాల్టీ వేసే ముందు.. నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి. ఎగవేతకు ఇదే నాంది కాగలదు. కాబట్టి, అలా చేయకండి. వాడిన సందర్భంలో ఎగవేత లేదని రుజువు చేయలేకపోతే పెనాల్టీ పడుతుంది. బండి అంతదాకా పోనివ్వకండి. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
మగువ.. అరకేజీ బంగారం.. ఓ ఆసక్తికరమైన కేసు
ITAT Specified Gold Jewellery for married women in taxable income: బంగారం ఎంత ఉంటే ఇబ్బంది లేదన్న విషయంలో బంగారం లాంటి రూలింగ్ (తీర్పు) వచ్చింది ఈ మధ్య. ఇది మహిళలకు.. ముఖ్యంగా సంక్రాంతి ముందు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. సాధారణంగా ఆదాయపు పన్ను అసెస్మెంటు పూర్తయిన తర్వాత, ఆ అసెస్మెంట్ ఆర్డర్‌లోని విషయాలతో విభేదిస్తే.. ఒప్పుకోకపోతే లేదా మీకు నష్టం అనిపిస్తే మీరు ఉన్నత అధికారులకు లేదా ట్రిబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అలాంటి ఒక అసెస్సీ తనకు న్యాయం కావాలని ఢిల్లీలో ఉన్న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ అన్ని వివరాలు, కాగితాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకుని, వివాహిత విషయంలో 500 గ్రాముల బంగారం ఉన్నా కూడా ఎటువంటి విధంగానూ దాని విలువను ఆదాయానికి కలపకూడదని తీర్పు ఇచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెడితే .. ఓ ఆదాయపు అధికారి ఒక వివాహిత ఆదాయాన్ని మదింపు చేస్తున్నారు. ఈ సందర్భంగా సెర్చి కేసులో సుమారుగా రూ. 66 లక్షలు విలువ చేసే బంగారం దొరికింది. అందులో రూ. 10,00,000 బంగారానికి సంబంధించి కాగితాలు, బిల్లులు లేవు. ఈ విలువను ఆదాయంగా పరిగణించి ఆ మహిళ ఆదాయానికి కలిపి అసెస్మెంటు పూర్తి చేశారు. ఈ ఆర్డరును విభేదిస్తూ ఆ వివాహిత.. ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నారు. ఆ అప్పీలులో ఆమె 1994 మే 11 నాడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేసిన 1916 నంబరు సూచనను ప్రస్తావించారు. ఈ సూచన కింద నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమిటంటే.. ► వెల్త్ ట్యాక్స్‌లో డిక్లరేషన్ చేసిన బంగారం కంటే ఎక్కువ బంగారం ఉంటే జప్తు చేయవచ్చు. ► వెల్త్ ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ల విషయంలో.. వివాహిత మహిళ అయితే 500 గ్రాముల వరకు, వివాహం కాని మహిళ విషయంలో 250 గ్రాములు, పురుషులకు సంబంధించి 100 గ్రాముల వరకు పసిడి ఉంటే జప్తు చేయకూడదు. ► కుటుంబ స్థాయిని బట్టి, ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో పరిస్థితులను బట్టి జప్తు చేయాలి. ఉన్నతాధికారులకు తెలియజేయాలి. ► ఉన్న/దొరికిన బంగారం విషయంలో సమగ్రమైన పట్టిక/జాబితా తయారు చేయాలి. ప్రస్తుతం మన దేశంలో వెల్త్ ట్యాక్స్ చట్టం రద్దు అయింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక కుటుంబం అసెస్‌మెంటుకు సంబంధించి .. పైన పేర్కొన్న పరిమితుల మేరకు మదింపు చేయాలి. ఈ నేపథ్యంలోనే.. 1916 నంబరు సూచనను ప్రస్తావిస్తూ ఢిల్లీ ట్రిబ్యునల్ తాజా రూలింగ్ ఇచ్చింది. మీకు తెలిసే ఉండొచ్చు.. అసెస్మెంటు సందర్భంలో కేవలం ఆదాయమే కాకుండా ఇతర ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. లెక్కలోకి రాని నగదు, బంగారం, భవంతులు, ఆస్తిపాస్తులు, పెద్ద ఖర్చులు.. ఇవన్నీ ఉన్నాయంటే ఆ మేరకు ఆదాయం ఉందన్నట్లుగా (లేదా రుణం, సోర్స్ ఉండాలి) అధికారుల అసెస్మెంటు ఉంటుంది. కాబట్టి, మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. మీ దగ్గరున్న బంగారం జాబితా తయారు చేసుకోండి. జాబితా ప్రకారం బంగారం కాగితాలను భద్రపర్చుకోండి. ఆ లెక్కల్ని చూపించండి. మీ పుట్టింటి వారు ఇచ్చినది, అత్తగారు ఇచ్చినదీ, దగ్గర బంధువులు ఇచ్చినదీ, మీ వారు కొన్నదీ.. అన్నింటి జాబితా తయారు చేసి దగ్గర ఉంచుకోండి. ఎటువంటి సమస్యా ఉండదు. :: కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య.. ట్యాక్సేషన్ నిపుణులు -
ఈ పొరపాట్లు చేయొద్దు.. ఫారం 16ని చెక్ చేయండి
ఐటీ రిటర్నులు వేస్తున్నాం.. పన్నులు కట్టేస్తున్నాం కదా అని మనలో మనం సంబరపడుతుంటాము. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తుంటాం. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో బైటపడ్డ నిజాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనం చేసే తప్పుల గురించి తెలుసుకుందాం.. ► ఒక ఉద్యోగి ఒక సంవత్సరకాలంలో రెండు చోట్ల ఉద్యోగం చేసినప్పుడు .. ఇద్దరూ ఫారం 16 జారీ చేసి ఉంటారు. ఇద్దరూ స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ఇస్తారు. ఇద్దరూ సెక్షన్ 80సి మినహాయింపులూ ఇస్తారు. కానీ ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఒకసారే మినహాయింపు వస్తుంది. రెండు సార్లు రాదు. స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఆదాయంలో మార్పు రాదు. కానీ మినహాయింపులు, సగానికి తగ్గుతాయి. ఫలితంగా పన్నుభారం పెరుగుతుంది. ఈ విషయం అర్థం కాక పన్ను భారం పెరిగిపోయిందో అని ఆందోళన .. కాస్సేపు బాధ .. కాస్సేపు బెంగ వస్తాయి. ఇవన్నీ సర్దుకునే సరికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఫారం 16ని చెక్ చేయండి. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే సరిదిద్దుకోండి. ► కొన్ని ఆదాయాలను పరిగణనలోకి తీసుకోరు. బ్యాంకు డిపాజిట్ మీద వడ్డీ, సేవింగ్స్ ఖాతాలో జమయ్యే వడ్డీ, ఆన్సర్ పేపర్లు దిద్దితే వచ్చే డబ్బు, ఇన్విజిలేషన్ వల్ల వచ్చే డబ్బు, నగదు రూపంలో వచ్చే ట్యూషన్ ఫీజులు, ఇంటద్దెలు, గార్డియన్‌గా పిల్లలకు వచ్చిన ఆదాయం, జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయం.. ఇవన్నీ చూపించాలి. ఎటువంటి రిస్కు తీసుకోవద్దు. ► పన్ను భారం ఉండని ఆదాయాన్ని.. అంటే.. మినహాయింపు లభించే ఆదాయాలను కూడా రిటర్నులో డిక్లేర్ చేయాలి. ఇలా చేయడం వల్ల పన్ను భారం ఉండదు. భవిష్యత్తులో ‘‘సోర్స్’’ వివరణ ఇచ్చినప్పుడు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ► బ్యాంకుల మీద వచ్చే వడ్డీ కేవలం 10 శాతం టీడీఎస్‌కి గురి అవుతుంది. మీ నికర ఆదాయంపై 10 శాతం, 20 శాతం లేదా 30 శాతం వర్తించవచ్చు. 20 శాతం, 30 శాతం రేటు పడినప్పుడు వడ్డీ మీద టీడీఎస్ సరిపోదు. పది శాతం పన్ను పడుతుంది. అలా తెలియగానే ఎంతో బాధ.. ఏదో తప్పు జరిగిందని ఆవేదన, ఆలోచన వస్తాయి. మిగతా మొత్తం చెల్లించక్కర్లేదు అనుకోవడం తప్పు. ► నికర ఆదాయం నిర్దేశించిన పరిమితి దాటితే స్థూల పన్ను భారంలో 10 శాతం సర్‌చార్జి పడుతుంది. సర్‌చార్జి మీద 4 శాతం సెస్సు అదనం. ముందుగా ఏ ఆదాయానికి ఆ ఆదాయం విడిగా లెక్కించి, అజాగ్రత్త వలన నికర ఆదాయం తక్కువగా అనిపించి సర్‌చార్జీని పరిగణనలోకి తీసుకోరు. కానీ అన్నీ కలిపేసరికి నికర ఆదాయం కోటి రూపాయలు దాటితే సర్‌చార్జి కరెంటు షాకులాగా తగులుతుంది. తప్పు .. తప్పని తేలకపోతే ఫర్వాలేదు. కానీ తేలితే మళ్లీ బెంగ.. భయం.. పైగా పన్నూ తప్పదు. కాబట్టి ఇలా ఎన్నో తప్పులు దొర్లవచ్చు. కనుక తస్మాత్ జాగ్రత్త వహించండి. -
కొత్త విధానంలో పన్ను తగ్గుదల ఉత్తుత్తిదేనా..?
సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గు తుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించు కోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్, గృహ రుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్ నిపుణులు ఎంఎన్ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు. వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యాక్స్ నిపుణురాలు కె.వి.ఎల్.ఎన్ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. -
రిటర్నులు ఎందుకు..?
చాలామంది రిటర్నులు ఎందుకు వెయ్యాలి అని అడుగుతారు. పాన్ ఉంటే వెయ్యాలి.. పాన్ లేకపోతే మంచిదే కదా.. మనం అస్సలు రిటర్ను వేయనక్కర్లేదు కదా.. మాకు ఆదాయం లేదు.. అయినా వెయ్యాలా? బంగారం ఉంటే.. కొంటే వెయ్యాలా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు .. ఎన్ని ప్రశ్నలు వేసినా ఒకే ఒక్క జవాబు.. రిటర్నులు దాఖలు చేయండి. ఎందుకంటే.. మీ వయస్సును బట్టి బేసిక్ లిమిట్ ఉంటుంది. బేసిక్ లిమిట్ దాటి మీ నికర ఆదాయం ఉంటే రిటర్ను దాఖలు చేయాలి. నికర ఆదాయాన్ని లెక్కించండి. ఇదంతా చట్టాల కోసమేనని ఆలోచించకండి. దీనివల్ల ఇతరత్రా కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. చట్టాన్ని గౌరవించండి.. పైన చెప్పిన విధంగా చట్టప్రకారం మీ గురుతరబాధ్యత నిర్వర్తించండి. కంపెనీల్లో డెరైక్టర్లూ రిటర్నులు దాఖలు చేయాలి.. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములూ వేయాలి. కొత్త నిబంధనల ప్రకారం మీకు విదేశాలలో బ్యాంకు అకౌంటున్నా.. రిటర్నులు వేయాలి. విదేశాల్లో ఆస్తులున్నాయి.. రిటర్నులు వేయాలండి. అంతే కాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడులుంటే రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సబుల్ ఇన్‌కం లేకపోయినా విదేశాల్లో ఉన్న అంశాలను రిటర్నుల్లో పొందుపర్చాలి. రీఫండ్లు పొందాలంటే,, చెల్లింపులు చేసే ప్రతివారు టీడీయస్ చేస్తున్నారు. అంటే మూలాల్లోనే కోత. కొంతమందికి ట్యాక్సబుల్ ఇన్‌కం దాటకపోయినా కోత తప్పటం లేదు. అధికారులకు భయం ఎక్కువవటం వలన కోత అమలు పరుస్తున్నారు. కోత పడిందంటే పన్ను ఖజానాకు జమయినట్లే. ఇలాంటి సందర్భంలో రిటర్నులు దాఖలు చేస్తే కానీ రీఫండ్ మీకు రాదు. కాబట్టి రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతే కాదు. రీఫండ్ ఉంది అంటే.. ఆన్లైన్లో దాఖలు చేయాలి సుమా. డిడక్షన్లు క్లెయిమ్ చేయాలంటే.. అందరికీ సెక్షన్ 80 కింద డిడక్షన్లు ఉంటాయి. 80సీ, 80డీ, 80డీడీ, 80ఈ .. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అన్నింటికి కాగితాలు ఉండాలి. రిటర్నులతో బాటు జతపర్చకపోయినా భద్రపర్చుకోవాలి. క్లెయిం కోసం స్థూల ఆదాయం లోంచి వీటిని మినహాయిస్తారు. కానీ స్థూల ఆదాయం మారవచ్చు.. ఉద్యోగస్తులకు ఎరియర్స్ రావొచ్చు.. ఇతరులకు గత ఆదాయం ఇప్పుడు రావొచ్చు. అందుకని డిడక్షన్లు సరిగ్గా క్లెయిమ్ చేస్తూ రిటర్నులు వేశారంటే మీరు మీ డిడక్షన్లన్నింటినీ డిక్లేర్ చేసినట్లే. ఉదాహరణకు.. మీ స్థూల ఆదాయం రూ. 3 లక్షల యితే.. 80సీ కింద రూ. 1,50,000 చెల్లించారనుకోండి.. ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 1,50,000 అవుతుంది.. పన్ను భారం ఏదు. ఇటువంటి సందర్భంలో ఏదైనా కారణం వలన ఆదాయం రూ. 1,00,000 పెరిగిందనుకోండి.. గతంలో మీరు చేసిన క్లెయిమ్ ఇప్పుడు మీ పన్ను భారం తగ్గిస్తుంది. షేర్లు అమ్ముతున్నారా.. షేర్ల లావాదేవీలలో.. నష్టం రావొచ్చు.. లాభం రావొచ్చు. చాలా మంది ఇటువంటి లావాదేవీలను డిక్లేర్ చేయడం లేదు. బేసిక్ లిమిట్ దాటకపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఇన్‌కం సరే, లావాదేవీల్లో నష్టం రావచ్చు. ఈ నష్టాన్ని డిక్లేర్ చేయడం వలన మీకొచ్చే షేర్ల మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. అలా సర్దుబాటు కాకపోయినా.. రాబోయే 8 సం.లు సర్దవచ్చు. అందువలన ఖచ్చితంగా ఈ లావాదేవీలను చూపించుతూ రిటర్నులు దాఖలు చేయండి. అమెరికా నుంచి అబ్బాయి పంపిస్తే.. విదేశాల నుంచి మీ అబ్బాయి/అమ్మాయి లేదా దగ్గర బంధువులు డబ్బులు పంపుతున్నారా. భయపడక్కర్లేదు. అక్కడ పన్ను చెల్లించిన ఆదాయం, మీ అకౌంటులో పడింది. ఇక్కడ పన్ను పడదు. కానీ మీరు చూపించాలి. అలాగే ఎన్నో ఆదాయాలు పన్నుకి గురికానివి ఉన్నాయి. గ్రాట్యుటీ, జీవిత బీమా మొదలైనవి ఆ కోవకి చెందినవే. ఇవన్నీ డిక్లేర్ చేస్తూ రిటర్నులు వేయండి. డిపార్ట్మెంట్ వారు అడిగినప్పుడు వివరణలు ఇవ్వవచ్చు. మరెన్నో ప్రయోజనాలు.. వీసా అధికారులు, బ్యాంకు అధికారులు, మీకు అప్పు ఇచ్చే వాళ్లు, క్రెడిట్ కార్డు సంస్థలు, కొన్ని క్లబ్బులు, కొన్ని సంస్థలు.. ఇలా ఎందరో ఆదిలోనే అడుగుతున్నారు మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు. పన్ను భారం లేకపోయినా.. బేసిక్ లిమిట్ దాటకపోయినా వీటి విలువ అపారం. అందరూ వీటిని విశ్వసిస్తున్నారు. వీటి మీద ఆధారపడే మీకు ఎన్నో పనులు జరుగుతాయి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు.. రిటర్నులు వేయడానికి ఉపక్రమించండి. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్‌లావణ్య -
వేతన జీవులకు నిరాశే మిగిలింది...
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. వీరికి బేసిక్ పరిమితి సహా ఇతర అంశాల్లోనూ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. బడ్జెట్లోని కొన్ని అంశాలను ఒకసారి గమనిద్దాం. ⇒ ధరల పెరుగుదలకు విలవిలలాడుతున్న సామాన్యుడికి.. అందులోనూ ప్రతి ఏడాది కచ్చితంగా పన్ను చెల్లించే వారికి బడ్జెట్లో భంగపాటే మిగిలింది. ప్రస్తుతం బేసిక్ లిమిట్ రూ.2,50,000 పరిమితిని పెంచుతారని చాలా మంది ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మిగతా శ్లాబుల్లోనూ ఎటువంటి మార్పు లేదు. అన్ని యథాతథంగా ఉన్నాయి. ⇒ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతన జీవులకు ఏదో ఒక తాయిలం ఇవ్వకపోతుందా? అని అందరూ అనుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ మళ్లీ వస్తుందని ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావనే లేదు. ⇒ పీఎఫ్ విత్‌డ్రాయల్స్, వడ్డీ మీద పన్ను వేశారు జైట్లీ. ఈ చర్యపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో తిరిగి వెనక్కు తగ్గారు. ⇒ ఇది వరకు సెక్షన్ 87ఏ కింద రిబేటు రూ.2,000 ఇచ్చే వారు. దీన్ని బడ్జెట్లో రూ.5,000కి పెంచారు. రిబేటు రూ.5,000 పొందాలంటే నికర ఆదాయం రూ.5,00,000 లోపల ఉండాలి. దీని వల్ల కొంత మందికి రూ.3,000 పన్ను భారం తగ్గింది. ⇒ ఇక 80జీజీ కింద ఇంటి అద్దె చెల్లింపు పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కి పెంచారు. దీని వల్ల ఈ పరిమితి రూ.60,000కి పెరిగింది. రూ. 36,000 పెరగడం వల్ల మీ మీ ట్యాక్స్ రేటును బట్టి 10 శాతం, 20 శాతం, 30% చొప్పున ఉపశమనం కలుగుతుంది. ⇒ చిన్న వ్యాపారస్తుల వార్షిక టర్నోవర్ రూ.కోటి లోపు ఉంటే వారి నికర ఆదాయాన్ని 8 శాతం చొప్పున డిక్లేర్ చేస్తే బుక్స్ రాయక్కర్లేదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. దీని ప్రకారం పన్ను భారంలో ఉపశమనం లేకపోయినా బుక్స్ నిర్వహణ తదితర వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ⇒ కొంత శాతం దాటి నికర ఆదాయాన్ని లెక్కించడం కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని వృత్తి నిపుణులకు కూడా ఇచ్చారు. ట్యాక్స్ ఆడిట్ వర్తించే పరిమితి రూ. 25,00,000 నుంచి రూ.50,00,000 దాకా పెంచారు. ఇది చాలా మంచి ఉపశమనం. అయితే నికర ఆదాయాన్ని టర్నోవర్‌లో 50 శాతం డిక్లేర్ చేస్తే బుక్స్, ఆడిట్ అక్కర్లేదు. కానీ అన్ని వృత్తుల్లో 50 శాతం నికరంగా మిగలదు. ⇒ నల్లధనం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాకుండా.. ‘ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద వారు మొత్తం ఆదాయం/సంపద తదితర వాటిపై 45 శాతం పన్ను చెల్లిస్తే.. వడ్డీలు, ప్రాసిక్యూషన్ లేకుండా చూస్తారు. ⇒ నికర ఆదాయం రూ.1 కోటి దాటిన వారికి సర్‌చార్జీ 12 శాతంగా ఉండేది. ఇప్పుడు దీన్ని 15 శాతానికి పెంచారు. ⇒ ఇప్పుడు రూ.10,00,000 దాటిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం పన్ను కట్టాల్సిందే. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
గృహ రుణానికి బీమా ధీమా
అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే... కొండంత భరోసా! గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ రుణాల లభ్యత మెరుగయింది. దీంతో ఇళ్ల కొనుగోళ్లూ పెరుగుతున్నాయి. పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవడం సాధారణమైపోయింది. అయితే సజావుగా సాగినంత కాలం అంతా బాగానే ఉంటుంది. కానీ ఊహించని ఉపద్రవం వచ్చి పడితే? చెల్లించాల్సిన ఇంటి రుణం భారంగా మారితే? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కుంగిపోకుండా కాస్త భరోసా కల్పించే బీమా పథకాలు కొన్ని ఉన్నాయి. వాటి తీరుతెన్నులు వివరించేదే ఈ కథనం. - అనిల్ రెగో ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్ మూడు రకాల పాలసీలు.. అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే మిగతా మొత్తాన్ని కట్టే భారం కుటుంబం మీద పడకుండా బీమాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మూడు రకాల పాలసీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ ఇన్సూరెన్సు. దురదృష్టవశాత్తూ రుణగ్రహీత కన్నుమూసిన పక్షంలో గృహ రుణ బాకీ మొత్తం చెల్లింపు ఆటోమేటిక్‌గా జరిగేలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని పాలసీలు అందిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పక్షంలో 3 నెలల పాటు ఈఎంఐల భారాన్ని కవర్ చేసే విధంగా మరికొన్ని ప్యాకేజీలున్నాయి. గృహ రుణ బీమా పాలసీలో ప్రీమియాన్ని ముందస్తుగా సింగిల్ పేమెంటులో చెల్లించేయాల్సి ఉంటుంది. రుణాలిచ్చే సంస్థలు చాలా మటుకు ఈ ప్రీమియాన్ని కూడా రుణ మొత్తంలోనే కలిపేసి, తదనుగుణంగా ఈఎంఐలను లెక్కిస్తాయి. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంపై పడే వడ్డీ భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్‌లు... మొత్తం గృహ రుణానికి కవరేజీ పొందడంతో పాటు కట్టిన ప్రీమియం నుంచి గరిష్ట ప్రయోజనం దక్కించుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైనదిగా చెప్పొచ్చు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌కి భిన్నంగా ఈ తరహా పాలసీల్లో కవరేజీ స్థిరంగా ఉంటుంది. గృహ రుణ బీమా పాలసీ విషయంలో ఈఎంఐలు కట్టే కొద్దీ బాకీ మొత్తం తగ్గుతూ ఉంటుంది కనుక.. దానికి తగ్గట్లే కవరేజీ కూడా తగ్గుతూ వస్తుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇలాంటి సమస్య ఉండదు. పెపైచ్చు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తర్వాత ఇది అత్యంత చౌకైన జీవిత బీమా పాలసీ. దీనికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీల్లాగా గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలే ఉండాలన్న నిబంధనా లేదు. స్థూలంగా చెప్పాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు .. శరీరానికి, జీవితానికి బీమా రక్షణ కల్పించే సరళమైన పథకాలు. తీవ్ర గాయాల పాలైనా, మరణం సంభవించినా మొదటిది బీమా రక్షణ కల్పిస్తుంది. రుణ భారం ఉన్నా, లేకున్నా ఎవరైనా తీసుకోతగిన పాలసీ ఇది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. గృహ రుణంతో పాటు కుటుంబానికి కూడా కవరేజీ అందించగలిగేది ఇది. వ్యక్తిగత ప్రమాద బీమా అనుకోని విధంగా ఏవైనా ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైతే ఈఎంఐలు సమస్యగా మారకుండా చూసుకునేలా ముందు జాగ్రత్తగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవచ్చు. అంగవైకల్యం, పక్షవాతం మొదలైన వాటికి కూడా దీని ద్వారా కవరేజీ లభిస్తుంది. అయితే, ఈ పాలసీల గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలు మాత్రమే ఉంది. కానీ ఒకవేళ ప్రమాదం కారణంగా మరణం సంభవించిన పక్షంలో సందర్భాన్ని బట్టి సమ్ అష్యూర్డ్ కన్నా కూడా కొంత అధిక మొత్తమే లభించే పాలసీలూ ఇందులో ఉన్నాయి. గరిష్ట కవరేజీకి పరిమితులున్నప్పటికీ... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందించగలిగే పాలసీలు ఇవి. ఏ రుణాలు ఉన్నా లేకున్నా.. వ్యక్తిగత ప్రమాద బీమా అన్ని విధాలుగా ఉపయోగకరమైనదే. -
దీపావళి ఖర్చులకూ మినహాయింపు!
కొన్ని విరాళాలు, ఖర్చులపై 125 శాతం కూడా... ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. వ్యాపారం, వృత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఒకటి గానే పరిగణిస్తారు. వ్యాపారాన్ని, వృత్తిని చట్టంలో నిర్వచించారు. అసెసీ స్వయంగా ఆర్జించినా, ఏజెంట్ ద్వారా ఆర్జించినా దాన్ని ఆదాయంగా పరిగణి స్తారు. వచ్చిన ఆదాయం/అమ్మకాల విలువ/సర్వీసుల విలువలోంచి వ్యాపారం, వృత్తి చేయటానికి అవసరమైన ప్రతి ఖర్చుని మినహాయిస్తారు. ఖర్చు ఎంతయ్యిందో అంత ఇవ్వడం సహజం. ఇవి కాకుండా కొన్నిసార్లు వంద రూపాయలు ఖర్చుపెడితే వందాపాతిక మినహాయింపు ఇస్తారు. ఉదాహరణకి రూల్స్ ప్రకారం.. శాస్త్రసాంకేతిక పరిశోధనల కోసం ఇచ్చిన మొత్తం, అలాగే నేషనల్ లేబొరేటరీ, విశ్వ విద్యాలయం, ఐఐటీలకు ఇచ్చే మొత్తాల మీద రెండింతల మినహాయింపు ఇస్తారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి సాధారణంగా పెద్దపెద్ద కంపెనీలకు, సంస్థలకు సాధ్యమవుతుంది. మనం ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు తదితర వారి విషయాన్ని మాత్రమే పరిశీలిద్దాం. ఎంటర్టైన్మెంట్, బహుమతులు, ట్రావెలింగ్, గెస్ట్‌హౌస్ నిర్వహణ, విదేశీయానం, దీపావళి ఖర్చులు... ఇలా ఎన్నో ఖర్చులకు మినహాయింపు ఉంటుంది.మీరు గుర్తించవలసిన విషయాలు.. ప్రతి ఖర్చుకి సంబంధించిన కాగితాలను, వోచర్లను, అకౌంట్లను భద్రపరచాలి. నిజంగా ఖర్చుపెట్టి ఉండాలి. ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే కావాలి. ఈ ఖర్చులకు మినహాయింపు ఉండదు * వ్యక్తిగత ఖర్చులు * స్థిరాస్తులు, ఇతర ఆస్తులు * రుణం చెల్లింపులు * అప్పులు/చేతిబదులు/అడ్వాన్సుల చెల్లింపులు * వినాయక చవితి/ దసరా విరాళాలు * పూజ ఖర్చులు * ఆదాయపు పన్ను * ఆస్తి పన్ను * అసమంజసమైన, వివరణలేని ఖర్చులు * సంబంధం లేని ఖర్చులు * బంధువులకు ఇచ్చే జీతభత్యాలు (సమంజసం కాకపోతే) * నగదు చెల్లింపులు.. రూల్స్ ప్రకారం, ఏదేని చెల్లింపు రూ.20,000 దాటితే కచ్చితంగా అకౌంట్ పేరు, చెక్కు ద్వారా/ డీడీ ద్వారా చెల్లించవలసిందే. అలా కాని పక్షంలో ఆ చెల్లింపుల ద్వారా చేసిన ఖర్చులకు మినహాయింపులు ఉండవు. రిటర్నులు ఎలా వేయాలి? * గడువు తేదీ లోపల రిటర్నులు వేయండి. * నికర ఆదాయం రూ.5 లక్షలు దాటితే ఈ-ఫైలింగ్ చేయాలి. * ఇతరులు డిపార్ట్మెంట్కు వె ళ్లి ఫైల్ చే యొచ్చు. * గడువు తే ది లోపల ఫైల్ చేయకపోతే నష్టాన్ని రాబోయే సంవత్సరం సర్దుబాటు చేస్తారు. * అకౌంటింగ్ మెథడ్‌ను సక్రమంగా పాటించాలి. * కొత్తగా వచ్చిన స్టాండర్డ్స్‌ని పాటించాలి. * స్టాక్‌ను సక్రమంగా వాల్యూ చేయించాలి. * బుక్స్ రాయించాలి.(ట్రక్లు నడిపేవారు, ట్రాన్స్పోర్ట్ వాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు. టర్నోవర్/వసూళ్లు రూ.కోటి దాటని వారు వారి లాభ శాతం 8 % దాటి చూపిస్తే బుక్స్ రాయనక్కర్లేదు.) * ట్యాక్స్ ఆడిట్ అవసరమైతే చేయించాలి. * బుక్స్ రాయకపోయినా, ఆడిట్ చేయించకపోయినా పెనాల్టీ పడుతుంది. ట్యాక్సేషన్ నిపుణులు : 1. కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, 2. కె.వి.ఎన్ లావణ్య -
అద్దె వస్తుంటే పన్ను కట్టాలి మరి!
ఒక ఇల్లు మీ పేరిట ఉంది. దాని మీద వచ్చే ఆదాయాన్ని ‘ఇంటి మీద ఆదాయం’ అని పిలుస్తారు. అది మీ ఖాతాలో పడుతుంది. సూటిగా చెప్పాలంటే... ఇల్లు అద్దెకు ఇవ్వడం వలన వచ్చే ఆదాయం పన్ను భారానికి గురవుతుంది. విదేశాల్లో ఉన్న ఇంటి మీద ఆదాయం మీరు రెసిడెంట్ అయితే పన్నుకి గురవుతుంది. యజమానే పన్ను కట్టాలి. యజమాని అంటే... ఆస్తి ఎవరి పేరిట ఉందో వారే యజమాని. పేరు మీద లేకపోయినా అద్దె తీసుకునే హక్కు ఉన్న వ్యక్తి కూడా యజమానే. అంతే కాకుండా ప్రతిఫలం తీసుకోకుండా ఇంటిని బదిలీ చేసినప్పుడు.. బదిలీ చేసిన వ్యక్తినే యజమాని అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి పాతిక లక్షల నగదు భార్యకిచ్చాడు. ఆ భార్య ఆ నగదుతో ఇల్లు కట్టి అద్దెకిచ్చింది. ఆ అద్దెని ఆదాయంగా పరిగణించడానికి పెద్ద మనిషే యజమాని. సహకార సంస్థలు ఎలాట్ చేసినప్పుడు మెంబరే యజమాని అవుతాడు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి 10 లక్షలు ఇచ్చి ఇల్లు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇల్లు అద్దెకిచ్చాడు. అద్దె వస్తోంది. రిజిస్ట్రేషన్ జరగ లేదు. అయితే ఇక్కడ 10 లక్షలు ఇచ్చిన వ్యక్తే యజమాని. అలాగే ఇంటిని 12 సంవత్సరాలకు పైగా లీజుకు ఇస్తే.. ఇల్లు అనుభవిస్తున్న వ్యక్తి యజమాని అవుతాడు. జాయింట్‌గా హక్కులుంటే... హద్దులు స్పష్టంగా ఉంటే.. జాయింట్ ఓనర్లుగా పరిగణిస్తారు. అద్దెను ఎలా నిర్వచిస్తాం... అద్దె అంటే మీ చే తికి వచ్చింది అని చెప్పొచ్చు. సమంజసంగా ఉండాలి. మరీ తక్కువగా చూపిస్తే అధికారులు ఒప్పుకోరు. అలా మదించిన అద్దెలో నుంచి కిరాయిదారు చెల్లించిన మున్సిపల్ పన్నులు, రిపేర్లు, బ్రోకరేజ్, కమీషన్ తదితర వాటికి మినహాయింపు ఇవ్వరు. తిరిగి ఇవ్వాల్సిన డిపాజిట్ అద్దె కాదు. ఇవ్వనవసరం లేని డిపాజిట్‌ను లీజు వ్యవధికి సర్దుబాటు చేసి అద్దెగా పరిగణిస్తారు. ఫర్నిచర్, సెట్టింగ్స్ తదితర వాటిని కలిపి అద్దెకిస్తే.. రెండింటినీ విడగొట్టాలి. ఇంటి అద్దెకాని భాగాన్ని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. ఇంటి అద్దెలో నుంచి తగ్గింపులు అద్దెలో నుంచి యజమాని చెల్లించిన స్థానిక పన్నులు తగ్గిస్తారు. ఇక్కడ చెల్లించినట్లు రుజువులు కావాలి. మిగిలిన మొత్తంలో నుంచి 30% స్టాండర్డ్ డిడక్షన్‌గా మినహాయిస్తారు. ఈ మినహాయింపునకు ఎటువంటి రుజువులు అవసరం లేదు. రుణాల మీద వడ్డీకి మినహాయింపు ఉంది. ఇటువంటి వడ్డీ మీద ఎటువంటి పరిమితులు లేవు. రుణాలు ఎవరి దగ్గరి నుంచైనా తీసుకోవచ్చు. ముందు రుణం చెల్లించడానికి మరో రుణం తీసుకుంటే రెండవ రుణం మీద వడ్డీ తగ్గిస్తారు. సొంత ఇంటి మీద ఆదాయం అంటే మీ ఇంట్లో మీరు ఉండటం. దీనివల్ల ఎటువంటి అద్దె రాదు. ఎటువంటి మినహాయింపులు కానీ, తగ్గింపులు కానీ ఉండవు. కానీ రుణం మీద వడ్డీకి మినహాయింపు ఉంటుంది. 01/04/1999 త ర్వాత తీసుకున్న రుణాల మీద వడ్డీ రూ.2,00,000 వరకు తగ్గిస్తారు. రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి 3 ఏళ్లలోపు ఇల్లు పూర్తి అవ్వాలి. 01/04/1999కి ముందు తీసుకున్న రుణాల మీద వడ్డీ కేవలం రూ.30,000 వరకు మాత్రమే మినహాయిస్తారు. ఇల్లు పూర్తి కావడానికి ముందు చెల్లించిన వడ్డీని ఇల్లు పూర్తయిన తర్వాత 5 సమాన భాగాలుగా ఐదేళ్లు మినహాయిస్తారు. ఇంటి అద్దె కన్నా వడ్డీ ఎక్కువగా ఉంటే దాన్ని నష్టం అంటారు. ఈ నష్టాన్ని మీ ఇతర ఆదాయంలో నుంచి తగ్గిస్తారు. ముఖ్యాంశాలు ఇవీ... * మున్సిపల్ పన్నులు చెల్లించండి. రశీదులు భద్రపరచుకోండి. * అద్దెను ఫర్నిచర్, సెట్టింగ్స్గా విడగొట్టండి. * నెలసరి రూ.15,000 లోపు ఉంటే టీడీఎస్ బాధ్యతలు ఉండవు. * ఫ్లాట్లలో మెయింటెనెన్స్ ఉంటుంది. దీనిని కిరాయిదారును డెరైక్ట్‌గా ఇవ్వమనండి. అద్దెలో కలపకండి. అప్పుడు మీ చేతికి వచ్చిన మొత్తాన్ని మాత్రమే ఆదాయంగా తీసుకోవచ్చు. * ఇంటి రుణం సంస్థల నుంచి తీసుకుంటే అన్ని కాగితాలు ఉండాలి. ఇతరుల నుంచి తీసుకుంటే జాగ్రత్త వహించండి. * వరకట్నం నేరం. తీసుకోవద్దు. కానీ పుట్టింటి వారిచ్చిన నగదు, ఇతర ధనాన్ని స్త్రీ ధనంగా పరిగణిస్తారు. దీన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయించండి. ఆ మొత్తాన్ని చెక్కు ద్వారా అప్పు తీసుకొని ఇంటి మీద ఖర్చుపెట్టండి. వడ్డీ ఇవ్వండి. వడ్డీని క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ భాగస్వామికి ఏ ఇతర ఆదాయం లేకపోతే వడ్డీ మీద రూ.2,50,000 వరకు ఎటువంటి పన్నుభారం ఉండదు. కె.సీహెచ్ ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు