
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్‌నే ప్రస్తావిద్దాం.
అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం.
పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్‌లో కేవలం ఇన్‌కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం.
- మినహాయింపులు లేవు
- తగ్గింపులు లేవు
- తాయిలాలు లేవు
- బేసిక్ లిమిట్ పెంచలేదు
- శ్లాబులు, రేట్లు యధాతథం
ఒక పక్కన ట్యాక్స్‌పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్‌పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి.
వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్‌పేయర్స్‌కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త.
➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు..
➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు.
ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్‌లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి.
రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment