Legal Consequences Of Having Two PAN Cards, Details Inside - Sakshi
Sakshi News home page

ఇలాంటి పాన్‌ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!

Published Mon, Aug 1 2022 7:56 AM | Last Updated on Mon, Aug 1 2022 2:02 PM

Pan Card Information And Services By Taxation Experts - Sakshi

ఇదే ప్రశ్నని పూర్తిగా అడుగుతున్నాం. మీకు రెండు పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్లు ఉన్నాయా? అదేనండి.. రెండు పాన్‌లు ఉన్నాయా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్‌ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్‌ శాశ్వతం. ప్రత్యేకం.

మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్‌ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్‌మెంట్‌ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్‌ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 

పెనాల్టీ కట్టాల్సిందే.. 
ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్‌ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. 

సరెండర్‌ చేయండి.. 
మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్‌ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఎక్కడా ఆ నంబరును ప్రస్తావించకండి. తెలియజేయకండి. డిక్లేర్‌ చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాన్‌ని దుర్వినియోగం చేసినట్లు కాదు. అంతటితో ఆగిపోకుండా వెంటనే ఆ నంబరును సరెండర్‌ చేయండి. 

ఎలా సరెండర్‌ చేయాలి.. 
సరెండర్‌ అంటే కార్డుని ఫిజికల్‌గా డిపార్ట్‌మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్‌లోడ్‌ చేయండి. కొత్త పాన్‌ కోసం, మార్పుల కోసం దీన్ని వాడవచ్చు. కారణం అడగరు. వివరణ అక్కర్లేదు. విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు. దరఖాస్తు చాలు. వెంటనే సరెండర్‌ చేయండి. 

పెనాల్టీ వేసే ముందు..
నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్‌మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి. ఎగవేతకు ఇదే నాంది కాగలదు. కాబట్టి, అలా చేయకండి. వాడిన సందర్భంలో ఎగవేత లేదని రుజువు చేయలేకపోతే పెనాల్టీ పడుతుంది. బండి అంతదాకా పోనివ్వకండి.

చదవండి: Amazon: అమెజాన్‌ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement