గృహ రుణానికి బీమా ధీమా
అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే... కొండంత భరోసా!
గతంతో పోలిస్తే ప్రస్తుతం గృహ రుణాల లభ్యత మెరుగయింది. దీంతో ఇళ్ల కొనుగోళ్లూ పెరుగుతున్నాయి. పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవడం సాధారణమైపోయింది. అయితే సజావుగా సాగినంత కాలం అంతా బాగానే ఉంటుంది. కానీ ఊహించని ఉపద్రవం వచ్చి పడితే? చెల్లించాల్సిన ఇంటి రుణం భారంగా మారితే? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కుంగిపోకుండా కాస్త భరోసా కల్పించే బీమా పథకాలు కొన్ని ఉన్నాయి. వాటి తీరుతెన్నులు వివరించేదే ఈ కథనం.
- అనిల్ రెగో
ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్
మూడు రకాల పాలసీలు..
అనుకోని ఉపద్రవం ముంచుకొస్తే మిగతా మొత్తాన్ని కట్టే భారం కుటుంబం మీద పడకుండా బీమాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మూడు రకాల పాలసీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్ ఇన్సూరెన్సు. దురదృష్టవశాత్తూ రుణగ్రహీత కన్నుమూసిన పక్షంలో గృహ రుణ బాకీ మొత్తం చెల్లింపు ఆటోమేటిక్‌గా జరిగేలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని పాలసీలు అందిస్తున్నాయి.
ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పక్షంలో 3 నెలల పాటు ఈఎంఐల భారాన్ని కవర్ చేసే విధంగా మరికొన్ని ప్యాకేజీలున్నాయి. గృహ రుణ బీమా పాలసీలో ప్రీమియాన్ని ముందస్తుగా సింగిల్ పేమెంటులో చెల్లించేయాల్సి ఉంటుంది. రుణాలిచ్చే సంస్థలు చాలా మటుకు ఈ ప్రీమియాన్ని కూడా రుణ మొత్తంలోనే కలిపేసి, తదనుగుణంగా ఈఎంఐలను లెక్కిస్తాయి. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియంపై పడే వడ్డీ భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
టర్మ్ ఇన్సూరెన్స్‌లు...
మొత్తం గృహ రుణానికి కవరేజీ పొందడంతో పాటు కట్టిన ప్రీమియం నుంచి గరిష్ట ప్రయోజనం దక్కించుకునేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైనదిగా చెప్పొచ్చు. హోమ్ లోన్ ఇన్సూరెన్స్‌కి భిన్నంగా ఈ తరహా పాలసీల్లో కవరేజీ స్థిరంగా ఉంటుంది. గృహ రుణ బీమా పాలసీ విషయంలో ఈఎంఐలు కట్టే కొద్దీ బాకీ మొత్తం తగ్గుతూ ఉంటుంది కనుక.. దానికి తగ్గట్లే కవరేజీ కూడా తగ్గుతూ వస్తుంది.
అయితే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో ఇలాంటి సమస్య ఉండదు. పెపైచ్చు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తర్వాత ఇది అత్యంత చౌకైన జీవిత బీమా పాలసీ. దీనికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీల్లాగా గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలే ఉండాలన్న నిబంధనా లేదు.
స్థూలంగా చెప్పాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు .. శరీరానికి, జీవితానికి బీమా రక్షణ కల్పించే సరళమైన పథకాలు. తీవ్ర గాయాల పాలైనా, మరణం సంభవించినా మొదటిది బీమా రక్షణ కల్పిస్తుంది. రుణ భారం ఉన్నా, లేకున్నా ఎవరైనా తీసుకోతగిన పాలసీ ఇది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. గృహ రుణంతో పాటు కుటుంబానికి కూడా కవరేజీ అందించగలిగేది ఇది.
వ్యక్తిగత ప్రమాద బీమా
అనుకోని విధంగా ఏవైనా ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైతే ఈఎంఐలు సమస్యగా మారకుండా చూసుకునేలా ముందు జాగ్రత్తగా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోవచ్చు. అంగవైకల్యం, పక్షవాతం మొదలైన వాటికి కూడా దీని ద్వారా కవరేజీ లభిస్తుంది. అయితే, ఈ పాలసీల గరిష్ట కవరేజీ రూ. 25 లక్షలు మాత్రమే ఉంది.
కానీ ఒకవేళ ప్రమాదం కారణంగా మరణం సంభవించిన పక్షంలో సందర్భాన్ని బట్టి సమ్ అష్యూర్డ్ కన్నా కూడా కొంత అధిక మొత్తమే లభించే పాలసీలూ ఇందులో ఉన్నాయి. గరిష్ట కవరేజీకి పరిమితులున్నప్పటికీ... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందించగలిగే పాలసీలు ఇవి. ఏ రుణాలు ఉన్నా లేకున్నా.. వ్యక్తిగత ప్రమాద బీమా అన్ని విధాలుగా ఉపయోగకరమైనదే.