వేతన జీవులకు నిరాశే మిగిలింది...
తాజా బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లించే వారికి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. వీరికి బేసిక్ పరిమితి సహా ఇతర అంశాల్లోనూ ఎటువంటి ప్రయోజనం కలగలేదు. బడ్జెట్‌లోని కొన్ని అంశాలను ఒకసారి గమనిద్దాం.
⇒ ధరల పెరుగుదలకు విలవిలలాడుతున్న సామాన్యుడికి.. అందులోనూ ప్రతి ఏడాది కచ్చితంగా పన్ను చెల్లించే వారికి బడ్జెట్‌లో భంగపాటే మిగిలింది. ప్రస్తుతం బేసిక్ లిమిట్ రూ.2,50,000 పరిమితిని పెంచుతారని చాలా మంది ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. మిగతా శ్లాబుల్లోనూ ఎటువంటి మార్పు లేదు. అన్ని యథాతథంగా ఉన్నాయి.
⇒ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వేతన జీవులకు ఏదో ఒక తాయిలం ఇవ్వకపోతుందా? అని అందరూ అనుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ మళ్లీ వస్తుందని ఎదురు చూశారు. కానీ ఆ ప్రస్తావనే లేదు.
⇒ పీఎఫ్ విత్‌డ్రాయల్స్, వడ్డీ మీద పన్ను వేశారు జైట్లీ. ఈ చర్యపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో తిరిగి వెనక్కు తగ్గారు.
⇒ ఇది వరకు సెక్షన్ 87ఏ కింద రిబేటు రూ.2,000 ఇచ్చే వారు. దీన్ని బడ్జెట్‌లో రూ.5,000కి పెంచారు. రిబేటు రూ.5,000 పొందాలంటే నికర ఆదాయం రూ.5,00,000 లోపల ఉండాలి. దీని వల్ల కొంత మందికి రూ.3,000 పన్ను భారం తగ్గింది.
⇒ ఇక 80జీజీ కింద ఇంటి అద్దె చెల్లింపు పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కి పెంచారు. దీని వల్ల ఈ పరిమితి రూ.60,000కి పెరిగింది. రూ. 36,000 పెరగడం వల్ల మీ మీ ట్యాక్స్ రేటును బట్టి 10 శాతం, 20 శాతం, 30% చొప్పున ఉపశమనం కలుగుతుంది.
⇒ చిన్న వ్యాపారస్తుల వార్షిక టర్నోవర్ రూ.కోటి లోపు ఉంటే వారి నికర ఆదాయాన్ని 8 శాతం చొప్పున డిక్లేర్ చేస్తే బుక్స్ రాయక్కర్లేదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. దీని ప్రకారం పన్ను భారంలో ఉపశమనం లేకపోయినా బుక్స్ నిర్వహణ తదితర వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
⇒ కొంత శాతం దాటి నికర ఆదాయాన్ని లెక్కించడం కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని వృత్తి నిపుణులకు కూడా ఇచ్చారు. ట్యాక్స్ ఆడిట్ వర్తించే పరిమితి రూ. 25,00,000 నుంచి రూ.50,00,000 దాకా పెంచారు. ఇది చాలా మంచి ఉపశమనం. అయితే నికర ఆదాయాన్ని టర్నోవర్‌లో 50 శాతం డిక్లేర్ చేస్తే బుక్స్, ఆడిట్ అక్కర్లేదు. కానీ అన్ని వృత్తుల్లో 50 శాతం నికరంగా మిగలదు.
⇒ నల్లధనం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురాకుండా.. ‘ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమ్ 2016’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద వారు మొత్తం ఆదాయం/సంపద తదితర వాటిపై 45 శాతం పన్ను చెల్లిస్తే.. వడ్డీలు, ప్రాసిక్యూషన్ లేకుండా చూస్తారు.
⇒ నికర ఆదాయం రూ.1 కోటి దాటిన వారికి సర్‌చార్జీ 12 శాతంగా ఉండేది. ఇప్పుడు దీన్ని 15 శాతానికి పెంచారు.
⇒ ఇప్పుడు రూ.10,00,000 దాటిన డివిడెండ్ ఆదాయంపై 10 శాతం పన్ను కట్టాల్సిందే.
- కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు