అడగనిదే అమ్మయినా పెట్టదంటారు. అందుకని వేతన జీవులు తమ వేదనలను వెలిబుచ్చుతూ ఎన్నో విన్నపాలు వినవలె అంటూ విన్నవించుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిగి రాలేదు. చలించలేదు. పెడచెవిన పెట్టారో .. శీతకన్ను వేశారో .. మొత్తానికి చిన్న చూపే చూశారనే చెప్పాలి.
కరోనా నేపథ్యంలో ఆర్థిక స్థితి బాగులేదని సరిపెట్టుకుందామనుకున్నా ముందు రోజు విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే‘ ఎంతో ఆశాజనకంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ పెరుగుతుందని ఆశించారు. కానీ పెంచలేదు. సెక్షన్ 80సిలో సేవింగ్స్ లిమిట్ పెరుగుతుందనుకున్నారు. పిల్లల స్కూలు ఫీజుకు ఎక్కువ మినహాయింపు లభిస్తుందనుకున్నారు. ఇంటి లోన్ మీద వడ్డీకి మినహాయింపు పెరుగుతుందని అనుకున్నారు. కానీ.. భారతదేశాన్ని ’డిజిటల్’ భారతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నీతిగా, నిజాయితీగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించే వేతనజీవులకు ఎటువంటి వెసులుబాటు లభించలేదు.
నిన్న, మొన్నటి వరకూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి అందరూ రిటర్నులు వేశారు. వెబ్‌సైట్‌లో దురదృష్టవశాత్తూ ఏర్పడ్డ స్వాభావిక ఇబ్బందుల వల్ల తుది గడువును పలు మార్లు పొడిగించి చివరికి మమ అనిపించింది. ఇప్పుడు కొత్త ఫెసిలిటీ ఇస్తారట. అది అమల్లోకి వచ్చినప్పటి మాట. ఫెసిలిటీ ఇవ్వడమనేది ఎటువంటి ఉపశమనం కాదు. అది బాగా పనిచేస్తే త్వరితగతిన ఫైలింగ్ చేసుకోవచ్చు.
శ్లాబ్‌రేట్లు యథాతథం..
బేసిక్ లిమిట్ పెంచలేదు. శ్లాబ్ రేట్లు యథాతథంగా ఉంచారు. రేట్లలో మార్పు లేదు. పైపెచ్చు పెంచకపోవడమే ఊరట అన్నారు మంత్రి. మిగతా రంగాల్లో గ్రామీణం, వ్యవసాయం, ఇళ్లు, ఇన్‌ఫ్రా, కరోనా నివారణ, క్యాపిటల్ ఖర్చులు .. వీటి ద్వారా పరోక్షంగా ప్రయోజనం ఉంటుందని ముందు ముందు ఎటువంటి ఆశలకు తావు ఇవ్వకుండా అడ్డుకట్ట వేశారు.
‘విభిన్న సామర్థ్యం‘ ఉన్నవారికి ఇచ్చిన .. లేదా పొందుపర్చిన ఉపశమనం నామమాత్రమే. చాలా కొద్ది మందికే ఇది లభిస్తుంది. ఇదొక మంచి అవకాశం అని చెబుతున్నారు. రిటర్నుల్లో సవరణలు చేసుకోవచ్చని అంటున్నారు. అయితే, రివైజ్ చేసినప్పుడు ఆదాయం పెరిగితే .. సహజంగానే పన్నుభారం పెరుగుతుంది. వడ్డీలు కూడా కట్టాలి. కొత్త మార్పుల ప్రకారం అయితే.. మొదటి సంవత్సరం లోపల మార్పులు చేసుకుంటే 25 శాతం అదనం .. రెండో సంవత్సరం మొదలై పూర్తయ్యేలోపల 50 శాతం అదనం కట్టాల్సి ఉంటుంది. దీనితో ఎటువంటి ప్రయోజనమూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment