కొత్త పరిశోధనలు, అభివృద్ధి కోసం శాస్త్ర–సాంకేతిక శాఖకు రూ.20 వేల కోట్లు భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా ‘డీప్ టెక్’ ఫండ్ ఆఫ్ ఫండ్స్
న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త టెక్నాలజీలకు రాచబాట వేసేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ప్రైవేటు రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చర్యలను ప్రకటించారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లను కేటాయించారు. మొత్తంగా శాస్త్ర, సాంకేతిక రంగానికి సంబంధించి వివిధ విభాగాలకు మొత్తంగా రూ. 55,679 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
పెద్ద ఎత్తున పరిశోధనలకు ప్రోత్సాహం
దేశంలో ప్రైవేటు రంగంలో భారీ ఎత్తున పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డీప్ టెక్, సోలార్, ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం తొలి విడతగా తాజా బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భవిష్యత్తు తరం స్టార్టప్‌లకు ప్రోత్సాహమిచ్చేలా రూ.10 వేల కోట్లతో ‘డీప్ టెక్’ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీలు
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పా టు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలతో ఆర్థిక వ్యవస్థ అనుసంధానాన్ని బలోపేతం చేస్తామన్నారు. దేశంలో ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేలా ‘భారత్ ట్రేడ్ నెట్’ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ప్రధాన విభాగాలకు గణనీయంగా కేటాయింపులు..
⇒ కార్పస్ ఫండ్‌కు ఉద్దేశించిన నిధులు సహా తాజా బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక విభాగానికి రూ.28,508 కోట్లు
కేటాయించారు.
⇒ బయోటెక్నాలజీ విభాగానికి ఈసారి రూ.3,446 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపులు రూ.2,275 కోట్లతో పోలిస్తే.. రూ.1,171 కోట్లు అదనం. ఇక పారిశ్రామిక పరిశోధనల విభాగానికి రూ.6,657 కోట్లు ఇచ్చారు.
⇒ అణుశక్తి విభాగానికి గతంలో (రూ.24,968 కోట్లు) కన్నాస్వల్పంగా తగ్గించి రూ.24,049 కోట్లు కేటాయించారు.
⇒ అంతరిక్ష పరిశోధనల విభాగానికి రూ.13,416 కోట్లు కేటాయించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ సెంటర్లలో కొనసాగుతున్న స్పేస్ ఫ్లైట్, లాంచ్ వెహికల్, శాటిలైట్ ప్రాజెక్టుల కోసం రూ.10,230 కోట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment