పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సెషన్ 2024 ఆగస్టు 12న ముగుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను అనుసరించి భారీ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి సీతారామన్ తన 7వ బడ్జెట్‌ను జూలై 23న ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్.. ఏడవ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.
1959 నుంచి 1964 వరకు మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపట్టారు. మొత్తం మీద దేశాయ్ 10సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా అత్యధికసార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డ్ ఈయన పేరుమీదనే ఉంది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ విషయంలో మాత్రమే ఆ రికార్డును సీతారామన్ బ్రేక్ చేయనున్నారు.
నిజానికి ఇందిరా గాంధీ తరువాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలా సీతారామన్ ఖ్యాతిగడించారు. భారతదేశంలో ఎక్కువకాలం ఆర్ధిక మంత్రిగా పనిచేసిన మహిళ కూడా సీతారామన్ కావడం గమనార్హం.
బ్రీఫ్‌కేస్ విధానానికి మంగళం పాడి.. జాతీయ చిహ్నం కలిగిన బుక్ తరహాలో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయాన్ని, పేపర్‌లెస్ కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం, అత్యల్ప బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులు కూడా సీతారామన్ ఖాతాలోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment