కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలకు బడ్జెట్‌లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.
ఆదాయంలో పెరుగుదల
-ఆశిష్‌కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్‌ఎస్‌ఈ
బలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.
వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం
- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.
పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్‌లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్‌ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.
వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి
- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్
మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్‌ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ బూస్టర్
- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ
కేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్‌కు సరైన బూస్టర్‌ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
అదనంగా 75 వేల వైద్య సీట్లు
- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ
కేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్‌వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment