![Special Story About Gender Budget 2025-26](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/nirmala-seetaraman-1.jpg.webp?itok=6xHGST37)
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్‌లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్‌లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో!
ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్‌లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్‌లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..
అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఇంపాక్ట్ అసెస్‌మెంట్ లేదు
జెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్‌ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్‌మెంట్ల వారీగా డిపార్ట్‌మెంట్‌ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు.
గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్‌లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.
– సరస్వతి రమ
ఇంకొంత కసరత్తు
ఈ ఏడు జెండర్ బడ్జెట్‌కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది.
– మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖ
నిజాయితీతో కూడిన మద్దతు అవసరం
మహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.
– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్
కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ
పెద్దగా మార్పు కనపడలేదు
2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది.
– ప్రియ గజ్దార్, చైర్‌పర్సన్, ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్
శ్వేతపత్రం విడుదల చేయాలి
స్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి!
– ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి
– మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment