![Rajasthan has lesson for the world to save environment say Martin Goodman](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/martin.jpg.webp?itok=3WXs38os)
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్‌మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...
అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.
కరువు నుంచి
బయటపడేందుకు
పశ్చిమ రాజస్థాన్‌లో జోద్‌పూర్, బికనిర్‌లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.
1730 స్త్రీల ఊచకోత
1730లో జోద్‌పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.
చలించిన రచయిత
‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్‌మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్‌లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్‌లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్
గుడ్‌మాన్.
వేటాడితే జైల్లో వేస్తాం
పుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్‌లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి.
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment