Jaipur Literature Festival
-
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్‌లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్‌లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్‌లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్‌లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్‌ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్‌లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
నీలగిరి కొండల తొలి వెలుతురు
‘నీలగిరుల్లోని ప్రతి కొండ మాకు దేవునితో సమానం’ అంటుంది వాసమల్లి.నీలగిరిలో అంతరించిపోతున్న ‘తోడా’ తెగకు చెందిన వాసమల్లి ఆ తెగలో మొదటి గ్రాడ్యుయేట్. లిపిలేని తోడా భాషకు డిక్షనరీ తయారు చేసే పనిలో ఉంది. తోడా తెగ పాటలను సేకరిస్తే సాహిత్య అకాడెమీ ప్రచురించింది. ‘చంద్రునిలో ఉండే కుందేలు మా తెగదేనని మా విశ్వాసం’ అందామె.‘ఊటీ’ అని అందరూ పిలుచుకునే ‘టూరిస్ట్ కేంద్రం’లో తోడా తెగ విశిష్ట జీవనాన్ని నమోదు చేస్తున్న వాసమల్లి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ఆయుష్మంతులు తోడాలు కొండగొర్రెల్లా తిరుగుతూనే ఉంటారు. అడవి పళ్లు, ఆకుకూరలు తింటారు. ప్రశాంతంగా జీవిస్తారు. రోగాలు రావు. నూరేళ్లు సులువుగా బతుకుతారు. డబ్బు దాదాపుగా ఎవరి దగ్గరా ఉండదు. దానికి పెద్దగా విలువ లేదు. తోడాలు చేతి ఎంబ్రాయిడరీలో నిష్ణాతులు. తెలుపు, ఎరుపు, నలుపు రంగులు మాత్రమే వాడుతూ అందమైన ఎంబ్రాయిడరీ కంబళ్లు అల్లుతారు. తెలుపు బాల్యానికి, ఎరుపు యవ్వనానికి, నలుపు పరిణితికి గుర్తుగా భావిస్తారు. – వాసమల్లి ‘నీలగిరి కొండల్లో విహారానికి వచ్చేవాళ్లు మేం మాట్లాడుకునే భాష విని భలే ఉందే, ఇదేం భాష అనుకుంటారు. మా తర్వాతి తరాలు అలా అనుకోకూడదని తోడా భాషను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మా భాషకు లిపి లేదు. కాని యాభైకి మించిన ధ్వన్యక్షరాలు ఉన్నాయి. వాటిని నమోదు చేస్తున్నాను. తోడా డిక్షనరీ తయారు చేస్తున్నాను. తోడాలు పాడుకునే పాటలు, చెప్పుకునే కథలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని సేకరించి పుస్తకం వేశాను’ అంటుంది వాసమల్లి.అరవై ఏళ్లు దాటిన వాసమల్లి కేవలం 1500 మంది మాత్రమే మిగిలిన తోడా తెగకు ప్రతినిధి.‘నీలగిరుల్లో మొత్తం ఆరు తెగలు ఉన్నాయి. అన్నీ అంతరించిపోయే ప్రమాదపు అంచున ఉన్నాయి’ అంటుందామె. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో జానపదుల కథల గురించి మాట్లాడడానికి వచ్చిన వాసమల్లి ‘ఆదిమ తెగలు మానవ నాగరికతకు పాదముద్రలు. భాష మరణిస్తే సమూహం కూడా మరణిస్తుంది. మా తోడా భాష ఎంతో సుందరమైనది. మా తర్వాతి తరాలు దానిని కాపాడుకోవాలనేదే నా తపన’ అంది. బర్రెలే ఆస్తి ‘తోడాలకు బర్రెలే ఆస్తి. నీలగిరుల్లోని కొండ బర్రెలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ‘ఇర్ర్’ అంటారు. వాటి పాల నుంచి తీసిన నెయ్యితో మాత్రమే మేము దేవుని దీపాలను వెలిగించాలి. వాటిని మేము దైవాంశాలుగా చూస్తాం. తోడాలు శాకాహారులు. ఇర్ర్లను కోయడం, తినడం చేయం. మా తోడాల్లో ఎవరైనా చనిపోతే ఒక బర్రెను ఎంపిక చేసి పడమరవైపు తోలేస్తాం. అది కూడా ఏదో ఒక రోజున మరణించి ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరకు తోడు కోసం వెళుతుందని మా నమ్మకం’ అని చెప్పిందామె. చంద్రుని పై కుందేలు ‘తోడాలు ఏది దొరికినా పంచుకుని తినాలి. ఒకసారి ఒక తోడా తేనె దొరికితే వెదురుబొంగులో తన కోసం దాచుకుని ఇంటికి బయలుదేరాడట. అతనిలోని దురాశ వెంటనే పాములా మారి వెంటబడింది. అతను పరిగెడుతూ చేతిలోని వెదురుబొంగును కింద పడేస్తే అది పగిలి తేనె కుందేలు మీద చిందింది. పాము ఆ కుందేలు వెంట పడింది. కుందేలు భయంతో సూర్యుడి వైపు పరిగెడితే నేను చాలా వేడి... చంద్రుడి దగ్గరకు వెళ్లి దాక్కో అన్నాడు. కుందేలు చటుక్కున చంద్రుడిలో వెళ్లి దాక్కుంది. అందుకని చంద్రుడిలోని కుందేలు మా పూర్వికురాలనుకుంటాం. చంద్రగ్రహణం రోజున చంద్రుణ్ణి రాహువు వదిలే వరకూ కుందేలు క్షేమం కోసం భోరున విలపిస్తాం’ అని తెలిపిందామె. మొదటి గ్రాడ్యుయేట్ నీలగిరి కొండల్లో గిరిజనవాడలను ‘మండ్’ అంటారు. అలాంటి మండ్‌లో పుట్టిన వాసమల్లి చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తితో హైస్కూల్ వరకూ చదువుకుంది. చిన్న వయసు పెళ్లి తప్పించుకోవడానికి ఇంటర్, డిగ్రీ చదివింది. తర్వాత ఊటీలోని ‘హిందూస్థాన్ ఫొటో ఫిల్మ్ ఫ్యాక్టరీ’లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది. ఆ సంస్థ ఉద్యోగినే పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఉద్యోగం చేస్తుంటే, మరో కొడుకు ఊటీలో గైడ్‌గా పని చేస్తున్నాడు. ‘నా పరిశోధనకు పెద్దగా సపోర్ట్ ఏమీ దొరకడం లేదు. మా నీలగిరుల్లో యాభై కొండలకు యాభై కథలు ఉన్నాయి. సేకరిస్తున్నాను. ఎలా ప్రచురించాలో ఏమిటో’ అంటున్న ఆమె ఒక తొలి వెలుగుగా అనిపించింది. ఆ దీపం నుంచి మరో దీపం వెలుగుతూ వెళ్లాలని కోరుకుందాం. - ఇంటర్వ్యూ: జైపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్‌కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్‌లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్‌కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్‌లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్‌కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్‌లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్‌లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్‌లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్‌ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్‌ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
Jaipur Literature Festival 2023: త్రీలు– పని: నా డబ్బులు తీసుకో అనొద్దు
‘ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు?’ ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చింది?’ ‘డబ్బులు కావాలా?’ ఈ ప్రశ్నలు స్త్రీలను పురుషులు అడుగుతారు. ‘డబ్బులు కావాలంటే నా డబ్బులు తీసుకో’ అని భార్యతో భర్త, కూతురితో తండ్రి, తల్లితో కొడుకు, చెల్లితో అన్న అంటారు. ‘నేను సంపాదించుకున్న నా డబ్బులు నాకు కావాలి’ అని స్త్రీలు చెప్తే వీరు తెల్లముఖం వేస్తారు. స్త్రీల ఇంటి పని (కేర్ వర్క్)కి విలువ ఇవ్వక, స్త్రీలు బయట పని చేస్తామంటే పట్టించుకోక పోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య ఆర్థిక తారతమ్యాలు తొలగడానికి ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం 120 ఏళ్లు పట్టనుందని శనివారం ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. భవిష్యత్తులో ‘కేర్ వర్క్’ పెద్ద ఉపాధి రంగం కానుందని తెలిపారు. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక అధ్యయనం చేసింది. రాబోయే రోజుల్లో ఎటువంటి పనులు గిరాకీ కోల్పోయి ఎటువంటి పనులు గిరాకీలోకి వచ్చి ఉపాధిని ఏర్పరుస్తాయి అనేదే ఆ అధ్యయనం. అందులో దినదిన ప్రవర్థమానమయ్యే పని రంగంగా సంరక్షణా రంగం (కేర్ వర్క్) వచ్చింది. ఇంటి సంరక్షణ, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, ఇంటి శుభ్రత, ఇంటి ఆరోగ్యం... ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. ఈ కేర్ వర్క్ తరాలుగా స్త్రీలు చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న స్త్రీల చేత లెక్కా జమా లేని అతి తక్కువ వేతనాలకు చేయిస్తున్నారు. ఇంటిలో పని చేసే గృహిణుల కేర్ వర్క్‌కు విలువ కట్టడం లేదు. కేర్ వర్క్‌ను ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఒక ఉపాధి రంగంగా అభివృద్ధి చేస్తే తప్ప కేర్ ఎకానమీ స్వరూపం, ఉనికి, ఉపయోగం అర్థం కాదు. మగవాడు ఇంటి బయట జీతానికి చేసే పని ఒక్కటే పని కాదు. ఇంటి లోపల జీతం లేకుండా స్త్రీలు చేసే పని కూడా పనే’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో శనివారం జరిగిన ‘విమెన్ అండ్ వర్క్’ అనే సెషన్లో పాల్గొన్న రచయిత్రులు అన్నారు. వీరిలో ‘సిస్టర్హుడ్ ఎకానమి’ పుస్తకం రాసిన శైలి చోప్రా, ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద ‘దోజ్ మేగ్నిఫీషియెంట్ విమెన్ అండ్ దెయిర్ ఫ్లయింగ్ మెషిన్స్’ పుస్తకం రాసిన మిన్ని వైద్, ఐక్యరాజ్యసమితి మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ లక్ష్మి పురి ఉన్నారు. ‘స్త్రీలు ఉండదగ్గ చోటు ఇల్లు అనడమే పెద్ద అవరోధం. అన్ని చోట్లు స్త్రీలు ఉండదగ్గ చోట్లే. కాని ఇంట్లో ఉండటం వల్ల, బిడ్డను కనే శారీరక ధర్మం ఆమెకే ఉండటం వల్ల ప్రేమ, బాధ్యత అనే మాటల్లో ఆమెను పెట్టి ఇంటి పని చేయిస్తున్నారు. అంతులేని ఈ ఇంటి చాకిరికి విలువ ఉంటుందని స్త్రీ ఎప్పుడూ అనుకోదు. విలువ సంగతి అటుంచితే... అంత పని స్త్రీ నెత్తిన ఉండటం గురించి కూడా మాట్లాడరు. గ్లోబల్‌గా చూస్తే పురుషుల కంటే స్త్రీలు 2.9 శాతం ఎక్కువ పని చేస్తున్నారు. భారతదేశంలో ఇది పది శాతమైనా ఉంటుంది. స్త్రీ, పురుషుల శరీర నిర్మాణంలో భేదం ఉంది. కాని ఈ భేదం భేదభావంగా వివక్షగా మారడం ఏ మాత్రం సరి కాదు’ అని లక్ష్మి పురి అన్నారు. ‘స్త్రీలు పని చేస్తామంటే పురుషులు అడ్డంకులు వేస్తూనే ఉంటారు. ఎందుకు పని చేయడమంటే అది స్త్రీల లక్ష్యం కావచ్చు. ఎంపిక కావచ్చు. ఇష్టం కావచ్చు. ఆర్థిక స్వావలంబన కోసం కావచ్చు. నా డబ్బు తీసుకో ఉంది కదా అని భర్త, తండ్రి, కొడుకు అంటూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి. తాము సంపాదించుకున్న డబ్బు కావాలి అనుకోవచ్చు స్త్రీలు. భారతదేశంలో స్త్రీల జనాభా జపాన్ దేశపు జనాభాకు ఎనిమిది అంతలు ఉంటుంది. అంతటి జనాభా ఉన్నప్పటికీ మన దేశ స్త్రీల అభిప్రాయాలను, భావాలను పరిగణనలోకి తీసుకోరు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి’ అని శైలి చోప్రా అన్నారు. ‘మగవారి మధ్య బ్రదర్హుడ్ ఉంటుంది. స్త్రీల మధ్య సిస్టర్హుడ్ బలపడితే అన్నింటిని మార్చగలం. అందుకే నా పుస్తకానికి సిస్టర్హుడ్ ఎకానమీ అని పేరు పెట్టాను’ అన్నారామె. ‘ఇస్రో మహిళా శాస్త్రవేత్తల మీద నేను పుస్తకం రాశాను. వాళ్ల నుంచి విన్న మొదటి మాట మహిళా అనొద్దు... మేమూ శాస్త్రవేత్తలమే... ప్రత్యేకంగా ఎంచడం వల్ల ఏదో ప్రోత్సహిస్తున్న భావన వస్తుంది అంటారు. చాలా బాగుంది. కాని ఇస్రోలో ఇప్పటికీ 16 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు ఇస్రోకు మహిళా శాస్త్రవేత్త డైరెక్టర్ కాలేదు. ఎప్పటికి అవుతారో తెలియదు. మంగళయాన్ వంటి మిషన్‌ను స్త్రీలు విజయవంతం చేసినా... నా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే చేశాను... నా భర్త సపోర్ట్ చేయడం వల్లే చేశాను... వారు చేయనివ్వడం వల్ల చేశాను అని చెప్పుకోవాల్సి వస్తోంది. ‘చేయనివ్వడం’ అనేది స్త్రీల విషయంలోనే జరుగుతుంది. ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా భర్తో/కుటుంబమో వారిని ‘చేయనివ్వాలి’... ఈ స్థితి మహిళలకు ఎలాంటి మానసిక అవస్థను కలిగిస్తుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగం చేస్తున్న స్త్రీ తారసపడితే ఆఫీసు, ఇల్లు ఎలా బేలెన్స్ చేసుకుంటున్నావు అని అడుగుతారు. మగవాడిని ఎందుకనో ఈ ప్రశ్న అడగరు’ అన్నారు మిన్ని వైద్. ‘కుటుంబ పరమైన, సామాజిక వొత్తిళ్ల వల్ల పిల్లలు కనే వయసులోని స్త్రీలు తమ వృత్తి, ఉపాధి నుంచి దూరమయ్యి పని చేయడం మానేస్తున్నారు. వారు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పని చేసే, చేయగలిగే వాతావరణం పూర్తి స్థాయి ఏర్పడాలంటే మగవాళ్లు ఇంకా మారాల్సి ఉంది’ అని ఈ వక్తలు అభిప్రాయ పడ్డారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
లతా మంగేష్కర్ నా సినిమా జీవితానికి ఆమె వీసా ఇచ్చింది
‘మన జీవితంలో పండగ వచ్చినా, నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వేడుక, పిల్లాడు పుట్టినా, సుప్రభాత పూజ చేస్తున్నా... ప్రతి సందర్భానికి లతా పాడిన పాట ఉంటుంది. వింటాము. లతా అలా మన జీవితంలో మనకు తెలియకుండానే నిండి పోయింది. అందుకనే ఆమె ఎప్పటికీ వినపడుతూనే ఉంటుంది’ అని గీత రచయిత గుల్జార్ అన్నారు. శనివారం జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో లతా మంగేష్కర్ మీద వెలువడ్డ తాజా పుస్తకం ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ ఆవిష్కరణ సందర్భంగా గుల్జార్ మాట్లాడారు. ‘బందినిలో మొర గోర అంగ్ లైలే... నా మొదటి పాట. కాని దానికి మూడేళ్ల ముందు నుంచి లతా దీదీ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్తో మాట్లాడటం లేదు. ఎస్.డి.బర్మన్ కూడా ఆమెతో మాట్లాడదలుచుకోలేదు. నేనేమో పాట రాశాను. లతా నా పాటను మెచ్చి మొత్తం మీద పాడి నాకు సినిమా రంగంలో ప్రవేశానికి వీసా ఇచ్చింది. ఆ తర్వాత తను ప్రొడ్యూసర్‌గా నా దర్శకత్వంలో ‘లేకిన్’ నిర్మించింది. నేను ఆమె మీద అభిమానంతో ‘నామ్ గుమ్ జాయేగా’ (కినారా) పాట రాశాను. ఆ పాటలోని ‘మేరి ఆవాజ్ హీ పెహెచాన్ హై’ అనే లైన్‌ను మీరు ఆటోగ్రాఫ్ చేసేప్పుడు మెన్షన్ చేసేందుకు వీలుగా రాశాను అని లతాతో చెప్పాను. ఆ లైనే ఆమె బతికి ఉండగానేగాక మరణించాక ఒక అస్తిత్వంగా మారింది’ అన్నాడు. ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ పుస్తక రచయిత యతీంద్ర మిశ్రా మాట్లాడుతూ ‘ఇవాళ గాయనీ గాయకులు పొందుతున్న రాయల్టీ సౌకర్యాలకు, అవార్డులకు లతా మొదలెట్టిన పోరాటమే కారణం. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కొత్తల్లో గాయనీ గాయకులకు ఇచ్చేవారు కాదు. సంగీత దర్శకులకే ఇచ్చేవారు. ‘చోరి చోరి’ సినిమాలోని ‘రసిక్ బల్మా’ పాటకు శంకర్ జైకిషన్కు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఆ వేడుకలో ఆ పాట పాడమని జైకిషన్ లతాను పిలిచాడు. అవార్డు మీకు వచ్చింది... వెళ్లి ట్యూన్ వాయించండి సరిపోతుంది అందామె. గాయని లేకుండా పాట ఎలా? టైమ్స్ గ్రూప్ అధినేత రంగంలో దిగి ఫోన్ చేసి బతిమిలాడినా పాడలేదు. దాంతో ఇంకో రెండేళ్లకు గాయనీ గాయకులకు ఫిల్మ్‌ఫేర్ ప్రవేశపెట్టారు. రాయల్టీ విషయంలో కూడా లతా పట్టుదల వల్లే గాయనీ గాయకులకు డబ్బులు వచ్చాయి’ అని తెలియచేశాడు. లతా పాడిన పాటల వెనుక కథలు, విశేషాలతో ‘లతాజీ– ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్’ వెలువడింది. -
కథలన్నీ సలీమ్వి... సంభాషణలు నావి
(జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి): బాలీవుడ్ స్టార్ రచయితలు సలీమ్ జావేద్ విడిపోయి ఇంతకాలం అయినా వారు ఇరువురూ ఏనాడూ తాము పని విభజన ఎలా చేసుకున్నారో చెప్పలేదు. ఎన్ని ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న వేసినా సమాధానం దాట వేసేవారు. కాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం తన పుస్తకం ‘టాకింగ్ లైఫ్’ విడుదల సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ‘మేమిద్దరం (సలీం జావేద్) రాసిన సినిమాలన్నింటిలో ప్రతి కథా సలీం నుంచి వచ్చేది. సంభాషణలు నేను రాసేవాణ్ణి. స్క్రీన్ ప్లే ఇద్దరం సమకూర్చేవాళ్లం’ అని తేటతెల్లం చేశాడు. ఈ ఇద్దరి జంట రచనలో జంజీర్, యాదోంకి బారాత్, డాన్, షోలే, దీవార్, శక్తి వంటి సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రచయితలకు సినిమా రంగంలో స్టార్డమ్ తెచ్చిన జోడి వీరు. ‘మేమిద్దరం అనుకోకుండా కలిశాం. దర్శకుడు రమేష్ సిప్పి వాళ్ల నాన్న దగ్గర నెలకు 750 రూపాయల జీతానికి చేరాం. రాజేష్ ఖన్నా హీరోగా అందాజ్, హాతీ మేరి సాథి రాయడంతో స్థిరపడ్డాం’ అన్నాడాయన. బాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మేన్ ఇమేజ్ను హీరోకు సృష్టించిన ఈ జంట అనిల్ కపూర్ హీరోగా ‘మిస్టర్ ఇండియా’ (1987) రాశాక విడిపోయారు. (క్లిక్ చేయండి: అవకాశాలు ఇప్పిస్తాం, కోరికలు తీర్చమని అడిగారు) -
పేరెంటింగ్: కూతురు నేర్పిన పాఠం
‘పిల్లలతో స్నేహంగా ఉండండి. వాళ్లు తల్లిదండ్రులకు భయపడేలా ఉంచకండి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి’ అంటున్నారు సుధామూర్తి. 15 ఏళ్ల వయసున్నప్పుడు 45 ఏళ్లు ఉన్న తనకు తన కూతురు అక్షత నేర్పిన పాఠం వల్ల తాను ఈ రోజు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు. ‘పిల్లలకు తమ మీద తాము ఆధారపడటం నేర్పాలి. ఆనందం పొందడం నేర్పించాలి. నా తల్లిదండ్రుల నుంచి అదే నేర్చుకున్నాను. నా పిల్లలకూ అదే నేర్పాను’ అన్నారు సుధామూర్తి. జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొని తల్లిదండ్రులను, యువతను ఉద్దేశించి తన పుస్తకాల నేపథ్యంలో మాట్లాడారు. ‘పిల్లల నుంచి తల్లిదండ్రులు... తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలి. అలా జరగాలంటే ఇద్దరి మధ్య భయం లేని సంభాషణ జరిగే వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు భయపడేలా ఉంటే తమ మనసులోది చెప్పకుండా ఉంటారు. అప్పుడు ఇరుపక్షాలకూ నష్టం జరుగుతుంది’ అన్నారు సుధామూర్తి. తొలికాలపు మహిళా ఇంజినీర్‌గా, ఇన్ఫోసిస్ దిగ్గజంగా తనకు ఉన్న గుర్తింపు కంటే పుస్తకాలు రాయడం ద్వారా ‘దేశానికి అమ్మమ్మ’గా తనకు వస్తున్న గుర్తింపు, తన రాతలూ మాటలూ నవతరం వింటున్న తీరు తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారామె. జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో శుక్రవారం క్రిక్కిరిసిన పాఠకుల మధ్య ‘మై బుక్స్ అండ్ బిలీఫ్స్’ అనే అంశం మీద మాట్లాడారు. ► ఆడపిల్ల గొప్పతనం ‘ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదని నేను నిరూపించదల్చుకున్నాను. మా నాన్న డాక్టర్. నేను డాక్టరైతే బాగుంటుందని అనుకున్నాడు. మా అమ్మ లెక్కల టీచర్. నేను కూడా లెక్కలు టీచరు అయితే సరిపోతుందని భావించింది. కాని నేను అప్లయిడ్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేద్దామని నిశ్చయించుకున్నాను. ఇంజినీరింగ్ మగవారి విద్య అని అప్పటివరకూ భావన. మా నానమ్మ నేను ఇంజినీరింగ్ చదివితే తమ ఇళ్లల్లో కుర్రాళ్లు ఎవరు పెళ్లి చేసుకుంటారని హడలిపోయింది. ఆడపిల్లలు ఇంజినీరింగ్ చేస్తారని తెలియక నేను చదివిన కాలేజీలో లేడీస్ టాయిలెట్ కట్టలేదు. నేను చేరాక కూడా ఈ సెమిస్టర్ అయ్యాక మానేస్తుంది వచ్చే సెమిస్టర్లో మానేస్తుంది అని కట్టలేదు. నేను మానలేదు. పట్టుదలగా ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు... అందరిది... అదే నేను నిరూపించాను. ఏ ఇంటి అమ్మాయిలైనా ఇలాంటి పట్టుదలతో ఉండాలి. మీ మీద మీరు ఆధారపడి ముందుకు పోవాలి’ అందామె. ► కూతురి పాఠం ‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక నేను మంచి ఇంజనీర్ని అనిపించుకోవాలని... మగవాళ్ల కంటే బాగా పని చెయ్యాలని ఉద్యోగంలో విపరీతంగా కష్టపడేదాన్ని. (భర్త నారాయణమూర్తితో) ఇన్ఫోసిస్ స్థాపించాక లాభాల గురించి పత్రికల్లో వార్తలు వచ్చినా పిల్లలకు అది పెద్ద విషయంగా చూపేదాన్ని కాదు. అంతేకాదు, పది రూపాయలు పిల్లలకు ఇచ్చినా లెక్క అడిగేదాన్ని. ఇలా ఉండగా నా కూతురు అక్షత, అప్పుడు 15 ఏళ్లు ఉంటాయి, తనకు తెలిసిన ఒక పేద పిల్లాడికి కాలేజీలో సీటు వచ్చిందని, ఆ అబ్బాయిని స్పాన్సర్ చేయమని నన్ను అడిగింది. నేను నా పని హడావిడిలో ఆ మాట విని– నువ్వు స్పాన్సర్ చెయ్ అనేశాను తేలిగ్గా. దానికి నా కూతురు భయపడకుండా– అమ్మా... నీకు 45 ఏళ్లు వచ్చాయి. మంచి స్థితిలో ఉన్నావు. ఆదాయం ఉంది. ఒకరికి సాయం చేయగలవు. నాకు నువ్వు పాకెట్ మనీ కూడా ఇవ్వవు. కాని సాయం చేయమనేసరికి నన్ను చేయమంటున్నావు. చేయగలిగిన స్థితిలో ఉండి నువ్వు చేయలేనప్పుడు ఇంకొకరు సాయం చేయాలని ఆశించకు అంది. ఆ రోజు ఆఫీస్‌కు వెళ్లి అలా కూర్చుండిపోయాను. రెండు రోజులు ఆ మాటలు వెంటాడాయి. దాని నుంచే నా ఫౌండేషన్ పుట్టింది. ఫలితం? ఎందరో పేదలకు సాయం చేస్తున్నాను. ఎదుటివాళ్లకు సాయం చేయడంలోని ఆనందం నా కూతురి వల్లే పొందడం నేను నేర్చుకున్నాను’ అందామె. ► పోల్చి చూసుకోవద్దు ‘పిల్లలకు ఇంకొకరితో పోల్చి చూసుకోవడం నేర్పించవద్దు. నా కొడుక్కు నాలుగో ర్యాంకు వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లాణ్ణి కంగ్రాచ్యులేట్ చేయమన్నాను. నేను చేయను... వాడు నాకు పోటీ అన్నాడు. మన కంటే బాగా పని చేసేవారు ఎప్పుడూ ఉంటారు... మన కంటే ప్రతిభ ఉన్నవారిని చూసి ఈర్ష్య పడటం మంచి అలవాటు కాదు అని నేర్పించాను. పిల్లలకు తమతో మాత్రమే తాము పోల్చుకుని చూసుకోవాలని చెప్పాలి. నిన్నటి కంటే ఇవాళ మెరుగ్గా ఉన్నానా అని చెక్ చేసుకుని ఎదిగేలా వారికి తర్ఫీదు ఇవ్వాలి. నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో అని చెప్పాలి’ అన్నారామె.‘తల్లిదండ్రులు పిల్లలకు దేశం తిప్పి చూపించాలి. మన దేశాన్ని అర్థం చేయిస్తే వారు తాము తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు. ఒంటి మీద చొక్కాలేని పేదలే ఈ దేశాన్ని నిజంగా అర్థం చేయిస్తారు అనే మాట పిల్లలకు చెప్తే దేశం కోసం వాళ్లు ఏం చేయాలో తోటివారికి ఎలా సాయం చేయాలో తెలుసుకుంటారు’ అని ముగించారామె. ‘నీ మంచి మిత్రుడివి నీవే... చెడిపోవాలంటే నిన్ను చెడగొట్టుకునేది నీవే... నీలోని మంచి మిత్రుడిని కాపాడుకో’ అని చెప్పాలి. – సుధామూర్తి – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
పురాణ స్త్రీల మరో అన్వేషణ
‘నేను రాసిన మహా భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం ఉంటుంది... కాని శ్రీ కృష్ణుడు వచ్చి దుస్తులు ఇవ్వడు... ద్రౌపది తానే ఆ ఘట్టాన్ని ఎలా ఎదుర్కొని ఉంటుందో రాశాను’ అంటుంది ఇరా ముఖోటి. మహా భారతాన్ని అందులోని స్త్రీ పాత్రల కోణంలో వ్యాఖ్యానిస్తూ ఇరా ముఖోటి రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ ఎన్నో ఆలోచనలు రేపుతోంది. ప్రశంసలూ పొందుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నేచురల్ సైన్సెస్ చదివిన ఇరా పురాణ స్త్రీలను పునర్దర్శించే పనిలో ఎందుకు పడిందో ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాఠకులతో పంచుకుంది. ‘సమాజం చాలా ఆధునిక స్థాయికి చేరింది. ఇంగ్లిష్ భాషలో మాట్లాడి ఆలోచించే వర్గం మన దేశంలో స్థిరపడింది. అదే సమయంలో ప్రతి ఇల్లూ మూలాలకు దూరంగా జరుగుతూ ఏకాకిగా మారుతోంది. అలాంటి సమయాలలో పురాణాల వైపు చూసి వాటిని మళ్లీ చదవడం ద్వారా అంతో ఇంతో ఓదార్పు పొందడం జరుగుతోంది. పురాణాలను మళ్లీ వ్యాఖ్యానిస్తూ ఇంగ్లిష్‌లో వస్తున్న రచనలను కూడా అలాగే చూడాలి’ అంటుంది ఇరా ముఖోటి. ఫార్మస్యూటికల్ రంగంలో చాలా ఏళ్లు ఉన్నతోద్యోగం చేసిన ఇరా రచన పట్ల తన ఆసక్తిని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఒక దశలో ఉద్యోగం మానేసి గమ్యం లేనట్టుగా తిరుగుతూ రచయితగా ఉండటమే తన నిర్ణయంగా బలపరుచుకుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం వైపు చూళ్లేదు. ఫుల్‌టైమ్ రైటర్‌గా మారిపోయింది. ‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా కూతుళ్లు ఇద్దరూ చిన్నవాళ్లు. వాళ్లను తీసుకుని ప్రతి సంవత్సరం రామ్‌లీల చూడటానికి వెళ్లేదాన్ని. నాటకం చివరలో సీత రాముడి పక్కన సింహాసనం పై కూచోవడం చూసి నా కూతుళ్లు చప్పట్లు కొట్టేవాళ్లు. నాకు అనిపించేది... సీత అలా కూచోవడం వెనుక ఎన్ని సవాళ్లను ఎదుర్కొంది.. ఎన్ని పరీక్షలకు తల ఒంచింది... ఇవన్నీ నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనిపించేది. సీత ఎంతో ఆదర్శప్రాయమైన స్త్రీ. ఆమెకు కష్టాలు తప్పలేదు. అదే సమయంలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. అది నా మనసు కలచి వేసేలా చేసింది. స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా, ఎంత ముందంజ వేసినా వారిపై దాష్టీకాలు ఉంటాయి అనిపించింది. ఆ సమయంలోనే పురాణపాత్రలను మళ్లీ రాయాలనుకున్నాను. వెంటనే ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల రాశాను.’ అందామె. అలా రైటర్ అయిన ఇరాను ఆమె పబ్లిషర్ ప్రోత్సహించాడు. ‘నీకు చరిత్ర అవగాహన బాగా ఉంది. ముందు హిస్టారికల్ నాన్ ఫిక్షన్ రాయి’ అని సలహా ఇచ్చాడు. దాంతో ఇరా రాయడం మొదలెట్టింది. ‘హీరోయిన్స్: పవర్ఫుల్ ఇండియన్ విమెన్ ఆఫ్ మిత్ అండ్ హిస్టరీ’, ‘క్వీన్స్ అండ్ బేగమ్స్ ఆఫ్ మొఘల్ అంపైర్’, ‘అక్బర్– ది గ్రేట్ మొఘల్’ పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత అన్నింటి కంటే ముందు రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ నవల బయటకు వచ్చింది. అయితే ‘ద్రౌపది’ పాత్ర మీద పున ర్వా్యఖ్యానం, పునఃచిత్రణ కొత్త కాదు. ప్రాంతీయ భాషలలో, ఇంగ్లిష్‌లో ఎన్నో రచనలు వచ్చాయి. తెలుగులో యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రాసిన ‘ద్రౌపది’ (2009) నవల చాలా చర్చోపచర్చలకు కారణమైంది. 2010లో అదే నవలకు సాహిత్య అకాడెమీ బహుమతి దక్కితే దుమారం రేగింది. కాని ఇరా రాసిన ‘సాంగ్ ఆఫ్ ద్రౌపది’ అమె రచనా శైలి, ఆలోచనా శైలితో ఆకట్టుకుంటోంది. ‘ద్రౌపది భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం. స్త్రీ ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కాని ద్రౌపది తన కోపాన్ని ప్రదర్శించగలిగింది. ఆమె నిండు కౌరవసభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాడింది. ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర. అయినా సరే కౌరవసభకు సమాధానం చెప్పగలిగింది.’ అంటుందామె. అయితే అందరూ తరతరాలుగా చెప్పుకుంటున్న ఆ ‘వస్త్రాపహరణం’ ఘట్టంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి చీరలు ఇవ్వడాన్ని ఇరా రాయలేదు. ‘1930లో మన దేశంలో ఒక పండిత వర్గం, చరిత్రకారుల వర్గం కలిసి కొన్నాళ్లు పూణెలో కూచుని మహాభారతంలోని ప్రక్షిప్తాలన్నీ తొలగిస్తూ సిసలైన మహాభారతాన్ని తేల్చారు. నేను వారు కూర్చిన మహాభారతాన్ని నా రచనలకు ప్రామాణికంగా తీసుకున్నాను. వాస్తవ దృష్టితో చూస్తే అది రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య తగవు. కృష్ణుడు కూడా ఈ వాస్తవిక దృష్టిలో ఒక రాజకీయవేత్తగా కనిపించాడు నాకు. అందుకే దైవశక్తులు ఉన్న కృష్ణుడిని నా వస్త్రాపహరణ ఘట్టంలో పెట్టలేదు. ద్రౌపదినే ఆ ఘటనను ఎదుర్కోనిచ్చాను’ అంటుందామె. పురాణాలలో ఉన్నత వర్గాల ప్రయోజనాలు నిమ్నవర్గాల ప్రజలకు ఎలా చేటు చేశాయో చూపే ప్రయత్నం చేస్తుంది. ‘లక్క ఇంటిలో పాండవులను కాపాడటానికి కుంతి ఒక గిరిజన తల్లిని, ఐదుమంది పిల్లలను తమకు మారుగా పడుకోబెడుతుంది. ఆ అమాయకులు అగ్నికి ఆహుతి అవుతారు. ఇది ఎంత అన్యాయం. ఏకలవ్యుడు, ఘటోత్కచుడు పాండవ, కౌరవులతో సమగౌరవం ఎందుకు పొందలేదో చూడాలి’ అంటుంది. కురుక్షేత్ర యుద్ధం వల్ల వితంతువులుగా మారిన కౌరవుల భార్యల దిక్కులేని స్థితిని ఇరా తన పుస్తకంలో రాస్తుంది. ‘సతీ సహగమనం’ ఆ సమయంలోనే ఉనికిలోకి విస్తారంగా వచ్చి ఉంటుందని ఆమె ప్రతిపాదన. ఏమైనా ఇది అంతులేని అన్వేషణే. కాలం గడిచేకొద్ది నాటి పాత్రలు కొత్త అర్థాలతో భారతజాతిని మేల్కొలుపుతూనే ఉంటాయి. ఇరా ముఖోటి వంటి మహిళా రచయితలు ఆ పనిలో భాగం కావడమే ఇప్పుడు వార్త. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: ఆ మహిళలవి ప్రాణాలు కావా!!
‘పేద, దిక్కు మొక్కు లేని స్త్రీల హత్యలు పేపర్లలో వస్తుంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమయ్యాయో మీరెప్పుడైనా పట్టించుకున్నారా?’ అని అడుగుతుంది రిజులా దాస్. కోల్‌కతాలోని అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా ‘సోనాగాచి’లో ఎవరికీ పట్టని వేశ్యల హత్యల నేపథ్యంతో ఆమె రాసిన ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ నవల విశేషంగా పాఠకాదరణ పొందింది. వెబ్ సిరీస్‌గా కూడా రానుంది. వేశ్యల జీవితాలపై ఎన్ని నవలలు వచ్చినా వారి గురించి సంపూర్ణంగా తెలిసే అవకాశం లేదు అంటున్న రిజులా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో తన పుస్తకానికై చేసిన పరిశోధన గురించి మాట్లాడింది. ‘మురికివాడల్లో ఉన్న స్త్రీలు, భవన నిర్మాణ రంగంలో ఉన్న స్త్రీలు, కూలి పని చేసే మహిళలు, వేశ్యలు, ఇంకా ఇలాంటి మార్జినలైజ్డ్ సెక్షన్లలో ఉన్న ఆడవాళ్లలో ఎవరైనా హత్యకు గురైతే ఈ వార్త పేపర్లలో వస్తుంటుంది. మనం చదువుతాం. ఆ తర్వాత సౌకర్యంగా మర్చిపోతాం. ఆ హత్యలు చేసింది ఎవరో వారికి శిక్ష పడిందో లేదో పట్టించుకోము. మన సమాజంలో కొందరి ప్రాణాలకే విలువ. ఆ ప్రాణాలు తీసింది ఎవరో మనకు తెలియాలి. కాని ఇలాంటి స్త్రీలు మరణిస్తే ఎవరికీ పట్టదు. పోలీసులకూ పట్టదు. వారివి ప్రాణాలు కాదా? వారు చంపదగ్గ వారే అనుకుంటున్నామా మనం’ అంటుంది రిజులా దాస్. ఆమె రాసిన తొలి నవల ‘ఏ డెత్ ఇన్ సోనాగాచి’ గత సంవత్సరం విడుదలైంది. త్వరలో అమెరికన్ ఎడిషన్ రానుంది. ఇప్పటికే వెబ్ సిరీస్‌కు కూడా తీసుకున్నారు. ‘మీరు వెంటనే ఇదేదో మర్డర్ మిస్టరీ అని చదవడానికి బయలుదేరకండి. నా నవల యాంటీ మర్డర్ మిస్టరీ... యాంటీ థ్రిల్లర్. సమాజంలో ఒక అనామక స్త్రీ చనిపోతే ఆ కేసు తేలకపోవడం గురించి మీకెలా చింత లేదో నా నవలలో హత్యకు గురైన వేశ్య కేసు తేలాలన్న చింత నాకూ లేదు. సమాజంలో ఏ ధోరణి ఉందో ఆ ధోరణే నా నవలలో ఉంటుంది’ అంటుందామె. కోల్‌కతాకు చెందిన రిజులా దాస్ చాలా ఏళ్లుగా న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఆమె అక్కడ క్రియేటివ్ ఫిక్షన్లో పిహెచ్డి చేసింది. తన తొలి నవల రాయడానికి దక్షిణ ఏసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన ‘సోనాగాచి’ (కోల్‌కతా) గురించి ఆమె దాదాపు నాలుగైదేళ్లు పరిశోధన చేసింది. మరో రెండేళ్లు రాసింది. అంటే ఈ మొత్తం పనికి ఆమె ఏడేళ్లు వెచ్చించింది. ‘దీనిని రాసే ముందు నేను ఇది రాయడానికి అర్హురాలినా కాదా చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ జీవన నేపథ్యం లేదు. ఆ కష్టాలూ తెలియదు. కాని వారు అలా ఉండటానికి నేనూ నా నగరం కోల్‌కతా నా సమాజం కారణమే కదా అనుకున్నాను. అందుకే సోనాగాచి స్త్రీలను విడిగా కాకుండా కోల్‌కతాలో భాగంగా తీసుకున్నాను. నగరం ప్రమేయం లేకుండా సోనాగాచి లేదు’ అంటుందామె. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగు చేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. ‘అసలు సోనాగాచిలో ఉన్న సెక్స్‌వర్కర్లు తమను రక్షించి ఈ మురికి కూపం నుంచి బయటపడేయమని మనల్ని అడుగుతారా... లేదా వారి మానాన వారిని వదిలేయమంటారా అనేది మనం ఎప్పటికీ కనిపెట్టలేం’ అంటుంది రిజులా దాస్. ఆమె ఈ నవలను ‘లలీ’ అనే వేశ్య పాత్ర ద్వారా చెబుతుంది. నాసిరకం సరసకథలు రాసే రచయిత ఆమె ప్రియుడు. సోనాగాచిలో ఒక వేశ్య దారుణంగా హత్యకు గురైతే వ్యవస్థ అంతా ఇది మామూలే అని ఊరుకుంటుంది. కాని రిజులా ఏం చెబుతుందంటే అలా జరిగిన హత్యలు అంతటితో ఆగవు... అవి సోనాగాచిలో ఒక దానితో ఒకటిగా కలిసి అనేక స్త్రీ వ్యతిరేక ఘటనలకు కారణం అవుతాయి అని. ‘ఈ నవల రాసేప్పుడే డిమానిటైజేషన్ వచ్చింది. సెక్స్వర్కర్లది నోట్ల ఆధారిత వ్యవస్థ. ‘మేము ఎయిడ్స్ విజృంభించినప్పుడు తట్టుకుని నిలబడ్డాం కాని డిమానిటైజేషన్లో మాత్రం పూర్తిగా పతనమయ్యాం. అంతటి ఘోరమైన దెబ్బ మా జీవితాల్లో ఎరగం’ అని వారు అన్నారు. ఈ ముఖ్య పరిణామాన్ని నా నవలలో పెట్టడానికి మళ్లీ రీరైట్ చేశాను’ అంటుంది రిజులా. సెక్స్‌వర్కర్ల దగ్గర ఉన్న చాయిస్ ఏమిటి? సోనాగాచి విడిచిపెట్టి వెళ్లాలి అంటే వాళ్లకు పచ్చళ్లు పెట్టడం నేర్పించి పంపించేస్తే చాలా? లేదంటే సోనాగాచిలోనే ఉండిపోవాలి అంటే ఈ హింసాత్మకమైన బతుకును ఇలాగే బతకాలా? వారికి ఉన్న చాయిస్ ఏమిటి? సమాజం ఇచ్చే చాయిస్ ఏమిటి? ఈ ప్రశ్నలను లేవనెత్తుతూ ఈ నవల ముగుస్తుంది. ఇంగ్లిష్, బెంగాలీలలో రాసే రిజులా బాల్యంలో రష్యన్ సాహిత్యంతో ప్రభావితమైంది. రష్యన్లో కుప్రిన్ రాసిన ‘యమకూపం’ వేశ్యల మీద వచ్చిన గొప్ప నవల. ఇప్పుడు ఈమె రాసింది ఈ దేశ వేశ్యావాటికలను అర్థం చేయించే సమర్థమైన నవల. ఈ రెండూ మీరు చదవతగ్గవే. సోనాగాచిలో దాదాపు 50 వేల మంది వేశ్యలు ఉంటారు. వీరిని ఆధారం చేసుకుని ‘మేడమ్‌లు’, ‘బాబూలు’, పింప్స్... వీళ్లతో కుమ్మక్కు అయిన పోలీసులు... వేశ్యలను బాగుచేస్తాం అని తిరిగే సోషల్ వర్కర్లు... ఆధ్యాత్మిక మార్గం పట్టిస్తాం అని చెప్పే భక్త శిఖామణులు... ఇదంతా పెద్ద వ్యవస్థ. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: అది నిశ్శబ్ద మహమ్మారి
‘సామాజిక వేదనలకు స్థానం కల్పించడం... రాసే వారికి సమాన వేదిక ఇవ్వడం’ ప్రతి ఏటా జైపూర్‌లో జరిగే ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ (జెఎల్ఎఫ్) ప్రధాన లక్ష్యం. ఆసియాలోనే అతి పెద్ద లిటరేచర్ ఫెస్టివల్‌గా చెప్పుకునే ఈ సాహితీ ఉత్సవం 15వ వేడుక మార్చి 10 నుంచి 14 వరకూ 5 రోజుల పాటు జరిగింది. పురుషుల సంఖ్యతో సమానంగా స్త్రీలు పాల్గొని తాము ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి రాశారో, ఏమి రాయాలనుకుంటున్నారో పాఠకులతో పంచుకున్నారు. కథలు, కవిత్వం, నవల, నాన్ ఫిక్షన్, పరిశోధన, ప్రచురణ, పురాణాల పునఃకథనం, చిత్రలేఖనం, గానం... ఓహ్... భారతదేశపు నలు మూలల నుంచి వచ్చిన స్త్రీల ప్రతిభ, వర్తమాన సృజన ఈ ఫిస్టివల్‌లో పాఠకులకు తెలిసింది. ‘జెఎల్ఎఫ్ 2022’లో పాల్గొన్న మహిళా రచయితల్లో కొందరి పరిచయం నేటి నుంచి ధారావాహికంగా... సాక్షి పాఠకులకు ప్రత్యేకంగా. ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి ఊపేసింది. వణికించింది. తాళాలు బిగించుకుని కూచునేలా చేసింది. కాని...ఈ మహమ్మారికి నీడలా ‘షాడో పాండమిక్’ లేదా ‘సైలెంట్ పాండమిక్’ కూడా నడిచింది. అదే స్త్రీలపై సాగిన హింస. లాక్డౌన్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై సాగిన హింసను ‘షాడో పాండమిక్’ అంటున్నారు. యుద్ధాలు వచ్చినా, రోగాలు వచ్చినా తొలి బాధితులు స్త్రీలే అంటారు సొహైలా అబ్దుల్ అలీ. ఆమె రాసిన ‘వాట్ వుయ్ టాక్ అబౌట్ వెన్ వుయ్ టాక్ అబౌట్ రేప్’ పుస్తకం ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022’ ప్రారంభ సెషన్లో ఆమె మాట్లాడింది ఏమిటి? ‘సునామి వచ్చినా, యుద్ధం వచ్చినా, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా మొదట నష్టపోయేది స్త్రీలేనని మనకు తెలుసు. ‘షాడో పాండమిక్’ అనుకుంటూ ఇంకా ఎంత కాలం దాని గురించి ఆశ్చర్యపోవడం. స్త్రీల జీవితాల మెరుగు కోసం చర్చించాలి’ అంటుంది సొహైలా అబ్దుల్ అలీ. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘ది జెండర్ కంటాజియన్’ అనే అంశం మీద ఆమె మాట్లాడారు. ‘నాలుగు గోడల మధ్య మనకు చాలా ఇష్టమైన వారితో బంధింపబడ్డా మనకు విసుగు వస్తుంది. అది ప్రదర్శించబుద్ధవుతుంది. లాక్డౌన్లో ఇళ్లల్లో ఈ విసుగును బయటకు చూపలేని హింసను స్త్రీలు భరించారు. మగవారికి కలిగిన విసుగు తమ మీద హింసగా మారినా భరించారు. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి సమయాల్లో ఇంటి నుంచి బయటపడటానికి మనకు సరైన హెల్ప్లైన్లు లేవు, షెల్టర్లు లేవు, ఆర్థికంగా ఆదుకునే వ్యవస్థ లేదు. వాటి గురించి ఆలోచించాలి. అయితే ఇలాంటి సమయాల్లోనే మన దేశంలో కొన్నిచోట్ల స్త్రీల మధ్య ఐక్యత కనిపించింది. ఇంట్లో హింస ఎదుర్కొంటున్న స్త్రీలు గోడల మీద బాది సంకేతాలు ఇవ్వడం ద్వారా పక్కింటి స్త్రీల మద్దతు సంపాదించి రక్షణ పొందారు’ అంటారామె. న్యూయార్క్‌లో స్థిరపడ్డ ఈ మహారాష్ట్ర యాక్టివిస్ట్ భారతదేశపు తొలి ‘రేప్ సర్వయివర్’. అవును. తన మీద జరిగిన గ్యాంగ్ రేప్‌ను తన పేరును దాచుకోకుండా మొట్టమొదటిసారి మన దేశంలో బయటకు చెప్పిన మహిళ. ‘రేప్‌కు గురైన స్త్రీలకు నేటికీ మన దేశంలో గొంతు లేదు. వారు తమపై జరిగిన ఘోరాన్ని తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ బయటకు చెప్పే పరిస్థితులు ఈ దేశంలో లేవు’ అంటారు ఆమె. 1980లో గ్యాంగ్ రేప్ సొహైలాకు 17 ఏళ్ల వయసు ఉండగా 1980లో ముంబైలోని ఒక గుట్ట మీదకు మిత్రునితో సాయంత్రపు షికారుకు వెళ్లింది. చీకటి పడుతుండగా నలుగురు వ్యక్తులు కత్తులు చూపించి వాళ్లను మనుషులు తిరగనివైపు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతణ్ణి చావబాదారు. సొహైలాపై సామూహిక అత్యాచారం చేశారు. చంపుదామా వద్దా అని చర్చించుకుని ఎందుకో చంపకుండా వదిలి వెళ్లిపోయారు. ‘వాళ్లు నా శరీరాన్నే అగౌరపరిచారు. నా అస్థిత్వాన్ని, ఉనికిని కాదు’ అంటుంది సొహైలా. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెకు చాలా ధైర్యం ఇచ్చారు. ‘తెలిసిన వారు ఒకరిద్దరు ఇలా ఉండే బదులు చావే నయం’ అని అన్నారు కాని ప్రాణం కంటే శారీరక దాడి విలువైనది కాదు అని అనుకున్నాను. నా జీవితం విలువ నా శరీరంలో లేదు అనుకున్నాను. భవిష్యత్తు మీద విశ్వాసం ఉంచాను. ఇవాళ నాకో కూతురు ఉంది. నా జీవితంలో రుతువులు ఉన్నాయి. నవ్వు ఉంది. ఇవన్నీ నాలా మన దేశంలో రేప్‌కు గురైనవారు పొందడం లేదు. రేప్ అయ్యిందంటే ఇక జీవితమే లేదనుకుంటున్నారు’ అంటుందామె. పుస్తకం రాసి 1983లో సొహైలా తన మీద జరిగిన అత్యాచారాన్ని వివరంగా ఒక హిందీ పత్రికలో రాసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2012లో ‘నిర్భయ’ ఘటన జరిగినప్పుడు తన రేప్ క్షోభను ఆమె న్యూయార్క్ టైమ్స్ ఎడిట్‌లో రాస్తే ఆ పేజీని అంతకుముందు ఎప్పుడూ చదవనంత మంది పాఠకులు చదివారు. 1998 నుంచి సొహైలా రచనలు చేస్తోంది. ఆమె రెండు నవలలు ‘మేడ్ఉమన్ ఆఫ్ జాగోర్’, ‘ఇయర్ ఆఫ్‌ది టైగర్’ పాఠకాదరణ పొందాయి. 2018లో ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం జరుగుతున్నప్పుడు ‘వాట్ వుయ్ టాక్ అబౌట్ వెన్ వుయ్ టాక్ అబౌట్ రేప్’ పుస్తకం విడుదలైంది. రేప్గు గురైన స్త్రీలు తమను తాము కూడగట్టుకోవడం గురించి, సమాజం వారికి ఇవ్వాల్సిన మద్దతు గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. ‘స్త్రీలు ఎవరికీ సొంత ఆస్తులు కాదు’ అంటుంది సొహైలా. ‘పెళ్లి అయినంత మాత్రాన ఆమె భర్త ఆస్తి అయిపోతుందా? ఆమె అనుమతి లేకుండా సాగే మారిటల్ రేప్‌ను ఎలా సమర్థిస్తాం?’ అంటుందామె. అందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తిత్వం సొహైలాది. ‘రేప్’ గురించి ఆమె రాసిన పుస్తకం తప్పక తెలుసుకోదగ్గది. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
నీ పుస్తకాలే నీ వ్యక్తిత్వం
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో అల్బెర్టో మాంగ్యుయెల్ని కలవడం ఎవరికైనా చాలా సంతోషాన్నిచ్చే సంగతి. అల్బెర్టో అనేక విధాలుగా గొప్పవాడు. ఇతడు చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఒక బుక్స్టాల్లో పని చేస్తుంటే ప్రఖ్యాత రచయిత బోర్హెస్ వచ్చి (అప్పటికి పుస్తకాలు చదివీ చదివీ ఆయన చూపు పోయింది) అబ్బాయ్... అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి పుస్తకాలు చదివి వినిపించవచ్చు కదా అని అడిగాడట. అల్బెర్టో చాలాసార్లు బోర్హెస్ ఇంటికెళ్లి ఆ పని చేసి వచ్చాడు. ఆ సంగతి విని అసూయపడని వాడు లేదు. బోర్సెస్ని చూడటమే పెద్ద విషయం. ఆయనతో గడపడం ఇంకా. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన అల్బెర్టో వ్యాసకర్త, రచయిత అనే విషయం కన్నా ఆయన పుస్తకాల సేకర్త అన్న విషయమే ఎక్కువమందిని ఆయన వైపు లాగుతుంది. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లో ఒక మారుమూల పల్లెలో తన ముప్పై నలభై వేల పుస్తకాల నడుమ హాయిగా చదువుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకం ‘ది హిస్టరీ ఆఫ్ బుక్ రీడింగ్’ చాలా విలువైనది. ప్రతి ఉత్తమ సాహిత్యాభిలాషీ చదవదగ్గది. ఆయన ఈ ఫెస్టివల్లో చాలా విలువైన విషయాలు చెప్పాడు. వాటిలో కొన్ని... ‘ఎవరికీ పుస్తకం ఇవ్వకండి. అంతగా అయితే కొత్తది కొని కానుకగా ఇవ్వండి. మీ పుస్తకం ఇచ్చారంటే మీరు ఎదుటివ్యక్తిని దొంగతనానికి పురిగొల్పుతున్నట్టే. ఆ పుస్తకం మరి తిరిగి రాదు. నా దృష్టిలో సాహిత్య చరిత్ర అంటే అది రచయితలు నిర్మించిన చరిత్ర కాదు. పాఠకులు నిర్మించిన చరిత్ర. పాఠకులు తమకు ఏ పుస్తకాలు కావాలనుకున్నారో వాటినే నిలబెట్టుకున్నారు. ఆ పుస్తకాలే చరిత్రగా మిగిలాయి. మనం ఎంత ప్రయత్నించినా పాఠకులు కోరనిదే పుస్తకాన్ని నిలబెట్టుకోలేము. ఒక మనిషి తన ఇంట్లో పర్సనల్ లైబ్రరీని తయారు చేసుకున్నాడంటే అతడు దాదాపుగా తన ఆత్మకథ రాస్తున్నట్టే లెక్క. ఆ పుస్తకాల్లో ఏవో కొన్ని స్లిప్పులు దాస్తాడు. రసీదులు దాస్తాడు. ఎవరెవరివో ఫోన్ నంబర్లు నోట్ చేస్తాడు. ఫొటోలు... ఇవన్నీ జ్ఞాపకాలుగా మారి ఒక ఆత్మకథను రచించినంత పని చేస్తాయి. ఇంకా ఏమంటానంటే మీ లైబ్రరీయే మీ ముఖచిత్రం. అంటే మీ పుస్తకాలను చూసి మీ వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు. నేను ఎవరి ఇంటికైనా వెళితే ఆ పెద్దమనిషి పుస్తకాల ర్యాక్‌లో ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారి పుస్తకాలు కనిపించాయనుకోండి... అతడు స్నేహశీలి అని అర్థం చేసుకుంటాను. పాలోకోయిలో పుస్తకాలు కనిపించాయనుకోండి... ఇక మాట్లాడటం అనవసరం అని నిశ్చయించుకుంటాను. (పాలోకోయిలో అధమస్థాయి రచయిత అని అల్బెర్టో ఉద్దేశం). నేను చిన్నప్పటి నుంచి చాలా చదివాను. అలా అని నాకు పేరుంది. పుస్తకాలను చదివినవారిని మాత్రమే నేను గౌరవిస్తాను. ఇంటికి ఆహ్వానిస్తాను. ఏ రాత్రయినా చక్కటి విందు ఏర్పాటు చేయాలంటే నేను ఆహ్వానించదలుచుకునే గొప్ప గొప్ప చదువరులు- ఒకడు బోర్హెస్... రెండు (కవి) రూమీ... మూడు వర్జీనియా వూల్ఫ్. పుస్తకాలంటే ఏం పుస్తకాలు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి చదివి మనం దేనిని మన మెదళ్లలోకి పంపుతున్నామో అప్రమత్తంగా ఉండాలి. ఏది మంచి ఏది చెడు ఇది తెలుసుకునే ఇంగితాన్ని ఇచ్చే పని మనం పుస్తకాలతో చేయాలి. అక్షరాలతో చేయాలి. మతం, జ్ఞానం, అధికారం కంటే మంచి చెడుల విచక్షణ తెలుసుకుని మంచివైపు నిలబడటం నేర్పడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రపంచంలో చాలా హింస తగ్గుతుంది. మనం కొంచెం నాగరికులం అవుతాం. సరిగ్గా జీవించగలుగుతాం’ -
జైపూర్ ఫెస్టివల్‌కు మేరీ కోమ్ డుమ్మా
జైపూర్: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జైపూర్ పర్యటన రద్దు చేసుకున్నారు. తన కూతురికి అనారోగ్యంగా ఉండడంతో ఆమె జైపూర్ సాహిత్య ఉత్సవానికి వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకున్నారు. ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి మేరీ కోమ్ కుమార్తె ఆరోగ్యం క్షీణించిందని, దీంతో మేరీ కోమ్.. జైపూర్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆమె మేనేజర్ జి్మీ లివియన్ తెలిపారు. జైపూర్ సాహిత్య ఉత్సవంలో 'పుల్లింగ్ ద పంచ్' పేరుతో నిర్వహించనున్న విభాగంలో రచయిత అమృత త్రిపాఠితో ఆమె చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సివుంది. మేరీ కోమ్ గైర్హాజరీతో ఆమె పాల్గొనదలిచిన కార్యక్రమం పేరును 'నో మోర్ పంచ్'గా మార్చారు.