జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: హింసించే భర్తకు గుడ్‌బై | Jaipur Literature Festival 2022: Author Meghna Pant on new book Boys Dont Cry | Sakshi
Sakshi News home page

జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: హింసించే భర్తకు గుడ్‌బై

Published Fri, Mar 18 2022 12:19 AM | Last Updated on Mon, Mar 21 2022 1:34 PM

Jaipur Literature Festival 2022: Author Meghna Pant on new book Boys Dont Cry - Sakshi

గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్‌. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె.

మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి  ఆ అనుభవాలతో ‘బాయ్స్‌ డోన్ట్‌ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది.

‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్‌.
 తాను రాసిన నవల ‘బాయ్స్‌ డోన్ట్‌ క్రై’ గురించి జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది.

‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్‌ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె.

 మేఘనా పంత్‌ ముంబైలో చదువుకుంది. ఎన్‌డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది.
‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్‌ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె.

మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్‌ డిజార్డర్‌ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది.

పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్‌ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్‌ అండ్‌ ఏ హాఫ్‌ వైఫ్‌’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్‌ మొదలైతే నాప్‌కిన్‌ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె.


వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్‌ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్‌ గుడ్‌ న్యూస్‌’ నవల ‘బద్నామ్‌ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్‌ డోన్ట్‌ క్రై’ కూడా వెబ్‌ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము.

వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్‌కోర్స్‌.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె.

 ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.
 ‘బాయ్స్‌ డోన్ట్‌ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్‌లో ఉంది. చదవండి.

‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు.
వేదికపై మేఘనా పంత్‌
జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మేఘనా పంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement