Novel
-
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
ఇండియా ప్రయాణం
భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఒక ఆంగ్లేయుడి దృష్టి కోణంలో చూపే నవల ‘ఎ పాసేజ్ టు ఇండియా’. ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన ఇరవయ్యో శతాబ్దపు వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన ఈ రచనకు ఇది శతాబ్ది సంవత్సరం. తన బ్రిటిష్ రాజ్ అనుభవాలతో ఇ.ఎం. ఫార్స్టర్ 1924లో దీన్ని రాశారు. మరాఠా సంస్థానం దేవాస్ సీనియర్లో (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లో భాగం) మూడో తుకోజీరావ్ పవార్ వ్యక్తిగత కార్యదర్శిగా ఫార్స్టర్ 1921–22 మధ్య పనిచేయడమే కాకుండా, అంతకు పదేళ్ల ముందు ఒక ఏడాది పాటు ఇండియాలో పర్యటించారు. ఆ అనుభవాల సారాన్ని నవలకు వాడుకున్నారు. శీర్షికను మాత్రం అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ కవితా సంకలనం ‘పాసేజ్ టు ఇండియా’(1871) ప్రేరణతో తీసుకున్నారు. ఈ నవలను ఎంతోమంది సినిమా తీయాలని ప్రయత్నించినా, ఫార్స్టర్ పడనీయలేదు, సమతూకం తప్పుతారేమోనని! ఆయన చనిపోయాక(1970) అది సాధ్యపడింది. అదృష్టవశాత్తూ టైటిల్లోనే ఇండియా అనే మాటను నవల కలిగివుందనీ, వైభవోపేతమైన ఇండియాను గొప్పగా తెరకెక్కించవచ్చనీ ఉత్సాహపడ్డారు డేవిడ్ లీన్ . ‘ఎ పాసేజ్ టు ఇండియా’ పేరుతోనే, నవల వచ్చిన సరిగ్గా 60 ఏళ్ల తర్వాత 1984లో సినిమా వచ్చింది. ఆ సినిమాకు కూడా ఇది నలభయ్యో సంవత్సరం. నల్లవాళ్లను చీవాట్లు పెట్టడం అతి మామూలు వ్యవహారంగా ఉండిన కాలం. మీదకు కారును తోలినా పశ్చాత్తాపం ప్రకటించాల్సినంతటి మనుషులు వీళ్లు కాదన్న అహంకారం తెల్లవాళ్లలో ఉన్న కాలం. ‘సామాజిక మేళనం’ అర్థంలేనిది అనుకునే కాలం. ‘వాళ్లందరూ ముందు పెద్ద మనుషులుగా ఉందామనే వస్తారు... అందరూ ఒకేలా తయారవుతారు; చెడ్డగా కాదు, మెరుగ్గా కాదు. నేను ఏ ఆంగ్లేయుడికైనా రెండేళ్లు ఇస్తాను... ఆంగ్ల మహిళకైతే ఆరు నెలలే’ అంటాడు డాక్టర్ అజీజ్. అయినా వాళ్లను ఆరాధించకుండా ఉండలేకపోవడం భారతీయుల బలహీనత అని అతడికి తెలుసు. అలాంటి కాలంలో అజీజ్‌తో స్నేహంగా ఉంటాడు హెడ్మాస్టర్ ఫీల్డింగ్. అజీజ్ తబ్బిబ్బయి పోతే, అదొక పెద్ద విషయంగా భావించడమే అర్థం లేనిదంటాడు. భార్య చనిపోయాక, ఇద్దరు పిల్లల్ని ఊళ్లో తల్లిదండ్రుల దగ్గర ఉంచి, సంపాదనంతా వాళ్లకే పంపుతుంటాడు అజీజ్. తనకు మించిన భారం అయినప్పటికీ తమ చంద్రాపూర్ పట్టణానికి వచ్చిన మిసెస్ మూర్, ఆమె యువ స్నేహితురాలు అడెలాను ‘మరబార్’ గుహల పర్యటనకు తీసుకెళ్తాడు అజీజ్. గుహలంటే అలాంటిలాంటివి కావు. ఎత్త్తైనవీ, చీకటైనవీ, నిర్జనమైనవీ. పరివారము, క్యాంపులు, ఖర్చులు! సిటీ మ్యాజిస్ట్రేట్ అయిన మూర్ కొడుక్కీ అడెలాకూ నిశ్చితార్థం అయివుంటుంది. తీరా అన్నీ ఒకేలా కనబడే ఆ చీకటి గుహల్లో, ఎండ మండిపాటులో, గుండె చప్పుడు సైతం ప్రతిధ్వనించే చోట మిసెస్ మూర్ అనారోగ్యం పాలవడమూ... విధిలేని పరిస్థితుల్లో అడెలా, అజీజ్ ఇద్దరే లోపలికి దారితీయడమూ, ఆ ఇరుకులో, ఆ గందరగోళంలో, ఆ భయంలో అజీజ్ తన మీద అత్యాచారం చేయబోయాడని రక్తమోడుతుండగా అడెలా కిందికి పరుగెత్తుకురావడమూ... తెల్లమ్మాయి మీద నల్లవాడి చేయా? ఆంగ్లేయులు పళ్లు కొరుకుతారు. నల్లవాడి మీద కేసు బనాయింపా? జనాలు వీధుల్లోకొస్తారు. కోర్టు కేసు సంచలనం అవుతుంది. ఇరుపక్షాలూ నిలబడి కలబడటమే తరువాయి! కథ ఏ బిందువు దగ్గర వచ్చి ఆగుతుంది, అక్కడి నుంచి పాత్రలు ఎలా పరిణామం చెందుతాయన్నది ఇందులో ముఖ్యం. తెల్లవాడికీ, నల్లవాడికీ మధ్య స్నేహం నిలబడుతుందా? ఒక పక్షం వహించని సమదృష్టి సాధ్యమేనా? వీటన్నింటిని మించిన మానవీయ విలువంటూ ఉండగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో మౌనంగా జవాబు దొరుకుతుంది. గుహల్లోకి ప్రవేశించినప్పటి నుంచీ తన తలలో మొదలైన హోరు వల్ల అడెలా స్థిరంగా ఉండలేదు. పొరబడ్డానేమో అని కేసు ఉపసంహరించుకున్నాక హోరు పోతుంది. ప్రతి తెల్లమనిషిలోనూ గుబులు రేపుతున్న భారతీయుల స్వాతంత్య్రోద్యమపు నినాదాల హోరుకు సంకేతంగా దీన్ని తీసుకోవచ్చేమో! కేసు ఉపసంహరణ తర్వాత అడెలా ఇరవై వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నిశ్చితార్థం రద్దవుతుంది. అంత జరిమానా కట్టాలంటే అడెలా సర్వనాశనమై పోతుందనీ, దాన్ని ఉపసంహరించుకొమ్మనీ కోరినప్పుడు రెండు పక్షాలకూ హీరోగా నిలిచే డ్రామా ఆడుతున్నావని ఫీల్డింగ్‌ను నిందిస్తాడు అజీజ్. కేసు వల్ల పోయిన తన ప్రతిష్ఠ మాటేమిటని నిలదీస్తాడు. తెల్లవాళ్ల మెహర్బానీ కోసం జెంటిల్మన్ గా ప్రవర్తించాల్సిన అవసరం లేదనీ, వాళ్లతో కరాఖండిగానే వ్యవహరించడం తప్పదనీ అనుకుంటాడు. ‘దయ, మరింత దయ, ఆ తరువాత కూడా మరింత దయ’ను మాత్రమే ఫార్స్టర్ నమ్మారు. ‘నా దేశాన్ని మోసం చేయడమా, నా స్నేహతుడిని మోసం చేయడమా అని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నా దేశాన్ని మోసం చేసే ధైర్యం నాకుంది’ అన్నారు. భారతీయులు పుట్టుకతో తాత్వికులు; రిక్షాను లాగేవాళ్లు కూడా కర్మ, పునర్జన్మల గురించి మాట్లాడుతారని మురిసిపోయారు. ఉర్దూ, హిందీ భాషలంటే ఇష్టపడే ఫార్స్టర్ హైదరాబాద్‌లోని ఉర్దూ హాల్ నిర్మాణానికి విరాళమిచ్చారు. ఆ గుహల్లో నిజానికి ఏం జరిగిందనేది నవల లోపల గానీ, బయట గానీ ఎప్పుడూ ఆయన వెల్లడించలేదు. అర్థవంతమైన మర్మం. ‘మనం ఎన్ని మానవ ప్రయత్నాలైనా చేయొచ్చు, కానీ ఫలితం ముందే నిర్ణయమైవుంటుంది’ అంటాడు నవలలో ప్రొఫెసర్ గోడ్బోలే. అడెలా ఇండియాకు రావడం కూడా అందులో భాగమేనన్నది ఆయన భావన. ఫార్స్టర్ ఇండియాకు వచ్చినప్పుడే ఈ నవల పుట్టుక నిశ్చితమైవుంటుంది! -
మూడు దారులు..! ఎన్నో గుర్తులు..!!
"నడిచి పోయిన చరిత్రను రాయడం చాలా సులభం. నడుస్తున్న చరిత్రను రాయడం చాలా కష్టం. గతకాలపు చరిత్ర ఆకారాలు కష్టపడి సంపాదించాలి. అవి దొరికితే చరిత్ర రాయడం సులభం. వాటిని అధ్యయనం చేసి, వివరించి, ఒక నిర్ణయానికి రావడం, కొన్ని సూత్రీకరణలు చేయడం సులభం. ఆచరిత్ర నిర్మాతలు మన కళ్ళముందు ఉండరు. ఆ పాత్రలు మనతో మాట్లాడవు. మనం రాసింది వాళ్ళు చూడరు. నడుస్తున్న చరిత్రకు ఆకారాలు అపారంగా దొరుకుతాయి." ఆ చరిత్ర నిర్మాతలు మనకళ్ళముందు కదలాడుతుంటారు. మనతో మాట్లాడుతుంటారు. కలిసి జీవిస్తుంటారు. ఈ చరిత్రను తెలిసిన వాళ్ళుకూడా మన చుట్టూ ఉంటారు. ఈ ఆకారాలను ఏరుకొని, అధ్యయనం చేసి, వివరించి, సూత్రీకరించడం చాలా కష్టం. చారిత్రక వాస్తవాలు ఉటంకించడం సులభం. వాటిని వ్యాఖ్యానించడం కత్తిమీద సాము వంటిది. గత చరిత్ర రాసినవాళ్ళకు ఏ ప్రశ్నలూ ఎదురుకావని కాదు. అయితే వాటికి సమాధానం చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్ర రాసినవాళ్ళకు చాలా ప్రశ్నలు ఎదురౌతాయి. వాటికి సమాధానాలు సమకూర్చుకోవడం అదనపు శ్రమ. గత చరిత్రను రాయడంలో విషయలోపమున్నా, విధానంలోపమున్నా అనంతరకాలంలో సవరించుకోవచ్చు. నడుస్తున్న చరిత్ర రచనలో ఆ రెండు లోపాలు ఉంటే సమాజంలో తక్షణస్పందన రచయితను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నడిచి పోయిన చరిత్రతో చరిత్ర రచయితకు సయోధ్య లేకపోయినా చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్రతో రచయితకు సయోధ్య కుదరని సందర్భాలను వ్యాఖ్యానించడం అంత సులభం కాదు. సృజనసాహిత్యంలోనైతే రచయిత కల్పనను గొప్ప ఆయుధంగా వాడుకొని గట్టెక్కవవచ్చు. చరిత్ర రచనలో కల్పనకు అవకాశమే లేదు. చరిత్రలో రచయిత చరిత్రంతా చెప్పాలి. చరిత్ర తప్ప ఇంకేమీ చెప్పకూడదు. దేవులపల్లి అమర్ గారు ఇవన్నీ తెలిసినవారు. ఆయన రాసిన "మూడు దారులు" నడుస్తున్న చరిత్ర. ఆ చరిత్రకు కారకులు మనందరికీ తెలిసినవారు. మనం చూసిన వాళ్ళు. మన ముందు ఉండినవారు, ఉన్నవారు. వాళ్ళ సమాచారం గుట్టలకొలదీ లభిస్తున్నది. అమర్ గారు ఆ సమాచారం గుట్టలు తవ్వి తాను రాయదలచుకున్న చరిత్ర రచనకు అవసరమైన అంశాలను జాగ్రత్తగా ఎన్నుకొని వాస్తవిక దృక్పథంతో ఈ రచన చేశారు. వాస్తవాల విజ్ఞానం, వాస్తవిక దృష్టి, వాస్తవాభివ్యక్తినిబద్ధత, నిస్సంకోచం ఈ గ్రంథంలోని విశేషాలు. నాలుగున్నర దశాబ్దాలలో తెలుగునాట రాజకీయరంగాన్ని నడిపిన ముగ్గురి జీవితాల వ్యాఖ్యానం ఈ గ్రంథం. చరిత్రకారులు మేధావులు. సద్దలు తిని సద్దలు విసర్జించరు. సామాజిక వాస్తవాలను జీర్ణించుకొని సామాజిక వాస్తవికతను మనకందిస్తారు. అమర్ గారు ఈ పని ఫలవంతంగా చేశారు. చరిత్రలో రచయిత ఆమోదించే అంశాలు చెప్పడం సులభం. ఆమోదం లేని అంశాలను చెప్పడానికి చిత్తశుద్ధి ఉంటే చాలదు. నిజాయితీ ఉండాలి. దానికి మించి ధైర్యం ఉండాలి. ధైర్యం ఎందుకంటే అనామోద ఆంశాలను చెప్పినప్పుడు అనేక పార్శ్వాలనుండి అనేక సవాళ్ళు ఎదురౌతాయి. వాటికి సమాధానం చెప్పడానికి, వాటిని ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం. అమర్గారిలో ఈ గుణాలు ఉన్నాయి. చరిత్రలో చరిత్ర రచయిత ఆమోదించినవీ, ఆమోదించనివీ ఆ రచయిత వ్యక్తిగత అభిరుచులుగా ఉండకూడదు. వాటికి కూడా ఒక హేతుబద్ధత, ప్రామాణికత ఉండాలి. అవి సామాజిక సత్యాలని రుజువుచేసే సత్తా చరిత్రకారునికుండాలి. అమర్ గారిలో అవి ఉన్నాయి. 1978లో తెలుగు నాట రాజకీయ రంగప్రవేశం చేసిన డా. వై యస్ రాజశేఖరరెడ్డిగారు, నారా చంద్రబాబు నాయుడుగారు, వాళ్ళ తర్వాత 2004లో రాజకీయాల్లోకి వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డిగారు.. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను, జీవితాలను, పాలనా విధానాలను మూడు దారులుగా నిర్వచించి, విస్తరించి రాశారు అమర్ గారు. రాజకీయాలలో విశ్వసనీయతా విశ్వసనీయతలు, నిబద్ధానిబద్ధతలు ఎలా ఉంటాయో రుజువు చేశారు. ప్రజాస్వామ్యయుగంలోకూడా భూస్వామ్య యుగ రాజకీయ స్వభావం, ఎత్తుగడలు ఎలా కొనసాగుతున్నాయో అమర్ గారు చక్కగా వివరించారు. సాధారణంగానే రాజకీయ చరిత్ర ఎత్తుగడలు మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎత్తుగడలు ప్రజానుకూలంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో, ప్రజావ్యతిరేకంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో అమర్‌గారు దృష్టాంతాలుతో స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వ్యాపారబుద్ధి చొరబడితే పాలన ఎంత ప్రజాకంటకంగా ఉంటుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా అమర్‌గారు నిరూపించారు. చరిత్రకారునికి విషయం పరిజ్ఞానం ఉండడం ఎంత ముఖ్యమో, విషయ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం. అమర్గారిలో ఈ రెండు శక్తులు సమానస్థాయిలో ఉన్నాయి. మూడు దారులు గ్రంథం చదువుతుంటే నాలుగున్నర దశాబ్దాల తెలుగు నేల చరిత్ర మీద వచ్చిన ఒక నవలను చదువుతున్న అనుభవం, అనుభూతి కలుగుతాయి. సామాన్య పాఠకులకు కూడా వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ గ్రంథం సులభంగా తెలియజేస్తుంది. – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
నవల రాసిన 13 ఏళ్ల అమ్మాయి.. త్వరలో ఇది సినిమాగా రిలీజ్
సినిమాల్ని చాలావరకు కథలు, నవలల ఆధారంగానే తీస్తుంటారు. అయితే అనుభవజ్ఞులైన రైటర్స్ రాసిన నవలల ఆధారంగా ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓ 13 ఏళ్ల అమ్మాయి రాసిన 'బటర్ ఫ్లై' నవలని సినిమాగా తీయబోతున్నారు. హైదరాబాద్‌కి చెందిన సైరా తన పదేళ్ల వయసులోనే ఈ బుక్ రాసింది. అది కూడా విడాకుల కాన్సెప్ట్ గురించి. ఇప్పుడు దాన్నే ఓ నిర్మాణ సంస్థ.. సినిమాగా తీయబోతుంది. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) ఈ అమ్మాయి రెండో క్లాసులో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ నోటి నుంచి ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారనేది మాట విన్నది. ఆ తర్వాత కూడా క్లాస్మేట్స్ పేరెంట్స్ విడిపోవడం గురించి వింటూ వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల పిల్లలు ఎలా మదనపడుతున్నారనేది ఓ పుస్తకంగా రాసింది. ఈ మధ్యే జనవరి 26-28 వరకు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లోనూ సైరా పాల్గొంది. ఈ నవల గురించి మాట్లాడిన సైరా తల్లి.. ఈ నవలని సినిమాగా తీయడానికి పలు నిర్మాణ సంస్థ తమని సంప్రదిస్తున్నాయని చెప్పింది. అంటే ఈ నవల.. త్వరలో సినిమాగా రాబోతుందనమాట. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) -
నవల రాసిన ప్రముఖ డైరెక్టర్.. ఆవిష్కరించిన దిగ్గజ నటుడు
సాధారణంగా రచయితలు దర్శకులుగా మారిన తర్వాత తిరిగి వెనక్కి చూసేది చాలా తక్కువ. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తిరిగి రైటర్ అయిపోయారు. ఏకంగా ఓ నవల కూడా రాసేశారు. దీన్ని పలువురు సెలబ్రిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆసక్తికకరంగా మారిపోయింది. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) బాలీవుడ్లో 'కాల్', 'లక్', 'ఫిక్సర్' సినిమాలు తీసిన దర్శకుడు సొహమ్ షా.. ప్రస్తుతం సినిమాలే చేయట్లేదు. అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ 'బ్లడ్ మూన్' అనే నవలతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కరోనా కాలంలో చూసిన కొన్ని పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని, పారానార్మల్ థ్రిల్లర్ కథతో ఈ నవలని రాసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆవిష్కరించారు. ఇదే ఈవెంట్లో అనుపమ్ ఖేర్‌తో పాటు జాకీ ష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వీళ్లిద్దరూ కూడా సొహమ్ షాతో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే ఈ బుక్ లాంచ్ చేయడం తను గౌరవంగా భావిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో పని చేసింది!) -
‘చాట్‌జీపీటీ అద్భుతం చేసింది’, యువతికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్!
చాట్‌జీపీటీ! టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీనిపేరే వినబడుతుంది. అంతకు మించి జాబ్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకోవడంతో.. అత్యంత కీలక రంగమైన టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలన్నీ చాట్‌జీపీటీని వినియోగిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో చాట్‌జీపీటీ పేరు వింటేనే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనను పక్కన పెట్టేసి..దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చని అంటుంది ఓ యువతి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశం టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే? అకుటగావా అవార్డు ప్రధానం జపాన్‌కు చెందిన రీ కుడాన్ 33 ఏళ్ల సాహితి వేత్త (Literary scholar). ఇటీవల ఆమె సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన జపాన్ సాహిత్య పురస్కారం ‘అకుటగావా’ అవార్డును సొంతం చేసుకున్నారు. అకుటగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరిచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రధానం చేస్తుంది. తాజాగా, అకుటగావాను టోక్యో-టు డోజో-టు (టోక్యో సానుభూతి టవర్) పేరుతో నవల రాసిన రచయిత్రి కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. చాట్‌జీపీటీతో అద్భుతాలు ఈ నేపథ్యంలో కుడాన్ తాను రాసిన నవలకు అవార్డును సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఏఐ టూల్ చాట్ జీపీటీతో ఇది సాధ్యమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాట్‌జీపీటీ ఉపయోగించి రాసిన నవల. ఇందులో మొత్తం 5 శాతం మాత్రమే నేరుగా రాసింది. వర్క్ ప్రొడక్టివిటీ విషయంలో, నాలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు చాట్‌జీపీటీని మరింతగా వినియోగించాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ప్రశంసలు.. విమర్శలు కుడాన్ నవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఏఐని ఉపయోగించి తాను ఈ నవల రాసినట్లు బహిర్గతం చేయడం వివాదాస్పదంగా మారింది. సాహిత్యంతో పాటు ఇతర అత్యున్నత పురస్కాల కోసం ఏఐని ఉపయోగించేందుకు రచయితలు పోటీపడతారేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇప్పుడు జపాన్ రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీని ఉపయోగించే రాసే రచనలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ అంశంపై జపాన్ ప్రభుత్వంతో పాటు కుడాన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. -
చీకట్లో చిరుదీపం! ఆ యాక్సిడెంట్ ఓ కొత్త బంధాన్ని..
‘ఫ్లైట్‌లో భలే ఉంది డాడీ! ఇప్పుడు జుయ్య్ మంటూ పైకి ఎగిరి పోతుందా? మబ్బుల్లోకి దూరిపోతుందా? మనం మబ్బులను తాకవచ్చా?’ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పింకీ. ‘ఫ్లైట్ పైకి ఎగిరిపోతుంది కానీ మనం మబ్బులను తాకలేము. నువ్వు అల్లరి చేయకుండా కూర్చోవాలి. లేకపోతే ఎయిర్ హోస్టెస్ నిన్ను కిందకు దింపేస్తుంది’ అన్నాడు వశిష్ట. ‘అమ్మా! మనం అమెరికా వెళ్ళగానే జార్జ్ మామయ్య ఎయిర్ పోర్ట్‌కి వచ్చి మనల్ని తీసుకెళ్తారా? ఒకవేళ మామయ్య రాకపోతే మనం ఏం చేద్దాం?’ సందేహంగా అంది పింకీ.‘జార్జ్ మామయ్య తప్పకుండా వస్తాడు పింకీ!’ నమ్మకంగా అన్నాను. ‘లేఖా! ఎప్పుడయినా ఇలా అమెరికా వెళ్తాము అని అనుకున్నామా?’ ఆనందంగా అన్నాడు వశిష్ట. ‘అలాంటి పగటి కలలు కనే అలవాటు మనకు లేదు కదండీ! మనం ఊహించనిది జరగడమే జీవితం’ నవ్వుతూ అన్నాను. అంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ప్రయాణికులు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా వాళ్ళను అనుసరించాం. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్ది రోజుల వెనక్కి వెళ్ళాను. ∙∙ నేను ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తున్నాను. ఆస్పత్రికి వెళ్ళే దారిలో రైల్వే పట్టాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్తే దారి కలిసి వస్తుందని ఎక్కువగా అటువైపు నుండే నడిచి వెళ్తాను. ఆలస్యం అయినరోజు చుట్టూ తిరిగి ఆటోలో వెళ్తాను. సరిగ్గా రైల్వే పట్టాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జనం గుమిగూడి కనిపించారు. ఏమైందోనని జనం మధ్యలో నుండి తొంగిచూశాను. ‘ఎవరో ఒక యువకుడు పడిపోయి ఉన్నాడు. తలకు కట్టు కట్టి ఉంది. బట్టలన్నీ చినిగిపోయి అర్ధనగ్నంగా ఉన్నాడు. ఆ అబ్బాయి మా ఆస్పత్రిలో నిన్నటి దాకా ఉన్న పేషెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. బయటకు ఎలా వచ్చాడు? ఎప్పుడు స్పృహ వచ్చిందో? నుదుటి మీద దెబ్బలున్నాయి. ఎవరో రాళ్లతో కొట్టినట్లున్నారనుకుని, గబగబా దగ్గరకు వెళ్ళి చూశాను. స్పృహలోనే ఉన్నాడు కానీ మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి అతన్ని మళ్ళీ ఆస్పత్రిలో చేర్పించాను.. చికిత్స కోసం! సరిగ్గా ఒక పదిహేను రోజుల క్రితం ఆ ప్రాంతంలోనే ఒక రైలు పట్టాలు తప్పి పడిపోయింది. ఆ ప్రమాదంలో దెబ్బలు తగిలిన వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చాలామందికి చిన్న చిన్న గాయాలే అయ్యాయి. ప్రాణనష్టం జరగలేదు. కానీ పది మందికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. అందులో తొమ్మిది మంది సమాచారం వాళ్ళ వాళ్లకు చేరింది. కానీ ఒకే ఒక యువకుడి తాలూకు అడ్రస్ మాత్రం తెలియలేదు. అతని దగ్గర బ్యాగ్ కానీ, ఫోన్ కానీ.. అతని ఉనికిని తెలిపే ఏ వస్తువు కానీ లేవు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నిన్నటి వరకు పూర్తి స్పృలో కూడా లేడు. ‘అతను బయటకు ఎలా వెళ్ళిపోయాడు?’ అంటూ డాక్టర్ గారు స్టాఫ్ అందరినీ గట్టిగా కేకలు వేశారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చిందని మీడియాకి సమాచారం అందించారు. కాంపౌండర్‌కి చెప్పి అతని బట్టలు మార్పించి గాయాలు తుడిచి కట్టు మార్చి, మందులు వేశాను. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు. అసలు మనం మాట్లాడేది అర్థం అవుతోంది లేనిది కూడా తెలియడం లేదు. ‘బహుశా తలకు తగిలిన దెబ్బ వల్ల మాట పోయిందా? లేక మతి భ్రమించిందా? అసలు చెవులు వినబడుతున్నాయా? లేదా?’ అనుకున్నాను. ‘శ్రీలేఖా.. ఏక్సిడెంట్తో ఇతను షాక్‌లోకి వెళ్లినట్లున్నాడు. వాళ్ల వాళ్లు వచ్చే వరకు మనమే టేక్ కేర్ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు డాక్టర్ గారు ఆ యువకుడిని పరీక్షించాక. ∙∙ మీడియా వచ్చి అతని ఫొటోస్ తీసుకొని.. వివిధ రకాల ప్రశ్నలు వేసింది. అతడి నుండి ఎటువంటి సమాధానమూ రాకపోయేసరికి నిరాశతో వెనుదిరిగింది. ‘నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిహేను రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడికి రెండు రోజుల క్రితమే స్పృహ వచ్చిందని డాక్టర్ గారు సమాచారం ఇచ్చారు. అతను షాక్‌కి లోనయి ఉండటం వల్ల మాట్లాడటం లేదు. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగలరు.’ అంటూ పేపర్లో వార్తగా వచ్చింది ఆ యువకుడి విషయం. రెండు.. మూడు.. వారం రోజులు గడిచాయి. ఎవరూ రాలేదు. అతడు ఎవరితో మాట్లాడటం లేదు. తిండీ తినడం లేదు. ఎవరయినా పలకరించినా అలా చూస్తూ ఉంటున్నాడు. కానీ సమాధానం చెప్పడం లేదు. డ్యూటీలోకి రాగానే ముందు అతడిని చూడటం.. అలాగే డ్యూటీ నుండి వెళ్లిపోయే సమయంలో నైట్ డ్యూటీ స్టాఫ్‌కి అతడి గురించిన జాగ్రత్తలు చెప్పి వెళ్లడం నా దినచర్యలో భాగమైంది. ఒకరోజు డాక్టర్ గారు రొటీన్ చెకప్‌లో భాగంగా ఆ అబ్బాయిని చూసి.. ‘శ్రీలేఖా.. అతని తాలూకు ఎవరూ రావడం లేదు కదా! మనం మాత్రం ఎన్నాళ్లని అతని బాధ్యత తీసుకోగలం? అందుకే డిశ్చార్జ్ చేసేద్దాం’ అన్నారు. ‘సర్.. అతనికి ఆకలి, దాహం కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో బయటకు పంపిస్తే ఎలా? అతని వల్ల మనకు సమస్యేమీ లేదు కదా! ఇంకొన్నాళ్లు చూద్దాం సర్’ అన్నాను రిక్వెస్టింగ్ ధోరణిలో. ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు. ∙∙ ఒకరోజు ఉదయం నేను వచ్చేసరికి నర్సు కమల అతని మీద అరుస్తోంది. ‘ఏమైంది కమలా.. ఎందుకు కోప్పడుతున్నావు?’ అడిగాను కంగారుగా. ‘ఇతను తిండి తిని రెండు రోజులు అవుతోంది మామ్! ఎంత చెప్పినా మెతుకు ముట్టడు. కాంపౌండర్ అన్న వచ్చి స్నానం చెయ్యమంటే చేస్తాడు. రెండు జతల బట్టలు ఆస్పత్రిలో ఉంటే ఇచ్చాం. అవి ఉతుక్కోమంటే మా ముఖాలు చూస్తాడు. వినపడదో.. చెప్పింది అర్థంకాదో తెలీట్లేదు. ఈ గోల ఎక్కడ పడం మామ్.. పంపించేస్తే సరిపోతుంది కదా!’ అంది కమల. అతని వైపు చూశాను. ముఖం కిందకు దించుకొని చూడసాగాడు. నేను దగ్గరకు వెళ్లి అక్కడున్న ఇడ్లీ ప్లేటు అతని ముందుకి జరిపి అక్కడే కూర్చున్నాను. ఒక ముక్క తుంపి అతని చేతికి ఇచ్చి ‘తీసుకో! తిను’ అన్నాను మెల్లిగా. కాసేపు అలాగే చూసి ఇడ్లీ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలాగే నెమ్మదిగా మొత్తం తినేశాడు. నేను తెచ్చుకున్న అరటి పండునూ ఇచ్చాను నా బ్యాగ్‌లోంచి తీసి. మౌనంగానే ఆ అరటి పండునూ తిన్నాడు. ‘మామ్! ఎవరం ఎంత చెప్తున్నా అతను వినడం లేదు. తిండి తినడం లేదు. కానీ మీరు చెప్పగానే భలే తినేశాడే! అలాగే అతను శుభ్రత విషయంలోనూ కాస్త సాయం చేద్దురూ.. ’ అంది కమల నవ్వుతూ. ‘సరే, ప్రయత్నిస్తాను కమలా!’ అని.. కాంపౌండర్ గోపిని పిలిచాను. ‘గోపీ.. ఇతన్ని స్నానానికి తీసుకెళ్లు. తర్వాత ఓ రెండు నైట్ డ్రెసెస్ కొనుక్కురా. ఆ.. సాయంత్రం నీ డ్యూటీ అయ్యాక సెలూన్‌కి తీసుకెళ్లు. అతని మానాన అతన్ని వదిలేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకో. నేను డాక్టర్ గారికి చెప్తాను’ అని పురమాయిస్తూ నా బ్యాగ్‌లో నుండి డబ్బులు తీసి గోపి చేతిలో పెట్టాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆసుపత్రిలో జరిగినదంతా మా ఆయనతో చెప్పాను. ‘లేఖా! అతను ఎవరో అనాథై ఉండాలి. లేకపోతే ఏక్సిడెంట్ జరిగి ఇన్నాళ్ళయినా అతని కోసం ఎవరూ రాకపోవడం ఏంటీ! నువ్వు చెప్పేది వింటున్నాడు అంటే కచ్చితంగా మూగవాడు అయ్యుండడు. ఏదో ఒకరోజు నార్మల్ అవుతాడులే’ ప్రోత్సహకరంగా మాట్లాడాడు వశిష్ట. హోమ్‌వర్క్ చేస్తున్న పింకీ ‘అమ్మా.. అమ్మా!’ పిలిచి.. నా అటెన్షన్ తన మీద పడగానే తన చేతిలో ఉన్న నోట్‌బుక్‌ను చూపిస్తూ..‘నా పేరును కలరింగ్ చేసి తీసుకు రమ్మన్నారు మా టీచర్. చూడు బాగుందా?’ అంది. ‘చాలా బాగుంది’ అంటూ పింకీని ముద్దు పెట్టుకొని కిచెన్‌లోకి వెళ్లాను. పింకీ పేరు చూడగానే నాకు మళ్లీ అతను గుర్తొచ్చాడు. అతని పేరు ఏంటీ? ఎలా తెలుసుకోవడం? ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే అతను ఎదురొచ్చాడు. గోపి అతనికి క్రాఫ్, గడ్డం చేయించినట్లున్నాడు. ముక్కు, ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్టలు కూడా కొత్తవి వేసుకున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే చదువురాని వాడిలా అనిపించడం లేదు. నన్ను చూసి చెయ్యి చాపాడు. నాకు ముందు అర్థం కాలేదు.. తరువాత అర్థమయింది. బ్యాగ్‌లో నుండి అరటి పండు తీసి ఇచ్చాను. తిన్నాడు. అంటే నిన్న నేను అరటిపండు ఇచ్చింది గుర్తుందన్నమాట! సాయంత్రం డ్యూటీ పూర్తి అయ్యాక అతని కోసం వెతికాను. పేషంట్స్ ఉండే రూమ్స్‌లో ఒక చోట కూర్చొని ఉన్నాడు. లోపలికి వెళ్లాను. నన్ను చూశాడు. కానీ నవ్వలేదు. ముఖం మాత్రం ప్రసన్నంగా మారింది. బయటకు రమ్మని సైగ చేశాను. కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని నాతో తెచ్చుకున్న పుస్తకం మీద ‘శ్రీ లేఖ’ అని తెలుగులో, ఇంగ్లిష్‌లో, హిందీలో రాశాను. ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో అతను నా కుర్చీ దగ్గర.. నేను రాసేది చూస్తున్నాడు. గమనించీ గమనించనట్టుండిపోయా. నా చేతిలో ఉన్న పెన్ను ఇవ్వమని చెయ్యి చాపుతూ ఏదో అన్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. యాసతో వచ్చిన మాట! స్పష్టత లేదు. కానీ మొదటిసారి అతను నోరు తెరిచాడు. అతనికి పెన్ను ఇచ్చాను. నా చేతిలోని పుస్తకం తీసుకున్నాడు. దాని మీద ‘జార్జ్’ అని రాశాడు ఇంగ్లిష్‌లో. ఆ నిముషంలో నాకు ఎగిరి గంతులు వేయాలి అన్నంత సంతోషం కలిగింది.. నా ఆలోచన సరిగ్గానే పని చేసిందని! ‘జార్జ్’ అతని పేరు అయ్యుంటుంది. ఇక ఇతర వివరాలు తెలియాలి. పెన్నును పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైలు ఏక్సిడెంట్ అయిన రోజు నుండి వచ్చిన న్యూస్ పేపర్లు అన్నీ అటెండర్‌తో తెప్పించాను. ఎక్కడ కూడా జార్జ్ అన్న పేరుతో ఒక్క వార్తా లేదు. గాలిలోకి బాణం వేస్తున్నానేమో అనిపించింది. అంతలోనే నా దృష్టి ‘హైదరాబాద్‌లో విలియమ్స్ అనే ఓ విదేశీయుడు అమీర్‌పేట్‌లోని ఒక స్టార్ హోటల్లో రాత్రివేళ రూమ్ తీసుకొని మరుసటి రోజు ఉదయం లాక్ చేసుకొని బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. అతను ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా అందుబాటులో లేదు. హోటల్ వాళ్ళు మారు తాళం చెవితో రూమ్ తెరిచి చూస్తే అతని బట్టల సూట్‌కేస్ ఉంది. అవి అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు’ అన్న చిన్న న్యూస్ మీద పడింది. ఈ వార్తకు, జార్జ్‌కి ఏదయినా సంబంధం ఉందేమో అనిపించింది ఎందుకో! రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను దాని గురించి. నా అనుమానాలన్నిటినీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక వశిష్ట దగ్గర వెలిబుచ్చాను. ‘నువ్వు నర్సు ఉద్యోగం మానేసి సీఐడీలో చేరితే బాగుంటుందేమో!’ అన్నాడు నవ్వుతూ వశిష్ట. ‘అలా ఎగతాళి చేయకండీ! ఆ అబ్బాయి చూస్తే తమ్ముడిలా అనిపిస్తున్నాడు. అతనికంటూ ఒక కుటుంబం ఉండుంటే.. అతను ఇలా జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల తన వాళ్లను చేరుకోలేక.. అనాథలా మిగిలిపోతాడేమో!’ అన్నాను బాధగా. ‘హోటల్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫోన్ చేసి చూద్దాం!’ అన్నాడు వశిష్ట నన్ను అనునయిస్తూ. గూగుల్‌లో హోటల్ నంబర్ చూసి రిసెప్షనిస్ట్‌తో మాట్లాడాడు వశిష్ట..‘మామ్! మేము నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం. పేపర్లో మీరు ఇచ్చిన వార్త చూశాం. మొన్న ఇక్కడ జరిగిన రైలు ఏక్సిడెంట్లో ఒక వ్యక్తి గతం మరచిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. అతనికీ, మీ హోటల్ నుండి మాయమైన విలియమ్స్కీ ఏదయినా సంబంధం ఉందేమోనని ఫోన్ చేశాను’ అంటూ. రిసెప్షనిస్ట్ మేనేజర్‌కి కనెక్ట్ చేసింది. మేనేజర్ కూడా వెంటనే స్పందించాడు. ‘విలియమ్స్ వచ్చిన రోజు సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఆయన ఫొటోను పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఇచ్చాం. అది ఒకటి నా దగ్గరా ఉంది. మీ నంబర్‌కి వాట్సప్ చేస్తాను’ అని చెప్పి.. మరికొద్ది సేపట్లోనే విలియమ్స్ ఫొటోను వశిష్టకు వాట్సాప్ చేశాడు హోటల్ మేనేజర్. అందమైన ఓ పాతికేళ్ల యువకుడు.. చేతిలో ఒక లెదర్ సూట్ కేస్, క్యాబిన్ బ్యాగ్‌తో ఉన్న ఫొటో అది. పరీక్షగా చూస్తే అతనిలో జార్జ్ పోలికలు కనిపించాయి. ‘అతనే ఇతను!’ ఆనందంగా అరిచాను. ‘అయితే నీకు సీఐడీ పదవి గ్యారంటీ’ నవ్వుతూ అన్నాడు వశిష్ట. ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే మా చీఫ్ డాక్టర్ గారికి విలియమ్స్ ఫొటో చూపించి జరిగిందంతా చెప్పాను. ఆయన నిజామాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కి కాల్ చేసి సమాచారం అందించారు. వాళ్ళు అంతా విన్నాక అమీర్‌పేట్ పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్న జార్జ్ లగేజ్ నిజామాబాద్‌కి పంపించే ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు హైదరాబాద్ నుంచి పోలీసులు లగేజ్‌తో ఆస్పత్రికి వచ్చారు. జార్జ్‌ని తీసుకురమ్మని అటెండర్‌కి పురమాయించారు డాక్టర్ గారు. అప్పుడు నేనూ అక్కడే ఉన్నాను. జార్జ్‌ని తీసుకొచ్చాడు అటెండర్. వచ్చీరావడంతోనే జార్జ్ దృష్టి పోలీసుల దగ్గరున్న సూట్‌కేస్ మీద పడింది. అలా చూస్తూ నిలబడిపోయాడు. నేను అతనినే గమనిస్తున్నాను. సూట్‌కేస్‌ను పోలీసులు ఇదివరకే ఓపెన్ చేసి చూశారు. అందులో కొన్ని జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు. అందుకే వాళ్లకు వివరాలు తెలియలేదు. పిచ్చివాడిలా.. అయోమయంగా చూస్తుండే జార్జ్ చురుకుగా మారాడు. గబగబా వెళ్ళి సూట్‌కేస్ తీసుకొని ఓపెన్ చేశాడు. ‘వేర్ ఈజ్ మై ఫోన్?’ అడిగాడు అమెరికన్ యాసలో. అక్కడున్న అందరం తుళ్ళిపడ్డాం. ‘మీ ఫోన్ పోయింది. మీరు ఫోన్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగో’ అని ఇంగ్లిష్‌లో చెబుతూ తన ఫోన్ ఇచ్చాడు ఒక పోలీస్. జార్జ్‌కి ఆ పోలీస్ ఇంగ్లిష్ అర్థం కాలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి. భావం అర్థమైనట్టుంది అందుకే పోలీస్ చేతిలోని ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఎవరికో కాల్ చేశాడు. అటు వైపు ఉన్నవారు జార్జ్ గొంతు విని చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. జార్జ్ మాట్లాడలేకపోతున్నాడు. సమాధానం చెప్పలేక అయోమయంగా చూస్తున్నాడు. నేను అది గ్రహించి అతని దగ్గర నుండి ఫోన్ తీసుకొని.. జరిగింది అంతా అవతలి వైపున వ్యక్తికి వివరించాను. ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి జార్జ్ తండ్రని అర్థమైంది. ఆయన నా ఫోన్ నంబర్, ఆస్పత్రి అడ్రస్ తీసుకున్నాడు. జార్జ్‌కి ఫోన్లోని నా సంభాషణ ద్వారా కాస్త ఊరట దొరికినట్టయింది తప్ప భరోసా అందినట్టు లేదు. అందుకే పూర్తిగా మామూలు స్థితికి రాలేదు. పోలీసులు జార్జ్‌కి సూట్‌కేస్ అందచేసి వెళ్లిపోయారు. ఏదో ఒక పెద్ద విజయం సాధించిన భావం నాలో! అనామకుడు అనుకున్న వ్యక్తిని తన కుటుంబంతో కలుపుతున్న ఆనందం! ఇంటికి వెళ్లగానే అడిగాడు వశిష్ట.. ‘ఏమైంది నీ ఇన్వెస్టిగేషన్?’ అంటూ కాస్త వెక్కిరించినట్టుగానే. జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాను. ‘అయితే జార్జ్ విలియమ్స్ పూర్తి కథ తెలుసుకునే సమయం దగ్గరకు వచ్చేసిందన్నమాట!’ అన్నాడు. ‘అవును’ అన్నాను సంతోషంగా! ∙∙ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయం తొందరగా లేచి మా ముగ్గురి లంచ్ బాక్స్‌లతో పాటు జార్జ్‌కి కూడా బాక్స్ సర్దాను. వశిష్ట వెక్కిరించినా పట్టించుకోలేదు. నేను ఆస్పత్రికి వెళ్ళగానే జార్జ్ కోసం వెతికాను. ఎప్పటిలా నాకు ఎదురు రాలేదు. నేనే అతను కూర్చున్న చోటుకు వెళ్ళాను. నేను దగ్గరకు వెళ్ళగానే ఎప్పటిలా చెయ్యి చాచలేదు. నేనే అరటి పండు తీసి ఇచ్చాను. తీసుకున్నాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆగిపోయాడు. మధ్యాహ్నం నేను తెచ్చిన లంచ్ బాక్స్ అతనికి ఇచ్చి, నేను కూడా అక్కడే కూర్చుని తిన్నాను. సాయంత్రం జార్జ్ తండ్రి హైదరాబాద్ వచ్చాక నాకు ఫోన్ చేశాడు. డాక్టర్ గారు సహా స్టాఫ్ అంతా ఆయన కోసం ఎదురు చూడసాగాం. అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడమనిషి దిగారు. ఆ ఆడమనిషికి.. జార్జ్‌కి పోలికలు కనిపించాయి. ఆమె అతని తల్లి అయ్యుంటుంది. అమెరికన్ల రంగు కాదు ఆవిడది. ఇండియన్ల కలరే. అందుకే మేమెవ్వరం జార్జ్‌ని అమెరికన్ అని అనుకోలేకపోయాం. జార్జ్‌ని చూడగానే అతని కుటుంబం భావోద్వేగానికి లోనయింది. జార్జ్ తల్లితండ్రుల ద్వారా మాకు తెలిసిన విషయం ఏమిటంటే.. ‘జార్జ్ విలియమ్స్.. ఎమ్మెస్ పూర్తి చేసి భారతీయుల జీవన విధానం మీద ఆసక్తితో రీసెర్చ్ కోసం ఇండియా వచ్చాడు. పేరెంట్స్‌కి అతను ఒక్కగానొక్క సంతానం. కోట్లకు అధిపతి. హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగిన తరువాత నిజామాబాద్ జిల్లా పర్యటన కోసం రైల్లో బయలుదేరాడు. అనుకోకుండా ఏక్సిడెంట్లో అతని బ్యాగ్.. అందులో ఉన్న ఫోన్ పోయాయి. అతని తలకి బలమైన గాయం తగలడం వల్ల షాక్‌కి లోనయ్యాడు. ఇక్కడి భాష, మనుషులు.. వాతావరణం.. అతన్ని మరింత అయోమయంలోకి నెట్టాయి. ఈ కాంటాక్ట్ లేక జార్జ్ సమాచారం అందక అతని తల్లితండ్రులు ఆందోళన పడ్డారు’ అని. ‘శ్రీలేఖ మా ఆస్పత్రిలో హెడ్ నర్స్‌గా పని చేస్తోంది. తను పేషంట్స్‌ను సొంత మనుషుల్లా చూస్తుంది. మీ అబ్బాయి కోసం ఎవరూ రాలేదు కాబట్టి నేను అతన్ని డిశ్చార్జ్ చేసెయ్యమని చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. అతడి వివరాలు తెలిసేవరకు ఎదురుచూద్దాం అంది. ఈ అమ్మాయి వల్లే మీ అబ్బాయి మీకు దొరికాడు’ చెప్పారు చీఫ్ డాక్టర్ గారు జార్జ్ తల్లి తండ్రులకు. ‘అమ్మా! నీ ఋణం తీర్చుకోలేను’ అంటూ నా రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జార్జ్ తల్లి. ఖాళీ చెక్ పైన సంతకం చేసి ‘అమ్మా ఇది నా కొడుకు మమ్మల్ని చేరేలా చేసినందుకు మా బహుమానం. తప్పుగా అనుకోకుండా తీసుకో.. నీకు కావలసినంత రాసుకో’ అంటూ నా చేతుల్లో చెక్ లీఫ్‌ని పెట్టాడు జార్జ్ తండ్రి. దాన్ని ఆయనకు తిరిగి ఇస్తూ ‘నా డ్యూటీ నేను చేశాను. దీన్ని నేను తీసుకుంటే డబ్బు కోసం చేసినట్లు అవుతుంది. జార్జ్‌ను చూస్తుంటే నాకు నా తమ్ముడిలా అనిపించింది. ఆ వాత్సల్యంతో అతడి వివరాల కోసం ప్రయత్నం చేశాను’ అన్నాను. ఆ మాటలు వింటున్న జార్జ్ వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞతా భావం. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా నేను డబ్బు తీసుకోలేదు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ మా మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూనే వచ్చింది. ఇదిగో ఇలా మేం అమెరికా వెళ్లిదాకా! ∙∙ ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో నేను వాస్తవంలోకి వచ్చాను. వశిష్ట, పింకీ ముఖాలలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. జార్జ్‌ని చూడబోతున్నానన్న ఆనందంతో నా మనసు నిండిపోయింది. (చదవండి: గజరాజు గర్వభంగం!) -
వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా?
తమిళ సినిమా: వైవిధ్యానికి మారుపేరు నటుడు విక్రమ్. ఈయన నటించే చిత్రాల్లో నటుడు కనిపించరు పాత్రలే కనిపిస్తాయి. అన్నియన్, ఐ వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. తాజాగా విక్రమ్ నటిస్తున్న మరో విభిన్నమైన కథా చిత్రం తంగలాల్. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ను గుర్తు పట్టడం చాలా కష్టం. అంతగా మేకోవర్ అయ్యి ఆ పాత్రకు ప్రాణం పోస్తున్నారు. కాగా ఈయన నటుడు కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, త్రిష, ఐశ్వర్య రాయ్, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్తీపన్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఈ చిత్ర రెండో భాగం భారీ అంచనాల మధ్య ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. మరిన్ని చిత్రాలు విక్రమ్ చేతిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాసిన నవల కళ్లికాట్టు ఇతిహాసం. 14 గ్రామ ప్రజల పోరాటమే ఈ నవలలోని ప్రధానాంశం. ఇది 2003 సాహితీ అకాడమీ అత్యున్నత అవార్డును గెలుచుకుంది. కాగా ఈ నవల ఆంగ్లం, హిందీ తదితర 7 భాషల్లో అనువదించారు. తాజాగా ఈ నవలను సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: సిమ్రాన్ దీనికి మదయానై కూట్టం చిత్రం ఫేమ్ విక్రమ్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఇందులో నటుడు సియాన్ విక్రమ్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఆయన అందులో నటించడానికి సమ్మతిస్తారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. -
Nandini Krishnan: అనువాద వారధి
సొంతగా రచనలు చేయగలిగేవారు అనువాదాలు చేయరు. భాష బాగా వచ్చినంత మాత్రాన అనువాదం చేయలేరు. దానికి నైపుణ్యం, కొంత నిస్వార్థం కావాలి. తమిళ రచయిత్రి నందిని కృష్ణన్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఇంగ్లిష్ అనువాదం ఏప్రిల్ 24న మార్కెట్లోకి రానుంది. నవలలోని పాతకాలపు తమిళాన్ని నేటి యువతకు అందేలా అనువాదం చేయడం సులువు కాదు. తమిళంలోని ఉత్తమ నవలలను సవాలుగా తీసుకుని నందిని ఇంగ్లిష్‌లో అనువాదం చేస్తోంది. ఆమెకు వస్తున్న గుర్తింపు ఆ రంగంలో రాణించాలనుకునే స్త్రీలు గమనించదగ్గది. దాదాపు 2500 పేజీలు ఉండే ఐదు భాగాల భారీ ప్రఖ్యాత తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను ఇంగ్లిష్‌లో అనువాదం చేయబూనడం సాహసం. కాని ఈ క్లాసిక్‌ను అనువాదం చేయడానికి చాలా మంది ట్రై చేస్తూనే వచ్చారు. ముగ్గురు నలుగురు సఫలీకృతులయ్యారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్‌కు తగ్గట్టుగా అనువాదం చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నందిని కృష్ణన్ వంతు. ఆమె చేసిన ఈ నవల అనువాదం మొదటి భాగం పూర్తయ్యింది. ఏప్రిల్ 24న విడుదల కానుంది. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ దీనిని ప్రచురిస్తుంటే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాల సినిమాగా తీస్తున్న దర్శకుడు మణిరత్నం ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకుడిగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ నవల 75 ఏళ్ల క్రితం నాటిదని గుర్తు లేనంతగా అనునిత్యం తమిళ సాహిత్యంలో కలగలిసిపోయింది. కల్కి రాసిన ఈ నవలలోని భాషను, పై అర్థాన్ని, లోపలి అర్థాన్ని అర్థం చేసుకుని అనువాదం చేయడం చాలా జటిలం. అయినా చేశాను. పాఠకులు సులభంగా చదువుకోవడానికి, చేత బట్టుకోవడానికి వీలుగా ఇంగ్లిష్‌లో ఐదు కంటే ఎక్కువ భాగాలుగా విభజించి పుస్తకాలుగా తేనున్నాము’ అని తెలిపింది నందిని కృష్ణన్. ఎవరీ నందిని కృష్ణన్? నందిని కృష్ణన్ చెన్నైలో స్థిరపడిన నాటకకర్త, రచయిత్రి, స్టేజ్ యాక్టర్ కూడా. లండన్‌లో, ఢిల్లీలో జర్నలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత చెన్నై నుంచి వెబ్, ప్రింట్ మీడియాలలో పని చేయడం మొదలుపెట్టింది. హాస్యం రాస్తుంది. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ వైవాహిక వ్యవస్థపై విమర్శను పెడుతూ వివాహమైన స్త్రీలను, పురుషులను ఇంటర్వ్యూ చేసి ‘హిచ్డ్: ది మోడర్న్ అండ్ అరేంజ్డ్ మేరేజ్’ పుస్తకం తెచ్చింది. ట్రాన్స్ మెన్ జీవితాల ఆధారంగా ‘ఇన్విజిబుల్ మెన్‘ పుస్తకం రాసింది. పెరుమాళ్ మురుగన్ నవలలను ఇంగ్లిష్‌లో అనువాదం చేయడం ద్వారా అనువాద రంగంలో ప్రవేశించింది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్‘ అనువాదం చేస్తోంది. నందిని కృష్ణన్ ఇంట్లో ఎప్పుడూ వీధి కుక్కలు ఉంటాయి. వాటిని సాకుతుంటుంది. పిల్లులను కూడా. ‘కుక్కలు, పిల్లలు, వేల కొద్ది పుస్తకాలు అంతే మా ఇల్లు’ అని చెబుతుంది. కత్తి మీద సాము ‘అనువాదం చేయడం కత్తి మీద సాము’ అంటుంది నందిని. ‘సొంత రచనైతే అలా ఒక సమాధి స్థితికి వెళ్లి రాసుకుంటూ పోతాము. అనువాదం అలా కాదు. అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు చదివితే అది కేవలం అనువాదం అనిపించకూడదు. అదే సమయంలో ఒరిజినల్ నవల తాలూకు పరిమళం దానిలో ఉండాలి. అనువాదం పూర్తి చేశాక ఎవరిదో కన్నబిడ్డను మనం సాకాం... ఇక దీనితో రుణం చెల్లిపోయింది అన్న బాధ తప్పదు’ అంటుంది నందిని. ‘అనువాదకులు స్వయంగా రచయితలు కాకపోవడం వల్ల కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వాళ్లు ప్రతి మాటా కచ్చితంగా అనువాదం చేస్తూ కృతకంగా మారుస్తారు. అనువాదకులు స్వయంగా రచయితలైనా కూడా కొన్ని అనువాదాలు చెడిపోతాయి. ఎందుకంటే వారు తమ సృజనశక్తిని కూడా కలుపుతారు. అది తప్పు. వేరొకరు గీసిన బొమ్మను నకలు చేసేటప్పుడు మనం పికాసో అంతటివాళ్లమైనా ఆ బొమ్మలో మన గొప్పదనం చూపకూడదు. అనువాదం అయినా అంతే’ అంటుంది నందిని కృష్ణన్. మంచి అనువాద రుసుము ‘అనువాదంలో రాణించాలంటే మంచి డబ్బు కూడా మనకు ఆఫర్ చేయాలి. తగిన డబ్బు లేకుండా అనువాదం చేయడం అనవసరం’ అంటుంది నందిని. ‘కొంతమంది కల్లబొల్లి మాటలు చెప్పి అనువాదం చేయించుకోవాలనుకుంటారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను రోజుకు ఆరేడు గంటలు అనువాదం చేస్తాను. ఒక పదానికి బదులు ఎన్ని పదాలు వాడొచ్చో అవసరమైతే లిస్ట్ రాసుకుంటాను. ఒరిజినల్ని చదువుతూ, అనువాదాన్ని చదువుకుంటూ పని ముగిస్తాను. పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు పల్లెల్లో మరీ కొన్ని వర్గాలు మాత్రమే వాడే మాటల్ని ఉపయోగించి రాస్తారు. వాటికి ఇంగ్లిష్ మాటలు ఉండవు. డిక్షనరీలు కూడా ఉండవు. అందుకే అవసరమైతే ఒరిజినల్ రచయితనే సంప్రదిస్తూ డౌట్లు క్లియర్ చేసుకుంటూ అనువాదం ముగించాలి’ అంటుంది నందిని. నందిని లాంటి అనువాదకులు తెలుగులో కూడా ఉంటే మన క్లాసిక్స్ కూడా ప్రపంచ పాఠకులకు తప్పక చేరుతాయి. అనువాదకులకు గుర్తింపునూ తెచ్చిపెడతాయి. -
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
Kahlil Gibran: ప్రవక్త వాణి
అల్‌ముస్తఫా వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. పన్నెండేళ్లుగా ఉంటున్న ఆర్ఫాలీస్ ద్వీప నగరాన్ని ఇక విడిచిపెట్టాలి. సముద్రాన్ని దాటిస్తూ తన జన్మస్థలానికి తిరిగి చేర్చగలిగే సరైన(?) ఓడ వచ్చేస్తోంది. కానీ నగరవాసులు ఆయన్ని వదిలిపెడతారా? వియోగం వచ్చేంతవరకూ ప్రేమలోని లోతు తెలియదు కదా! నువ్వు మాకు అతిథివి కావు, మాలో ఒకడివి, మాకు ప్రియమైనవాడివి, మా కలలకు కలలిచ్చేందుకు నీ యవ్వనాన్ని ధారబోసినవాడివి, నువ్వు ఎలా వెళ్లగలవని వాళ్లు నిలదీయరా? తనకోసం చాలులోనే నాగలి వదిలేసివచ్చిన మనిషికి ఏం జవాబివ్వాలి? తనకోసం ద్రాక్షసారా యంత్ర చక్రాన్ని ఆపి పరుగెత్తుకొచ్చినవాడికి ఏం చెప్పాలి? హృదయం విరగకాసిన పళ్ల చెట్టయి వాటన్నింటినీ రాల్చితే? వారి పాత్రలను కోర్కెల జలధారై నింపితే? సర్వేశ్వరుడి శ్వాసను తనలోంచి పోనిచ్చే వేణువు అయితే? నిశ్శబ్దాల్లో కనుగొన్న నిధిని మాటల ద్వారా పంచితే? వారిని సముద్రపు అలలు వేరుపరచకముందే వీడ్కోలు చెప్పడానికి ఒకరి వెంట ఒకరు రావడంతో అక్కడ గుంపు పోగైంది. అలా విడిపోబోయే రోజే సమావేశపు రోజు కూడా అయ్యింది. అందరూ నెమ్మదిగా మందిరం వైపు అడుగులు వేశారు. మందిరంలోంచి యోగి అల్‌మిత్ర బయటికి వచ్చింది. వాళ్లందరి తరఫునా ఆమె మేము మా పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు చెప్పుకొనేలా జనన మరణాల మధ్యలి సత్యాన్ని తెలియజేయమని కోరింది. జనంలో గమనించిన సత్యాన్ని జనానికే చెప్పడానికి పూనుకొంటాడు అల్‌ముస్తఫా. లెబనాన్ మూలాలున్న అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్(6 జనవరి 1883–10 ఏప్రిల్ 1931) రచన ‘ద ప్రాఫెట్’కు ఇదీ భూమిక. నూరేళ్లుగా అన్ని ప్రపంచ భాషల్లోకీ మళ్లీ మళ్లీ అనువాదమవుతూ, ఇప్పటికీ కొత్త ఆసక్తి రేపుతున్న ఈ మహత్తర రచన 1923లో ప్రచురితమైంది. వచన కవిత్వం రూపంలో జిబ్రాన్ తన పాఠకులకు ఎన్నో అంశాల మీద సున్నితమైన దృక్కోణాన్ని ఇస్తారు. ‘ప్రేమ’తో మొదలైన సంభాషణ– తాపీమేస్త్రి, నేత కార్మికుడు, సత్రం నిర్వాహకుడు, పిల్ల తల్లి, న్యాయమూర్తి ఇలా ఒక్కొక్కరూ తమ సందేహాలను తీర్చమనడంతో అల్‌ముస్తఫా–– పెళ్లి, పిల్లలు, కాలం, జ్ఞానం, మంచి, చెడు, ప్రార్థన, దయ, ఆనందం, అందం, మతం, ఇవ్వడం... ఇలా అన్నింటికీ సమాధానాలు ఇస్తూపోతాడు. స్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వని ప్రేమ ప్రాధాన్యతను ప్రేమగా చెబుతాడు. మీ పిల్లలు మీ పిల్లలు కాదు; వాళ్లు మీ ద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు; వాళ్లు మీతో ఉన్నప్పటికీ మీకు చెందరంటాడు. నీకు ఎంతో ప్రియమైనవాళ్లు ఆ ఇంటిలో నివసిస్తారన్నట్టగా ఒక ఇంటిని నిర్మించమని చెబుతాడు. ఆకలి కోసం ఒక సీమరేగిపండు తిన్నాకూడా దాని విత్తనాలు నీ శరీరంలో పెరుగుతాయన్నంత స్పృహతో ఆ పనిచేయమని చెబుతాడు. ఆనందమూ దుఃఖమూ వేర్వేరు కాదు; నీ హృదయానికి సాంత్వన ఇచ్చే వేణువు కూడా కత్తి గాట్లకు గురైందని అంటాడు. జీవితాన్ని ఎంత సుతారంగా, సుందరగా సమీపించవచ్చో అత్యంత మృదువుగా, సరళంగా వివరిస్తాడు. స్వయంగా చిత్రకారుడు కూడా అయిన జిబ్రాన్ పుస్తకంలోని పన్నెండు చిత్రాలను స్వయంగా గీశారు. విడుదలైన సంవత్సరం ప్రచురించిన రెండు వేల కాపీలకుగానూ 1,500 మాత్రమే అమ్ముడుపోయింది. కానీ ఆ తర్వాత అది పునర్ముద్రణలు వరుసగా పొందుతూనే ఉంది. లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకం ఒక దశలో వారంలో సగటున 5,000 కాపీలు ఎక్కడో ఓచోట అమ్ముడవుతూనే ఉంది. ఈ నూరేళ్లలో ఏ ఒక్క సందర్భంలోనూ ఈ చిరుపొత్తం అచ్చులో లేకుండా లేదు. ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగిలించేట్టుగా రాయడం వల్ల ఇది తరచుగా బహుమానాలు ఇచ్చుకునే పుస్తకంగా కూడా ఉంటోంది. అయితే మేధావులు మాత్రం దీన్నొక పంచదార పాకంగా భావించకపోలేదు. ‘శాండ్ అండ్ ఫోమ్’, ‘ద వాండెరర్’ లాంటి ఇతర ప్రసిద్ధ రచనలు కూడా వెలువరించిన జిబ్రాన్– అరబిక్, ఆంగ్లం రెండు భాషల్లోనూ రాయగలరు. ఆయన్ని బహాయీ, సూఫీ మతాలు విశేషంగా ఆకర్షించాయి. వాటి అంతస్సారమైన నిశ్శబ్దం, ప్రేమ ‘ద ప్రాఫెట్’ నిండుగా పరుచుకొని ఉంటాయి. చిత్రంగా జిబ్రాన్ తల్లిదండ్రులు క్రైస్తవులు. తాతల కాలంలో ముస్లింలు. అలా అన్ని మతాలనూ ఇముడ్చుకునే గుణం ఆయనకు చిన్నతనంలోనే అలవడింది. అందుకే ఒక చోట నేను నీ మసీదులో, నీ చర్చిలో, నీ సినగాగ్‌లో కూడా ప్రార్థిస్తాను అంటాడు. ప్రపంచంలో శాంతి నెలకొనా లంటే అన్ని మతాల మధ్య సమన్వయం జరగాలన్న భావన ఆయనది. దానికి కావాల్సిన హృదయ వైశాల్యాన్ని పెంచేదిగా ఈ పుస్తకం ఉంటుంది. ప్రతి ఒక్క చెడుకూ ప్రతి ఒక్కరూ బాధ్యులేనన్న సామూహిక ఇచ్ఛ ఇందులో దర్శనమిస్తుంది. వ్యాపారంలో ప్రేమ, కరుణపూరిత న్యాయం చూపకపోతే, అది కొందరి దురాశకూ, మరికొందరి ఆకలికీ కారణమవుతుందని చెబుతుంది. అల్‌ముస్తఫా నిజానికి వెళ్లింది స్వస్థలానికేనా? తన కాలం ముగిసి, మళ్లీ మరో జీవితపు చక్రానికి సిద్ధం చేసే సముద్రాన్ని దాటాడు. ఇప్పుడిక జీవితం అనేది ఒక కల. అనంత శక్తి ప్రవాహంలో లిప్తకాలపు జీవులం మనం. ఈ భావన మనశ్శాంతినీ, సాంత్వననూ ప్రసాదిస్తుంది. జీవితం నుంచి ఒక విముక్త భావనను కలిగిస్తుంది. ముఖ్యంగా మతాల్లోని అసలైన ఆధ్యాత్మిక గంధం ఇగిరిపోయి, కేవలం అవి బల ప్రదర్శనలకు మాత్రమే పనికొస్తున్నప్పుడు– అన్ని జీవుల్లోనూ దేవుడిని చూసుకోవడమనే ప్రాచ్య భావనను రేకెత్తిస్తుంది. పుస్తకం ఒక పంచదార పాకమే కావొచ్చు. కానీ ఈ కల్లోల ద్వేషాల కాలంలో అప్పుడప్పుడూ నోటికి అత్యవసరమైన తీపి! -
అర్థం లేనితనం
‘‘అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా బహుశా నిన్న, నాకు తెలీదు.’’ ఈ ప్రారంభ వాక్యాలతో ఉదాసీన గొంతుకతో మొదలయ్యే ‘ద స్ట్రేంజర్’ నవల సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం 1942లో వచ్చింది. ఆల్బర్ట్ కామూ ఫ్రెంచ్ భాషలో రాసిన, ఆంగ్లంలో ‘ది ఔట్‌సైడర్’ పేరుతో కూడా ప్రసిద్ధమైన ఈ నవల అసంబద్ధవాద తాత్విక చింతనకు శిఖరాయమానమైన రచనగా నిలిచింది. ఈ ప్రపంచానికి ఏ క్రమమూ లేదు, జీవితం అనేదానికి ఏ పరమార్థమూ లేదని అసంబద్ధవాదం చెబుతుంది. ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుంటుందనే అంచనాతో జనాలు ప్రవర్తిస్తారు. అలా ఉన్నా, ఉండకపోయినా ఈ ప్రపంచానికి పోయేదేమీ లేదు. కానీ మన తార్కిక మెదడు ఒక క్రమాన్నీ, అర్థాన్నీ అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఈ కఠిన సత్యాన్ని మనిషి అనేవాడు ఎదుర్కోవాల్సిందే. లేదా చచ్చిపోవడమే దారి. అలా చేయలేనివాళ్లు దేవుడినో, ఆధ్యాత్మికతనో ఆశ్రయిస్తారు. దానికి బదులుగా ఆ అర్థంలేనితనాన్ని అంగీకరించడం ఉత్కృష్ట మార్గం. దీన్నే మహత్తరమైన వచన సరళతతో, అత్యంత సంక్లిష్టమైన యాంటీ–హీరో పాత్ర చిత్రణతో నిరూపిస్తాడు కామూ. ఫ్రెంచ్–అల్జీరియాలోని అలై్జ్జర్స్ నగరంలో మ్యార్‌సో ఒక మామూలు ఉద్యోగి. వచ్చేది అరాకొరా జీతం. తల్లిని మరెంగో గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఉంచుతాడు. ఆమె మరణవార్త టెలిగ్రామ్ అందుకున్నాక, అంత్యక్రియలకు రెండ్రోజుల సెలవు అడుగుతాడు. (దానికి బాస్ చిరాకుగా ముఖం పెడతాడు. కారణం: అంత్యక్రియలు శుక్రవారం కాబట్టి, వీకెండ్‌తో కలుపుకొని ఆ సెలవు నాలుగు రోజులవుతుంది.) అలా సెలవు అడగాల్సి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూనే తల్లి దగ్గరికి వెళ్లిన మ్యార్‌సో ప్రవర్తనలోని పొసగనితనాన్ని ప్రపంచం అడుగడుగునా గమనిస్తుంది. తల్లి శవం పక్కన జాగారం చేస్తూ సిగరెట్ కాల్చుతాడు. కాఫీ తాగుతాడు. అతడు వెళ్లేప్పటికే మూసేసివున్న శవపేటిక తలుపు తెరవనక్కర్లేదని చెప్పి అక్కడి సహాయకుడిని విస్తుపోయేలా చేస్తాడు. ఇంకా ముఖ్యంగా తల్లి చనిపోయిందని ఏడ్వడు. తెల్లారి బీచిలో మాజీ సహోద్యోగి మరీ కార్డోనా అనుకోకుండా ఎదురవుతుంది. ఇద్దరూ ఈత కొడతారు. మ్యార్‌సో కోరిక మీద సినిమాకు వెళ్తారు. అది కూడా కామెడీ సినిమా. ఆ రాత్రి ఇద్దరూ కలిసి గడుపుతారు. గతం రోజే తల్లి ఖననం జరిగివుందనేది ఒక నేపథ్య వాస్తవం. మ్యార్‌సో తన చర్యల పరిణామాల గురించి ఆలోచించడు. ఇతరులు ఏమనుకుంటారో అని తలచడు. సందర్భశుద్ధి గల ఉద్వేగాలు ప్రకటించడు. సింపుల్‌గా చెప్పాలంటే, అతడు జీవితపు ఆట ప్రకారం ఆడడు. అందుకే అతడు సమాజానికి ‘అపరిచితుడు’, లేదా ‘బయటివాడు’. అందువల్ల దానికి తగిన మూల్యం చెల్లిస్తాడు. అనుకోకుండా అతడు చేసిన హత్య కన్నా, అతడి (అ)ప్రకటిత ఉద్వేగాలు ఎక్కువ ప్రశ్నార్థకం అవుతాయి. నిజాయితీతో కూడిన జవాబులే అయినప్పటికీ – విచారణ సమయంలో తాను అరబ్బును చంపడానికి కారణం మండుటెండ పుట్టించిన చీదర అని జవాబివ్వడం ద్వారా న్యాయమూర్తినీ, జైల్లో పడ్డాక కూడా తనకు దేవుడు అక్కర్లేదని మతగురువునూ చీకాకుపెడతాడు మ్యార్‌సో. ప్రకృతి మాత్రమే మన జీవితాల్ని శాసిస్తుందని చెప్పడం కామూ ఉద్దేశం. భౌతిక అవసరాలు మాత్రమే మ్యార్‌సోను శాసిస్తాయి. జైలు మూలంగా ఈత కొట్టలేకపోవడం, సిగరెట్లు కాల్చలేకపోవడం, శృంగార జీవితం లేకపోవడం గురించి బాధపడతాడు. ఆ శృంగారం కూడా ప్రత్యేకించి మరీయే అని కాదు. నిజానికి మనుషులు లోలోపల ఇలాగే ఉంటారు. కానీ పైన ఒక ఆమోదనీయ పొరను కప్పుకొంటారు. ఇంకోలా ఉండాలనో, ఉండలేకపోవడం తప్పనో భావిస్తారు. ఒకప్పుడు లక్ష్యం ఉండి, ఇప్పుడు అంతా ఒకటే అనే స్థితి మ్యార్‌సోది. ప్రమోష¯Œ వచ్చినా, రాకపోయినా తేడా లేదనే మనిషి ఎవరు ఉండగలరు? ఇదొక రుషిత్వపు లక్షణంలా కనబడుతుంది. కానీ ఎలా ఉన్నా అర్థమే లేనప్పుడు, దానికోసం మళ్లీ ప్రత్యేకంగా తపన పడటం ఎందుకనేది అతడి వాదం. నిజానికి ఒక సున్నితమైన మనిషి మ్యార్‌సోలో ఉంటాడు. అరబ్బును చంపిన తర్వాత తానిక సంతోషంగా ఉండలేనని అతడికి తెలుసు. అయినా అది జరిగిపోయింది. దానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేడు. అరబ్బు హత్య, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇవేవీ కూడా ఒక క్రమం వల్ల జరిగినవి కావు. కానీ మ్యార్‌సో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. జీవితానికో ప్రత్యేక క్రమం ఉందన్న వాదనను ఇది పటాపంచలు చేస్తుంది. అందుకే చివరలో గిలటి¯Œ తో తలను తెగ్గొట్టే మరణ శిక్ష అనుభవించడానికి ముందు, ఇక అక్కడ పోగుకాబోయే కోపగ్రస్థ మూక అరుపులను ఊహించుకున్నాక, ప్రపంచం గురించి అతడికి ఉన్న ఆ చివరి భ్రమలు కూడా తొలగిపోతాయి. జీవితపు సున్నితమైన ఉదాసీనతకు మేలుకుంటాడు. శిక్షను తేలిగ్గా అనుభవించే మానసిక స్థితికి వస్తాడు. అతడి చింతన సంపూర్ణమవుతుంది. ఊహ తెలిసేనాటికే మొదటి ప్రపంచ యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్నాడు కామూ. రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది జీవితాలు చెదిరిపోవడం చూశాడు. అల్జీరియాలో ఫ్రెంచివారి అణిచివేతకు సాక్షిగా ఉన్నాడు. పేదరికాన్ని అనుభవించాడు. జీవితపు అర్థరాహిత్యం ఆయన అనుభవసారం. కథకుడు, నాటకకర్త, పాత్రికేయుడు అయిన కామూ తన 28వ యేట ‘స్ట్రేంజర్’ రాశాడు. 1957లో నోబెల్ వరించింది. ఆ పురస్కారం అందుకున్న అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచాడు. కానీ మూడేళ్లకే తన 46వ యేట కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూశాడు, ప్రపంచపు అసంబద్ధతను తన జీవితం ద్వారా కూడా నిజం చేస్తూ! -
అక్కడ కూడా పొన్నియిన్ సెల్వన్ కథ చదివేవారి సంఖ్య పెరుగుతోంది: కార్తీ
సాక్షి, చెన్నై: మణిరత్నం తెరకెక్కించిన చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్‌ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీ పన్, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. మెడ్రాస్ టాకీస్, లెకా సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడం విశేషం. కాగా తొలి భాగం శుక్రవారం తెరపైకి వచ్చింది. ముందెప్పుడూ లేనట్లుగా మణిరత్నం టీమ్ ఈ చిత్ర ప్రచారంలో పాల్గొనడం విశేషం. పలు రాష్ట్రాలు చుట్టొచ్చిన నటుడు కార్తీ మీడియాతో ముచ్చటిస్తూ పొన్నియిన్ సెల్వన్ చిత్ర ప్రచారానికి ఇతర రాష్ట్రాల్లోనూ విశేష ఆదరణ లభించిందన్నారు. రైలు ప్రయాణంలో కూడా పొన్నియిన్ సెల్వన్ నవల చదివేవారి సంఖ్య అధికం అవుతోందన్నారు. కొంతమంది యూట్యూబ్‌లో వింటున్నారని చెప్పారు. పొన్నియిన్ సెల్వన్ చిత్ర నిర్మాణం మొదలైన తరువాత ఈ కథ తెలుసుకోవాలనే ఆసక్తి ఇతర రాష్ట్రాల ప్రజల్లోనూ పెరుగుతోందని అన్నారు. ఆ కాలంలో రాజులు రాజ్యాన్ని ఎలా పరిపాలించారు? అప్పటి మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉండేవి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోందన్నారు. ఇలాంటి చిత్రాన్ని చేయడం మణిరత్నంకే సాధ్యం అయ్యిందన్నారు. ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఏ తరహా చిత్రానికైనా ఆయన విజువల్స్ అద్భుతంగా ఉంటాయన్నారు. చిత్రంలో జయం రవి, త్రిష, ఐశ్యర్యరాయ్ వంటి నటీనటులతో కలిసి నటించడం తనకు మంచి అనుభవం అన్నారు. కాగా ఈ చిత్రం తరువాత తాను కథానాయకుడిగా నటించిన సర్దార్ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి సిద్ధం అవుతోందన్నారు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపారు. -
భగ భగ మండే నిప్పుల కొలిమిలో వేసినా తగలబడదు
చరిత్రలో కనుమరుగు అయిన పుస్తకాలు ఎన్నో. చెదలు పట్టడమో, ప్రమాదాల్లో నాశనం అయిపోవడమో జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే.. ఇక్కడో పుస్తకం ఎంతో ప్రత్యేకం. మంటల్లో వేసిన కూడా తగలబడదు ఈ పుస్తకం. దీని ప్రత్యేక ఏంటో తెలుసా?.. వెయ్యికిపైగా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా నాశనం కాదట!. మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని ప్రత్యేకమైన ఫైర్‌ఫ్రూఫ్ మెటీరియల్‌ని ఉపయోగించి ప్రింట్ చేశారు. సినీఫాయిల్, ప్రత్యేకమైన అల్యూమినియం మెటీరియల్‌ని ఉపయోగించి ఈ బుక్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఈ అన్‌బర్నబుల్ బుక్ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా.. కీలకమైన కొన్ని కథలను రక్షించాల్సిన ఉద్దేశంతో రూపొందించారు. ఈ పుస్తకం వేలంలో కోటి రూపాయలకు పైనే పలకింది. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును.. స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే 'పెన్ అమెరికా' సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారట. ఇది స్త్రీ ద్వేషం, అణిచివేతకు గురవుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించే డిస్టోపియన్ నవల. అంతేకాదు అత్యధికంగా అమ్ముడైన నవల కూడా ఇదే . ఆ పుస్తక రచయిత అట్వుడ్ ఈ అన్‌బర్నబుల్ బుక్ ఆఫ్ ది హ్యాండ్‌మెయిడ్స్ 'పెన్ అమెరికా' కోసం చాలా డబ్బులు సేకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు ఈ పుస్తకం చాలాసార్లు నిషేధించబడింది. అంతేకాదు బుక్ పెంగ్విన్ రాండమ్ హౌస్ అనే పబ్లిషింగ్ సంస్థ, టోరంటోలోని రీథింక్ క్రియేటివ్ ఏజెన్సీ, ది గ్యాస్ కంపెనీ ఇంక్ అనే రెండు కంపెనీలు ఉమ్మడిగా ఈ అన్‌బర్నబుల్ బుక్ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. దాదాపు 2200 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రతకు గురైనప్పటికీ నాశనం కాదని, పైగా ప్రత్యేకమైన ఇంక్‌తో ముద్రించబడిందని బుక్ డిజైనర్లు వెల్లడించారు. అంతేకాదు ఒక కెనడా రచయిత ఫ్లేమ్ త్రోవర్‌తో పుస్తకాన్ని కాల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: 14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు ప్రవేశం లేదు) -
మన అక్షరానికి పట్టాభిషేకం
మన అక్షరానికి అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం. మనం ఇది గర్వించాల్సిన సందర్భం. అవును... భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’కి ఆంగ్లానువాదమైన ‘టూంబ్ ఆఫ్ శాండ్’ ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం సాహితీ ప్రియులకు ఈ మండు వేసవిలో మామిడిపండు లాంటి తీపి కబురు. భారతీయ భాషలోని ఓ రచనకు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రప్రథమం. ఎనిమిది పదుల వయసులోని స్త్రీమూర్తి తన మూలాలు వెతుక్కుంటూ సాగించిన అన్వేషణ నేపథ్యంలో దేశ విభజన నాటి పరిస్థితులనూ, కాలం మాన్పని గాయాలనూ కళ్ళకు కట్టిన నవల ఇది. ప్రేమ, కష్టనష్టాలు, వాటి నుంచి విమోచన లాంటి జీవితంలోని భావోద్వేగాలను చిత్రీకరించిన ఈ నవలకు అత్యున్నత పట్టం కట్టాలని న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. అనువదించి, అంతర్జాతీయ యవనికపైకి తీసుకొస్తే భారతీయ రచనలు ప్రపంచ సాహిత్య శ్రేణిలో నిలబెడతాయని మరోసారి రుజువైంది. ఢిల్లీకి చెందిన 64 ఏళ్ళ గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’ (ఇసుక సమాధి) నాలుగేళ్ళ క్రితం 2018లో ప్రచురితమైంది. తొమ్మిదేళ్ళ శ్రమ ఫలితమైన ఆ పుస్తకాన్ని మరో రచయిత్రి డైసీ రాక్వెల్ ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా ఇంగ్లీషులోకి అనువదించారు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ద్వారా వారిద్దరికీ సంయుక్తంగా 50 వేల పౌండ్ల పారితోషికం దక్కుతుంది. నవల పేరు నుంచి పాత్రల దాకా అనేక అంశాలను ప్రతీకాత్మకంగా ధ్వనింపజేస్తుందీ రచన. భర్త మరణం తర్వాత ప్రపంచానికి దూరం జరిగిన తల్లి, పితృస్వామ్య శృంఖలాలను ఛేదించుకొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆమె కూతురు, ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో సర్వసాధారణంగా కనిపించే కోడలు – ఈ మూడు బలమైన స్త్రీ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ అది. ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర వీటికి అదనం. ఈ నవలలో ఇల్లు వదిలి మూలాలు వెతుక్కుంటూ వెళ్ళే మహిళ ఒకరైతే, ప్రపంచంలోని దేశదేశాల్లో సొంత ఇళ్ళున్న రిటైర్డ్ కస్టమ్స్ అధికారిణి మరొకరు. ఇలాంటి విరోధాభాసలతో పాఠకులకు ఎన్నో అంశాలను చెప్పకనే చెబుతారు రచయిత్రి. పేరుకు ఇది కాల్పనిక రచన అయినా, నవలలోని స్థల కాలాదులు, పాత్రలతో నిజజీవిత వ్యక్తులు, పరిస్థితులను స్ఫురింపజేస్తారు. దాదాపు 110 ఏళ్ళ క్రితం మన రవీంద్రనాథ్ టాగూర్ కవితా సంపుటి ‘గీతాంజలి’ సైతం ఇలాగే ఇంగ్లీషులోకి ‘సాంగ్ ఆఫరింగ్స్’ పేరిట అనువాదమైంది. సాహితీ రంగానికి గాను 1913లో నోబెల్ పురస్కారం అందుకుంది. ఒక రకంగా మళ్ళీ అలాంటి గర్వకారణమైన సందర్భం ఇది. ఎందుకంటే, ఇంగ్లీషులోనే నేరుగా రాసే నవలలకు ఏటా వార్షిక బుకర్ ప్రైజ్ ఇస్తారు. కానీ, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను మాత్రం రెండేళ్ళకు ఒకసారే ఇస్తారు. ఒకప్పుడు దీన్నే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌గా పేర్కొనేవారు. ఇంగ్లీషులోనే ప్రచురితమైన, లేదంటే ఇంగ్లీషు అనువాదం అందుబాటులో ఉన్న రచనల్లో అత్యుత్తమమైనదాన్ని ఎంపిక చేసి, ఈ పురస్కారం అందిస్తారు. గీతాంజలిశ్రీ ‘రేత్ సమాధి’ ఈ పురస్కారాన్ని తొలిసారిగా భారతీయ సాహిత్యాన్ని తెచ్చిపెట్టింది. గతంలో 5 నవలలు, 5 కథా సంపుటాలు వెలువరించిన గీతాంజలిశ్రీ పేరు ఈ తాజా పురస్కారంతో దేశమంతటా వినిపిస్తోంది. మతాలకూ, దేశాలకూ, చివరకు స్త్రీ పురుషులకూ మధ్య మనం సృష్టించుకున్న సరిహద్దులను ఆమె తన రచనలో ప్రతిఫలింపజేశారు. 80 ఏళ్ళ కథానాయకి పాత్ర ద్వారా సంప్రదాయాన్ని ఎదిరించి, హద్దులను చెరిపే మానవ స్ఫూర్తికి పట్టం కట్టారు. లౌకికవాద భావజాల రచనల గీతాం జలిశ్రీ, ఆమె రచనల్లోని భావ తీవ్రత సహజంగానే పాలక వర్గాల్లో కొందరికి రుచించకపోవచ్చు. విజేతను అభినందించడానికి సైతం వారికి నోరు పెగలకపోవచ్చు. అంతమాత్రాన విలువ తగ్గదు. 41 ఏళ్ళ క్రితం 1981లో ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ రచనతో సల్మాన్ రష్దీ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఆ తరువాత అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్), కిరణ్ దేశాయ్ (ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్), అరవింద్ అడిగ (ది వైట్ టైగర్) ఈ పురస్కారం తెచ్చిపెట్టారు. ఆ వరుసలో మరో అడుగు ముందుకేసి గీతాంజలిశ్రీ తొలిసారి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సాధించారు. కాళిదాసు, భవభూతుల కాలం నుంచి భారతీయ సాహిత్యం విస్తృతమైనది, వైవిధ్యభరితౖ మెనది. మన ప్రాచీన సాహిత్య ఔన్నత్యానికి పాశ్చాత్యులు శిరసు వంచిన ఘట్టాలు అనేకం. సమ కాలీన భారతీయ సాహిత్యంలోనూ అనర్ఘ రత్నాలెన్నో. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీల్లో వస్తున్న గొప్ప రచనలు ఆయా భాషల పరిధులు దాటి బాహ్యప్రపంచానికి చేరుతున్న సందర్భాలు ఇవాళ్టికీ అరుదు. ఈ తాజా అవార్డుతో మన భారతీయ భాషా సాహిత్యంపై మళ్ళీ విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేగుతుంది. అనువాదాలూ పెరిగే అవకాశమూ ఉంది. నిజానికి, అభ్యు దయ సాహిత్యాన్ని అనేక భాషల నుంచి తెలుగులోకి తెచ్చుకున్న మనం అన్నమయ్య నుంచి ఆధునిక సాహిత్యం దాకా మన సాహిత్యపు లోతులను అంతర్జాతీయ పాఠకులకు తగినంతగా చేరవేయలేదు. బుకర్ ప్రైజ్ నిర్ణేతల సారథి సైతం అనువాదాలు లేక, రాక ఎందరో భారతీయ రచయితల ప్రతిభ ప్రపంచానికి తెలియడం లేదన్నారు. అన్ని భాషల్లోనూ, ముఖ్యంగా తెలుగునాట సమర్థులైన ఆంగ్ల అనువాదకులు, ఆ అనువాదాలను ప్రోత్సహించే ప్రచురణకర్తల కొరత నేటికీ ఉంది. దాని నుంచి బయటపడేందుకు ‘రేత్ సమాధి’ నవల, దానికి దక్కిన బుకర్ ప్రైజ్ ఊతమిస్తుందని ఆశిద్దాం. అనువాద కళను ప్రోత్సహిస్తే, భారతీయ సాహిత్యానికి మరో నోబెల్ కల తీరినా ఆశ్చర్యం లేదు. -
నూరేళ్ల స్రవంతి
మానవ అంతరంగపు సంక్లిష్టతను మహాద్భుతంగా చిత్రించిన మహారచయితలు ఎందరో ఉన్నారు. అయితే ఆ అంతరంగపు సంక్లిష్టతకు తగిన మరింత దగ్గరి రూపాన్ని సాహిత్య ప్రపంచం ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంది. అట్లా ఆధునిక వచనపు అత్యున్నత సృజనశీలతకు ప్రతి రూపంగా చైతన్య స్రవంతి టెక్నిక్ ఉద్భవించింది. ఆ సృజన ప్రక్రియలో శిఖరప్రాయమైన రచన – ‘ఉలిసేస్’ నవల. చైతన్య స్రవంతి అనగానే మొట్టమొదలు గుర్తొచ్చే ఈ నవలకు ఇది శతాబ్ది సంవత్సరం. 1922 ఫిబ్రవరి 2న దీని తొలి ఎడిషన్ వచ్చింది – జేమ్స్ జాయిస్ నలభయ్యో (1882–1941) పుట్టినరోజుకు సరిగ్గా అందేట్టుగా! గ్రీకులో హోమర్ విరచిత ‘ఒడిస్సీ’ కావ్యానికి ఆధునిక రూపంగా ఐరిష్ రచయిత అయిన జేమ్స్ జాయిస్ ఆంగ్లంలో ఈ ‘ఉలిసేస్’ రాశాడు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి తన రాజ్యమైన ఇతకాకు వెళ్తూ, పదేళ్లపాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు అన్నేళ్లుగా తనకోసమే వేచివున్న భార్య పెనలోపి, కొడుకు తలామకస్‌ను చేరుకుంటాడు హోమర్ కావ్యనాయకుడు ‘ఒడిస్సీస్’. దీన్ని లాటిన్లో ఉచ్చరించే విధానం ‘ఉలిసేస్’. అదే పేరును తన నాయకుడికి ఎంచుకున్నాడు జాయిస్. నవలలోని లియోపాల్డ్ బ్లూమ్, ఆయన భార్య మోలీ బ్లూమ్, ఇంకా స్టెఫాన్ డిడాలస్... ఈ మూడు పాత్రలూ ‘ఒడిస్సీ’లోని ఉలిసేస్, పెనలోపి, తలామకస్‌కు ఆధునిక రూపాలు. అయితే ఈ సాధారణ మనుషులు ఎదుర్కొనే కష్టాలు మాత్రం రోజువారీ అతి అల్పమైన, ‘నీచమైన’ అంశాలే. ఈ నవల ఒక్కరోజులో 1904 జూన్ 16న ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కేంద్రంగా సాగుతుంది. లియోపాల్డ్ బ్లూమ్ ఆ ఒక్క సుదీర్ఘరోజులో ఉదయం లేచినప్పటి నుంచీ ఏ రాత్రికో కొంపకు చేరుకోవడం దాకా సాగే అనుభవాల సారం ఇది. పెంపుడు పిల్లి కోసం దుకాణంలో మాంసం కొనుగోలు చేయడం, పత్రికాఫీసుకు వెళ్లడం, ఒక చావుకు హాజరు కావడం, ఒక పుట్టుకను చూడటం, ఒక యూదుడిగా పరాయివాడి ముద్రను ఎదుర్కోవడం, మ్యూజియం దర్శించడం, తినడం, తాగడం, వ్యభిచార గృహం చేరుకోవడం, కొడుకు లాంటి తలామకస్‌కు తారసపడటం, ‘విశ్వాసం’ లేని భార్య గురించి క్షోభపడటం... ఈ ప్రతి సందర్భంలోనూ అతడి అంతరంగపు అగాథాలనూ, తాత్విక వివేచననూ, ప్రతి సూక్ష్మ వివరం సహా జాయిస్ దర్శింపజేస్తాడు. నవల ఒక్క రోజులో జరిగేదైనప్పటికీ దీన్ని రాయడానికి జాయిస్కు ఏడేళ్లు పట్టింది. ఇరవైల్లో ఉన్నప్పుడు తన మాతృదేశంలోని పరిస్థితుల మీది విముఖతతో తనకు తాను స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు జాయిస్. అట్లా ట్రీఎస్ట్(ఇటలీ), జ్యూరిక్(స్విట్జర్లాండ్) నగరాల్లో గడిపాక ప్యారిస్(ఫ్రాన్స్) చేరుకున్నాడు. ఆ మూడు నగరాల్లోనూ రచన సాగింది. ఒక విధంగా తనకు ఎంతో ఇష్టమైన డబ్లిన్‌ను దూరం నుంచి అపురూపంగా చూసుకున్నాడు. అందుకే అక్కడి ప్రతి వీధీ ఇందులో దర్శనమిస్తుంది. దీనిలోని కొన్ని భాగాలు 1920లో యూఎస్ మ్యాగజైన్ ‘లిటిల్ రివ్యూ’లో అచ్చయినాయి. అయితే అశ్లీలంగా ఉందన్న కారణంగా ఆ పత్రిక సంపాదకులు విచారణను ఎదుర్కొన్నారు. జరిమానా విధిస్తూ తర్వాతి ప్రచురణను నిలిపివేయమని ఉత్తర్వులిచ్చింది కోర్టు. గ్రేట్ బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిందలే మోపారు. ఐర్లాండ్‌లో మాత్రం ఇది నిషేధానికి గురికాలేదు. దాన్ని ఎటూ చదివేది గుప్పెడు మంది; మళ్లీ దానికోసం నిషేధం అవసరమా అన్నది అప్పుడు వారి ఆలోచన. చాలాకాలం జాయిస్‌ను ఐర్లాండ్ పూర్తిగా సొంతం చేసుకోలేదు కూడా! చివరకు ప్యారిస్‌లో ఇంగ్లిష్ పుస్తకాలు అమ్మే సిల్వియా బీచ్ దీన్ని ఏకమొత్తంగా పుస్తకంగా తెచ్చింది. ‘షేక్స్పియర్ అండ్ కంపెనీ’ పేరుతో పుస్తకాల దుకాణం నడిపేదామె. ప్రింటర్‌కు చెల్లించ డానికి తాను ప్రతి చిల్లిగవ్వా దాచానని పేర్కొంది. తానొక మాస్టర్ పీస్‌ను ప్రచురిస్తున్నానన్న నమ్మకం ఆమెను ముందుకు నడిపింది. పుస్తకం వచ్చాకా విమర్శలు ఆగలేదు. రచయిత్రి వర్జీనియా వూల్ఫ్ దీన్ని చెత్తగా కొట్టిపారేసింది. పైగా దీన్ని చదవడం ఏమంత సుఖమైన అనుభవం కాదు. అత్యంత సంక్లిష్టంగా ఉండి, శ్లేషలు, ప్రతీకలు, వ్యంగ్యం పరుచుకుని ఉంటాయి. అంతర్ముఖమైన గొంతుకలు వినిపిస్తుంటాయి; స్టెఫాన్, మోలీ అంతరంగాలు సహా. అందుకే ఆదరణ అంతంతే ఉండింది. అయినా జాయిస్ ‘కనీసం జనాల అభిరుచికి తగ్గట్టుగా కామాను మార్చడానికి కూడా’ ఇష్టపడలేదు. ఏమైనా నెమ్మదిగా తన మాతృదేశంతో సహా ప్రపంచమంతటా జేమ్స్ జాయిస్ ‘కల్ట్’ మొదలైంది. ‘చైతన్య స్రవంతి’ అనే పేరుతోనే తెలుగులో బుచ్చిబాబు ఈ టెక్నిక్‌ను పరిచయం చేయడానికి కథ రాశాడు. నవీన్ ఈ ప్రక్రియలో రాసిన నవలతో ‘అంపశయ్య’ నవీన్ అయ్యాడు. 2,65,000 పదాలు గల ‘ఉలిసేస్’ కష్టం అనే మాటతో జోడింపబడింది; నిజానికి అక్కడ ఉండాల్సిన మాట ఆనందం అంటాడు విమర్శకుడు స్టీఫెన్ ఫ్రై. ఈ నవల వీరాభిమానులు దీన్ని చదవడానికి కొన్ని మార్గాలు చెబుతారు: విమర్శలను చదవొద్దు, పుస్తకం చదవాలి. వేగంగా చదవొద్దు, గట్టిగా చదువుతుంటే దానికదే సజీవంగా ఆవిష్కృతమవుతుంది. నాలుగో అధ్యాయం చదవడానికి అవసరమైన క్లూస్ మూడో అధ్యాయంలో ఉండే డిటెక్టివ్ నవల కాదిది; కాబట్టి వరుస పెట్టి చదవాల్సిన పని కూడా లేదు. నెమ్మదిగా అందులో మునిగిపోతే ఇది ఇవ్వగలిగే పఠనాను భవాన్ని ఇంకో పుస్తకం ఇవ్వలేదు. ఒక్కటైతే గట్టిగా చెప్తారు. సులభంగా ఒక పుస్తకం చదివి పక్కన పెట్టేయాలనుకునేవారికి మాత్రం ఇది తగినది కాదు! -
పెళ్లాడే బొమ్మా!
మార్చి 20న ఉషశ్రీ జయంతి సందర్భంగా ఆయన 1961లో రాసిన ‘పెళ్లాడే బొమ్మా!’ నవలా లేఖావళి నుంచి మొదటి లేఖ సంక్షిప్తంగా... చిరంజీవినీ – అని నిన్ను సంబోధించడం నాకిష్టం లేదు. అయినా ప్రపంచంలో అన్నీ మనకిష్టమైనవే చేస్తున్నామా! ఇష్టం లేని వాటి మీదనే ఎంతో శ్రద్ధ, ఆప్యాయత. ఔత్సుక్యం ప్రదర్శించడానికి అలవాటు పడిపోయాడు మానవుడు. ఈ విషయంలో పల్లెటూరి వాడి కంటె నాగరికుడు మరీ సామర్థ్యం కనబరుస్తున్నాడు. చదువుకున్న వాడికి ఈ కళలో మంచి ప్రావీణ్యం ఉంది. చదువురాని వాడు ఈ విషయంలో అసమర్థుడేనేమో! చదువుకున్నవాడు చదువుకున్న వాడితో సాగించే ఈ కృత్రిమ వ్యవహారం ఉన్నదే ఇంతకంటె దుర్భరమైనది లేదు. వాస్తవానికి మనిషి కృత్రిమంగా బ్రతకడానికి ఎప్పుడో అలవాటు పడిపోయాడు. అసలు కృత్రిమ శబ్దం ఇక్కడ ఉచితం కాదని నాకు తెలుసు. ఆర్టిఫిషియల్ అనేదానికి తెలుగు రానివాడు రాసిన అనువాదం కృత్రిమం. అందువలన ఒక రకంగా ముసుగులో గుద్దులాట అంటే బావుంటుంది కానీ అదీ సమంజసం కాదు. పచ్చి మోసం అంటే సుఖంగా ఉంటుందేమో అలోచించు. ఇంతసేపూ నీకు నేను అనవసర విషయం మీదనే వ్రాసినట్లున్నాను. ఇది అనవసరమని నాకూ తెలుసు. అసలీ ప్రపంచంలో అవసరమైంది ఏముంది కన్నతల్లీ? అన్నీ అవసరాలే! అనవసరాలనే అవసరాలుగా అంగీకరించి అనుభవించడానికి అలవాటు పడుతున్నాము. పుట్టడం కంటె అనవసరమైనది లేదు. అయినా అది మన చేతుల్లో వున్నదా! అని నువ్వు ప్రశ్నిస్తావు. నిజమేకాని – ఏది మన చేతుల్లో ఉంది. ఊరికే తెలియక కొందరు అమాయకులు అంతా మన చేతుల్లో ఉన్నదంటారు. మరికొందరు ఆకాశంలోని గ్రహాలకు ఈ అధికారం అంటకడుతున్నారు. ఆ గ్రహాలకు ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆగ్రహిస్తారు వారు. అన్నిటికీ అతీతమైన శక్తి ఒకటి ఉందని అంటే హేతువాదులు ఒప్పుకోరు. ఎప్పుడు హేతువాదం, విశ్వాసం కంటె బలీయమైందో అప్పుడే మానవుడు మోసంలో పడిపోయాడు. మోసగించుకొంటున్నాడు. మోసం చేస్తున్నాడు. మోసంలో పడుతున్నాడు. ఇందులో కొంత తెలిసి జరుగుతుంటే కొంత తెలీకుండా జరుపుతున్నాడు. తెలిసినా తెలియకపోయినా ముట్టుకుంటే నిప్పు కాలి తీరుతుంది. అందుచేత ఈ మోసాలకు ప్రాయశ్చిత్తం తప్పదు. అయితే తత్కాలంలో ఇవి వేధించకపోవచ్చు. కాని వీటి పరిణామ రూపమైన ప్రాయశ్చిత్తఫలాన్ని అనుభవించక తప్పదు – అని నేనన్నప్పుడు ‘‘ఈ జన్మలో హాయిగా పోతే చాలు, వచ్చే జన్మ అనేది ఉందో లేదో తెలియనప్పుడు అందులో అనుభవించడమనే అవస్థ ఎక్కడిది?’’ అని నవ్వి పారేశావు. నిజమే! పూర్వజన్మ, పునర్జన్మ, కర్మ అనేవి ప్రత్యక్షమయే విషయాలు కావు. కావు కాని ప్రత్యక్షాంశాలకు హేతువులు దొరకనప్పుడు పై వాటిని స్వీకరించడంలో దోషం కనిపించదు. ఉదాహరణకు నువ్వు బియ్యే చదివావు. నీలానే చదివిన వాళ్లెందరో ఉన్నారు. నీ కంటె గొప్పగా ప్యాసయిన వాళ్లలానే, తక్కువ మార్కులతో ఉత్తీర్ణులయిన వాళ్లూ ఉన్నారు. కానీ – ఈ క్రింది తరగతుల వాళ్లు నీ కంటె మంచి పదవుల్లో ఉండగా ప్రథమ శ్రేణివారు నిరుద్యోగులుగానూ కనిపిస్తున్నారు కదా. ఏమిటి దీనికి కారణం? ఆలోచించవు నువ్వు, అనవసరం అనుకుంటావు. అక్కడే విడుతున్నాం మనం. చిత్రం చూశావా! ఏది నేననవసరమనుకుంటానో అది అందరికీ అవసరంగా కనిపించినట్లే నువ్వ అవసరమనుకునేది మరి కొందరికి అనవసరమవుతుంది. ఇదంతా మన మనస్సుల మీద ఉన్నది. ఈ మనస్సు ఉన్నదే. ఇది బహు ప్రమాదకరమైనది. ప్రమోదానికి ఇదే మూలస్థానం. దీనినే శంకరుడు కోతితో పోల్చాడు. ఉత్త కోతి అన్నాడు మనస్సును. అప్పుడనిపిస్తుంది. మనిషి కోతి నుండి పుట్టాడంటే మనస్సనే కోతిని పెట్టుకు పుట్టాడా అని. నవ్వొస్తుంది నీకు – ఇందుకే కాదు అన్నింటికీ నవ్వడమే అలవాటు నీకు. అదే నీ అదృష్టమేమో జాతక చక్రంలో. ఇంతకూ ప్రపంచంలో... అసలేం వ్రాద్దామనుకున్నానో, ఏం వ్రాయమని నువ్వు అడిగావో అది వ్రాయడమే మరచిపోతున్నానని నువ్వు కాకపోతే నీ పక్కవాళ్లయినా భ్రమపడవచ్చు. అది ఎవరి దోషమూ కాదు. వ్రాసేదాన్ని పూర్తిగా అవగాహన చేసికొని ఆ అక్షర సముదాయం వల్ల ఏర్పడే శబ్దాలిచ్చే అర్థాలతో పాటు ఆ శబ్ద సముదాయం మరే అంశాన్నయినా ధ్వనిస్తున్నదా అని లోచించడం అవసరం అనుకుంటా. ఇలా అన్నందుకు చాలామందికి ఆగ్రహం వస్తుంది. అయినా అందరి ఆగ్రహానుగ్రహాలనూ లక్ష్యం చేస్తూ కూచుంటే మన జీవితాలు సాగవని నువ్వు అనేమాట నేనెరుగుదును. కానీ ఆగ్రహానుగ్రహాల విషయంలో గొప్ప పేచీ ఉంది. ఆ విషయం చాలాసార్లు వివరిద్దామనుకుంటూ మరచిపోతూనే ఉన్నాను. కొన్ని కొన్ని విషయాలు మరిచిపోగలిగితే ఎంత బావుండునూ అనుకుంటాము. కానీ – ఏవి మరచిపోదామనుకుంటామో అవి తరిమి తరిమి వేధిస్తూంటాయి. మనం స్వయంగా చేసిన తప్పులు విష ఫలితాలతో ఎదురయేటప్పుడు మరిచిపోదామనుకుంటాము కాని సాధ్యమా? కాదు, కాదని అటువంటి తప్పులు చేయకుండా ఉండగలమా? తప్పులు చేస్తూండడం, దిద్దుకోవడం... మానవ జీవితానికి నిర్వచనం. చేసిన తప్పులే చేస్తూండడం మేధావులమనుకొనేవారి లక్షణం. ఈ లక్షణానికి మంచి లక్ష్యం ఏమిటో తెలుసా? పెళ్లి – అనుకోలేదు నువ్వు.. ఇంత తొందరగా ఈ అంశంలోకి వస్తానని. నువ్వు ఏమీ అనుకోవు. ఉత్తర దక్షిణాన్ని గురించి ఆలోచనే లేదు నీకు. గతాన్ని స్మరించడమే కిట్టదు. వర్తమానాన్ని మింగుతూ ఉంటావు. ఈ తత్వం అలవరుచుకుంటే వచ్చేది కాదు. జన్మతః సిద్ధిస్తుంది. ఇది జీవితాంతం ఉంటే మంచిదే. కాని అలా భావించడం ఒక పగటి కల. అక్షరాలా పగటి కల. అంటే నీకు కోపం, బాధ, అసహ్యం లాంటివెన్నో కలగవచ్చు. కాని సత్యం సుమీ! అమ్మడూ నేను చెపుతూన్నది. అనాలోచితంగా మానవజాతి చేస్తూన్న పనులలో మొదటిది పెళ్లి. ఎంతో ఆలోచిస్తూ చేస్తూన్నాననుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది – భూతభవిష్యద్వర్తమానాలను అనుశీలించి చేస్తున్నామనుకుంటారీ పని. వీరందరూ కూడా ఈ విషయం దగ్గరే భూతాన్ని స్మరించరు. భవిష్యత్తును ఊహించరు. నిజానికి వర్తమానాన్నే స్మరిస్తారు. నిజానికి వర్తమానమే శాశ్వతమై భూతభవిష్యత్తులు లేకపోయినట్లయితే ఎంతో బావుండుననుకుంటాము. నిజానికి గత స్మృతులతో వేగుతూ భవిష్యత్తుకు భయపడుతూ సుఖంగా వర్తమానాన్ని ధ్వంసం చేసుకునే వాళ్ల మీద మనకు సానుభూతి అవసరం లేదు. లేకపోయినా సానుభూతి మానవత్వ లక్షణ శ్రేణిలో మొదటిదని కదా అంటూంటావు. దాన్ని ఆశించనివారు లేరని నీ ఊహ. కాని సానుభూతిని చూపడం ప్రారంభించేవారు, జీవితాంతం దానితోనే ఉండాల్సి వచ్చేసరికి జీవితం విసుగెత్తిపోయి సానుభూతి చూపే వాళ్ల మీద అసహ్యం ఏర్పడుతుంది. దాంపత్యంలో ఉన్న చిక్కే ఇది. సానుభూతి – భర్త భార్య నుంచి తన పరిశ్రమకు సానుభూతిగా చిరునవ్వులు కోరవచ్చు. భార్య భర్త నుండి తన కుటుంబ పరిశ్రమకు సానుభూతిగా చీరలూ, నగలూ వాంఛించవచ్చు. ఈ సానుభూతి పరస్పరాపేక్షితం. అది లభించినట్లయితే వారు చిలకా గోరింకల్లా ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇది ఒకే వైపు నుండి వస్తుంది. రెండవవారు సదా వాంఛించడమే కాని ప్రదర్శించరు. అప్పుడు అవతలివారు దాన్ని ఇస్తూన్నంత కాలం ఇబ్బంది లేదు. అంటే ఒకరెప్పుడూ ఒదిగి ఉండడమే. ఇందులో సుఖం ఉభయులకూ ఉందని నమ్మగలమా, ఉన్నట్టు నటిస్తారు. ఈ నటన చిరకాలం సాగదే. నటన నటనే. ఎప్పుడో ఈ నటన బయటపడుతుంది. అప్పుడు నరకమే కదా. మరో శ్రేణి ఉంది – వారు ఉభయులకూ ఒకరి మీద ఒకరికి సానుభూతి ఉండదు. పులీ – మేకా మొగుడూ పెళ్లాయినట్లుంటుంది సంసారం. ఇంతకూ – ఏది ఎలా జరుగుతున్నా ఒక పురుషుడూ – ఒక స్త్రీ కలిసిమెలసి ఉంటూన్నట్టు నటిస్తూ అయినా బ్రతకక తప్పనిసరి సామాజిక వ్యవస్థలో మనం బ్రతుకుతూ... ఇప్పుడు ఆ నిబంధనలు ముళ్ల కిరీటాలే అయినా ధరించక తప్పదు. (క్లిక్: నూట పాతికేళ్ళ యువకుడు) స్త్రీకి పురుషుడూ, పురుషునికి స్త్రీ ఆహార నిద్రాద్యవసరాలకే ఆవశ్యకం కాదు సుమా. ఈ అవసరాలకే పరిమితం చేసుకున్న భార్యభర్తలు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ అయినా సంసారమే సాగిస్తారు. కాని అందుకు కాదుగా నువ్వడిగింది. జీవితంలో సాహచర్యం కోసం కదా! అటువంటప్పుడు నేనేం చెప్పగలను, అని తప్పుకోవడం నన్ను మోసగించుకోవడం అవుతుంది. ప్రయోజనరహితంగా ఈ మోసకారి జీవితాలు గడిపేవారిని నేనెరుగుదును. కానీ ఈ అల్ప విషయం కోసం అబద్ధమాడడం నాకిష్టం లేదు. కొందరితో అయినా యదార్థంగా ఉండడం మంచిది కనుక ఇంత వ్రాస్తున్నాను. ఈ సారి మరికొంత... – ఉషశ్రీ -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
కండలు తిరిగిన దేహం.. పొడవాటి జుట్టు; అదరహో ధోని
టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. మాములుగానే ధోని మంచి ఫిజిక్‌తో ఉంటాడు. అలాంటి ధోని ఈసారి కండలు తిరిగిన దేహంతో .. పొడవాటి జుట్టుతో .. చేతిలో కత్తులతో యుద్ధంలో శత్రువులపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇదేంటి ధోని సినిమాల్లో ఏమైనా కనిపిస్తున్నాడా అని సందేహం వద్దు. ఒక యానిమేటెడ్ గ్రాఫిక్స్ నవల కోసం ధోని వారియర్ అవతారమెత్తాడు. అథర్వ అనే టైటిల్‌తో తొందర్లోనే రానున్న ఈ నవలకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అథర్వ అనే సూపర్ హీరో క్యారెక్టర్లో మెరుస్తున్న ధోని.. తన లుక్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. కాగా ఈ నవలను రమేశ్ తమిల్మని రాశారు. చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా! మోషన్ పోస్టర్‌కు సంబంధించిన టీజర్‌ను ధోని స్వయంగా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అథర్వ అనే కొత్త అవతారంలో కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇందులోని స్టోరీ, ఆర్ట్‌వర్క్‌తో ప్రతీ ఒక్కరు లీనమవుతారని.. ముఖ్యంగా కామిక్ లవర్స్‌కు ఇదో పెద్ద పండుగలా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో నాలుగోసారి సీఎస్కేను విజేతగా నిలబెట్టిన ధోని.. మరోసారి సీఎస్కే కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఫిబ్రవరి 12,13న జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో సీఎస్కే ఎవరిని కొనుగోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి:Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది -
క్యాచ్–22 సిచ్యువేషన్ అంటే ఏంటో తెలుసా?
జీవితంలో మనకు అప్పుడప్పుడూ కొన్ని రకాల సందర్భాలు ఎదురవుతుంటాయి. కింద ఇచ్చిన పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైతే ‘క్యాచ్–22 సిచ్యువేషన్’లో ఉన్నట్లు. ► ఏదైనా ఒక సందర్భంలో ఒక అడుగు ముందుకు వేయబోతే సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి ఎదురుకావడం. (క్లిక్: ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?) ► మీరు మీ కళ్లజోడును ఎక్కడో పెట్టి మరిచిపోతారు. అయితే అవి ఎక్కడున్నాయో వెదకాలంటే కళ్లజోడు తప్పనిసరి. ఇదొక విచిత్ర పరిస్థితి. ∙మీరు కారు డ్రైవ్ చేస్తూ ఒక సైకిలిస్ట్‌ను ఢీకొట్టారు. ‘నువ్వు సైకిలిస్ట్‌ను చూశావా?’ అని జడ్జి అడుగుతాడు. ‘చూశాను’ అని అంటే ‘చూస్తూ కూడా ఎందుకు ఢీకొట్టావు?’ అని అడుగుతాడు. ‘చూడలేదు’ అని చెబితే ‘అంత నిర్లక్ష్యమా!’ అంటాడు. ఇదొక సంకట పరిస్థితి. (నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?) జోసెఫ్ హెలీ రాసిన క్యాచ్–22 సెటైరికల్ నవలతో ఈ ‘క్యాచ్–22’ అనే ఎక్స్ప్రెషన్ మొదలైంది. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యం తీసుకొని రాసిన ఈ నవలలో యుద్ధంలో ఉండే క్రూరత్వం, వినాశనాన్ని వ్యంగ్యాత్మకంగా చెబుతారు రచయిత. (క్లిక్: అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది..!) -
‘గిన్నిస్‌బుక్’ పరిశీలనలో ‘భారతవర్ష’
తెనాలి: విజయవాడకు చెందిన బహుభాషా కోవిదుడు వెంకట్ పూలబాల రచన ‘భారతవర్ష’కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు వారి సంప్రదాయ, సాంస్కృతిక అంశాలతో గద్య పద్య కావ్యంగా 1,265 పేజీల్లో వెలువడిన ఆధ్యాత్మిక శృంగార కావ్యం భారతవర్ష. అమెరికాలోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఈ నెల 16న వెబినార్‌లో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించనుంది. డబ్బు కన్నా విలువైనవి మానవ సంబంధాలని, గుణగుణాలు ప్రగతికి సోపానాలనే మరపురాని ఇతివృత్తంతో, మనసుకు హాయి గొలిపే భాషతో, ఉదాత్తమైన పాత్రలతో మనోరంజకంగా మలచిన కావ్యం. తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి అభినందనలు అందుకున్న భారతవర్ష, విడుదల కాకుండానే గిన్నిస్‌బుక్ పరిశీలనలో ఉండటం మరో విశేషం. వెయ్యి పేజీలు మించిన నవల రచనకు మిట్చెల్ అనే ఇంగ్లిష్ రచయిత్రికి పదేళ్లు పట్టింది. ‘జూరాసిక్ పార్క్’ రచనకు క్రోక్టర్ అనే అమెరికన్ రచయిత అంతే సమయం తీసుకున్నారు. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యుగోల్కు ‘మిజరబుల్’ అనే నవలకు పన్నెండేళ్లు పట్టింది. పూలబాల తన వృత్తపద్యాలతో గ్రాంధిక తెలుగులో భారతవర్ష గ్రంథాన్ని కేవలం ఎనిమిది నెలల్లోనే రచించారు. తెలుగులో తొలి ఫ్రెంచి నవల తెలుగులో తొలి ఫ్రెంచి నవల రాసిన రచయితగా గుర్తింపు పొందిన పూలబాల బహుభాషాకోవిదుడు. ఆరు విదేశీ భాషలు తెలిసిన పూలబాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెంటర్లో బోధించారు. పేజీ మేకర్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ వర్డ్‌పై గ్రంథాన్ని నేరుగా కంపోజ్ చేయటం, ట్రాన్స్లిటరేషన్ ద్వారా 1,265 పేజీలు తెలుగు నవల టైపు చేయడమనే అంశాలు గిన్నిస్ బుక్ పరిశీలనలో ఉన్నాయి. -
ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?
ఆశావాదం మంచిదే కాని అతి ఆశావాదంతోనే సమస్య. అతి ఆశావాదం వాస్తవాలను చూడనివ్వదు. భ్రమజనిత ప్రపంచంలో పెడుతుంది. ఏదైనా ఐడియా లేదా ప్లాన్‌లో వాస్తవం తక్కువై, ఆశావాదం మరీ ఎక్కువైంది అనుకోండి ‘ఉత్త ప్యాంగసియన్ ఐడియా’ అంటారు. అతి ఆశావాదులను ‘ప్యాంగసియన్’ అంటారు. ఇంతకీ ఎవరు ఇతను? ఫ్రెంచ్ ఫిలాసఫర్, రైటర్, హిస్టారియన్ వొల్టేర్ 1759 లో ‘కాండీడ్’ అనే నవల రాశాడు. అనేక దేశాల్లో ఈ పుస్తకం నిషేధానికి గురైంది. ఆ కాలంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేరుగాంచింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది) ఈ నవలలో ‘ప్యాంగ్లాస్’ అనే తత్వవేత్త అతిఆశావాది. నెత్తి మీద బండ పడినా, కొండ పడలేదు కదా! అని సర్దుకుపోయే తత్వం. తన అతి ఆశావాదాన్ని నెగ్గించుకోవడానికి వాస్తవాలతో సంబంధం లేని ఎన్ని వాదనలైనా చేస్తాడు. చివరికి తాను బిచ్చమెత్తుకునే విషాదపరిస్థితి వచ్చినప్పటికీ తన ఆతిఆశావాదాన్ని మాత్రం వదలడు! తన కంటే సీనియర్ అయిన ఒక జర్మన్ తత్వవేత్తను దృష్టిలో పెట్టుకొని వొల్టేర్ సెటైరికల్‌గా ఈ పాత్రను సృష్టించాడు. (చదవండి: లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ.. అదే ఆమె మంత్రం!) -
మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన
సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన స్వాతం త్య్రోద్యమ వీరుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ. ఆయన న్యాయ వాది. 1877 డిసెంబర్ 4న గుంటూరు జిల్లా వేములూరు పాడు గ్రామంలో జన్మించారు. అనేక సాహిత్య గ్రంథాలు చదివిన స్ఫూర్తితో 1900 సంవ త్సరంలో గుంటూరులో యంగ్‌మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించారు. సంస్కరణ దృక్పథంతో 1902లో గుంటూరులో వితంతు శరణాలయం స్థాపించారు. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగాన్ని ఆహ్వానించి ఆయన అధ్యక్షతన తొలి వితంతు వివాహం జరిపించారు. సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే రచనలు, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ ఆశయం. సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతా ధర్మాన్ని స్థాపించడం ఆయన లక్ష్యం. కులవ్యవస్థను నిరసించారు. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్య సాధనకై విప్లవాత్మకమైన ‘మాలపల్లి’ రచించారు. జాతీయోద్యమంలో రాజకీయ వాతావరణాన్ని, గాంధీ ఆశయాలను, తెలుగు వారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి. ( వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) ఉన్నవ 1922లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి రాయవెల్లురు జైలుకు వెళ్లారు. అక్కడే ఈ నవల రాశారు. మంగళపురంలో రామదాసు, మాలక్ష్మి దళిత రైతు దంపతులు. వాళ్లకు వెంకటదాసు, సంగదాసు, రంగడు అనే ముగ్గురు కొడుకులు. ఆ ఊరి భూస్వామి చౌదరయ్య. సంగదాసు చదువుకున్నాడు. దేనిమీదనైనా సొంత అభిప్రాయాలు ఉన్నవాడు. అతడు చౌదరయ్య దగ్గర పాలేరు. అతనికి చౌదరయ్య కుమారుడు రామానాయుడు స్నేహితుడు. చౌదరయ్యకు అది నచ్చదు. వరి కోతల సమయంలో రైతులు ధాన్యానికి బదులు రోజుకు ఆరణాల కూలీ ఇస్తామంటే కూలీలు అందుకు ఒప్పుకోకుండా ధాన్యమే కావాలన్నప్పుడు సంగదాసు కూలీల అభిప్రాయాన్ని సమర్థిస్తాడు. కూలీల తిరుగుబాటుకు సంగదాసు కారణమని చౌదరయ్యకు కోపం వస్తుంది. ఆనాటి సమాజంలో హరిజనుల కుటుంబ బాధను ఇతివృత్తంగా తీసుకుని హరిజనుడిని నాయకుడిగా చేసి నవల రాయడం సాహసం. అందుకే ఈ నవలకు నాయకుడి పేరు కలిసి వచ్చేలా ‘సంగ విజయం’ అనే మరో పేరు సార్థకమైంది. ఆ నవల నూరేళ్ల సందర్భం ఈ సంవత్సరం. ఈ నవలలో చరమగీతం, సమతాధర్మం అనే రెండు గేయాలను వాడుకభాషలో రాసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. బెల్లంకొండ రాఘవరావు ఆర్థిక సహ కారంతో 1922లో రెండు భాగాలుగా ప్రచురితమైన ఈ నవల 1923, 1936లో మద్రాసు ప్రభుత్వం వారి నిషేధానికి గురైంది. రాజాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 1937 నిషేధాన్ని తొలగించారు. గాంధేయ సిద్ధాంతాలను, శాంతి అహింసలను ఆచరణలో చూపిన వ్యక్తి ఈ నవలలో రామదాసు. భూస్వామి చౌదరయ్య తన కుమారుడిని చంపినపుడు, భార్య మరణించినపుడు, కుమారుడు వెంకటదాసు క్షతగాత్రు డైనప్పుడు, శాంతి, సహనం రూపుదాల్చినట్లు ప్రవర్తించాడు. భారతజాతి నెత్తురు బొట్టు కారకుండా స్వాతంత్రాన్ని పొందగలిగితే అది మహా అద్భుత కార్యంగా పరిగణిస్తారని రామదాసు గాంధేయ మార్గాన్ని ప్రతి పాదించాడు. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఈ నవలకు పీఠిక రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రసాహిత్య హృదయ పరి ణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యమ న్నారు. నగ్నముని ఈ నవలని నాటకీకరించారు. ఆచార్య రంగా దీన్ని టాల్‌స్టాయ్ బృహన్నవల ‘వార్ అండ్ పీస్’తో పోల్చదగినది అన్నారు. ’మాలపల్లి’ని అనుసరించి ఆయన ‘హరిజన నాయకుడు’ నవల రాశారు. గుంటూరు శేషేంద్రశర్మ ప్రశంసించినట్లు ‘తెలుగు విప్లవ సాహిత్యంలో వచ్చిన ప్రథమ మహా కావ్యం మాలపల్లి’ అనడం అతిశయోక్తి కాదు. గాంధేయవాదిగా, స్వాతంత్య్రయోధుడిగా, సంఘ సంస్కర్తగా, గుంటూరు శారద నికేతన్ వ్యవస్థాపకుడిగా, తెలుగు నవల సాహిత్య వైతాళికుడిగా గణనీయమైన కీర్తి పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ 1958 సెప్టెంబర్ 25వ తేదీన పరమపపదించాడు. తెలుగు నవలా సాహిత్యంలో ‘మాలపల్లి’ చిరస్మరణీయం. - డా. పీవీ సుబ్బారావు వ్యాసకర్త సాహితీ విమర్శకులు (ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నవలకు శతవసంతాలు; డిసెంబర్ 4న ఉన్నవ జయంతి) -
The Alchemist: ఎల్లలు లేని అభిమానం.. ఓవర్‌నైట్ పాపులారిటీ
The Alchemist: పుస్తక ప్రియులకు పరిచయం అక్కర్లేని నవల ది ఆల్కెమిస్ట్. తన అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఓ గొర్రెల కాపరి పిల్లాడి జీవన ప్రయాణం, అతనికి ఎదురైన ఆటుపోట్లు అనుభవాల సారమే ఈ పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఈ పుస్తకం నుంచి స్ఫూర్తిని పొందారు. ఈ నవల రచయిత పాలో కోయిలోకి లక్షల మంది అభిమానులయ్యారు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన ప్రదీప్. కేరళలోని చెరాయ్కి చెందిన ప్రదీప్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పుస్తకాలు చదవడమంటే ప్రాణం. ప్రసిద్ధ రచయితల పుస్తకాలన్నీ చదివేశాడు. అయితే అందులో అమితంగా ఆకట్టుకుంది ఆల్కెమిస్ట్. అందుకే తన అభిమానానికి గుర్తుగా తన ఆటో వెనుక ఆల్కెమిస్ట్ నవల పేరుని మళయాళంలో, దాని రచయిత పాలో కోయిలో పేరును ఇంగ్లీష్‌లో రాసుకున్నాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియా ద్వారా ఎక్కడో బ్రెజిల్లో ఉన్న పాలోకోయిలోకి చేరింది. ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఓ ఆటో వెనుక తన పేరు రాసుకున్న ఫోటోను పాలో కోయిలో ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటో పంపినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు. ట్విట్టర్ అకౌంట్లో ప్రదీప్ ఆటో కనిపించడతో ఒక్కసారిగా అతనికి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. స్థానిక మీడియాలో అతని పేరు మార్మోగిపోతోంది. ఏదైనా ఒక రోజు బ్రెజిల్ వెళ్లి తన అభిమాన రచయితను తప్పకుండా కలుస్తానంటున్నాడు ప్రదీప్. Kerala, India (thank you very much for the photo) pic.twitter.com/13IdqKwsMo — Paulo Coelho (@paulocoelho) September 4, 2021 చదవండి: వింతగా అరుస్తున్న పక్షి.. ఆశ్చర్యంలో నెటిజన్లు -
తానా నవలల పోటీ... విజేతలు వీరే
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన నవలల పోటీలో విశాఖపట్నంకి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్థనారి నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలిద్దరికి రెండు లక్షల రూపాయలను సమానంగా అందివ్వనున్నారు. అదే విధంగా ఈ నవలలను ప్రచురించే బాధ్యతలను తామే తీసుకుంటామని తానా కార్యవర్గం ప్రకటించింది. తానా ఆధ్వర్యంలో 1997 నుంచి నవలల పోటీలు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల పాటు నవల, కథా పోటీలు నిరాటంకంగా జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఈ పోటీలు నిర్వహించలేదు. తిరిగి 2017 నుంచి నవల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగిన నవలల పోటీకి మొత్తం 107 నవలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. -
నవల కావాలి
అగ్రహారం ఇళ్ల మీద గద్దలు వాలడం చూసి అగ్రహార వాసులు హాహాకారాలు చేస్తారు. అలా గద్దలు వాలడం వారు ఎరగరు. కాని గద్దలు మాత్రం ఏం చేస్తాయి ఇళ్లల్లో ఉండాల్సిన ఎలుకలు వీధుల్లోకి వచ్చి దౌడు తీస్తున్నాయి. కలరా వచ్చింది. కలరా విలయతాండవం ఆ ప్రాంతంలో మొదలయ్యింది. ఆ మహమ్మారిని ఎదుర్కొనాలా సనాతన సంప్రదాయాల సంక్లిష్టతను ఎదుర్కొనాలా యు.ఆర్.అనంతమూర్తి నవల ‘సంస్కార’ పాఠకునికి ఎన్నో ప్రశ్నలు చేతికి ఇస్తుంది. ఎన్నో సమాధానాలు వెతకమంటుంది. 50 ఏళ్ల క్రితం వచ్చిన ఈ నవల నేటికీ చర్చను లేవదీస్తూనే ఉంది. ‘సుదీర్ఘ వచనం’ సమగ్ర జీవితాన్ని చూపిస్తుంది. సమస్య సమగ్రతను చూపుతుంది. ఒక చారిత్రక సందర్భాన్ని సమూలంగా చర్చిస్తుంది. అనుభూతినో, ఆలోచననో, దర్శనాన్నో, వికాసాన్నో అది ప్రతిపాదిస్తుంది. సుదీర్ఘ వచనం కలిగిన ‘నవల’ ఆ పని చేస్తుంది. ఒక రచయిత తాను రచయితనని నిరూపించుకోవడానికి నవల రాయాలని పాశ్చాత్యులు భావిస్తారు. పాశ్చాత్యులకు నవల ప్రియ పఠన వచనం. నేటికీ అమెరికా, యూరప్‌లలో నవలకు ఉన్న గిరాకీ హ్రస్వ వచనం కలిగిన కథకు లేదు. అంతర్జాతీయ అవార్డులు, నోబెల్ బహుమతి నవలను పరిగణించినట్టుగా ఇతర వచనాలను పరిగణించవు. ఆ విధంగా పోల్చి చూసినప్పుడు తెలుగు నవల ప్రయాణం ఎత్తు పల్లాలను చూస్తూ ముందుకు సాగుతోంది. పాశ్చాత్యులకు యుద్ధం ఒక ప్రధాన నవలా వస్తువు. లైంగిక వ్యామోహాలు కూడా. కాని తెలుగు నవల ఆదర్శాన్ని తన ఆత్మగా స్వీకరించింది. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ఉద్దండులు ఒజ్జలుగా మారి తెలుగు నవలా బాటలు వేశారు. ఆ తర్వాత గుడిపాటి చలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, ఒద్దిరాజు సోదరులు, సురవరం, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య తదితరులు ఆ బాట లను విశాలం చేస్తూ అశ్వ రథాలను, ఏనుగు అంబారీలను నడిపించారు. ఆపై స్త్రీలు ఆ రచనా కళను హస్తగతం చేసుకున్నారు. రంగనాయకమ్మ పురోగామి నవలకు ఆధార కేంద్రం నిర్మించారు. వాసిరెడ్డి సీతాదేవి నవల ‘మరీచిక’ నిషేధం పొందే స్థాయిలో నవల శక్తిమంతం అయ్యింది. నవల ఏం చేసిందంటే భాషను పాఠకులకు పరిచితం చేసింది. అక్షరాస్యత పట్ల ఆసక్తి పెంచింది. జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పింది. సంస్కరణ అభిలాషను పాదుకొల్పింది. చారిత్రక ఘటనలను రీప్లే చేసింది. తాత్త్విక దృష్టిని అలవర్చింది. సామాన్యుడికి అతడి బలహీనతలు బలాలు తెలియచేసింది. గోపిచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’, రావిశాస్త్రి ‘అల్పజీవి’, కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’, భాస్కరభట్ల కృష్ణారావు ‘వెల్లువలో పూచికపుల్లలు’, నవీన్ ‘అంపశయ్య’, శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’... ఇవన్నీ నవీన వస్తు శిల్పాలతో పాఠకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కాలం మారింది. కాలక్షేప నవలలు పెరిగాయి. వీక్లీలు వచ్చి కమర్షియల్ నవలను ప్రోత్సహించాయి. సామాజిక అంశాలను, సామాజిక జీవితాన్ని రాసే నవలలు వేదికలు కోల్పోయాయి. ఆ కాలంలో కూడా కె.ఎన్.వై.పతంజలి, కేశవరెడ్డి, ఓల్గా, కాశీభట్ల వేణుగోపాల్ తదితరులు మెరిసి తమ ఉనికిని, నవల ఉనికిని నిలబెట్టారు. అయితే 1990–2000 కాలంలో సీరియస్ నవల కంటే సీరియస్ కథ పాఠకులకు చేరువయ్యింది. ఇక నవల సంగతి ముగిసినట్టే అని కూడా అనుకున్నారు. కాని ఇప్పుడు తెలుగు నవల మళ్లీ విస్తృత కృషిలో ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల సమర్థులైన రచయితలు సుదీర్ఘ వచనం మేము రాయగలం, రాస్తున్నాం అని నిరూపిస్తున్నారు. అల్లం రాజయ్య, స్వామి, సన్నపరెడ్డి వెంకటరామి రెడ్డి, మధురాంతకం నరేంద్ర, రాసాని, సలీం, పెద్దింటి అశోక్ కుమార్, చంద్రలత... తదితరులు ఎందరో నవలను ముందు వరుసలోకి తెచ్చారు. ప్రవాసాంధ్ర సంస్థలైన తానా, ఆటా, రాష్ట్రంలోని సంస్థలు నిర్వహిస్తున్న నవలా పోటీలు కూడా ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ఇప్పుడే తెలుగు నవల అవసరం మరింతగా కనపడుతోంది. దేశ రాజకీయ సందర్భాలను, సామాజిక పరిణామాలను, పూర్తిగా వేగమంతమయ్యి మనిషిని ఒంటరి చేస్తున్న పోటీ జీవితాన్ని, వలసప్రవాస బతుకులను, హింసా ధోరణి, విలువల పతనం, ద్వేషం, మానసిక అలజడులు, స్త్రీ పురుష సంబంధాలు... ఇవన్నీ ఇప్పుడు సుదీర్ఘ వచనంలో పాఠకులకు చూపాల్సి ఉంది. కరోనా సంక్షోభం కారణంగా దేశంలో, తెలుగు రాష్ట్రాలలో మనిషి జీవితం ఎంతగా సంక్షుభితమయ్యిందో గమనించి చూస్తే రాబోయే రోజుల్లో ఈ కాలాన్ని నవలా వస్తువుగా తీసుకుంటే ఎన్ని నవలలు వస్తాయో కదా. అంతే కాదు ప్రపంచంలో వస్తున్న గొప్ప నవలలు ఇటుకి, ఇక్కడ వస్తున్న మంచి నవలలు అటుకి అనువాదమయ్యి ఆదాన ప్రదానాలు జరగాల్సి ఉంది. బెంగాల్ నుంచి రాసిన శరత్ దేశ రచయిత కావడానికి తెలుగునాడు నుంచి రాసిన చలం ప్రాంతీయ రచయితగా మాత్రమే ఉండిపోవడానికి ఇన్స్టిట్యూషన్ల వైఫల్యమే కాక సాహితీ బృందాల అలసత్వమూ కారణమే. ఎవరో అన్నట్టుగా తెలుగు నవల అంతర్జాతీయ స్థాయిలోనే ఉంది... కాకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉందని రచయితలకు నమ్మకం కలిగించాలి. ఓటీటీలలో పది పన్నెండు ఎపిసోడ్ల వెబ్ సిరీస్‌లు చూస్తున్న వీక్షకులను వందా రెండు వందల పేజీల నవల చదివించేలా చేయడమే ఇప్పుడు రచయితలకు అసలైన సవాలు. తెలుగు నవల వేయి కలాలతో విరచితం వికసితం కావాలని కోరుకుందాం. -
పేజ్ త్రీ కేళీ.. కామోత్సవ్
విలువలు మధ్యతరగతి జీవితాల వెలలు. ఆ పై తరగతికి సంతోషమే పరమావధి.. కింది తరగతికి బతుకీడ్చమే ప్రధానం. అందుకే ఆ రెండింటి భారాన్ని మధ్యతరగతి మోస్తూ ఉంటుంది. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘కామోత్సవ్’ ఈ విషయాన్నే వెల్లడిస్తుంది ఉన్నత వర్గపు జీవన శైలిని నవల రూపంలో. కథానాయకుడు జ్ఞాన్.. చిత్రకారుడు. చిత్రకళ మీదే కాదు సాహిత్యం, చరిత్ర, సమకాలీన రాజకీయాల మీదా పట్టున్నవాడు. లెఫ్ట్ ఐడియాలజీ ప్రేమికుడు. ఎలీట్ కుటుంబపు అల్లుడు. ఆ లైఫ్‌స్టయిల్‌లోని సుఖభోగాలన్నిటినీ అనుభవిస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు. పోలీసు నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తిని కలిసి పోలీసులకు పట్టుబడి.. వాళ్ల కన్నుగప్పి పారిపోయి నిందితుడిగా వాళ్ల గాలింపులో ఉంటాడు. భార్య కీర్తి జ్ఞాన్‌ను కాపాడుకునే ప్రయత్నంతో ముంబై తీసుకెళ్తుంది. అక్కడ స్టార్ హోటల బస, సినిమా, వ్యాపార, రాజకీయవేత్తల, కళాకారుల పార్టీలతో కాలం వెలిబుచ్చుతుంటారు. అది ఏ మలుపు తీసుకొని ఎక్కడికి వెళ్తుందనే గమనం ఆసక్తిగా సాగుతుంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాల జీవితాలను, సంబంధాలను, చట్టాలకతీతమైన వాళ్ల వెసులుబాటునూ చెప్తుందీ నవల. 1987లో అప్పటి ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వచ్చిన కామోత్సవ్‌ను ఈ యేడు నవలగా తీసుకొచ్చారు. కాలతీతం కాని రచన. వర్తమానాన్నే ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంటుంది పాఠకులకు. అప్పట్లో ఈ సీరియల్ ఒక సంచలనం. అశ్లీల రచనగా కోర్ట్ దాకా వెళ్లింది. కాని ఆ కేసును కోర్ట్ కొట్టిపారేసింది. ఇప్పటి సాహిత్యమే కాదు, సినిమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని కథాంశాలు, చిత్రీకరణలతో పోల్చుకుంటే కామెత్సవ్ మీద అశ్లీల రచన ముద్ర హాస్యాస్పదం అనిపిస్తుంది. ‘పేజ్ త్రీ’ సినిమా కంటే ఎన్నో ఏళ్ల ముందే తెలుగులో ఆ కల్చర్ మీద ఈ రచన వచ్చింది. పేజ్ త్రీ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న పాఠకులకు ఆ కుతూహలాన్ని తీర్చే నవల కామోత్సవ్. కామోత్సవ్ రచయిత.. గుంటూరు శేషేంద్ర శర్మ ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్ ట్రస్ట్ పేజీలు: 198, వెల.. 200 రూపాయలు ప్రతులకు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పుస్తక దుకాణాల్లో దొరుకుతుంది. -
యుద్ధ చరిత్రల్లో స్త్రీ
రెండవ ఇటాలో–ఇథియోపియన్ యుద్ధంలో (1935–1941) ఇటలీ మీద ఇథియోపియా సాధించిన విజయం ప్రతిష్టాత్మకమైనది. మొదటిసారి పరాజయం పాలైన ఇటలీ, నలభై ఏళ్ల తరవాత ముస్సోలినీ కాలంలో మరోసారి దురాక్రమణకి ప్రయత్నించి పరాజయాన్ని చవిచూసింది. సుశిక్షిత సైన్యం, ఆధునిక యుద్ధపరికరాలూ, రేడియోలతోబాటు ఇథియోపియన్ ప్రాంతపు నైసర్గిక స్వరూపం తెలిసిన శత్రురాజుల సహకారం ఇటలీ బలాలైతే, అప్పటికప్పుడు హడావుడిగా సమీకరించుకున్న సైన్య సమూహాలూ, సాంప్రదాయ యుద్ధపరికరాలూ, సమాచార లోపాలూ ఇథియోపియా బలహీనతలు. ఓటమి అనివార్యం అనుకున్న తరుణంలో ఇటలీని నిలువరించి విజయాన్ని సాధించడం ఇథియోపియా చరిత్రలో ఘనమైన అధ్యాయం. ఇథియో–అమెరికన్ రచయిత్రి మాజా మెంగిస్టె రాసిన చారిత్రక నవల ‘ద షాడో కింగ్’ ఈ యుద్ధం గురించి చెబుతుంది. పురుష సైనికాధికారులని మాత్రమే ప్రస్తావించే చరిత్రలోనూ వివక్ష ఉందన్నది రచయిత్రి వాదన. పదేళ్లపాటు ఈ యుద్ధం మీద చేసిన పరిశోధనలో స్త్రీల ప్రస్తా వన ఎక్కడా కనిపించని రచయిత్రికి, తమ వంశంలోని స్త్రీలు ఇందులో పాల్గొన్నారని తల్లి ద్వారా తెలియటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇథియోపియన్ స్త్రీలు తెరవెనుక పాత్రలకే పరిమితమై పోకుండా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నారన్న నిజాన్ని చరిత్రకారులు గుర్తించకపోవటం శోచనీయమనీ, వారి సాహస గాథలు వంటింటి కథలుగా మిగిలిపోతున్నాయన్న రచయిత్రి ఆవేదననే నవలకి ప్రేరణ. ఇటలీ యుద్ధం ప్రకటించాక పరాజయ, ప్రాణభయాలతో ఇథియోపియా రాజు హైలా సెలాసే ఇంగ్లండ్ పారిపోతాడు. రాజే పారిపోయాడని తెలిస్తే ప్రజలు నిర్వీర్యులవుతారనుకున్న సైన్యాధికారి కిడానె, రాజు రూపురేఖలతో ఉన్న దళసభ్యుడు మినిమ్ అనే వ్యక్తిని ప్రజలను ఉత్తేజపరిచేందుకు షాడో కింగ్‌గా ప్రజల ముందుకు తెస్తాడు. గెరిల్లా పద్ధతిలో ప్రాణాలకు తెగించి పోరాడిన కిడానె, హీరూట్, ఆస్తర్, ఇతర పౌరులూ వెన్నెముకై నిలిచి గెలిచిన యుద్ధమే కథాంశం; యుద్ధభూమే కథావరణం. కొడుకు మరణం, భర్త నిర్లక్ష్యం, సేవకురాలు హీరూట్ పట్ల భర్త కిడానెకి ఉన్న ఆకర్షణ లాంటి సమస్యలున్నప్పటికీ, స్త్రీలను సంఘటిత పరుస్తూ సైనికులుగా తయారుచేసి ఇటాలియన్ సైన్యాధికారి ఫ్యుసెల్లి మీదకు ప్రత్యక్షదాడి చేసిన ఆస్తర్; ‘కొంతమంది వస్తువులను సొంతం చేసుకోటానికి పుడితే మరికొందరు వాటిని శుభ్రం చేసి నిర్దేశిత ప్రాంతాల్లో పెట్టడానికే పుడతారు,’ అనుకునే స్థితినుంచి యుద్ధఖైదీగా మారినపుడు గుండెనిబ్బరంతో ప్రయాణం సాగించే సేవకురాలు హీరూట్; వేశ్యగా పరిచయమై, ఇటాలియన్ సైన్యాధికారులకు సేవలందిస్తూ, మరోపక్క ఇథియోపియన్లకు గూఢచారిణిగా వ్యవహరిస్తూ స్వతంత్రాపేక్ష కోల్పోని ఫిఫి – వీళ్లంతా వివిధ ఔన్నత్యాలతో ప్రకాశించే స్త్రీ పాత్రలు. దాడులు కొనసాగించమని లండన్ నుంచి రాజు ఉత్తర్వులు పంపినప్పుడు– కొడుకుని రక్షించుకుంటున్న రాజు, కొడుకుని కోల్పోయిన తనని ప్రాణత్యాగం వైపుకి నడిపించటంలోని స్వార్థచింతన అర్థమవుతుంది సైన్యాధికారి కిడానేకి. ఇటాలియన్ సైన్యంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఇటాలియన్స్ దాష్టీకాలను అరాచకాలను సమర్థించలేని, యూదుడయిన కారణంగా వారిలో కలిసిపోలేని ఎత్తోరేది మౌనవేదన. ఇటలీ సైన్యాధికారి ఫ్యుసెల్లి సైనికరూపం వెనక ఉన్నభయాలూ, న్యూనతలూ మనిషి మౌలిక రూపాన్ని చూపిస్తాయి. యుద్ధానంతరం రాజ్యాధికారం తిరిగి చేపట్టగలిగిన హైలా సెలాసే, సివిల్ వార్ అనంతరం రైతుగా మారడం కొసమెరుపు. రాజై ఉండి అపరాధపు నీలినీడల్లో కుమిలిన హైలా సెలాసే షాడో కింగా? రైతే రాజుగా మారి ప్రజలను ఉత్తేజపరిచిన మినిమ్ షాడో కింగా అన్నది శీర్షికలోని ప్రహేళిక. బహుళ కథకులు, బలమైన పాత్రలు, కొత్తఒరవడిని గుర్తుచేసే కథాకథనం, యుద్ధవాతావరణ చిత్రీకరణలోని గ్రీక్ ట్రాజెడీ ఛాయలు, కథనంలో ఇమిడిపోయిన సూక్ష్మమైన వర్ణనలు, మనస్తత్వ విశ్లేషణలు, చర్చింపబడిన వివక్షలు నవల బలాలు. నవలలోని కథనం ‘ఫొటో’, ‘కోరస్’, ‘ఇంటర్లూ్యడ్స్’ అనే అధ్యాయాలుగా ఇటాలియన్ అరాచకాలనీ, జరుగుతున్న కథనీ, రాజు అంతరంగాన్నీ చిత్రిస్తూంటాయి. అక్కడక్కడా కనిపించే అమ్హారిక్, ఇటాలియన్ భాషాప్రయోగాలు ప్రాంతీయతకి దోహదం చేస్తాయే తప్ప, చదవడానికి ఆటంకాలు కావు. చరిత్ర చెప్పే వాస్తవాల అడుగున మరుగునపడ్డ ఉద్వేగాలు అనేకం ఉంటాయి. యుద్ధపరిణామాలకి సమాంతరంగా మానవజీవితంలో స్థితమై ఉండే జ్ఞాపకాల, గుండెచప్పుళ్ల నిరంతరతను ప్రదర్శించిన రచయిత్రి ప్రతిభా పాటవాలు– శ్రీపాద భాషలో – ఆమె వేత్తృతకి నికషాలు. - పద్మప్రియ -
మనుషులు గీసిన గీతలు
ప్రతిష్ఠాత్మక నేషనల్ బుక్ అవార్డ్స్ 2020కి షార్ట్‌లిస్ట్ అయిన ‘మైనర్ డీటైల్’ సైజులో చిన్నదయినా అతిశక్తివంతమైన నవలికగా రూపొందడంలో పాలెస్తీనా రచయిత్రి అదనియా షిబ్లీ, అభినందనీయమైన అనువాదం చేసిన ఎలిజబెత్ జకాట్ సమాన పాత్ర నిర్వహించారు. ఇజ్రాయెల్, పాలెస్తీనాల చరిత్రలోని హింసని లీలామాత్రంగానే స్పృశించినా, పెను అలజడిని కలిగించడంలో వస్తుశిల్పాల సమాన భాగస్వామ్యం ఉంది. నిర్మాణపరంగా నవల కూడా రెండు సమాన భాగాలుగా విభజించబడి ఉంటుంది. 1948లో జరిగిన ఇజ్రాయెల్– పాలెస్తీనా యుద్ధపరిణామం ఇజ్రాయెల్‌కి స్వాతంత్య్ర సాధనగా, పాలెస్తీనాకి ఉత్పాతంగా పరిణమించాక, ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారి దక్షిణ ప్రాంతంలో ఈజిప్ట్‌తో ఉన్న సరిహద్దు భద్రతకోసం మిలిటరీ దళం ఏర్పాటు చేయడంతో ఆగస్ట్ 9, 1949న మొదటిభాగం ప్రారంభమవుతుంది. మొదటిరోజు రాత్రే దళం కమాండర్‌ని గుర్తుతెలియని విషప్పురుగేదో కుట్టడంతో సంబంధిత శరీరభాగమంతా ఇన్ఫెక్షన్కి గురవుతుంది. గాయపు సలపరింత పెరుగుతున్న కొద్దీ, కమాండర్ ఉన్మాదిలాగా కనిపించిన కీటకాలనన్నింటినీ చంపుతుంటాడు. మూడోరోజున దళం ఒక అరబ్బుల సమూహాన్ని గుర్తిస్తుంది. వాళ్లందరినీ కాల్చిపడేసాక, ‘‘కీటకం లాగా’’ బురఖాలో ముడుచుక్కూచుని బతికిబయటపడ్డ ఒక అరబ్ యువతిని పట్టుకుని క్యాంప్‌కి తీసుకొస్తారు. ఆమె వెనకే ఆమె కుక్క కూడా. మురికిగా ఉన్న ఆమెని పెట్రోల్‌తో శుద్ధి చేసి, జుట్టు కత్తిరించేస్తారు. మర్నాటి ఉదయం వరకూ దళసభ్యులు జరిపిన అత్యాచారాలకి గొంతువిప్పి ప్రతిఘటించలేని యువతి ఆక్రోశాన్ని, గొంతెత్తి అరుస్తూనే ఉన్న ఆమె కుక్క ద్వారానే వినగలం. మరుసటిరోజుకి ఆమెకిక అరవాల్సిన అవసరం రాదు– చుట్టూ అలముకుని ఉన్న పెట్రోల్ వాసన, కుక్క అరుపుల మధ్య ఆమెని కాల్చి చంపేయడంతో మొదటిభాగం పూర్తవుతుంది. అయిదురోజుల ఈ కథాభాగం ప్రథమపురుష భూతకాలపు కథనంలో, సూక్ష్మమైన వివరాలను సైతం తటస్థ కథనదూరంతో అందిస్తూ, పాత్రల ఆంతరంగికతలను ఏమాత్రం బహిర్గతం చేయని దృశ్యచిత్రణ. సుమారు అరవై ఏళ్ల తర్వాత పాలెస్తీనాలోని ఒక ఉద్యోగిని పై సంఘటన గురించిన విపులమైన వార్తాకథనాన్ని చదవడంతో రెండవభాగపు ఉత్తమపురుష వర్తమానకాలపు కథనపు హోరు ప్రారంభమవుతుంది. తన భయాల అభద్రతల్లో సాదాసీదా జీవితాన్ని గడుపుతూ, పక్క బిల్డింగ్ బాంబింగ్‌కి గురైతే తన కాగితాల మీద దుమ్ముని ఏమీ జరగనట్టే మామూలుగా దులుపుకునే ఈ అమ్మాయిని ఆ వార్త ఆకర్షించడానికి కారణం– ఆ దారుణం జరిగిన సరిగ్గా పాతికేళ్లకి అదే రోజున తను పుట్టడం అనే చిన్న వివరం. ఈ సంఘటన వెనకాల ఉన్న సత్యాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది కానీ, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలెస్తీనా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఆంక్షలుంటాయి. కొలీగ్ ఐడీ కార్డ్, అద్దెకి కార్ తీసుకుని, భయాలని అధిగమిస్తూ మాప్స్ పెట్టుకుని (1948కి ముందువీ, తరువాతవీ) ఆమె చేసిన ప్రయాణం మొత్తం నిష్ఫలమవుతుంది. మ్యూజియంలలో చూస్తున్న వస్తువులు గతానికి కేవలం మౌనసాక్ష్యాలు మాత్రమే. మధ్యలో పెట్రోల్ బంక్‌లో పొరపాటున కొంత పెట్రోల్ మీద ఒలకబోసుకుంటుంది. దారీతెన్నూ తెలియకుండా ఒంటిమీద పెట్రోల్ వాసనతో కార్లో తిరుగుతుండగా సుమారు డెబ్భై యేళ్లున్న ముసలామె ఒంటరిగా కనిపిస్తే, ఆగి లిఫ్ట్ ఇవ్వడం ఆమె కథకి మలుపు. ముసలామె దిగిపోయాక, రేప్ బాధితురాలు ఇప్పటికీ బతికుంటే ఇంతే వయసుండేది కదా అని వచ్చిన ఆలోచన ఆమె కథని పూర్తిగా మార్చేస్తుంది. జీవితంలో మొదటిసారిగా ఈ ప్రయాణంలో కొన్న చూయింగ్ గమ్, ఆమె చేసిన ఆఖరి తప్పవుతుంది. గతాలు వర్తమానాన్ని నిర్దేశిస్తాయి; వర్తమానంలోని అనుభవాలు గతాన్ని ప్రశ్నిస్తుంటాయి. కాలాల్లోని భేదాల భౌతికతని కథనంలోని దృష్టికోణపు మార్పు మనం ఉలిక్కిపడే అనుభవాన్ని కలిగించగా, ఆ కాలాలలోని సామ్యతని నవలలో పదేపదే ఉపయోగించే పెట్రోల్ వాసన, కుక్క అరుపులలాంటి ‘మోటిఫ్స్’ ప్రతీకాత్మకంగా చూపిస్తాయి. హింస రాజ్యమేలే చోట ఏమార్పూ ఆశించలేమన్న సారాంశాన్ని నవల ప్రారంభవాక్యమే తేల్చిచెబుతుంది: Nothing moved except the mirage. భ్రాంతి తప్ప మారేది మరోటి ఉండదు! -ఎ.వి.రమణమూర్తి -
జ్వలిత ప్రజ్వలనాలు
ప్రభుత్వంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా జింబాబ్వేలోని హరారేలో ఆందోళనలో పాల్గొని, కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారనే నేరారోపణలతో అరెస్ట్ కాబడి, అటుతర్వాత బెయిల్ మీద విడుదలవడం, క్షేత్రస్థాయిలోని కార్యకర్తగా త్సిత్సీ డాంగరెంబా సామాజిక నిబద్ధతకు నిదర్శనం కాగా, ఆమె రాసిన నవల ‘దిస్ మౌర్నబుల్ బాడీ’ బుకర్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ అయిన ఆరింటిలో ఒకటవటం నవలకూ, ఆమెకూ దక్కిన సాహితీ గౌరవం. జింబాబ్వే చరిత్ర నేపథ్యంగా రాసిన నవలల ట్రిలజీలో ఆఖరిదైన ఈ నవల విడిగా కూడా చదువుకోగలిగినది. మొదటి నవలలో వివక్షతోబాటు అనేక ఇబ్బందులని ఎదుర్కొంటూనే పట్టుదలతో చదువు పూర్తిచేసిన చిన్నపిల్లగా పరిచయమయిన కథానాయిక తాంబూ, రెండోనవలలో యుక్తవయస్కురాలిగా యుద్ధవాతావరణంతో అల్లకల్లోలమవుతున్న జింబాబ్వే (పాత రొడీషియా) సమాజంలో భాగంగా కనబడుతుంది. ‘దిస్ మౌర్నబుల్ బాడీ’లో కథానాయిక తాంబూ, హరారేలో కాపీరైటర్ ఉద్యోగం చేస్తున్న నడివయసు స్త్రీ. యుద్ధానంతర జింబాబ్వేలోని పెట్టుబడిదారీ విధానాలు, దేశాన్ని ఇంకా వీడని బ్రిటిష్ పోకడలు, ఆధిపత్యధోరణులు, లింగవివక్ష, లైంగిక హింసాత్మక దాడులు, పేదరికం నవలలో పరిచయమవుతాయి. ఊరినీ, తమ తల్లిదండ్రుల జీవితాలనీ ఆవరించిన పేదరికం, నిరాశానిస్పృహలు, యుద్ధంలో గాయపడి తిరిగివచ్చిన సోదరి – వీటన్నిటినుంచీ దూరంగా పారిపోయి స్వతంత్రంగా బ్రతుకుతూ ఎదగాలన్న తాంబూ కోరికే చోదకశక్తిలా మారి ఆమెను హరారేకి చేర్చింది. ఉద్యోగరీత్యా తాను చేసిన పనులను తాము చేసినట్టుగా చెలామణి చేసుకుంటున్న తెల్లవాళ్ల కుట్రలను సహించలేని తాంబూ కాపీరైటర్ ఉద్యోగానికి రాజీనామా చేయటంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. చదువుకుని, స్వతంత్రంగా బతుకుతున్న తన ఇప్పటి ఆర్థికపరిస్థితులు తల్లితో పోలిస్తే ఏమాత్రం భిన్నంగా లేవన్న వాస్తవం తాంబూకి రుచించదు. ఆత్మనిష్ఠూరం, అవమానం, ఆత్మన్యూనత, జీవితంలో ఎదగలేకపోతున్నానన్న అసహనం, అసంతృప్తులకు తోడుగా ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేనితనం ఆమెను కుంగదీస్తాయి. స్కూల్టీచరుగా ఉద్యోగం సంపాదించుకున్న తాంబూ ఒకానొక ఉన్మాదస్థితిలో ఒక విద్యార్థినిని తీవ్రంగా గాయపరుస్తుంది. అనంతరం మానసిక సమతుల్యతని కోల్పోయి ఆస్పత్రిపాలైన తాంబూని చిన్నప్పటి స్నేహితురాలు, బంధువు అయిన న్యాషా, ఇతర కుటుంబీకులూ ఆదుకుంటారు. ‘నాకు బాగుపడాలని ఉంది, కానీ అలా మారేందుకు కావలసిన సాధనాలే నాదగ్గర లేవు’ అని డాక్టర్‌తో అనడం తాంబూ అంతస్సంఘర్షణని తెలియచేస్తుంది. విదేశాలలో చదువుకున్న న్యాషా సైతం ఇప్పటికీ పేదరికంలోనే ఉండటం తాంబూ అహానికి కొంత ఊరటనిస్తుంది. న్యాషాలోని సేవాభావం, కరుణ, స్త్రీల సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి వెనక విలువలని గుర్తించని తాంబూ తన స్వార్థం మాత్రం చూసుకుని న్యాషా పరిస్థితులను పట్టించుకోకుండా ఇకోటూరిజంలో మరో కొత్తఉద్యోగం వెతుక్కుని అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆర్థికోన్నతి తాలూకు డాబుసరితనాన్ని ప్రదర్శిస్తూ, పెట్టుబడిదారుల చేతిలో పావుగా ఊరినీ ప్రజలనూ కూడా తన ఎదుగుదల కోసం ఉపయోగించదలుచుకున్న తాంబూని ఆమె తల్లి నిలువరించిన విధానం, తాంబూ మానసిక వికాస పరిణామక్రమం నవలలోని తుదిభాగపు అంశాలు. మూడువందల పేజీల పాటు పోషించటం కష్టమైన మధ్యమపురుష కథనం మొదట్లో కొంత బెసికినట్టనిపించినా తరువాత వేగాన్ని పుంజుకుని ఆ కథనానికున్న ఇబ్బందిని దాటుకుని పాఠకుడి ఉత్సుకతను నిలబెట్టగలుగుతుంది. మొదటి రెండునవలల్లోని ఉత్తమపురుష కథనానికి భిన్నంగా ఈ నవలలో తననుంచి తాను విడివడి, వర్తమానకాలపు కథనం చేస్తుంది తాంబూ. పురాజ్ఞాపకాలు, ఊహాసౌధాల భవిష్యత్తు మధ్య ఊగిసలాడుతున్న తాంబూ అంతర్–బహిర్ముఖత్వాల మధ్యనున్న పల్చటిపొర తొలగిపోయి, ఆమె క్రూరమైన ఆలోచనలు బహిర్గతమవుతుంటాయి. తాంబూ వ్యక్తిత్వం సమర్థనీయంగా అనిపించకపోయినా, వివక్షలాంటి కారణాల వల్ల ఆమె పొందిన మానసిక గాయాల లోతుల్ని వదిలేసి ఆమెని బేరీజు వేయడం కూడా సబబు కాదు. పంటికింద రాయిలా అక్కడక్కడా దొర్లే షోనా భాషాపదాలను మినహాయిస్తే బలమైన పాత్రలు, సరళమైన భాష నవలలోని పరిగణనీయాంశాలు. ‘‘స్వీయ లోపమ్ములెరుగుట పెద్ద విద్దె; లోపమెరిగినవాడె పూర్ణుడగు నరుడు,’’ అని గాలిబ్ చెప్పినట్టు, అలాంటి స్పృహ మాత్రమే పరివర్తనానికి ఏకైక కారణం కాగలదు. -పద్మప్రియ నవల: దిస్ మౌర్నబుల్ బాడీ రచయిత్రి: త్సిత్సీ డాంగరెంబా ప్రచురణ: ఫేబర్ అండ్ ఫేబర్; 2020 -
ఒక అసాంఘికుడి ఆత్మకథ
దాదాపు రెండు సంవత్సరాల క్రితం కవి చిత్రకొండ గంగాధర్ చనిపోయాడని ఈ లోకానికి తెలిసింది. అలా మనకు తెలియడానికి చాలాకాలం క్రితమే తన ఊరిలో తనకు తానుగా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి తన శరీరాన్ని విడిచిపెట్టాడు. అలా నిజంగా ఆత్మహత్య చేసుకోడానికి ముందే అనేక సంవత్సరాల క్రితమే మరణించాడు. అంతకుముందెప్పుడో ఆదిమకాలంలోనే ఈ లోకం మరణించింది. తన పుట్టుకతోనే మరణాన్ని కలగన్నరోజే మనిషి జీవించడానికి కావాల్సిందేదో ఈ భూమ్మీద నశించింది. సుకుమారుడూ, సున్నిత మనస్కుడూ, మాటలురాని మౌని అయిన చిత్రకొండ గంగాధర్ లోకంలో అన్నీ చూసి, జీవితంలో దేనినీ చేతులతో తాకకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. నడిచినంతమేరా ఉలిదెబ్బలు తిని రాటుదేలిన ఈ మనిషి అశేషమైన మానవుల జీవన కార్యకలాపాల్లోనే ఏదో పాపం ఉందని, అందులో పాలుపంచుకోవడమే మహాపాపమని భావించి జీవిత రంగం నుంచి ఉత్తిచేతులతో విరమించుకున్నాడని ఒక్కోసారి నాకనిపిస్తూ ఉంటుంది. ఈ లోకం చేత తిరస్కరించబడినవారు కొందరుంటారు. కూలీలు, హమాలీలు, డబ్బు సంపాదించలేనివారు, తెలివితక్కువవారు, మందబుద్ధులు, ముష్టివాళ్లు, కుష్టువాళ్ళు, వేశ్యలు, అనాథలు, అందవికారులు, మందభాగ్యులు. వీరంతా తిరస్కృతులు. బహిష్కృతులు. వీళ్లంతా బాధలు పడేవాళ్ళు, వీళ్లంతా భయంతో బతికేవాళ్లు. దీనులు, హీనులు. వీళ్ళలోనే వీళ్ళలాకాక ఈ లోకాన్నీ, జీవితాన్నీ తిరస్కరించినవారు కొందరుంటారు. కొందరు లోపలికి ముడుచుకునేవాళ్ళు, కొందరు అన్నిటినీ విడిచిపెట్టేవాళ్ళు, అసహ్యించుకునేవాళ్ళు , లోకవృత్తం అర్థమయ్యి నవ్వుకునేవాళ్ళు, నిరంతరం దేనికోసమో వెతుక్కుంటూపోయే సంచారులు, ఏదీ వెతకక, దేనితోనూ పనిలేక అలా కూర్చుండిపోయే విరాగులు, బైరాగులు. వీళ్లంతా లోకం పోకడకు పారిపోయే పిరికివాళ్ళు కారు. చిత్రకొండ గంగాధర్ ఈ కోవకి చెందినవాడు. ఇల్లూ వాకిలి, ఊరూవాడా విడిచిపెట్టి తనకి మాత్రమే గోచరించే వెలుగునేదో వెతుక్కుంటూ, అనుదినం వెంటాడే వెలితి బరువుని భుజానేసుకుని అతడు ఈ లోకయాత్రకి బయలుదేరాడు. ఇలా ఉండబోతుంది అనుకున్న సుఖమయ జీవితాన్ని అతడు ముందే ఊహించి దాన్ని సంపూర్ణంగా తిరస్కరించాడు. అతడు ఆశావాది కాదు, నిరాశావాది అసలే కాడు. అతడిలో దిగులూ, దైన్యమూ ఏ కోశానా లేవు. పైకి బిడియస్తుడిలా కనిపించే గంగాధర్ లోకమూ జీవితమూ నలిపి పడేసిన అలాగాజనం తరపున వకాల్తా పుచ్చుకున్న మనిషిలా కనిపిస్తాడు. ఈ నవల చదువుతున్నంతసేపూ గంగాధర్ నాతో మాట్లాడుతున్నట్లే ఉంది. అతడు 12000 సంవత్సరానికి పూర్వం రాసుకున్న ఈ నవల ఒకరకంగా అతడి ఆత్మకథలా నాకనిపించింది. నవల ప్రారంభంలో నీలంరంగు మంచినీటి సరస్సులో స్నానం చేసి బయలుదేరిన ఇకారస్, తమ ఊరి చెరువులో జీవితాన్ని ముగించిన గంగాధర్ ఒకరే అని నాకనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచమంతా గంగాధర్‌కి కొత్త. ప్రపంచానికి గంగాధర్ ఒక వింత. ఈ మనుషులు, ఇళ్ళు, స్త్రీలు... అలా ఈ ప్రపంచ ప్రవాహమంతా గంగాధర్‌కి ఒక విడదీయలేని చిక్కుముడి, ఒక లేబరింత్ లాగా అనిపించింది. ఈ లేబరింత్ కొందరికి పవిత్రమైన, దైవికమైన విశ్వరహస్యంలా, మరికొందరికి అంతుపట్టని అమోఘమైన సౌందర్యంలా అనిపిస్తే గంగాధర్ లాంటి కొందరికి అంతంలేని దుఃఖంలా అనిపిస్తుంది. గ్రీకు మైథాలజీలో ఇకారస్ తొడుక్కున్న లక్కతో చేసిన రెక్కలు సూర్యుడి వేడిమికి కరిగిపోయి సముద్రంలో పడిపోతాడు. చిత్రంగా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లిపోయిన గంగాధర్‌లానే ఇకారస్కి తన తండ్రి డేడలస్‌తో అనుబంధం ఎక్కువ. మరి గంగాధర్ ధరించిన రెక్కలు ఎవరివి? అవి ఎక్కడ తెగిపోయాయి? నవల ముగింపులో ఇకారస్ మరణించాక మళ్ళీ వస్తాడని గంగాధర్ చెబుతాడు. వచ్చి మళ్ళీ ముప్పై ఐదేళ్లు బతుకుతాడని, మళ్ళీ ముప్పై వింత పట్టణాలు తిరుగుతాడని ఉంటుంది. మరి ఇకారస్ లాగానే చిత్రకొండ గంగాధర్ మళ్ళీ తిరిగి వస్తాడా? (చిత్రకొండ గంగాధర్ మరణానంతరం అతడి ఈ ఏకైక నవల మిత్రుల చొరవతో ప్రచురితమైంది.) - అజయ్ ప్రసాద్ మృతనగరంలో (నవల) రచన: చిత్రకొండ గంగాధర్; పేజీలు: 108; వెల: 110; ప్రచురణ: పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ. ఫోన్: 9866115655 -
సమాధానం కన్నా ప్రశ్న బలమైనది
పాట్నా బ్లూస్ నవలని అబ్దుల్లాహ్ ఖాన్ మొదట ఇంగ్లిష్‌లో, హిందీలో రాశారు. బిహార్‌లో ఒక మధ్యతరగతి ముస్లిం యువకుడి జీవితం ఇందులో కనపడుతుంది. ఇప్పటికి ఆ నవల పదమూడు భాషల్లో అనువాదమైంది. అరిపిరాల సత్యప్రసాద్ తెలుగు అనువాదం పాట్నా ఒక ప్రేమకథ అన్వీక్షికీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా రచయితతో అనువాదకుడి సంభాషణ: పాట్నా బ్లూస్ కథాంశం పల్ప్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంటుంది. కొంత మంది విమర్శకులు ఆ మాట అన్నారు కూడా. అలాగే చాలా మంది ఆ పుస్తకానికి ఒక ప్రత్యేకమైన సాహితీ విలువ ఆపాదించారు. మీరు ఆ పుస్తకాన్ని ఎలా చూస్తారు? పల్ప్ ఫిక్షనా, సాహిత్యమా? ఈ రెండే రకాలుగా పుస్తకాలు వుండాలి అని మనకి మనమే పరిధులు గీసుకుంటున్నామేమో. నా నవలని నేను పాపులర్ సాహిత్యం అంటాను. ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఆ కథని ఆసక్తికరంగా, చదివించే విధంగా రాయడంలో తప్పేముంది? మనం చెప్పే కథ సాహితీ విలువ కలిగి వుంటే దాన్ని ఆకర్షణీయంగా ఆసక్తికరంగా చెప్పడం వల్ల అది ఎక్కువమందికి చేరుతుంది కదా? పల్ప్ ఫిక్షన్లో వుండే ఆకర్షణనీ, సాహిత్యంలో వుండే విలువలనీ జోడించి రాయటం నా వుద్దేశ్యంలో చాలా మంచిది, అవసరం కూడా. అయినా చాలా తక్కువ విమర్శకులు ఈ పుస్తకాన్ని పల్ప్ ఫిక్షన్ అన్నారు. కొంచెం మెలోడ్రామా ఎక్కువైందని మాత్రం విమర్శలు వచ్చాయి. ఆరిఫ్ అనే మధ్యతరగతి బిహారీ ముస్లిం జీవితంలో దాదాపు రెండు దశాబ్దాల కథ ఇందులో కనిపిస్తుంది. దానితోపాటు మండల్ నుంచి మోదీ దాకా భారతదేశ రాజకీయ చరిత్ర అంతర్లీనంగా పరుచుకుని వుంటుంది. వీటిని కథలో ఎందుకు చొప్పించారు? కథలు ఏ ఆధారం లేకుండా గాలిలో వుండవు. ఒక కాలాన్ని మనం తీసుకుని ఆ కాలంలో మనుషుల గురించి చెప్తున్నప్పుడు ఆ కాలంలో వున్న సామాజిక, రాజకీయ పరిస్థితులు, సంఘటనల గురించి చెప్పకపోతే ఎలా? ముఖ్యంగా ఆ పరిస్థితులు, సంఘటనలు ఆ పాత్రల జీవితాలపై ప్రభావం చూపిస్తున్నప్పుడు? ఆరిఫ్ తొంభైలలో వున్న పాత్ర కాబట్టి ఆ కాలం నాటి ప్రభావం అతని జీవితం మీద వుంటుంది. ఆ సంఘటనల గురించి ఆరిఫ్‌కి కూడా ఒక అభిప్రాయం వుంటుంది. ఇలాంటి వివరాలన్నీ జోడిస్తేనే పాత్రలు రక్తమాంసాలతో సహజంగా, సజీవంగా వుంటాయి. కథలో ముస్లిం పాత్రలూ వున్నాయి, హిందూ పాత్రలూ వున్నాయి. ఆ పాత్రల మధ్య విభేదాలు, గొడవలు, అల్లర్లు కూడా వున్నాయి. కానీ మీరు కథ చెప్పిన విధానం గమనిస్తే ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్తున్న గొంతు వినపడుతుంది. ఇలాంటి గొంతును ఎందుకు ఎంచుకున్నారు? మీరు చెప్పింది నిజమే. నేను కావాలనుకుంటే గట్టిగా అరిచి చెప్పి వుండొచ్చు. నిరసన ప్రకటించి వుండొచ్చు. విభేదాల గురించి ఒకవైపు ఒరిగి మాట్లాడవచ్చు. కానీ అవేమీ చెయ్యలేదు. ఈ కథానాయకుడు హిందూ ముస్లింలు కలిసిమెలిసి వుండే ప్రాంతంలో వుంటాడు. అతని కుటుంబానికి హిందూ కుటుంబాలతో సత్సంబంధాలు వుంటాయి. ఆరిఫ్ తండ్రికి గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి బ్రాహ్మిన్. ఆరిఫ్ ఆప్తమిత్రుడు మృత్యుంజయ్ హిందూ. అందువల్ల ఆ పాత్రలు సౌభ్రాతృత్వాన్నే కోరుకుంటాయి. రెండో కారణం ఈ కథని తృతీయ పురుష కథనంలో చెప్పడం. ఉత్తమ పురుష కథనం అయితే అభిప్రాయాలు ప్రకటించేందుకు కొంత వెసులుబాటు ఉండేది. తృతీయ పురుష కథనంలో ఆ అవకాశం తక్కువ. బహుశా నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన హిందూ ముస్లిం సంబంధాల ప్రభావం కూడా వుండి వుండొచ్చు. పాఠకుడికి ఆసక్తి కలిగించడానికి కొన్ని చిక్కు ముడులు వేసి చివర్లో ఆ ముడులు విప్పడం సాధారణంగా రచయితలందరూ చేస్తారు. నవలలో మీరు ఎన్నో చిక్కు ముడులను విప్పకుండా వదిలేశారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే నవల ముగించారు. ఎందుకు? సమాధానం కన్నా ప్రశ్న బలమైనది. నేను సమాధానం చెప్పేసే బదులు తొలిచే ప్రశ్నలతో పాఠకులని వదిలేస్తే, వాళ్లే సమాధానాల కోసం వెతుక్కుంటారు. మొదటిసారి రాసినప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాశాను. కానీ అవి చదివినప్పుడు చాలా కృతకంగా అనిపించాయి. అందుకే వాటిని తరువాత డ్రాఫ్ట్ నుంచి తొలగించాను. చిత్రం ఏమిటంటే ఇలా జవాబు తెలియని ప్రశ్నలతో పుస్తకాన్ని ముగించడం చాలామంది పాఠకులకి నచ్చింది. ఆరిఫ్ జీవితం మొత్తం వైఫల్యాలతో నిండి వుంటుంది (చివరి సంఘటన తప్ప). ఇలాంటి వైఫల్యాలతో నిండిన వ్యక్తిని కథానాయకుణ్ణి చేసి కథ చెప్పడానికి ఎలా సాహసించారు? నిజజీవితంలో మాత్రం మనం కోరుకున్నవన్నీ దక్కుతాయా? వైఫల్యాలు సహజం. కథానాయకుడు ప్రతిసారీ గెలవడం నాకు ముఖ్యం కాదు. అతనికి వున్న పరిమితుల్లో ప్రయత్న లోపం లేకుండా వున్నాడా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆరిఫ్ పూర్తిగా విఫలమయ్యాడు అంటే నేను ఒప్పుకోను. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా పోరాడి నిలబడ్డాడు. సమస్యల నుంచి పారిపోలేదు. కెరియర్ దెబ్బతిన్నా, అతనికి వున్న ఆత్మీయ బంధం తెగిపోయినా అతను ఆత్మహత్య చేసుకోలేదు. అది ఆ పాత్ర మానసిక బలాన్నే చూపిస్తుంది. కాబట్టి ఆరిఫ్ వైఫల్యాలను చూడటం కన్నా, ఆ వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తిత్వాన్ని చూడాలి. అతనిలో వున్న మానవత్వం, కుటుంబం పట్ల బాధ్యత ఇవన్నీ కూడా గుర్తిస్తే అతను నిజమైన హీరోలా కనిపిస్తాడు. -
కీట్స్ కవితకు వ్యాఖ్యానంలాంటి నవల
ఈవెంట్ త్రిపుర కథల వెబినార్: త్రిపుర పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం ఛాయ వెబినార్ ద్వారా త్రిపుర కథలు గుర్తుచేస్తున్నారు ఏకే ప్రభాకర్, ఎన్.వేణుగోపాల్, ల.లి.త, నరేష్ కుమార్ సూఫీ, దేశరాజు. ఫేస్బుక్, యూట్యూబులో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. -త్రిపుర 19వ శతాబ్దిలో పరిఢవిల్లిన ఆంగ్ల కాల్పనిక కోయిల జాన్ కీట్స్ 1819లో రచించిన కవిత ‘ఓడ్ ఆన్ ఎ గ్రీషియన్ అర్న్’. గ్రీకుల విగ్రహారాధన, అనేక ప్రాపంచిక విషయాలలో వారి సత్యశోధన అంశాల పట్ల కీట్స్ ఆకర్షితుడయ్యాడు. ఈ ప్రభావాలే తన కవితకు ప్రేరణగా నిలిచాయి. ఒక అందమైన కలశం మీద చిత్రితమైన చిత్రాలకు ఇంద్రధనుస్సు రంగులను అద్దాడు కవి. ఆ కలశం మీద అడవి వైపు వెళ్తున్న ప్రేమజంట, ఒక ఊరేగింపులాంటి కోలాహలం, ఖాళీ అయిన ఒక గ్రామం చిత్రితమైనాయి. ‘ఏ నదీ సముద్రతీరాల పక్కనో, పర్వత సానువుల చెంతనో నిర్మితమైన ప్రశాంతమైన దుర్గం. ఈ ప్రభాతాన జనమంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓ చిన్ని గ్రామమా! నీ వీధుల్లో ఇక నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నిన్నెందుకిలా వదిలిపోయారో– చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’ ఆ వెళ్లిపోయిన ప్రేమజంట ఎవరు? ఊరెందుకు ఖాళీ అయింది? కీట్స్ లేవనెత్తిన ఈ ప్రశ్నలకు సమాధానమా అన్నట్లుగా ఒక భారతీయ రచయిత తన నవల రూపకల్పన చేశాడని నాకు అనిపించింది. ఆ నవలే దాదీ బుఢా. రచయిత గోపీనాథ మహంతి. ఒరియా సాహిత్యంలో తొలి జ్ఞానపీuŠ‡ పురస్కారం(1973) పొందిన రచయిత మహంతి. దాదీ బుఢా 1944లో విడుదలైంది. థెంగా, సంతోష్‌కుమారి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఊరు వదిలి అరణ్యంవైపు వెళ్తున్న దృశ్యమూ, గ్రామస్తులంతా కోలాహలంగా తమ సామాన్లని సర్దుకుని లుల్లా గ్రామం వదిలిపోతున్న దృశ్యమూ– కీట్స్ కవితలో కలశంపై చిత్రితమైన కథకు వ్యాఖ్యానంగా నిలుస్తాయి. కోరాపుట్ జిల్లా కొండలలో అనేక ఆదివాసీ గ్రామాలున్నాయి. మురాన్ నది గట్టు మీద ఉన్న గ్రామాలలో లుల్లా ఒకటి. కథాకాలం నాటికి క్రిస్టియన్ మతం అక్కడ వ్యాపిస్తోంది. ప్రధాన పాత్ర గ్రామ పెద్ద రామ్ నాయక్. ఒక రాత్రివేళ కొందరితో కలిసి కొండ దిగి గ్రామంలోకి రావటంతో కథ ప్రారంభమౌతుంది. ప్రతి గ్రామంలో మూలపురుషుడిని దాదీ బుఢా పేరుతో పూజించడం ఆచారం. గ్రామంలో దైవశక్తులున్నాయని ప్రజలు విశ్వసించే ఒక గురుమాయి, ఒక పూజారి కూడా ఉన్నారు. కొండ ప్రాంతాల భూములన్నీ వరి, రాగి, మొక్కజొన్న, గోధుమ పంటలతో కళకళలాడుతున్నాయి. పెళ్లికాని యువతీ యువకులు రాత్రిపూట నృత్యగానాలతో సందడిగా గడుపుతారు. గ్రామపెద్ద కొడుకు థెంగా జానీ. ఊళ్లో అమ్మాయిలందరూ థెంగా తమ భర్త కావాలని కోరుకుంటారు. అతడు పరజా జాతివాడు. అయితే, క్రిస్టియన్‌పేటకు చెందిన డొంబుల అమ్మాయి సంతోష్ కుమారికి దగ్గరవుతాడు. పూర్వంనుంచీ పరజాలకూ డొంబులకూ పెళ్లిళ్లు జరిగేవి కావు. ఈ లోపల మరో పెద్దమనిషి కూతురు సారియతో థెంగాకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని తెలిసి, ఒక తెల్లవారుజామున ఆ ప్రేమికులు గమ్యం తెలీని యాత్రికుల్లా అడవి దాటి ముందుకుసాగారు. మరి ఊరు ఎలా ఖాళీ అయింది? కొడుకు తమను విడిచివెళ్లడం రామ్ నాయక్ దంపతులను దుఃఖంలో ముంచేసింది. కష్టాలు తొలగాలని దాదీ బుఢాకు పూజలు జరిపిస్తారు. ఈ లోపల ఊరిని ఉపద్రవం చుట్టుముట్టింది. పశువులు, కోళ్లు వ్యాధులతో మరణిస్తాయి. పులులు గ్రామం మీద పడతాయి. గురుమాయిని దాదీ బుఢా ఆవహించి ఊరు వదిలెయ్యమని చెబుతాడు. అలా జనం కొత్త ఊరికి పయనమయ్యారు. క్రమంగా గ్రామంలో ఇండ్ల గోడలన్నీ కూలిపోయాయి. అక్కడంతా పిచ్చిమొక్కలు. కీట్స్ పేర్కొన్నట్లు, ‘నిన్నెందుకిలా వదిలిపోయారో చెప్పటానికి ఒక్కరూ లేరు, మరి తిరిగిరారు కూడా.’ 1819లో కీట్స్ కవిత గ్రీషియన్ అర్న్లో కలశం మీద చిత్రాలకు సుమారు 125 ఏండ్ల తర్వాత గోపీనాథ మహంతి వ్యాఖ్యాన ప్రాయమైన నవల వెలువరించడం విశేషం. గ్రీకు భాషలో దీనికి మూలకథ ఉండివుండవచ్చు. అలాగే మహంతి ఆ కవిత చదివాక ఉత్తేజితుడై ఈ నవలా రచనకు ఉపక్రమించాడని చెప్పటం ఊహాత్మకమే అవుతుంది. ఖండాంతరాల ఆవల ఉన్న రచయితల ఊహలు ఒక్కోమారు యాదృచ్ఛికంగా సంవాదించడం సాహిత్యకారులందరికీ తెలిసిన విషయమే. అటువంటి కోవకు చెందిన రచనగానే దాదీ బుఢాని పరిగణించాలి. (దాదీ బుఢా ఒరియా నవలకు వ్యాసకర్త చేసిన తెలుగు అనువాదం ‘ఈతచెట్టు దేవుడు’ పేరుతో సాహిత్య అకాడెమీ ద్వారా వెలువడనుంది.) డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి -
ఒకపరి భ్రమణం
ఆఫీసు నుంచి ట్యాక్సీలో ఇంటికి తిరిగివస్తూ, రోడ్డుకటువైపున తనలాగానే ఉన్న అమ్మాయిని చూసి ఆబెగేల్ ఉలిక్కిపడి ట్యాక్సీ ఆపేయించి దిగిపోతుంది. రోడ్డుదాటి దగ్గరనుంచి పరీక్షగా చూస్తే ఆ అమ్మాయి తనే, కచ్చితంగా తనే – సరిగ్గా ఇరవై రెండేళ్లప్పటి తను! ఆబెగేల్ విభ్రమంలోనుంచి తేరుకోకమునుపే ఆమె ఇంకొక యువకుడితో కలిసి వెళ్లిపోతుంది. ఆబెగేల్‌కి ఒక్క క్షణం అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. తనే, తనకి కనిపించటం ఏమిటి? నలభైఆరేళ్ల ఆబెగేల్ జీవితంలోకి ఇరవైరెండేళ్లప్పటి తన పూర్వరూప ప్రవేశంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆమెకి ‘ఏ’ అని పేరు పెట్టుకుంటుంది ఆబెగేల్. చిత్రకారిణి ఆబెగేల్, శిల్పకారుడు డెనిస్ వివాహానంతరం జీవికకోసం కళలను పక్కనపెట్టి ఉద్యోగాలు చేస్తూంటారు. ఇద్దరు టీనేజ్ పిల్లలతో హాయిగానే సాగిపోతూ ఉంటుంది వారి జీవితం. ‘ఏ’ తనకు కనిపించటం, పరిచయం కొనసాగటం, సంభాషించటం అసహజమనిపించినా అది పని ఒత్తిడి వల్ల కలిగిన భ్రమేనని తోసిపారేస్తుంది ఆబెగేల్. ఉద్యోగం కోల్పోయిన డెనిస్ శిల్పకళపట్ల దృష్టిపెట్టి ఎదుగుతుండగా, ఉద్యోగం చేస్తూనే అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి ఆర్ట్క్లాసులో చేరుతుంది ఆబెగేల్. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపట్ల ఒకరికీ, పిల్లలపట్లా ప్రేమానురాగాలున్నా, జీవితంలో అస్పష్టమైన అసంతృప్తులు, స్తబ్దతల కారణంగా ఇద్దరూ వివాహేతర సంబంధాలపట్ల ఆకర్షితులౌతారు. ‘ఏ’ ప్రవేశంతో, తన గతజీవితంలో జరిగిన సంఘటనలు – ఈలైతో ప్రేమకథా జ్ఞాపకాలతో సహా – కొన్ని ఆబెగేల్‌కి గుర్తుకొచ్చి నిర్వచించలేని గందరగోళానికి గురిచేస్తాయి. జీవితంలో తను చేసిన తప్పులు ‘ఏ’ చేయకూడదని ఆబెగేల్ తాపత్రయపడినా, ఇరవైరెండేళ్లప్పడు తను జీవించదలచుకున్న, ఇప్పుడు జీవిస్తున్న పద్ధతుల మధ్యనున్న అంతరం గురించి ‘ఏ’ ఆమెను ప్రశ్నిస్తున్నట్టు ఉంటుందామెకి. తరచూ తలనొప్పీ, తలతిరగడంలాంటి సమస్యలతో బాధపడే ఆబెగేల్‌కి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు ఈలైతో జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. చిత్రకళకు సంబంధించి తన వివరాలున్న కవర్ని ఈలై అకారణంగా తగలబెట్టడానికి ప్రయత్నించటం, బాల్కనీలో జరిగిన పెనుగులాటలో తామిద్దరూ కొన్ని అంతస్తుల మీదనుంచి కిందపడిపోవటం, అతను చనిపోవటం, తానుమాత్రం తలకు బలమైన గాయాలతో బయటపడటం గుర్తొస్తుందామెకు. అస్వస్థత తీవ్రమై మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేశాక, ఆబెగేల్ కోమాలోకి వెళ్తుంది. తిరిగి మామూలయిన ఆమెకు ‘ఏ’ మళ్లీ కనిపించదు; భ్రాంతిమయమైన జీవితం నుంచి కాంతిమయమైన ఆవరణలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. పిల్లలు స్థిరపడటం, తనూ భర్తా తమ కళలలో నైపుణ్యతని పెంపొందించుకుంటూ, రాణించడంతోపాటు ఆర్థిక స్థిరత్వం కోసం ఆబెగేల్ తన ప్రతిభని ఉపయోగించగలిగిన ఉద్యోగంలో చేరి ముందుకు సాగడంతో నవల ముగుస్తుంది. ఆబెగేల్ ప్రస్తుత జీవితానికీ ఇరవైరెండేళ్లప్పటి గతానికీ మధ్య ఊగిసలాడుతూ ముందుకూ వెనక్కూ సాగే కథ రకరకాల జీవితఘట్టాలని పరిచయం చేస్తుంది. భ్రాంతుల్లో చిక్కుకున్న ఆమె చెప్పే పాక్షిక కథనం పూర్తిగా నమ్మటానికి వీలులేనట్టుంటే, మిగతా కథ ఆబెగేల్ జర్నల్ రూపంలో కొంతా, మానసిక వైద్యురాలి నోట్స్ ద్వారా కొంతా, ఒక ఫిజిసిస్ట్, న్యూరాలజిస్ట్ మధ్య మెయిల్స్ రూపంలో మరికొంతా చెప్పబడుతుంది. ఆబెగేల్ తలకు దాదాపు పాతికేళ్ల క్రితం తగిలిన దెబ్బ వల్ల ఆమె మెదడులో లోపం ఏర్పడిందనీ, అందువల్ల ఆమెకు భ్రాంతులు కలగవచ్చనీ న్యూరాలజిస్ట్ అంటే, క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాల ప్రకారం కాలపు పొరలను చీల్చుకుని ఆబెగేల్ తన వర్తమాన భూతకాలాలని ఒకేసారి దర్శించగలుగుతోందన్నది ఫిజిసిస్ట్ ప్రతిపాదన. ఎవరి సిద్ధాంతాలు ఏవైనప్పటికీ, జీవితం వాటికి అతీతంగా తనదైన పద్ధతిలో సాగిపోతూనే ఉంటుంది. ‘‘రంగు అనేది వైయక్తిక దర్శనం. ఇది జీవితానికీ వర్తిస్తుంది. మనం చూసే ప్రతీదీ మనదైన ప్రత్యేక భావప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఏ ఇద్దరూ ఒకే ప్రపంచంలో ఉండరు. నువ్వుచూసే ఆకుపచ్చరంగు, నేను చూసే ఆకుపచ్చరంగు కాదు!’’ అన్న తన ప్రొఫెసర్ మాటలని ఆబెగేల్ గుర్తు చేసుకుంటుంది. నెరవేరని ఆశల గురించి, కాలవిన్యాసం గురించి తాత్వికమైన, మేధోపరమైన చర్చలను లేవదీసిన అమెరికన్ రచయిత్రి డెబ్రా జో ఎమెర్గట్ నవల యూ అగైన్ పాఠకుడిని ప్రభావితం చేసే దిశగా ఆలోచింపజేస్తుంది! పద్మప్రియ నవల: యు ఎగైన్ రచన: డెబ్రా జో ఎమెర్గట్ ప్రచురణ: ఎకో; 2020 -
అద్దంలోని ముడుపులు
2008 ప్రాంతంలో అమెరికాలో పాంజీ స్కీం రూపంలో అతిపెద్ద ఆర్థికనేరం బయటపడి పెనుసంచలనం సృష్టించింది. ప్రజల నుంచి పెట్టుబడులు ఆహ్వానించి, ఆ సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెట్టి అధిక లాభాలను ఆర్జించి, తిరిగి చెల్లింపుల రూపంలో వారికే అందిస్తామని ప్రలోభపెట్టి, చివరికి ఒకరిచ్చిన సొమ్మునే మరొకరికి లాభాల పేరుతో ముట్టచెప్పే మోసపూరితమైన వ్యాపారమే పాంజీ స్కీం. కొన్ని వేలకోట్ల డాలర్లతో నడిచిన ఈ పాంజీ స్కీం బయటపడ్డాక దీనికి రూపకర్త అయిన బెర్నీ మెడాఫ్కి అమెరికా న్యాయస్థానం 150 యేళ్ల జైలుశిక్ష విధించింది. వైట్‌కాలర్ నేరం ఇతివృత్తంగా రాసిన ‘ద గ్లాస్ హోటల్’ నవలని ఈ కథతో ముడిపెట్టి రాశారు కెనడియన్ రచయిత్రి ఎమిలీ సెయింట్ జాన్ మెండేల్. దయ్యాల కథలన్నా తనకు చాలా ఇష్టమనే ఈ రచయిత్రి, దయ్యాలంటూ వేరే ఉండవనీ తాము జీవించలేకపోయిన జీవితం, తీసుకోలేకపోయిన నిర్ణయాలూ, ఓడిపోయిన పరిస్థితులే మనిషిని ఆ రూపంలో వెంటాడుతుంటాయని అంటారు. పట్టణపు వాసనలు లేని కయేట్ అనే ఊహాజనిత ప్రదేశంలో కథ మొదలవుతుంది. ఒకవైపు సముద్రమూ, మరోవైపు అడవీ, ఇరవై గడపలూ ఉన్న ఆ చిన్న ఊళ్లో అత్యంత ఆధునికమైన హంగులతో, చుట్టూ ఉన్న అడవి కనిపించేలా నిలువెత్తు గాజు పలకలతో ‘కయేట్ హోటల్’ నిర్మిస్తాడు వ్యాపారవేత్త జానథన్. అదే ఊరికి చెందిన విన్సెంట్ అనే మహిళ తన సోదరుడు పాల్‌తో కలిసి ఆ హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. భార్య మరణించడంతో ఒంటరిగా ఉన్న జానథన్, సహజీవనం చేసే ఒప్పందం మీద విన్సెంట్‌ని తనతోపాటు కనెక్టికట్‌కి తీసుకెళ్లిపోతాడు. అతిసామాన్యమైన జీవితంలో నుంచి ఐశ్వర్యంలోకి అడుగుపెట్టిన విన్సెంట్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నా, జరిగిన ప్రతి సంఘటనా వేరేలా జరిగుంటే జీవితం మరోలా ఉండేదని అనుకుంటుంది. జానథన్‌తో చేసుకున్న ఒప్పందం సరైనది కాదని అనిపించినా, తాననుభవిస్తున్న జీవితానికి ఆమాత్రం మూల్యం చెల్లించుకోవడం సబబే అని నచ్చజెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో జానథన్ చేసే పెట్టుబడుల వ్యాపారం మోసమనీ, పాంజీ స్కీం అనీ బయటపడి, ప్రభుత్వం అతన్ని జైల్లో పెడుతుంది. రెట్టింపు లాభాలకు ఆశపడి అతని దగ్గర పెట్టుబడి పెట్టిన కొన్ని వందలమంది జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. జైల్లో జానథన్ ఉన్నగది గోడలమీద ‘ఏ నక్షత్రమూ శాశ్వతంగా వెలుగులు చిమ్మదు,’ అని రాసివున్న వాక్యం అతని అప్పటి స్థితికి సూచిక. చేసిన తప్పుని సమర్థించుకోడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా కుదుటబడని అతని మనసు, అపరాధ భావనకి లోనై తనవల్ల మోసపోయినవారూ, తన గజిబిజి ఆలోచనలూ దయ్యాలై చుట్టుముడుతున్న విభ్రాంతికి లోనవుతుంది. జానథన్‌తో పనిచేసిన కొందరు తప్పొప్పుకొని జైలుపాలైతే, మరికొందరి వైవాహిక జీవితాలు విచ్ఛిన్నమవుతాయి. శిక్ష తప్పించుకోటానికి దేశమే వదిలి పారిపోయిన ఒక ఉద్యోగి ఏదోనాడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో మనశ్శాంతిని కోల్పోతాడు. పరిస్థితులని ఎదుర్కొని నిలదొక్కుకున్న విన్సెంట్ పేరూ, రూపం మార్చుకుని ఒక ఓడలో వంటమనిషిగా కుదురుకుని, అనూహ్యంగా సముద్రంలో పడి చనిపోతుంది. ఉద్యోగ విరమణ తరవాత వచ్చిన డబ్బంతా జానథన్ వల్ల కోల్పోయి రోడ్డున పడ్డ లియాన్ అనే వ్యక్తి భార్యతో కలిసి జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తుంటాడు. ‘‘మంచీ చెడూ అని ద్వంద్వాలు నిర్దిష్టంగా ఉంటాయా? రెండు ఛాయలూ ఏకకాలంలో ఉండవచ్చు కదా?’’ అని ప్రశ్నించే పాల్ వీటన్నిటికీ దూరంగా సంగీతకారుడిగా ఎదుగుతున్నప్పటికీ మాదకద్రవ్యాలకు బానిసై జీవితంలో ఎత్తుపల్లాలను చూస్తూనే ఉంటాడు. దయ్యాల, ఆత్మల ప్రమేయాన్ని కొద్దిగా ప్రవేశపెట్టి, భిన్నమైన వ్యక్తిత్వాలని ఛిన్నాభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో, నాన్‌లీనియర్ పద్ధతిలో, సర్వసాక్షి కథనం ద్వారా పరిచయం చేస్తుంది రచయిత్రి. కథనం చురుగ్గా సాగడానికి సూటిగా సులువుగా ఉన్న భాష ప్రధాన కారణం అయింది. మార్చి నెలలో నాప్ఫ్ ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయిన ఈ నవలకి పాఠకులు, విశ్లేషకుల స్పందన విశేషంగా ఉంది. -పద్మప్రియ -
కూతురి ఒడిలో అమ్మ
ఏమయింది ఆ తల్లికి! మొండిగా, నిక్కచ్చిగా పెరిగింది. తల్లిదండ్రులపై కోపం. భర్తపై అసంతృప్తి. బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. బిడ్డనూ పట్టించుకోలేదు. బిడ్డే తల్లిని ఒడిలోకి తీసుకుంది! ‘బుకర్’ పోటీలో ఓ నవల ఇది. బహుమతికి వడపోత మొదలైంది. పదమూడు మందిలో... తొమ్మిది మంది రచయిత్రులే! ఒకరిని మించిన థీమ్ ఒకరిది. జడ్జిలకు పెద్ద పరీక్షే పెట్టారు. చిన్నప్పుడు తార మొండిగా ఉండేది. పెద్దయ్యాక, పెళ్లయ్యాక కూడా! అయితే కారణం ఉండేది ఆ మొండితనానికి. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని అతyì నుంచి విడిపోయింది. ఒడిలో చిన్న బిడ్డ. అంత బిడ్డ ఉన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఉండదు. సంపన్నులైన తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికి ఆశ్రమ జీవితం గడుపుతూ, పనిగట్టుకుని యాచకురాలిగా కొన్నాళ్లు గడుపుతుంది. తైల సంస్కారం ఉండదు, మంచి బట్టలు వేసుకోదు. కూతురు పెద్దదవుతుంటుంది. తారకూ వయసు మీద పడి అన్నీ మర్చిపోతుంటుంది. కూతురే ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన స్థితికి వస్తుంది. తల్లి.. కూతురి ఒడిలో బిడ్డవుతుంది! తల్లి తనకేదైతే ‘కేరింగ్’ను ఇవ్వలేదో, అదే కేరింగ్‌ను కూతురు తన తల్లికి ఇవ్వవలసి వస్తుంది. ఆ తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ద్వేషాలే.. ‘బరన్ట్ షుగర్’ నవల. పోటీలో గెలిస్తే 50 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చే ‘బుకర్ ప్రైజ్’ రేస్‌లో ఉంది ‘బరన్ట్ షుగర్’! దుబాయ్‌లో ఉంటున్న అవనీ దోషీ ఈ పుస్తక రచయిత్రి. అవని కనుక ఈ ఏడాది విజేత అయితే.. అరుంధతీరాయ్, కిరణ్ దేశాయ్‌ల తర్వాత బుకర్ ప్రైజ్ పొందిన మూడో భారతీయురాలు అవుతారు. లండన్‌లోని ‘బుకర్ ప్రైజ్’ కమిటీ మంగళవారం విడుదల చేసిన తొలి వడపోత (లాంగ్ లిస్ట్) ఆంగ్ల భాషా నవలా రచయితల జాబితాలో (పుస్తకాల జాబితా అనాలి) 165 మందికి 13 మంది మిగిలారు. వారిలో ఒకరు అవనీ దోషీ. ఈ పదమూడు మందిలోంచి ఆరుగురిని రెండో విడతగా (షార్ట్ లిస్ట్) వడకడతారు. నవంబరులో అంతిమ విజేతను ప్రకటిస్తారు. అవని తొలి నవల ‘గర్ల్ ఇన్ ది వైట్ కాటన్’. గత ఏడాది ఆగస్టులో ఇండియాలో పబ్లిష్ అయింది. అందుకనే పోటీకి పంపించలేక పోయింది. యు.కె., ఐర్లండ్‌లలో ప్రచురణ అయిన నవలలను మాత్రమే బుకర్ కమిటీ పోటీకి స్వీకరిస్తుంది. ‘బరన్ట్ షుగర్’ అవని రెండో నవల. లండన్‌లోని పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ రోజు (జూలై 30) ఆ పుస్తకాన్ని విడుదల చేస్తోంది. ముందరి ఏడాది అక్టోబర్ 1 నుంచి.. అవార్డు ప్రకటించే ఏడాది సెప్టెంబర్ 30 లోపు వచ్చిన పుస్తకాలను బుకర్ కమిటీ పోటీకి పరిగణనలోకి తీసుకుంటుంది కనుక ‘బరన్ట్ షుగర్’ పోటీలో చోటు చేసుకుంది. ఏడాది బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్‌లో ఒక విశేషం ఉంది. పోటీకి నిలిచిన పదమూడు మందిలో తొమ్మిది మంది మహిళా రచయితలే. అవనితో పాటు.. డయేన్ కుక్ (ది న్యూ వైల్డర్నెస్), ట్సిట్సీ డాన్గరేంబ్గా (దిస్ మార్నబుల్ బాడీ), హిలరీ మాంటెల్ (ది మిర్రర్ అండ్ ది లైట్), మాజా మాంగిస్ట్ (ది షాడో కింగ్), కైలీ రీడ్ (సచ్ ఎ ఫన్ ఏజ్) యాన్ టైలర్ (రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్), సోఫీ వార్డ్ (లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్), పామ్ జాంగ్ (హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్).. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ తొమ్మిది పుస్తకాలలో ‘ది మిర్రర్ అండ్ ది లైట్’కి కనుక ప్రైజ్ వస్తే.. పుస్తక రచయిత్రి హిలరీ మాంటెల్కి ఇది మూడో ‘బుకర్’ అవుతుంది. 2009లో, 2012లో ప్రైజ్ గెలుచుకున్న ‘ఉల్ఫ్ హాల్’, ‘బ్రింగ్ అప్ ద బాడీస్’ ఆమె రాసిన నవలలే. ఏమైనా ఈ ఏడాది పోటీ ‘టఫ్’గా ఉండబోతోంది. ఈ ‘నవ’లామణులు ఒకరిని మించిన థీమ్‌తో ఒకరు న్యాయ నిర్ణేతలకు గట్టి పరీక్షే పెట్టబోతున్నారు. నవలల సారాంశం ‘ది న్యూ వైల్టర్నెస్’ వాతావరణ మార్పులకు నివాసయోగ్యం కాని ప్రపంచం నుంచి కూతుర్ని కాపాడుకునే తల్లి కథ. ‘దిస్ మార్నబుల్ బాడీ’ జీవితానికి ఆశల రెక్కలు తొడుగుతుంది. ‘ది మిర్రర్ అండ్ ది లైట్’ ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి ముఖ్య సలహాదారు థామస్ క్రాంవెల్ చరమాంకం. ‘ది షాడో కింగ్’ ఒక సైనికాధికారి ఇంట్లోకి పనమ్మాయిగా వచ్చిన అనాథ.. నియమ నిబంధనలతో కూడిన తన కొత్త జీవితానికి అలవాటు పడలేకపోవడం. ‘సచ్ ఎ ఫన్ ఏజ్’.. తగని చోట తగిన విధంగా ఉంటే ఏం జరుగుతుందన్నది! ‘రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్’ అసంఖ్యాకంగా అక్కచెల్లెళ్లు, అత్తమామల కుటుంబ సభ్యులతో విసురుగా మెసిలే ఒక మొరటు మనిషి హృదయ నైర్మల్యం. ‘లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్’ పిల్లలు పుట్టడం ఎదురు కోసం చూస్తూ, భవిష్యత్తును అల్లుకుంటున్న ఓ జంట జీవితంలోని హటాత్పరిణామం. ‘హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్’ గూడు కోసం, అదృష్టం కోసం వెదకులాడే ఒక వలస కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన అనూహ్య ఘర్షణ. -
సూక్ష్మ వైశాల్య కథల రచయిత
బి.పి.కరుణాకర్ 22 ఏప్రిల్ 1944 – 20 జూలై 2020 ‘‘మామూలుగా రాసేదానికన్నా కాస్త ఎక్కువే రాసాను. చిన్నదిగా రాసేంత సమయం లేకపోయింది’’ అన్నాడట ఫ్రెంచ్ గణిత తత్వవేత్త బ్లైసీ పాస్కల్. కథల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందేమో. నిడివి అనే పరిమితిలో కథని నడపడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. అలాంటి కథలు విరివిగా రాసి పాఠకులని మెప్పించగలిగిన వాళ్లు తెలుగు కథాజగత్‌లో చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి కథకుల్లో చెప్పుకోవాల్సిన పేరు బి.పి.కరుణాకర్. ఆయన కథల్లో ముగింపులాగే గత శనివారం ఉన్నట్టుండి ఆయన గురించి చివరివాక్యం వినాల్సి వచ్చింది. ఫ్లాష్ ఫిక్షన్, సడన్ ఫిక్షన్, స్మోక్ లాంగ్ ఫిక్షన్ అంటూ ప్రపంచ భాషల్లో జరుగుతున్న ప్రయోగాలు అన్ని సాహితీ ప్రయోగాల్లాగే మన భాషలో వచ్చి చేరడంలో ఆలస్యం జరుగుతూనే వుంది. అయినా వాటిని పరిశోధించి, ప్రత్యేకించి ఇలాంటి కథలనే రాయాలని సాధన చేసి సాధించిన రచయిత కరుణాకర్. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఆయన్ని మొదటిసారి కలిసినప్పుడు ఆయన చెప్పిన సడన్ ఫిక్షన్ కథా నిర్మాణ రహస్యాలు ఇంకా గుర్తున్నాయి. ‘‘నా కథలలోకి మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి, పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తయిన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.’’ ఈ నిర్మాణ శైలిని సడన్ ఫిక్షన్ అంటారని తరువాతెప్పుడో తెలిసిందనీ చెప్పారాయన. నిడివి తక్కువగా వున్న అర్థవంతమైన, సంపూర్ణమైన కథ రాయడం అంత సులువు కాదు. చాలామంది ఇలాంటి కథలు రాసినప్పుడు కథలో చిక్కదనం పెరిగినా నడకలో వేగం వచ్చి పఠనానుభూతిని తగ్గిస్తుంది. ఈయన కథ అలా కాదు. చాలా తీరుబడిగా మొదలౌతుంది. సన్నివేశ చిత్రణ, పాత్ర చిత్రణ సవివరంగా వుంటుంది. చాలాసార్లు చివరి రెండు పేరాల వరకు కథ మొదలు కూడా కాదు. ‘‘నీడలేని పందిరి’’ అనే కథ ఓ ఎండాకాలం ఒక స్కూల్ లో మొదలౌతుంది. నాలుగు పేజీల కథలో రెండున్నర పేజీలు వాతావరణం తెలియజేయడానికీ, కథకుడి వ్యక్తిత్వాన్ని పరిచయం చెయ్యడానికే సరిపోతాయి. ఈ కథకుడు ఇంటికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న తరువాత ఒక విద్యార్థి వచ్చి తలుపులు కొట్టడంతో అసలు కథ మొదలౌతుంది. ఆ తరువాత కథ ముగింపు అరపేజీ దూరంలో వుంటుంది. ఈ కథలన్నీ సూటిగా వెళ్లే బాణాల్లాంటి కథలే అయినా ఒక బాణాన్ని నారిపై పెట్టి నెమ్మదిగా వెనక్కి లాగిన లక్షణం మొదటి పేజీలలో కనిపిస్తుంది. దాని వల్ల కథ నడకలో ఎలాంటి సమస్యా రాకపోగా గోప్యత పెరుగుతుంది. పాఠకుడిలో ఉత్సుకత రేగుతుంది. అసలు సడన్ ఫిక్షన్ కథలకి ముగింపే ముఖ్యం అంటారు కరుణాకర్. కథ చివర్లో జరిగే ఎఫిఫనీ గురించి మనకి చాలా తెలుసు. అలవాటుగా ఓ హెన్రీ పేరు చెప్పేస్తాం కూడా. కొసమెరుపు కథలు అంటూ కాస్త తక్కువ చేసి మాట్లాడేవాళ్లు లేకపోలేదు. కేవలం పాఠకుణ్ణి విస్మయ చకితుణ్ణి చెయ్యడానికి మాత్రమే ఒక ముగింపుని గుప్పిట్లో దాచిపెట్టి కథని బలవంతంగా ఆ ముగింపు వైపు తోలే కథలని అలా అంటే అనచ్చు కానీ కరుణాకర్ కథలు అలాంటి కొసమెరుపు కథలు కాదు. ఇవి కొసమలుపు కథలు (ముగింపు గురించి చెప్తూ వల్లంపాటి వెంకట సుబ్బయ్య– ఓ హెన్రీ, మొపాస కథలను చర్చిస్తూ ఇలాంటి వ్యత్యాసాన్ని చర్చించారు). ‘‘గుప్పెడుగాలి’’ కథ చూడండి. భర్త ఎవరిదో ఫోన్ నంబర్ రాసి జేబులో పెట్టుకున్నాడు. భార్యకి అనుమానం. భర్త ఆఫీస్‌కి వెళ్లినప్పుడు ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే ఒకటే ఎంగేజ్. ఆయన ఎంతసేపు మాట్లాడుతున్నాడో అలా! చివరికి తెలుసుకుంటుంది – తన ఇంటి నంబర్ నుంచి అదే నంబర్‌కి ఫోన్ చెయ్యడం వల్ల ఎంగేజ్ వస్తోందని. గుప్పెట్లో ఎంత గాలి నిలుస్తోందో అదే కథలో వుంది. అంటే ఏమీ లేదా? భర్త సెల్ ఫోన్లో ఎప్పుడూ మాట్లాడుతూ వుండటం చూసి ఆ భార్య అనుభవించే అభద్రత కథ మొత్తం పరుచుకొని వుంది. నిజానికి అదే కథ. అందుకే చివరి వాక్యం ‘‘సెల్లో ఇంతసేపు ఎవరితో మాట్లాడుతూ వుంటాడు?’’ అన్న ప్రశ్నతో మళ్లీ మొదటికే వస్తుంది. ఇలాంటి కథలు రాయాలంటే పాఠకుల మీద అపారమైన నమ్మకం వుండాలి. వాళ్ల తెలివితేటల పట్ల గౌరవం వుండాలి. అప్పుడే ఎంత చెప్పాలో అంతకన్నా తక్కువ చెప్పి ఆపేయగల ధైర్యం వస్తుంది. ఇలా తక్కువలో ఎక్కువ చెప్పడం కరుణాకర్ అలవోకగా, అలతి పదాలతో సాధించారు. కథలకు పేర్లు పెట్టడంలోనే ఆ చాకచక్యం కనిపిస్తుంది మనకి – ‘ఇరుకు పదును’, ‘నీటిబీట’, ‘ఊటబాధ’, ‘దూరపు దగ్గర’, ‘ఒంటరి దూరం’. మంటో చివరిగా నిద్రించే చోట రాయించుకున్నాడట – ‘‘చిన్న కథ రహస్యాలని తనతోనే పెట్టుకొని సదత్ హసన్ మంటో ఇక్కడే సమాధిలో వున్నాడు’’ అని. కరుణాకర్‌తో కూడా తెలుగు సడన్ ఫిక్షన్ రహస్యాలు కొన్ని వెళ్లిపోయాయి. అవి ఇక మనం ఆయన కథల్లోనే వెతుక్కోవాలి. (బి.పి.కరుణాకర్ ఇటీవలే కన్నుమూశారు. ‘అంబాలీస్’, ‘నిర్నిమిత్తం’, ‘రాజితం’, ‘రెల్లు’, ‘డియర్’ ఆయన కథల సంపుటాలు. దాదాపు అన్ని కథలూ సడన్ ఫిక్షన్ కథలే.) అరిపిరాల సత్యప్రసాద్ -
ఏది సత్యం? ఏదసత్యం?
నవల: డెత్ ఇన్ హర్ హాండ్స్ రచన: ఓటెస్సా మాష్ ఫెగ్ ప్రచురణ: పెంగ్విన్; జూన్ 2020 అతని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ప్రక్రియలో తనకి తనే అంగీకారయోగ్యం కాలేకపోతున్నానన్న వాస్తవాన్ని విస్మరించిన ఆమె, చివరికి ఆ నిజాన్ని ఎదుర్కోవలసి రావటం – మనిషి జీవితాంతం నటిస్తూ ఉండిపోలేడన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది. వార్ధక్యంలో జీవిత భాగస్వామిని కోల్పోతే ఏర్పడే ఒంటరితనాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం. పిల్లలు లేని డెబ్బై రెండేళ్ల వెస్టా, భర్త వాల్టర్ చనిపోయాక ఏర్పడిన శూన్యాన్ని తట్టుకోలేక తాముంటున్న ఊరూ, విశాలమైన ఇల్లూ విడిచిపెట్టి లెవాంట్ అనే ఊరికి వెళ్లిపోతుంది. లెవాంట్‌లో కొనుక్కున్న చిన్న ఇంట్లో కొత్తగా పెంచుకుంటున్న కుక్క చార్లీయే ఆమెకి తోడు. రోజూలాగే ఒక ఉదయం చార్లీని తీసుకుని అడవిలో నడకకి బయల్దేరిన వెస్టాకి దారిలో ఒక కాగితం కనిపిస్తుంది. దాని మీద ‘ఆమె పేరు మాగ్డా. ఆమెని ఎవరు చంపారో ఎవరికీ, ఎప్పటికీ తెలీదు. నేను మాత్రం కాదు! ఆమె శవం ఇక్కడే ఉంది.’ అని రాసి ఉండటం చూసిన వెస్టా ఉలిక్కిపడుతుంది. రక్తపుమరకలు గానీ, ఘర్షణ జరిగిన సూచనలు గానీ ఏమీ కనిపించవు. నిజంగానే ఏదన్నా హత్య జరిగిందా లేక ఎవరన్నా తనని ఆటపట్టిస్తున్నారా అన్నది ఆమెకి అర్థం కాదు. ఒంటరితనాన్ని మరిచిపోవడం కోసమైనా ఈ మర్డర్ మిస్టరీని తానే స్వయంగా ఛేదించాలని అనుకుంటుంది. ఆ ప్రయత్నంలో మాగ్డా హత్య గురించి ఊహాచిత్రాన్ని గీసుకుని, తనే నాలుగైదు పాత్రలని సృష్టించి మాగ్డా కథని నడిపించే ప్రయత్నం చేయడం వెస్టాని ఒకవిధమైన ఉన్మాద స్థితిలోకి నెడుతుంది. తను సృష్టించిన పాత్రల వలయం లో, తన ఆలోచనల భయాలలో తానే చిక్కుకుని సంక్లిష్ట మానసిక స్థితికి లోనవుతుంది. ఒకవైపు మాగ్డా హత్య గురించిన ప్రశ్నలు వెస్టా జీవితాన్ని పూర్తిగా ఆక్రమించేస్తూ ఉండగా, మరోవైపు ఆమె వైవాహిక జీవితంలోని జ్ఞాపకాలూ, వైఫల్యాల నీడలూ, ఒంటరితనపు చీకట్లూ ముసురుకుంటూ కథనంలో కలిసిపోతాయి. స్త్రీల వైవాహిక జీవితంలో తామే ఒప్పుకోలేని ఓటములు, ప్రపంచానికి చెప్పుకోలేని వైఫల్యాలు, మేధోపరమైన ఆధిక్యతా ప్రదర్శనతో భార్యలను హింసించే భర్తలు, వయసు పైబడుతున్నవారి ఏకాకి జీవితపు మానసిక అస్థిరత్వాలు – వీటన్నిటి గురించీ రచయిత్రి చేసిన పరిశీలనలు సునిశితంగానూ, విలక్షణంగానూ ఉన్నాయి. అందగాడూ, తెలివైనవాడూ, ప్రొఫెసరూ అయిన భర్త ఆమె తెలివితేటలనో రూపాన్నో తరచూ విమర్శించడం, చేసే ప్రతిపనినీ ఆక్షేపించటం వెస్టాలో సహజంగానే న్యూనతని కలిగిస్తుంది. అతని ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్న ప్రక్రియలో తనకి తనే అంగీకారయోగ్యం కాలేకపోతున్నానన్న వాస్తవాన్ని విస్మరించిన ఆమె, చివరికి ఆ నిజాన్ని ఎదుర్కోవలసి రావటం – మనిషి జీవితాంతం నటిస్తూ ఉండిపోలేడన్న సత్యాన్ని గుర్తు చేస్తుంది. చనిపోయిన భర్త ఓ శత్రువులా ఇప్పటికీ తన ఆలోచనలలోకి చొరబడి సూచనలూ, విమర్శలూ చేస్తుంటే ఆ స్వరాన్ని ధిక్కరించాలని శతవిధాలా ప్రయత్నించే వెస్టా పట్ల సానుభూతి కలుగుతుంది. ‘క్షమించడం ఒక గుణం కాదు, అదొక నిర్ణయం’ అనే వెస్టా చివరికి భర్తని క్షమించగలుగుతుందా? తాననుభవించిన ప్రేమరాహిత్యపు జీవితాన్ని తలపోసుకుంటూ, ఒంటరితనం కలిగించే మానసిక దౌర్బల్యానికి లోనవుతూ, మాగ్డా ఆలోచనలలో కూరుకుపోతూ, దేనిమీదా ధ్యాస నిలవక, వాస్తవాలూ కల్పనల మధ్య సరిహద్దులు చెరిగిపోయి అన్రిలయబుల్ నెరేటర్‌గా, తనే ఒక మిస్టరీగా మారుతుంది వెస్టా. ఆలోచనల ముసురులో, బీభత్సమైన పరిస్థితులలో, కమ్ముకుంటున్న ఉన్మాదావస్థలో నిశిరాత్రి చీకట్లోకి వెస్టా కదిలివెళ్లే ఆఖరి దృశ్యాలు జలదరింపు కలిగించేలా ఉన్నా ఏకాకి అయిన వెస్టా ఆంతర్యపు లోతులను పరిచయం చేయటమే రచయిత్రి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. తగినంత ఉత్కంఠ, పదునైన ఆలోచనలు, దిగజారుతున్న మానసిక స్థితుల చిక్కుముళ్లు ఉన్న నవల ‘డెత్ ఇన్ హర్ హ్యాండ్స్’. ఈనాటి ‘ఆల్బర్ట్ కామూ’గా గుర్తింపబడిన అమెరికన్ రచయిత్రి ఓటెస్సా మాష్ఫెగ్ రాసిన ఈ నవల గతనెల విడుదలయింది. భద్రజీవితాన్ని ఆశించి తను తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని తెలుసుకున్న వెస్టా, ‘‘నా కలలనన్నింటినీ నేనే చేజేతులారా చిదిమేసుకున్నాను. భవిష్యత్తుని ఎంచుకునే ప్రక్రియలో నచ్చిన జీవితమా, భద్రజీవితమా అన్న మీమాంసకు గురయినప్పుడు ఒకోసారి మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం,’’ అన్న మాట సార్వజనీనమైన విషాద వాస్తవం. పద్మప్రియ -
అసలేం జరిగిందంటే
కథాసారం ఆ దృశ్యం నా కంటపడగానే చకితుణ్ణయిపోయాను. మార్నింగ్ వాక్కని బయలు దేరాను. నాకు తెలియకుండానే, ఆ శవాన్ని దాటి... ‘శవం’ అన్న పదాన్ని వాడటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. రోడ్డు ప్రక్కన ఫుట్‌పాత్‌పైన నిద్రపోతున్నట్టు పడున్న ఆ అందమైన వ్యక్తిని శవం అని ఎలా అనను? ప్రమాద సూచనలేవీ లేవే? గాయాలూ, నెత్తురూ ఏమీ కనిపించటం లేదు. ఎలా చచ్చివుంటాడు? గుండె ఆగిపోయి వుంటుంది. పాపం! ఆట్టే వయసు కూడా లేదు. భార్యాపిల్లలు వుండే వుంటారు. అక్కడో క్షణం కూడా నిలవలేకపోయాను. దారిలో కాఫీ హోటల్ కనిపించింది. నేను తప్ప మరెవ్వరూ లేరు. కూచుని ఆర్డరిచ్చాను. ఇంతలోకి ఇద్దరు, దంపతులు గామాల్ను, వచ్చారు. ‘‘అది ముమ్మాటికి హత్యే’’ అంటున్నాడు అతను. ‘‘మీ మాటే మీకా? నడి బజారులో హత్యేవిటండీ?’’ ‘‘వండర్ఫుల్. ‘నడిబజారులో హత్య’. అద్భుతంగా వుంది టైటిల్.’’ ‘‘ఆ వెధవ డిటెక్టివ్ పుస్తకాలు చదువుతూంటం వల్లే మీ మతి ఇలా చలించిపోతోంది.’’ ‘‘అన్నన్నా! ఎంతమాటన్నావు? వేటర్... రెండు కాఫీ. అవి ఎంత గొప్ప గ్రంథాలో నీకేం తెలుసు? దృష్టి ఇట్టే విశాలమైపోతుంది.’’ ‘‘అవును విశాలమైపోయి ప్రపంచమంతటా హత్యలూ, హంతకులే కనిపిస్తుంటారు. ఆ మనిషి ఎవరో పాపం, చెక్కు చెదరకుండా పడివుంటే హత్య అంటకడతారే?’’ ‘‘పిచ్చిదానా, హత్య అంటే పిస్తోలుతో కాల్చటమో, కత్తితో పొడవటమో అనుకుంటున్నావు. హత్య కూడా అతి సున్నితమైన కళగా మారిపోయిందని నీకింకా తెలీదు గామాల్ను. ఈ రోజుల్లో ఒక చిన్న షాట్, అంటే ఇంజక్షన్ చాలు. మనిషన్నవాడు చెక్కు చెదరకుండా చచ్చివూరుకుంటాడు.’’ ‘‘ఆ ఇంజక్షనిచ్చిన డాక్టరెవరో?’’ ‘‘అంటే హంతకుడెవరో చెప్పమంటున్నావు, నాకేం తెలుసు? నువ్వే కావచ్చు.’’ ‘‘నేనా?’’ ఆశ్చర్యపోయింది ఆవిడ. ‘‘ఆ శవం దగ్గర ఒక్క అయిదు నిమిషాలు పరిశోధించి వుంటే బోలెడన్ని క్లూలు దొరికేవి. ఏదీ, నువ్వు నిలువనిస్తేగా?’’ ‘‘అపరాధ పరిశోధక మహాశయా! ఇప్పుడెళ్లి ఆ క్లూలేవిటో వెతుక్కోండి. నే నింటికెళ్తాను.’’ ‘‘ఇంతవరకూ క్లూలు కూచున్నాయేవిటి? మాయం చేసెయ్యరూ?’’ ‘‘వాళ్లెవరూ?’’ ‘‘ఆ దొంగముఠావాళ్లు.’’ ‘‘హంతకుల్లోంచి దొంగల ముఠాలోకి దిగారేవిటి?’’ ‘‘దొంగలంటే దోపిడీ దొంగలేం కాదు, దొంగనోట్లు తయారుచేసే ముఠా.’’ కాస్త తగ్గుస్వరంతో మొదలెట్టాడు అతను. ‘‘ఆ చచ్చిపోయిన అభాగ్యుడు కూడా ఆ ముఠాకు చెందినవాడే. నాయకునితో ఏవో స్పర్థలొచ్చాయి. విడిపోతాననీ, పోలీసులకి ఆచూకీ ఇస్తాననీ బెదిరించాడు. ఇంకేముందీ, ముఠా నాయకుడు సిగ్నల్ ఇచ్చాడు. అతని అనుచరులు పది నిమిషాల్లో పని పూర్తిచేశారు.’’ ‘‘ఎందుకండీ, లేనిపోనివన్నీ కల్పిస్తారు. అది హత్య ఎంతమాత్రం కాదు, ఆత్మహత్య.’’ ‘‘అదెవ్వరు చెప్పారు?’’ ‘‘నా అంతరాత్మే చెబుతోంది. హృదయమున్నవాళ్లు అతని ముఖంకేసి ఒక్క క్షణం చూస్తే చాలు అంతా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది.’’ ‘‘ఏవిటో అది?’’ ‘‘వినండి. అతనొక కవి, గాయకుడు, చిత్రకారుడు... అతని గానం విని ఆనంద సాగరంలో మునిగి పోయేవారు, అతను గీసిన చిత్రాలను చూసి మంత్రముగ్ధులై పోయేవారూ అనేకులు. వారిలో ఆ అమ్మాయి కూడా ఒకర్తె. అందాల రాశి. చూపులు కలియగానే హృదయాలు పెనవేసుకుపోయాయి. కాని అతను నిరుపేద, ఆమె ఒక ధనవంతుని గారాల కూతురు. తన ఏకైక పుత్రిక కోరిక కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నాడు తండ్రి. కాని అదొక ఎత్తు. కూతురు చదువు వంకబెట్టి పెళ్లి రెండేళ్లు వాయిదా వేశాడు. ఈ లోపున అతని చిత్రలేఖనానికి మెరుగులు దిద్దే మిష మీద శాంతినికేతన్లో చేర్పించాడు. కొన్నాళ్లకు అతను ప్రమాదవశాత్తూ హుగ్లీ నదిలో పడి కొట్టుకుపోయినట్టు ఒక టెలిగ్రాం కల్పించి తెప్పించాడు. అతని ఉత్తరాలు కూతురికి అందకుండా కట్టుదిట్టం చేశాడు. మరి కొన్నాళ్లకు కూతురి గుండె గాయం మానిందన్న ధైర్యం రాగానే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఎలాగో వొప్పించాడు. అటు అతను తన ఉత్తరాలకు జవాబులు రాక తల్లడిల్లిపోయి స్వయంగా బయలుదేరాడు. రైలు దిగేసరికి చీకటి పడ్డది. తిన్నగా ఆ ధనవంతుని ఇంటికి దారితీశాడు. దోవలో ఊరేగింపు ఎదురైంది. బాజాభజంత్రీలతోనూ, లైట్లతోనూ, బాణాసంచాతోనూ వెళ్తోన్న పెళ్లి ఊరేగింపు. అప్రయత్నంగా అతని దృష్టి ఆ నవదంపతుల కారువైపుకు పోయింది. గుండె ఆగినట్టనిపించింది. ఎలుగెత్తి అరవబోయాడు. కాని శోష వచ్చి పడిపోయాడు. తెలివి వచ్చేసరికి అంధకారం. ఆ చీకట్లో చేతికున్న వజ్రపుటుంగరం మెరిసింది. ఆమె కానుక అది. వెంటనే ఆ వుంగరాన్ని మింగేశాడు. అక్కడే వొరిగిపోయాడు.’’ ‘‘కట్... ఆ ఆఖరు సీను నాకు నచ్చలేదు. ఈనాటి యువతరం చెయ్యాల్సిన పనికాదది. అంతకంటే ఒక పిస్తోలు సంపాదించి, ఆ ధనవంతుణ్ణి కాల్చి చంపి, కోర్టులో ధనవంతులు చేసే అన్యాయాల మీద ఉపన్యాసం దంచి, ఉరికంబం ఎక్కివుంటే ఎలా వుండేది?’’ ‘‘క్షమించాలి. అక్కడ ఫుట్‌పాత్ పైన చచ్చిపడివున్న వ్యక్తిని గురించే కదూ మీరు మాట్లాడుకుంటోంది’’ అంటూ ఒకతను దంపతుల దగ్గరికి వచ్చాడు. మొహం ఎక్కడో చూసినట్టే వుంది. ‘‘ఆశ్చర్యపోకండి... మీరా వ్యక్తి గురించి అనుకుంటున్నదేదీ నిజంకాదని చెబుదామని.’’ ‘‘మీరూ?’’ ‘‘నే నెవరైతే ఏంలెండి. అసలేం జరిగిందో చెబుతాను. ఈ కుర్చీలో కూచోనా?’’ ‘‘ఓ, దానికేం’’ అంటూ ఆహ్వానించాడు భర్త. భార్య ఇంకా అనుమానంగానే చూస్తోంది. ‘‘అది హత్య కాదు, ఆత్మహత్యా కాదు. అతని మరణానికి కారణం దొంగనోట్లూ కావు, ప్రేమా కాదు. అతని అందం.’’ ‘‘అందమా?’’ దంపతులు నోరెళ్లబెట్టారు. అతను జేబులోంచి ఒక ఖరీదైన పాకెట్ తీసి, ముందు భర్తకు ఆఫర్ చేశాడు. భర్త చెయ్యి ముందుకు పోనిచ్చి, భార్యను చూసి వెనక్కి తీసుకున్నాడు. అతను సిగరెట్ వెలిగించి, చెప్పుకుపోయాడు. ‘‘అసలతను ఎవరో, ఎక్కడివాడో ఎవరికీ తెలీదు. పెద్దపెద్ద హోటళ్లలోనే నివాసం చేస్తాడు. రకారకాల కార్లలో షికారు కొడుతుంటాడు. వెంట ఒకరో ఇద్దరో అందమైన ఆడవాళ్లు అంటివుంటారు. ఇదంతా ఎలా సాగుతోందో తెలీదు. కాని అతని అందాన్ని అమ్ముకుని బ్రతుకుతాడని ప్రతీతి.’’ భార్యాభర్తల కళ్లు మరీ పెద్దవైనాయి. ‘‘మగవాళ్లల్లో కూడా కొందరికి తమ అందాన్ని అమ్ముకునే అవకాశాలు లేకపోలేదు ఈ ప్రపంచంలో. ఈ మధ్యే ఒక డబ్బుగల వితంతువుకు అతనిపైన మోజు కలిగింది. నిన్న రాత్రి ఇద్దరూ పట్నానికి పది మైళ్ల దూరంలో వున్న ఒక రహస్య స్థలానికి వెళ్లారు. తిరిగి బయలుదేరేసరికి మూడు దాటింది. హైరోడ్డుకు రావడానికి మూడు మైళ్ల అడ్డదారి. అన్నీ ఎత్తుపల్లాలు. బాగా వొరిగి నిద్రపోతున్నాడనుకున్నది. కానీ కెవ్వున కేకేసింది. తన అనుమానం డ్రైవర్‌కు చెప్పింది. భయంతో వణికిపోయింది. డ్రైవర్ ధైర్యం చెప్పాడు. కాస్త చీకటిగా వున్నచోట ఆపి, శవాన్ని లాగి, ఫుట్‌పాత్‌పైన పడుకోబెట్టారు’’ అని ఆగిపోయాడు. ‘‘మరి అతను ఎలా చచ్చాడు?’’ ‘‘మీకు తెలుసో లేదో, మనిషి మెదడుకీ వెన్నెముకకీ కొన్ని నరాల ద్వారా సంబంధం ఉంటుంది. దాన్నే మెడిల్లా అబ్లాంగేటా అంటారు. ఏ విధంగానైనా ఆ సంబంధం తెగిపోతే మనిషి వెంటనే ప్రాణాల్ని కోల్పోతాడు. ఉరి తీయటంలో అదే జరుగుతుంది. అంటే అతని చావుకు కారణం అడ్డదారిలోని ఎత్తుపల్లాల కుదుపులన్నమాట. ఇదీ సంగతి, శలవు’’ అంటూ లేచాడు. వీధిలోని రిక్షాను కేక వేసుకుంటూ వెళ్లిపోయాడు. దంపతులు ఒహరి మొహాలు ఒహరు చూసుకుంటూ కూచుండిపోయారు. నేను ఆ అపరిచిత వ్యక్తిని వెతుక్కుంటూ వీధిలోకి వెళ్లాను. అప్పటికే రిక్షా ఎక్కబోతున్నాడు. ‘‘ఒక్కమాట. నేనూ ఆ శవాన్ని చూసినవాణ్ణే. మీరిందాక చెప్పింది నమ్మమంటారా?’’ పెద్దగా నవ్వాడు. ‘‘ఆ దంపతులు చెప్పింది వినేవుంటారుగా. వాళ్లని నమ్మగలిగితే, నే చెప్పిందీ నమ్మొచ్చు.’’ ‘‘అంతేనంటారా?’’ ‘‘అతను డిటెక్టివ్ నవలలు చదివీ, ఆమె సినిమాలు చూసీ తమ వూహాకల్పనలు చేశారు. నేనూ ఒక పోగు వేశాను.’’ ‘‘అదేదీ నిజంకాదని మీరెలా అనగలరు?’’ ‘‘మీరు నన్ను ఇంకా పోల్చుకోలేదా? ఆ శవాన్ని నేనే. పోనీవోయ్ రిక్షా’’ అంటూ ఎక్కి కూచున్నాడు. ‘‘అరెరే, ఆగండి. అసలేం జరిగిందో చెప్పరూ?’’ ‘‘వడ్లగింజలోనిదే బియ్యపుగింజ. నేను కథలు రాస్తాను. రాత్రి ఒక ప్లాటు కోసం ఎంత ఆలోచించినా దొరకలేదు. తెల్లవారు ఆలోచిస్తూ నడుస్తుంటే నా కాలు అరటితొక్కపైన పడింది. జారి పడిపోయాను. రాత్రి నిద్రలేనందువల్లనేమో తెలివి తప్పిపోయాను. తెలివి వచ్చేసరికి చుట్టూ జనం మూగివున్నారు. నేను చనిపోయాననే అనుకున్నారట. లేచి, తిన్నగా కాఫీహోటల్ చేరుకున్నాను. ఆ దంపతుల కథలు విన్నాను. నా కథ కూడా జోడించాను’’ అంటూ చక్కా వెళ్లిపోయాడు. ఆ కొత్త కథ కూడా నిజం అవునో కాదో తేల్చుకోలేక అక్కడే నిల్చుండి పోయాను. నెల్లూరు కేశవస్వామి కథ ‘అసలేం జరిగిందంటే’కి సంక్షిప్త రూపం ఇది. కేశవస్వామి (1920–1984) హైదరాబాద్‌లో జన్మించారు. నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా పనిచేశారు. చార్మినార్, పసిడి బొమ్మ వీరి కథాసంపుటాలు. చార్మినార్ సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వెలుతురులో చీకటి వీరి నవల. హైదరాబాద్‌లోని ముస్లింల జీవితాన్ని తన కథల్లో వరుసగా, స్థిరంగా పరిచయం చేసిన రచయిత. హైదరాబాద్ విమోచన నేపథ్యంలో రాసిన యుగాంతం ఆయన కథల్లో ఒకటి. కొన్ని ప్రేమ్‌చంద్ కథల్ని అనువదించారు. ఈ యేడాది కేశవస్వామి శతజయంతి సంవత్సరం. నెల్లూరు కేశవస్వామి -
ఎవరి కథని వారే చెప్పాలా?
అనధికార సాంస్కృతిక స్వీకరణ (కల్చరల్ అప్రాప్రియేషన్) –సాహిత్యాన్ని అంటిపెట్టుకుని ఉండే ప్రశ్న! కథలు ఎవరు చెప్పాలి? ఎవరి కథలు వారే చెప్పుకోవాలా? తనది కాని జీవితావరణంలోని అనుభవాల, అనుభూతుల ఆవిష్కరణకి రచయిత పూనుకోవచ్చా, కూడదా? ఈ విషయమై మూడేళ్ల క్రితం రచయిత్రి లైనల్ ష్రైవర్ ప్రసంగానంతరం రేగిన వివాదాలు మర్చిపోకముందే, మళ్లీ ఊహించని రీతిలో సంచలనాత్మక చర్చలకు తెరతీసింది ఈ సంవత్సరం జనవరి నెలలో వచ్చిన– జెనీన్ కామిన్స్ నవల అమెరికన్ డర్ట్. ఎన్నో ప్రచురణ సంస్థలు పోటీపడిన తరువాత – అత్యధిక పారితోషికమిచ్చిన ఫ్లాట్ ఐరన్ సంస్థ నవల ప్రచురణ హక్కుల్ని సంపాదించుకుంది. హాలీవుడ్ అప్పుడే నవలని సినిమాగా మార్చే ప్రయత్నంలో ఉంది. వెల్లువెత్తుతున్న ప్రశంసలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే కార్చిచ్చులా రగులుతున్న విమర్శలు చర్చలు రేపుతున్నాయి. ప్రధానంగా తనదికాని అనుభవాన్నీ, వలసదారుల కథనీ రచయిత్రి చెప్పటం సరికాదనే తీవ్రవిమర్శని ఎదుర్కొంటోందీ నవల. మా కథ మేము చెప్తే పట్టించుకోని ప్రచురణ సంస్థలు మా గురించి ఇంకొకరు రాస్తే ప్రచురించటం ఏమిటనీ, సాహిత్యపు గమనాన్ని నిర్దేశించగలిగిన ఈ సంస్థలు అన్ని వర్గాలవారి సామర్థ్యాన్ని గుర్తించాలనీ అనేవారి సంఖ్య భారీగానే ఉంది. కథ ఎవరు చెప్పినా ఫరవాలేదు, వస్తువుకి న్యాయం చెయ్యాలనే వారు కొందరు. ఇందులో మెక్సికో ప్రజలకీ, వలసదారులకీ న్యాయం జరగలేదని లోపాలను ఎత్తిచూపేవారు మరికొందరు. విమర్శలూ ప్రతివిమర్శలతో కలకలం సృష్టిస్తోందీ నవల. ఇన్ని సంచలనాలు సృష్టించిన ఈ నవల థ్రిల్లర్‌లా మొదలవుతుంది. మెక్సికోలో ఉన్న మధ్యతరగతి కుటుంబమైన లిడియావాళ్ల ఇంట్లో పుట్టినరోజు వేడుక జరుగుతూంటుంది. ఉన్నట్టుండి పెరట్లో కాల్పులు. కుటుంబంలో పదహారుమంది చనిపోయిన ఆ మారణహోమాన్నుంచి లిడియా తన కొడుకు లూకాతో సహా తప్పించుకుంటుంది. ఒక మాఫియా అధినేత గురించి తన భర్త, పత్రికలో రాసిన వ్యాసమే ఈ ప్రతీకార చర్యకి కారణమని లిడియాకి అర్థమవుతుంది. మాఫియా అరాచకాలకు ఎవరూ అతీతులు కారనీ, పిల్లలు కూడా వీధుల్లో హత్యల్నీ, శవాలు పడివుండటాన్ని చూసినవారేననీ అంటారు రచయిత్రి. వీధుల్లో తెగిపడిన తలలూ, యువతీయువకులూ, పిల్లలూ కనిపించకుండా పోవడాలూ, కత్తిపోట్లూ, తుపాకీల మోతలూ – అన్నీ సాధారణమే. ఇదేమిటని మాఫియాని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రభుత్వ యంత్రాంగమూ, పోలీసులూ వారి గుప్పిట్లో ఉన్నవారే! బతుకు భరోసా కరువైన అలాంటి పరిస్థితుల్లో మాఫియాకి దూరంగా – అక్రమంగానైనా సరే – అమెరికాకి వెళ్లిపోవాలని లిడియా చేసే ప్రయత్నమే ఈ నవల. ప్రాణభయం, కొడుకుని కాపాడుకోవాలన్న తాపత్రయం, తెలివితేటలూ, తెగింపూ ఉన్న వ్యక్తి లిడియా. కొడుకు కోసం కదిలే రైలు పైకి దూకగలిగిన మొండి ధైర్యం ఆమెది. పసితనంలోనే విషాద జీవితానుభవాలు పొందిన ఎనిమిదేళ్ల లూకా తల్లికి ధైర్యాన్ని ఇవ్వవలసిన బాధ్యతని తనమీద వేసుకొని, వయసుకి మించిన మానసిక స్థైర్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. వీరి ప్రయాణంలో మెక్సికో నుంచి పారిపోయే వారేకాదు, అమెరికానుంచి వెనక్కి పంపబడి మళ్లీ వెళ్లటానికి ప్రయత్నించేవారూ కలుస్తారు. గూడ్స్ రైళ్ల నిచ్చెనలూ, పైకప్పుల మీద వీరందరి అనధికార ప్రయాణం. సహాయం చేసేవారితో పాటు, దౌర్జన్యంగా డబ్బుని లాక్కునేవాళ్లూ, అమ్మాయిలను రాక్షసంగా అనుభవించి అమ్మేసే వాళ్లూ, పిల్లలను మాఫియాకి సరఫరాచేసే వాళ్లూ – అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు. ‘‘ప్రతిక్షణం పరిస్థితులకి అనుగుణంగా మారటం వలసదారులకి అవసరం. వారు మొండిగా ఉండవలసిన విషయం ఒక్కటే– అది ప్రాణాలతో ఉండటం’’అంటుంది లిడియా. వలసదారుల అస్తిత్వపోరాటం, అస్థిరత్వం, భయం, సంఘర్షణ, స్త్రీ అంతఃశక్తి– వీటిలో ఈ నవల స్పృశించనిదేదీ లేదు, మనల్ని తాకనిదీ ఏదీ లేదు. -పద్మప్రియ రీవిజిట్ ఒక తాత్విక చమత్కారం సామాజిక ప్రయోజనం నెరవేర్చని కవి తనంతట తానే మరణిస్తాడంటాడు ప్రసేన్. అలాగని, హృదయంలోని సుతిమెత్తని తంత్రులను మీటడం సామాజిక ప్రయోజనం కాకుండా పోదని కూడా అంటాడు. ఇలా మాట్లాడటం వల్లే ఒక్కోసారి ఎవరికైనా తాను అర్థం కాకుండా పోయానేమో అన్న అనుమానం ఆయనకు ఉన్నప్పటికీ, చెప్పాలనుకున్నదాన్ని చెప్పాల్సిన విధంగానే చెప్పానన్న స్పష్టత కూడా ఆయనకు ఉంది. 1985లో రక్తస్పర్శ కవుల్లో ఒకడిగా మొదలైన ప్రసేన్ సొంతంగా ‘ఇంకా వుంది’, ‘ఏదీ కాదు’ కవితా సంపుటాలు వెలువరించాడు. ‘కవిత్వం’, ‘క్రితం తర్వాత’ సంకలనాల్లో భాగమయ్యాడు. ఈ మళ్లీ వచ్చిన ‘ప్రసేన్ సర్వస్వం’లో ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు, ముందుమాటలు విమర్శలు, ప్రశంసలతో పాటుగా, ఆయన కవితల్లోంచి ఎంపిక చేసిన కవితలు కూడా ఉన్నాయి. అందులోంచి ఒకటి: నెత్తురోడుతున్నావు గదా నువు గాయానివా అడిగింది ఆయుధం కాదు నేను ఓడిపోయిన అభిప్రాయాన్ని చెప్పింది విజయం ఉప్పురుచి తెలియదు ఐనా నేను సముద్రాన్నేనా అడిగింది కన్నీటి చుక్క పరిమళం మరణించినా పూవుసారం మారదు చెప్పింది విషాదం విజయానికి విషాదానికి ఏ దూరపు చుట్టరికం అడిగింది రేపటి కల నేను కీ నేను కీ మధ్య తేడా ఉండదు కదా! చెప్పింది తుళ్లిపడ్డ నిద్ర! ప్రసేన్ సర్వస్వం పేజీలు: 326; వెల: 300; ప్రచురణ: అడుగు జాడలు పబ్లికేషన్స్; కవి ఫోన్: 9963155524 -ప్రసేన్ -
భ్రమాన్విత చేతన
‘వాస్తవాన్ని వివరించడానికి, ఎన్నిమాటలూ సరిపోవు,’ అంటాడు డానియల్ ఖిల్మాన్ రాసిన ‘యు షుడ్ హావ్ లెఫ్ట్’ నవలలోని కథకుడు. కానీ, రచయిత సమర్థుడైతే ఒక ప్రత్యేకమైన కథకుడ్ని ఉపయోగించుకుని ఆ సంక్లిష్ట వాస్తవాన్ని మన ఊహకి అందేలా చేయగలడు. నవల శిల్పం, ఆ శిల్ప ప్రభావం సంపూర్ణంగా ఆ ప్రత్యేక కథకుడి మీదా, అతని కథనం మీదా ఆధారపడి వుంటుంది. సినిమా రచయిత అయిన కథకుడు, విజయవంతమైన తన సినిమాకి సీక్వెల్ రాయడానికి– భార్య (ఒకప్పుడు సినీ నటి, ఇప్పుడు నలభై ఏళ్లు), నాలుగేళ్ల కూతురుతో కలిసి కొండమీద ఒక భవంతిని అద్దెకి తీసుకుంటాడు. రైటర్స్ బ్లాక్‌తో అవస్థ పడుతున్న అతనికి, నటిగా అవకాశాలు రాని అసహనంతో ఉన్న భార్య విసిరే సూటిపోటి మాటలు తోడవుతుంటాయి. స్క్రీన్‌ప్లే రాసే పుస్తకంలోనే జరుగుతున్న విషయాలని కూడా అతను రాస్తుండటంతో కథ మనలని చేరుతుంటుంది. మొత్తం ఆరురోజుల కథ, ఆరే ఆరు అధ్యాయాలు. రెండో అధ్యాయంలో ‘ఒక వింత విషయం జరిగింది,’ అనే వాక్యంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక ఫొటోలోని మనిషే పీడకలలో కనిపించింది కానీ, తీరా చూస్తే ఇప్పుడక్కడ ఆ ఫొటోనే లేదు! ఇంట్లో ఇంతకుముందు చూసిన కారిడారే ఇంకా పొడుగ్గా ఉన్నట్టుంది. ఇంతకుముందు లేని పడక గదులు ఇప్పుడు మరికొన్ని కనిపిస్తున్నాయి. కొండకింది ఊరికి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడో కొత్త వ్యక్తి, అక్కడెందుకు ఉంటున్నారసలు అని స్థానిక యాసలో అడిగింది అతనికి సగమే అర్థం అవుతుంది. మిగతా సగం మనకి అర్థం అవుతుంది! నాలుగో రోజుకి మరో ఎదురుదెబ్బ– భార్యకి మరెవరితోనో సంబంధం ఉందని తెలియడం, నిలదీస్తే ‘కూతుర్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఆమె కారేసుకుని వెళ్లిపోవడం. ఒక లంబకోణం గీసి, ఆ కోణాన్ని ఖండిస్తూ అడ్డంగా మరో సరళరేఖని గీసి, ఏర్పడ్డ రెండు కోణాల మొత్తం చూస్తే అది తొంభైకి కొంచెం తక్కువగా ఉంటోంది. లెక్కలన్నీ తప్పుతున్నాయి.ఇదంతా బొత్తిగా ‘భూత’ కల్పనేమో అని మనం అనుకునే లోపలే ఒక విషయం గమనిస్తాం. ఇప్పటివరకూ జరిగిన కథలోని చివరి రెండు అధ్యాయాలలోనూ కథకుడు రాస్తున్న దాంట్లో తేడా కనిపిస్తుంది. విరిగిపోతున్న వాక్యాలూ, చెరిగిపోతున్న విరామ చిహ్నాలూ మనకి కొత్త అనుమానాలు సృష్టిస్తాయి. దెబ్బతిన్న కథకుడి మానసిక సమతుల్యత అర్థమై– జరిగిన కథని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం, జరగబోతున్న కథని, చెప్పబోతున్న కథకుడిని జాగ్రత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఏకకాలంలో కలుగుతాయి. ప్రత్యేకత కలిగిన ఇలాంటి అన్రిలయబుల్ నేరేటర్ విషయంలో కథకుడు నమ్మదగినవాడు కాదని ప్రారంభంలోనే తెలియడం వేరు. మధ్యలో తెలియడం అసలైన హారర్! ముప్పై ఏళ్ల వయసులోనే ‘మెజరింగ్ ది వరల్డ్’ నవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జర్మన్ రచయిత మూడేళ్ల క్రితం విడుదలయిన నవల ‘టిల్’తో జర్మన్ సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ‘యు షుడ్ హావ్ లెఫ్ట్’ కథనం ఆకట్టుకోవడానికి మూల రచయిత కృషి ఎంత ఉండివుండవచ్చో, అనువాదకుడు రాస్ బెంజమిన్ కృషి దాదాపుగా అంతే ఉందనిపిస్తుంది. 2017లో పాంథియాన్ ప్రచురించిన ఈ ఇంగ్లిష్ అనువాదం చదివాక బెంజమిన్ ఇతర అనువాదాలని వెతికిపట్టుకుని చదవాలనిపిస్తుంది. దిశ మారుతున్న కథని మనం గమనిస్తూ కూడా దాన్ని మామూలు హారర్ కథగా భ్రమించకుండా, రచయిత కథని నడుపుతున్న తీరుని గమనించేట్టు చేయడం డానియల్ ఖిల్మాన్ ఈ నవలలో సాధించిన విశేషం. -యు ఎ.వి.రమణమూర్తి -
కరోనా వెనుక అసలు కథ.. ఇదేనా!
ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు దాదాపు 1700 మంది వైరస్ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వూహాన్ వైరస్ గురించి 40 ఏళ్ల క్రితమే ఓ నవలా రచయిత ఊహించాడు. 1981లో అమెరికా రచయిత డీన్ కూంట్జ్ తన థ్రిల్లర్ నవల ‘ది ఐస్ ఆఫ్ డార్క్నెస్’లో వూహాన్ సిటీలో కొత్త వైరస్ ప్రస్థావన ఉంది. ఆయన తన ఫిక్షన్ స్టోరీలోని ఓ పేజీలో దీని గురించి రాశారు. చదవండి: ఆరోగ్య శత్రువు కోవిడ్–19 వూహాన్ సిటీలోని మిలటరీ ల్యాబ్‌లో చైనా కావాలని బయో వెపన్ కోసం ఈ వైరస్‌ను సృష్టించినట్లు ఆ బుక్‌లో ఉంది. వుహాన్-400 అనే పేరుతో చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను క్రియేట్ చేసినట్లు ఆ ఫిక్షన్ స్టోరీలో రాశారు. ఈ వైరస్ శత్రుదేశాలపై పోరాటానికి చైనా తయారుచేస్తుందని, ఇది మనుషులపై మాత్రమే ప్రభావం చూపుతుందని అందులో ఉంది. దీని ద్వారా కొన్ని ప్రాంతాలను లేదా దేశాలనే నాశనం చేయవచ్చని అందులో పేర్కొన్నారు. చదవండి: కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. దారెన్ ప్లెమౌత్ అనే ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన బుక్ కవర్ ఫోటో, ఆ బుక్‌లో వైరస్ గురించి ప్రస్తావించిన పేజీని ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మనీష్ తివారీ కూడా ట్విటర్లో స్పందించారు. కరోనా వైరస్ వూహాన్-400 పేరుతో చైనా అభివృద్ధి చేసిన బయోలాజికల్ ఆయుధమా..? అంటూ 1981లో పబ్లిష్ అయిన ఓ బుక్ కాపీని జత చేస్తూ మనీష్ తివారీ ట్వీట్ చేశారు. చదవండి: 'వీరి ప్రేమ ముందు ఏ వైరస్ నిలబడలేదు' It's a strange world we live in.#coronavirus #COVID19 #Wuhan pic.twitter.com/WkjbK4zGaW — Darren of Plymouth 🇬🇧 (@DarrenPlymouth) February 16, 2020 Is Coranavirus a biological Weapon developed by the Chinese called Wuhan -400? This book was published in 1981. Do read the excerpt. pic.twitter.com/Qdep1rczBe — Manish Tewari (@ManishTewari) February 16, 2020 -
తెలుగులో నవ్వే హోవార్డ్ రోర్క్
75 ఏళ్లుగా పాఠకులు చదువుతున్నారు. 20కి పైగా భాషలలోకి మార్చుకున్నారు. 70 లక్షల ప్రతులకు మించి కొన్నారు. కాలాలు దేశాలు దాటివచ్చిన పుస్తకం క్లాసిక్ కాక మరేమిటి? ఇందులో కథ కొన్ని ఏళ్లపాటు జరిగిన కథ. హీరో పాత్రకి 22 ఏళ్లుండగా మొదలౌతుంది. అతనికి సుమారుగా 40 ఏళ్లు వచ్చేదాకా నడుస్తుంది. 1943లో అచ్చయిన ఈ పుస్తకంలో హీరో హోవార్డ్ రోర్క్ పాత్ర 1936 నాటికే పుట్టింది. 1937 నాటికే అయిన్ రాండ్‌కు టూహీ పాత్ర గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఎంత చిన్న పాత్ర అయినా సరే వాళ్లని రూపురేఖలు దుస్తులతో సహా ఊహించింది అయిన్ రాండ్. ఉదాహరణకు టూహీ అర్భకంగా ఉండటం కేవలం వైచిత్రి కోసం చేసిన కల్పన కాదు. అతని మానసిక వైఖరికి కారణాల్లో అర్భకత్వం ఒకటి. నేపథ్య చిత్రణ వాస్తవంగా లేకపోతే నవల సహజంగా పండదు. అందుచేత వాస్తవిక చిత్రణ కోసం ఆర్కిటెక్చర్ రంగం గురించి విస్తృతంగా అధ్యయనం చేసింది. ఒక సంవత్సరం పాటు ఒక ఆర్కిటెక్చర్ ఆఫీసులో ఉద్యోగం చేసింది. ఇది ఆమె శ్రద్ధ. ఇది ఆర్కిటెక్చర్ మీద పుస్తకం కాదు. కానీ చిత్రంగా ఈ నవలలో అయిన్ రాండ్ చేసిన ఊహలతో అమెరికన్ ఆర్కిటెక్చర్ రంగం ప్రభావితం అయిందంటున్నారు విశ్లేషకులు. అదీ ఆమె క్రియేటివిటీలోని లోతు మనిషి అంటే ఏమిటో చూపించడానికి ఇది రాయాలనుకుంది అయిన్ రాండ్. మనిషి ‘అయినవాడు’ ఏం కోరుకుంటాడో, ఏ రకంగా ఆ కోరికను తీర్చుకుంటాడో రాయడానికి పూనుకుంది. ‘మనిషి చైతన్యం సాధించే గెలుపుకి ఒక ఇతిహాసంగా, మనిషిలోని ‘నేను’కు ఒక ‘హిమ్’గా (ప్రశంసా గీతంగా, కీర్తనగా) ఈ నవలను తీర్చిదిద్దాలని ఆవిడ సంకల్పం. స్వార్థపరుడైన గొప్ప వ్యక్తి ఈ నవలలో హీరో. స్వార్థం అనేది తప్పు అని మనకు చెబుతూ వచ్చాయి మతాలు. అనేకమంది తత్వవేత్తలు కూడా స్వార్థ రాహిత్యం గొప్పదని బోధించారు. అయిన్ రాండ్ అదంతా తప్పు అంది. ఇంతవరకూ మనం స్వార్థమని భావిస్తున్నది ఎంత నిస్సా్వర్థమో అందువల్ల ఎంత నిస్సారమో చూపించింది. హోవార్డ్ రోర్క్ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. రోర్క్ ఎందరో మేధావులకి ప్రేరణగా నిలిచిన పాత్ర. అయిన్ రాండ్ తన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో ప్రకటించింది. విభేదించడానికి అయినా చదవాల్సిన రచయిత్రి. సోదర భాషల మధ్య ఫరవాలేదుకాని తెలుగు ఇంగ్లీషుల్లాగా రెండు ఏమాత్రం సంబంధం లేని భాషల మధ్య అనువాదం కష్టం. వీటిలో కర్త, కర్మ, క్రియల కూర్పు వేర్వేరు. జాతీయం వేరు. సంస్కృతి వేరు. అలవాట్లు వేరు. మర్యాదలు వేరు. వాళ్ల లివింగు రూములు, డ్రాయింగు రూములు, స్టడీ రూములు మనకు పరాయివి. అన్నింటినీ ‘తెలుగు చెయ్యడం’ కుదరదు. ఇంగ్లీషులో కన్నా తెలుగులో పదజాలం తక్కువ. అనేక అర్థచ్ఛాయల్ని ఇముడ్చుకున్న ఏకపదాలు ఇంగ్లీషులో ఉంటాయి. అంతవరకూ ఎందుకు, ఇంగ్లీషులో కామాలు, సెమీకోలన్లు, కోలన్లు, హైఫెన్లు కూడా అవిభాజ్యాలయిన భాషా భాగాలు. తెలుగులో వాటి వాడుకకు కచ్చితమైన వ్యవస్థ ఏర్పడలేదు. అవి అలా ఉండగా, అయిన్ రాండ్ నిర్దాక్షిణ్యంగా రాస్తుంది. ఎక్కడ ఏ పదం ఉచితం అనుకుంటే అక్కడ ఆ పదాన్ని నిస్సందేహంగా వాడుతుంది. ఆవిడ డిక్షన్ సామాన్యమయింది కాదు. ఆలోచనలో లోతెక్కువ. గాఢత సున్నితత్వం హెచ్చు. మెలికలు ఎక్కువ. పదక్లిష్టతని ఏ డిక్షనరీ సహాయంతోనో అధిగమిస్తాం. భావ క్లిష్టతని? సగటు పాఠకుడికి అర్థమయ్యేలా రాయమని ఒకరిద్దరు సూచించారు. రీ టెల్లింగులో సులభపరిచే స్వేచ్ఛ ఉంటుంది. కానీ లోతు పోతుంది. గొప్ప నవలని వట్టి కథ స్థాయికి దించకూడదు. కాబట్టి అనువాదమే దారి. ఎంత దులుపుదామన్నా ఈ తెలుగు పుస్తకానికి భాషరీత్యా కూడా కొద్దో గొప్పో ఇంగ్లీషు అంటుకునే ఉండిపోయింది. తెలుగు భాషకి ఉన్న పరిమితులే కాక నా భాషాజ్ఞానానికి ఉన్న పరిమితులు కూడా ఉంటాయి. ప్రయత్న లోపం మటుకు లేదు. - రెంటాల శ్రీవెంకటేశ్వరరావు -
నమ్మాలనుకునే గతం
‘మనకి గుర్తున్నదే, మనం చూసినదై ఉండనవసరం లేదు.’ ఇలా మొదులయ్యే బ్రిటిష్ రచయిత జూలియస్ బార్న్స్ రాసిన ‘ద సెన్స్ ఆఫ్ యాన్ ఎండింగ్’ నవలకు ప్రధాన పాత్రా, కథకుడూ అయిన టోనీ, అరవైల్లో ఉన్న వ్యక్తి. ‘జీవితం నన్నెక్కువ అల్లరి పెట్టకూడదనుకున్నాను. జీవితపు చివరి దశలో కొంతయినా విశ్రాంతి అవసరం. దానికి నేను అర్హుడిని’ అనుకునే సగటు మనిషి. అలాంటి వ్యక్తిని, 40 ఏళ్ళ కిందకి లాక్కెళ్లే పరిస్థితులు ఎదురవుతాయి. టోనీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు, యేడ్రియన్ అన్న తెలివైన అబ్బాయి అదే స్కూల్లో చేరతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. యూనివర్సిటీలో టోనీకి, వెరోనికా గర్ల్‌ఫ్రెండ్ అవుతుంది. ఒక వారాంతం, టోనీ ఆమె ఇంట్లో గడపడానికి వెళ్తాడు. వెరోనికా తల్లయిన సారా– కూతురి గురించి చెడుగా చెప్పి, టోనీతో సరసాలాడుతుంది. వెనక్కి వచ్చిన తరువాత, వెరోనికా– టోనీ మధ్య అన్యోన్యత పోతుంది. యూనివర్సిటీ చివరి సంవత్సరంలో, టోనీకి– తను వెరోనికాతో కలిసున్నానని రాసిన యేడ్రియన్ ఉత్తరం అందుతుంది. ‘ప్రియమైన యేడ్రియన్, (వెరోనికా, దీన్ని నువ్వూ చదువుతూనే ఉండి ఉంటావని తెలుసు.) మీరు ఒకరికొకరు సరిగ్గా సరిపోతారు. నేను మిమ్మల్నిద్దరినీ పరిచయం చేసిన రోజుని మీరు తిట్టుకుంటారని అనుకుంటాను. కాలం తీర్చుకునే ప్రతీకారాన్ని నమ్ముతాను కనుక మీకిద్దరికీ ఒక బిడ్డ తప్పక పుట్టాలి. ఆ బిడ్డ, తల్లిదండ్రుల పాపాలకు వెల చెల్లించాలి. వెరోనికా తల్లే నన్ను కూతురి గురించి హెచ్చరించింది. నేనే నీ స్థానంలో ఉండివుంటే, నిర్ణయం తీసుకునేముందు ఒకసారి సారానూ సంప్రదించేవాడిని’ అని విషం కక్కుతూ జవాబు రాసిన టోనీ, దాని గురించి ఇక మరచిపోతాడు. ఆ 40 ఏళ్ళ పాత ఉత్తరం, అందరి జీవితాలనూ మార్చేస్తుంది. కొన్ని నెలల తరువాత యేడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కబురు అందుతుంది టోనీకి. ప్రస్తుత కాలపు పుస్తకపు రెండవ భాగంలో, సారా– టోనీకి అయిదు వందల డాలర్ల ‘బ్లడ్ మనీ’తో పాటు రెండు పత్రాలను వదిలిపెట్టిందని లాయర్ ఉత్తరం వస్తుంది. యేడ్రియన్ డైరీ వెరోనికా వద్దే ఉందని తెలుస్తుంది. లాయర్, టోనీకి అతని గతపు ఉత్తరం అందించాక, ‘అది రాసినది నేనేనా!’ అనుకుని, నమ్మడానికి నిరాకరిస్తాడు. వెరోనికా తన వద్దున్న యేడ్రియన్ డైరీ ఇవ్వనన్నప్పుడు, టోనీ ఆమెతో ‘మర్యాదగా, స్నేహంగా’ ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు. వెరోనికా, టోనీని మానసిక వికలాంగులుండే చోటుకి తీసుకెళ్తుంది. వాళ్ళలో ఒక వ్యక్తికి యేడ్రియన్ పోలికలుండటం గమనించిన టోనీ, ‘నీకూ, యేడ్రియన్కూ కొడుకున్నాడని తెలియలేదు’ అన్నప్పుడు, తిరుగు మెయిల్లో, ‘నీకె ప్పుడూ, ఏదీ అర్థం కాదేం?’ అన్న ప్రశ్న సమాధానంగా వస్తుంది.‘అప్పుడు జరిగినదాని గురించిన నా పక్షపు కథ ఇది. ఆ సంఘటనల నా జ్ఞాపకం అనుకోండి’ అని టోనీ, పాఠకులకు చెప్తాడు. ఆ వ్యక్తి నిజానికి యేడ్రియన్కూ, సారాకూ పుట్టినవాడు. వెరోనికా సవతి తమ్ముడు. యేడ్రియన్, వెరోనికాల సంబంధం తెగిపోవడానికీ, సారాతో అతని సంబంధానికీ, అతని ఆత్మహత్య కారణాలనూ పాఠకుల ఊహకే వదిలేస్తాడు రచయిత. గతంలో– ఏది, ఎలా జరిగిందని టోనీ నమ్మాడో, వాటికి వ్యతిరేకంగా జరిగినవే అన్నీ. కాలం, అవగాహనను మార్చేస్తుందని చెప్తుంది పుస్తకం. కష్టపెట్టే నిజాలను మరచిపోడానికి– వాటిని అణచిపెట్టి, మనసులో అల్లుకున్న కథలనే నమ్ముతాం అని కూడా చెబుతుంది. ‘భద్రంగా బతికే ప్రవృత్తి నాలో ఉండివుంటుంది. దాన్ని పిరికితనం అనేది వెరోనికా. నేనైతే అది ప్రశాంతంగా బతకడం అనుకున్నాను’ అని ఆధారపడలేని కథకుడైన టోనీ గుర్తిస్తాడు. స్ఫుటమైన, సంక్షిప్తమైన బ్రిటిష్ వచనం ఉన్న యీ 150 పేజీల పుస్తకాన్ని ‘జోనథన్ కేప్’ 2011లో ప్రచురించింది. నవల– బుకర్ ప్రైజుతో పాటు అనేకమైన అవార్డులు గెలుచుకుంది. దీని ఆధారంగా 2017లో భారత దర్శకుడు రితేష్ బత్రా దర్శకత్వంలో ఇదే పేరుతో సినిమా వచ్చింది. కృష్ణ వేణి -
మళ్లీ పాడుకునే పాట
టోనీ మోరిసన్ రాసిన ‘సాంగ్ ఆఫ్ సాలొమన్’ –అమెరికా, మిచిగాన్‌లో ఉన్న ‘సౌత్ సైడ్’ అన్న కాల్పనిక ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది. అది నల్లవారుండే ప్రాంతం. ఎగరడానికి ప్రయత్నించి, చనిపోయిన స్మిత్‌తో నవల మొదలవుతుంది. చుట్టూ పోగయిన జనాల్లో ఉన్న రూత్‌కు అప్పుడే పురిటి నొప్పులు మొదలై, మూడో మేకెన్ డెడ్‌కు జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు ఆస్పత్రిలో పుట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్–అమెరికన్. కొత్తగా స్వేచ్ఛ పొందిన నల్లవారిలో ఒకరైన మూడో మేకెన్ డెడ్‌కు తాతైన సాలొమన్కు ‘మేకెన్ డెడ్’ అన్న పేరు పెట్టినది, తాగి ఉన్న ఓ ఆర్మీ ఆఫీసర్. ఆ వెక్కిరింత పేరే మూడు తరాలపాటు కొనసాగుతుంది. మూడో మేకెన్ డెడ్, చాలాకాలం చనుబాలు తాగడం వల్ల, అతనికి ‘మిల్క్‌మాన్ డెడ్’ అన్న వెక్కిరింపు పేరు స్థిరపడుతుంది. ఈయన తండ్రయిన రెండవ మేకెన్, ఆస్తులు పోగుచేసుకోవడం తప్ప జీవితంలో మరే సంతోషం కనుక్కోలేకపోయిన కర్కోటకుడు. ఇరుగు పొరుగులందరిలో కారున్నది అతనికొక్కడికే. ‘అతని కుటుంబం కార్లో వెళ్ళడాన్ని వారు అసూయతోనూ, మరెంతో వినోదంగానూ చూసేవారు.’ ఆ ఊర్లో ఆ అతి ధనిక నల్ల కుటుంబంలో– తల్లి నిర్లిప్తత, తండ్రి పీనాసితనం, మేనత్త పిలాతు ఆచరణాత్మకత, ఇద్దరు అక్కల ‘శుచికరమైన కన్యత్వం’ మధ్యన పెరిగిన మిల్క్‌మాన్‌కు ప్రేమ, నిబద్ధత అర్థం కావు. ఆర్థిక స్వాతంత్య్రం పొందడానికి, పిలాతు వద్ద ఉందని ఊహించుకున్న బంగారం కొట్టేసే పథకం వేస్తాడు. ‘నేను చిన్న స్త్రీని. అల్పమైనదాన్ని అన్న అర్థంలో కాదు. చిన్నదానిగా నొక్కేశారు’ అని రూత్ తన గురించి చెప్పుకుంటుంది. పిలాతు మనవరాలైన హాగరు, మిల్క్మాన్ను ఆరాధిస్తుంది. వారి కుటుంబ స్నేహితుడైన గిటార్, నల్లజాతిపై జరిగే అత్యాచారాల గురించి పోట్లాడుతుంటాడు. ‘నీ సమస్త జీవితాన్నీ మిల్క్‌మాన్‌కు అర్పించుకుంటున్నావు. దానికి ఏ వెలా లేదా? నీకే అలా అనిపిస్తే, అతనెందుకు లెక్కచేయాలి’ అంటూ హాగరును మందలిస్తుంటాడు. ఒకసారి, తండ్రి తమ కుటుంబ చరిత్ర గురించి సూచనప్రాయంగా చెప్పిన తరువాత, మిల్క్‌మాన్ తన ముత్తాత గురించి తెలుసుకోవడానికి దక్షిణ వర్జీనియా ప్రయాణిస్తాడు. పూర్వీకుల అసలు పేర్లూ, చరిత్రా కనుక్కుంటాడు. తాత పేరు ‘సాలొమన్’ అని తెలిసి, కుటుంబం పట్ల గర్వపడతాడు. ఒక ఊర్లో పిల్లలు, సాంగ్ ఆఫ్ సాలొమన్ పాట పాడటం విన్నప్పుడు, దానికీ తన కుటుంబ చరిత్రకూ సంబంధం ఉందని తెలుసుకుంటాడు. మిచిగాన్‌లో – మిల్క్‌మాన్‌కు గురిపెట్టిన గిటార్ తుపాకీగుండు తగిలి, పిలాతు మరణిస్తుంది. తన బలహీనతలనూ, అల్పత్వాన్నీ గుర్తించిన 32 ఏళ్ళ మిల్క్‌మాన్– సాలొమన్ పాటను గుర్తు చేసుకుంటూ, గిటార్ వైపు ఎగురుతాడు. తరువాత జరిగినదేమిటో చెప్పరు రచయిత్రి. అయితే, అది అతను తన కుటుంబ వంశక్రమానికి తిరిగి వచ్చాడన్న లాంఛనప్రాయ క్రియ అని అర్థం అవుతుంది. సాంస్కృతిక గుర్తింపు కోసమని చేసే వెతుకులాట గురించి చెప్పే ఈ పుస్తకం, బానిసత్వాన్ని తప్పించుకోవడానికి ఆఫ్రికా ఎగిరిపోయే ఆఫ్రికన్– అమెరికన్ జానపద కథని ఆధారంగా తీసుకుని రాసినది. కొంత మాయా వాస్తవికతా, ప్రతీకవాదం, అణచివేత, వివక్ష పట్ల కోపం ఉన్న ఈ కుటుంబ చరిత్రలో అనేక పాత్రలు ఉన్నాయి. మగవాళ్ళెప్పుడూ తమ ఉనికిని తప్పించుకుని పారిపోతూ ఉండగా, స్త్రీలు ప్రేమలో పిచ్చివాళ్ళవుతారు. వారు జాత్యహంకారానికి బలి అవడమేగాక, తమ పురుషుల స్వేచ్ఛకు కూడా మూల్యం కూడా చెల్లిస్తారు. ప్రథమ పురుషలో సాగే కథనం భూతకాలంలో ఉంటుంది. ఇరవయ్యవ శతాబ్దంలో ఆఫ్రికన్ అమెరికన్ల బానిసత్వపు చేదు వారసత్వం, వారి కుటుంబాల్లో ఉండే సంక్లిష్టతలను స్పృశిస్తారు రచయిత్రి. సంగీతం అన్న మూలాంశం నవలంతటా కనిపిస్తుంది. నవల ఎగిరే ప్రయత్నంతోనే మొదలవుతుంది, ముగుస్తుంది. 1977లో ప్రచురించబడిన నవలిది. ఆఫ్రికన్ అమెరికన్ అయిన టోనీ మోరిసన్ నోబెల్ పురస్కారం పొందిన మొట్టమొదటి నల్లజాతి మహిళ(1993). ఆమె రచనల్లో– ఇతిహాస ఇతివృత్తాలు, సున్నితమైన భాష, వివరమైన ఆఫ్రికన్ అమెరికన్ జీవితాలుండటం వల్ల అన్నీ పేరు పొందినవే. గత వారమే ఆమె మరణించారు(18 ఫిబ్రవరి 1931– 5 ఆగస్ట్ 2019). -యు.కృష్ణ వేణి -
ఒక బలహీనమైన గాఢమైన ప్రేమ
లీనా ఆండర్సన్ రాసిన స్వీడిష్ నవల ‘విల్‌ఫుల్ డిస్రిగార్డ్’లో, 31 ఏళ్ళ ఎస్టర్ తెలివైనది. ఫిలాసఫీలో డిగ్రీ ఉంటుంది. కవిత్వం, వ్యాసాలూ రాస్తూ స్టాక్‌హోమ్‌లో ఉంటుంది. ఆమె ‘భౌతిక, మానసిక అవసరాలను తృప్తి పరుస్తూ, ఆమె స్వేచ్ఛకు అడ్డుచెప్పని పెర్తో సామరస్యమైన సంబంధంలో’ 13 ఏళ్ళుగా ఉంటుంది. ఆమెకు ‘తన ఆలోచనలు తెలుసు. తన సిద్ధాంతాల ప్రకారమే జీవించేది.’ ఒకరోజు, పేరున్న వీడియో ఆర్టిస్టయిన హ్యూగో రస్క్ గురించి లెక్చర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, నెట్లో అతని వివరాలు వెతుకుతుండగా, ‘ఆమెకు అతనితో దృఢమైన సంబంధం’ ఉన్న భావన కలుగుతుంది. అతను ప్రేక్షకుల్లో కూర్చునుంటాడు. లెక్చర్ తరువాత, ‘బయటవారెవరూ నన్ను ఇంత కచ్చితంగా, లోతుగా అర్థం చేసుకోలేదు’ అని ఎస్టర్కు చెప్పిన క్షణమే ఆమె అతనితో ప్రేమలో పడిపోతుంది. ‘మాకిద్దరికీ గాఢమైన బంధం ఏర్పడింది’ అని స్నేహితురాళ్ళకు చెప్పినప్పుడు ‘నీపై అతనికే ఆసక్తీ ఉండదులే’ అని వారు తేల్చిపారేసినా పట్టించుకోదు. ఎస్టర్కు రస్క్‌తో ‘ఒంటిమీద స్పృహ లేని ఉద్రిక్తమైన వారం’ గడిపిన తరువాత, బయట ప్రపంచం కనిపించడం మానేస్తుంది. పెర్తో ఉండే తన సంబంధం పేలవంగా అనిపిస్తుంది. ఎస్టర్, హ్యూగో కలిసి డిన్నర్లకు వెళ్ళడం, టెక్ట్స్ మెసేజులు పంపుకోవడం ప్రారంభిస్తారు. ఆడ అభిమానులున్న హ్యూగో ఆమెను తనింటికి రానివ్వడు. తన స్టూడియోలో కలుసుకుంటాడు. ఆమె మెసేజులని పట్టించుకోవడం మానేస్తాడు. మెయిల్స్‌కు జవాబివ్వడు. అలా అని, తనకింక ఆమెపై ఆసక్తి లేదనీ చెప్పడు. ఆమె మాత్రం అతను కనిపిస్తాడేమోనన్న ఆశతో అతని స్టూడియో చుట్టూ తిరుగుతుంటుంది. ‘నా ఫోన్ సైలెంట్లో కానీ లేదు కదా!’ అని ఆత్రంగా, తన ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేసుకుని చూసుకుంటుంది. హ్యూగో ప్రతీ రెండు వారాంతాలకూ తల్లి కోసమని చెప్పి బారస్ అనే ఊరుకి వెళ్తానని చెప్తాడు. ఇతర స్త్రీలతో గడపడానికే వెళ్తున్నాడన్న అనుమానం కలిగినప్పటికీ, ‘అతనికేవో అడ్డంకులొచ్చుంటాయిలే’ అని నచ్చచెప్పుకుంటుంది. బాధ మరచిపోడానికి ప్యారిస్ వెళ్తుంది. తటపటాయిస్తూనే హ్యూగోకి ఫోన్ చేస్తుంది. ‘సరే, నీవు తిరిగి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం’ అని అతనన్నప్పుడు, అలవాటైన ఆమె ఆశ మళ్ళీ చిగురిస్తుంది. వెనక్కి తిరిగి వచ్చి, పెర్కు అకారణంగా ఫోన్ చేస్తుంది. అతను తమ సంబంధాన్ని తిరిగి కొనసాగించాలనుకున్నా, ఆమె ఇష్టపడదు. ఇలా– సంవత్సరం, నాలుగు నెలలు గడిచిన తరువాత, హ్యూగోతో తనకున్న అన్యోన్యత కేవలం తన ఊహే అని గ్రహిస్తుంది. తన ఆ ఆకర్షణ, హ్యూగో కనపరిచిన వ్యక్తిత్వం వల్ల కలిగిందేనని అర్థమై, తన్ని తాను ఏవగించుకుంటుంది. తన ‘దుఃఖం అంత తీవ్రంగా, అపరిమితంగా కొనసాగడం అసాధ్యం’ అని గుర్తిస్తుంది. ఆ సంబంధం మెల్లిమెల్లిగా తెగిపోయిన వర్ణన– భావావేశంతో, నిజాయితీగా ఉంటుంది. నవల్లో ఏ పాత్రనీ భౌతికంగా వర్ణించరు ఆండర్సన్. ఎవరి నేపథ్యాల, జీవనశైలుల ప్రస్తావనా ఉండదు. ఏకపక్ష ప్రేమేనని తెలిసినప్పటికీ, మనల్ని మనం ఎంత ఇష్టపూర్వకంగా వంచించుకుంటామో చెబుతుంది పుస్తకం. ప్రతి ఒక్కరూ యీ పరిస్థితిని ఎప్పుడో అప్పుడు ఎదుర్కునే ఉంటారంటారు రచయిత్రి. ఒక సంబంధంలో బలహీన స్థితిలో ఉండేది ఎక్కువ ప్రేమించే వ్యక్తే అంటారు. పాఠకులకు ఎస్టర్ పట్ల చిరాకు పుట్టినా సానుభూతీ కలుగుతుంది. పుస్తకం–తేలికైన ప్రేమకథలా కాక పాత్రల మానసిక అధ్యయనంలా అనిపిస్తుంది. డైలాగులకు కొటేషన్ మార్క్స్ ఉండనప్పటికీ, ప్రతీ పదం అర్థవంతంగా ఉన్నందువల్ల అర్థమవుతుంది. సెరా డెత్ ఇంగ్లిష్‌లోకి అనువదించిన యీ పుస్తకాన్ని అదర్ ప్రెస్ 2016లో ప్రచురించింది. స్వీడిష్‌లో 2013లో మొదటిసారి ప్రచురించబడినప్పుడు ‘ఆగస్ట్ ప్రైజ్’ గెలుచుకుంది. -కృష్ణ వేణి -
ఎడారి కాయని జీవితం
సౌదీలో భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా (మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు అర్బాబ్. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు నజీబ్. బెన్యామిన్ రాసిన మలయాళీ నవల ‘గోట్ డేస్’లో, కేరళ యువకుడైన నజీబ్ చిరకాల వాంఛ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం. ‘బంగారం వాచ్, గొలుసు, ఫ్రిజ్, టీవీ, వీసీఆర్, ఏసీ’లతో కూడిన జీవితం వంటి చిన్న కోరికలే అతనివి. బయటి ప్రపంచం గురించి తెలియక, ‘అమ్మకానికున్న వీసా’ తీసుకుని ఇల్లు తాకట్టు పెడతాడు. గర్భవతైన భార్యని వదిలి, 1992లో సౌదీ అరేబియా రాజధాని రియాద్ వెళ్తాడు. అక్కడ ‘తన కలల సంరక్షకుడు, తన లక్ష్యాలను నెరవేర్చే’ అర్బాబ్ (యజమాని) అతన్ని విమానం నుండి దించుకుంటాడు. నజీబ్‌ను ట్రక్కులో ఎడారికి తీసుకెళ్తాడు అర్బాబ్. భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా(మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు. నజీబ్ ‘అనవసరమైన ఆరోగ్య అవసరాలకని నీరు వృథా చేయకూడదు’. మూడు పూటలా బ్రెడ్డు, పాలే భోజనం. మేకలకి మేత వేస్తూ, పాలు పితుకుతూ, వాటిని ఇసుక దిబ్బల మీద తిప్పుతూ– అర్బాబ్ తిట్లూ, దెబ్బలూ తింటుంటాడు. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల, స్నేహితుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు. అతని పాస్‌పోర్ట్ యజమాని దగ్గర పెట్టుకుంటాడు. జీతం ఇవ్వడు. ‘ఈ పరిస్థితి నేను కన్న కలల నుండి ఎంత దూరమో గుర్తించాను. దూరం నుండి మాత్రమే ఆకర్షణీయంగా కనిపించే పరాయి చోట్ల గురించి కలలు కనకూడదు. అవి యధార్థం అవనప్పుడు, రాజీ పడటం ఇంచుమించు అసాధ్యం’ అనుకున్న నజీబ్, అల్లా చిత్తంపైన ఉన్న విశ్వాసంతో– తన ఒంటరితనాన్నీ, పరాయీకరణనీ ఎదురుకోగలుగుతాడు. మరుసటి మూడేళ్ళల్లో ‘పేలు పట్టి, అట్టలు కట్టిన జుత్తు, పొడుగు గడ్డంతో కంపు గొడ్తున్న ఆటవికుడి’గా మారతాడు. ఒక పిల్లాడిని చూస్తూ తనకి పుట్టిన కొడుకుని తలచుకుంటుంటాడు. ఆ పిల్లవాడి అంగచ్ఛేదానికీ, మరణానికీ సాక్షి అవుతాడు. తన జాగాలో, తనకిముందు అక్కడ పని చేసిన వ్యక్తి ఎముకలు ఇసుకలో కనబడినప్పుడు గానీ తనెంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు. తప్పించుకునే అవకాశం దొరికినప్పుడు ఇక తాత్సారం చేయడు. ఎడారిలో అతని ప్రయాణం బాధాకరమైన రీతిలో వర్ణించబడుతుంది. అతనితో పాటు బయల్దేరిన ఇద్దరిలో ఒకడు మరణిస్తాడు. మరొకతను మాయం అవుతాడు. ఏ గుర్తింపు పత్రాలూ లేకుండా ఒక్కడే నాగరికతలోకి అడుగు పెడతాడు. ‘చావకుండా మిగిలి ఉండాలంటే ఇదొక్కటే నాకున్న దారి’ అనుకుంటూ, జైలు అధికారులకి లొంగిపోతాడు. అక్కడ నుండి అతన్ని ఇంటికి పంపుతుంది ప్రభుత్వం. ‘రచయితలు ఎడారులను జ్ఞానోదయ స్థలాలంటారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగిస్తాయంటారు. నాకైతే, ఎడారి ఏ విధంగానూ ప్రాణం పోయలేదు. అక్కడ నేను మూడేళ్ళకి పైగానే ఉన్నాను’ అంటాడు నజీబ్. ‘ఇది నాకు నిజజీవితంలో తెలిసిన మనిషి అనుభవాల గురించిన పుస్తకం’ అంటారు రచయిత బెన్యామిన్(ఇది కలంపేరు. అసలు పేరు బెన్నీ డెనియల్). మేకల వివరాలు నిండి ఉన్న ఈ పుస్తకం– శరీరాన్నీ, మనస్సునూ కూడా తీవ్రంగా అణచివేసే, వణుకు పుట్టించే వృత్తాంతం. దేవుని మీద నమ్మకం అండగా లేకపోతే, నజీబ్ పరిస్థితి– ఓటమికీ, స్వీయ నిర్మూలనకీ దారి తీసి ఉండేది. నాలుగు భాగాలుగా ఉన్న పుస్తకం ఉత్తమ పురుష కథనం. సంభాషణా శైలితో ఉండి, డైరీలా అనిపిస్తుంది. అలంకార ప్రాయమైన భాష ఉండదు. ఈ నవలను సౌదీ అరేబియాలోనూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ నిషేధించారు. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ నవలను 2012లో పెంగ్విన్ బుక్స్ ప్రచురించింది. ‘ద మ్యాన్, ఏషియన్ లిటరరీ అవార్డ్’ కోసం లాంగ్‌లిస్ట్ అయింది. -కృష్ణ వేణి -
పెట్టెలో ఏముంది? నీ మనసులో ఏముంది?
ఎల్లుండే ఎలక్షన్ రిజల్ట్! మల్లప్పకు మహాటెన్షన్‌గా ఉంది. సస్పెన్స్ నవలలు చదవడం మల్లప్ప హాబీ. ఆ నవలల్లో ‘నరాలు తెగే ఉత్కంఠ’ అనే వాక్యాన్ని తరచుగా చదివేవాడు. ఇప్పుడది స్వయంగాఅనుభవంలోకి వచ్చింది. గోడ గడియారంలోని లోలకం తన గుండెలో పెద్దగా చప్పుడు చేస్తుంది.మల్లప్ప తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగాడు.‘ఇజ్జత్‌కా సవాల్’ అంటూ తన ప్రత్యర్థి పది రూపాయలు ఖర్చు చేస్తే తాను పాతిక ఖర్చు పెట్టాడు. ప్రత్యర్థి వంద ఖర్చు చేస్తే తాను అయిదొందలు ఖర్చు చేశాడు.ఈ దెబ్బకు ఆస్తంతా మే నెల ఎండల్లో ఆరుబయట ఐసుముక్క కరిగిపోయినట్లు కరిగిపోయింది.‘ఒకవేళ ఎలక్షన్లో గెలవకపోతే’ తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో!ఆదివారం పొద్దుట నుంచి మల్లప్పలో ఒకటే టెన్షన్.రోజూ నిద్ర లేవడంతోనే బెడ్ మీద నుండే...‘కాఫీ’ అని అరవడంమల్లప్ప అలవాటు. ఈరోజు మాత్రం... లేవడం లేవడంతోనే...‘‘గెలుస్తానా.... లేదా!’’ అని అరిచాడు.భార్య మల్లీశ్వరి నవ్వుకుంది.బాత్రూమ్లో పాటలు పాడుతూ స్నానం చేయడం మల్లప్ప అలవాటు. ట్యూన్ పాతదే. పాటే కొత్తది. ‘గజిని’ సినిమాలోని ట్యూన్‌తో ఇలా పాట అందుకున్నాడు.‘గెలుపు ఎక్కడ ఉన్నాది?గెలుపు ఎక్కడ ఉన్నాది?నీ చుట్టూనే తిరుగూతున్నాది!’ఇప్పుడు కూడా భార్య మల్లీశ్వరి చిన్నగా నవ్వుకుంది.స్నానం తరువాత దేవుడి పటం ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ మంత్రాలు చదవడం మల్లప్ప అలవాటు.ఈరోజు కూడా అలాగే కూర్చున్నాడు. కానీ మనసు మాత్రం ఎక్కడికో వెళ్లింది. ‘ఓం... గెలుస్తానా లేదా ఓం... ఓడిపోతానా ఏమిటి కొంపదీసి? ఓం... ఎలాగైనా గెలవాలి. ఓం... గెలవకపోతే ఇంకేమైనా ఉందా!’ ఈసారి మాత్రం భార్య చిన్నగా నవ్వలేదు. పెద్దగా అరిచింది...‘‘ఏమైంది నీకు?’’ట్రాన్స్ నుంచి బయటికి వచ్చిన మల్లప్ప...‘‘నాకేమైంది!’’ అన్నాడు అమాయకంగా.‘‘మీ టెన్షన్ ముదిరి పాకాన పడింది. ఇలాగైతే మీకు పిచ్చిపట్టడం ఖాయం. మీరు గెలిచినా... అందరూ పిచ్చి ఎంఎల్ఏ అంటారు. పిచ్చి వల్ల పదవికి అనర్హుడిగా ప్రకటిస్తారు’’ అని భయపెట్టింది మల్లీశ్వరి.‘‘నిజమే సుమీ! కానీ నేను ఎంత ప్రయత్నించినా టెన్షన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.ఏంచేయమంటావు చెప్పు!’’ దీనంగా జుట్టు పీక్కోబోయాడు మల్లప్ప.‘‘ఇంకా జుట్టు ఎక్కడ ఉంది నా బొంద... మొన్న ఎలక్షన్లో ప్రత్యర్థులు పీకిపాకాన పెట్టారు కదా’’ అని ఉన్నవిషయం చెప్పింది మల్లీశ్వరి.‘‘జుట్టు సంగతి సరే, టెన్షన్ నుంచి డైవర్ట్ కావడం ఎలా?’’ అడిగాడు మల్లప్ప.‘‘టీవీలో స్వామిసాగరానంద అనే ఆయన గొప్ప ప్రవచనలు చెబుతున్నాడు. ఆ ప్రవచనలు వింటే మీ మనసు శాంతిస్తుంది. టెన్షన్ మాయమవుతుంది. వెంటనే యూ ట్యూబ్ ఓపెన్ చేయండి’’ అని లాప్టాప్ చేతిలో పెట్టింది మల్లీశ్వరి.ఆరోజంతా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ప్రవచనలు సీరియస్‌గా విన్నాడు మల్లప్ప. మరుసటిరోజు ఆయన మనసు తేలికైంది. టెన్షన్ ధ్వంసమైంది. మనసు దూదిపింజలా తేలిపోయింది.తన గది దాటి బయటకు వచ్చాడు మల్లప్ప. ‘‘చక్కని సలహా ఇచ్చావు మల్లీశ్వరి. ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షనూ లేదు. నిండు కొండలా నిబ్బరంగా ఉన్నాను’’ అన్నాడు తన్మయంగా.‘‘అదిసరే... రేపు రిజల్ట్ పెట్టుకొని సంచిలో బట్టలు సర్దుకొని ఎక్కడికిబయలుదేరారు?’’ ఆశ్చర్యంగా అడిగింది శ్రీమతి మల్లీశ్వరి.అప్పుడు ఆయన ఇలా అందుకున్నాడు:‘మల్లీశ్వరీ!ఎలక్షనేమిటీ? రిజల్ట్ ఏమిటీ? ఈ చరాచరసృష్టిలో చెరుకుగడలో కూడా పరమార్థం ఉంది.తీపి గడను నిర్ణయిస్తుందా?గడ తీపిని నిర్ణయిస్తుందా?.... సమాధానం అంత తేలికా!ఎలక్షనేమిటీ దానితో నాకు ఉన్న కనెక్షనేమిటి?నువ్వు గెలిచాననుకున్నది గెలుపు కాదు. నువ్వు ఓడాననుకున్నది ఓటమి కాదు.గెలుపు ఓటములకు అతీతమైన సమ్యక్ దృష్టి నిన్ను గెలిపిస్తుంది.ఈ లోకంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు... విధి ఆడిస్తున్న వింత బొమ్మలు. జయాపజయాలు దైవాధీనాలు కదా.... నాకు విజయం కానీ, పదవి కానీ, సుఖం కానీ వద్దు.నేను జయం కోరను. పదవి వలన కానీ, జీవించడం వలన కానీ ప్రయోజనం ఏమిటి?’‘‘ప్రయోజనం ఏమిటో నేను చెబుతాను’’ అంటూ బకెట్ నీళ్లను అతడి నెత్తి మీద కుమ్మరించడంతో ఏదో లోకం నుంచి ఈలోకంలోకి వచ్చిపడ్డాడు మల్లప్ప!మల్లప్ప గురించి మాట్లాడుకున్నాం కదా.... ఇప్పుడు రాజపక్షే గురించి చెప్పుకుందాం. ఈయన శ్రీలంకీయన్ కాదు మనోడే. అసలు పేరు పక్షి రాజా. ఇంటిపేరు తన పేరు పక్కన చేరడం వల్ల రాజా పక్షి అయ్యాడు.... కాలక్రమంలో రాజపక్షే అయ్యాడు. సరే ఈ పేరు గోల ఎందుకుగానీ బిడ్డ చచ్చినా పురిటి కంపు పోనట్లు... ఎలక్షన్లై పోయినా ఎల్లుండి రిజల్ట్ అని తెలిసినా ఎలక్షన్ క్యాంపెయిన్ అలవాటునుమాత్రం మానుకోలేకపోతున్నాడు ఈ రాజపక్షే.ఉదాహరణకు... పొద్దున్నే లేచి కెమెరామెన్‌ను వెంటదీసుకొని బయలుదేరుతాడు. పేపర్బాయ్ని సైకిల్ దింపి తాను సైకిల్ ఎక్కి ఇంటింటికి వెళ్లి పేపర్ వేసి వస్తాడు. ఆ తరువాత కనిపించిన హోటల్లోకి దూరి టీ కాస్తాడు. ఆ తరువాత వేడి వేడి బజ్జీలు వేస్తాడు. కొద్దిసేపటి తరువాత సెలూన్‌లోకి దూరి గెడ్డాలు గీస్తాడు. మార్కెట్లోకి దూరి కూరగాయలు అమ్ముతాడు... ఒక్కటా రెండా! – యాకుబ్ పాషా -
మనకేది వద్దో మనకు తెలుసా?
ఏండ్రియా బెర్న్ 39 ఏళ్ళ అవివాహితురాలు. తాగుతుంది. అప్పుడప్పుడూ డ్రగ్స్ తీసుకుంటుంది. ‘ఎంతోమందితో శృంగారం జరిపినప్పటికీ, ఎవరితోనూ బంధాలు కలిపించుకోవాలని అనిపించదు’ అని తను తరచూ వెళ్ళే థెరపిస్టుతో చెబుతుంది. ‘నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు అని చెప్పిన మరుక్షణం, వాళ్ళు నమ్మరు. అబద్ధాలు చెప్తు్తన్నాననుకుంటారు’ అంటుంది. ఒకానొకప్పుడు ఆమె చిత్రకారిణి. ‘ఆ కళ నాలో ఉండి ఉండదు. అది నాకు ఆర్థికంగా సహాయపడలేదనుకున్నప్పుడే, దాన్ని విడిచిపెట్టాను. చిత్రకారిణి అవడం అంటే, జీవితకాలం సహాయం లేకుండా ఉండటం’ అనుకుని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న చిన్న అపార్టుమెంట్ అద్దెకి తీసుకుని ఉద్యోగం చేసుకుంటుంటుంది. ఏండ్రియా బాల్యంలోనే తండ్రి డ్రగ్సుకు అలవాటు పడి చనిపోతాడు. తల్లి గతంలో ‘డిన్నర్ పార్టీల’కు పురుషులని ఆహ్వానిస్తూ బతుకు వెళ్ళదీసేది. అప్పుడు కూతురు ఎదుర్కొన్న ఒకానొక సంఘటన వల్ల, తల్లి ఆ వ్యాపారాన్ని ఆపేస్తుంది. ఏండ్రియా చుట్టుపక్కల ఉన్నవారందరూ పెళ్ళయినవారో, చేసుకోబోతున్నవారో, పిల్లల్ని పెంచుతున్నవారో. ఆమె వీటిమీద మోహపడదు. పాత కాలేజి స్నేహితులు తమ పెళ్ళిళ్ళ, కుటుంబాల ఫొటోలు ఫేస్బుక్లో పెడుతూ, ‘నీకిష్టమేమో చూడు. ఇతన్ని చూస్తే, నువ్వే గుర్తొచ్చావు’ అన్నప్పుడు, ‘డిజ్లైక్ బటన్ ఎక్కడ? అరిచే బటన్ ఎందుకు లేదో!’ అంటూ, కోపం తెచ్చుకుంటుంది. స్నేహితురాలైన ఇండిగో, తనకి పుట్టిన పిల్లని ఏండ్రియా చేతులకి అందించినప్పుడు, సామాజిక మర్యాదను పాటించకుండా, ‘దీనికన్నా గ్లాసుడు వైన్ తాగితే నయం’ అనేంత విముఖత పిల్లలంటే. ఇటువంటి అభిప్రాయాలున్న ఏండ్రియా, అభివృద్ధికి నిర్వచనాలిచ్చే ప్రపంచంలో ఇమడలేకపోతుంది. తనకి కావలసినదేమిటో ఏండ్రియాకి తెలియదు. అలా అని తనకేది వద్దో అని ఆమెకి తెలుసునని కాదు. ఏండ్రియా అన్న తన విషాదకరమైన బాల్యాన్ని మరచిపోతాడు. స్నేహితుడు మేథ్యూ, చేతిలో చిల్లికాణీ లేనప్పటికీ చిత్రలేఖనాన్ని కొనసాగిస్తాడు. తను పరిపూర్ణమైన వ్యక్తిని కాననీ, తను తన జీవితంతో కానీ, తనయందు తాను కానీ సంతోషంగా లేననీ ఏండ్రియాకు తెలుసు. బతకడానికి అవసరం అని తను అనుకున్నదేదైనా చేయడానికి ఆమె సిద్ధమే. అన్నావదినలకి పుట్టిన ‘సిగ్రిద్’ ప్రమాదకరమైన వ్యాధికి గురయినప్పుడు, ‘నా దుఃఖమే ఇంతుంది. వారి బాధనెక్కడ పట్టించుకోను!’ అన్న మనిషి, మేనగోడలు మరణిస్తోందని తెలిసినప్పుడు, తన ఉద్యోగం గురించి పట్టించుకోకుండా– తన కుటుంబం పడే బాధలో పాలుపంచుకుంటూ, తనని వీడిపోతున్న జీవితాన్ని తిరిగి పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. తన జీవితానికి భాగం అయినవారినుండి తను కోరుకునేదేమిటో, మరీ ముఖ్యంగా– తననుండే తనకి కావలసినదేమిటో అని పరిశీలించుకుంటుంది. పరిహాసకరంగా ఉండి, పదునైన అభిప్రాయాలతో రాసిన ‘ఆల్ గ్రోన్ అప్’ నవల పట్టణంలో వొంటరిగా నివసించే స్త్రీ గురించినది. రచయిత్రి జేమీ అటెన్బెర్గ్ –ఏండ్రియా కంఠాన్నీ, పాత్రనూ భావోద్వేగాలతో, నిజాయితీతోనూ నింపుతారు. నవల్లో చమత్కారానికి కొదవుండదు. కథనం సూటిగా, బిగుతుగా ఉంటుంది. చైతన్య స్రవంతిలో ఉండే పుస్తకంలో, ఏండ్రియా టీనేజీ వయస్సు నుండీ– ఆమెకి కుటుంబంతో, స్నేహితులతో సహోద్యోగులతో, జీవితంలో కలిసిన పురుషులతోనూ ఉండే సంబంధాల వివరాలుంటాయి. ఆమె చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపు, అన్యోన్యత లేని తల్లిదండ్రుల సంబంధం గురించి పాఠకులకు తెలుస్తాయి. ఆమె ఎలా జీవించాలో అని నిర్దేశించే సమాజం గురించి హాస్యంగా చిత్రిస్తారు రచయిత్రి. మొదటి అధ్యాయంలో కొంతభాగం తప్ప, నవలంతటా ఏండ్రియా దృష్టికోణంతో ఉండేదే. ప్రతీదీ చక్కబడి, సుఖాంతం అయిన నవల కాదిది. దీన్ని 2017లో మొదట అమెరికాలో పబ్లిష్ చేసినది ‘హాటన్ మిఫ్లిన్ హర్కోర్ట్’. -కృష్ణ వేణి -
కోగో నోడా ( గ్రేట్ రైటర్ )
ఆనందమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సినిమాకళ ప్రేమికులు ఇవ్వగలిగే జవాబుల్లో ఒకటి: యాసుజిరో ఓజు సినిమాలను చూడగలగడం! ఈ జపాన్ దర్శకుడి చిత్రాల్లోని పాత్రల పరిణామం, అవి ఒక తార్కిక ముగింపునకు చేరే తీరు సహజంగా, అంతకంటే సున్నితంగా ఉంటుంది. జపాన్ ఆత్మను ఈ చిత్రాల్లో దర్శించవచ్చు. ఈ ప్రపంచ మేటి దర్శకుడి నిజమైన బలం రచయిత కొగో నోడా(1893–1968). పాత్రికేయుడిగా, స్టూడియో రచయితగా పనిచేశారు నోడా ముందు. ఓజు తొలి చిత్రం, 1927 నాటి మూకీ ‘స్వోర్డ్ ఆఫ్ పెనిటెన్స్’తో వీరి స్నేహం మొదలైంది. టాకీల నుంచి రంగుల చిత్రాల దాకా, ఓజు మరణించే 1963 వరకు అది కొనసాగింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘టోక్యో స్టోరీ’, ‘లేట్ స్ప్రింగ్’, ‘ఫ్లోటింగ్ వీడ్స్’, ‘యాన్ ఆటమ్ ఆఫ్టర్నూన్’ లాంటి కళాఖండాలన్నింటికీ స్క్రీన్‌రైటర్ కొగో నోడా. తరాల మధ్య అంతరాలనూ, కుటుంబ సంబంధాల్లోని గాఢతనూ ఇవి గొప్పగా చూపుతాయి. సుమారు 25 సినిమాలకు వీళ్లు కలిసి పనిచేశారు. ఒక కథను ప్రారంభించే ముందు ఓజు, నోడా ఎక్కడో ఏకాంతంగా ఒక గదిని తీసుకునేవారట. ఆ కాలంలో తాగి పడేసిన మద్యపు సీసాల్ని బట్టి స్క్రిప్టు ఎంత బలంగా వచ్చిందో చెప్పొచ్చని జోక్ చేసేవాడు ఓజు. -
మా సంతోషాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఏడవకు నా కన్నా నీ కన్నీళ్లను ఈ ముద్దులతో తుడిచెయ్యనీ గర్జించే మేఘాల విజయం ఎంతో సేపు నిలవదులే అవి ఆకాశాన్ని ఎంతో సేపు ఆక్రమించుకొని ఉండలేవులే! – వాల్ట్ విట్మన్ పై కవితనుంచే కెన్యా రచయిత గూగీ వా థియాంగో స్ఫూర్తి పొంది తన మొదటి నవలకి ‘వీప్ నాట్ చైల్డ్’ అని పేరు పెట్టాడు. 1964లో ప్రచురితమైన ఈ నవల రాసే సమయానికి ఆయన 22 యేళ్ళ యువకుడు. 1938లో పుట్టిన గూగీ తన బాల్యాన్నీ, యవ్వనాన్నీ యుద్ధనీడలలో గడిపాడు. రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయ్యే నాటికి పాఠశాల చదువు కొనసాగిస్తూ చదువు తమ అందరికీ ఒక మంచి భవిష్యత్తును తెచ్చిపెడుతుందనే ఆశతో కన్నీటిని తుడుచుకొంటున్నాడు. అటువంటి అనుభవాన్ని మించిన గొప్ప కథా వస్తువు మరింకేముంటుంది? సాధారణంగా మొదటి రచన ఆత్మకథాత్మకం కావడం సహజం. ఇటువంటి సంక్లిష్టమైన జీవితానుభవం ఉన్నపుడు మరీనూ. గూగీ కూడా అందుకు మినహాయింపు కాదు. తెల్లవాళ్ళ దాష్టీకాన్ని గురించీ వలసపాలనలోని హింస, దౌర్జన్యం, దోపిడీ గురించీ ఇందులో చిత్రిస్తాడు. చదువుకోవాలనే బలమైన కాంక్ష ఉన్న పేద పసివాడు జొరొగో. చెప్పకుండానే అతని ఆకాంక్ష తెలుసుకున్న తల్లి యోకబి. జొరొగో కుటుంబానికి అది చిన్న కోరికేమీ కాదు. చదువు అంటే కేవలం పుస్తకాలే కాదు స్కూలుకు వెళ్ళేందుకు ఒక జత బట్టలు కూడా కావాలి. అందుకే పిల్లలందరిలోకి ఒక్కరికే చదివే అవకాశం ఉంది. అది అందరికన్నా చిన్నవాడైన జొరొగోకి దక్కింది. ఆ ‘అదృష్టాన్ని’ నిలబెట్టుకోవడానికి జొరొగో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ప్రధానంగా కథ. జొరొగో తండ్రి నుగొతో తన సొంత భూమిలోనే వెట్టిచేయాల్సిన పరిస్థితి. భూమిని తన ప్రాణం కన్నా మిన్నగా ఎంచుకొనే నుగొతో తన భూముల్ని ఆక్రమించుకొన్న తెల్ల భూస్వామి హావ్‌లాండ్స్ దగ్గరే పనిచేస్తుంటాడు. ఇద్దరు భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా కలిపి పెద్ద కుటుంబాన్నే పోషించాల్సి వచ్చినా అతని ఇద్దరు భార్యలూ సొంత అక్కచెల్లెళ్లలా కలిసిపోయి సఖ్యంగా ఉంటారు. కానీ ఆ కుటుంబం సంతోషం కేవలం ఆ కుటుంబంలోని వ్యక్తుల మీద ఆధారపడినది కాదు. నుగొతో యజమాని హావ్‌లాండ్స్; నల్లవాడైనప్పటికీ హావ్‌లాండ్స్ తొత్తుగా పనిచేస్తూ తోటి ప్రజలని చిత్రహింసలు పెట్టే నల్ల భూస్వామి జాకబో; నుగొతో కొడుకులు పనిచేసే యజమానులు, ఇంతమంది మీద వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. హావ్లాండ్స్తో సహా ఈ అందరి పరిస్థితినీ నిర్ణయించేది అప్పటి బ్రిటిష్ వలస ప్రభుత్వం. ఈ అందరికీ అప్పటికి ఇంకా పూర్తిగా అర్థం కాకపోయినా ఎక్కడో నేపథ్యంలో జరుగుతూ పీడిత ప్రజలకు ఒక సన్నని వెలుగురేఖలా ఆశని కల్పిస్తున్న ‘మౌ మౌ’ సాయుధ పోరాటం. ఈ మొత్తం నవలలోని పరిస్థితులు ఇక్కడి పరిస్థితులతో దగ్గరగా కనిపిస్తూ ఆ పాత్రలని మనకి చేరువ చేస్తాయి. తూర్పు ఆఫ్రికాలో ఇంగ్లీషులో వెలువడిన తొలి తరం గొప్ప నవలలో ఒకటిగా ఇది పేరు పొందింది. ఈ నవలను ఎ.ఎం. అయోధ్యా రెడ్డి ‘ఏడవకు బిడ్డా’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ప్రచురణ ‘మలుపు’. బి.అనూరాధ -
నిజమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది?
అమెరికా–కనెటికట్‌లోని ఓ చిన్న ఊరు. ధనవంతురాలైన జూన్ కూతురి లోలీ పెళ్ళి నాటి ఉదయం. పువ్వులు అలంకరిస్తారు. కేక్ తయారవుతుంది. జూన్ జీవితాన్ని తలకిందులు చేస్తూ ఇంట్లో స్టవ్ పేలుతుంది. ఆరుబయట పడుకున్న ఆమె తప్ప– కూతురు లోలీ, కాబోయే అల్లుడు, మాజీ భర్త ఆడమ్, బాయ్ఫ్రెండైన లూక్ ఆ పేలుడులో చనిపోతారు. మర్నాడు పెళ్ళికి బదులుగా అంతిమ సంస్కారాల ఏర్పాట్లవుతాయి. ‘వారు చనిపోయినప్పుడే కాదు, అంత్యక్రియలప్పుడు కూడా జూన్ ఏడవలేదు’ అని ఊరి ప్రజలు గుసగుసలాడుకుంటారు. జూన్‌ను ఆవహించిన మౌనానికి భిన్నంగా, అగ్ని ప్రమాదం గురించిన పుకార్లు మొదలవుతాయి. ఈ ఆకస్మికమైన విషాదం తరువాత, జీవితాలు పూర్తిగా మారిన ప్రధాన పాత్రల దృష్టికోణాలు పాఠకులకు పరిచయం అవుతాయి. గతంలో తనతో స్నేహం చెడిన లూక్ తల్లైన లిడియా తన ఇంటికి వచ్చినప్పుడు జూన్, ‘వేడి సెగను తప్పించుకుంటున్నట్టు, తన ముఖం తిప్పేసుకుంటుంది. ఏ జంతువునో, ముష్టివాడినో విదిలించినట్టుగా చేయి జాడిస్తుంది.’ ‘ఈ పొద్దే వెళ్ళిపోవాలని జూన్ అనుకోదు కానీ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక, అదే సమయమని ఆమెకి తోస్తుంది.’ ఎంతోకాలం తరువాత కూతురితో సఖ్యత పెంచుకున్న జూన్ తన కారులో, అమెరికా తిరుగుతుంది. లోలీ తనకి రాసిన పోస్ట్ కార్డులో పేర్కొన్న వాషింగ్టన్ మోటెల్లో ఉండి– కూతురి పట్లా, లూక్ పట్లా తను చేసిన తప్పులని తలచుకుంటుంది. లోలీ వెళ్ళిన అవే నేషనల్ పార్కులకీ, పెట్రోల్ స్టేషన్లకీ వెళ్తుంది. ఊర్లో వెలివేయబడిన లిడియా కూడా, అప్పటికే కొడుకుతో గతంలో తనకుండే దూరాన్ని తగ్గించుకునుంటుంది. ఊరివారి దెప్పులని ఎదుర్కుంటూ, గడిచిపోయిన తన విషాదకరమైన జీవితాన్ని గుర్తు చేసుకుంటుంది. ఫ్లోరిస్ట్ అయిన ఎడిత్, పెళ్ళి ఏర్పాట్లకు డబ్బు అందలేదని సూటిపోటి మాటలన్నప్పటికీ, జూన్ డబ్బు మాత్రం తీసుకోదు. కేకును అగ్నిమాపక దళానికి ఇస్తుంది. పూలు ఊరివారికోసం ఉపయోగిస్తుంది. అలాగే, మరణించకుండా మిగిలున్న వారందరూ ‘బతికున్నప్పటికీ, ఛిద్రమైపోయినవారే’ అంటారు రచయిత బిల్ క్లెగ్. ఆ ప్రయాణంలో ఒకరోజు, జూన్ కారు అదుపు తప్పినప్పుడు– సహాయపడిన పరాయి వ్యక్తి, డిక్కీలో ఉండిపోయిన లోలీ సామాను బయటకి తీస్తాడు. అప్పుడు, ‘మొట్టమొదటిసారి ఇంటికి ఎంతో దూరంలో అపరిచితుడి ముందు ఆమె ఏడుస్తుంది.’ మితభాషి అయిన జూన్, తన ఆర్ట్ డీలర్ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. లిడియా– జూన్ ఉన్న చోటు కనుక్కుని, తనతో పాటు ఉండటానికి వస్తుంది. ‘ఆ తరువాత ఇంక ఏ అబద్ధాలూ, రహస్యాలూ ఉండవు’ అంటారు రచయిత. ‘డిడ్ యు ఎవర్ హావ్ అ ఫేమిలీ’ నవల్లో, మానవ స్వభావపు సంక్లిష్టతలను విడదీయడానికి ప్రయత్నిస్తారు క్లెగ్. పాత్రల పేర్లే ఉన్న ప్రతి పొట్టి అధ్యాయానికీ కథకులు మారతారు. వారి జ్ఞాపకాలు తప్ప ఎక్కువ చర్యలు కానీ డైలాగులు కానీ లేని పుస్తకం– అధికశాతం జూన్, లిడియా దృష్టికోణాలతో ఉన్నది. నవలంతటా ప్రధానంగా కనిపించే మనోద్వేగం– దుఃఖం. ‘జీవితం కఠోరమైనదైనప్పటికీ, మనం చేయగలిగేదల్లా మన పాత్రలను మనం పోషించి, ఒకరితో మరొకరం కలిసి ఉండటమే’ అన్న మోటెల్ వెయిట్రెస్ సిస్సీ మాటలు, పుస్తకపు సారాన్ని క్లుప్తీకరిస్తాయి. నవల– ఏలన్ షపిరో పద్యం, ‘సాంగ్ అండ్ డాన్స్’లో ఉండే, ‘నీకు కుటుంబం ఉండేదా!’ అన్న మాటలతో ప్రారంభం అవుతుంది. మ్యాన్ బుకర్ ప్రైజుకు లాంగ్ లిస్ట్ అయిన రచయిత యీ తొలి నవలని స్కౌట్ ప్రెస్ 2015లో ప్రచురించింది. -కృష్ణ వేణి -
మిస్టరీ ట్రెయిన్
మర్నాడు ఎటూ అన్నీ మరచిపోతుందని భర్త తనను నమ్మించినవన్నీ కూడా అబద్ధాలే అని గ్రహిస్తుంది రేచెల్. ‘ఇవ్వాళ శుక్రవారం. ట్రెయిన్లో తాగడంలో తప్పేమీ కాదు’ అని తన్ని తాను సమర్థించుకుంటూ– బ్యాగులో జిన్, టానిక్ కలిపిన నాలుగు క్యాన్లని పడేసుకుంటుంది 32 యేళ్ళ రేచెల్. తన ఇంటినీ, భర్త టామ్నూ, ఉద్యోగాన్నీ– తాగుడువల్ల పోగొట్టుకున్న యువతి ఆమె. అయినప్పటికీ, రోజూ అలవాటుగా తనింటినుంచి లండన్‌కు వెళ్ళే రైల్లో ప్రయాణిస్తుంటుంది. తన పాతింటి వద్ద రైలు ఆగినప్పుడు, టామ్ రెండవ భార్యను మనసులోనే వెటకరిస్తుంది: ‘నేను కొన్న ఫర్నిచర్ మధ్య, ఏళ్ళపాటు నేను అతనితో పంచుకున్న మంచంమీద, టామ్‌తో కలిసి పడుకోవడం ఎలా అనిపిస్తోంది ఏనా?’ తను తాగున్నప్పుడు, రాత్రిళ్ళు టామ్‌ను ఫోన్లో విసిగిçస్తుంటుంది. మర్నాడు ఎటూ అన్నీ మరచిపోతుందని అతను తన్ను నమ్మించినవన్నీ కూడా అబద్ధాలే అని గ్రహిస్తుంది. తన సహోద్యోగినులతో పెట్టుకున్న లైంగిక సంబంధాలవల్ల టామ్‌ను ఉద్యోగం నుండి తీసేశారని తెలుసుకుంటుంది. తన జ్ఞాపకాలని తప్పించుకోడానికి ఇతరుల జీవితాలను ఊహించుకునే ప్రయత్నంలో, అదే వీధిలో ఉండే ఒక జంటని ఇష్టంగా చూస్తూ, వారికి ‘జెస్, జేసన్’ అనే పేర్లు పెట్టుకుంటుంది. ఒకరోజు జెస్ అనుకున్న ‘మేగన్’, పరాయి పురుషుడిని ముద్దు పెట్టుకోవడం చూసినప్పుడు, ఆమె భర్తను మోసం చేస్తున్నందుకు కోపం తెచ్చుకుంటుంది. ఆ తరువాత, మేగన్ కనబడకుండా పోతుంది. అప్పుడు, ‘ఎంతోకాలం తరువాత నా దుఃఖం పైనే కాక, నేను ఆసక్తి పెంచుకున్నది దీనిమీదే’ అనుకున్న రేచెల్, పోలీసుల పరిశోధనలో జోక్యం కలిగించుకుంటుంది. నిజానికి–మేగన్, జేసన్ అనే స్కాట్‌ను పెళ్ళి చేసుకోవడానికి ముందు, ఆమె మొదటి వివాహం వల్ల కలిగిన కూతురు బాత్ టబ్బులో పడి మరణిస్తుంది. ఆ తరువాత, తనలో కలిగిన శూన్యాన్ని నింపడానికి, మేగన్ ‘స్కాట్‌ను ప్రేమిస్తాను కానీ అది సరిపోదు నాకు’ అంటూ, వివాహేతర సంబంధాలు ప్రారంభిస్తుంది. వాళ్ళల్లో టామ్ ఒకరు. గర్భవతి అయినప్పుడు, పుట్టబోయే బిడ్డకి తండ్రి అతనే అని చెప్పినప్పుడు, మేగన్‌ను టామ్ హత్య చేస్తాడు. మొదట్లో అనేకమందిని అనుమానించిన రేచెల్ నిజం తెలుసుకుని, పాత ఇంటికి వెళ్ళి ఏనాతో విషయం చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా టామ్ వస్తాడు. ఇద్దరూ అతన్ని మేగన్ గురించి నిలదీసినప్పుడు, తానే ఆమెను హత్య చేశానని ఒప్పుకుంటాడు. రేచెల్ అతన్ని కార్క్– స్క్రూతో పొడుస్తుంది. అతను చనిపోయాడని నిర్ధారించుకోడానికి, ఏనా దాన్ని మరింత లోతుగా తిప్పుతుంది. ఇద్దరూ కూడబలుక్కుని, పోలీసులకి అబద్ధం చెప్తారు. ‘ఏ పనీ లేకుండా ట్రెయిన్లో ఇటూ అటూ తిరిగే యువతిని కానింక’ అని తాగుడు వదిలించుకుని, జ్ఞాపకాలతో రాజీ పడుతుంది రేచెల్. రచయిత్రి పౌలా హాకిన్స్ తొలి నవల ‘ద గర్ల్ ఆన్ ద ట్రెయిన్’ అభద్రతా భావం, అస్పష్టత, నిస్పృహ ఉండే ముగ్గురు స్త్రీ పాత్రల దృష్టికోణాలతో రాయబడినది. కథలో మలుపులు అనేకం. అసలు సంగతి తెలియక, కేవలం మొహాలు చూసి అవతలివారి గురించి చేరిన నిర్ణయాలు ఎంత తప్పుగా పరిణమిస్తాయో చెబుతుందీ నవల. రచయిత్రి– దృష్టికోణాలనూ, కాలస్థాయిలనూ నేర్పుగా మార్చి రాస్తారు. నవల్లో పాత్రలు ఎక్కువున్నందువల్ల, అర్థం చేసుకోడానికి మాత్రం ఆగి, ఆగి చదవాల్సి వస్తుంది.‘రివర్ హెడ్ బుక్స్’ 2015లో పబ్లిష్ చేసిన ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో సినిమా కూడా వచ్చింది. ఆడియో పుస్తకం ఉంది. కృష్ణ వేణి -
అభేద్య బాక్సర్
బురదలో పుట్టినా పద్మంలా వికసించిన ఎం.సి.మేరి కోమ్ ఆత్మకథ, అన్బ్రేకబుల్. మణిపుర్ సాధారణ అమ్మాయి ఆమె. తండ్రి వ్యవసాయ కూలీగా చేస్తూనే, మోతుబరి రైతు పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు.కోమ్ సమాజంలో మగవాళ్లు చదువుకునేవాళ్లు, ఆడవాళ్లు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేవాళ్లు. ఆమె తండ్రి భిన్నంగా ఆలోచించి బడిలో చేర్చడంతో జీవితం మలుపు తిరిగింది. బడి నుండి వచ్చిన తరువాత, వెళ్ళే ముందు ఇంటి పనుల్లో అమ్మకూ, పొలం పనుల్లో నాన్నకూ సాయం చేసేది. వారున్న గ్రామానికి విద్యుత్ సదుపాయం లేనందున పత్తి వత్తితో చేసిన దీపంలో కిరోసిన్ పోసి ఇల్లంతటికీ అదే వెలుగు ఇస్తుండగా చదువుకునేది. ఆటలంటే మోజు ఉంది కానీ తండ్రికి ఇష్టం లేదు. శరీర సౌష్ఠవం కోసం బలమైన ఆహారం, పోటీల్లో పాల్గొనడానికి తరచూ ప్రయాణాలకయ్యే ఖర్చు కోసం ఆలోచించేవాడు. కుమార్తె పట్టుదల చూసి అంగీకరించక తప్పలేదు. ఎస్.ఎ.ఐ.లో బాక్సింగ్ శిక్షణ కోసం ఇంఫాల్‌లో అద్దె ఇంట్లో గడిపిన రోజుల్లో వంట చేయడానికి బియ్యం నిండుకోవడం, చేతిలో డబ్బు లేకపోవడం వలన నాలుగు గంటలు సైకిలు తొక్కుతూ కాంగతైలోని ఇంటికి వెళ్లి బియ్యం తెచ్చుకున్న విషయం ఆమె మరచిపోలేదు. కష్టాలలో గడపడం వలన బాక్సింగ్‌కు అవసరమైన కష్ట సహిష్ణుత, సహనం అలవాటయినట్టు చెప్పుకుంది. రోజూ ఆరు గంటలు వ్యాయామం చేస్తూ శత్రువుని ఓడించడానికి ఉత్తమ మార్గం వేగంగా, తీవ్రంగా విజృంభించడమే అన్న అవగాహన పెంచుకుంది. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బట్టలు నేస్తూ సంపాదించేది తక్కువ కావడంతో పంపించిన 50, 100 రూపాయలతోనే సర్దుకునేది. బాక్సింగ్ సామగ్రి ఖరీదైనది కాబట్టి అవేవీ లేకుండానే శిక్షణలో చేరింది. సౌకర్యవంతమైన బూట్లు కావాల్సినప్పటికీ స్థోమత లేక చౌక బూట్లు కొని సాధన చేసింది. ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరిన మేరి కోమ్ 5 సార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్ అయ్యింది. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా బాక్సర్ అయ్యి, 51 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలిచి దేశ జెండాను గర్వంగా ఎగరేసింది. 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్ అయ్యింది. అలాగే 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళా బాక్సర్ అయ్యింది. ఫుట్‌బాల్ ఆటగాడు ఆన్లెర్తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఇవన్నీ సాధించిందని మరవకూడదు. ఈ అన్ని విషయాలనూ క్షుణ్ణంగా ఈ ఆత్మకథ ఆవిష్కరించింది. తండ్రి రుణం తీర్చుకున్న కూతురులా నిలవాలని ఆయనకు బొలెరో కారు బహూకరించింది. ఇంగ్లిష్‌లో ‘అన్బ్రేకబుల్’గా వచ్చిన కోమ్ ఆత్మకథను డాక్టర్ డి.వి.సూర్యారావు ‘అభేద్యం’ పేరుతో తెలుగులోకి అనువదించగా ‘రీమ్’ ప్రచురించింది. నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
హత్యతో ముడిపడిన చరిత్ర
1921– బోంబే. మిల్లు యజమాని ఫరీద్ మరణిస్తాడు. అతని ముగ్గురు వితంతువులు– రజియా, సకీనా, ముంతాజ్– జనానాలో ఉంటారు. పేరున్న వకీలైన జమ్షెడ్ మిస్త్రీ కూతురు పెర్వీన్, ఇంగ్లండ్ నుంచి ‘లా’ చదివి వచ్చిన 23 ఏళ్ళ యువతి. అప్పట్లో, స్త్రీలకు కోర్టులో వాదించే హక్కు ఉండకపోయినందువల్ల తండ్రి ఆఫీసులో దస్తావేజులు తయారు చేస్తూ, క్లయింట్లకి సలహాలిస్తుంటుంది. వితంతువులు ముగ్గురూ తమ ‘మెహ్ర్’ను మదరసా కట్టేందుకు రాసిచ్చారని వారి హౌస్ ఏజెంట్ ముక్రీ నుంచి తండ్రికి వచ్చిన ఉత్తరాన్ని చూసి, నివ్వెరపోతుంది. ముంతాజ్‌కు చదువు రాదన్న సంగతిని ఆమె సంతకానికి బదులున్న ‘ఇంటూ మార్క్’ను బట్టి గ్రహిస్తుంది. ఆ వితంతువులు మగవారితో ముఖాముఖీ మాట్లాడరు, ఇల్లు విడవరు. బోంబే సీ వ్యూ స్ట్రీట్‌లో ఉన్న, ‘మలబార్ హిల్’ ఇంట్లో, పరదాలో ఉండే ఆ భార్యలతో ఏకాంతంగా మాట్లాడే పని పెర్వీన్ మీద పడుతుంది. ముగ్గురూ కలిసే ఉండి కూడా, ఒకరితో మరొకరు తమ రహస్యాలనూ, పథకాలనూ పంచుకోరు. అప్పుడు నెలకొన్న ఉద్రిక్తతలు– ‘ముక్రీ హత్యకూ, మరొక హత్యా ప్రయత్నానికీ దారి తీస్తాయి. ఆఖరి పేజీలలో– స్నేహితురాలైన బ్రిటిష్ అమ్మాయి ఏలిస్ సహాయంతో పెర్వీన్ హంతకులెవరో కనిపెడుతుంది. న్యాయవాద వృత్తిలో ఎదిగి, భారతదేశపు మొట్టమొదటి స్త్రీ వకీలు అవుతుంది. కథాంశానికి సమాంతరంగా పెర్వీన్ గత వ్యక్తిగత జీవితం నడుస్తుంది. ఇంగ్లండ్ వెళ్ళక ముందు కలకత్తాలో సోడా వ్యాపారం చేసే సైరస్, ఆమెని ఆకర్షించి పెళ్ళి చేసుకుంటాడు. పాతకాలపు పార్శీ ఆచారాలని పాటించే అత్తగారింట్లో బహిష్టు సమయాన పెర్వీన్ను విడిగా, ఇరుకు గదిలో నెలకి 8 రోజులుంచుతూ, ‘బినామాజీ’ ని పాటించేవారు. అప్పుడు, తనని తాను శుభ్రపరచుకునే అనుమతి కూడా ఉండేది కాదామెకి. తన తాత, తండ్రికి ఉన్న ఆస్తుల కోసమే సైరస్ తన్ని పెళ్ళి చేసుకొమ్మని అడిగాడనీ, అతను అంటించుకున్న సుఖవ్యాధులు తనకీ సంక్రమించాయనీ పెర్వీన్ గ్రహిస్తుంది. ఆ కారణం ఆధారంగా, అప్పుడు విడాకులు మంజూరు చేయబడేవి కావు కనుక ఆమె భర్తతో చట్టబద్ధంగా దూరంగా, క్షేమంగా ఉండేందుకు, తండ్రి కలకత్తా కోర్టులో కేసు వాదించి గెలిపిస్తాడు. తల్లి, అన్న కూడా పెర్వీన్కు పూర్తి సహకారాన్ని అందించే ఆధునిక కుటుంబం ఆమెది. వర్తమానంలో సైరస్ మరణించడంతో, పెళ్ళి అన్న బంధంనుండి బయట పడుతుంది పెర్వీన్. ప్రథమ పురుషలో ఉండే సుజాతా మెస్సీ రాసిన, ‘ద విడోస్ ఆఫ్ మలబార్ హిల్’ కథ, 1920ల పార్శీల చరిత్రతో, ‘ముస్లిమ్ పర్సనల్ లా’తోనూ ప్రారంభించి, వలస రాజ్యపు చరిత్ర గురించి కూడా విడమరిచి చెబుతుంది. రెండు భిన్నమైన మతాల గురించిన కథనం విసుగు పుట్టించదు. వందేళ్ళ కిందట స్త్రీల జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేవో చెప్తారు రచయిత్రి. కట్టడాల్లోనూ, అకౌంట్లు చూడ్డంలోనూ సిద్ధహస్తులైన పార్శీల కష్టపడే స్వభావాన్నీ, వారి పదజాలాన్నీ ఆసక్తికరంగా వర్ణిస్తారు. అప్పటి వారి భోజనం, వస్త్రధారణ, ఆచారాల వంటి రోజువారీ వివరాలని కళ్ళకి కట్టేలా వివరిస్తూ, గడిచిపోయిన కాలాన్ని సజీవంగా పాఠకుల ముందుంచుతారు. వారికి ఇంటి పేరుండకపోవడం బ్రిటిషర్లకి నచ్చనందువల్ల, వారి వృత్తే ఇంటి పేరయేది. ఉదా: మిస్త్రీ, సోడావాలా. భారతదేశపు మొట్టమొదటి స్త్రీ వకీలైన కొర్నీలియా సోరబ్జీ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాసిన యీ నవలను, సోహో ప్రెస్, 2018 జనవరిలో ప్రచురించింది. ఆడియో పుస్తకం ఉంది. - కృష్ణ వేణి -
పదమూడు రోజుల కిడ్నాప్ ముందూ, వెనుకా
కొత్త బంగారం ‘ఒకానొకప్పుడు నా జీవితం అద్భుత కథ. ఆ తరువాత, నేను ప్రేమించిన ప్రతీదాన్నుంచీ దొంగిలించబడ్డాను... మరణిస్తూ మరణిస్తూ గడిపిన ఎన్నో రోజుల తరువాత, నేనిప్పుడు మృతురాలిని’ అని ప్రారంభించిన ‘ఎన్ అన్టేమ్డ్ స్టేట్’, రాక్సీన్ గే తొలి నవల. నవలకున్న రెండు భాగాల్లో మొదటిదైన, ‘తర్వాత కలకాలం సుఖంగా’, ‘మిరీ’ అనబడే మిరయ్య జువ్వాల్ జామిసన్ దృష్టికోణంతో కొనసాగుతుంది. అమెరికాలో లాయర్‌గా ఉండి, హైతీలో ఉన్న పుట్టింటికి– అమెరికన్ భర్త మైకెల్‌తోనూ, పసికందైన కొడుకుతోపాటూ వచ్చిన మిరీ జీవితం సవ్యంగా సాగుతుంటుంది. ధనికులైన తల్లితండ్రుల ఇంట్లో అడుగు పెట్టినప్పుడే– ద్వీపంలో ఉన్న పేదవారికీ, ధనిక వర్గానికీ మధ్యనున్న ఉద్రిక్తతలను గమనిస్తుంది. ఒక రోజు, తల్లిదండ్రుల ఇంటినుండి బయటకి వస్తుండగా, భారీ ఆయుధాలు పట్టుకున్న గుంపొకటి ఆమెని అపహరిస్తుంది. తన్ని తాను ‘కమాండర్’ అని పిలుచుకునే వ్యక్తి ఆమెని బందీగా ఉంచి, విడుదల చేయడానికి ఆమె తండ్రిని, పది లక్షల యూఎస్ డాలర్లు అడుగుతాడు. డబ్బు చెల్లించిన తరువాత కూడా, కిడ్నాపర్లు తిరిగి మరింత డబ్బు కావాలంటారేమో అనుకున్న తండ్రి నిరాకరించినప్పుడు, గ్రహిస్తుంది: ‘కోపంతో గడిపే దేశంలో మనం నమ్మేవాళ్ళెవరూ ఉండరు.’ ఒక గదిలో నీళ్ళూ, తిండీ కూడా ఎక్కువ లేకుండా గడిపిన దృఢచిత్తం ఉన్న యీ యువతి, 13 రోజులు– దెబ్బలూ, హింసా, సామూహిక అత్యాచారాన్నీ ఎదుర్కుంటుంది. నవల రెండవ భాగం (ఒకానొకప్పుడు)లో– చెరనుంచి బయటకి వచ్చిన మిరీ, ‘స్వేచ్ఛ పొందినప్పటికీ, నేనింకా నిర్బంధంలోనే ఉన్నాను... హైతీ ఆశ్చర్యకరమైన వ్యత్యాసాలున్న దేశం. ఎంత అందంగా ఉంటుందో, అంతే కఠోరమైనది’ అనుకుంటుంది. విడుదల తరువాత, తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మిరీ చేసే ప్రయత్నాల ప్రయాణాన్ని నవల అనుసరిస్తుంది. చిందరవందరగా అయిన మిరీ మనఃస్థితి వల్ల– గతం, వర్తమానం, కొత్త సంఘటనలు మసగ్గా అవుతాయి. అపహరింపు వరకూ తిరిగి వెళ్ళిన మిరీ జ్ఞాపకం అక్కడే తిష్ట వేసుకుంటుంది. ఆమె తిరిగి యూఎస్‌కు వెళ్ళినప్పుడు, అత్తగారు లొరైన్ ఆమెకి శుశ్రూష చేసి, పూర్వస్థితికి తీసుకు వస్తుంది. ‘నాకు ఏడుపు రాలేదు... నేనూ ఆవిడా కూడా మాట్లాడుకోలేదు. కూర్చున్నాం అంతే. భద్రంగా ఉండటం అంటే ఏమిటో అర్థం అయింది’ అంటుంది. ఎల్లవేళలా భయపడుతూ ఉండటం మాని, మిరీ జీవితాన్ని య«థావిధిగా కొనసాగిస్తుంది. తిరిగి భర్తతో కాపురం చేయడం నేర్చుకుంటుంది. అప్పుడే హైతీలో 2010లో వచ్చిన భూకంపాల వల్ల తండ్రి మీద పగతో, మళ్ళీ పుట్టింటికి తిరిగి వస్తుంది. అయితే, ఆమె మానవత్వం, ఆమె ప్రతీకారాన్ని జయించినప్పుడు, ‘నేను ఆయన మొహం చూసినప్పుడు, నాకు కనిపించినదల్లా తను చేసిన ఘోరమైన తప్పువల్ల జీవితాంతం కుములుతూ గడిపే ఒక ముసలి వ్యక్తి మాత్రమే’ అంటూ, ‘తనలో ఇంకా మంచితనం’ మిగిలే ఉందని గుర్తిస్తుంది. గతానికీ, వర్తమానానికీ అద్భుతంగా మార్చి రాసిన నవల ఏ సంబంధాన్నీ విశ్లేషించకుండా వదిలిపెట్టదు. నవల, ‘అపహరింపు’ అన్న అంశం మీదనే కాక, ఆ సంఘటన పరిణామాల గురించినది కూడా. రచయిత్రి శైలి స్పష్టంగా, సరళంగా, బిగుతుగా ఉంటుంది. పాఠకులకు మానసిక అలసట కలిగించినప్పటికీ, బలవంతంగా ముందుకి నెట్టి మరీ చదివించే పుస్తకం ఇది. హైతీలో ఆచరణలో ఉండే– ‘గుర్తింపు, ప్రత్యేకాధికారం’ అన్న జఠిలమైన అంశాలని నిలదీస్తారు గే. గ్యాంగ్ రేప్ సీన్ల, చిత్రహింస నడుమ– అనేకమైన కథనాత్మకాలని అల్లుతారు. పుస్తకం మొదట 2014లో ‘గ్రోవ్ అట్లాంటిక్’ పబ్లిష్ చేసింది. ఆడియో పుస్తకం ఉంది. సినిమాగా కూడా తీస్తున్నారు. -కృష్ణ వేణి -
ప్రతిధ్వనించే పుస్తకం
అమితవ్ ఘోష్ అమెరికాలో స్థిరపడిన భారతీయ రచయిత. ఆయన రెండో నవల ‘ద షాడో లైన్స్’ ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం చాలా దేశాలు వలస పాలన నుండి విముక్తి పొందిన నేపథ్యంలో కొత్త దేశాలు, కొత్త సరిహద్దులు, పెల్లుబికిన జాతీయవాదం రచయితలకు కథావస్తువులైనాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దానితో పాటు దేశం రెండుగా చీలిపోయింది. చిత్రంగా, స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడిన శక్తులు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క విభజన రేఖ ఇంతటి విలయాన్ని సృష్టించడం, మనుషుల మనసుల్లో గిరిగీసుకున్న దాటరాని వలయం – అదే షాడో లైన్స్ అంటే! ఈ నవలలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రథమ పురుషలో కథని వివరించే పేరులేని యువకుడు, అతని నానమ్మ (ఆమెను ‘తామ్మ’ అని పిలుస్తాడు), ఇంకా అతని చిన్నాన్న త్రిదేబ్. చిన్నాన్న త్రిదేబ్ అంటే బాల్యంలో కథకుడికి ఒక రోల్‌మోడల్, ఆదర్శం. అతని హఠాన్మరణం అతనికొక మిస్టరీ. బాల్యం, యవ్వనం మధ్య అతని జ్ఞాపకాలు ఊగిసలాడుతుంటయ్. సరిహద్దు ఆవలికి జరిగిపోయిన తన పుట్టిన ఊరు ఢాకా చూడాలని ఒకప్పుడు తహతహలాడిన బామ్మ తీవ్రమైన వైముఖ్యంతో మాట్లాడుతుంది 1962 ఇండో–పాక్ వార్ ప్రజ్వరిల్లినప్పుడు. ‘మనని వాళ్లు చంపడానికి రాకముందే వాళ్లని తుద ముట్టించాలి’ అని ఆమె హిస్టీరికల్గా మాట్లాడటం బాల్యంలో అతనికొక ఆశ్చర్యం. పెరిగి పెదై్ద తానుగా శోధించి సంఘటనల మూలాల్లోకి వెళ్లి సత్యం తెలుసుకుంటాడు. అదే ఉత్కంఠను మనం చివరిదాకా అనుభవిస్తాం. యువకుడి నాయనమ్మ బంగ్లాదేశ్ ఏర్పడ్డ (తూర్పు పాకిస్తాన్) సమయంలో కలకత్తాకు వలస వస్తుంది. తాను పుట్టి పెరిగిన ఢాకా ఇప్పుడు పరాయి దేశంలో భాగం అనే యధార్థాన్ని స్వీకరించడానికి ఆమె మనసులో ఒక తీవ్రమైన పెనుగులాట. తను పుట్టిన ఊరు చూడడానికి అక్కడ దగ్గరినించి ఆహ్వానం అందినప్పుడు (ఆమె భర్త ఢాకా ఎంబసీలో అధికారి) అదే ద్వైధీ భావనకు లోనవుతుంది. రెండు దేశాల మధ్య విమానం ఎగిరేప్పుడు సరిహద్దు రేఖ కనిపిస్తుందా? మరి లేదంటే ‘విభజన’ మాటకు అర్థమేమిటి? ఎన్నో సందేహాలు. దురదృష్టవశాత్తు అదే సమయంలో కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల ప్రభావం ఢాకాలో ప్రతిధ్వనిస్తుంది. తన చిన్నప్పటి ఇంటికి కారులో వెళ్లి వస్తుంటుంది తామ్మ, ఆమెతో పాటు త్రిదేబ్, ఇతరులు. హఠాత్తుగా ఎదురైన అల్లరి మూకలు కారును, వెనుక రిక్షాలో వస్తున్న ఆమె పెదనాన్నను చుట్టుముడతాయి. అప్పుడే యువకుడి చిన్నాన్న త్రిదేబ్ వారి చేతులలో హతమౌతాడు. నానమ్మ మనసు విరిగిపోయింది. ఒక్కసారి హద్దు గీయబడిందంటే అది అనుల్లంఘనీయం అనే కఠిన వాస్తవం ఎరుకలోకి వచ్చింది. - తెన్నేటి శ్యామకృష్ణ -
బోల్డ్ కథతో క్రిష్..?
గమ్యం, వేదం లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘనవిజయం సాధించటంతో స్టార్ లీగ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఝాన్సీ లక్ష్మీ భాయ్ కథతో మణికర్ణిక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత క్రిష్ ఓ బోల్డ్ కథతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. కన్నడ రచయిత బైరప్ప రాసిన పర్వ అనే నవలను సినిమాగా రూపొందించేందుకు క్రిష్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రిష్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మహాభారత గాథకు సంబంధించిన పాత్రల నేపథ్యంలో రాసిన పర్వలో పలు వివాదాస్పద విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే కథతో సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట క్రిష్. అయితే క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గానే పర్వను ఎంచుకుంటాడా..? లేక మరో సినిమాను తెర మీదకు తీసుకువస్తాడా చూడాలి. -
ఇరువురు సోదరుల వేరు దారుల కథ
పుస్తక శీర్షిక ‘ద లోలాండ్’ రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. ఈ నవల ‘మాన్ బుకర్ ప్రైజు’కి షార్ట్‌లిస్ట్ అయింది. ఝుంపా లాహిరి రాసిన ‘ద లోలాండ్‘, కలకత్తా పొలిమేరల్లో రెండు చెరువులు మధ్యనున్న, రెండెకరాల చిత్తడినేల వర్ణనతో ప్రారంభం అవుతుంది. మిత్రాల కుటుంబంలో ఇద్దరన్నదమ్ములు పెరుగుతుంటారు. సుభాష్ 13 ఏళ్ళవాడు. తమ్ముడు ఉదయన్ 15 నెలలు చిన్నవాడు. ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యంతో పాటు పోలికలూ బాగానే ఉన్నప్పటికీ, స్వభావాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. సుభాష్ జాగ్రత్త పాటించేవాడు. అమెరికా వెళ్ళి చదువుకుంటాడు. ఉదయన్ నిర్లక్ష్య ధోరణి కనపరిచేవాడు. పగటిపూట ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, రాత్రుళ్ళు నక్సలైటు ఉద్యమాల్లో పాల్గొంటాడు. ఫిలొసొఫీ విద్యార్థిని అయిన గౌరితో ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుంటాడు. ఆ చిత్తడి నేలమీదే ఉదయన్‌ను ఒక రోజు పోలీసులు కాల్చి చంపేస్తారు. సుభాష్ ఇంటికి తిరిగి వచ్చి, తల్లీ తండ్రీ ఇష్టపడని గౌరిని పెళ్ళి చేసుకుని, ‘మధ్యలో ఆగిపోయిన నీ చదువు కొనసాగించవచ్చు’ అని ప్రలోభపెట్టి, అమెరికా తీసుకెళ్తాడు. అప్పటికే ఆమె గర్భవతి. బేలా పుడుతుంది. ప్రసవం తరువాత సుభాష్, గౌరి మొట్టమొదటిసారి లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు– ఇద్దరికీ సంతృప్తి కలగదు. వారి వివాహం కేవలం పరస్పర తాత్కాలిక ఆకర్షణ మీదా, ఇద్దరికీ దగ్గర అయిన ఉదయన్ జ్ఞాపకాల మీదా ఆధార పడినది అయి ఉండటం వల్ల, కొత్త భర్తనే కాక తను కోల్పోయిన ఉదయన్ జ్ఞాపకాలతో ముడిపడిన బేలాని కూడా ప్రేమించలేకపోతుంది గౌరి. ‘ఉదయన్ చోటు సుభాష్ భర్తీ చేయడం అన్నది దుద్దుల జతలో ఒకటి పోతే, రెండోదాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వంటిదే’ అనుకుంటూ, జీవితంతో రాజీపడలేకుండా ఇద్దరినీ వదిలి కాలిఫోర్నియా వెళ్ళి, తన రంగంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. లోర్నా అన్న స్త్రీతో సమలైంగిక సంబంధాన్ని ఏళ్ళకొద్దీ సాగిస్తుంది. సుభాష్ బేలాని పెంచుతాడు. వీటన్నిటినీ చూసిన బేలా పెద్దయి, ఏ నిబద్ధతకీ కట్టుబడి ఉండక, ఊరూరూ తిరుగుతుంది. తన బిడ్డ మేఘనాని తానే పెంచుతుంది.విడాకులు కావాలని సుభాష్ గౌరికి మెయిల్ పంపినప్పుడు, గౌరి ఒప్పుకుంటుంది. సుభాష్– బేలా టీచర్ ఎలీజ్‌ను పెళ్ళి చేసుకుంటాడు.ఆఖరి అధ్యాయం ఉదయన్ మరణించిన దినాన్ని గుర్తు చేసుకున్నది. అందరి దృష్టిలో దేవుడైన ఉదయన్, గతంలో జరిగిన ఒక హత్యలో పాలు పంచుకుంటాడు. ఇది తెలిసిన సుభాష్– ‘తనకి గౌరి ముందే అర్థం అయి ఉంటే, తన జీవితం వేరేగా గడిచేది’ అని గ్రహిస్తాడు. నవల– యువతకుండే తెగువ, మొండిధైర్యం, వ్యామోహం గురించినది. పశ్చాత్తాపం, తమని తాము క్షమించుకోలేకపోవడం, ఒక వ్యక్తి మరణం ఎంతమంది జీవితాలమీద ఎంత ప్రభావం చూపిందో అన్న అంశాలు నిండి ఉన్నది. ప్రధానపాత్ర చనిపోయిన తరువాత కూడా, కథనం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథాకాలం 1960లలో.పుస్తక శీర్షిక రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. 2013లో వచ్చిన నవల అదే సంవత్సరం, ‘మాన్ బుకర్ ప్రైజుకీ’కీ, ‘బెయిలీ వుమన్స్ ప్రైజు’కీ షార్ట్‌లిస్ట్ అయింది. పులిట్జర్ గ్రహీత అయిన రచయిత్రి రాసిన ఈ రెండవ నవల కూడా ఆమె ఇతర పుస్తకాల్లాగే అమెరికా, ఇండియాలని నేపథ్యంగా తీసుకుని రాసినది. ఆడియో పుస్తకం ఉంది. ...కృష్ణ వేణి ఝంపా లాహిరి -
రాయలసీ కన్నీటి పాట పెన్నేటి పాట
‘వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాటకోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజెరి కొట్టుకొనుచు’ అంటూ విద్వాన్ విశ్వం గానం చేసిన ‘పెన్నేటి పాట’ రాయలసీమ కరువు నేపథ్యంగా (1954లో) వచ్చిన తొలి కావ్యం. నదిలా ప్రవహించినప్పుడు పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభించిపోతుంది. ఎండిపోయిన పెన్నానది ఇసుకతో నిండిపోయి ఆ ప్రాంతపు జీవన వాస్తవికతను ఈ కావ్యంలో విశ్వం కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘ఇదే పెన్న! ఇదే పెన్న! నిదానించి నడు విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు! ఎదీ నీరు? ఎదీ హోరు? ఎదీ నీటి చాలు? ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు!’ అంటూ సాగే పంక్తులతో రాగయుక్తంగా కావ్యగానం చేసే వారు ఈ సీమలో ఇప్పటికీ ఉన్నారు.ఈ కావ్య కథానాయకుడు రంగడు ఒక పెద్ద రైతుకు పుట్టిన ఏకైక సంతానం. ఆస్తినంతా తండ్రి పోగొట్టగా రంగడికి మిగిలింది శారీరక శ్రమ మాత్రమే. అతను అడవినుంచి కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే కూలి. అతని భార్య గంగమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో ఒడ్లో, అటుకులో దంచి నూకలు, తవుడు తెచ్చుకుంటుంది. ఇద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, అంతులేని దారిద్య్రం, గంగమ్మ గర్భవతి కావడం, విశ్రాంతి లేకపోవడం, రంగడు నిస్సహాయుడై పోవడం ఇందులోని కథాంశం. ‘దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు? హృదయమా; మానవుడు నిన్ బహిష్కరించె! చచ్చె నీలోకమున నాత్మసాక్షి యనుచు నెత్తినోరిడు కొట్టుకోనిండు నన్ను’ అంటూ నిర్వేదంతో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యంలో కథ రేఖామ్రాతమే కానీ, పేదరికం వల్ల కలిగే విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చిన తొలి సంపూర్ణ కావ్యం. రాయలసీమలో ప్రవహించే ప్రధానమైన పెన్నానది, ఇక్కడి ప్రకృతి, గ్రామాలు, జీవన సరళి, శ్రమ వంటి వన్నీ ఈ కావ్యంలో ప్రతిబింబిస్తాయి. ఈ కావ్యం ప్రాచీన ఆధునిక రీతుల మేలు కలయిక. ఇందులో సీస పద్యాలున్నాయి, గేయాలున్నాయి, వృత్తాలున్నాయి, వచనంలా భాసించే పంక్తులున్నాయి. ఇందులో దస్త్రము, జీవాలు, సందకాడ, ఎనుము వంటి మాండలికాలున్నాయి. గంపంత దిగులు, అంబటిపొద్దు వంటి తెలుగు నుడికారాలూ ఉన్నాయి. రాఘవశర్మ -
పున్నాగ పూలు
డాక్టర్ జి.కె., డాక్టర్ క్రిష్ణ, షీలా మేడమ్ పాత్రల ద్వారా ‘జలంధర’ విభిన్న మనస్తత్వాలపై జరిపిన సైకో అనలిటికల్ పరిశోధన ఈ నవల. డాక్టర్ జి.కె. ఇచ్చిన స్ఫూర్తితో, మానవతా దృష్టితో ఆయన ప్రియ శిష్యుడు డాక్టర్ క్రిష్ణ స్థాపించిన జి.కె. హీలింగ్ సెంటర్ ఎందరికో శారీరక, మానసిక స్వాంతన కలిగిస్తూ ఉంటుంది.ఈ నవల జి.కె.కు స్వయానా తమ్ముడి కూతురైన ‘రాధ’ పాత్ర చుట్టూ ప్రధానంగా అల్లారు. రాధ సగటు ఆడపిల్లల ఆలోచనా సరళి కలిగి ఉంటుంది. తనకేం కావాలో తెలియని రాధ ‘మంచి అమ్మాయి’ అన్న ముద్ర ఉంటే చాలనుకుంటుంది. డాక్టర్ క్రిష్ణ రాధకు చిన్నతనంలో తెలిసిన వ్యక్తే. క్రిష్ణ రాధను ఎంతో ప్రేమిస్తాడు. కానీ రాధ తల్లి, క్రిష్ణ తల్లి వారి వారి ‘కచ్చలు’ తీర్చుకోవటానికి ఆడిన ఆటలో రాధ పావుగా మారి అనూహ్యంగా చెడు అలవాట్లు కలిగిన రాజారావ్‌కు భార్య అవుతుంది. క్రిష్ణ తనను ప్రేమించిన విషయం చివరి వరకూ రాధకు తెలియదు. రాజారావ్‌కు బాగా జబ్బు చేస్తే జి.కె. హీలింగ్ సెంటర్లో చేర్పిస్తారు. అక్కడి డాక్టర్స్ డివోషన్, షీలా మేడమ్ కౌన్సిలింగ్, లైబ్రరీలోని పుస్తకాలు ఇవన్నీ రాధలో గొప్ప మార్పు తీసుకొస్తాయ్. అప్పుడనిపిస్తుంది రాధకు, ‘తను ఇన్ని రోజులూ ఒక అనారోగ్యకరమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయాననీ, అందులోంచి బయటపడాలీ’ అని. ఇంతలోనే రాజారావ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉన్నట్లూ వారికో బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది రాధకు. హీలింగ్ సెంటర్లో ఎంతో మెచ్యూర్డ్‌గా తయారైన రాధ ఆమెను కలిసి ఆమె రాజారావ్‌ను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. విడాకులు తీసుకుని రాజారావ్ జీవితం నుంచి హుందాగా తప్పుకుంటుంది. ఆస్ట్రేలియాలో పైచదువులు చదవడానికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి స్కైప్‌లో ఛాట్ చేస్తున్నప్పుడు, పెదనాన్న ఫొటో, క్రిష్ణ ఉత్తరాలతో పాటు రాజారావ్ ఇచ్చిన డెబిట్ కార్డ్‌ని చూసి తల్లి అడుగుతుంది. ‘‘అవన్నీ సరే కానీ రాజారావ్ జ్ఞాపకాలెందుకు ఇంకా’’ అని. ‘‘అన్నీ జీవితంలో భాగాలే కదమ్మా’’ అంటూ చిరునవ్వుతో రాధ చెప్పే ముగింపు వాక్యాలతో నవల ముగుస్తుంది. -డాక్టర్ సి.ఎం. అనూరాధ -
శరీరంతో వినే సంగీతం
‘ఇప్పుడే ఒకమ్మాయి మొహం మీద గుద్దాను’ అని సిడ్నీ బ్లైక్ అనడంతో ప్రారంభం అయ్యే ‘మేబి సమ్‌డే’ నవల కొల్లీన్ హూవర్ రాసినది. సిడ్నీ తన ఆప్తమిత్రురాలైన టోరీతో కలిసి ఒక అపార్టుమెంట్లో ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం చేసుకుంటూ, సంగీతం నేర్చుకుంటుంటుంది.పెరటి బాల్కనీ నుండి రిజ్ గిటార్ వాయిస్తుండగా వింటూ –అతని సంగీతం పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. అతను పాటలు రాస్తాడు. రాత్రివేళలు తను వాయిస్తున్నప్పుడు ఆమె వింటూ, దానికనుగుణంగా పాడుతోందని రిజ్ గమనించి, తన మ్యూజిక్ బ్యాండ్ కోసమని, ఆమె బాణీ కట్టిన మాటలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు టెక్స్ మెసేజిలు పంపుకోవడం మొదలెడతారు. సిడ్నీ 22వ పుట్టినరోజునే, ఆమె బోయ్‌ఫ్రెండ్ హంటర్, టోరీతో వారి బాల్కనీలో శృంగారం జరుపుతుండగా రిజ్ చూసి, సిడ్నీకి చెప్తాడు. ఆమె హంటర్‌తో వాదన పెట్టుకుని, టోరీని చెంపదెబ్బ కొట్టి, అపార్టుమెంట్ వదిలి ఇద్దరు ఫ్లాట్మేట్లతో కలిసున్న రిజ్ ఇంటికి చేరుకుంటుంది. 24 ఏళ్ళ రిజ్, చెవిటివాడని సిడ్నీకి తెలుస్తుంది. అతనికి మ్యాగీ అన్న అందమైన గర్ల్ ఫ్రెండు ఉందని తెలిసినప్పుడు, దిగులు పడుతుంది. రిజ్, సిడ్నీ కలిసి లిరిక్స్ రాయడం ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్యా, నోటిమాటల్లేని చమత్కారమైన సంభాషణలు జరుగుతుంటాయి. సిడ్నీ: నీవు వినలేవని ఎందుకు చెప్పలేదు? రిజ్: నీవు వినగలవని ఎందుకు చెప్పలేదు? సిడ్నీ పాడుతున్నప్పుడు ఆమెని పొదివి పట్టుకుని, ఆమె శారీరక కదలికలని బట్టి పాటని గ్రహించడం ప్రారంభిస్తాడు రిజ్. అలా ఇద్దరి మధ్యా శారీరక సాన్నిహిత్యం ఎక్కువవుతుంది. రిజ్ సిడ్నీకి మెసేజ్ చేస్తాడు: ‘మ్యాగీ కోసం నేను వంగగలను. నీకోసం విరగగలను’. తన బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేసినట్టే మ్యాగీకీ అవకూడదనుకుంటుంది సిడ్నీ. గర్ల్ ఫ్రెండుకి గుండెజబ్బుందని తెలిసినప్పుడు, సిడ్నీని తనింట్లోంచి వెళ్ళిపొమ్మని రిజ్ కోరతాడు. అయితే, మ్యాగీ అతన్ని స్వీకరించదు. కొంత గడువు తరువాత రిజ్– సిడ్నీ ఫ్లాటుకి మారతాడు. రచయిత్రి– సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. వారి సంబంధంలో గౌరవం, నిజాయితీ, మెప్పుకోలూ ఉండటం చూస్తాం. ఎవరికీ అన్యాయం చేయకుండా ఇద్దరూ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ‘ఇద్దర్ని ఒకే సమయంలో ప్రేమించడం సాధ్యమేనా? మనం ప్రేమిస్తున్న మనిషి అవసరాలు మన అవసరాలు కాకపోతే!’ అన్న ఎన్నో ప్రశ్నలు కనబడతాయి నవల్లో. కథలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. నవల్లో కొన్ని సన్నివేశాలకి తగిన పాటలున్నాయి. ఈ–బుక్‌లో అయితే, ఒక పాట ‘లింక్’ మీద నొక్కితే అది వింటూ, పుస్తకం కూడా చదివే వీలుంటుంది. పేపర్ బ్యాక్ అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పాట వినవచ్చు. లేకపోతే, ‘మేబి సమ్ డే’ సైట్లో కూడా వినే అవకాశం ఉంది. 2014 మార్చిలో వచ్చిన ఈ నవల ఏప్రిల్‌లో, ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’ లిస్టులో ఉండి, మళ్ళీ తిరిగి సెప్టెంబర్‌లో కూడా అదే లిస్టులో అగ్రస్థానం సంపాదించుకుంది. దీని ఆధారంగా వచ్చిన సినిమా ఉంది. సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. - కృష్ణ వేణి -
రెండు గతాల సంభాషణ
కొత్త బంగారం మారిలిన్ రాబిన్సన్ ‘లైల’ నవల, ఐవా రాష్ట్రంలో కాల్పనిక ఊరైన గిలియడ్ నేప«థ్యంగా రాసినది. చింకి బట్టలు తొడుక్కున్న నాలుగో, ఐదో ఏళ్ళున్న లైల తన ఇంటి బయట చలికి వణుకుతూ, ఏడుస్తూ కనబడ్డప్పుడు–స్థిరత్వం లేని కుటుంబం నుంచి ఆ పిల్లని దొంగిలించి, కాపాడిన డాల్‌తో నవల ప్రారంభం అవుతుంది. ‘డాల్ ప్రపంచంలో అతి ఒంటరి స్త్రీ అయి ఉండవచ్చు. లైల ఒంటరి పిల్ల. ఇద్దరూ వర్షంలో ఒకరినొకరు వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తూ కలిసి ఉన్నవారు’ అంటారు రచయిత్రి. ఒక చోటనుండి మరొక దానికి మారుతూ, దొరికిన రోజు తింటూ, లేనినాడు పస్తులుంటూ ఉన్నప్పుడు కూడా వారిద్దరి జీవితాల్లో ప్రేమకి కొదవుండదు. దశాబ్దాలు గడుస్తాయి. డాలీ చేసిన హత్యవల్ల ఆమె జైల్లో పడ్డాక, లైల వేశ్యాగృహంలోకి ప్రవేశిస్తుంది. అయితే, ఆమె రూపురేఖలు ఆకర్షణీయంగా లేకపోవడంతో అక్కడ ఎక్కువ కాలం మనలేకపోతుంది. లాస్ ఏంజెలెస్‌లో ఒక చిన్న గుడిసెలో తల దాచుకుని, పక్కనే ఉన్న గిలియడ్ ఊరుకి వెళ్ళినప్పుడు, కురుస్తున్న వానని తప్పించుకుంటూ లైల చర్చిలోకి అడుగు పెడుతుంది. అక్కడ ఫాదరీ అయిన 67 ఏళ్ళ జాన్ ఏమ్స్ను కలుసుకుంటుంది. తన ఒంటరితనం ఇంక దూరం అయే అవకాశమే లేదనుకున్న ఏమ్స్కీ, సంవత్సరాల శ్రమనోడ్చి, ఒంటరితనం అంటే ఏమిటో తెలిసి, ఎవరినీ నమ్మే స్వభావం లేకపోయి, కత్తి తన స్టాకింగ్స్‌లో దాచుకుని తిరిగే లైలకీ స్నేహం కుదురుతుంది. అతన్ని కలుసుకోడానికి తరచూ అతని ఇంటికి వెళ్తుంది. పురిట్లో చనిపోయిన అతని భార్యా, కొడుకూ సమాధులని శుభ్రం చేయడం మొదలెడుతుంది. సంకోచంతో, లాంఛనప్రాయంగా మొదలయిన వారి స్నేహం, ఆకర్షణగా మారి పెళ్ళి చేసుకుంటారు. వారి మధ్యపెంపొందుతున్న సాన్నిహిత్యానికి వారి గతాలు అడ్డం పడుతూ ఉంటాయి.అతను బైబిల్ గురించి చెప్తూ ఉండే మాటలు ఆమెకి అర్థం కావు. మతం, విశ్వాసం గురించి నేర్చుకుంటూ– భర్తని నమ్మే సమర్థత తనకి లేదనుకుంటూనే లైల అతని మీద నమ్మకం ఏర్పరచుకుంటుంది. గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డమీద తన గతం ప్రభావం చూపుతుందేమోనని భయపడినా, తండ్రి ప్రభావం పడితే చాలనుకుంటుంది. కొడుకు పుట్టిన తరువాత, తల్లితనం వల్ల ఉపశమనం పొందుతుంది. కథనం ప్ర«థమ పురుషలో, చైతన్య స్రవంతిలో సాగుతుంది. నవలంతటా బైబిల్యుతమైన భాష కనిపిస్తుంది. రచయిత్రి స్వరం సరళతకూ, నిస్పృహతత్వానికీ మధ్య ఊగిసలాడుతూ–తేలికైన హాస్యాన్నీ, తీవ్రమైన భావోద్వేగాన్నీ సమపాళ్ళల్లో కనబరుస్తుంది. లైల, ఏమ్స్ మధ్య జరిగే సంభాషణలు– గతం, ఉనికి, జీవితానికున్న అర్థం మీద కేంద్రీకరిస్తాయి. అవే నవలకి ఆయువు పట్టు. ‘ఉనికిలో ఉంటూ ప్రేమలో పడిన పాత్రలు కావు వారిద్దరివీ. ప్రేమలో పడ్డానికి ఉనికిలో ఉన్నవి’ అంటారు రచయిత్రి. 2014లో అచ్చయిన ఈ నవల రాబిన్సన్ రాసిన నాలుగవది. గిలియడ్ ట్రియోలజీకి మూడవ భాగం. కథాకాలం 1920. 2014లో ‘నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్’ పొంది, 2015లో ‘మాన్ బుక్ ప్రైజ్’కు లాంగ్ లిస్ట్ అయిన ఈ నవల, మరెన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. - కృష్ణ వేణి -
జీవితాన్ని కట్టిన హారం
దురదృష్టవశాత్తూ మెటీల్డ్ ఒక గుమస్తా కుటుంబంలో పుట్టిందిగానీ ఆమెలాంటి అందగత్తెలు ఎప్పుడోగానీ జన్మించరు! అదే విధిరాత వల్ల ఆమె ప్రభుత్వ విద్యాశాఖలో ఒక చిన్న గుమస్తాను పెళ్లాడింది. జీవితం ప్రసాదించిన అన్ని భోగాలనూ అనుభవించలేకపోతున్నానన్న క్షోభ ఆమెను వెంటాడేది. అలంకార రహితమైన గోడలూ, చవకరకం కుర్చీలూ, వికారమైన తెరలూ దుఃఖం కలిగించేవి. ఆమెకు గౌన్లు లేవు, ఆభరణాలు లేవు, ఏమీలేవు. అలా ఉండటం కోసమే పుట్టానేమో అనుకునేది. అందరూ తనను చూసి అసూయపడేట్టు బతగ్గలిగితే ఎంత బాగుంటుంది! ఒక సాయంత్రం ఆమె భర్త చేతిలో ఒక పెద్ద ఎన్వెలప్తో వచ్చాడు. ఆమె ఆత్రంగా చింపి, అందులో ఉన్న పదాలు చదివింది. ‘విద్యాశాఖ మంత్రి జార్జెస్ ర్యాంపోనూ జనవరి 18, సోమవారం సాయంత్రం ఇవ్వనున్న విందుకు శ్రీమతి మరియు శ్రీ లొయిజెల్ను మంత్రిత్వ శాఖ భవనానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం’. చూడగానే ఎంతో సంబరపడుతుందనుకున్న భార్య ఆహ్వానపత్రాన్ని టేబుల్ మీద పడేసి, ‘దానితో నేను ఏం చేయాలి?’ అని గొణుక్కుంది. దేనికీ బయటికి వెళ్లని భార్యకు ఇదో గొప్ప అవకాశం అనుకున్నాడతను. అసలు చాలామంది గుమస్తాలకు అందులో ప్రవేశమే లేదు. కష్టపడి ఈ ఆహ్వానాన్ని సంపాదించాడు. ‘మరి ఏం వేసుకుని వెళ్లాలి?’ అనేది ఆమె సమస్య. అతడు దాని గురించి ఆలోచించలేదు. ‘థియేటర్‌కు వెళ్లేప్పుడు వేసుకునే గౌన్. అందులో నువ్వు నాకు బాగా కనబడతావు’. ఆమె మౌనంగా రోదించడం మొదలుపెట్టింది. ‘నేను వెళ్లలేను, అన్నీవున్న ఇంకెవరి భార్యకైనా ఇచ్చేయండి’. అతడు నిరుత్సాహపడ్డాడు. ‘ఇదిగో, ఇటుచూడు, మెటీల్డ్. మళ్లీ వేరే సందర్భాలకు కూడా వేసుకునే ఒక... మామూలు గౌన్ ఎంతవుతుంది?’ అన్ని లెక్కలూ వేసి, భర్త వెంటనే తిరస్కరించకుండా, అలాగని భయపడే మొత్తం కూడా కాకుండా, ‘కచ్చితంగా తెలీదు. ఒక నాలుగు వందల ఫ్రాంకులైతే సరిపోతాయేమో’ అంది. అతడి ముఖం పాలిపోయింది. సరిగ్గా అంతే మొత్తాన్ని అతడు వచ్చే వేసవిలో తన స్నేహితులతో కలిసి నాంటేర్ మైదానాల్లో భరత పక్షులను వేటాడ్డంకోసం ఒక తుపాకీని కొనడానికి పక్కన పెట్టుకున్నాడు. ‘సరే మంచిది. నేను నాలుగు వందల ఫ్రాంకులు ఇస్తాను. అందమైన గౌను కొనుక్కో’.విందు రోజు దగ్గరపడుతోంది. మేడమ్ లొయిజెల్ గౌను సిద్ధమైంది. అయినా ఆమె అసహనంగానే కనబడింది. భర్త కారణం అడిగాడు. ‘ఒక్క నగ కూడా లేదు. నా దరిద్రం మొత్తం అక్కడ కనబడుతుంది. అసలు పోకుండా ఉంటేనే బాగుంటుంది’. ఈ కాలంలో వచ్చే సహజమైన పూవులను ధరించమని సలహా ఇచ్చాడతను. ‘పది ఫ్రాంకులకు మూడు దివ్యమైన గులాబీలు వస్తాయి’. అంతమంది సంపన్నురాళ్ల మధ్య పేదరాలిగా కనబడటం కంటే అవమానం ఇంకేముంటుంది? భర్త సలహా ఇచ్చాడు. ‘నీ ఫ్రెండు మేడమ్ ఫోరెస్టీర్ ఉందికదా, ఆమె దగ్గర ఏమైనా అడిగి తీసుకునేంత చనువు నీకుంది కదా!’ అంతవరకూ ఆ ఆలోచనే రాని మెటీల్డ్ ఎగిరి గంతేసింది. తెల్లారే స్నేహితురాలి ఇంటికెళ్లి, తన బాధేమిటో చెప్పింది. మేడమ్ ఫారెస్టీర్ వార్డ్‌రోబ్‌లోంచి ఒక పెద్ద నగల పెట్టె తెచ్చి, మేడమ్ లొయిజెల్ ముందు పెట్టి, అందులోంచి కావాల్సింది ఎంచుకొమ్మంది. అందులో బ్రేస్లెట్స్, ఒక ముత్యాల హారం, రాళ్లు పొదిగిన వెనీస్ తయారీ క్రాస్ ఉన్నాయి. అవి వేసుకుని అద్దంలో చూసుకుంది. ఊహూ. ఉన్నట్టుండి, శాటిన్ వస్త్రం చుట్టివున్న ఒక అద్భుతమైన వజ్రాల హారం ఆమె కంటబడింది. దాన్ని తీసుకుంటుండగా ఆమె చేతులు వణికాయి. అది ధరించినప్పుడు అద్దంలో కనబడిన ప్రతిబింబం ఆమెను తన్మయత్వానికి గురిచేసింది. ‘దీన్ని అరువిస్తావా? ఇదొక్కటే?’ ‘ఓ, తప్పకుండా’. స్నేహితురాలి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది మెటీల్డ్. విందునాట్యం రోజు మేడమ్ లొయిజెల్ అందరినీ ఆకట్టుకుంది. అక్కడున్న స్త్రీలందరిలోకీ ఆమే గొప్పగా కనబడింది. పెద్దపెద్దవాళ్లు కూడా ఆమె ఎవరో తెలుసుకునేందుకు కుతూహలపడ్డారు. అంతెందుకు, సాక్షాత్తూ మంత్రి కూడా ఆమెను ప్రశంసించారు. సరిగ్గా ఉదయం నాలిగింటికి వాళ్లు విందు నుంచి బయటపడ్డారు. ఇంత చలిలో వెళ్తే జలుబు చేస్తుందని లొయిజెల్ క్యాబ్ కోసం చూశాడు. ఏదీ ఆగలేదు. సీన్ నది పక్కన వణుకుతూ నడుస్తుండగా పాత క్యాబ్ దొరికింది. ఎట్టకేలకు ఇల్లు చేరుకున్నారు. ఆమెకు సంబంధించినంతవరకూ అంతా ముగిసిపోయింది. అతడు మాత్రం మళ్లీ పొద్దున పది గంటలకు ఆఫీసుకు వెళ్లాలి.అద్దం ముందు కూర్చుని బట్టలు మార్చుకునేముందు మరోసారి అందులో చూసుకుంది. ఒక్కసారి కెవ్వుమంది. నెక్లెస్ లేదు. బట్టలు మార్చుకుంటున్న భర్త, ‘ఏంటీ? ఎలా? అసాధ్యం’ అని మాత్రం అనగలిగాడు. ఆమె స్కర్టు మడతల్లో చూశారు, జేబుల్లో వెతికారు. బయటికి వచ్చినప్పుడు మెడ చుట్టూ ఉందనిపించిందా? వీధిలో గనక పడిపోయుంటే శబ్దం తెలిసేది కదా! క్యాబ్‌లో పడిపోయుంటుందా? ఇద్దరూ స్తంభించిపోయారు. అతడు మళ్లీ బట్టలు వేసుకుని, కాలి నడకన క్యాబ్ ఎక్కిన చోటుకు వెళ్లాడు. ఆమెకు మంచం మీద పడుకోవడానికి కూడా శక్తి చాలలేదు. అతడు ఏడింటికల్లా తిరిగొచ్చాడు. దొరకలేదు. మళ్లీ, పోలీసుల దగ్గరికి వెళ్లాడు, తెచ్చి ఇచ్చిన వాళ్లకు బహుమతి పేరుతో ప్రకటన ఇవ్వడానికి పత్రికా కార్యాలయాలకు వెళ్లాడు, క్యాబ్ కంపెనీలకు వెళ్లాడు. ఆమె రోజంతా అలాగే ఉండిపోయింది. రాత్రికల్లా అతడు పాలిపోయిన ముఖంతో తిరిగొచ్చాడు. నెక్లెస్ కొక్కెం విరిగిపోయిందనీ, దాన్ని బాగుచేసి ఇవ్వడానికి కొంచెం సమయం కావాలనీ మెటీల్డ్తో ఆమె స్నేహితురాలికి ఒక లేఖ రాయించాడు. వారంకల్లా వాళ్ల ఆశలన్నీ అడుగంటాయి. అప్పటికే లొయిజెల్కు ఐదేళ్ల వయసు పెరిగినట్టయింది. ఆ హారం బదులు మరోటి ఎలా ఇవ్వాలి? తెల్లారి, నెక్లెస్ తెచ్చిన పెట్టె మీదున్న పేరును బట్టి ఆ దుకాణానికి వెళ్లారు. అతడు ఆ నెక్లెస్ అమ్మలేదు. ఆ పెట్టె మాత్రమే అమ్మాడు. అన్ని దుకాణాలు తిరిగారు అచ్చంగా అలాంటి హారం కోసం. ఆఖరికి రాయల్ ప్యాలెస్‌లో కనబడింది. వెల నలభై వేల ఫ్రాంకులు! ముప్పై ఆరు వరకు ఇస్తారు. మూడు రోజుల దాకా దాన్ని అమ్మొద్దనీ, ఒకవేళ వాళ్ల హారం గనక ఫిబ్రవరి చివరికల్లా దొరికితే ముప్పై నాలుగు వేలకు వాపసు కొనాలనీ బతిమాలారు. వాళ్ల నాన్న ఇచ్చిన పద్దెనిమిది వేల ఫ్రాంకులు లొయిజెల్ దగ్గరున్నాయి. మిగిలింది అప్పు చేశాడు. వెయ్యి ఫ్రాంకులొకచోట, ఐదు వందలొకచోట, ఐదు లూయీలొక దగ్గరా, మూడు లూయీలు మరోదగ్గరా, దొరికినచోట దొరికినట్టుగా, వడ్డీల మీద వడ్డీలకు ఒప్పుకుంటూ అప్పుపత్రాలు రాసిచ్చాడు. చివరకు మెటీల్డ్ హారాన్ని పట్టుకెళ్లి ఇచ్చినప్పుడు, మేడమ్ ఫోరెస్టీర్ ‘ఇప్పుడా ఇవ్వడం’ అని గొణిగింది. కానీ దాన్ని తెరిచి చూడనందుకు మెటీల్డ్ సంతోషపడింది. తనను దొంగ అనుకోదుకదా! తర్వాత వాళ్లు చిన్న ఇంటికి మారారు. పనిమనిషిని మాన్పించారు. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, నేల తుడవడం సహా ఇంటిపని మొత్తం గులాబీ వేళ్ల మెటీల్డే చేసుకుంది. అలుపు తీర్చుకుంటూ వీధిలోంచి నీళ్లు మోసుకొచ్చింది. మాంసం కొట్లో, పచారీ కొట్లో, పళ్ల దగ్గరా గీచి గీచి బేరాలు చేసింది. వయసు మీదపడ్డట్టయింది. లొయిజెల్ రాత్రిదాకా పేజీకింతని మరోచోట లెక్కల పద్దులు రాశాడు. ఫ్రాంకూ ఫ్రాంకూ జమచేస్తూ ఒక్కో నోటును చెల్లిస్తూ వచ్చారు. ఇట్లా ప..దే..ళ్లు గడిచాయి. ఎప్పుడైనా కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తే మెటీల్డ్కు ఆ విందునాట్యం రాత్రి గుర్తొస్తుంది. ప్చ్, ఆ హారం పోకపోయివుంటే? జీవితం ఎంత చిత్రమైంది! ఎంత అల్పమైన విషయం కూడా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కదా! ఒక ఆదివారం మెటీల్డ్ తోవన నడుస్తున్నప్పుడు పాపతో ఉన్న స్త్రీ కనబడింది. మేడమ్ ఫోరెస్టీర్! అంతే అందంగా, అంతే యౌవనంతో! మాట్లాడాలా, వద్దా? అన్నీ చెల్లించేశారు కాబట్టి, చెబితే పోయేదేముంది? కానీ ఫోరెస్టీర్ గుర్తుపట్టనేలేదు. ‘నేను, మెటీల్డ్ లొయిజెల్’. ‘అయ్యో, మెటీల్డ్ నువ్వా? ఎంత మారిపోయావు?’ ‘చాలా కష్టాలు అనుభవించాను... నీ కారణంగానే.’ ‘నా కారణంగానా? ఎలా?’ హారం పోవడమూ, బదులుగా వేరేది కొనివ్వడమూ, దానికి చేసిన అప్పు తీర్చడానికి పదేళ్లు పట్టడమూ అంతా చెప్పింది. ‘అంటే నువ్వనేది నా హారానికి బదులుగా మరో వజ్రాల హారం తెచ్చానంటావా?’ ‘అయితే నువ్వు గమనించలేదన్నమాట. అవి రెండూ ఒకేలా ఉన్నాయి’. ‘అయ్యో పాపం మెటీల్డ్! అది ఆర్టిఫీషియల్. దాని విలువ ఐదొందల ఫ్రాంకులు కూడా ఉండదు’. గై డి మపాసా(1850–1893) కథ ‘ద నెక్లెస్’ సారాంశం ఇది. 1884లో అచ్చయింది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకరైన మపాసా ఫ్రాన్స్‌లో జన్మించారు. తన కథల ద్వారా మనుషుల అంతరంగాల లోతులను పరిచయం చేసిన మపాసా 43 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు. -గై డి మపాసా -
చీకటితో రాజీ పడటమే ‘అగ్లీ’తనం
కొత్త బంగారం పెరీ, బేబీ గర్ల్ అనబడే డయోనా, స్నేహితురాళ్ళు. టీనేజర్లు. అరగంట కిందట తాము దొంగిలించిన కార్లో వాళ్ళిద్దరూ కూర్చుని ఉండటంతో నవల ప్రారంభం అవుతుంది. కారు డ్రైవ్ చేస్తున్న బేబీ గర్ల్‌ను చూస్తూ, ‘నకిలీ టక్కరి’ అనుకుంటుంది పెరీ. దానితోనే, వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం అంత నిలకడైనది కాదని తెలుస్తుంది. ట్రైలర్ పార్కులో ఉండే పెరీ తల్లి మైరా తాగుబోతు. హ్యాంగోవర్ వల్ల తరచూ పనికి వెళ్ళలేకపోతుంది. సవతి తండ్రి జైలు కాపరి. బేబీ గర్ల్ జీవితం ఇంతకన్నా కనాకష్టంగా ఉంటుంది. ఆ అమ్మాయి తన మేనమామతోనూ, మోటర్ సైకిల్ ప్రమాదంలో మతి చెడిన అన్నతోనూ ఉంటుంది. ఇద్దరూ కలిసి కార్లు దొంగిలిస్తూ, స్కూల్ ఎగ్గొడుతూ, రాత్రివేళలు బయట తిరుగుతూ ఉంటారు. కలిసి ఎంతో సమయం వెచ్చించినప్పటికీ, ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు. వారిద్దరికీ ఉన్న సామాన్యమైన నేపథ్యం– అస్థిరమైన కుటుంబాలు. బేబీ గర్ల్ స్థూలంగా ఉండి, తన తిరుగుబాటు ధోరణిని కనపరచడానికి సగం తల గొరిగేసుకుని, మందపాటి మేకప్ వేసుకుని, అన్న జీన్స్ తొడుక్కుంటుంది. ఇంకా కన్య. పెరీ అందమైన బ్లాండ్. లైంగిక సంబంధాలకి వెనకాడదు. ఇద్దరూ ఫేస్బుక్లో ‘టీనేజర్’ని అని చెప్పుకున్న జేమీతో చాట్ చేస్తుంటారు. అతను పెరీ ఉండే పార్కులోనే మరొక ట్రైలర్లో తల్లితోపాటు ఉండి, కంప్యూటర్ స్క్రీన్ వెనకాల నుంచి పెరీని చూస్తూ ఆమె పైన ఆసక్తి పెంచుకున్న మధ్యవయస్కుడు. పిల్లల పట్ల కామం పెంచుకునే స్వభావం ఉన్న వ్యక్తి. అమ్మాయిలిద్దరికీ అతని వివరాలు తెలియవు. పెడసరంగా ఉండే బేబీ గర్ల్‌కు ఇతరులు తన్ని ఇష్టపడాలని ఉంటుంది. జేమీ వల్ల ఇద్దరమ్మాయిల మధ్యా దూరం ఎక్కువవుతుంది. ఒక వర్షపు రాత్రి జేమీని కలుసుకోడానికి బేబీ గర్ల్– పెరీతో పాటు వెళ్ళినప్పుడు, జరిగిన ఘర్షణలో– అతను కాలు జారి రోడ్డు పక్కనున్న డొంకలో పడి చనిపోతాడు. పోలీసధికారులకి జరిగినది చెప్పమని బేబీ గర్ల్ దబాయించినప్పటికీ, పెరీ వినదు. ఇద్దరూ మృతదేహాన్ని వదిలేసి పోతారు. లిండ్సే హంటర్ పాత్రలకి తమ బలహీనతలు తెలుసు. తమని తాము ఏవగించుకుంటూనే, తమ తప్పుడుదారులు మాత్రం విడవరు. అయితే, పాఠకులకి మాత్రం సానుభూతి కలిగిస్తారు. నవల– కష్టాలని అధిగమించడం గురించినది కాక, తమలో ఉన్న చీకటి కోణాలతో రాజీ పడే పాత్రల చిత్రీకరణ. కథనం ప్ర«థమ పురుష స్వరంతో వినిపిస్తుంది. నెమ్మదిగా మొదలయి, హఠాత్తుగా ముగుస్తుంది. చివరి అధ్యాయాలు కొన్ని– కేవలం ఒకే పేరాతో పూర్తయేవి. పుస్తకం–గలీజైన, గరుకైన జీవితాల గురించినదైనప్పటికీ, కథాంశం పాత్రలని తాజా రీతిలో ముందుకు నడిపిస్తూ ఉన్నందువల్ల, విసుగు పుట్టించదు. ఆ విధమైన జీవితాల గురించీ, పాత్రల గురించీ పాఠకులు ఆలోచించేలా చేస్తుంది. ప్రతీ ఒక్కరూ అంతర్గతంగా చెడ్డవారేనన్న సూత్రం నవలంతటా కనబడుతుంది. ఇక్కడ ‘అగ్లీ’ అన్నది అమ్మాయిలని కాదు. ‘అగ్లీ’గా ఉండేది– మనుష్యులు, జీవితాలు, ఆలోచనలు, నైతిక స్థాయులు. కథాంశం–గ్రామీణ పేదరికం, టీనేజిలో కలిగే నిరుత్సాహపు సుఖదుఃఖాలు, లైంగిక పరిపక్వతకి ముందు వచ్చేచిక్కులు. గతంలో రచయిత్రి రెండు కథా సంకలనాలు రాశారు. అగ్లీ గర్ల్స్ ఆమె తొలి నవల. విడుదల అయినది 2014లో. కృష్ణ వేణి -
కారు వస్తే గుర్రం పోవాల్సిందేనా?
ప్రతిధ్వనించే పుస్తకం మనుషులకీ జంతువులకీ మధ్య ఉండే సంబంధం ‘బ్లాక్ బ్యూటీ’లోని ప్రధాన వస్తువు. ఈ నవలను అన్నా సీవెల్ గుర్రాల పట్ల మనుషులు దయగా ఉండాలనే సందేశంతో రాసిందని అంటారు. అప్పటికి రైలు వచ్చేసింది. ఇంకా కారు ఒక మార్కెట్ సరుకుగా వచ్చి ఉండలేదు. మానవ నివాస భూఖండాలన్నింటా జంతువులు ఉత్పత్తి కార్యకలాపాలలో భాగస్వాములుగా ఉన్న కాలం అది. మానవ నాగరికత మారిపోయింది. కార్లు... రైళ్ళు... బస్సులు వచ్చాయి. అవి నడవడం కోసం రోడ్లు వచ్చాయి. రోడ్ల కోసం కొండలు పేలాయి. భూమి మీద మానవునితో సంబంధం లేకుండా ఆవిర్భవించిన గుర్రం అతని సంబంధంలోకి వచ్చి పెంపుడు జంతువై మనిషికి వ్యక్తిగత ఆస్తి అయ్యి , సరుకు అయ్యి, చివరికి అంతరించిపోయే దశలోకి వచ్చేసింది. ప్రకృతికీ, సమాజానికీ సంబంధించిన పరిణామక్రమంలో యిప్పుడు ఉన్నట్టుగా ఉండడం అనేది ఒకానొక పరిణామ ఫలితమనీ యిది కూడా మారి పోతుందనీ మనకి సైన్స్పరంగానూ, తాత్వికంగానూ కూడా తెలుసు. ఈ ప్రక్రియలో మేధోజీవి అయిన మానవుడు ప్రకృతి పరిణామంగా వచ్చి దానిలో జోక్యం చేసుకోవడం, మార్చివేయడం అనే నాగరికత కలిగినవాడు. ఈ లక్షణాన్నీ, ఈ నాగరికతనీ మనం ప్రేమిస్తున్నాం. మార్చడం, మారిపోవడం రెండూ తప్పనిసరి అనీ, మార్పు యిలాగే ఉండాలనీ, అలా ఉండకపోవడం ఒక నేరమనీ భావిస్తున్నాం. అయితే మానవుని జోక్యంతో మారుతున్న ప్రకృతి యిప్పుడు చాలా ప్రశ్నల్ని మన ముందుకు తెస్తున్నది. కొన్ని వేల యేళ్ళు ప్రకృతి పరిణామంగా ఏర్పడినవన్నీ కొన్ని రోజులలో నాశనమై అంతరించిపోవడం ఈవేళ మనకి నిత్యమూ కనపడుతున్న అంశం. బ్లాక్బ్యూటీలో గుర్రాన్ని ప్రేమించడం హింసించడం రెండూ కనిపిస్తాయి. గుర్రంతో మనిషికి మైత్రి ఉంది. అది తన లాంటి ఒక ప్రాణి అనే ఎరుక ఉంది. కానీ కారుతో అలాంటిదేమీ లేదు. కానీ సమస్య యిది కాదు. కారు రావడంతో గుర్రం అనే ఒక ప్రకృతి జీవి మానవునితో ‘ఉద్యోగిత’ కోల్పోయి అంతరించిపోయే దశకి చేరుకోవడం. ఒక సహజ పరిణామం మనిషి కార్యాచరణకి గురై అంతరించిపోవడం మనకి భయానకమైన ప్రశ్న వేస్తున్నది. ప్రాజెక్టుల వల్ల నదులు, కొండలు, పట్టణీకరణవల్ల భూమి, చెట్లు, పక్షులు, అడవులు, ప్రపంచీకరణ వల్ల అన్నీ అంతరించిపోయే దశకి చేరుకోవడం ఈవేళ మనకి స్పష్టంగా తెలుస్తోంది. యిదంతా మానవుడి చేతుల్లో లేని ఒక సహజ పరిణామమా? ఇది అనివార్యమా? భూమి మీద జీవం అంతరించిపోవడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ప్రక్రియా యిది? - అద్దేపల్లి ప్రభు -
ప్రతిధ్వనించే పుస్తకం
కె.లలిత, వసంత కన్నబిరాన్, రమా మేల్కోటే, ఉమామహేశ్వరి, సూసీ తారూ, వీణా శత్రుఘ్న, ఎం.రత్నమాల సంపాదకత్వంలో, స్త్రీ శక్తి సంఘటన ప్రచురణగా 1986లో వచ్చిన అద్భుతమైన పుస్తకం ‘మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో స్త్రీలు)’. ఇది ‘చరిత్రలు సృష్టించినా పేరులేని స్త్రీలకూ, పోరాటాలకూ’ అంకితం చేయబడ్డది. ఒక్క మానుకోట దొర జన్నారెడ్ది ప్రతాపరెడ్డికే ఒక లక్షా యాభైవేల ఎకరాల భూమి ఉన్న రోజులవి. నిజాం ప్రభుత్వంలోని ఖాసిం రజ్వీ, లాయఖ్ అలీ వంటి ముస్లిం మతాభిమానుల నాయకత్వంలో రజాకార్లూ, నిజాం పోలీసులూ, ‘ఖాల్సా’ భూములను నిజాం అనుగ్రహంతో స్వాధీనం చేసుకుని, దశాబ్దాల పర్యంతం తమ అధీనంలో ఉంచుకుని తెలంగాణా పేద ప్రజలను వెట్టి చాకిరితో, లెవీ ధాన్యం వసూళ్లతో అతి భయంకరంగా హింసిస్తూ సాగించిన దోపిడినీ, అణచివేతనూ ప్రతిఘటించడానికి 1940లలో స్థాపించబడ్ద కమ్యూనిస్ట్ పార్టీ పదమూడు ‘ఆంధ్ర మహాసభ’ల నిర్వహణతో జనాన్ని చైతన్యపరిచింది. ఈ ‘సంగాల్లో’ నిరక్షరాస్యులైన అనేకమంది స్త్రీలు నిర్వహించిన వీరోచిత పాత్ర గురించి చాలా మందికి తెలియదు. అటువంటి విస్మరించబడ్డ నారీమణుల చరిత్రలను... జీవిత అంతిమదశకు చేరిన ఒక్కొక్కరి దగ్గరికి వెదుక్కుంటూ వెళ్ళి వాళ్ల స్వంత భాషలో వాళ్ళ అనుభవాలను విని, టేపుల్లో రికార్డ్ చేసి, అక్షరాల్లోకి అనువదించి ఒక అశ్రుఘోషగా వెలువరించిన గ్రంథమిది. వరంగల్ కమలమ్మ, చాకలి ఐలమ్మ, ప్రమీల తాయి, సుగుణమ్మ, బ్రిజ్ రాణి, మల్లు స్వరాజ్యం, ప్రియంవద, కొండపల్లి కోటేశ్వరమ్మ, సూర్యావతి, జమాలున్నీసా బేగం, లలితమ్మ, అచ్చమాంబ, మోటూరి ఉదయం వంటి వీరవనితల గురించి చదువుతున్నపుడు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దిక్కూ మొక్కూ లేని జనం విముక్తి కోసం వారు పడ్డ శ్రమ, తపన, చేసిన త్యాగాలు చూస్తే మనం వాళ్ళ వారసులమైనందుకు గర్వంతో పొంగిపోతాం. – రామా చంద్రమౌళి -
ఎవరు చెబుతున్నది నిజం?
కొత్త బంగారం జిలియన్ ఫ్లిన్ రాసిన ‘గాన్ గర్ల్’ నవల– నిక్, యేమీ ఐదవ వివాహ వార్షికోత్సవం నాడు, యేమీ కనబడకపోవడంతో మొదలవుతుంది. నిక్ డన్, యేమీ వివాహంలో ఉన్న ప్రేమ దూరమవుతూ ఉంటుంది. ఇద్దరూ న్యూయోర్కులో ఉద్యోగాలు పోగొట్టుకుని, క్యాన్సర్‌తో బాధపడుతున్న నిక్ తల్లి వద్దకి మిజోరీ చేరుకుంటారు. యేమీ అక్కడ ఇమడలేకపోతుంది. దంపతుల మధ్య పోట్లాటలు మొదలవుతాయి. నిక్ జర్నలిజం బోధించే యూనివర్సిటీలో, ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. యేమీకి అది తెలిసి నిక్కికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన హత్యకి అతడిని బాధ్యుడిగా చేసే యుక్తి పన్ని, తన జాడేదీ వదలకుండా మాయం అవుతుంది. ఆమె దాక్కున్న మోటెల్ గదిలో దొంగతనం జరిగినప్పుడు, పాత బాయ్‌ఫ్రెండ్ అయిన దేసీ కాలింగ్స్‌ను సహాయం అడుగుతుంది. సరస్సు పక్కనున్న తన ఇంట్లో ఆమెని దాచడానికి వొప్పుకుంటాడతను. ఇంతలో, తన పేరు మీదున్న క్రెడిట్ కార్డుతో ఆమె కొన్న వస్తువులని గమనించీ, తను గర్భవతిని అని అబద్ధం రాసుకుని ఆమె వదిలి వెళ్ళిన డైరీని బట్టీ భార్య ఉద్దేశ్యం అర్థం అయినప్పటికీ, నిక్ తను నిర్దోషినని పోలీసులని నమ్మించలేకపోతాడు. తన లాయర్ సలహాతో, తన గురించిన పబ్లిక్ అభిప్రాయాన్ని మార్చడానికి వొక టీవీ షోలో పాల్గొని– యేమీని క్షమాపణ అడిగినట్టు నటిస్తూ, ఆమెని వెనక్కి రమ్మని అడుగుతాడు. పబ్లిక్కు అతని మీద నమ్మకం ఏర్పడుతుంది కానీ దురదృష్టవశాత్తూ, తనవి కావని నిక్ చెప్పిన పార్న్ వీడియోలూ, యేమీ డైరీ పోలీసులకి దొరుకుతాయి. అతన్ని అరెస్ట్ చేసి బెయిలు మీద వదులుతారు. ఆ ఇంటర్వ్యూ చూసిన యేమీ భర్త తన్ని ప్రేమిస్తున్నాడని నమ్మి, తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దేసీని హత్య చేసి, భర్త వద్దకి తిరిగి వస్తుంది. తనని దేసీ బలాత్కారంగా తీసుకెళ్ళాడని కథ అల్లుతుంది. ఆమె అబద్ధం చెప్తోందని నిక్కికి తెలిసినప్పటికీ సాక్ష్యం లేకపోవడం వల్ల, మీడియా గోల తగ్గేటంతవరకూ కలిసే ఉందామనుకుని యేమీ నేరాలు, మోసాల గురించిన కథ రాయడం ప్రారంభిస్తాడు. అది యేమీకి తెలిసి, తామిద్దరూ గతంలో పిల్లలు పుట్టడం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఘనీభవించి పెట్టిన నిక్ వీర్యాన్ని ఇన్సెమినేట్ చేయించుకుని గర్భవతి అయి, నిక్ రాస్తున్న పుస్తకాన్ని కనుక అచ్చు వేస్తే, పుట్టబోయే బిడ్డని తీసుకుని వెళ్ళిపోతానని అనడంతో, గత్యంతరం లేని నిక్ ఆ మాట పాటిస్తాడు. పుస్తకం– నిక్, యేమీ దృష్టికోణాలని మార్చిమార్చి చూపిస్తూ రాయబడింది. తమ ప్రస్తుత సంబంధాన్ని వర్ణిస్తూ ఉన్న నిక్, తమ గత సంబంధాన్ని తన డైరీ రాతలతో వివరించే యేమీ కోణాలు భిన్నమైనవి. నిక్ బద్ధకస్తుడూ, అస్థిరచిత్తం ఉన్నవాడిగా యేమీ వర్ణిస్తే, ఆమె అనవరమైన కష్టాలని తెచ్చిపెట్టే మొండి స్వభావం ఉన్న వ్యక్తని నిక్ చెప్తాడు. అయితే, ఇద్దరూ తమ పక్షపు కథనాల్లో, నిజాలు వెల్లడించడం లేదని మాత్రం పాఠకులకి అర్థం అవుతుంది. దీని ఆడియో పుస్తకం కూడా ఉంది. 2012లో అచ్చయిన ఈ నవల ఫ్లిన్ రాసిన మూడవది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’గా ఎనిమిది వారాలున్న దీని ఆధారంగా ఇదే పేరుతో డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో సినిమా కూడా వచ్చింది. - కృష్ణ వేణి -
’పంది’రి
కథాసారం ఆకాశానికీ మనకూ మధ్య ఉండేది పందిరి. ఆకాశమంత ఆశవున్నా పందిరిని ప్రేమిస్తూనే ఉంటాం. నిజానికి ప్రేమ ఆకాశమంత ఉంటే ఆశల పందిరి అడ్డమే కాదు! నాన్న, బార్ట్ సింప్సన్ బొమ్మ కొనడు. అమ్మ నిజానికి కొందామనే అంది. కానీ అలా కొనిస్తే చెడిపోతానట. ఎందుకు కొనాలసలు? వాడేదో ఏడుపు మొదలుపెట్టగానే నువ్వు ఠకీమని ఒప్పేసుకుంటావని అమ్మను కోప్పడ్డాడు కూడా. వాడికి డబ్బు విలువ తెలియట్లేదన్నాడు. చిన్నతనంలో కాక పొదుపు గురించి మరెప్పుడు నేర్చుకుంటాడన్నాడు. అడగ్గానే బార్ట్ సింప్సన్ బొమ్మ అతిసులభంగా పొందిన పిల్లలు పెద్దయ్యాక మొద్దులుగా తయారవుతారని ఆయన ఉద్దేశం. ఇలాంటివాళ్లే ఏటీఎంల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లే బాపతుగా తయారవుతారట. అందువల్ల బార్ట్ సింప్సన్ బొమ్మ బదులుగా నాకు ఒక వికారమైన చైనా పంది బొమ్మ తెచ్చాడు. దాని వెనుక భాగంలో ఒక రంధ్రం ఉంది. ఇలా అయితే నేను మొద్దును కానన్నమాట! ప్రతిరోజూ నేను కప్పు కోకో తాగాలి, అదంటే నాకు అసహ్యమైనప్పటికీ. తొక్కతో కోకో తాగితే ఒక షెకెల్(ఇజ్రాయిల్ నాణెం) ఇస్తారు. తొక్కలేనిదైతే అర షెకెల్. దాన్ని అట్లానే తీసి పారబోస్తే ఏమీ ఇవ్వరు! ఆ ఇచ్చిన నాణేల్ని పంది వెనకాలి రంధ్రంలో వేయాలి. ఆ బొమ్మను ఊపితే గలగలమని శబ్దం వస్తుంది. పంది ఎప్పుడైతే నిండుతుందో దాన్ని ఊపినప్పుడు గలగలమని శబ్దం రాదు. అప్పుడు స్కేట్‌బోర్డ్ మీద ఉన్న సింప్సన్ బొమ్మ కొంటాడు నాన్న. ఆ విధంగా నేను పొదుపు పాఠాలు నేర్చుకుంటున్నాను. నిజానికి పంది బొమ్మ చూడముచ్చటగా ఉంది. దాని ముక్కును తాకితే చల్లగా ఉంటుంది. దాని వెనుక నాణేన్ని వేసినప్పుడల్లా అది నవ్వుతుంది. అర్ధనాణేన్ని వేసినా కూడా అలాగే నవ్వుతుంది. ఇంకో మంచి విషయమేమిటంటే, అసలు ఏ నాణేన్ని అందులో వేయకపోయినా కూడా అది అలాగే నవ్వుతుంది. నేను దానికి పెసాచ్సన్ అని పేరు పెట్టాను. ఈ పెసాచ్సన్ ఎవరంటే ఒకప్పుడు మేమున్న ఇంట్లో ఉండేవాడు. ఆయన పేరున్న లేబుల్‌ను మెయిల్ బాక్స్ మీదినుంచి ఎంత పీకేయడానికి నాన్న ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పెసాచ్సన్ మిగతా బొమ్మల మాదిరిగా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. దాన్లో లైట్లూ, స్ప్రింగులూ, లీకయ్యే బ్యాటరీలూ లేవు. అయితే, అది టేబుల్ మీద నుండి కిందకు దూకకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నేలవైపు వంగి కిందకు చూసినప్పుడు, ‘జాగ్రత్త పెసాచ్సన్! నువ్వు పింగాణీ తయారీవి’ అని చెబుతాను. అప్పుడు అది నా వైపు చూసి నవ్వుతుంది. నేను నా చేతిలోకి తీసుకునేంత వరకూ ఓపిగ్గా వేచి ఉంటుంది. పెసాచ్సన్ నన్ను చూసి నవ్వితే నేను వెర్రెత్తిపోతాను. కేవలం ఆ నవ్వు కోసమే నేను ప్రతి ఉదయం నాకిష్టం లేకపోయినా తొక్కతో ఉన్న కోకో తాగుతాను. దాని వెనకాల వున్న రంధ్రంలో నాణేన్ని వేసి దాని నవ్వు ఇంతకూడా ఎందుకు మారదో చూస్తాను. తర్వాత, ‘ఐ లవ్యూ పెసాచ్సన్’ అని చెబుతాను. ‘నిజంగా చెబుతున్నాను, అమ్మానాన్న కన్నా కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏటీఎంలను పగలగొట్టినా సరే , ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే ప్రేమిస్తాను. కానీ ఒకటి, టేబుల్ మీది నుంచి దూకాలని మాత్రం కనీసం ఆలోచన కూడా నీవు చేయొద్దు’. నిన్న నాన్న వచ్చాడు. టేబుల్ మీదున్న పెసాచ్సన్‌ను పైకెత్తి కిందికీ మీదికీ గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. ‘నాన్నా, జాగ్రత్త. నువ్వు పెసాచ్సన్‌కు కడుపునొప్పి తెప్పించేట్టున్నావు’ అన్నాను. కానీ నాన్న వినలేదు. ఇంకా అలాగే ఊపుతూ, ‘ఇందులోంచి శబ్దం రావడం లేదు. దీనర్థం నీకు తెలుసుకదా యువీ? నీకు రేపే స్కేట్‌బోర్డ్ మీదుండే సింప్సన్ బొమ్మ కొనిస్తాను’ చెప్పాడు నాన్న. ‘అద్భుతం నాన్నా. సింప్సన్ బొమ్మా? అద్భుతం. కానీ పెసాచ్సన్‌ను మాత్రం ఊపడం ఆపు. ప్లీజ్ దానికి నొప్పెడుతుంది’ అన్నాను. నాన్న పెసాచ్సన్‌ను తిరిగి టేబుల్ మీద పెట్టాడు. అమ్మ దగ్గరికి వెళ్లాడు. ఒక నిమిషం తర్వాత అమ్మను చేత్తో పట్టుకొని లాగినట్టుగా తోడ్కొని వచ్చాడు. ఇంకో చేతిలో సుత్తి వుంది. ‘చూశావా, నేనూహించినట్లుగానే జరిగింది’ చెప్పాడు నాన్న. ‘వస్తువుల విలువ ఏమిటో ఇప్పుడు వాడికి తెలుసు. కదా యువీ?’. ‘కచ్చితంగా తెలిసింది నాన్నా. అదిసరేగానీ సుత్తి ఎందుకు తెచ్చినట్టు?’ అని నేను అడిగాను. ‘నీ కోసమే’ అంటూ సుత్తిని నా చేతిలో పెట్టాడు. ‘జాగ్రత్త సుమా!’ అన్నాడు. ‘నేను జాగ్రత్తగానే ఉంటాను’ అన్నాను. నేను నిజంగానే జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని నిమిషాలు వేచి చూశాక, నాన్న విసిగిపోయాడు. ‘కానివ్వురా, ఆ పందిని పగలగొట్టు’ అన్నాడు. ‘య్యేమిటీ?’ నేను అరిచాను, ‘పెసాచ్సన్‌ను పగలగొట్టాలా?’ ‘అవునవును, పెసాచ్సనే’ చెప్పాడు నాన్న, ‘కానీ, పగలగొట్టెయ్. నువ్వు చాలా కష్టపడ్డావు. బార్ట్ సింప్సన్ బొమ్మ కొనివ్వడానికి అర్హత సంపాదించావు’. తన అంతిమ క్షణాలు వచ్చాయని తెలిసిపోయిన చైనా పందిలాగా పెసాచ్సన్ నావైపు చూసి దీనంగా నవ్వింది. సింప్సన్ బొమ్మ లేకపోతే పోయే! నేను నా ఫ్రెండు తల మీద సుత్తితో కొట్టడమా? ‘నాకు సింప్సన్ బొమ్మ వద్దు. ఈ పెసాచ్సన్ చాలు’ అని సుత్తిని నాన్నకు వెనక్కి ఇచ్చేశాను. ‘నీకు అర్థం కాలేదన్నమాట’ అన్నాడు నాన్న. ‘ఏం ఫర్లేదు. నన్ను చూసి నేర్చుకో. నీ కోసం నేనే పగలగొడతాను’. నాన్న అప్పటికే సుత్తిని పైకెత్తాడు. అమ్మ కళ్లు మూసుకుంది. పెసాచ్సన్ అలసిపోయినట్టుగా నవ్వుతున్నాడు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. నేను ఏమీ చేయలేదంటే పెసాచ్సన్ చచ్చిపోయినట్టే! ‘నా...న్నా...’ అని గట్టిగా నాన్న కాళ్లను పట్టుకున్నాను. ‘ఏం, యువీ?’ అడిగాడు నాన్న. చేతిలోని సుత్తి ఇంకా గాల్లోనే లేచివుంది. ‘నాన్నా! నాకింకో షెకెల్ కావాలి, ప్లీజ్. రేపు కోకో తాగిన తర్వాత అందులో వేయడానికి. రేపు దాన్ని నేనే పగలగొడతాను, తప్పకుండా’ అన్నాను. ‘ఇంకో షెకెలా?’ నాన్న నవ్వుతూ సుత్తిని టేబుల్ మీద పెట్టాడు, ‘చూశావా? వాడిలో ఎంత అవగాహన పెరిగేట్టు చేశానో’. ‘రేపు’. అప్పటికే నా గొంతు పూడుకుపోయింది. అందరూ గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత పెసాచ్సన్‌ను గట్టిగా హత్తుకున్నాను. ఒక్కసారిగా బయటికి ఏడ్చాను. పెసాచ్సన్ ఏమీ మాట్లాడలేదు. నా చేతుల్లో నిశ్శబ్దంగా వణికింది. ‘బాధ పడకు’ తన చెవిలో గుసగుసగా చెప్పాను, ‘నేను నిన్ను కాపాడుతాను’. రాత్రి నాన్న ముందుగదిలో టీవీ చూడటం ముగించి, నిద్రకు ఉపక్రమించే వరకూ వేచివున్నాను. నెమ్మదిగా మంచం మీదినుంచి లేచి, పెసాచ్సన్‌ను పట్టుకుని బయటికి వచ్చాను. చాలాసేపు మేమిద్దరమూ చీకట్లో నడిచాం. చివరకు ముళ్లపొదలున్న ఒక పొలాన్ని చేరుకున్నాం. ‘పందులకు ముళ్లపొదలున్న పొలాలంటే చాలా ఇష్టం’ అని పెసాచ్సన్‌ను నేల మీద పెడుతూ చెప్పాను, ‘నీకు ఇక్కడ నచ్చుతుంది’. జవాబు కోసం ఎదురుచూశానుగానీ పెసాచ్సన్ ఏమీ అనలేదు. దానికి గుడ్‌బై చెప్పడానికి ముక్కు మీద తాకినప్పుడు మాత్రం విషాదంగా చూసింది. మరి నన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేనని తనకు తెలుసుకదా! ఎట్గార్ కెరెట్ హీబ్రూ కథ ‘బ్రేకింగ్ ద పిగ్’ సారం ఇది. కెరెట్ 1967లో ఇజ్రాయిల్‌లో జన్మించారు. కథలూ, గ్రాఫిక్ నవలలూ, సినిమాలూ, టీవీకి స్క్రిప్టులూ రాస్తారు. - ఎట్గార్ కెరెట్ -
ఒక క్లాసిక్ తొలి రూపం
కొత్త బంగారం 1957లో, హార్పర్ లీ తన పబ్లిషరుకి ‘గో సెట్ అ వాచ్ మాన్’ రాతప్రతి ఇచ్చినప్పుడు, అది నవలలా కాక పిట్టకథల సంకలనంలా ఉందంటూ, అచ్చు వేయడానికి నిరాకరించారు. రెండేళ్ళ పాటు, డ్రాఫ్టులు మారుస్తూ రాసిన తరువాత రూపుదిద్దుకున్నది అమరత్వం పొందిన, ‘టు కిల్ అ మాకింగ్‌బర్డ్’. 1960లో అచ్చయిన ఈ నవల 1961లో పులిట్జర్ పురస్కారం గెలుచుకుంది. దీనికి ఇంత పేరు రావడానికి అతి ముఖ్య కారణం– పుస్తకం సరైన సమయాన, దక్షిణ అమెరికాలో జాత్యహంకారం అతి ఎక్కువయిన కాలంలో అచ్చవడం. మొదటి డ్రాఫ్టయిన, ‘గో సెట్ అ వాచ్ మాన్’ 2015లో పబ్లిష్ అయింది. ఇది జాన్ లూయీస్ 26 ఏళ్ళ వయసులో ఉన్నప్పటి కథ. న్యూయార్క్ నుండి కాల్పనిక ఊరైన మేకాంబ్కి, 72 ఏళ్ళున్న తండ్రి అట్టికస్ని చూడ్డానికి వస్తుంది. అట్టికస్ కీళ్ళనొప్పులతో బాధపడుతూ, చెల్లెలు అలెక్సాండ్రాతో పాటు ఉంటుంటాడు. తనని పెంచిన నల్లజాతికి చెందిన వంటామె ఇప్పుడు జాన్ని ‘తెల్లమ్మాయిగా’ చూస్తుంది. జాన్ బాల్య జ్ఞాపకాలే నవల అధిక భాగం ఆక్రమించుకుంటాయి. తన చిన్నతనంలో– ఒక నల్ల జాతి యువకుడు తెల్ల జాతి స్త్రీని మానభంగం చేశాడని ఆరోపించబడినప్పుడు, అట్టికస్ కోర్టులో అతని కేసు వాదించి అతన్ని రక్షిస్తాడని చూసి, తండ్రిని ఆదర్శమూర్తిగా ఊహించుకుంటుంది. ఆరేళ్ళ ఆ పిల్ల( అప్పటి పేరు–స్కౌట్) దృష్టిలో తండ్రి ఏనాడూ తప్పు చేయలేడు. అప్పుడు, ‘అందరికీ సమాన హక్కులుండాలి, ఎవరికీ ప్రత్యేకాధికారాలు ఉండకూడదు’ అని జపించిన తండ్రి ఇప్పుడు మూఢమతాభిమానిగా మారి, జాత్యహంకార కరపత్రాలు పంచుతూ, అనుకూల విభజన ప్రచారంలో పాల్గొంటున్నాడని చూసి జాన్ నమ్మలేకపోతుంది. ఇంక తండ్రిని ఎదుర్కునే సమయం వచ్చిందనుకుని వాదన పెట్టుకుంటుంది. అట్టికస్ తన ప్రస్తుత ఆలోచనలని వదులుకోడు. నలుపు జాతన్న వివక్ష ఉండకూడదన్న సుప్రీమ్ కోర్టు కొత్త నిర్ణయంతో విభేదిస్తాడు. నల్ల జాతీయులు అధికారంలోకి వచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు చేపడతారేమో అని బెంగ పడతాడు. కూతురికి బుద్ధి చెప్పడానికి తమ్ముడైన డాక్టర్ ఫించ్‌ని పిలుస్తాడు. ‘అంతర్యుద్ధంలో దాస్యం యాదృచ్ఛికమైనది. నల్ల జాతీయులు తెల్లవారికన్నా తక్కువ. ఇతరుల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి’ అంటూ, జాన్ చెంపమీద కొట్టి మరీ వివరించి, ఆమెని ‘మతోన్మాది’ అని పిలుస్తాడు పినతండ్రి. తండ్రి మెల్లిమెల్లిగా తిరోగమిస్తున్న వ్యక్తని జాన్ గ్రహించి, రాజీ పడుతుంది. వాచ్మాన్లోనూ, ప్రామాణిక నవల అయిన మాకింగ్బర్డ్లోనూ ఉన్న తేడాలు ఆసక్తికరమైనవి. వాచ్మాన్లోని అట్టికస్ దక్షిణ పట్టణపు జాత్యహంకారి, నైతికంగా దుర్బలుడైన వ్యక్తి. మాకింగ్బర్డ్లో అతను లోకం ప్రేమించే, న్యాయం పట్ల అక్కర ఉన్న లాయర్. నిర్భయమైన దిక్సూచి. ‘ప్రా«థమికంగా మనుష్యులు మంచివారు’ అన్న ఆశాభావంతో మాకింగ్‌బర్డ్ అంతం అవుతుంది. ‘మనుష్యులెప్పుడూ మారరు’ అన్న వొప్పగింతతో వాచ్మాన్ ముగుస్తుంది. మాకింగ్బర్డ్లో ఉన్న నాటకీయత ఈ నవల్లో లేదు. జాతీ, రాజకీయాలూ గురించిన సుదీర్ఘ ఉపన్యాసాలపైన ఆధారపడుతుంది. దానివల్ల, పాత్రల పట్ల ముందటి ప్రేమ పాఠకులకి కలగదు. మాకింగ్బర్డ్తో పోల్చి చూస్తే, ఇది ఒక నవల అని కూడా అనిపించుకోదేమో! - క్రిష్ణవేణి -
మరణించే హక్కు గురించి మాట్లాడే నవల
తన అంతర్జాతీయ కచేరీ పర్యటనకి మూడు వారాల ముందు, ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో, హాస్పిటల్లో చేరిన ఎలిఫ్రిడీ (ఎల్ఫ్)తో నవల ప్రారంభం అవుతుంది. ఆమె ప్రపంచ ప్రసిద్ధి పొందిన పియానిస్ట్. డబ్బున్నది. ప్రేమించే భర్త్ నిక్ ఉంటాడు. కానీ, మానసిక వ్యధతో బాధపడుతూ, మరణించాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్న స్త్రీ. చనిపోయేందుకు– కడుపు మాడ్చుకోవడం, నిద్ర మాత్రలు మింగడం, మణికట్టు కోసుకోవడం, బ్లీచ్ తాగడం వంటి ప్రయత్నాల్లో వేటినీ వదలదు. ‘ఎల్ఫ్ చనిపోవాలనుకుంది కానీ తను బతకాలన్నది నాకోరిక. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకునే శత్రువులం’ అన్న చెల్లెలు యోలాండా (యోలీ) జీవితం ఆటుపోట్లకి గురైనది. కథనం ఆమె స్వరంతోనే వినిపిస్తుంది. అక్కను చుట్టుముట్టిన చీకటి గురించి తెలిసిన యోలీని, కారుణ్య మరణం చట్టబద్ధం అయిన స్విస్ క్లినిక్‌కి తనను తీసుకెళ్ళమని ఎల్ఫ్ అడుగుతుంది. తను వొప్పుకున్నా లేకపోయినా కూడా, ఎల్ఫ్ ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడో అప్పుడు నెరవేరుతుందని గ్రహించిన యోలీ – అక్కకి సహాయపడ్డానికే నిశ్చయించుకుంటుంది. కానీ, బాంక్ ఆమెకి లోన్ ఇవ్వదు. ఎల్ఫ్కూ, నిక్కూ ఉమ్మడి ఖాతా ఉండటం వల్ల ఆ ప్రయాణాన్నిభర్తనుంచి దాయడం ఎల్ఫ్కు కుదరదు. తన పుట్టినరోజు జరుపుకోడానికి ఎల్ఫ్ హాస్పిటల్ నర్సుల అనుమతి తీసుకుని బయటకెళ్ళి, నిక్‌తో పాటు విందు భోజనం చేసి, పుస్తకాలు తెమ్మని అతన్ని లైబ్రరీకి పంపుతుంది. ఎదురుగా వస్తున్న రైలు కింద తల పెట్టేసి, ఆత్మహత్య చేసుకోవడంలో కృతకృత్యురాలవుతుంది. తన జీవిత బీమా డబ్బుని యోలీకి వదిలిపెడుతుంది. ఎల్ఫ్ తండ్రి కూడా ఇదే విధానంలో, 12 సంవత్సరాల కిందట తన మరణాన్ని ఎంచుకుంటాడు. అక్కచెల్లెళ్ళ పల్లెటూరి బాల్య జ్ఞాపకాలని రచయిత్రి స్పష్టంగా, శక్తిమంతంగా వర్ణిస్తారు. కథనం– సానుభూతికీ, పరిహాసానికీ మధ్య ఊగిసలాడుతుంది. మితిమీరిన విషాదం కనిపించక, పదునైన చమత్కారం కనబడుతుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది కూడా. అందుకే నవల విషాదకథల జోన్రాలోకి మాత్రం రాదు. కథాంశం తక్కువా, అస్పష్టమైన కవిత్వం ఎక్కువా ఉన్న ఈ నవల నిజాయితీగా అనిపిస్తుంది. కెనడియన్ రచయిత్రి మిరియమ్ తియస్ దీన్లో కొటేషన్ మార్క్స్ ఉపయోగించరు. అందువల్ల, ఏ పాత్ర మాట్లాడుతోందో, అది పలికిన మాటో, ఆలోచనో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నవల ఆఖరున రచయిత్రి డి.హెచ్.లారెన్స్‌ను ఉటంకిస్తారు: ‘ఎన్ని ఆకాశాలు మీద పడ్డా సరే, మనం బతకక తప్పదు.’ ‘జీవితంతో అలిసిపోవడం వల్ల మరణాన్ని ఎంచుకోవడం సహేతుకమైనదేనా! మనం ప్రేమించే వారిపట్ల మనకే బాధ్యత ఉండదా?’ అన్న ఎన్నో ప్రశ్నలని పుస్తకం సంధిస్తుంది. చనిపోయే ఎంపికా, ఆత్మహత్యకు సంబంధించిన అవమానం ఎదురుకోవడం అన్న అంశాలు నవల నేపథ్యానికి ఆయువుపట్టు. బ్రిటనీ మేనార్డ్ మొదలుపెట్టిన ‘మరణించే హక్కు’ ఉద్యమం ఊపందుకున్న తరువాత, ఈ పుస్తకం 2014లో విడుదల అయింది. ఇది రచయిత్రి ఆరవ నవల. తియస్ పుస్తకాలు ఎక్కువగా మానసిక వ్యాధులకి సంబంధించినవే. ఈ స్వీయ చరిత్ర 2014లో ‘రోజర్స్ ట్రస్ట్ ఫిక్షన్’ బహుమతి పొంది,‘స్కాటియా బాంక్గిలర్’బహుమతికి షార్ట్ లిస్ట్ అయింది. తదుపరి రెండేళ్ళలో మరెన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. కృష్ణ వేణి -
ప్రతిధ్వనించే పుస్తకం
కాలాతీత వ్యక్తులు ఎలాంటివారు కాలాతీత వ్యక్తులు? డాక్టర్ పి.శ్రీదేవి రాసిన ఈ నవలలో ప్రధానంగా ఉన్నవి నాలుగు పాత్రలు. మేనమామ అదుపాజ్ఞల్లో బతికే వైద్యవిద్యార్థి ప్రకాశం, మంచివాడే కానీ పిరికివాడు. అవసరమైన సందర్భంలో కూడా తగిన తెగువ చూపకపోవడం వల్ల అటు కళ్యాణినీ ఇటు ఇందిరనూ ఇద్దరినీ నష్టపోతాడు. ఒద్దికగా ఉండే సున్నిత మనస్కురాలు కళ్యాణి. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న రకం. చదవడానికి చప్పగా కనిపించినా సాధారణంగా అందరికీ ఇట్టే నచ్చేపాత్ర. విలాస జీవితాన్ని గడిపినా సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడి తన వ్యక్తిత్వం చాటుకోగలిగే వ్యక్తి కృష్ణమూర్తి. ఇక నాలుగోదీ, ఎక్కువ చర్చకు గురయ్యే పాత్ర, ఇందిర. ఒక విధంగా ఇందిరకు అనుగుణంగానే, లేదా ఇందిర పూనుకోవడం వల్లనే ఈ పాత్రల జీవితాలన్నీ మలుపు తిరుగుతాయి. చిన్నప్పుడే మరణించిన తల్లి, బాధ్యత లేకపోవడమే కాకుండా దురలవాట్లు కూడా గల తండ్రివల్ల చిన్న ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తూ జీవితంలో చాలా త్వరగా రాటుదేలిన పాత్ర ఈమెది. అంత కష్టాల్లోనూ తన షికార్లు వదులుకోదు. మనకు నచ్చింది చెయ్యగలగాలి, సంఘానికి వెరవకూడదంటుంది. పూర్తి నలుపు తెలుపుగా కాకుండా సహజమైన ఆలోచనాధోరణితో నడిచే రక్తమాంసాలున్న పాత్ర. ఆత్మవిశ్వాసం, స్వార్థం, ఈర్ష్య, జిత్తు అన్నీ కనబడతాయి. ‘నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కనుంచి వెళ్లేవారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయను? ఎవరి మటుకు వారు చూసి నడిచి వెళ్లాలి’ అంటుంది. చాలామంది మనుషులు ఇందిరల్లాగే ఉంటారు; కానీ బయటికి ఒప్పుకోరు. రచయిత్రి అంతరంగం ఏమిటి? ఇలాంటివాళ్లే బతుకుతారనా? ఇలా బతికితేతప్ప ఈ సమాజంలో నెగ్గుకురాలేమనా? అలాగని ఇందిర తన అంతరంగానికి ముసుగు వేసుకునే రకం కాదు. ‘ఏ పని చేసినా నేను కళ్లు తెరిచి చేస్తాను. ఏడుస్తూ ఏదీ చేయను. ఏది జరిగినా ఏడవను. నాకూ తక్కినవాళ్లకూ అదే తేడా’ అంటుంది. అదే సమయంలో ‘నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం’ తనదని చెబుతుంది. ఇద్దరు పరస్పర భిన్న వ్యక్తిత్వాలు గల ఇందిర, కళ్యాణి పాత్రల ప్రయాణాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. ఆధునిక స్త్రీ తాను స్వతంత్రురాలినన్న పేరుతో మోయాల్సివస్తున్న బరువును దింపుకునే పరిస్థితి లేకపోవడమూ కూడా ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి చూపారేమో అనిపిస్తుంది. 1957–58 మధ్య ధారావాహికగా వచ్చిన ఈ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా వచ్చింది. రాయడంలో గొప్ప ప్రతిభ కనబరిచి, మూడు పదుల వయసులోనే మరణించిన ఈ నవలా రచయిత్రి పి.శ్రీదేవి (1929–61) కూడా కాలాతీత వ్యక్తే. డా‘‘ పి.శ్రీదేవి -
ఉత్తరం వెళ్లే రైలు
కొత్త బంగారం ‘తనకి 16 సంవత్సరాలో, పదిహేడో కోరాకి తెలియదు’ అంటూ కాల్సన్ వైట్‌హౌస్ ప్రారంభించిన ఈ నవల్లో, ప్రధాన పాత్రయిన కోరా– జోర్జా రాష్ట్రపు, రాండాల్ ప్లాంటేషన్‌లో ఉండే మూడవ తరపు(1812) బానిస. బానిసల హింస, ఉరితీతలు, మానభంగాలు సామాన్యం అయిన చోటు అది. కోరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్లాంటేషన్ నుండి తప్పించుకు పారిపోయి, పట్టుబడని ఒకే ఒక బానిస–ఆమె తల్లి. కోరా అమ్మమ్మ చరిత్ర కూడా ఉంటుంది నవల్లో. కోరా యజమానిది వక్ర బుద్ధి. కోరా స్వతంత్ర భావాలున్నది. కొత్త బానిస సీసర్ సలహాతో, అతనితోపాటు ఒక రాత్రి పారిపోయి, ఒక తెల్ల ‘స్టేషన్ ఏజెంట్’ సహాయంతో నేలమాళిగ రెయిలెక్కుతుంది. స్వేచ్ఛ వెతుక్కుంటూ పారిపోయే బానిసలకి సహాయపడేందుకు అభివృద్ధి చేయబడిన అండర్‌గ్రౌండ్ రెయిల్ రోడ్ యొక్క అనేకమైన సొరంగాల ద్వారా ప్రయాణిస్తూ– ప్రమాదాలనీ, ప్రతిఘటనలనీ ఎదుర్కుంటుంది. చదువూ,స్వేచ్ఛా గురించిన తన కలలను నిజం చేసుకునేటందుకు వాటన్నిటినీ తట్టుకుంటూ, అణిచివేత గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలున్న దక్షిణ రాష్ట్రాలనుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తుంది. ఆ ప్రక్రియలో, ఒక తెల్ల వ్యక్తిని చంపవలిసి వస్తుంది. కోరా పరుగు మీద నుంచి దృష్టి మళ్ళించకుండానే రచయిత అనేకమైన ఇతర పాత్రలనీ, వారి దృష్టి కోణాలనీ, అంతర్గత జీవితాలనీ కనపరుస్తారు. ‘తనకీ ప్లాంటేషన్కీ మధ్యనున్న ప్రతీ మైలూ ఒక విజయమే’ అనుకున్న కోరా ఏ చోటూ భద్రమైనది కాదని గ్రహిస్తుంది. తను అడుగు పెట్టిన ప్రతీ రాష్ట్రంనుంచీ నేర్చుకుంటూ– మానసికంగా, తాత్వికంగా ఎదుగుతుంది. సౌత్ కారొలీనా వెళ్ళినప్పుడు కొత్త పేర్లూ, కొత్త గుర్తింపూ ఉన్న నూతన జీవితాలు మొదలెడతారు కోరా, సీసర్. అక్కడే సీసర్ హత్య జరుగుతుంది. పారిపోయిన బానిసలని తిరిగి తెచ్చే రిజ్వే గతంలో కోరా తల్లిని వెతకడంలో విఫలుడైన వ్యక్తి. అతనిప్పుడు కోరాని వెంబడిస్తాడు. మొదటిసారి ఆమె తప్పించుకుంటుంది. రెండోసారి అతన్ని రెయిలు మెట్లమీద నుంచి తోసి, గాయపరిచి– పట్టాలమీదగా పారిపోయి, నేలమాళిగ నుండి బయటకి వచ్చి– పశ్చిమదిక్కుగా ప్రయాణిస్తున్న బిడారుతో కలిపి వెళ్ళిపోతుంది. పారిపోయే వారికి సహాయం చేసేవారిని ‘కండక్టర్స్’ అనీ, బానిసలని ‘కార్గో’ అనీ పిలుస్తారు. ఈ నవల చారిత్రాత్మక వాస్తవికత యొక్క కాల్పనిక వృత్తాంతం. ఆనాటి రెయిలు వ్యవస్థకి ఆధునిక సౌకర్యాలని కలిపిస్తారు వైట్‌హౌస్. బానిసల మనస్తత్వాలని సూక్ష్మంగా వ్యక్తీకరిస్తారు. నిషేధించబడిన ‘నీగ్రో, నిగ్గర్’ అన్న మాటలని రచయిత వాడతారు. రచయిత మాటల్లో: ‘మనం గతాన్ని నిర్లక్ష్యపెట్టలేం. భయం సృష్టించడంతో గతాన్ని పునరావృతం చేయలేం. వర్తమానాన్ని గుర్తిస్తూ, గతంతో పాటు జీవించక తప్పదు... సమస్యకి పరిష్కారం ఉండే వీలు లేదు కనుక కథకీ పరిష్కారం లేదు. అమెరికాలో నల్లవారిగా ఉండటం అనేది ఏ విధమైన ముగింపుకీ చేరలేదు.’ రాయడానికి రచయితకి 16 సంవత్సరాలు పట్టిన ఈ నవలని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, టీవీ ప్రయోక్త ఓప్రా విన్ఫ్రే చదివారు. ఇది వైట్‌హౌస్ ఆరవ నవల. మాజికల్ రియలిజం పద్ధతిలో ఉండి, ప్రథమ పురుష స్వరంతో కొనసాగుతుంది. 2016లో అచ్చయి, అదే యేడు ‘నేషనల్ బుక్ అవార్డ్ ఆఫ్ ఫిక్షన్’ పొందింది. 2017లో పులిట్జర్ అవార్డు గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణవేణి -
ప్రతిధ్వనించే పుస్తకం
సాహిత్యంలోకి ఒక వురుములా, మెరుపులా ప్రవేశించాడు వడ్డెర చండీదాస్. తొలి నవలతోనే సంచలనం సృష్టించాడు. ప్రత్యేకమైన వచనమూ, అంతే ప్రత్యేకమైన జీవితపు చూపూ ఆయన్ని కూడా అంతే ప్రత్యేకమైన రచయితగా నిలబెట్టాయి. ‘గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని –– అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి; యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె’తో ఆయన రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల ‘హిమజ్వాల’. ప్రమాదవశాత్తూ పరిచయమైన కృష్ణచైతన్య, గీతాదేవిల బంధం ఏవో పురా పాపభీతుల కారణంగా ఏ తీరమూ చేరదు. తదుపరి పరిణామాల్లో శివరాం వైవాహిక సంకెళ్లలో గీతాదేవి బందీయవుతుంది. వారిరువురిలోని రసభేదాలు ఆ బంధాన్ని బీటలు వారుస్తాయి. ప్రకృతిలో పురివిప్పే నెమలికీ, దానికో కోక కప్పాలని చూసే అతడికీ మధ్య ఏమీ మిగలదు. అనంతరం, వయసు మళ్లిన విజయసారథి ఆమెను అంతరంగంలోకి ఆహ్వానిస్తాడు. మరోవైపు, గాలికి కొట్టుకుపోయిన కృష్ణచైతన్యకు రోగి చిదంబరరావుతో పరిచయం కావడం, ఆయన భార్యతో సంబంధం ఏర్పడటం, అనూహ్యంగా రోగి కోలుకోవడం, మరోసారి గాలికి విసరివేయబడి తండ్రి మరణవార్తతో ఇల్లు చేరడం, అక్కడ తండ్రి సహచరిగా గీతాదేవి కనబడటం, ప్రియుడిగా మారబోయిన కృష్ణచైతన్యను ఆమె అంగీకరించకపోవడం, పిచ్చివాడైన శివరాం తలతో మోది తాను చస్తూ గీతాదేవిని చంపేయడం... హిమజ్వాలను రెండు పొరల్లో అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ఒక పొర: మనుషుల చర్యలకు ఏ ప్రత్యేక అర్థం లేదనీ, జీవితాలు ఊరికే గాలికి కొట్టుకుపోయేవేననీ, అలా కొట్టుకుపోకుండా నిలిచిన ఆ కాస్త కాలంలో మాత్రం నేలను గట్టిగా తొక్కిపట్టడానికి ప్రయత్నిస్తాయనీ చెప్పినట్టనిపిస్తుంది. రెండో పొర: ఆ తొక్కిపట్టిన ఆ కొద్ది కాలంలో కూడా తాగడానికి రసం నిండిన పాత్రొకటి సిద్ధంగా ఉన్నదనీ, దాన్ని వృథాగా ఒలకబోసుకోకూడదనీనూ! ‘సరోవరం లాంటి హృదయంలో ఉండాల్సిన నేను నీ గాజు గుండెలో ఉండాలని కోరుకోనని తెలియదేమో నీకు! నువ్వొక కాగితం పువ్వువి. నాక్కావలసిన పరిమళం లభ్యం కాదు. నువ్వొక రంగు పువ్వులు చెక్కిన గాజు హృదయానివి. కానీ నాక్కావల్సింది పచ్చని పచ్చిక హృదయం. ప్రపంచంలో ఏ ఒక్కరి కోసమూ నన్ను నేను వంచించుకోలేను. కానీ ఒక్క రసస్పందనకోసం, ఒక్క వెన్నెల కోసం, రసహృదయపు లోలోతుల పలవరింతల కోసం నా సర్వస్వాన్ని అర్పించుకోగలను’ అంటుంది గీతాదేవి. ‘నీటిబుడగ చిట్లినట్లుగా’, ‘తారు పూసినట్టు ఆకాశంలో మబ్బులు’, ‘పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగకొద్దీ కాల్చి – అక్కడికీ కసి తీరక దోసిళ్ళతో మసియెత్తి గాలిలోకి యెగబోసి, వెళ్ళిపోయాడు సూర్యుడు’ లాంటి వాక్యాలు బుచ్చిబాబును గుర్తు చేస్తాయి. నవల కూడా ఆయనకే అంకితం ఇచ్చాడు. -
ఎమ్, ఆమె భర్త, వారి పిల్లలు
కొత్త బంగారం మహీమ్(ముంబయి)లో ఒక పడగ్గదీ, వంటిల్లూ, హాలూ ఉన్న అపార్టుమెంట్లో గోవా నుంచి వచ్చిన రోమన్ కాథలిక్కులయిన మెండాస్ కుటుంబం నివసిస్తుంది. ఎమెల్డా, ఆగస్టీన్ దంపతులూ, కూతురైన సూసన్, పేరులేని కథకుడైన కొడుకూ. పిల్లలు ముద్దుగా పిలిచే ఎమ్ అన్న తల్లి ఎమెల్డా, కొడుకు పుట్టిన తరువాత, ‘బైపొలార్’ వ్యాధికి గురవడంతో నవల మొదలవుతుంది. తరచూ హాస్పిటల్ పాలవుతూ ఉంటుంది. బిగ్ హుమ్ అనబడే భర్త ఆగస్టీన్ ప్రభుత్వ ఉద్యోగి. ‘ఎమ్ అండ్ ద బిగ్ హుమ్’ నవల, ఆ చిన్న ఇంట్లో పెరిగి పెద్దవుతున్న కొడుకు గొంతుతో వినిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యనున్న దుఃఖం, హాస్యం, ఒకరినొకరు పూర్తిగా అంగీకరించడం, ఎమ్ వల్ల ఆ కుటుంబమే తిరిగి ఛిన్నాభిన్నం అవడాన్నీ సహజంగా చిత్రీకరిస్తారు జెరీ పింటో. నిగ్రహవంతుడైన తండ్రి కుటుంబాన్ని కలిపి ఉంచి– వంటలూ, ఇంటి పనులూ చేస్తుంటాడు. దంపతుల మధ్య కనపరిచే ప్రేమ మనసును తాకుతుంది. మానసిక రోగం గురించి రచయిత రాసిన మాటలు కవితాత్మకంగా ఉంటాయి. విషాదం కనిపించదు. ఎమ్– టీలు కాస్తూ, బీడీలు పీలుస్తూ, తన శృంగారపు జీవితం గురించి పిల్లలకి చెప్తూ, ఎవరూ అడక్కపోయినప్పటికీ తెలివైన సలహాలిస్తూ ఉంటుంది. తన పిచ్చితనపు దశలో ఉన్నప్పుడు ఆమె సంభాషణ విచిత్రంగా, అసభ్యంగా ఉంటుంది. ఆ సంభాషణలు గుండెని మెలిపెడతాయి. ఆత్మహత్యా ప్రయత్నాలూ చాలానే చేస్తుంది. పాదరసంలా మారే ఎమ్ మనఃస్థితిని అర్థం చేసుకునేటందుకు పూర్తి కుటుంబం నిస్వార్థంగా ప్రయత్నిస్తుంది. మానసిక రోగానికి గురయ్యే ముందు, తండ్రి హుమ్ ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుని– దుఃఖంలో, విషాదంలో తనకి ఊతగా నిలిచిన ఎమ్ అనే ఈ తన తల్లి ఎవరా? అని కొడుకు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. అతను తల్లి జీవితపు బాటని అనుసరిస్తున్నప్పుడు పాఠకులకి కూడా ఆమె గురించిన వైవిధ్యమైన, అస్పష్ట భావాలు కలుగుతాయి. నవల వర్తమానానికీ, గతానికీ మధ్య చాలా సులభంగా మారుతూ– మానసిక స్థితి సరిగ్గాలేని తల్లితో పాటు ఉండి, పెరిగిపెద్దవుతున్న ఒక కుర్రాడి స్వాభావిక నొప్పిని వర్ణిస్తుంది. ఆ నొప్పికింద సున్నితమైన హాస్యం ఉంది. ఎమ్‌కి ప్రతీదాన్నీ ఒక భిన్నమైన దృష్టికోణంతో, ఒక వ్యంగ్య ధోరణితో చూసే సామర్థ్యమూ ఉంది. నవల– ఎమ్ మెదడులో ఉన్న చీకటి భాగాల ద్వారా ప్రయాణిస్తూ, ఇబ్బందికరమైన ప్రశ్నలని సంధిస్తుంది. వాటివల్ల మనం ‘పిచ్చి’ వాళ్ళనబడేవాళ్ళని కొత్త దృష్టికోణంతో చూడగలుగుతాం. పుస్తకం సామాజిక నిబంధనలని ప్రశ్నిస్తుంది. నాటకీయత తక్కువ మోతాదులో ఉన్నది. నవలకున్న బలం దానిలో ఉన్న సూక్ష్మభేదానిది. కథ ఎమ్ వ్యాధి ప్రాధాన్యతను వక్కాణించి చెప్పదు. ఆమెకోసం పిల్లలు చేసే త్యాగాలనీ వర్ణించదు. కథనం సరళంగా, స్ఫుటంగా, హాస్యంగా ఉంటుంది. జర్నలిస్టూ, రచయితా అయిన పింటో రాసిన ఈ నవలకి సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చింది. 2012లో అచ్చయిన ఈ పుస్తకానికి ఆయన విండెన్ కేంబెల్ బహుమతి కూడా పొందారు. - క్రిష్ణవేణి -
కావ్యం మీద తిరుగుబాటు నవల
సాహిత్య సభలకు ప్రజలు రారనే అపప్రదని ఈ ప్రపంచ తెలుగు మహాసభలు పటాపంచలు చేశాయని రచయిత అంపశయ్య నవీన్ వ్యాఖ్యానించారు. ఆయన అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో నవలా సాహిత్యంపై విస్తృతంగా చర్చ జరిగింది. కవిత్వం మీద చేసిన తిరుగుబాటు నవల అనీ, అంతకుముందున్న ప్రబంధాలూ, కావ్యాలూ కొన్ని వర్గాలకే సొంతం అయినా నవల అందరికీ సాహిత్యాన్ని చేరువ చేసిందని సదస్సు అభిప్రాయపడింది. యశోదారెడ్డి నవలల్లో తెలంగాణ గ్రామీణ భాష, యాస, శ్వాసలుగా నిలిచాయని వక్తలు ప్రశంసించారు. కాసుల ప్రతాపరెడ్డి నవలా సాహిత్యం– తొలిదశను వివరిస్తూ కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ తొలి నవల అన్నారు కానీ అది ఓ ఇంగ్లీషు నవలకి అనుసరణ మాత్రమేననీ, ఒద్దిరాజు∙సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి తొలి నవల అనీ అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణమూర్తి, అటవీశాఖా మంత్రి జోగు రామన్న, వి.శంకర్, త్రివేణి హాజరైన ఈ నవలా సాహిత్య సదస్సు మంచి నవలల ఆవశ్యకతను చాటిచెప్పింది. -
డిటెక్టివ్ పాత్రలో ఎన్టీఆర్
జై లవ కుశ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడట. 80లలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆ నవల హక్కులను కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ.. కూడా నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే. దీంతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా నవల ఆధారంగానే తెరకెక్కనుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి ఈప్రచారాలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
నవలలో బూతు కంటెంట్, సెన్సార్ ఏం చేస్తోంది?
రియాద్ : సౌదీ అరేబియాలో ఓ మహిళా రచయిత రాసిన నవల వివాదాస్పదంగా మారింది. అశ్లీలత ఉందంటూ దానిని చదివినవారు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ నవలను ప్రభుత్వం రద్దు చేసి, కాపీలను వెనక్కి రప్పించింది. బద్రియా అల్ బిష్ర్ మహిళల హక్కుల ఉద్యమకారిణి. రచయితగా తన పుస్తకాలకు గతంలో చాలా అవార్డులు గెలుచుకున్నారు కూడా. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ నవల రాశారు. ‘‘ఓ యువతి కొందరు మహిళల కష్టాలను తెలుసుకునేందుకు చేసే ప్రయాణం.. అందులో ఆమెకు ఎదురైన అనుభవాలతో’’ ఆ నవల కథ ఉంది. అయితే అందులో కొంత భాగం శృంగార నేపథ్యంతో కూడుకుని ఉందంట. కొందరు పాఠశాలు విషయాన్ని వెలుగులోకి తేగా.. మత పెద్దలు మండిపడ్డారు. దీనికి తోడు పెద్దలకు మాత్రమే గా పరిగణించాల్సిన ఈ నవలను చిన్న పిల్లల గ్యాలెరీలో పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పుస్తకాన్ని వెనక్కి రప్పించి, విచారణకు ఆదేశించారు. కాగా, ఈ విమర్శలపై స్పందించేందుకు బిష్ర్ అందుబాటులో లేరు. చట్టాలు చాలా కఠినంగా ఉండే సౌదీలో పుస్తకాలు, మాగ్జైన్, జర్నల్స్ కూడా సెన్సార్ అవుతుంటాయి. మరి ఈమె నవల సెన్సార్ చేసుకోకుండానే మార్కెట్లోకి వచ్చిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా
రెగ్యులర్‌గా మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రూట్ మార్చి చేసిన తొలి చిత్రం టెంపర్. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించిన టెంపర్ ఘనవిజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్‌ను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు కథను మరింత మంది పాఠకులకు అందించనున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కథను ఇంగ్లీష్ నవలగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా కష్టపడి వంశీ నవలను సిద్ధం చేశాడు. అయితే ఈ నవలలో క్లైమాక్స్‌ను సినిమాకు భిన్నంగా రాశాడట. ప్రస్తుతానికి ఆ క్లైమాక్స్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్. -
కళాపూర్ణోదయం ‘పద్యనవల’
భువన విజయ ప్రసంగాలలో డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం కల్చరల్ : అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయాన్ని పద్యనవలగా చెప్పుకోవచ్చని ఆంధ్రపద్యకవితా సదస్సు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. నన్నయ వాజ్ఞ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీకళాశాలలో జరుగుతున్న భువన విజయ సాహితీప్రసంగ పరంపరలలో భాగంగా బుధవారం ఆయన 'కళాపూర్ణోదయం–కథాకథనం' అనే అంశంపై ప్రసంగించారు. కళాపూర్ణోదయంలో ఆధునిక నవలా లక్షణాలు అన్నింటినీ చూడవచ్చని, కథాకథనం ఉత్కంఠభరితంగా సాగుతుందన్నారు. సరస్వతీచతుర్ముఖుల రహస్య క్రీడను తీసుకుని, ఎనిమిది ఆశ్వాసాలు, 1800 పద్యాలలో పింగళి సూరన ఈ ప్రబంధాన్ని రచించాడని ఆయన పేర్కొన్నారు. కళాపూర్ణోదయంలో పదిమందికి ఉపయోగపడని విద్య నిరర్ధదకమనే సందేశాన్ని కవి తన రచన ద్వారా సమాజానికి అందించాడని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘కేవల కల్పనాకథలు కృత్రిమరత్నములు’ అని భట్టుమూర్తి సాటికవి పింగళి సూరనను ఆక్షేపించాడని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ఈ ఆక్షేపణను తిప్పికొట్టాడని, కల్పననే సరస్వతీ విలాసంగా, ఒక అద్భుత కథనంగా పింగళి సూరన మలిచాడని పేర్కొన్నాడని వెంకటేశ్వరరావు విరించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రాచార్యశలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ మేధకు పదునుపెట్టే గ్రంథం కళాపూర్ణోదయమన్నారు. ముఖ్య డాక్టర సప్పాదుర్గాప్రసాద్ ప్రసంగించారు. నన్నయ వాజ్ఞ్మయవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చింతలపాటి శర్మ కార్యదర్శి నివేదికను సమర్పించారు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ఎం.వి.రాజగోపాల్ స్వాగతవచనాలు పలికారు. సాహిత్యాభిమానులు హాజరయ్యారు. నేడు పాండురంగమహాత్మ్యంపై ప్రసంగం భువన విజయ సాహితీప్రసంగాలలో భాగంగా గురువారం సాహితీవేత్త కర్రా కార్తికేయశర్మ పాండురంగ మాహాత్మ్యంపై ప్రసంగిస్తారు.