కాలాతీత వ్యక్తులు
ఎలాంటివారు కాలాతీత వ్యక్తులు? డాక్టర్ పి.శ్రీదేవి రాసిన ఈ నవలలో ప్రధానంగా ఉన్నవి నాలుగు పాత్రలు. మేనమామ అదుపాజ్ఞల్లో బతికే వైద్యవిద్యార్థి ప్రకాశం, మంచివాడే కానీ పిరికివాడు. అవసరమైన సందర్భంలో కూడా తగిన తెగువ చూపకపోవడం వల్ల అటు కళ్యాణినీ ఇటు ఇందిరనూ ఇద్దరినీ నష్టపోతాడు. ఒద్దికగా ఉండే సున్నిత మనస్కురాలు కళ్యాణి. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న రకం. చదవడానికి చప్పగా కనిపించినా సాధారణంగా అందరికీ ఇట్టే నచ్చేపాత్ర. విలాస జీవితాన్ని గడిపినా సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడి తన వ్యక్తిత్వం చాటుకోగలిగే వ్యక్తి కృష్ణమూర్తి.
ఇక నాలుగోదీ, ఎక్కువ చర్చకు గురయ్యే పాత్ర, ఇందిర. ఒక విధంగా ఇందిరకు అనుగుణంగానే, లేదా ఇందిర పూనుకోవడం వల్లనే ఈ పాత్రల జీవితాలన్నీ మలుపు తిరుగుతాయి. చిన్నప్పుడే మరణించిన తల్లి, బాధ్యత లేకపోవడమే కాకుండా దురలవాట్లు కూడా గల తండ్రివల్ల చిన్న ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తూ జీవితంలో చాలా త్వరగా రాటుదేలిన పాత్ర ఈమెది. అంత కష్టాల్లోనూ తన షికార్లు వదులుకోదు. మనకు నచ్చింది చెయ్యగలగాలి, సంఘానికి వెరవకూడదంటుంది. పూర్తి నలుపు తెలుపుగా కాకుండా సహజమైన ఆలోచనాధోరణితో నడిచే రక్తమాంసాలున్న పాత్ర. ఆత్మవిశ్వాసం, స్వార్థం, ఈర్ష్య, జిత్తు అన్నీ కనబడతాయి. ‘నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కనుంచి వెళ్లేవారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయను? ఎవరి మటుకు వారు చూసి నడిచి వెళ్లాలి’ అంటుంది.
చాలామంది మనుషులు ఇందిరల్లాగే ఉంటారు; కానీ బయటికి ఒప్పుకోరు. రచయిత్రి అంతరంగం ఏమిటి? ఇలాంటివాళ్లే బతుకుతారనా? ఇలా బతికితేతప్ప ఈ సమాజంలో నెగ్గుకురాలేమనా? అలాగని ఇందిర తన అంతరంగానికి ముసుగు వేసుకునే రకం కాదు. ‘ఏ పని చేసినా నేను కళ్లు తెరిచి చేస్తాను. ఏడుస్తూ ఏదీ చేయను. ఏది జరిగినా ఏడవను. నాకూ తక్కినవాళ్లకూ అదే తేడా’ అంటుంది. అదే సమయంలో ‘నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం’ తనదని చెబుతుంది.
ఇద్దరు పరస్పర భిన్న వ్యక్తిత్వాలు గల ఇందిర, కళ్యాణి పాత్రల ప్రయాణాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. ఆధునిక స్త్రీ తాను స్వతంత్రురాలినన్న పేరుతో మోయాల్సివస్తున్న బరువును దింపుకునే పరిస్థితి లేకపోవడమూ కూడా ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి చూపారేమో అనిపిస్తుంది. 1957–58 మధ్య ధారావాహికగా వచ్చిన ఈ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా వచ్చింది. రాయడంలో గొప్ప ప్రతిభ కనబరిచి, మూడు పదుల వయసులోనే మరణించిన ఈ నవలా రచయిత్రి పి.శ్రీదేవి (1929–61) కూడా కాలాతీత వ్యక్తే.
డా‘‘ పి.శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment