కొత్త బంగారం
మారిలిన్ రాబిన్సన్ ‘లైల’ నవల, ఐవా రాష్ట్రంలో కాల్పనిక ఊరైన గిలియడ్ నేప«థ్యంగా రాసినది. చింకి బట్టలు తొడుక్కున్న నాలుగో, ఐదో ఏళ్ళున్న లైల తన ఇంటి బయట చలికి వణుకుతూ, ఏడుస్తూ కనబడ్డప్పుడు–స్థిరత్వం లేని కుటుంబం నుంచి ఆ పిల్లని దొంగిలించి, కాపాడిన డాల్‌తో నవల ప్రారంభం అవుతుంది.
‘డాల్ ప్రపంచంలో అతి ఒంటరి స్త్రీ అయి ఉండవచ్చు. లైల ఒంటరి పిల్ల. ఇద్దరూ వర్షంలో ఒకరినొకరు వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తూ కలిసి ఉన్నవారు’ అంటారు రచయిత్రి. ఒక చోటనుండి మరొక దానికి మారుతూ, దొరికిన రోజు తింటూ, లేనినాడు పస్తులుంటూ ఉన్నప్పుడు కూడా వారిద్దరి జీవితాల్లో ప్రేమకి కొదవుండదు. దశాబ్దాలు గడుస్తాయి. డాలీ చేసిన హత్యవల్ల ఆమె జైల్లో పడ్డాక, లైల వేశ్యాగృహంలోకి ప్రవేశిస్తుంది. అయితే, ఆమె రూపురేఖలు ఆకర్షణీయంగా లేకపోవడంతో అక్కడ ఎక్కువ కాలం మనలేకపోతుంది.
లాస్ ఏంజెలెస్లో ఒక చిన్న గుడిసెలో తల దాచుకుని, పక్కనే ఉన్న గిలియడ్ ఊరుకి వెళ్ళినప్పుడు, కురుస్తున్న వానని తప్పించుకుంటూ లైల చర్చిలోకి అడుగు పెడుతుంది. అక్కడ ఫాదరీ అయిన 67 ఏళ్ళ జాన్ ఏమ్స్‌ను కలుసుకుంటుంది. తన ఒంటరితనం ఇంక దూరం అయే అవకాశమే లేదనుకున్న ఏమ్స్‌కీ, సంవత్సరాల శ్రమనోడ్చి, ఒంటరితనం అంటే ఏమిటో తెలిసి, ఎవరినీ నమ్మే స్వభావం లేకపోయి, కత్తి తన స్టాకింగ్స్‌లో దాచుకుని తిరిగే లైలకీ స్నేహం కుదురుతుంది. అతన్ని కలుసుకోడానికి తరచూ అతని ఇంటికి వెళ్తుంది. పురిట్లో చనిపోయిన అతని భార్యా, కొడుకూ సమాధులని శుభ్రం చేయడం మొదలెడుతుంది.
సంకోచంతో, లాంఛనప్రాయంగా మొదలయిన వారి స్నేహం, ఆకర్షణగా మారి పెళ్ళి చేసుకుంటారు. వారి మధ్యపెంపొందుతున్న సాన్నిహిత్యానికి వారి గతాలు అడ్డం పడుతూ ఉంటాయి.అతను బైబిల్ గురించి చెప్తూ ఉండే మాటలు ఆమెకి అర్థం కావు. మతం, విశ్వాసం గురించి నేర్చుకుంటూ– భర్తని నమ్మే సమర్థత తనకి లేదనుకుంటూనే లైల అతని మీద నమ్మకం ఏర్పరచుకుంటుంది. గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డమీద తన గతం ప్రభావం చూపుతుందేమోనని భయపడినా, తండ్రి ప్రభావం పడితే చాలనుకుంటుంది. కొడుకు పుట్టిన తరువాత, తల్లితనం వల్ల ఉపశమనం పొందుతుంది.
కథనం ప్ర«థమ పురుషలో, చైతన్య స్రవంతిలో సాగుతుంది. నవలంతటా బైబిల్యుతమైన భాష కనిపిస్తుంది.
రచయిత్రి స్వరం సరళతకూ, నిస్పృహతత్వానికీ మధ్య ఊగిసలాడుతూ–తేలికైన హాస్యాన్నీ, తీవ్రమైన భావోద్వేగాన్నీ సమపాళ్ళల్లో కనబరుస్తుంది. లైల, ఏమ్స్ మధ్య జరిగే సంభాషణలు– గతం, ఉనికి, జీవితానికున్న అర్థం మీద కేంద్రీకరిస్తాయి. అవే నవలకి ఆయువు పట్టు. ‘ఉనికిలో ఉంటూ ప్రేమలో పడిన పాత్రలు కావు వారిద్దరివీ. ప్రేమలో పడ్డానికి ఉనికిలో ఉన్నవి’ అంటారు రచయిత్రి.
2014లో అచ్చయిన ఈ నవల రాబిన్సన్ రాసిన నాలుగవది. గిలియడ్ ట్రియోలజీకి మూడవ భాగం. కథాకాలం 1920.
2014లో ‘నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్’ పొంది, 2015లో ‘మాన్ బుక్ ప్రైజ్’కు లాంగ్ లిస్ట్ అయిన ఈ నవల, మరెన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment