మొగులు మీద చక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ట్రాఫిక్‌తోని తొవ్వలు మెస్ల రాకుంటున్నయి. జెనంతోని సిన్మ తేటర్లు చీమల పుట్ట లెక్కున్నయి. పొద్దు మీకింది. ఇంటికి పోబుద్ది గాని సర్కార్ జీతగాల్లు హోటల్ల గూసోని ముచ్చట బెడ్తున్నరు. గుడికాడ బిచ్చపోల్లు బిచ్చమడుక్కుంటున్నరు. ఒక్కపారే సిటీ బస్సులు సొల్పుత బోతున్నయి. ఎప్పటి తీర్గనే చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మా దోస్తుల అడ్డ. గాడ పాన్లు దినెటోల్లు పాన్లు దింటరు. సిగిలేట్లు దాగెటోల్లు సిగిలేట్లు దాగుతరు. పాన్ డబ్బకు జెర్రంత దూరంల ఛాయ్ బండి ఉన్నది. గాడ ఛాయ్ దాగెటోల్లు పాన్లు, సిగిలేట్ల కోసం పాన్ డబ్బ కాడ్కి వొస్తుంటరు.
పొద్దు మీకంగనే మా దోస్తులు పాన్ డబ్బ కాడ జమైతరు. సిగిలేట్లు దాక్కుంట, పాన్లు దినుకుంట ముచ్చట బెడుతుంటరు. గా దాని మీద గీ దాని మీద అనకుంట అన్నిటి మీద గాల్లు ముచ్చట బెడుతుంటరు. గని ఎక్వ రాజకీయాల మీదనే మాట్లాడు తుంటరు. రాజకీయాల మీద మాట్లాడుకుంట నువ్వెంత అంటె నువ్వెంత అనుకుంట మాటలతోనే కొట్లాడుతుంటరు. గా దినం నేను బోక ముందు గాల్లు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గాల్లు గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు.
‘‘మా వాడకట్టుల గుంత బడ్డది’’ అని యాద్గిరి అన్నడు.
‘‘గుంత బడ్తె ఏమైంది?’’ అని సత్నారి అడిగిండు.
‘‘గుంతల బడి మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబ్ గాబట్టినయి.’’
‘‘జెనంకు ఏం గాలేదా?’’
‘‘ఎవలన్న గుంతల బడ్తె కాల్లు, చేతులు ఇర్గబట్టినయి. వాన బడెతల్కె గా గుంత నీల్లతోని నిండింది.’’
‘‘నీల్ల తోని నిండితె ఏమైంది?’’
‘‘గుంత నీల్లతోని నిండ బట్కె దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపబట్టినయి.’’
‘‘గుంతను పూడ్పిచ్చెతంద్కు మీరు కోషిస్ జెయ్యలేదా?’’
‘‘ఎందుకు జెయ్యలేదు. చేసినం.’’
‘‘ఏం జేసిండ్రు?’’
‘‘సక్కగ మా ఎమ్మెల్యె తాన్కి బోయినం.’’
‘‘పోయి ఏం జెప్పిండ్రు?’’
‘‘మా వాడకట్టుల గుంతబడ్డది. గా దాంట్ల ఎవలన్న బడితె కాల్లు చేతులు ఇర్గుతున్నయి. గుంతను పూడ్పియ్యండ్రి అని అన్నం.’’
‘‘గాయిన ఏమన్నడు?’’
‘‘కాల్లు చేతులు ఇర్గితె ఏం జేస్తున్నరు అని అడిగిండు.’’
‘‘మీరేం జెప్పిండ్రు?’’
‘‘డాక్టర్ తాన్కి బోయి పట్టి గట్టిచ్చుకుంటున్నం అని జెప్పినం.’’
‘‘చెప్తె గాయినేమన్నడు?’’
‘‘పట్టిగట్టినందుకు డాక్టర్‌కు ఫీజు ఇస్తున్నారా లేదా అని అడిగిండు.’’
‘‘మీరేమన్నరు?’’
‘‘ఇస్తున్నం అని జెప్పినం.’’
‘‘గాయినేమన్నడు?’’
‘‘మీరు ఫీజు ఇయ్య బట్కె డాక్టర్ బత్కుతున్నడు అని గాయిన అన్నడు.’’
‘‘గుంతల బడె బట్కె మోటర్ సైకిల్లు, స్కూటర్లు కరాబైతున్నయని మా ఎమ్మెల్యెకు జెప్పినం.’’
‘‘చెప్తె గాయినేమన్నడు?’’
‘‘స్కూటర్లు కరాబైతె ఏం జేస్తరు అని గాయిన అడిగిండు.’’
‘‘సక్కగ మెకానిక్ తాన్కి బోతం అని జెప్పినం.’’
‘‘మెకానిక్ తాన్కి బోయి స్కూటర్లు, మోటర్ సైకిల్లు బాగ జేపిచ్చుకొని ఏం జేస్తరు?’’
‘‘బాగ జేసినందుకు మెకానిక్‌కు రూపాయలిస్తం.’’
‘‘మీరు రూపాయలియ్యబట్కెనే మెకానిక్ బత్కుతున్నాడు.’’
‘‘వాన బడె బట్కె గుంత నీల్లతోని నిండింది.’’
‘‘నీల్లతోని నిండితె ఏమైతది?’’
‘‘దోమలొచ్చినయి. గవ్వి మమ్ములను కుట్టి కుట్టి సంపు తున్నయి. దోమలు కుట్టె బట్కె రోగాలొస్తున్నయి.’’
‘‘రోగాలొస్తె మీరేం జేస్తున్నరు?’’
‘‘డాక్టర్ల తాన్కి బోతున్నం.’’
‘‘డాక్టర్లు మీకు ఇలాజ్ జేస్తున్నరు. ఇలాజ్ జేసినందుకు గాల్లకు ఫీజు ఇస్తున్నరు. గాల్లు మీకు మందులు రాస్తున్నరు.
మందుల దుక్నంల మీరు మందులు గొంటున్నరు. మీరు ఫీజు ఇయ్యబట్కె డాక్టర్లు, మందులు గొన బట్కె మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంత జెయ్య బట్కె మెకానిక్‌లు, డాక్టర్లు,
మందుల దుక్నపోల్లు బత్కుతున్నరు. గుంతను పూడ్పిస్తె గింత మంది పొట్ట గొట్టినట్లు గాదా?’’ అని మా ఎమ్మెల్యె అడిగిండు: ‘గుంతలు లేని వాడకట్టులల్ల గుంతలు తోడ్పిస్తమని జెప్పిండు.’ అని యాద్గిరి అన్నడు.
‘‘మొన్న కేటీఆర్ పుట్టిన దినాన కొంతమంది టమాటలు
పంచి పెట్టిండ్రు.’’
‘‘టమాటలు పంచి పెట్టుడు అంటె బంగారంను పంచి పెట్టుడే.’’
‘‘దమ్ముంటె కాంగ్రెస్ గాల్ల సీఎం క్యాండిడేట్ ఎవలో
ముందుగాలే జెప్పాలె అని కేసీఆర్ అన్నడు.’’
‘‘దమ్ముంటె బీఆర్‌ఎస్ సిట్టింగ్లందర్కి ఎమ్మెల్యె టికిట్ ఇయ్యాలని రేవంత్ రెడ్డి అన్నడు.’’
గీ తీర్గ మా దోస్తులు ముచ్చట బెట్టిండ్రు.
తెలిదేవర భానుమూర్తి, రచయిత సీనియర్ జర్నలిస్ట్ - 99591 50491
Comments
Please login to add a commentAdd a comment