నేడు ప్రజాకవి కాళోజీ జయంతి..
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత– అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన సమరశీలి; సామాజిక స్పర్శతో కవిత్వాన్ని పునీతం చేసిన ప్రజాకవి కాళోజీ! ప్రజా ఉద్య మాల్లో పాల్గొని అన్యాయాన్ని కవిత్వ కరవాలంతో ఎదిరించి ప్రశ్నించి నిలదీసిన ధీశాలి. నిజాం రాజును ఆత్మస్థైర్యంతో ఎదిరించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాటను నిర్దేశించిన యోధుడాయన. తనను వదిలేసుకొని ఇతరుల మంచి కోసం పోరాడే సామాజిక స్పృహ, నిరంతర తపన కాళోజీలో ఉన్నాయి. పీడిత, తాడిత ప్రజల గుండెల్లో పోరాటపు పుప్పొడిని చల్లి కవిగా నిలిచి పోయారు. మాటల్లో, చేతల్లో, ప్రవ ర్తనలో, వేషభాషల్లో, ఆలోచ నలో, ఆర్తిలో, ఆవేదన – సంవే దనల్లో తెలంగాణ తనాన్ని విని పించి, కనిపింపజేసిన ఆయన అసాధారణ కవి. ప్రజల్లోకి బలంగా తన కవిత్వాన్ని తీసు కెళ్లిన కాళోజీని మహాకవి దాశరథి ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ అని అభివర్ణించారు. ఉద్యమ ప«థ నిర్దేశం చేసి చిరకాల కవిత్వాన్ని కాళోజీ ప్రజలకు మిగిల్చారు.
సమాజ గొడవను తన గొడవగా మార్చు కొని ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయి. దేశీయ దృక్పథం, ప్రాంతీయ çస్పృహ కలిగిన కాళోజీ ఖండాంతర కవి. ప్రజా ఉద్యమాలతో మమేకమైన ఆయన సమాజాన్ని నా గొడవలో అనేక కోణాలలో ఆవిష్కరించి చూపారు. నిజా లను కవిత్వంలో కుండబద్దలు కొట్టి చెప్పిన కాళోజీ ఎవరేమనుకున్నా తన తత్వం ఇదేనని స్పష్టం చేశారు. ‘ఓటేసేటప్పుడు వుండాలి బుద్ధి’ అన్న మాటల్లో వాస్తవాల ఆవిష్కరణ కనిపిస్తుంది. ఆచరణ యోగ్యంగా ఆయన కవిత్వపంక్తులు ఉంటాయి.
సామాన్య ప్రజానీకానికి అంత దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లిన కవిగా కాళోజీ మిగిలిపోయారు. ‘తిననోచని మాట్లాడ నోచని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవచేసి ప్రేమించనోచని శరీరం...’ వంటివాటి పక్షం వహిస్తాడు కాళోజీ. కచ్చితమైన అభిప్రా యాలు కల్గిన కాళోజీ... పలుకుబడుల వ్యావహా రిక భాషలో రచనలు చేశారు. ‘ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరుముతాం... ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాత రేస్తాం’ అంటూ తెలంగాణ వాణిని వినిపించిన కాళోజీ ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది... వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి’ అని స్పష్టం చేశారు. స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, ద్వంద్వ ప్రవృత్తులపై, అన్యా యం వంటివాటిపై ఖండనలు చేసిన ఆయన సామాజిక కవి శిఖరంగా కనిపిస్తారు. రాజ కీయ లౌక్యాలు, వ్యంగ్యాస్త్రాలు ప్రస్తావిస్తూనే సాహిత్య విలువ లను నా గొడవలో స్థాపన చేశారు. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించినట్టే తనకు ఎదిరించినోడే ఆరాధ్యుడని ఆయన చెప్పారు. ఓటు విలువను సమాజానికి చెప్పిన ఆయన సమాజ అంతరాలను నా గొడవలో బట్ట బయలు చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరడం తప్పదు... కాలంబు రాగానె కాటేసి తీరాలే... కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె’ అన్న కాళోజీ... నిర్భయత్వానికి నిదర్శనం! – డా. తిరునగరి శ్రీనివాస్, కవి, సాహిత్య విశ్లేషకులు, 94414 64764
Comments
Please login to add a commentAdd a comment