kaloji narayana rao
-
తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి అందించే నివాళి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనం అందించే నివాళి అని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. నేడు కాళోజీ వర్ధంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారని అన్నారు.కాళోజీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘తోటి మనిషి బాగు కోరుకోవడమే కాళోజీకి ఘన నివాళి. కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య గరిమను ప్రపంచానికి చాటారు. కాళోజీ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేశాం. తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారు అందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతరం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇమిడి ఉంది. ఈ మేరకు బీఆర్ఎస్ పలు కార్యక్రమాలను చేపట్టింది. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి’ అని చెప్పుకొచ్చారు. -
కాళోజీ దిగి వచ్చాడా!.. 'బతుకంతా దేశానిది' ప్రదర్శన ఓ అద్భుతం!
పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. ఆయన 110వ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ సేవలను స్మరించుకున్నారు.ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన " బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది. జి.శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం చూపరులను కట్టిపడేసింది. కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు దక్కాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్, లైటింగ్ అద్భుత అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు ప్రశంసలు కురిశాయి.ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకబృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఆయన కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ టెటా బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. -
జనం గొడవే.. ఆయన గొడవ!
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించి అణచివేత– అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపించిన సమరశీలి; సామాజిక స్పర్శతో కవిత్వాన్ని పునీతం చేసిన ప్రజాకవి కాళోజీ! ప్రజా ఉద్య మాల్లో పాల్గొని అన్యాయాన్ని కవిత్వ కరవాలంతో ఎదిరించి ప్రశ్నించి నిలదీసిన ధీశాలి. నిజాం రాజును ఆత్మస్థైర్యంతో ఎదిరించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరుబాటను నిర్దేశించిన యోధుడాయన. తనను వదిలేసుకొని ఇతరుల మంచి కోసం పోరాడే సామాజిక స్పృహ, నిరంతర తపన కాళోజీలో ఉన్నాయి. పీడిత, తాడిత ప్రజల గుండెల్లో పోరాటపు పుప్పొడిని చల్లి కవిగా నిలిచి పోయారు. మాటల్లో, చేతల్లో, ప్రవ ర్తనలో, వేషభాషల్లో, ఆలోచ నలో, ఆర్తిలో, ఆవేదన – సంవే దనల్లో తెలంగాణ తనాన్ని విని పించి, కనిపింపజేసిన ఆయన అసాధారణ కవి. ప్రజల్లోకి బలంగా తన కవిత్వాన్ని తీసు కెళ్లిన కాళోజీని మహాకవి దాశరథి ‘తెలంగాణ ఆధునిక సాహిత్య ముఖద్వారం’ అని అభివర్ణించారు. ఉద్యమ ప«థ నిర్దేశం చేసి చిరకాల కవిత్వాన్ని కాళోజీ ప్రజలకు మిగిల్చారు.సమాజ గొడవను తన గొడవగా మార్చు కొని ‘నా గొడవ’ పేరుతో రాసిన కవితలు సమాజానికి మార్గదర్శకాలుగా మారాయి. దేశీయ దృక్పథం, ప్రాంతీయ çస్పృహ కలిగిన కాళోజీ ఖండాంతర కవి. ప్రజా ఉద్యమాలతో మమేకమైన ఆయన సమాజాన్ని నా గొడవలో అనేక కోణాలలో ఆవిష్కరించి చూపారు. నిజా లను కవిత్వంలో కుండబద్దలు కొట్టి చెప్పిన కాళోజీ ఎవరేమనుకున్నా తన తత్వం ఇదేనని స్పష్టం చేశారు. ‘ఓటేసేటప్పుడు వుండాలి బుద్ధి’ అన్న మాటల్లో వాస్తవాల ఆవిష్కరణ కనిపిస్తుంది. ఆచరణ యోగ్యంగా ఆయన కవిత్వపంక్తులు ఉంటాయి.సామాన్య ప్రజానీకానికి అంత దగ్గరగా కవిత్వాన్ని తీసుకెళ్లిన కవిగా కాళోజీ మిగిలిపోయారు. ‘తిననోచని మాట్లాడ నోచని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవచేసి ప్రేమించనోచని శరీరం...’ వంటివాటి పక్షం వహిస్తాడు కాళోజీ. కచ్చితమైన అభిప్రా యాలు కల్గిన కాళోజీ... పలుకుబడుల వ్యావహా రిక భాషలో రచనలు చేశారు. ‘ప్రాంతేతరులే దోపిడీ చేస్తే పొలిమేర దాకా తరుముతాం... ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతో పాత రేస్తాం’ అంటూ తెలంగాణ వాణిని వినిపించిన కాళోజీ ‘వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది... వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి’ అని స్పష్టం చేశారు. స్వచ్ఛత, సూటిదనం, నచ్చని విషయాలపై నిరసన, ద్వంద్వ ప్రవృత్తులపై, అన్యా యం వంటివాటిపై ఖండనలు చేసిన ఆయన సామాజిక కవి శిఖరంగా కనిపిస్తారు. రాజ కీయ లౌక్యాలు, వ్యంగ్యాస్త్రాలు ప్రస్తావిస్తూనే సాహిత్య విలువ లను నా గొడవలో స్థాపన చేశారు. ప్రహ్లాదుడు అన్యాయాన్ని ఎదిరించినట్టే తనకు ఎదిరించినోడే ఆరాధ్యుడని ఆయన చెప్పారు. ఓటు విలువను సమాజానికి చెప్పిన ఆయన సమాజ అంతరాలను నా గొడవలో బట్ట బయలు చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ‘తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరడం తప్పదు... కాలంబు రాగానె కాటేసి తీరాలే... కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె’ అన్న కాళోజీ... నిర్భయత్వానికి నిదర్శనం! – డా. తిరునగరి శ్రీనివాస్, కవి, సాహిత్య విశ్లేషకులు, 94414 64764 -
ప్రజాకవి కాళోజీకి మరో అవార్డు
ప్రముఖ కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు బయోపిక్‌గా రూపొందించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్ (అశోక్ రెడ్డి) టైటిల్ రోల్లో నటించారు. డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్‌పై విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలైంది. ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఈ మూవీ తాజాగా ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఫీచర్ ఫిక్షన్ కేటగిరీలో స్పెషల్ జ్యురీ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డును ప్రభాకర్ జైనీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘కాళోజీ నారాయణరావుగారి జీవిత విశేషాలతో ‘ప్రజాకవి కాళోజీ’ మూవీ తీసినందుకు చిత్రసీమకు చెందిన అనేక మంది ప్రముఖులు నన్ను ప్రశంసించారు. ఒక కవి మీద సినిమా తీయడం చాలా సాహసమని కొనియాడారు. మా సినిమాకి మొత్తం 8 అవార్డులు రావడం హ్యాపీ’’ అన్నారు. -
కవిత్వం చెప్పగలడు
మూల విరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న ముఖ్య తారలుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రముఖ కవి కాళోజీ నారాయణ బయోపిక్‌గా విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి, తెలంగాణ సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, నిర్మాత రామసత్యనారాయణ, దర్శకులు వీయన్ ఆదిత్య, వేణు ఊడుగుల సినిమా హిట్టవ్వాలన్నారు. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘ఒక రిక్షావాడు కూడా కవిత్వం చెప్పగలడని ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘కాళోజీగారి ఆత్మ నా ద్వారా ప్రేక్షకులకు పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కాళోజీ పాత్రధారి మూల విరాట్. -
అలుపెరుగని కలం యోధుడా...
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్‌యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే. -
నా పూర్వజన్మ సుకృతం ఇది
తెలంగాణ ప్రజా కవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. కాళోజీగా మూల విరాట్ నటించారు. విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌కు వెళుతోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘కాళోజీలాంటి గొప్ప కవి సినిమా తీయడం సాహసమే అయినప్పటికీ నాకీ అవకాశం రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు విజయలక్ష్మీ జైనీ. ‘‘ఈ సినిమాలో నటించడానికే సినిమా రంగంలోకి వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ΄ాత్ర చేశాకే నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలుగుతోంది’’ అన్నారు మూల విరాట్. -
సోషల్ మీడియాకు బందీ కావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరాన్ని స్మార్ట్ ఫోన్ నిర్వీర్యం చేస్తోందని.. సోషల్ మీడియా బందీగా మార్చిందని ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టే అనిపిస్తుందని.. కానీ ఏమీ తెలియకుండా పోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన కాళోజీ నారాయణరావు స్మారక పురస్కరాన్ని అందుకున్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. అది నాలో ఆలోచనా శక్తిని ఉత్తేజపర్చింది. సమాజాన్ని అన్ని కోణాల్లో చూసే తత్వాన్ని కలిగించింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, బాధితుల పక్షాన నిలదీయటం, ఎదిరించటం అలవాటు చేసింది. ఇప్పటితరంలో ఇది లోపించింది. రాయకున్నా కనీసం చదివే లక్షణమైనా ఉండాలి..’’ అని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భాషను ముందు తరాలకు అందించాలి తెలంగాణ భాషను రేపటి తరానికి పదిలంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అది రచనలతోనే ముందుకు సాగుతుందని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని కాళోజీ చెప్తూ చేసి చూపించారని.. ఆ దిశగానే తానూ ముందుకు సాగానని చెప్పారు. తమ రచన సాహితీ కళావేదిక తొలి వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఓ రోజంతా తమతో గడిపారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలకు మనం స్పందించగలగాలని.. ఆ తత్వం మనసుకు ఉండాలని చెప్పారు. చాలా మందిలో ఈ తత్వం ఉన్నా దాన్ని గుర్తించరని.. రచనా వ్యాసంగం వైపు మళ్లినప్పుడు అది ఉత్తేజం పొందుతుందని తెలిపారు. సమాజాన్ని గమనించటం, పుస్తకాలు చదవడం మేధస్సుకు పదును పెడుతుందన్నారు. దీనిని నేటి తరం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు / సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!? అన్ని భాషలు నేర్చుకో. కానీ నీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకోమని చెప్పిన కాళోజీ నారా యణరావు తెలుగు వారికి ఎన్నో విధాల ఆదర్శనీయుడు. కాళోజీ రంగా రావు, రమాబాయమ్మల రెండవ కుమారుడైన ఆయన అసలు పేరు ‘రఘువీర్ నారాయణ్ లక్ష్మీ కాంత్ శ్రీనివాస రామరాజ్.’ కర్ణాటక రాష్ట్రంలోని ‘రట్టహళ్లి’ గ్రామంలో 9 సెప్టెంబర్ 1914న జన్మించారు. ‘కాళన్న’గా తెలుగు ప్రజలకు సుపరిచితులు. కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. తెలంగాణ జీవిత చలనశీలి. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. స్వాతంత్య్ర సమరయోధుడు. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ ‘కాళన్న’గా పరిణామం చెందడం ఒక చారిత్రక ఘట్టం. కాళోజీ తెలంగాణ భాష, యాసలను తరతరాలకు తెలిసే విధంగా రచనలు చేశారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి, ప్రజాకవిగా నిలిచారు. కవిత్వంతో ప్రజలను నిద్రలేపారు. మనిషితనం పట్ల ప్రేమ కలిగిన కాళోజీకి తెలంగాణ యాసపై విపరీతమైన అభిమానం. ఆయన ధిక్కార కవిత్వమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. కాళోజీ తన భాషాసోయిని తెలుగు ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపింపజేసిన వ్యవహారదక్షుడు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష గావాలె’ అని వ్యావహారిక భాషను అందలమెక్కించిన భాషావాది. శతాబ్దపు జీవన ప్రయా ణంలో ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వీ కరించిన వ్యక్తి. ‘నేను ప్రస్తుతాన్ని/ నిన్నటి స్వప్నాన్ని/ రేపటి జ్ఞాపకాన్ని’ అని చెప్తూ... ఒక్కమాటలో తన వస్తుతత్వాన్ని చెప్తాడు. అలాగే ‘నవ యుగంబున నాజీ నగ్న నృత్య మింకెన్నాళ్ళు... / హింస పాపమని ఎంచు దేశమున హిట్లరిత్వ మింకెన్నాళ్లు...’ అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన యోధుడు. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట’ అంటూ బడుగు బలహీన వర్గాలకు బాసటగా... భూస్వామ్య వాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. వ్యక్తిత్వం, కవిత్వం వేర్వేరు కాని మనీషి కాళోజీ. సాహిత్య ప్రవేశానికి ముందు కాళోజీ గొప్ప కథకుడు కావాలనో, కవిని అనిపించుకోవాలనో అనుకోలేదు. కాళోజీ కవిత కాలం ప్రవహిస్తున్న వ్యథ. ఒక్క మాటలో చెప్పాలంటే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. తన గొడవ తెలంగాణ గొడవ. మౌలికంగా మనిషి గొడవ. జీవితం, కవిత్వం, రాజకీయాలు అన్నింటిలోనూ కాళోజీ ప్రజాస్వామికవాది. ఇంకా చెప్పాలంటే తీవ్ర ప్రజాస్వామిక వాది. కేవలం పౌర హక్కులకే కాదు, సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించటంలో ఆయన ముందుండేవారు. ‘దోపిడీ చేసే ప్రాంతేతరులను / దూరందాకా తన్ని తరుముతం / ప్రాంతం వారే దోపిడీ చేస్తే / ప్రాణంతోనే పాతర వేస్తం’ అని దళారుల అణచివేత, దోపిడీలను, వాళ్ళతో మిలాఖతయిన ప్రాంతం వారిని నిర్ద్వంద్వంగా ఖండించారు. కలం సిరాను ‘న భూతో న భవిష్యతి’గా వర్ణించిన విశిష్ట కవి కాళోజీ నారాయణరావుకు శత సహస్ర వందన చందన ములతో తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘కాళన్న యాదిలో...’ కవితా సంకలనాన్ని 226 మంది కవులతో పుస్తకం తెచ్చింది. అనేక దేశాల్లో వివిధ రంగాలలో... కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులైన తెలుగు వారిని గుర్తించి ‘ప్రజాకవి కాళోజీ జాతీయ పురస్కారాలు అందించింది. నేడు ఆ మహాను భావుని జయంతి సందర్భంగా ఘనమైన నివాళి. దాసరి (జంగిటి) శాంతకుమారి వ్యాసకర్త వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య కళాపీఠం ‘ మొబైల్: 96524 83644 (నేడు కాళోజీ జయంతి) -
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలి : కేవీ రమణాచారి
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం ,తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడుతూ కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతుందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని,కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు .తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు.ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం ,డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శివి.ఆర్. విద్యార్థి ,కాళోజి కుమారుడు రవికుమార్ ,ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు. -
'ప్రజాకవి కాళోజీ' సాహసంతో కూడుకున్న ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్ : "ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమా తీయడమన్నది సాహసంతో కూడుకున్న ప్రక్రియని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విజయలక్ష్మీ జైనీ నిర్మాణ సారథ్యంలో జైనీ క్రియేషన్స్ నిర్మిస్తున్న "ప్రజాకవి కాళోజీ" బయోపిక్ సినిమాకు సంబంధించి బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన ప్రముఖ నవలా రచయిత, నంది అవార్డు గ్రహీత ప్రభాకర్ జైనీ అభినందనీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళోజీ గారి 106 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించే ఉద్దేశంతో ఒక వీడియో సాంగ్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కాళోజీ తెలంగాణా చైతన్య స్ఫూర్తి. కళలకు కాణాచి అయిన వరంగల్ నుండి జయకేతనం ఎగురవేసి విశ్వమంతా ఖ్యాతినార్జించిన మహాకవి. తెలుగువారిలో సాహిత్య రంగంలో "పద్మ విభూషణ్" పొందిన ఏకైక వ్యక్తి కాళోజీ. కాళోజీ నారాయణరావుపై సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉంది. అందుకే కాళోజీ పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించామని.. వరంగల్‌లో కాళోజీ స్మారక సభా మందిరం నిర్మిస్తున్నాం. ప్రతీ సంవత్సరం కాళోజీ జన్మదినాన్ని "తెలంగాణా భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాం. ప్రముఖ రచయితలను కాళోజీ సాహితీ పురస్కారంతో సత్కరించుకుంటున్నాం 'అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. సినిమా నిర్మాణం త్వరగా పూర్తయ్యి విడుదల కావాలని.. ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సినిమా యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు. ఈ సినిమాకు కెమెరామెన్ గా రవికుమార్ నీర్ల పనిచేయగా.. రచయిత కళారత్న బిక్కి కృష్ణ ఈ చిత్రానికి పాటలు రాయగా, యస్. యస్. ఆత్రేయ సినిమాకు సంగీతం అందించారు. కాళోజీ పాత్రలో మూలవిరాట్ నటించనున్నారు. పీవీ గారి పాత్రలో వారి తమ్ముడు పీవీ మనోహర రావు నటించారు. వీరితో పాటు సినిమాలో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు నటించడంతో పాటు చిత్ర నిర్మాణానికి తమ సహకారమందించారు. -
వెండితెరకు కాళోజీ జీవితం
ప్రజాకవి, ప్రముఖ రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత స్వర్గీయ కాళోజీ నారాయణరావు జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో జైనీ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ ‘ప్రజాకవి–కాళోజీ’ పేరుతో ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ‘‘కాళోజీగారి జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి– కాళోజీ’గా తెరకెక్కిస్తున్నాం. కాళోజీ పాత్రలో శ్రీ మూలవిరాట్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారి పాత్రను వారి తమ్ముడు మనోహర రావుగారు పోషిస్తున్నారు. కాళోజీ భార్యగా విజయలక్ష్మీ జైనీ కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ఎస్. ఆత్రేయ సంగీతదర్శకుడు’’ అని చిత్రబృందం తెలిపింది. కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, పొట్టపల్లి శ్రీనివాసరావు, కవి అన్వర్ పాల్గొన్నారు. -
ప్రశ్నను చంపేవాడే దేశద్రోహి
హత్యకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపడం. రేప్ కన్నా ప్రజలను భజనపరులుగా మార్చడం, లించింగ్ అనే మూకుమ్మడిహత్యలకన్నా ప్రశ్నించే తత్వాన్ని హత్య చేయడం తీవ్రమైన నేరాలు. పరస్పర ద్వేషాలను రగిలించే విధానాలు అనుసరిస్తూ లించింగ్ సరైనదే అని పరోక్షంగా నేర్పే రాజకీయులు, రాజకీయాలే అసలైన నేరగాళ్లు. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం ప్రజాస్వామిక బాధ్యత. కాళోజీ అన్నట్టు అప్పుడే అతను పౌరుడవుతాడు లేకపోతే పోరడు. కానీ అదే అడిగితే? అడిగిన వాడిపై దాడి చేయడం, వేటాడడం, దొంగకేసులు పెట్టడం, పాతకేసులు తవ్వడం, లేదా చెత్తకేసుల్లో ఇరికించడం దారుణాలు. కనిపిం చని హంతకులు చేసే అదృశ్య హత్యలు ఇవి. న్యాయంగా కేసులు నిర్ధారించిన జడ్జీలను కూడా వేధించడం, విభేదించిన వాడిని బాధించడం, నేరవిచారణ అధికారులమీదే నేరాలు బనాయించడం, కిందిస్థాయి అవినీతి పరులను కలుపుకుని తిరుగుబాట్లు చేయించి, వ్యవస్థలను ధ్వంసంచేయడం, మూకుమ్మడి అత్యాచారాలే. కాకతీయ యూనివర్సిటీలో ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు ఎండోమెంట్ ప్రసంగం చేయాలని పిలిచారు. కాళోజీ వ్యక్తిత్వానికి సరిపోయే చర్చనీయాంశం ఏదంటే ‘ప్రజాస్వామ్యం, ప్రశ్నించే తత్వం’ కాక మరేది. ‘ప్రజలను చంపే అధికారం ఎవరిచ్చార్రా వెంగళ్రావ్’ అంటూ నినదించిన గొంతు ఆయనది. అదీ ఎక్కడ.. వెంగళరావు సీఎం హోదాలో సత్తుపల్లిలో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న చోట. ముఖ్యమంత్రిగా కొనసాగడం కోసం వెంగళ్రావ్ పోటీ చేస్తే, కాళోజీ కేవలం ప్రశ్నించడం కోసం పోటీచేసినాడు. గెలిచింది సీఎంయే కానీ ప్రజాప్రతినిధి కావలసిన వ్యక్తి కాదు. ఓడింది ప్రజాస్వామ్యమేగాని కాళోజీ కాదు. బూటకపు ఎన్కౌంటర్లు జరిపించిన తొలి ఎమ ర్జెన్సీ సీఎం అని గొంతెత్తి చెప్పడమే విజయం. తిడితే తిట్టనీ, అడిగితే అడగనీ అని జలగం వెంగళరావు అడిగేవాడిని అడగనిచ్చాడు. జవాబు ఇవ్వలేకపోయినా. పోటీచేస్తే చేయనీ, అని పోటీ చేయనిచ్చాడు. రాజును రోజూ తిడుతున్నా రాజద్రోహం కేసు పెట్టించలేదు. జలగం ఎంత గొప్పవాడు? కాళోజీ ఇప్పుడు బతికి ఉంటే, అప్పుడెప్పుడో సత్తుపల్లిలో ప్రశ్న వేసినందుకు 2019లో రాజద్రోహం కేసు కింద అరెస్టయి పుణే ఎరవాడ జైల్లో వరవరరావుతోపాటు ఉండేవాడేమో?. కాళోజీ వంటి సెలబ్రిటీ వ్యక్తులు 49 మంది ఈమధ్య చేసిన నేరం ఏమంటే ప్రశ్నించడం. గుంపు హత్యలు ఈ దేశ పరువును ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు. లించింగ్‌లు జరగకుండా చూడలేరా అని అడిగితే దేశ ద్రోహం ఏ విధంగా అవుతుందో చెప్పగలరా ఎవరైనా? గతవారం ముజఫ్ఫర్ పూర్ చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ గారికి 49 మంది కళాకారులు మేధావులు ప్రధానికి రాసిన ఈ లేఖలో దేశద్రోహపు రంగులు, కాంతులు, పొగలు, పగలు కనిపించడం ఆశ్చర్యకరం. దేశ ద్రోహం కేసు రిజిస్టర్ చేయాలని ఆదేశించిన ఆ న్యాయాధికారిగారి దృక్పథం ఇదా అని దేశం మ్రాన్పడిపోయింది. మరో 185 మంది సమాజశ్రేయోభిలాషులు అక్టోబర్ 8న ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ మరోలేఖ వ్రాసారు. వారిమీద కూడా దేశద్రోహం కేసు పెడతారా? అయితే ఈ అవివేకపు కారు చీకటిలోనూ కొంత వెలుగు కనిపించింది. బిహార్ స్పెషల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ కుమార్ దేశద్రోహపు ఆరోపణ చేసే ఈ ఫిర్యాదును బుట్టదాఖలుచేయాల్సిందే అని నిర్ణయించడంలో వివేకం విజ్ఞత ఇంకా బతికున్నాయనే ఆశాభావం కన్నుతెరిచింది. న్యాయాధికారి చూడలేకుండాపోయిన నిజాలు పోలీసు అధికారికి సులువుగా కనిపించాయి. ఇది దురుద్దేశపూరితంగా చేసిన తప్పుడు ఫిర్యాదు, దేశద్రోహం ఆరోపణ పైన విచారించడానికి అణుమాత్రం ఆధారంకూడా లేదు అని మనోజ్ కుమార్ వివరించారు. ఈ ఫిర్యాదు చేసిన ఓఝా అనే వ్యక్తి పిటిషన్ పైన జడ్జిగారు జారీ చేసిన ఆదేశం మేరకు కేసు రిజిస్టర్ చేయవలసి వచ్చిందని మరో ఉన్నతాధికారి చెప్పాడు. ‘‘ఒరేయ్ ప్రశ్నించేవానికి, ప్రశ్నకు కూడా ద్రోహం చేస్తావ్ రా ఎన్ని గుండెలు నీకు? అయితే నువ్వేరా దేశద్రోహివి, ఇది తెలిసినోడేరా అసలైన దేశభక్తుడు’’ అని కాళోజీ ఇప్పుడు ఉంటే అనేవాడేమో. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వెండితెరకు కాళోజి జీవితం
ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘9.9.2019 కాళోజి నారాయణరావుగారి 105వ జయంతి. ఈ సందర్భంగా కాళోజిగారి జీవిత విశేషాలను, రచనలను, స్వాతంత్య్ర పోరాట విశేషాలను నేటి యువతీయువకులకు పరిచయం చేయాలనుకున్నాం. మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఆయన జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ‘కాళన్న’ సినిమా చేస్తున్నాం. కాళోజికి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వి.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మిత్రులతో సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్ సిరాజుద్దీన్. -
తెలియక ప్రేమ తెలిసి ద్వేషము
ఏమీ! నీవూ ఆ దేవాలయ ప్రవేశ సందర్భములోనే నెత్తి పగిలిన మహావీరుడవా నాయనా? స్వర్గంలో ఇంద్రవైభవము పొందగలవు. నీ తల పగులకొట్టిన ఆ పాపాత్ముడెవడు? వానికి నరకం తప్పునా? ‘‘ఎంత బాగుందోయి పాట. కొంతసేపాగి విని, మరిపోదామా?’’ ‘‘నాకూ విందామనే వుంది కాని సమయానికక్కడ చేరకపోతే దయాదాక్షిణ్యం లేక దండన విధిస్తాడు ఆ యమధర్మరాజు తెలుసా?’’ ‘‘ఆ భయం మనకు లేనిదెపుడు. వైతరణి దాటితే యమపురి ఎంతదూరం. తొందరగా నడిస్తే వేళ కందలేమా ఏమి?’’ ‘‘కాని పాశాల్లో జీవాలున్నావే, వెంట తీసుకొని ఎలా వెళ్లడం గంధర్వుల గానం వినేటందుకు?’’ ‘‘వైతరిణీ తీరాన వదిలేద్దాం. తిరుగుతాయి పాపం కొంచెం స్వేచ్ఛగా. ఎటైనా పారిపోతాయన్న భయమూ లేదు.’’ ‘‘సరే, నడువు అట్లాగయితే.’’ ‘‘ఇదేమిటి? ఇప్పటికి నేనొక్కడనే అనుకుంటున్నాను ఈ ప్రదేశంలో. కాని మీరెవరో వున్నారే నాతోపాటు? మనమెక్కడ వున్నది మీకేమైనా తెలుసా?’’ ‘‘నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఏమీ బోధపడడం లేదు.’’ ‘‘సరే కాని, ఎక్కడివాడవు నాయనా నీవు?’’ ‘‘అయ్యా, నేను భారతీయుడను.’’ ‘‘మహాభాగ్యం, ఏ ప్రాంతం నాయనా?’’ ‘‘అయ్యా నేను నిజాం రాష్ట్రంలోని తెలంగాణా మనిషిని.’’ ‘‘ఏమంటివి! స్వదేశీయుడవే కాకుండా స్వప్రాంతీయుడవు కూడానా? అందుకే, నిన్ను చూడడంతోనే ఒక విధమైన సోదరప్రేమ కలిగింది. ఇక్కడికెలా రావడమైంది బాబూ?’’ ‘‘అదే బోధపడడం లేదు నాకూను. ఉదయం మా వూళ్లో జరిగిన కొట్లాటలో నా తలపైన దుడ్డుకర్ర పడ్డాక స్పృహ తప్పింది. తర్వాత ఏమి జరిగిందో చూస్తే ఇక్కడున్నాను.’’ ‘‘ఎంత చిత్రం, మీ ఊళ్లో కూడా ఉదయం గోల జరిగిందా? నా తలపైన గొడ్డలి పడడం వరకు జ్ఞాపకం ఉంది. తర్వాత ఏమి జరిగినదీ నాకు తెలియదు.’’ ‘‘బాగానే వుంది. అయితే మీ ఊళ్లో జరిగిన సంగతేమిటో చెప్పండి. నేను మా సంగతి చెపుతాను తరవాత. అన్యాయంగా వుందండి కథ. ప్రపంచంలో దయ అనేది లేకపోవడం సత్యమని బోధపడుతుంది మీకే తర్వాత.’’ ‘‘నా కథ అలాగే వుంది అబ్బాయి. ప్రపంచంలో ధర్మమనేది నాశనమయిపోతున్నది దినదనం. ఆచార వ్యవహారాలు మంట గలుస్తున్నాయి లోకంలో. మా ఊళ్లో జరిగిన కథ చెప్పితే నమ్మవేమో అని అనుమానిస్తున్నాను. అందుకే నీవే నీ కథ మొదలు చెప్పితే బాగుంటుందని నా అభిప్రాయం.’’ ‘‘నిజమేనండి. ప్రపంచంలో మనుష్యత్వమే లేకుండా పోయింది. ఏమి చెప్పేది మా ఊళ్లో అవస్థ. మా ఊళ్లో ఒక దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద తీర్థం సాగుతుంది. ఈ ఏడు జాతర అప్పుడు దేవాలయ ప్రవేశ విషయంలో వచ్చింది తగాదా అస్పృశ్యులకు, సవర్ణ హిందువులకు. సవర్ణులలో కొందరు దేవాలయ ప్రవేశానికి సాయపడతాం అన్నారు. దాంట్లో ఒకరిద్దరు బ్రాహ్మణులు కూడా వుండటం తటస్థించింది. జాతరకంటె వారం ముందే హరిజనులందరు దేవాలయ ప్రవేశ విషయమై సత్యాగ్రహం మొదలుపెట్టారు. బ్రాహ్మణులూ, యితర హిందువులూ లాఠీలతో గుడి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఈరోజు ఉదయం హరిజనులు కూడా సత్యాగ్రహానికి స్వస్తి చెప్పి దేవాలయ ప్రవేశం చేద్దామని లాఠీలతో తయారైనారు. జరిగింది సవర్ణ అవర్ణ హిందువులకు లాఠీలతో సంగ్రామం.’’ ‘‘ఏమీ! నీవూ ఆ దేవాలయ ప్రవేశ సందర్భములోనే నెత్తి పగిలిన మహావీరుడవా నాయనా? స్వర్గంలో ఇంద్రవైభవము పొందగలవు. నీ తల పగులకొట్టిన ఆ పాపాత్ముడెవడు? వానికి నరకం తప్పునా? నేనూ ఆ ధర్మయుద్ధంలో పాల్గొన్న వీరుడనే తండ్రీ. ఇంతకూ, మనమిరువురమూ ఒక్క ఊరివారమే నాయనా, నిన్ను కొట్టిన ఆ దుర్మార్గుడెవడో జ్ఞాపకమున్నదా?’’ ‘‘బాగా బలిసిన ఒక లావాటి బాపనయ్య నా తలపై దుడ్డుకర్ర వేసాడు. అతనికీ తగిన శాస్తి అయిందనే నా అభిప్రాయం. మా వెంకడు అప్పుడే గొడ్డలితో అతని బుర్రపై కొట్టినట్లు నాకు జ్ఞాపకం.’’ ‘‘ఓరి ఇక్కడా దాపురించావు? దేవాలయ ప్రవేశం కంటే మొదలు యమపురి ప్రవేశం చేయిస్తామని అనుకుంటే తప్పించుకుపోయావు. కాని ఇప్పుడెటు పోతావురా? గొంతు పిసికి పారేస్తాను చూడు.’’ ‘‘బొర్రపై కొట్టానంటే భక్ష్యాలన్నీ బయటపడాలే జాగ్రత్త.’’ ‘‘అబ్బా ఎంత తన్ను తన్నితివిరా?’’ ‘‘అయ్యో చస్తి చేతకాక కొడుతావటయ్యా ఉండు నీ పని పట్టిస్తా.’’ ‘‘అరే చాలురా పాట వినడం. నదీ తీరాన ఏవో కేకలు వినవస్తున్నాయి. ప్రాణాలను పాశాల్లోంచి వదిలి వచ్చాం. అలవాటు చొప్పన ఇక్కడా కొట్లాడుకుంటున్నాయో ఏమో.’’ ‘‘అవునురా ఈ కేకలక్కడివే.’’ ‘‘..........’’ ‘‘..........’’ ‘‘వీరి కావరం మండా. పోనీ పాపమని కొంత స్వేచ్ఛ యిస్తే మళ్లీ తన్నుకుంటున్నారేమిరా?’’ ‘‘చచ్చి ఇంకా పది గంటలు కాకపోయే. ద్వేషం అప్పుడే పోతుందా?’’ ‘‘చచ్చినా ఈ మతపిచ్చి ఈ వర్ణభేద శతృత్వం పోలేదేం? యమపురిలో తీర్పు చెప్పిన తరువాత తెలుస్తుందిలే సంగతి.’’ ‘‘ఇంకా ఆలోచిస్తున్నావే నేను పాశంలో వేసుకొని నడవటానికి సిద్ధంగా వుంటే?’’ ‘‘ఏమి, దేవాలయ ప్రవేశం చేస్తామంటే అడ్డుపడడమే కాకుండా ఒకరిని కర్రతో బాది చంపినాడా?’’ ‘‘అవును మహాప్రభో!’’ ‘‘ఏమోయి, మావాడు నీ విషయమై చెప్పేది నిజమేనా?’’ ‘‘అయ్యా నిజమే కాని ధర్మ సంరక్షణ...’’ ‘‘నోరుమూయి ధర్మాధర్మములు ధర్మరాజునైన నాకా చెప్పేది? ఒరే ఇతనిని పదిరోజులూ అగ్నిగుండంలో పడవేసి తరువాత కొచ్చిన్‌లోని ఒక పరయా కుటుంబంలో పడెయ్యి. ధర్మం తెలుస్తుంది.’’ ‘‘అయ్యో అగ్నిగుండమా? మాదిగ జన్మమా? అన్యాయం, ఘోరం’’ ‘‘...........’’ ‘‘వీడెవడురా?’’ ‘‘దేవాలయ ప్రవేశానికి లాఠీతో పోయి చంపబడ్డ...’’ ‘‘అట్లాగా. నీవు మహాత్ముడు చెప్పిన అహింసా విధానం మాని లాఠీ సహాయమెందుకు అపేక్షించావు దేవాలయ ప్రవేశానికి?’’ ‘‘ఎన్నిరోజులు ప్రయత్నించినా దయరాలేదు. విసిగి జబర్దస్తీకి దిగాం మహారాజా.’’ ‘‘అది తప్పే. ఒరే వీడిని రెండు రోజులు ఆ మంచులో పడవెయ్యి కోపం అంతా పోయి శాంతం అలవడుతుంది. మూడోరోజు తిరువాన్కూరులో హరిజన కుటుంబంలోకి పంపించు.’’ ‘‘తెలుగు దేశంలో కాక మలయాళ దేశంలో ఎందుకు తండ్రీ జన్మం?’’ ‘‘మళ్లీ దేవాలయ ప్రవేశపు చిక్కు లేకుండా. లేకపోతే తలపగులకొట్టించుకొని చేరుకుంటావు నా వద్దకు.’’ కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు (9 సెప్టెంబర్ 1914 – 13 నవంబర్ 2002) కథ ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’కు సంక్షిప్త రూపం. కాళోజీ తండ్రి మరాఠీ, తల్లి కన్నడిగ, జన్మ తెలంగాణ. చిన్న చిన్న ఉద్వేగాలకు కూడా స్పందించి కళ్లనీళ్లు పెట్టుకునే కాళోజీ పెద్ద పెద్ద ఉద్యమాలకు పెద్దదిక్కుగా ఉన్నందువల్లే కాళన్న అయినాడు, పద్మవిభూషణ్ అయినాడు, ప్రజాకవి అయినాడు. నా గొడవ ఆయన కవితా సంపుటి. ఇదీ నా గొడవ ఆత్మకథ. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. నేడు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 105వ జయంతి ఉత్సవం రవీంద్రభారతిలో జరగనుంది. -
కాళోజీ యాదిలో ...
కవిగా కాళోజీకి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన పుస్తకం ‘నా గొడవ’. ఇది 1953లో విడుదలయింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన మహాకవి శ్రీశ్రీ ఆ సందర్భంగా అన్న మాటలు చిరస్మరణీయాలు. ‘ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన ప్రతి ఒక్కరికీ ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది విషాలజగత్తు ప్రజలందరి గొడవ’ అన్నారు. ఆనాటినుండి కాళోజీ ప్రచురించిన ప్రతి కవితాసంకలనానికి నా గొడవ అనే పేరు పెట్టాడు. ప్రపంచబాధంతా శ్రీశ్రీ బాధ అయినట్లే ప్రజల గొడవంతా తన గొడవగా భావించి కవితా ప్రస్థానం సాగించిన వ్యక్తి కాళోజీ. కాళోజీ తన పోరాటాలన్నింటికి కవిత్వాన్ని మాధ్యమంగా ఎంచుకున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న దానిని సూటిగా సరళమైన ప్రజల భాషలో చెప్పేవాడు. ఆయనది బడిపలుకుల భాషకాదు, పలుకుబడుల భాష. అందుకే ఆయన రచనలు ప్రజలకు చేరువయ్యింది. ఒకప్పుడు భాషకోసం సమైక్య రాష్ట్రాన్ని ఆహ్వానించిన కాళోజీ, అవమానాల పాలవుతున్న ఆ భాషకోసమే మళ్లీ తెలంగాణ రాష్ట్రం అడగడానికి వెనకాడలేదు. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుకభాషలోనే రాయాలనేది అతని ప్రగాఢవిశ్వాసం. తెలంగాణ భాష అన్నా, యాస అన్నా అపారమైన అభిమానం. తెలంగాణ భాష, యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. పరభాష మనల్ని మనం మనంగా బ్రతకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలనేవారు కాళోజీ. కొన్నాళ్లు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ మాండలిక భాషాదినోత్సవంగా ఆయన అభిమానులు జరి పిండ్రు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప కాళోజీ జన్మదినాన్ని తెలం గాణ భాషాదినోత్సవంగా, అధికారి కంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయం, అభినందనీయం. తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషిచేశారు. తెలంగాణ ప్రజాసంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన గొంతు వినిపించేవారు. మనభాష, మన పలుకుబళ్లు ఇప్పుడు మన సొంత రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వించదగింది. వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగం, ఓయూ ‘ మొబైల్: 98491 36104 -
కాళోజీకి తప్పని ఓటమి
అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటి వాడో చూడు అని ప్రజలను అప్రమత్తం చేసిన ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు సైతం ఎన్నికల్లో ఓడిపోయారు. 1952లో ఆయన తెలంగాణలోని వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు కాళోజీపై గెలిచారు. ఎమర్జెన్సీకి నిరసనగా కాళోజీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. వరంగల్ జిల్లాకే చెందిన మరో అదర్శ వ్యక్తి భూపతి కృష్ణమూర్తి కూడా 1972, 1978, 1983 ఎన్నికల్లో వరంగల్ నుంచి అసెంబ్లీకి వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగారు. అయితే మూడుసార్లు ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 1961లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం 300 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అందులో 43 స్థానాలు ఎస్సీలకు, 11 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అనంతరం 1962 ఫిబ్రవరి 19న రాష్ట్రంలో అసెంబ్లీకి మూడో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 177 స్థానాలు, సీపీఐ 51, స్వతంత్ర పార్టీ 19 స్థానాల్లో గెలుపొందగా.. ఇండిపెండెంట్లు 51 స్థానాల్లో విజయం సాధించారు. బీవీ సుబ్బారెడ్డి స్పీకర్‌గా, వి.కృష్ణాజీ నాయక్ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. మూడో అసెంబ్లీ గడువు ముగిసేలోగా నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 300 మందితోమూడో అసెంబ్లీ 1951 నుంచి 2019 వరకులోక్సభ ఎన్నికల నిర్వహణ..ఇన్ని రోజుల్లో.. -
మహోన్నత వ్యక్తి.. కాళోజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 104వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2018వ సంవత్సరానికి గానూ ఆయన ఈ పురస్కారాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి కాళోజీ అని, జీవితాంతం పేదవాడి పక్షాన నిలిచిన ప్రజాకవి అని కొనియాడారు. జీవన సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పిన మహోన్నత వ్యక్తి కాళోజీ అన్నారు. ప్రభుత్వ పురస్కారాలు పొందగానే కొందరిలో మార్పు వస్తుందని.. పద్మవిభూషణ్ వంటి ప్రఖ్యాత పురస్కారం పొందినప్పటికీ కాళోజీలో ఎలాంటి మార్పు రాలేదని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణ కవులను విస్మరించాయని విమర్శించారు. కాళోజీ కవితలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళోజీ మార్గదర్శిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడారు. కాళోజీ నారాయణరావు, ఆయన సోదరుడు రామేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వరంగల్‌లో మిత్రమండలి స్థాపించిన కాళోజీ సోదరులు ఎంతో సాహితీ సేవ చేశారన్నారు. కాళోజీది మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు. గాంధీజీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చెప్పిన ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడారంటే భవిష్యత్ తరాలు విశ్వసించవు’ అన్న వ్యాఖ్యలు.. కాళోజీకి సరిగ్గా సరిపోతాయన్నారు. తన తొలి నవల అంపశయ్య రాతప్రతిని చదివి కాళోజీ తనను అభినందించిన విషయాన్ని నవీన్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ పురస్కారం లభించాలన్న తన కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సంగీత నాటక అకాడమీ అ«ధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి దేవులపల్లి ప్రభాకర్లతో పాటు పలువురు కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
కాలంతో నడిచిన కవి కాళన్న
మహోన్నత మూర్తిపూలలాలిత్యంవజ్ర కాఠిన్యంతనువంతా నింపుకున్నధిక్కార స్వరంభాషకు యాసకు పట్టం కట్టికవితా యాత్ర చేసిన తెలంగాణ చైతన్యందుర్భర జన జీవితాన్నిదగ్గరగా దర్శించి ప్రజాస్వామ్యాన్ని పాతరేసేపాలక రక్కసులను ప్రశ్నించిన పౌరహక్కుల స్వరం ఎవరికీ వెరవని నైజం మానవత్వం పరిమళించే తేజంకాలాన్ని వ్యాఖ్యానించిన కవిత్వం కర్తవ్యాన్ని బోధించిన ధీరత్వం మన కాళోజీమహోన్నత మూర్తి మన కాళోజీమనందరికీ స్ఫూర్తి..–వల్స పైడి, కవి,ఉపాధ్యాయుడు హన్మకొండ కల్చరల్(వరంగల్): ‘రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు’ అని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తన కవిత్వంలో ప్రస్తావించిన ప్రజాకవి కాళోజీ పది జిల్లాల తెలంగాణ భాషపై రెండున్నర జిల్లాల ఆంధ్రభాష పెత్తనం చేయడం, ఇక్కడి భాషను తక్కువగా చూడడంపై మండిపడ్డారు. తెలంగాణ భాషను, మాట తీరును ఎవరు కించపరిచినా ఆయన సహించేవారు కాదు. అందుకే కాళోజీ నారాయణరావు జయంతిని కొన్నేళ్లుగా తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా భాషాభిమానులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాళోజీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాష దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ మట్టిని, భాషను, మనుషులను ఎంతగానో ప్రేమించిన కవి కాళోజీ. కాళోజీ 104వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న రంగారావు, రమాబాయి దంపతులకు నాటి నిజాం సంస్థానంలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ పూర్తి పేరు. బీజాపూర్ నుంచి తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. దీంతో కాళోజీ మడికొండలో ప్రాథమిక విద్యం, హన్మకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్య అభ్యసించారు. ఆయన 15 ఏళ్ల వయస్సు నుంచే రాజకీయ ఉద్యమాల్లో, కవితా, రచనావ్యాసంగాల్లో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ , నిజాం స్టేట్ కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. ప్రవక్తలా బోధించిన కవి.. కాళోజీ వంటి ప్రజాస్వామ్య విలువలు బోధించిన ప్రజాస్వామిక ప్రవక్త మరో వెయ్యి సంవత్సరాలకుగాని పుట్టబోరని ప్రముఖ న్యాయవాది, పీయూసీఎల్ నేత కన్నాభిరాన్ వ్యాఖ్యానించడం అతిశయోక్తి కాదు. కాళోజీ జీవించిన కాలంలో జీవించడంతోనే మనం ధన్యులమైనట్లని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కాళోజీ అవార్డు అందుకుంటున్న అంపశయ్య నవీన్ వ్యాఖ్యానించారు. మాతృభాష రాదన్న వారిపై విసుర్లు.. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తమ మాతృభాష అయిన తెలుగు భాషపై నిరాదరణతో ఉండడం చూసి స్పందించి ‘ఏ భాషరా నీది యేమి వేషమురా? /ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా? / అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. పార్టీల నిషేధంపై ఆగ్రహం.. 1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. ‘ప్రజాసంస్థలపై పగ సాధించిన ఫలితం తప్పక బయటపడున్/నిక్కుచునీల్గే నిరంకుశత్వం/నిల్వలేక నేలను గూలున్/చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను/స్థిరమగు కట్టయు శిథిలమగున్..’ అంటూ హెచ్చరించారు. నిజాం ప్రధానిని ప్రశ్నించిన కాళోజీ.. 1946లోనే వరంగల్ కోటలో మొగిలయ్య హత్య జరిగింది. మరోచోట పసిబాలుడిని పొడిచారు. శిక్ష చంపిన వారికి వేయాల్సిందిపోయి జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలలపాటు దేశబహిష్కార శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఇక్కడి సంఘటనలపై విచారణ చేయాడానికి వచ్చిన ప్రధాని సర్ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ తన కవిత ద్వారా ప్రశ్నించారు. ‘ఇది అందరికి చిరపరిచితమే ఎన్నాళ్ల నుండియో ఇదిగో అదిగో అనుచూ ఈనాటికైనను ఏగివచ్చితివా? కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట గుండాల గుర్తులు గోచరించినవా బజారులో బాలకుని బల్లెంబుతో పొడుచు బద్మాషునేమైనా పనిబట్టినావా మొగిలయ్య భార్యతో, మొగిలయ్య తల్లితో మొగమాటము లేక ముచ్చటించితివా? కాలానుగుణ్యమగు కాళోజీ ప్రశ్నలకు కన్నులెర్రగా చేసి ఖామూష్ అంటావా?...’ అంటూ సర్ మీర్జాఇస్మాయిల్‌ను ప్రశ్నించారు. కాళోజీ తన భావాలకే కాదు శరీరానికి మరణం లేదని నిరూపించిన వ్యక్తి. అందుకే ఆయన మరణాంతరం తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించేలా విల్లు రాసిచ్చారు. దీంతో ఆయన కోరిక మేరకు కేఎంసీకి ఆయన పార్థీవదేహాన్ని అప్పగించారు. శతజయంతి ఉత్సవాలతో మలుపు... 2002లో కాళోజీ కన్నుమూసిన తర్వాత కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్‌తోపాటు జిల్లాలోని ఇతర సాహిత్య సంస్థలు కాళోజీ జయంతి, వర్ధంతులను నిర్వహించేవి. అంతేగాక కాళోజీ జయంతిని మాండలికభాషా దినోత్సవంగా ప్రకటించాలని కాళోజీ అభిమానులు, అనుచరులు చాలాకాలంగా కోరుతూ వచ్చారు. అప్పటి ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. అయితే 2014 సెప్టెంబర్ 9 నుంచి 2015 సెప్టెంబర్ 9 వరకు నిర్వహించిన కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాషదినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. అంతేగాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతీసుకుని కాళోజీ పేరిట రవీంద్రభారతి కంటే పెద్ద ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే బాలసముద్రంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తికాలేదు. కాళోజీ పేరిట జిల్లాలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక అంశాలపై బో ధన, పరిశోధన జరిగేలా విశ్వవిద్యాలయం ఏర్పా టు చేయాలని సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కాళోజీ అభిమానులు కోరుతున్నారు. చేపట్టిన పదవులు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా , ఆంధ్రసారస్వత పరిషత్తు , ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రచనలు అణా కథలు, నా భారతదేశయాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తుదివిజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదీ నా గొడవ, బాపూ!బాపూ!!బాపూ!!! 1992: పద్మవిభూషణ్ 1968 : ‘జీవన గీత’ రచనకు రాష్ట్ర ప్రభుత్వంచే అనువాద పురస్కారం. బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం, ప్రజాకవి బిరుదు 1972 : తామ్రపత్ర పురస్కారం 1992 : కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ 1996 : సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు 1996 : కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం -
అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత అంప శయ్య నవీన్‌ను మరో ప్రఖ్యాత పురస్కారం వరించింది. కాళోజీ నారాయణరావు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే సాహితీ పురస్కారానికి ఈసారి అంపశయ్య నవీన్‌ను ఎంపిక చేశారు. కాళోజీ 104వ జయంతి సందర్భంగా ఈ నెల 9న సాయంత్రం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. నవీన్‌కు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు. అధ్యాపకుడి నుంచి రచయితగా.. అంపశయ్య నవీన్ 1941లో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో జన్మించారు. నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2004లో కాలరేఖలు రచనకు గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆయన రాసిన కథల్లో చెర, బలి, దాడి ప్రముఖమైనవి. 1965–1968 మధ్య కాలంలో రచించిన తెలుగు నవల అంపశయ్య. ఇది నవీన్ రాసిన మొదటి నవల. చైతన్య స్రవంతి విధానంలో రాసిన ఈ నవల 1969లో తొలిసారి ప్రచురితమై, నేటికీ పాఠకాదరణ పొందుతోంది. ఈ నవల పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. తెలుగు, ఇంగ్లిష్ పత్రికల్లో ఆయన ఎన్నో సాహిత్య వ్యాసాలు కూడా రాశారు. -
‘అఖిల భారత కోటా’తో అవకాశాలు మెండు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లు పొందేందుకు తెలంగాణ విద్యార్థులకు భారీగా అవకాశాలు పెరిగాయి. నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడం, అఖిల భారత కోటాలో పోటీ పడేందుకు వీలు కలగడంతో సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లలో పాగా వేసేందుకు మార్గం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 150 సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్లే ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా చూస్తే వెయ్యికి పైగా సీట్లున్నాయి. గతంలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లకే దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే గతేడాది నుంచి నీట్ ద్వారా ప్రవేశాలు కల్పించడంతో పరిస్థితి మారింది. అంతేకాదు రాష్ట్రంలోని సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. ఎంబీబీఎస్ సీట్లలో కేవలం 15 శాతమే అఖిల భారత కోటాలోకి ప్రభుత్వ సీట్లు వెళ్లగా, సూపర్ స్పెషాలిటీ సీట్లు నూటికి నూరు శాతం వెళ్లడం గమనార్హం. పైగా ప్రైవేటు కాలేజీల సీట్లు కూడా అఖిల భారత కోటాలోకి వెళ్లాయి. అంటే దేశంలోని సూపర్ స్పెషాలిటీ సీట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగే కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు కూడా ఉండవు. రాష్ట్ర కోటా కూడా లేదు. అంటే దేశంలోని అన్ని సీట్లల్లోనూ రాష్ట్ర విద్యార్థులు పోటీ పడటానికి వీలు కలిగిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి వెబ్ కౌన్సెలింగ్.. సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల కోసం నీట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆయా కోర్సుల్లో చేరేందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లను లాక్ చేసుకునేందుకు ఐదో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆరో తేదీన సీటు కేటాయింపు జరుగుతుంది. వాటి ఫలితాలను ఏడో తేదీన ప్రకటిస్తారు. సీటు పొందిన విద్యార్థులు అదే నెల 8 నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో చేరడానికి గడువు విధించారు. ఇక రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 16 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు తమకు వచ్చిన సీటును 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ చేసుకోవాలి. 20వ తేదీన సీటు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. 21వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. 22 నుంచి 27వ తేదీ వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరేందుకు గడువు విధించారు. ఇదిలావుండగా గతేడాది దేశవ్యాప్తంగా అనేక కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ సీట్లు మిగిలిపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. గతేడాది రెండు సార్లు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. సీట్లు మిగిలిపోవడంతో వాటిని తిరిగి భర్తీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. -
నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2018–19 సంవత్సరానికి ‘ఎ’కేటగిరీ కన్వీనర్ కోటా సీట్లకు తొలి విడత వెబ్ కౌన్సెలింగ్‌కు శుక్రవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ఓ ప్రకటన జారీచేశారు. కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందని, తుది మెరిట్ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు కూడా తొలి విడత కౌన్సెలింగ్‌లోనే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు ఎన్ని వెబ్ ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చని చెప్పారు. వచ్చిన కాలేజీలో చేరాల్సిందే..! సీటు కేటాయించాక సంబంధిత అభ్యర్థికి కేటాయించిన కాలేజీలో చేరకపోతే వచ్చే కౌన్సెలింగ్‌కు అనర్హులుగా ప్రకటిస్తామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు వారి ప్రాధాన్యం, కాలేజీ, కోర్సుల ఎంపికలో జాగ్రత్త వహించాలని సూచించారు. క్రీడలు, ఎన్సీసీ, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధిత అధికారుల నుంచి ప్రాధాన్య జాబితా వచ్చాక ఆయా కోటాకు సంబంధించిన వెబ్ అప్షన్లకు మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www. knruhs. inను సందర్శించాలని సూచించారు. నీట్లో 1 నుంచి 5 వేల ర్యాంకుల అభ్యర్థులు 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. 5,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్లను మార్చుకోవాలనుకునే వారికి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం ఇస్తామని చెప్పారు. వెబ్ ఆప్షన్లకు సంబంధించిన పేజీని ప్రింటు తీసుకోవాలని పేర్కొన్నారు. సీటు కేటాయించిన తర్వాత విద్యార్థుల మొబైల్ ఫోన్లకు సమాచారం అందజేస్తామన్నారు. సీటు కేటాయింపు తర్వాత సంబంధిత లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మొదటి జాబితా విడుదల.. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మొదటి విడతకు సంబంధించిన తుది జాబితాను కాళోజీ ఆరోగ్య వర్సిటీ విడుదల చేసింది. మొత్తం 10,847 మందితో జాబితాను విడుదల చేశారు. అందులో నీట్లో 16వ ర్యాంకు సాధించిన మెండ జైదీప్ నుంచి 7,56,526 ర్యాంకున్న విద్యార్థికి కూడా జాబితాలో పేరు దక్కింది. -
ఆరోగ్య వర్సిటీకి అనారోగ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులను నిర్వహించే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. మరోవైపు వైద్య విద్య కోర్సుల నిర్వహణలో ఏటా కొత్త మార్పులు వస్తున్నాయి. ఎంబీబీఎస్, డెంటల్, పీజీ మెడికల్, నర్సింగ్, ఆయుష్ వంటి అన్ని కోర్సుల సీట్లు ఇప్పుడు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆధారంగానే భర్తీ అవుతున్నాయి. గతంలో బీ, సీ కేటగిరీ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భర్తీ చేసుకునేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. వంద శాతం సీట్లను కాళోజీ వర్సిటీనే భర్తీ చేయాల్సి ఉంటోంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య డిగ్రీ, పీజీ సీట్లు అన్నీ కాళోజీ వర్సిటీ ఆధ్వర్యంలోనే భర్తీ అవుతాయి. అన్ని కోర్సులు కలిపి ఏడాది పొడవునా అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలు ఉంటున్నాయి. దీంతో వర్సిటీ పని భారం గతంలో కంటే పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్సిటీలో కనీస స్థాయిలో పరిపాలన వ్యవస్థ ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించడం లేదు. 2018–19 ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెలలో మొదలుకానుంది. పరిస్థితి మారకుంటే వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియలో, కోర్సుల నిర్వహణలో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క పోస్టూ భర్తీ కాలేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో వైద్య విద్య కోసం కాళోజీ విశ్వవిద్యాలయాన్ని 2014 సెప్టెంబర్ 26వ తేదీన వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేశారు. వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో నియమించింది. అనంతరం విశ్వవిద్యాలయం నిర్వహణకు 82 రెగ్యులర్ పోస్టులను, 22 ఔట్ సోర్సింగ్ పోస్టులను మంజూరు చేస్తూ 2016 జనవరి 19వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోస్టుల భర్తీకి అనుమతి వచ్చి రెండేళ్లు గడిచినా విశ్వవిద్యాలయంలో ఒక్క రెగ్యులర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. వైద్య శాఖలో, ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేసే 21 మందిని డిప్యూటేషన్ పద్ధతిలో కాళోజీ వర్సిటీలో నియమించారు. అధికార పార్టీలోని పలువురు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఏడాది క్రితం ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేశారు. అలా ఔట్సోర్సింగ్ కేటగిరీలోని పోస్టులను ఈ సంస్థ ద్వారా భర్తీ చేశారు. కానీ రెగ్యులర్ పోస్టుల భర్తీ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటివరకూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గానీ, ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ ఒక్కసారి కూడా యూనివర్సిటీ పరిస్థితిపై సమీక్షించలేదు. పోస్టుల భర్తీ విషయాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పరిపాలన తీరు గందరగోళంగా మారుతోంది. -
వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ.. కోటా యథాతథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ అంశం కొలిక్కి వచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీలో నేషనల్ పూల్‌లో చేరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కోటా ఉంటుందా లేదా అనే సందేహాలకు తెరపడింది. నేషనల్ పూల్‌లో చేరినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కోటా కొనసాగనుంది. పూర్తి పరిశీలన అనంతరం తెలంగాణ న్యాయ శాఖ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. మన రాష్ట్రం నేషనల్ పూల్‌లో చేరినా ఉమ్మడి రాష్ట్రాల కోటా కొనసాగాలని స్పష్టం చేసింది. వైద్య విద్య సీట్ల భర్తీ అంశంలో నేషనల్ పూల్‌లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) ఆమోదం తెలిపాయి. 2018–19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్ విధానం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. కాళోజీ నారాయణరావు వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.కరుణాకర్‌రెడ్డి నేషనల్ పూల్ అమలు విషయాన్ని ‘సాక్షి ప్రతినిధి’తో ధ్రువీకరించారు. వచ్చే విద్యా సంవత్సరంలోనేషనల్ పూల్‌తోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటా సైతం ఉంటుందని పేర్కొన్నారు. – నేషనల్ పూల్ పరిధిలో ప్రస్తుతం 4,157 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న జమ్మూకశ్మీర్ వైద్య సీట్లను సొంతంగానే భర్తీ చేసుకుంటోంది. ఈ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య విద్య డిగ్రీ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు నేషనల్ పూల్‌లో చేరలేదు. తాజాగా రెండు రాష్ట్రాలు నేషనల్ పూల్‌లో చేరాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలవుతుంది. – తెలంగాణలో 3,200 ఎంబీబీఎస్, 1,140 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. నేషనల్ పూల్ అమలు చేస్తుండటంతో 2018–19 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 70 శాతం స్థానికులకే కేటాయిస్తారు. 15 శాతం సీట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటాగా ఉంటాయి. మరో 15 శాతం సీట్లు నేషనల్ పూల్ కోటాలో ఉంటాయి. – ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో విద్యా సంస్థలకు పదేళ్లపాటు(2024 వరకు) ఉమ్మడి కౌన్సెలింగ్ నిబంధన అమలులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల్లోని సీట్లలో 15 శాతం కోటాను మెరిట్ ప్రాతిపదికన పదేళ్లపాటు పరస్పరం కేటాయించుకోవాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. 15 శాతం సీట్లలో మెరిట్ కోటా కింద ఆంధ్రప్రదేశ్ వారు పోటీ పడతారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధానం అమలవుతోంది. ఆ రాష్ట్రంలోని 15 శాతం సీట్లకు తెలంగాణ విద్యార్థులు మెరిట్ ప్రాదిపదికన దక్కించుకునే అవకాశం ఉంటుంది. – అలాగే మరో 15 శాతం సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్తాయి. అన్ని రాష్ట్రాల్లోని అభ్యర్థులు మెరిట్ ప్రాతిపదికన నేషనల్ పూల్‌లోని సీట్లను పొందే పరిస్థితి ఉంటుంది. మన రాష్ట్రంలోని విద్యార్థులు సైతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 15 శాతం సీట్లను మెరిట్ ప్రాదిపదికన పొందే అవకాశం ఉంటుంది. – వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ కోసం మే 6న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)ను నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9 వరకు దరఖాస్తు ప్రక్రియగా నిర్ణయించారు. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ, ఫీజు చెల్లింపు అన్ని ఆన్లైన్ పద్ధతిలోనే ఉండనున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్‌లో నీట్‌ను నిర్వహించనున్నారు. -
కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన రిజిస్ట్రార్ పోస్టులో కొనసాగుతారని పేర్కొంది. ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం వరంగల్‌లోని మహాత్మా గాంధీ స్మారక ఆస్పత్రిలో అనస్తీషియా విభాగం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు ఆగస్టు 31న ఖాళీ అయింది. -
ఓయూలో ఘనంగా కాళోజీ జయంతి
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ప్రజాకవి, పద్మభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాళోజీ జయంతిని సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్యులు, పరిశోధకులు మాట్లాడుతూ కాళోజీ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ భాషా వైశిష్ట్యాన్ని, తెలంగాణ మాండలికాన్ని కాళోజి నిర్భయంగా ఉపయోగించిన తీరును వివరించారు. ఆయన నిరాడంబర జీవితాన్ని గుర్తు చేస్తూ, జీవితాంతం బడుగు బలహీనుల కోసం కలాన్ని కదిపిన మహనీయుడని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా కంటతడిపెట్టే సున్నితమైన మనసుగలవారని, అదే సమయంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగా ప్రశ్నించే దీశాలి అని కొనియాడారు. కాళోజి అందించిన స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అందుకోవాలన్నారు. తెలంగాణా భాష, యాసల ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేయాల్సిన బాధ్యత భావి పరిశోధకులపై ఉందన్నారు. ఈ కార్యమంలో ఆర్ట్స్ కళాశాల ఉప ప్రధానాచార్యులు, తెలుగు శాఖ అధ్యక్షులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
కాళోజీ యాదిలో..
♦ ఉమ్మడి జిల్లాతో నారాయణ రావుకు అనుబంధం ♦ జలగం వెంగళరావుపై ఎన్నికల్లో పోటీ ♦ నేడు కాళోజీ జయంతి తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని.. తెలంగాణ స్వేచ్ఛాగీతిక ఆలపించిన బడుగుల మనిషి.. పోరాటంలో తరించిన ప్రజాకవి మన కాళోజీ నారాయణరావు. ఆయనకు ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం జిల్లాలతో విడదీయలేని అనుబంధం ఉంది. తెలంగాణ గోసను వినిపించిన కాళోజీ జయంతి సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. శనివారం కాళోజీ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. ఖమ్మంకల్చరల్: ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాళోజీ బంధువులు, మిత్రులు న్నారు. 1972 సంవత్సరంలో ఎమర్జెనీ ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో అప్రజాస్వామ్యక విధానాలకు వ్యతిరేకంగా, పీడీతతాడితుల పక్షపాతిగా నిర్బంధాలను ధ్వంసం చేస్తూ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నాటి జలగం వెంగళరావుపై పోటీకి నిలిచారు. ఈ సందర్బంగా అనేక సభల్లో తనదైన శైలిలో గళం విప్పారు. స్వేచ్ఛాయుత రాజీకీయాలకు బీజం వేసి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ‘నెత్తుటి ధారలు’ పుస్తకావిష్కరణ.. నాటి ఇల్లెందు ప్రాంత కాచనపల్లి ఎన్కౌంటర్ సందర్భంగా ముద్రించిన ‘నెత్తుటిధారలు’ పుస్తకాన్ని ఖమ్మం జిల్లా కేంద్రంలోని గ్రం«థాలయంలో కాళోజీ ఆవిష్కరించి ఉద్వేగభరిత ఉపన్యాసమిచ్చారు. ఇలా పలుమార్లు జిల్లాలో ప్రజాస్వామ్యవాదిగా, మానవతావాదిగా తన జీవనగమనాన్ని సాగించారు. కలం యోధుడు... ప్రజల సమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు కాళోజీ నారాయణరావు. నా కులం, నా ప్రాంతం, నా భాష అనే భేదం లేని గొప్ప మానవతావాది. తరాలు మారినా, యుగాలు మారినా కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉంది. రవీందర్, తెలుగు లెక్చరర్ ‘కాళోజీ’ నిత్య చైతన్య స్ఫూర్తి ప్రజాకవి కాళోజీ జయంతి తెలుగు వారి పండగ కావడం గర్వకారణం. కాళోజీ అప్రజాస్వామ్యక విధానాలపై తిరుగుబాటు కలాన్ని గళాన్నెత్తిన చైతన్యస్ఫూర్తి. అన్ని తరాలకు ఆదర్శవాదిగా భవితకు మార్గదర్శిగా కాళోజీ నిలిచారు. –లెనిన్ శ్రీనివాస్, వికాస వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగుయాస, భాష కోసం పోరాడిన మహోన్నతుడు అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు సకలించు ఆంధ్రుడా! చావవెందుకురా! అంటూ తెలుగు భాష యాస, భాష కోసం విశేష కృషి చేసిన ప్రజాకవి కాళోజీ..! కాళోజీ కలానికి కోట్ల కత్తుల పదును. అందుకే ప్రతినిత్యం ప్రజల పక్షాన నిలబడి కలాన్ని ఝలిపించారు. అలాంటి మహోన్నతుడి జయంతిని అధికారింగా జరుపుకోవడం అభినందనీయం. –రాచమళ్ల ఉపేందర్, రచయిత -
వైద్య విద్య సీట్లకు 9 నుంచి దరఖాస్తులు
- 18న ముగియనున్న గడువు - మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు - ప్రకటించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనర్ (కాంపిటెంట్ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకు ప్రకారం ఆన్లైన్లో జూలై 9 ఉదయం 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ గడువు జూలై 18న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపింది. http://medadm.tsche.in, www.knruhs.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్ జాబితాను ప్రకటిస్తుంది. అనంతరం ర్యాంకుల ప్రకారం అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలించి మరోసారి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్లో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆప్షన్లను పరిశీలించి మెరిట్ ప్రకారం వర్సిటీ సీట్లను కేటాయిస్తుంది. -
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 2017–18 విద్యా సంవత్సరానికి కన్వీనరు (కాంపిటెంట్ అథారిటీ) కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్) ర్యాంకు ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్ 9న ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది. జూన్ 18న సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. www.knruhs.in, http://medadm.tsche.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెరిట్ జాబితాను ప్రకటిస్తుంది. అనంతరం ర్యాంకుల ప్రకారం అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ తర్వాత మరోసారి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం ఆన్లైన్లో ఆప్షన్లు ఇస్తారు. అభ్యర్థుల ఆప్షన్లను పరిశీలించి మెరిట్ ప్రకారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సీట్లను కేటాయిస్తుంది. -
150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకోవచ్చు
- మల్లారెడ్డి మహిళా కాలేజీకి కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: మల్లారెడ్డి మహిళా మెడికల్ కాలేజీకి ఎట్టకేలకు ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుమతించింది. 2016-17 వైద్య విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేసింది. ఆ కాలేజీలోని సగం కన్వీనర్ కోటా (75) సీట్లకు ఈనెల 29న వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. వాటితోపాటు రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలే సీట్లకు, స్పోర్ట్స్ కోటాకు చెందిన 10 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్పోర్ట్స్ కోటా సీట్లకు సంబంధించి ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి మెరిట్ లిస్టు రాలేదు. లిస్టు 28వ తేదీ సాయంత్రానికి వస్తేనే ఆ సీట్ల భర్తీ జరుగుతుందని వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జాబితా పంపాలని అథారిటీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. మల్లారెడ్డి కాలేజీలో 29న ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నందున, బి కేటగిరీ మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లతోపాటు మల్లారెడ్డి కాలేజీకి వచ్చిన సీట్లలో బి కేటగిరీకి చెందిన 35 సీట్లకు ఈనెల 30న కౌన్సెలింగ్ నిర్వహించుకునేందుకు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్య సంఘానికి అనుమతి ఇచ్చినట్లు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
కాళన్నకు నివాళి
హన్మకొండ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో ఇదేరోజు సాహితీవేత్తలు తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజు ఆహ్మద్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, వరంగల్ పోలీస్ కమిషనర్ గొట్ట సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా, సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ డీ.ఎస్.జగన్, వరంగల్ ఆర్డీఓ వెంకటమాధరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, నాయకులు హసనుద్దీన్, వెంకటేశ్వర్లు, సామ్యేల్ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు ఈ.వీ.శ్రీనివాస్, మోడెం శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, నాయకులు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, నాయకులు కాయిత రాజ్‌కుమార్, మేకల రాజు, మనోహర్, గడ్డం రమేష్, ఊరగంటి శ్రీను వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్. విద్యార్ధి, ప్రముఖ కవి పోట్లపల్లి శ్రీనివాస్‌రావు కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి.జితేందర్‌రావు, శనిగారపు రాజమోహన్ తదితర కవులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు డాక్టర్ వి.విశ్వనాథం, మోత్కూరి మనోహర్‌రావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తిరువరంగం ప్రభాకర్, జిల్లా కన్వీనర్ వల్స పైడి, రహమాన్, బోయినపల్లి పురుషోత్తమరావు, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ కన్వీనర్ అస్నాల శ్రీను, కవులు దేవులపల్లి వాణి, దినకర్, అన్వర్ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తెలంగాణలోనే కాళోజీకి గుర్తింపు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా కవి కాళోజీ నారాయణరావుకు తగిన గుర్తింపు, గౌరవం లభించిందని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాళోజీ జయంతిని హన్మకొండలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ప్రభుత్వం కాళోజీని జయంతిని తెలంగాణ భాషా దినంగా నిర్వహించడంతో పాటు కాళోజీ కేంద్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, కె.వాసుదేవరెడ్డి, మాడిశెట్టి శివశంకర్, సారంగపాణి, శ్రీకర్, వీఎస్ యాకూబ్‌రెడ్డి, కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, బోయినిపల్లి రంజిత్‌కుమార్, వీరగంటి రవీందర్, నల్ల స్వరూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, నాయకులు నలుబోలు సతీష్, చెన్నం మధు. పులి రజనీకాంత్ పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీలో.. ఎంజీఎం : వరంగల్ కేఎంసీ ప్రాంగణంలోని ఆరోగ్య నారాయణరావు వర్సిటీలో కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బి.కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సత్యనారాయణ, వైద్యులు ప్రవీణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన కవితలే ఆయుధాలు
హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్: ప్రజాకవి ‘కాళోజీ నారాయణరావు’ జీవితం ఎంతో విశాలమైందని, ఆయన జీవితాంతం ప్రజాస్వామిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తూ యువతలో ఉద్యమ స్ఫూర్తిని నింపారని శాసన సభ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. తెలంగాణ బాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం–కాళోజీ జయంతిని పురస్కరించుకుని ‘‘తెలంగాణ భాషా పరిరక్షణ–రచయితలు–భాషావేత్తల కర్తవ్యం’’ అంశంపై తెలుగు అకాడమిలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా‘సాక్షి’ దినపత్రిక కార్టునిస్ట్ శంకర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం స్పీకర్‌మాట్లాడుతూ ఉద్యమాల్లో కాళోజీ తన కవితలనే ఆయుధాలుగా మలుచుకున్నారన్నారు. తెలంగాణ తెలుగు యాసను బతికించేందుకు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ కాళోజీ సమాజిక పరిస్థితులపై తన కవిత్వంతో ఎండగట్టే వారన్నారు. నందిని సిదారెడ్డి మాట్లాడుతూ ఆధిపత్య భావనలపై తిరుగుబాటులో ఆయన ప్రహ్లాద పాత్రను ఆదర్శంగా తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో ఆచార్య రివ్వాశ్రీహరి, సత్యనారాయణరెడ్డి, డాక్టర్ గంటా జలందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాహిత్యమే ఆయన ఊపిరి కాళోజీ నారాయణరావు సాహిత్యమే ఉపిరిగా జీవించారని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కాళోజి జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమంతో మొదలైన ఆయన తెలంగాణా రైతాంగ పోరాటం, తొలిదశ తెలంగాణ ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. కాళోజీ వాడిన పదాలు అన్వయిస్తూ తెలంగాణా బాషా నిఘంటువును రూపొందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయనను విశ్వవిద్యాలయ యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో వీసీ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుభాషను కాపాడుకోవాలి
శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కమాన్‌చౌరస్తా : మాతృభాష తెలుగును సంరక్షించుకోవాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘నేటి విద్యావిధానం –మాధ్యమం–ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబల్ సమావేశంలో పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యా బోధనలో ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు బండి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను, అవశ్యకతను వివరించారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు 5 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, లక్ష్మీప్రసాద్, యశ్వంత్, ఉమేరా తస్మిన్, విజయ్‌కుమార్, విజయ ప్రకాశ్, ప్రదీప్‌రాజ్, రమేశ్, హరికృష్ణ, విద్యార్థులు రాందాస్, జనార్దన్, మౌనిక, సౌజన్య, రాజు, వెంకటేశ్, రంజిత్ పాల్గొన్నారు. వివేకనందలో.. వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, ఉపన్యాసకులు ఎండీ అలీఖాన్, వేణుగోపాలశర్మ, శ్రీలత, సాగర్, శ్రీనాథ్‌రెడ్డి, అకడామిక్ కో–ఆర్టినేటర్ బి.సంపత్‌కుమార్, ఏవో శ్రావణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. కాళోజీ జయంతి వేడుకలు కరీంనగర్‌కల్చరల్ : శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాష దినోత్సవం నిర్వహించారు. సాహితీవేత్త దాస్యం సేనాధిపతిని సన్మానించారు. కళాశాల డైరెక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి ముద్దసాని రమేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి.మల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రాంగోపాల్‌రావు, తెలుగుశాఖ అధ్యక్షుడు మధుసూదనస్వామి పాల్గొన్నారు. వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి, అధ్యాపకులు సంపత్, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. పారమిత స్కూల్లో విద్యార్థులు ‘కాళోజీ కవిత్వం–భాష–యాస’ అంశంపై కవిత్వాలు రాశారు. ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారి, కో ఆర్డినేటర్స్ అరుణ, హేమ, శ్రీలత, ఉపాధ్యాయినీలు గీతాంజలి, విజయ, మధులత, శ్రీలత, రమ, స్వప్న, అభినవ్, చిరంజీవచారి పాల్గొన్నారు. ‘తెలంగాణ తెలుగు’ డాక్యుమెంటరీ ప్రారంభం ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ తెలుగు’ అనే డాక్యుమెంటరీ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. శతాధిక గ్రంథకర్త మలయశ్రీపై ముహుర్తం షాట్‌ను చిత్రీకరించారు. కళాశాల ప్రిన్సిపల్ పి.నితిన్, విశ్రాంత లైబ్రేరియన్ వారాల ఆనంద్, చిత్ర దర్శకుడు కొత్తిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. మలయశ్రీ రచించిన 128వ పుస్తకం ‘తెలంగాణ పోరుకేక జయ పతాకం’ ఆవిష్కరించారు. అధ్యాపకులు మస్రూర్ సుల్తానా, శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, రాజు, సత్యనారాయణ, జార్జ్, శ్రీనివాస్, ఎలిజాబెత్రాణి, సుబ్బారాంరెడ్డి, ప్రేమ్‌చంద్, నాగరాజు పాల్గొన్నారు. సత్యంగౌడ్‌కు సత్కారం కరీంనగర్ కల్చరల్ : కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యంగౌడ్‌ను ఏజేసీ నాగేంద్ర సత్కరించారు. -
తెలుగుభాషను కాపాడుకోవాలి
శాతవాహన రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కమాన్‌చౌరస్తా : మాతృభాష తెలుగును సంరక్షించుకోవాలని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ‘నేటి విద్యావిధానం –మాధ్యమం–ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టెబల్ సమావేశంలో పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యా బోధనలో ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు బండి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను, అవశ్యకతను వివరించారు. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు 5 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, లక్ష్మీప్రసాద్, యశ్వంత్, ఉమేరా తస్మిన్, విజయ్‌కుమార్, విజయ ప్రకాశ్, ప్రదీప్‌రాజ్, రమేశ్, హరికృష్ణ, విద్యార్థులు రాందాస్, జనార్దన్, మౌనిక, సౌజన్య, రాజు, వెంకటేశ్, రంజిత్ పాల్గొన్నారు. వివేకనందలో.. వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, ఉపన్యాసకులు ఎండీ అలీఖాన్, వేణుగోపాలశర్మ, శ్రీలత, సాగర్, శ్రీనాథ్‌రెడ్డి, అకడామిక్ కో–ఆర్టినేటర్ బి.సంపత్‌కుమార్, ఏవో శ్రావణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. కాళోజీ జయంతి వేడుకలు కరీంనగర్‌కల్చరల్ : శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాష దినోత్సవం నిర్వహించారు. సాహితీవేత్త దాస్యం సేనాధిపతిని సన్మానించారు. కళాశాల డైరెక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి ముద్దసాని రమేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జి.మల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రాంగోపాల్‌రావు, తెలుగుశాఖ అధ్యక్షుడు మధుసూదనస్వామి పాల్గొన్నారు. వివేకానంద విద్యానికేతన్ స్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి, అధ్యాపకులు సంపత్, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. పారమిత స్కూల్లో విద్యార్థులు ‘కాళోజీ కవిత్వం–భాష–యాస’ అంశంపై కవిత్వాలు రాశారు. ప్రిన్సిపాల్ శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ తివారి, కో ఆర్డినేటర్స్ అరుణ, హేమ, శ్రీలత, ఉపాధ్యాయినీలు గీతాంజలి, విజయ, మధులత, శ్రీలత, రమ, స్వప్న, అభినవ్, చిరంజీవచారి పాల్గొన్నారు. ‘తెలంగాణ తెలుగు’ డాక్యుమెంటరీ ప్రారంభం ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ తెలుగు’ అనే డాక్యుమెంటరీ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. శతాధిక గ్రంథకర్త మలయశ్రీపై ముహుర్తం షాట్‌ను చిత్రీకరించారు. కళాశాల ప్రిన్సిపల్ పి.నితిన్, విశ్రాంత లైబ్రేరియన్ వారాల ఆనంద్, చిత్ర దర్శకుడు కొత్తిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు. మలయశ్రీ రచించిన 128వ పుస్తకం ‘తెలంగాణ పోరుకేక జయ పతాకం’ ఆవిష్కరించారు. అధ్యాపకులు మస్రూర్ సుల్తానా, శ్రీనివాస్‌రెడ్డి, రాజేష్, రాజు, సత్యనారాయణ, జార్జ్, శ్రీనివాస్, ఎలిజాబెత్రాణి, సుబ్బారాంరెడ్డి, ప్రేమ్‌చంద్, నాగరాజు పాల్గొన్నారు. సత్యంగౌడ్‌కు సత్కారం కరీంనగర్ కల్చరల్ : కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యంగౌడ్‌ను ఏజేసీ నాగేంద్ర సత్కరించారు. -
ధిక్కారస్వరం ‘కాళోజీ’
ఓరుగల్లులో ప్రభవించిన విశ్వనరుడు కవితలతో అన్యాయాన్ని ఎదిరించిన కాళన్న తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చురుకైన పాత్ర నేడు కాళోజీ నారాయణరావు జయంతి కాళోజీ నారాయణరావు జీవితం ఎంతో విశాలమైంది. బతికున్నంత కాలం ఆయన ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మరణాంతరం కూడా ఆయన భావాలు అదే స్థాయిలో వేదికగా నిలిచి ప్రజాస్వామ్యవాదులకు, కళాకారులకు స్ఫూర్తినిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో కూడా ఆయన జీవితం పెనవేసుకుపోయింది. అందుకే ‘‘లొల్లికి లొల్లిSజతకట్టి.. లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు పృథ్వీలోనా.. ఎల్లకాలము గుర్తుండు చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న.. కరుణ హృదయ..’’ అంటూ ప్రముఖ కవి నల్ల ఉపేందర్ కాళోజీ జీవితాన్ని శతకంగా రాశారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, తర్వాత కొనసాగిన ప్రత్యేక తెలంగాణ తొలిదశ, మలి దశఉద్యమాలతోనూ ఆయన జీవితం ముడిపడి ఉంది. కాళోజీ తన భావాలకే కాదు.. శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి. నేడు కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. –హన్మకొండ కల్చరల్ కవితలే ఆయుధాలు.. ఉద్యమ కార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితలనే ఆయుధాలుగా మలుచుకుని విజృంభించేవారు. కాళోజీ ఎక్కడ ఉన్నా ఆయన కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉంటాయి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగుభాషపై నిరాదరణ కొనసాగుతుండడంపై కాళోజీ స్పందించారు. ఏ భాషరా.. నీది యేమి వేషమురా..? ఈ భాష.. ఈ వేషమెవరి కోసమురా..? ఆంగ్లమందున మాటలాడ గలుగగనే.. ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా..? ...అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు.. సకిలించు ఆంధ్రుడా.. ! చావవెందుకురా? అంటూ తెలుగును వ్యతిరేకించే వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ.. నవయుగంబున నాజీవృత్తుల నగ్న నృత్య మింకెన్నాళ్లు..? పోలీసు అండను దౌర్జన్యాలు.. పోషణబొందె దెన్నాళ్లు..? దమననీతి లో దౌర్జన్యాలకు.. దాగిలిమూతలు ఎన్నాళ్లు..? కంచెయె చేనును మేయుచుండగా.. కాంచకుండుటింకెన్నాళ్లు.. ? అంటూ ప్రశ్నించారు. 1946 లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ప్రజా సంస్థపై పగ సాధించిన.. ఫలితం తప్పక బయటపడున్.. నిక్కుచునీల్గే నిరంకుశత్వము.. నిల్వలేక నేలను గూలున్.. చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను.. స్థిరమగు కట్టయు శిథిలగున్.. అంటూ హెచ్చరించారు. మీర్జా ఇస్మాయిల్‌కు ప్రశ్నల వర్షం.. 1946లో వరంగల్ కోటలో మొగిలయ్య అనే వ్యక్తిని హతమార్చారు. మరో చోట పసిబాలుడిని దారుణంగా పొడిచారు. అయితే ఆ కాలంలో చంపిన వారికి శిక్ష వేయాల్సింది పోయి.. జాతీయ జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశ బహిష్కరణ శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఇక్కడి సంఘటనలపై విచారణ చేసేందుకు వచ్చిన నిజాం ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్‌ను కాళోజీ నారాయణరావు తన కవిత ద్వారా ప్రశ్నించారు. ఇది అందరికి చిరపరిచితమే ఎన్నాళ్ల నుండియో ఇదిగో.. అదిగో.. అనుచూ.. ఈ నాటికైనను ఏగివచ్చితివా..? కోట గోడల మధ్య ఖూనీ జరిగిన చోట.. గుండాల గుర్తులు గోచరించినవా.. బాజారులో బాలకుని బల్లెంబుతో పోడుచు.. బద్మాషునేమైనా పనిబట్టినావా.. మొగిలయ్య భార్యతో, మొగిలయ్య తల్లితో.. మొగమాటము లేక ముచ్చటించితివా..? కాలానుగుణ్యమగు కాళోజీ ప్రశ్నలకు.. కన్నులెర్రగా చేసి ఖామూషి అంటావా..? అంటూ సర్ మీర్జాఇస్మాయిల్‌ను కాళోజీ ప్రశ్నించారు. ఇది ఇంగ్లిష్‌లో వార్డు బె స్టరు ఫీల్డుకు డాక్టర్ జాన్సన్ రాసిన లేఖ వంటిదని.. ఇప్పటికి లేఖ సాహిత్యంలో ఉత్తమ శ్రేణికి చెందిందిగా గుర్తిస్తారు. కాళోజీ కేవలం ఇక్కడి పోరాటాలకు మాత్రమే కాదు జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో జరిగిన ఘటనలకు కూడా స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారత నావికాదళ సిబ్బందికి తెల్లవారితో సహా సమాన హోదాలు, జీతభత్యాలు ఇస్తానని చెప్పి మాటతప్పింది. దీంతో భారత నావికులు తిరుగుబాటు చేశారు. ఈ సమయంలో కాళోజీ వారికి మద్దతుగా నిలిచి కవిత రాశారు. యుద్ధ కాలమునందు ఉబ్బించి ఉబ్బించి ఉత్సాహ పరిచారురా..! పాలకుల పాలితుల భేదాలికుండవని ప్రకటనలు చేశారురా..! ఫాసిస్టు వ్యతిరేక పాటలతో.. ఆటలతో బా నిసల రేపారురా..! వర్ణభేదము మాట పౌరస్వత్వములందు వర్తించదన్నారురా..! యుద్ధంబు ముగిసినను బానిసత్వము మిగిలి ఉండనే ఉన్నాదిరా..! పాలకుల యుద్ధంబు జేసింది యెందుకో బట్ట బయలైనాదిరా..! అంటూ వారిపై మండిపడ్డారు. స్ఫూర్తిదాయకంగా సెప్టెంబర్ 9 కాళోజీని, ఆయన ప్రజాస్వామిక విలువలను, ధిక్కారస్వరాన్ని అభిమానించే, అనుసరించేవారికి ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 9 స్ఫూర్తిదాయకమైన తేదీగా నిలిచింది. కాళోజీ నారాయణరావు చనిపోయిన తర్వాత కాళోజీ మిత్రమండలి, కాళోజీ ఫౌండేషన్ పేరుతో పాటు జిల్లా లోని అన్ని సాహిత్యసంస్థలు కలిసి ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహించేవారు. ఈ సమయంలో ప్రభుత్వం, జిల్లాలోని రాజకీయనాయకులు వారికి కనీస సహకారం ఇవ్వనిపరిస్థితి ఉండేది. ఆయినప్పటికీ ప్రతియేటా కాళోజీ జయంతిని తెలుగు మాండలిక భాషాదినోత్సవంగా జరుపుతూ వచ్చారు. 2013లో కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, జీవన్‌కుమార్ సమస్వయకర్తగా, ప్రముఖన్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా.. కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటై ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2013 సెప్టెంబర్ 9న హన్మకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో జరిగిన శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభ చారిత్రాత్మకమైంది. ఇది తెలంగాణ ఉద్యమం చివరి మలుపులో ఉన్నప్పుడు జరిగిన కీలకమైన సభగా నిలిచింది. విశ్వవ్యాప్తం కానున్న కాళోజీ.. దురదృష్టవశాత్తు కాళోజీకి సంబంధించిన ఆనవాళ్లుగాని.. ఆయన ఉపన్యాసాలుగాని భద్రపరచలేదు. కానీ.. కాళోజీ బతికున్న కాలంలో పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్ హంటర్‌రోడ్డులో ఏర్పాటు చేసిన జానపదగిరిజన విజ్ఞానపీఠం కాళోజీ సంభాషణలను రికార్డుచేసి భద్రపరిచింది. ఇవి చాలా కీలకమైనవి. కాళోజీ రాసిన ప్రతి కవితకు సంబంధించిన చరిత్రను నాగిళ్ల రామశాస్త్రి అడుగుతుండగా.. కాళోజీ వివరించేవారు. అలాగే ఆయన ఫొటోలను కూడా భద్రపరిచారు. వీటి సహకారంతో బి. నర్సింగరావు దర్శక త్వంలో ‘మన కాళోజీ డాక్యుమెంటరీ’ నిర్మాణం చేశారు. బడి పలుకుల భాషకాదు.. పలుకుబడుల భాష.. కావాలని కాశోజీ నినందించేవారు. ఎవరి భాషలో.. మాండలికంలోనే వారు మాట్లాడుకోవాలని కాళోజీ చెప్పుడు చెప్పేవారు. మాండలికభాషకు పెద్దపీట వేయాలని, కాళోజీ జయంతిని మాండలిక భాషా దినోత్సవంగా ప్రకటించాలని కాళోజీ అభిమానులు, అనుచరులు చాలా కాలంగా కోరుతూవచ్చారు. కానీ.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదీ కూడా పట్టించుకోలేదు. కాళోజీ శతజయంతి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. జైజై జయహో అంటూ తెలంగాణ నినాదాలు మిన్నుముట్టాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా ప్రకటించారు. కాళోజీ పేరిట హన్మకొండ బాలసముద్రంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణం జరుగుతోంది. కాళోజీ జీవితాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆశయంతో కాళోజీ బయోగ్రఫీని రూపొందిస్తున్నారు. -
కాళోజీ జీవితంలోని రెండు ఉదంతాలు
సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి కాళోజీ రెండోసారి (1942) జైల్లో వున్నప్పుడు టి.బి. మూలంగా తీవ్రంగా సుస్తీ చేసింది. అప్పటికే ఒక ఊపిరితిత్తిని కోల్పోయిన ఒంటూపిరి మనిషి జైల్లోవుంటే దుర్గతి తప్పదని అన్న రామేశ్వరరావు భయపడ్డాడు. ఎట్లాగైనా విడిపించి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. జైలు అధికారి క్రూరుడు. శిక్ష రెండున్నరేండ్లు. అప్పటికి గడిచింది ఆరునెలల కాలమే! జీవితాంతం సర్కారును విమర్శించబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే విడుదల చేస్తామన్నారు. అన్నగారి సమక్షంలో జైలు అధికారి ఆ కాగితం కాళోజీకి ఇచ్చాడు. సంతకం చేయమని ఆదేశించాడు. ‘‘ఈ రొండేండ్లు నా చేతి కింద నలిగి నిలబడలేవు. ఉన్నా చచ్చిపోతావ్’’ అని హుంకరించాడు అధికారి. తాను ఆ షరతులకు లొంగేది లేదని కాళోజీ తిరుగులేని మాటల్లో చెప్పేశాడు: ‘‘రొండేండ్లు ముందుగా సర్కారు విడిచిపెడుతనంటున్నది. నేను ఆ రొండేండ్లు మాత్రమే సర్కారును విమర్శించను. అంతేతప్ప ఆజన్మాంతం సర్కారుకు విరుద్ధంగా ప్రవర్తించనని మాత్రం చస్తే రాసివ్వ’’.కాళోజీ షరతులకు సర్కారు అంగీకరించింది! దీంతో కాళోజీ విడుదలై ఇల్లు చేరాడు. వద్దిరాజు రాజేశ్వరరావు అనే పెద్ద వకీలు దగ్గర కాళోజీ జూనియర్‌గా పని చేసేవాడు. రాజేశ్వరరావు పెద్ద జమీందారు. 49 మంది వున్న సమష్టి కుటుంబానికి యజమాని. ఆ భార్యాభర్తలకు దోమలు కరుస్తుండటం వల్ల ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఇది గమనించి కాళోజీ- ‘‘భాయీసాబ్, రొండు దోమ తెరలు కొనుక్కోవద్దా మీరు?’’ అని అడిగాడు. అందుకు రాజేశ్వరరావు -‘‘మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ గద, అందరికి బాధ్యత వహించవలసిన వాణ్ణి నేను. మాకు ఆమ్దని వున్నది. ఖర్చున్నది. 49 దోమతెరలు కొనేటి అవకాశం వున్నప్పుడు మాక్కూడ రొండు దోమతెరలు వస్తయి’’ అన్నాడు. జమీందారుకు 49 మంది విషయంలోనైనా సమదష్టి వున్నందుకు కాళోజీ ఆలోచనలో పడ్డాడు. ‘మరి ఈ కాళోజీ విశ్వమంత ఒకటే కుటుంబమనుకున్నడు. అందరు సుఖపడాలే అనుకున్నడు. తన దోమతెర గురించి పట్టించుకున్నడు. తన భార్యకు దోమతెర వున్నదో లేదో అని ఎన్నడు ఆలోచించలే’ అనుకుంటూ తన ఆలోచనకూ ఆచరణకూ మధ్యవున్న తేడాను గుర్తించటమే కాదు, ఈ ఉదంతాన్ని కాళోజీ గర్వభంగంగా భావించాడు. జీవితంలోఒక పాఠం నేర్చుకున్నాడు. రచయిత: అమ్మంగి వేణుగోపాల్ 9441054637 -
గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కుకవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు. -
గోరటి వెంకన్నకు ‘కాళోజీ’పురస్కారం
మట్టి మనిషి కిరీటంలో మరోతురాయి పాలమూరు మట్టిబిడ్డకు మరో గౌరవం తెలకపల్లి/మహబూబ్‌నగర్ కల్చరల్: ‘పల్లే్లకన్నీరు పెడుతుందో’ అని విలపించినా, ‘వాగులెండిపాయేరా’ అని బాధపడినా, ‘సంత మావురు సంతా’ అని సంబరపడినా, ‘ఏమిమారే ఏమీమారేరా’ అని చింతచేసినా గోరటి వెంకన్న పాట వినిపిస్తుంది. ప్రముఖ కవి, సినీగేయ రచయిత, ప్రకృతి కవి, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ప్రభుత్వం భాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆయనకు ఈ అందజేయనున్నారు. గోరటి వెంకన్న తెలకపల్లి మండలం గౌరారం స్వగ్రామం. ఆయన చిన్నతనం నుంచే తండ్రి గోరటి నర్సింహ్మ, తల్లి ఈరమ్మ యక్షగానం, భజన కీర్తనలు, మంగళ హారతుల పాటలతో వెంకన్న మనసును పాటల వైపు మళ్లింది. పచ్చటి పల్లెపొలాలు, దుందుభీ వాగు తీరాన్ని చూస్తూ పెరిగిన ఆయన ప్రకృతే తన పాటకు వస్తువుగా మార్చుకున్నారు. వెంకన్న విద్యాభ్యాసం జిల్లాలోనే కొనసాగింది. ప్రస్తుతం ఆయన నాగర్‌కర్నూల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటడమే కాక స్వరాష్ట్ర ఆవశ్యకతను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వెంకన్న పాటలు ఆకట్టుకుంటాయి. అచ్చతెలుగు మాండలికానికి చిరునామా గోరటి వెంకన్న. మన బాస, యాసను మరిచిపోతున్న తరుణంలో ఆయన రాసిన ప్రతి గేయంలో, పాటలో మాండలిక గుభాళిలిస్తాయి. పల్లె పాటలకు ప్రాణం 1984లో ‘నీ పాట ఏమాయెరో కూలన్నా, నీ ఆట ఎటుపాయెరో మాయన్నా’ అంటూ మొదటిసారి రాసిన పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ‘రాజహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో’ అనే పాట ప్రముఖ సినీదర్శకుడు శంకర్‌ను ఆకర్షించింది. ఆయన పాటలు రాయాలని పట్టుబట్టడంతో ‘ఎన్కౌంటర్’ సినిమాకు ‘జైబోలో.. జైబోలో అమరవీరులకు జైబోలో’ అంటూ అమరవీరులను స్మరిస్తూ పాటరాశారు. అప్పట్లో ఏ నోట విన్నా ఇదే పాట మార్మోగింది. ‘కుబుసం’లో పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అంటూ పల్లెగోషను వినిపించారు. ఆ పాటే వెంకన్నకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. దీంతోపాటు ఆర్.నారాయణపూర్తి సినిమాల్లో లెక్కకుమించి పాటలెన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వెంకన్న పాటలేని ధూం..ధాం కార్యక్రమమే లేదు. ‘మందెంట పోతుంటే ఎలమంద’, ‘సేతానమేడుందిరా సేలన్నీ బీడాయెరా’, ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది, జిల్లేడన్నా జిట్టా’, గుమ్మాలకు బొమ్మలోలె..’ ‘ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా’, ‘ఇండియా పాకిస్తాన్ వలె ఇనుప కంచె పడుతుందా’ అనే పాటలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. పురస్కారాలు.. తాత్వికుడిగా, వాగ్గేయకారుడిగా పాటలతో విశిష్టతను సాధించుకున్న గోరటి అనేక పురస్కారాలు అందుకున్నారు. 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారం అందించి ఘనంగా సత్కరించింది. 2014లో కర్ణాటకకు చెందిన లంకేష్ సాహితీ సమితి జాతీయ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సినారే సాహితీ సంస్థ పురస్కారం దక్కించుకున్నారు. అధికార భాషా సంఘం 2007లో తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గేయకావ్యం, తెలుగు సాహిత్య అవార్డును అందించింది. అపర కష్ణశాస్త్రి, విశాలాంధ్ర, తెరా ఇటీవల ఖమ్మంలో జీవితసాఫల్య పురస్కారం అందించింది. -
కాళోజీ కల సాకారం
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభం కానున్న యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు సాక్షి, హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో రిమోట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు దక్కిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కడంతో తెలంగాణలో ఆరోగ్య వర్సిటీని వరంగల్‌లో నెలకొల్పేలా అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఆర్యోగ్య మంత్రి తాటికొండ రాజయ్య కృషి చేశారు. చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు ఈ వర్సిటీని మంజూరు చేశారు. తొలుత కాకతీయ మెడికల్ కాలేజీలోని తాత్కాలిక భవనంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వీసీగా కరుణాకర్‌రెడ్డిని నియమించారు. రూ. 130 కోట్లతో నిర్మాణం.. వరంగల్ నగరంలో కాళోజీ యూనివర్సిటీ నెలకొల్పి ఏడాది దాటినా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. పూర్తి స్థాయిలో భవనం, సిబ్బంది లేకపోవడంతో ఈ పరిíస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్సిటీ భవనాలను రూ. 130 కోట్లతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో తొలి విడతగా రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో వర్సిటీ పరిపాలన భవనాలను నిర్మించనున్నారు. ఈ భవనాల నిర్మాణ నమూనాలను టీ వన్ అనే కన్సల్టెంట్ సంస్థ రూపొందించింది. ఈ పరిపాలన భవనాన్ని దాదాపు లక్ష చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించనున్నారు. కాగా, శిలాఫలం ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్‌ప్రభు, అనంత్‌కుమార్, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.130 కోట్లు.. ఆధునిక హంగులు
లక్ష చదరపు అడుగుల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇవీ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవన విశేషాలు రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ వివరాలు వెల్లడించిన వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి ఎంజీఎం : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవనాన్ని రూ.130 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించనున్నారు. వరంగల్‌లోని సెంట్రల్ జైలు ఆవరణలో భవనం నిర్మించనుండగా.. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం శంకుస్థాపన చేస్తారు. మెదక్ జిల్లా గజ్వేల్ జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటున్న మోదీ అక్కడి నుంచే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు వివరాలను యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ బి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పురోగతిని వీసీ వివరించారు. 2014లో ప్రారంభం తెలంగాణ ఏర్పడిన అనంతరం రాష్ట్రప్రభుత్వం 2014 సెప్టెంబర్ 29న రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల కేంద్రంగా యూనివర్సిటీని ప్రారంభించగా 2015 జూలై 16న రిజిస్ట్రార్‌గా టి.వెంకటేశ్వర్రావును, నవంబర్ 23వ తేదీన హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌గా డాక్టర్ కరుణాకర్‌రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా వీసీ యూనివర్సిటీ పరిధిలోకి కళాశాలలను తీసుకరావడంతో పాటు మొట్టమొదటిసారి పీజీ అడ్మిషన్లను యూనివర్సిటీ పరిధిలో విజయవంతంగా చేపట్టారు. కాగా, కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పాత పోస్టాఫీసు భవనాన్ని పునరుద్ధరించి యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అలాగే, ప్రభుత్వం విడుదల చేసిన రూ.కోటి నిధులతో ఫర్నీచర్, వాహనాలు కొనుగోలు చేయగా, ఈ ఏడాది మార్చిలో యూనివర్సిటీ లోగోను సైతం ఇక్కడి సిబ్బంది రూపొందించగా ప్రభుత్వం అమోదముద్ర వేసింది. అలాగే, యూనివర్సిటీ కార్యకలాపాల కోసం కేయూలో ఉద్యోగ విరమణ చేసి జాయింట్ రిజిస్ట్రార్, ఇద్దరు డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇద్దరు సెక్షన్ల సూపరిండెంట్లతో పాటు ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లను డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అయితే, త్వరలోనే టీపీపీఎస్సీ ద్వారా 25 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నారు. రూ.45 కోట్లతో పరిపాలన భవనం కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రిజిస్ట్రార్‌తో కలిసి పలు యూనివర్సిటీల భవనాలను సందర్శించిన వీసీ కరుణాకర్‌రెడ్డి నమూనా రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఈమేరకు భవనాన్ని రూ.130 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం కాగా, నమూనా సైతం ఖరారైంది. కాగా, యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు తొలుత రూ.45 కోట్లతో అడ్మినిస్ట్రేవ్ బ్లాక్(పరిపాలన భవన నిర్మాణాన్ని) దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష చదరపు అడుగుల స్థలంలో నిర్మించనున్నట్లు వీసీ తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మించనున్న ఈ భవనానికే ప్రధాని ఆదివారం గజ్వేల్ నుంచి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. భవన నమూనాను టీమ్ వన్ ఇండియా కన్సల్టెంట్ రూపొందించగా, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా రూ.25 కోట్లు విడుదల చేసిందని, ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని వీసీ తెలిపారు. విజయవంతంగా పీజీ అడ్మిషన్లు తెలంగాణలోని పది జిల్లాల్లో కొనసాగుతున్న 167 వైద్య విద్య కళాశాలలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి డీ అఫ్లియేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2016న ఫిబ్రవరి 9వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ వెంటనే కళాశాలలను కాళోజీ నారాయణరావు హెల్త్యూనివర్సిటీకి అప్లియేట్ చేసేలా 10వ తేదీన కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ అధికారులకు విన్నవించగా.. మార్చి 2న అనుమతులు మంజూరుయ్యాయి. ఈ మేరకు ఏప్రిల్‌లో పీజీ అడ్మిషన్లను విజయవంతంగా చేపట్టారు. ఇక రాష్ట్రంంలోని పది జిల్లాలో కొనసాగుతున్న వైద్యవిద్య కళాశాలలోని విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను నారాయణరావు యూనివర్సిటీ పరిధిలో జరిగేలా చేయడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అనంతరం కళాశాలలోని అధ్యాపక సిబ్బంది, వైద్యవిద్య ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. -
ప్రసిద్ధ కట్టడంగా కాళోజీ కళాకేంద్ర నిర్మాణం
-పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు హన్మకొండ(వరంగల్ జిల్లా) ప్రపంచలోనే ప్రసిద్ధ కట్టడంగా కాళోజి కళా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు చెప్పారు. హన్మకొండలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం హరిత కాకతీయ హోటల్లో విలేకరులతో మాట్లాడుతూ.. 4.5 ఎకరాల్లోని 12,900 చదరపు మీటర్ల స్థలంలో 207 పిల్లర్లు, నాలుగు అంతస్థుల(జీ ప్లస్ 4)తో 70 అడుగులో ఎత్తులో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 1150 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 115 పిల్లర్ల నిర్మాణం పూర్తరుుందని చెప్పారు. మరో ఏడాదిలో పూర్తవుతుందని తెలిపారు. ఈనెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల కోసం పర్యాటకుల సౌకర్యార్థం నాగార్జునసాగర్‌లో రెండు ఏసీ బోట్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ పుష్కరఘాట్ నుంచి నాగార్జున కొండ మధ్య వీటిని నడుపుతామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర దేవస్థానం పుష్కరఘాట్ వద్ద కూడా ఏసీ బోట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ బోట్లో శ్రీశైలం డ్యాం వరకు వెళ్లి రావచ్చని, ఇందులో రెస్టారెంట్ సౌకర్యం ఉందని చెప్పారు. ఆలంపూర్లో పర్యాటకుల సౌకర్యార్థం తుంగభద్ర నది సమీపాన హరిత ఆలంపూర్‌ను నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశ పెట్టిందన్నారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామ్యేల్, ఏఈ రామకృష్ణ ఉన్నారు. -
కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవికాలం పొడిగింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.వెంకటేశ్వర్రావును పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు వెంకటేశ్వర్రావును రిజిస్ట్రార్‌గా మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా ఉన్న వెంకటేశ్వర్రావు 2015 జూలై 16న రిజిస్ట్రార్‌గా ఏడాది కాలానికి నియమితులయ్యారు. ఈ నెల 16తో ఆయన పదవికాలం ము గిసింది. ఈ క్రమంలో మరో ఏడాది పాటు ఆయన పదవిని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర్రావు పదవికాలం పొడిగింపు నిర్ణయం ఈనెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఎంసెట్-2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా
- రాత్రికి రాత్రే సర్కారు నిర్ణయం - వారం పాటు వాయిదా వేస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల వ్యవహారం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇందులో కేసు నమోదు చేస్తే తప్ప లోతైన విచారణ చేపట్టలేమన్న సీఐడీ వాదన నేపథ్యంలో ఎంసెట్-2 కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ప్రవేశాలకు సోమవారం నుంచి జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను వారం రోజులపాటు వాయిదా వేసింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటించలేదు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వరకు కూడా వెరిఫికేషన్ ఉంటుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వం... రాత్రి అకస్మాత్తుగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం హైదరాబాద్, వరంగల్‌కు ముందుగానే చేరుకున్నారు. ఎంసెట్-1, ఎంసెట్-2, నీట్.. ఇలా ఒకే ఏడాది మూడు పరీక్షలు రాసిన విద్యార్థులు ఇప్పుడు లీకేజీ వ్యవహారం తెరపైకి రావడంతో మానసికంగా నరకయాతనకు గురవుతున్నారు. వెంటాడుతున్న అనుమానాలు ఎంసెట్-2కు సంబంధించిన అనుమానాలు సీఐడీని కూడా వెంటాడుతూనే ఉన్నాయి. బ్రోకర్ వెంకట్రావ్ పదే పదే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మెడికల్ సీటు గ్యారంటీ’ అని చెప్పడం వెనుక మతలబేంటి..? నిజంగా అతడికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. అతనితో మాట్లాడినా సరైన సమాచారం లభ్యం కావడం లేదని పేర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్ల నుంచి ముందుగానే ఎందుకు వెళ్లారన్న దానిపైనా స్పష్టత రావడం లేదు. బ్రోకర్ వెంకట్రావ్, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య జరిగిన సంభాషణలను పూర్తిగా పరిశీలించాలని సీఐడీ భావిస్తోంది. కేసు నమోదు కాగానే వెంటనే సెల్‌ఫోన్ కంపెనీల నుంచి కాల్ రికార్డులను తెప్పించుకొని పరిశీలిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. నేడు కేసు నమోదు! ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ అనుమతితో సోమవారం కేసు నమోదు చేయాలని సీఐడీ భావిస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనుమానితులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఇన్చార్జి అధికారిగా అదనపు ఎస్పీ స్థాయి అధికారిని కేటాయించారు. ఆయనపై డీఐజీ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేయడంపై స్పష్టత తీసుకోండి
- ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన 2రౌండ్ల కౌన్సెలింగ్‌లో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్ సీట్ల గురించి అభ్యర్థుల నుంచి స్పష్టత తీసుకోవాలని ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలను గురువారం హైకోర్టు ఆదేశించిం ది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2016-17 విద్యా సంవత్సరానికి ఏపీలో ఎన్టీఆర్ వైద్య విద్యాలయం, తెలంగాణలో డాక్టర్ కాళోజీ నారాయణరావు వైద్య విద్యాలయం మొదటిసారి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పీజీ సీట్లను భర్తీ చేస్తున్నాయి. అభ్యర్థులు 2 రాష్ట్రాల్లో జరిగే కౌన్సెలింగుల్లో పాల్గొనే అవకాశం ఉండటంతో... మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు పలు సీట్లను బ్లాక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో పలు సీట్లు మిగిలి పోతున్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అపూర్వ మరికొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.వి.సింహాద్రి వాదనలు వినిపించారు. దీంతో సీట్లను బ్లాక్ చేసుకున్న అభ్యర్థుల నుంచి స్పష్టత తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు 2 వర్సిటీల అధికారులను ఆదేశించారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు
ఏటూరు నాగారం : వరంగల్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ సేవలను ప్రారంభించింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గొత్తికోయ గూడేలు లింగాపురం, రాయిబందం, చిన్మలమర్రిలో 600 కుటుంబాలకు ఆదివారం వస్త్రాలు పంపిణీ చేశారు. కాళోజీ వర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న రెండు మూడేళ్లలో ఈ గూడేలలో కనీస అవసరాలకు ఇబ్బంది రాకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధబోయిన నాగార్జున, ఎంపీపీ మహీరున్నీసా తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీ ఆరోగ్య వర్సిటీ లోగో ఖరారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి సంబంధించి కొత్త అధికారిక లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. -
కాళోజీ హెల్త్ వర్సిటీ లోగో విడుదల
తెలంగాణ పటం, కాకతీయ కీర్తితోరణం తెరిచిన పుస్తకం.. గ్రీకు చిహ్నంతో రూపకల్పన ఇక వర్సిటీలో పూర్తిస్థారుు కార్యకలాపాలు హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్వర్సిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై కాకతీయ కళాతోరణం.. వీటికి ముందు తెరిచిన పుస్తకంలో వైద్యవృత్తికి సంబంధించిన గ్రీకు ఆరోగ్య చిహ్నం (క్యాడిసియోస్)లతో కూడిన చిత్రాన్ని కాళోజీ వర్సిటీ అధికారిక లోగోగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగోకు ఇరువైపులా సురక్ష చిహ్నాలైన ఆకులు ఉన్నాయి. లోగోకు కింది భాగంలో సర్వేజనా సుఖినోభవంతు అనే నినాదాన్ని చేర్చారు. వృత్తాకారంలో ఉన్న ఈ లోగో పైభాగంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వరంగల్, తెలంగాణ రాష్ట్రం అని ముద్రించారు. హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్వర్సిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై -
755 కొత్త పోస్టుల మంజూరు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో వివిధ పోస్టుల మంజూరుకు రాష్ర్ట ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ హోదాల్లో 82 రెగ్యులర్ పోస్టులతో పాటు 22 అవుట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ రిజిస్ట్రార్ (2), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డెరైక్టర్(పబ్లికేషన్స్), చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (3), రీజనల్ కో ఆర్డినేటర్, డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్ (అకడమిక్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(అడ్మిషన్స్), డిప్యూటీ డెరైక్టర్/డిప్యూటీ రిజిస్ట్రార్(ఎగ్జామ్స్), ఫైనాన్స్ ఆఫీసర్(డిప్యూటీ రిజిస్ట్రార్ కేడర్), యూనివర్సిటీ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ (7), సీనియర్ సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్/సెక్షన్ ఆఫీసర్, పీఎస్ టు వైస్ చాన్స్‌లర్, సూపరింటెండెంట్స్ (12), డ్రాట్స్‌మెన్, సీనియర్ అసిస్టెంట్స్ (15), వీసీకి పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జాయింట్ రిజిస్ట్రార్ పీఏ (సీనియర్ స్టెనోగ్రాఫర్), జూనియర్ అసిస్టెంట్స్ (15), లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ (2), స్టాటిస్టికల్ ఆఫీసర్, డెరైక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రోగ్రామర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ (4), ట్రేసర్స్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ సబార్డినేట్(18), ఎలక్ట్రీషియన్ కమ్ జనరేటర్ ఆపరేటర్, ప్లంబర్ పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో 147 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ పంపించిన ప్రతిపాదనలకు పరిశీలించి కొత్త పోస్టులకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పిడియాట్రిక్ ఐసీయూ, నియోనాటల్ ఐసీయూ, మెట ర్నల్ ఐసీయూ, అనస్థీషియా యూనిట్లో వివిధ పోస్టులతో పాటు ఇతర పారామెడికల్ పోస్టులను మంజూరు చేసింది. మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులు మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీకి 462 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాలేజీ సూపరింటెండెంట్ కార్యాలయానికి 55, ప్రిన్సిపల్ ఆఫీసుకు 24, క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 302, నాన్ క్లినికల్ స్పెషాలిటీ విభాగానికి 81 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది. అటవీ శాఖలో 42 పోస్టులు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాల్లోని ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు అటవీ శాఖలో 42 సూపర్ న్యూమరీ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. వీటికి అమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 18 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, 4 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 9 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 2 సీనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించారు. -
భారీగా భర్తీ
కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి పలు పోస్టులు మంజూరు ఎంజీఎం : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలను విస్తృతం చేసేందు కు అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు పోస్టులు కేటారుుస్తూ మంగళవారం జీవో నంబర్ ఎంఎస్ 5 విడుదల చేసింది. -
కాళోజీ హెల్త్‌వర్సిటీకి పాలకమండలి
వరంగల్ : కాళోజీ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. యూనివర్సిటీకి ఏడుగురు సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 సెప్టెంబర్ 25న కాళోజీ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రం మొదలుకాలేదు. వచ్చే విద్యా సంవత్సరంలో అయినా ఈ వర్సిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఈ అంశంపై ‘ఖాళీగా కాళోజీ వర్సిటీ’ శీర్షికతో ఈ నెల 27వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. స్పం దించిన ప్రభుత్వం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి పాలక మండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయం కార్యకలాపాలలో పాలక మండలి కీలకమైనది. యూ నివర్సిటీ పరిపాలన, ఉద్యోగుల భర్తీ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ పాలకమండలి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. పాలక మండలిలోని సభ్యులు వీరే... {పొఫెసర్ డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి - పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు {పొఫెసర్ డాక్టర్ డి.రాజారెడ్డి - నిమ్స్ మాజీ సంచాలకుడు {పొఫెసర్ డాక్టర్ పి.శ్రీనివాస్ - వైద్య విద్యా శాఖ మాజీ సంచాలకుడు డాక్టర్ మంతా శ్రీనివాస్ - అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కె.ఇందిర - ఫార్మకాలజీ ప్రొఫెసర్, నిజామాబాద్ వైద్య కళాశాల. డాక్టర్ జె.పాండురంగ్ - ఆప్తమాలజీ ప్రొఫెసర్, కాకతీయ వైద్య కళాశాల. డాక్టర్ బి.రమేష్ - రేడియాలజీ ప్రొఫెసర్, ప్రతిమ వైద్య కళాశాల, కరీంనగర్ -
కాళోజీ కళా కేంద్రానికి రూ.50 కోట్లు
హన్మకొండ: కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనులకు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న కళా కేంద్రం నిర్మాణ పనులు.. ఇకపై వేగం పుంజుకోనున్నాయి. తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి కానుకగా 2014 సెప్టెంబరు 9న వరంగల్ నగరంలో ఈ కళా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయస్థాయి హంగులతో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసిపోయి ఏడాది దాటినా కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనుల్లో వేగం పుంజుకో లేదు. ఎట్టకేలకు తెలంగాణ పర్యాటక శాఖ ఒకేసారి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా.. వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కళా కేంద్రం నిర్మాణానికి సంబంధించి 2015 నుంచి 2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌ను ఒకేసారి విడుదల చేసింది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు ముందుకు సాగనున్నాయి. -
ఆరోగ్య వర్సిటీకి 300 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీకి 300 పోస్టులకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఈ పోస్టుల మంజూరు కోరుతూ ఆర్థిక శాఖకు వర్సిటీ నివేదించింది. దీనిపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ పోస్టులన్నీ పరిపాలనా అవసరాలకు సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. వీటి నియామక ప్రక్రియపై త్వరలో స్పష్టత రానుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటైన ఈ ఆరోగ్య వర్సిటీకి ప్రస్తుతం ఒక రిజిస్ట్రార్ మాత్రమే ఉన్నారు. -
‘ప్రత్యేక ప్రతిపత్తే’ పరిష్కారం!
రాష్ట్ర శాసనసభలు సమగ్రంగా చర్చించకుండానే ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించాయి. ఆ తరువాత వ్యక్తిగత నిర్ణయాలను డొల్లించుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే వరుసగా తదుపరి నిర్ణయాలు జరిగిపోయాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ‘ప్రత్యేక హోదా’ (ప్యాకేజీ కాదు) ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీతో తృప్తి పడవచ్చుగదా అని ప్రశ్నించేవారికి ఒకటే సమాధానం, ‘ప్రత్యేక హోదాతోనే పునర్ నిర్మాణ కార్యకలాపాలకు పరిపూర్ణత, సార్థకత సిద్ధిస్తుంది. ‘‘ప్రజలలో ఉపేక్షా భావమే చాలా డేంజర్. దేశంలో పాలకులు ప్రజల్ని గొర్రెలుగా భావిస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు! ఎంతగా నమ్ముతున్నా రంటే - ఎద్దు, కాడి చేబట్టంగానే తనంతట తానే వచ్చి కాడికింద తల పెట్టుతది! అట్లనే బానిసత్వానికి ప్రజలు స్వయంగా లొంగుతున్నారు! ‘గొర్రె’ అన్న రచనలో నేను అన్నాను - ‘మందలబడి మురుస్తోంది గొర్రె, తెగబలుస్తోంది గొర్రె. బయళ్ల గడ్డిని గొల్లన్నే మొలిపిస్తాండనుకుంటాంది గొర్రె. సెలయేళ్ల నీళ్లన్నీ గొల్లన్నే ఒలికిస్తాండనుకుంటాంది గొర్రె. గొల్లన్న గొంగడి బొచ్చే తన పెయినిండా మొలిపిస్తాండనుకుంటాంది గొర్రె! ఈ పరిస్థితి మారాలి, మారాలి!’’ - కాళోజి సమైక్య ఆంధ్రప్రదేశ్ ను అమాంబాపతు రాజకీయ నాయకులు (కేంద్రం నుంచి రాష్ట్రం దాకా) చీల్చిన ఫలితంగా రెండు రాష్ట్రాలు పలు సమస్యలతో తేరుకోలేకపోతున్నాయి. విభజన చట్టం (కేంద్రం) తెచ్చిన అనర్థాలకు పరిష్కారంగా కాంగ్రెస్ (యూపీఏ-2) తన మంత్రి మండలి సమావేశంలో చేసిన తీర్మానంలో అంశం - ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి హోదా’. కాని ఇందులోనూ జరిగిన మోసం, కేబినెట్ నిర్ణయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవ స్థీకరణ చట్టం’లో చేర్చకుండా తప్పించుకోవటం! మరి ఆ హామీకి కాళ్లెలా వచ్చాయి? నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ ఇచ్చిన నోటి మాట ద్వారా! ఆచరణలోకి రాని ‘ప్రత్యేక హోదా’ కల్పనకు అదనపు అలంకరణ- మన్మో హన్ ద్వారా సోనియా బృందం కల్పించిన సరికొత్త భ్రమ- రూ.5 లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి, ఇతర సౌకర్యాలకు ఇస్తామన్న బూటకపు ప్రక టన! అధికార పీఠాల కోసం‘ఆవురావుమంటూ’ చూస్తున్న బీజేపీ (ఎన్డీఏ) నాయకులు తెలుగు జాతిని చీల్చే ప్రక్రియలో భాగంగా పార్లమెంటులో ప్రవర్తించిన తీరు మరవరానిది. ‘ముందు తెలుగు జాతి విభజన ప్రక్రియను పూర్తి చేయండి, ప్రత్యేక ప్రతిపత్తి గురించి మీరు ఇచ్చిన హామీలను మేమొచ్చి నెరవేర్చేస్తాం’ అని బీజేపీ ప్రతినిధులు మూగసైగలతో ‘ఆపద్ధర్మ నీతి’ని ప్రదర్శించడాన్నీ మరచిపోలేం! అలాంటి బీజేపీతో అధికార తాపత్రయంతో చెలిమికి దూసుకువచ్చాడు చంద్రబాబు. ఆ అధికారం కోసమే రాజధాని లేని పరిశేష ఆంధ్రప్రదేశ్‌కు ఆమోదిస్తూ అంతకుముందే సమ్మతి లేఖ రాసి ఇవ్వడమూ విద్రోహ రాజకీయంలో భాగమే! భౌగోళిక పరిస్థితులు అనుకూలం కాదనే.. ఇప్పుడు రాజధానిగా నిర్ణయించిన అమరావతి ఆకాశహర్మ్యాల నిర్మాణానికి అనువుగానిదని నిపుణులు చెబుతున్నారు. కోస్తా ప్రాంతాలలో తరచుగా భూకంపాలు సంభవించగల ప్రాంతాలలో నాలుగు, అయిదు ‘జోన్స్’ పరిధిని దాటి రెండవ, మూడవ జోన్స్‌లో చేరిన ప్రాంతంగా శాస్త్రవేత్తలు అమరావతిని అంచనా వేశారని నిపుణులు పేర్కొంటున్నారు. ‘సింగపూర్, మలేసియా, జపాన్ వంటి దేశాల రాజధానులను నదీతీరాలలో, నదీ గర్భాల మీదనే కదా నిర్మించుకున్నారు, అమరావతిలో నిర్మిస్తే ఏం ప్రమాద’మని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాని అవి దీవులు, నదీ మధ్యస్థదీవులు. వైశాల్యమూ తక్కువ, జన సంఖ్యా తక్కువే. అందుకనే జపాన్ రాజధాని టోక్యో అఖాతంలోని హాన్షూ దీవి తూర్పు కోస్తాలో కొలువు తీరాల్సి వచ్చింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ హాన్ నదిపైన, ఉత్తర కొరియా రాజధాని తేడాంగ్ నదిపైన, సింగపూర్ రాజధాని పసిఫిక్, హిందూ మహాసముద్రాల ప్రధాన వర్తక కూడలి వద్ద, మలేసియా రాజధాని కౌలాలంపూర్ మాలే ద్వీపకల్పంలోని క్లాంగ్, గోంబాక్ నదుల కూడలి వద్ద, ఇండోనేసియా రాజధాని జకార్తా నైరుతి జావా దీవిలోని సిలీవూంగ్ వద్ద, మైన్మార్ రాజధాని యాంగన్ (రంగూన్) నదిపైన వెలవవలసి వచ్చింది! భూవైశాల్యం కుదించుకుపోయి, పరిమిత జనాభా తదితర భౌగోళిక వనరులు తక్కువై, ప్రభుత్వ బంజర్లు లేనిచోట, అటవీ సంపద కునారిల్లి పోయిన దీవులకు, ప్రాంతాలకు మాత్రమే ఈ సమస్య. కాని ఈ సమస్యలు లేని రాష్ట్రాలు, దేశాల రాజధానీ నగరాల నిర్మాణం ఎక్కడ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు? పంటలు పండని మెరక భూములలో, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నచోట, రాష్ట్రం లేదా దేశంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరాలలో భూములున్న చోట జరుగుతుందంటారు నిపుణులు. పైగా తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుందని ఇంజనీరింగ్, వాస్తు, శాస్త్రవేత్తల అంచనా. ఈ దృష్ట్యానే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర అత్యున్నత (శివరామకృష్ణన్) సాధికార కమిటీ పర్యావరణ పరిస్థితుల కారణంగా అమరావతిని రాజధానిగా అనువైన స్థలంగా పేర్కొనడానికి సాహసించలేదు. కానీ రాజధానికి మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను ప్రతిపాదించింది. ఒకనాడు దగా పడిన రాయల సీమ ప్రాంతాన్ని కూడా కమిటీ పరిశీలనలోకి తీసుకుంది. అన్ని ప్రాంతాలకు మధ్య సమతుల్యతను పాటిస్తూ రాజధాని ప్రాంతంగా గుర్తించి, ప్రజాభి ప్రాయానికి విడిచిపెట్టిన ఆ మూడు ప్రాంతాలు: ఉత్తరాంధ్రలో విశాఖ ప్రాంతం. కర్నూలు, అనంతపురం, తిరుపతి, కడప, చిత్తూరులతో కూడిన రాయలసీమ ఆర్క్. కాళహస్తి-నడికుడి స్పయిన్. ఇది కాళహస్తి-నడికుడి రైల్వే లైన్‌ను ఆనుకుని కొనసాగే ప్రాంతం కిందికు వస్తుంది (ఈ వరసలోనే వినుకొండ- దొనకొండ ప్రాంతమూ వస్తుంది). ఇలా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల భావి ప్రగతికి కేంద్ర కమిటీ రూపొందించిన వివేచనాత్మక నివేదికను టీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించింది. రాష్ట్ర శాసనసభలు సమగ్రంగా చర్చించ కుండానే ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించాయి. ఆ తరువాత వ్యక్తిగత నిర్ణయాలను డొల్లించుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజ నాల కోసమే వరుసగా తదుపరి నిర్ణయాలు జరిగిపోయాయి. సింగపూర్ ప్రయోజనాలకేనా? ముందు వీజీఎంటీ, ఆ తరువాత సీఆర్డీఎమ్ల తతంగం ద్వారా భారీ స్థాయిలో లక్షన్నర ఎకరాలను రాజధాని నిర్మాణానికి సేకరించాలని నిర్ణయించి సుక్షేత్రాలను, 125 రకాల పంటలు, పండ్లు సమకూర్చి ఆహార భద్రతకు భరోసాగా ఉన్న కృష్ణా, గుంటూరు, గోదావరి పేద మధ్య తరగతి రైతాంగం నుంచి పంట భూములను బలవంతంగా సేకరించి వ్యవసాయంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల ఉపాధికి, వేలాది మంది వృత్తిపనుల వారి ఉపాధికి చేటు తెచ్చారు. ఫలితంగా రైతాంగం వ్యవసాయ కార్మిక సంఘాలు రక్షణ కోరుతూ న్యాయ స్థానాలను ఆశ్రయించవలసి వచ్చింది. విభజన వల్లనే గాక, భూసేకరణ, భూస్వాధీనపు చట్టాల కింద కుదరకపోతే; భూ ఆర్డినెన్స్‌ల చాటున దాగి (కేంద్ర ఆర్డినెన్స్‌కు గండి పడినా) బలవంతపు బ్రాహ్మణార్థపు తతంగం సాగుతూనే ఉంది. ఇక్కడి నిపుణులు పనికిరారా? నిజానికి దేశీయంగా రాష్ట్రీయంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పు తున్న గొప్ప గొప్ప ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నిర్మాణ రంగ నిపుణులు, సిస్మాలజిస్టులు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పిన సిద్ధహస్తులైన కాంట్రాక్టర్లు, ప్రసార సాంకేతిక నైపుణ్యం కల శాస్త్రవేత్తలు ఎందరో మన మధ్య ఉన్నారు. వారి సేవలు వినియోగించుకున్న తరువాత అవసరాన్ని బట్టి మిగులు సగులు నిర్మాణాలకు, మెరుగులు దిద్దుకోవడానికి సింగపూర్, జపాన్, అమెరికా బహుళ జాతి సంస్థల వైపు మోరలు చాచేపని. కాని ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోమని మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందుకున్న సింగపూర్ బడా పెట్టుబడుల కంపెనీ ఏం చేసింది? మన మాటల్లో కాకుండా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మాటల్లో చూద్దాం. ‘‘రాజధాని నిర్మాణపు మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో రియెల్టీ (రియల్ ఎస్టేట్)వ్యాపారానికి పది వేల ఎకరాలు కావాలని సింగపూర్ కోరింది. పది వేల ఎకరాలు ఇచ్చుకునే పక్షంలో పాలనా నిర్వహణకు సంబంధించిన ప్రధానమైన భవనాలను ఉచితంగా కట్టిపెడతామని సింగపూర్ బృంద నాయకుడు ఖోటెంగ్ ఛే చెప్పడం వల్ల, ఈ మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రయో జనాలను, దాని భావి భారత భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలనే ఎక్కువగా ఈడేర్చి పెడుతుంది గాని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాదని తేలింది. ఏతావాతా రాజధాని భవన నిర్మాణానికి అయ్యే ఖర్చుకు బరాబరి విలువ చేసే భూమి మాకు కావాలని సింగపూర్ నాయకుడు చెప్పాడు.’’ పరిహారం చెల్లించాల్సిందే ఇంతకూ నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ‘ప్రత్యేక హోదా’ (ప్యాకేజీ కాదు) ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీతో తృప్తి పడవచ్చుగదా అని ప్రశ్నించేవారికి ఒకటే సమాధానం, ‘ప్రత్యేక హోదాతోనే పునర్ నిర్మాణ కార్యకలాపాలకు పరి పూర్ణత, సార్థకత సిద్ధిస్తుంది. కేంద్రం ఈ అనివార్యమైన మూల్యం ఎందుకు చెల్లించుకోవాలంటే- ప్రధాన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల నాయకులంతా కలసి తెలుగుజాతి కుదురును చెల్లాచెదురు చేసినందుకు, తెలుగువారి చరిత్ర గురించిన అవగాహన, జ్ఞానం వారికి కొరవడినందుకు, ప్రజలను నిలువునా వంచించినందుకు, రాజ్యాంగంలో 2/3/4 అధికర ణలకు అవకాశవాద భాష్యాలు చెప్పినందుకు, సమగ్ర రాష్ట్ర ప్రతిపత్తి కోసం పొందుపరిచిన 371(జి) ప్రత్యేక అధికరణను తోసిపుచ్చి నిరంకుశంగా వ్యవహరించినందుకు, 2-3 అధికరణలపై గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులకు, ప్రతిపాదనలకు వక్రభాష్యాలు చెప్పినందుకు, ‘రాష్ట్ర శాసన సభలదే అంతిమ తీర్పు’ అని స్పష్టం చేసిన తొల్లింటి ఐదో క్లాజును తొలగించి తెలుగువారి మెడలకు ఉచ్చులు (ఇరువైపులా) తగిలించి చిచ్చు పెట్టినందుకు ప్రత్యేక ప్రతిపత్తి పరిహారం చెల్లించక తప్పదు. (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
తెలంగాణలో ఉన్నది ఏకవచనమే!
ఇటీవల, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుంచి 2015 సంవత్సరానికిగానూ తొలి ‘ప్రజాకవి కాళోజీ పురస్కారం’ స్వీకరించిన కవి, విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్‌తో ‘సాక్షి సాహిత్యం’ ప్రతినిధి షేర్షా జరిపిన సంభాషణ: కాళోజీ పురస్కారం మీకు ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? ఒకటేమిటంటే, తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఉద్యమ కవిత్వం రాయడం, అది మొదటి కారణం అనుకుంటున్నా. ఇంకోటి అటు కవిత్వ రంగంలోనూ, ఇటు సాహిత్య విమర్శ రంగంలోనూ ఉండటం. అలాగే, నేను కెరీరిస్టును కాను; నా మానాన నేను మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లే మనిషిని. బహుశా వీటన్నింటినీ అవార్డు కమిటీ గుర్తించిందేమో! మీ జీవితానికి సంబంధించి ఈ పురస్కారం ఏమిటి? 1962-63లో పద్యకవిగా నా సాహిత్య జీవితం మొదలైంది. ఆ దశ అంత విలువైంది కాదుగానీ ఒక లెక్కకోసం చెప్పడం! లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు, ‘ఉస్మానియా’ ప్రిన్సిపాల్ సంతాప సభ పెడితే పద్యాలు వినిపించిన. అప్పట్నుంచీ ఈ యాభై ఏళ్లుగా సాహిత్య రంగంలో ఉన్న. ‘అనార్కలి’లో ‘జీవితమే సఫలమూ...’ అన్నట్టుగా, ఇది నాకు జీవన సాఫల్య పురస్కారం! కాళోజీ తన జీవితాంతం సాధన చేసిన ముఖ్య విలువ ఏమిటి? దాని ప్రాసంగికత... ‘ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’లో అనుకుంటా సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నడు: ‘కవుల కవితలు కూడా కలలే. అయితే ఆ కలల వేర్లు వాస్తవ జీవితంలో ఉంటాయి’. అట్లా, మానవుడు ఆత్మాభిమానంతో ఎవరికీ తలవంచకుండా సగౌరవంగా బతకాలని కలగన్నడు కాళోజీ. ‘మానవుని మానవుడు మానవుని మాదిరిగా/ మన్నించలేనంత మలినమైనాది/ మానవుని హృదయంబు మలినమైనాది’ అన్నడు. ఈ ఆవేదన ఇప్పటికీ సజీవమే. ఒక మనిషి ఇంకో మనిషితో హెచ్చుతగ్గులతో ప్రవర్తిస్తున్నడు. ఇదంతా ఒక వైపు; మరోవైపు, ‘ఓసీ ప్రభుత్వమా/ దోపిడి వర్గాలను నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు/ పీడితవర్గాల నేను తిరగబడమంటే తప్పా?’ అని ప్రశ్నించిండు. సమసమాజం ఏర్పడేదాకా కాళోజీ రిలవెంటుగానే ఉంటడు. ఇంకో పార్శ్వంలో అద్భుతమైన జీవితసత్యాలు చెప్పిండు కాళోజీ: ‘పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది’. ఇది ‘జేపీ’ గురించి చెప్పినా అందరికీ వర్తిస్తుంది. డేవిడ్ డేచస్ అనే విమర్శకుడు తన ‘క్రిటికల్ అప్రోచెస్ టు లిటరేచర్’లో ‘జీవితాన్ని ఒక అనంత సత్యంగా ప్రకటించే భావచిత్రమే కవిత’ అని నిర్వచించిండు. అట్లా కాళోజీ జీవిత సత్యాన్ని చెప్పే తాత్వికుడిలా కనిపిస్తడు. కాళోజీని మొదటిసారి ఎప్పుడు చూశారు? సంచార కవి వేమన, భక్త తుకారాంల వారసుడు కాళోజీ. తుకారాం నా దగ్గర ‘మాటలనే రత్నాలున్నాయి, వాటినే పంచుతూ వెళ్తా’ అంటడు. అట్లానే కాళోజీ తెలంగాణ, ఆంధ్ర జిల్లాల్లో కూడా విపరీతంగా తిరిగిండు! మాటల రత్నాలు పంచిండు. వరంగల్ వాళ్లు కాక మిగిలిన జిల్లాలవాళ్లందరూ ఆయన్ని ఏదో ఒక బహిరంగసభలో చూసుంటరు. 1968-69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సుల్తాన్‌బజార్ హైస్కూల్ ప్రాంగణంలో- అప్పుడు ఇంత రద్దీ లేదు కదా, అక్కడ బహిరంగ సభలు జరిగేటివి- అక్కడ ఆయన మాట్లాడిండు. అప్పుడు చూసిన మొదటిసారి. కవిత చదవడం, వ్యాఖ్యానం, ఉపన్యాసం... ఇదీ కాళోజీ పద్ధతి. 20,000-30,000 మంది గల సభలో కవిత్వంతో జనాన్ని ఆకట్టుకోవడం ఆయనకే సాధ్యమైంది. ప్రజాకవి అనడం వెనుక ఔచిత్యం అది. తర్వాత, నా ఉద్యోగ జీవితం 1970లో జూనియర్ లెక్చరర్‌గా హుజూరాబాద్(కరీంనగర్)లో మొదలైంది. అక్కణ్నుంచి వరంగల్ 30-40 కిలోమీటర్లు . ‘మిత్రమండలి’ సమావేశాలకు వెళ్లేటోడిని. ఒకసారి నరసింహారెడ్డి ఇంట్లో, ఒకసారి తిరుపతయ్య ఇంట్లో, ఇంకోసారి వరవరరావు ఇంట్లో సమావేశాలు జరిగేటివి. యువకులు కవిత చదివి, కాళోజీ వ్యాఖ్య కోసం ఎదరుచూసెటోళ్లు. పొరపాటు ఎత్తిచూపడం కాకుండా ఆయన వ్యాఖ్య లైవ్లీగా ఉండేది. మనముందు జీవిత దృశ్యం ఉంచి కంపారిటివ్‌గా చెప్పెటోడు. యంగ్‌స్టర్‌కు యూజ్‌ఫుల్‌గా ఉండేది. కాళోజీ జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా ప్రకటించడం పట్ల మీ ఆలోచనలు... నా ఉద్దేశంలో సీమాంధ్ర నాయకులు, సినిమాలు తెలంగాణ మాటను చిన్నచూపు చూడటంలోంచి వచ్చిన తిరుగుబాటు ధోరణిగా దీన్ని చూడాలి. మొదట్లో కాళోజీ జయంతిని తెలుగు మాండలిక భాషా దినోత్సవంగా పాటించిన్రు. కాని దాని మీద సీమాంధ్ర జిల్లాలు అంత ఉత్సాహం చూపలేదు. తెలంగాణ ఏర్పడినాక, తెలంగాణ జీవితానికి ప్రాముఖ్యత లభించింది. తెలంగాణ పలుకుబడి, మాటతీరు వీటికి పెద్దపీట వేయడం ఇప్పుడు జరుగుతున్నది. ఆత్మగౌరవ సూచకంగా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నం. ‘తెలంగాణ భాష’ అనడం దీర్ఘకాలికంగా మేలుచేసేదేనా? నా ఉద్దేశంలో మేలుచేస్తదో చేయదోగానీ కీడు చేయదని మాత్రం చెప్పొచ్చు. మనకు ఉన్నదంతా ఏకవచనమే. బహువచనం లేదు. ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో సింగులర్కే ప్రాధాన్యత ఇస్తున్నరు. మీరు కొత్తగా పరిచయం నాకు, మిమ్మల్ని మీరు అనకుండా నువ్వు అనగలనా? మీకు ఇప్పుడు అభ్యంతరంగా ఉంటుంది కావొచ్చు. అరవై ఏళ్ల కింద నువ్వే అనేటోళ్లం. ప్రస్తుతం మీ సాహిత్య కార్యకలాపాలు... నా నాలుగో కవితా సంపుటి గంధంచెట్టు వారం పది రోజుల్లో విడుదలవుతుంది. నా ఎంపిక చేసిన కవితల్ని ఎలనాగ ఇంగ్లీషులోకీ, ఎం.రంగయ్య హిందీలోకి చేస్తున్నరు. ఇంకా, సగంలో ఆపేసిన నా పుస్తకాలు ‘కాళోజీ జీవితం-సాహిత్యం’, ‘బిరుదురాజు రామరాజు జీవితం- సాహిత్యం’ పూర్తి చేయవలసి ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా మఖ్దూం మొహియుద్దీన్ లైఫ్ అండ్ వర్క్స్‌ను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి చేస్తున్న. సంభాషణ ప్రారంభానికి ముందు, మనవడి అనారోగ్యం గురించి వచ్చింది కదా... సాహిత్యకారుడిగా ఇట్లాంటి లౌకిక వ్యవహారాలు ఎలా ఎదుర్కొంటారు? చిన్న పిల్లలకు జబ్బు చేస్తే ఇల్లంతా సంక్షోభానికి గురవుతుంది. చిన్నపిల్లల పట్ల ఉండే అనుబంధం అలాంటిది. అట్లాంటి సందర్భాల్లో ఎంత పెద్ద సాహిత్యకారుడైనా సాధారణ మనిషిగా మారిపోతడు. మీరు ఫోన్ చేసినప్పుడు రిపోర్టు కోసం పోయినుంటి. డెంగీ కాదని తేలిపోయింది. పెద్ద రిలీఫ్. అయితే, ఇదంతా అధిగమించి ఒక జ్ఞాపకంగా మారినప్పడు దీన్ని సాహిత్యంలోకి తేగలుగుతాం. -
కాళోజీ జీవితం దేశానికి ఆదర్శం
హన్మకొండ అర్బన్ : అస్తిత్వం కోసం జాతిని జాగృతం చేసిన ప్రజాకవి, మహనీయుడు కాళోజీ నారాయణరావు అని, ఆయన జీవితం దేశానికే ఆదర్శమ ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ భాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటాని కి పూలమాల వేసి నివాళి అర్పించారు. పలువు రు కవులు, కళాకారులు కాళోజీ జీవిత చరిత్ర తెలిపేల ప్రసంగాలు చేశారు. పాటలు పాడా రు. కవితలు చెప్పారు. కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్యే టి.రాజయ్య పాల్గొన్న కార్యక్రమంలో వినయ్‌భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. ఉమ్మడిరాష్ట్రంలో కాళోజీ మ్యూజి యం నిర్మాణానికి 300గజాల స్థలం కోసం ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. అదే స్వ రాష్ట్రంలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం 3ఎకరాల భూమి కేటాయించిందని తెలి పారు. నైతిక విలువలు, మానవత్వం అంతరిం చి పోతున్న ప్రస్తుత తరుణంలో కాళోజీ వంటి మహనీయులు మళ్లీ పుట్టాలని ఆకాంక్షించారు. కాళోజీ మార్గ్‌గా బాలసముద్రం రోడ్.. బాలసముద్రం ప్రధాన రోడ్డును కాళోజీ మార్గ్‌గా నామకరణం చేస్తున్నట్లు కలెక్టర్, కమిషనర్ ప్రకటించారు. ఇకపై అదేపేరుతో వ్యవహరించాలని వినయ్‌భాస్కర్ కోరారు. నా.. నుంచి మ.. వరకు రాలేదన్నారు.. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ ‘నేను నా నుంచి మా వరకు రాలేద’ని కాళోజీ చెప్పడం ఆయన సా దారణ జీవితానికి అద్దం పడుతుందన్నారు. కాళోజీ ఓరుగల్లువాసి కావడం మనమంతా గ ర్వించదగ్గ విషయన్నారు. వల్లంపట్ల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. కాళోజీ యువతను ప్రో త్సహించేవారన్నారు. తన సహజశైలిలో పాట లు పాడి వల్లంపట్ల ఆకట్టుకున్నారు. గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని వ్యక్తీకరించిన వ్యక్తి కా ళోజీ అన్నారు. జితేందర్ మాట్లాడుతూ కాళోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ, కాళోజీ పైనా రచయిత్రి అనిశె ట్టి రజిత కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ సీసీ శ్రావణ్ వినిపించిన‘కాళోజీ... ను వ్వు మళ్లీ పుట్టాలి’కవిత అందరికీ ఆకట్టుకుం ది. కాళోజీ జీవితచరిత్రను తన వాగ్ధాటితో విని పించిన చిన్నారి మాస్టర్ అర్జున్ను సభికులు అ భినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా గిరిజా మనోహర్‌బాబు, వెలిపాటి రాంరెడ్డి, అనిశెట్టి రజిత, మహ్మద్ సిరాజుద్దీన్, బాలరా జులను అతిథులు శాలువాలతో సత్కరించా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఏజేసీ తిరుపతిరావు, డీఆ ర్వో శోభ, ఉద్యోగ సంఘాల నాయకులు రాజేష్‌కుమార్, జగన్మోహన్రావు, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అధికార భాషగా హిందీని చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్, పద్మశ్రీ ప్రొ. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాళోజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, తెలంగాణ సర్కార్ ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్‌తోపాటు రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... దేశంలో హిందీని అధికార భాషగా మార్చేందుకు యత్నించాలని కేంద్రానికి సూచించారు. ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలన్నీ హిందీలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మోదీ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. హిందీ అకాడమీలలో కేవలం ఉత్తరాది వారినే నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందీ నేర్చుకున్న దక్షిణాది వారిని కూడా అకాడమీలలో నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి విశ్వహిందీ మహాసభలు భోపాల్‌లో జరుగనున్నాయని లక్ష్మీప్రసాద్ తెలిపారు. -
ప్రజాకవి కాళోజీ
-
అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం
హైదరాబాద్ : కాళోజీ స్మారక పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్...ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తొలిసారిగా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సర్కార్ ...కాళోజీ పేరుతో ఈ స్మారక పురస్కారాన్ని అందిజేస్తోంది. అలాగే కాళోజీ జయంతిని పురస్కరించుకొని బుధవారం తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో, హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితల పోటీలు నిర్వహిస్తారు. -
సుద్దాలకు కాళోజీ స్మారక పురస్కారం
వెంగళరావునగర్: సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్టు భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని స్థానిక మధురానగర్‌కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ఏటా మహాకవి కాళోజీ పురస్కారాన్ని వివిధ రంగాల్లో నిపుణులకు అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది సుద్దాల అశోక్ తేజకు ఇవ్వనున్నామని తెలిపారు. ఈనెల 8వ తేదీన స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ఆయనకు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
వర్సిటీ అక్కడ.. పరిపాలన ఇక్కడ
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యకలాపాలను తాత్కాలికంగా హైదరాబాద్ నుంచే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో ప్రభుత్వ భవనాలు లేకపోవడం... కొత్త భవనాల నిర్మాణం చేపట్టకపోవడంతో పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ నుంచే తాత్కాలిక ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయంలో అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇటీవలే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ టి.వెంకటేశ్వర్రావును ప్రభుత్వం నియమించింది. ఆయన తక్షణమే డీఎంఈ కార్యాలయం నుంచే వర్సిటీకి సంబంధించి కార్యకలాపాలు చేపడతారు. అందుకోసం ఆయనకు ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేస్తారు. వరంగల్‌లో భవనాల నిర్మాణం, ఇతరత్రా పనులన్నింటినీ ఆయన ఇక్కడి నుంచే చూసుకుంటారు. వైస్ చాన్స్‌లర్‌ను నియమించే వరకూ ఆయనే కీలకంగా ఉంటారు. ఇదిలావుంటే వర్సిటీని వరంగల్ కంటే హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అన్ని రకాలుగా హైదరాబాద్ అనుకూలమైందని...విద్యార్థులకు ఇది సౌలభ్యంగా ఉంటుందన్న భావన కూడా ఉంది. గతంలో వైద్య మంత్రిగా ఉన్న రాజయ్య వరంగల్‌కు చెందిన వ్యక్తి కావడంతో వర్సిటీని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారని... ఇప్పుడు పరిస్థితి మారినందున హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని వైద్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 80 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం... విశ్వవిద్యాలయం కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకానికి సంబంధించి సీఎం కేసీఆర్ 80 పోస్టులను మంజూరుచేశారు. వాటిని మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తారా? లేక టీఎస్పీఎస్సీ కింద భర్తీ చేస్తారా.. అనే అంశంపై స్పష్టత రావాలి. ఆ పోస్టులన్నీ వర్సిటీ పరిపాలనాపరమైన పోస్టులే కావడం గమనార్హం. -
తెరపైకి మళ్లీ... సంఘవి
సంఘవి గుర్తుంది కదూ.. సింధూరం, తాజ్‌మహల్, సీతారామరాజు, సమరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో నటించిన సంఘవి కొంత విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ‘కొళంజి’ అనే తమిళ చిత్రంలో సముద్రఖని సరసన ఆమె నటించనున్నారు. ‘అమరావతి’ చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమైన సంఘవి ఆ తర్వాత రసిగన్, కోయంబత్తూర్ మాపిళ్లయ్.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. తెలుగు తెరపై ఆమె కనిపించి ఐదారేళ్లు కాగా, తమిళంలో దాదాపు పదేళ్లవుతోంది. -
కాళోజీ వర్సిటీకి కార్యనిర్వాహక మండలి
ఏర్పాటుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫైలును త్వరలోనే సీఎం కేసీఆర్ ముందుంచనున్నట్లు సమాచారం. ఆయన ఆమోదం తర్వాత ఫైలు గవర్నర్ పరిశీలనకు వెళ్లనుంది. మండలి ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపితే సంబంధిత చర్యలను ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభిస్తుంది. మండలి ఏర్పాటుకు ముందు వీసీ నియామకం జరుగుతుందని తెలిసింది. వీసీని నియమించకపోయినా రిజిస్ట్రార్‌ను ఇన్చార్జి వీసీగా కొనసాగిస్తూ మండలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఇటీవల నియమించిన రిజిస్ట్రార్‌ను వివాదాల కారణంగా బర్తరఫ్ చేశారు. -
వరంగల్ జిల్లాకు ప్రాధాన్యం
మరోసారి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఈసారి రెండు రోజుల పర్యటన నేడు అర్చక సమాఖ్య సభకు హాజరు భూపాలపల్లిలో నియోజకవర్గ సమీక్ష జిల్లా కేంద్రం ప్రకటనపై ఆసక్తి! తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. చేతల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మరోసారి జిల్లాకు వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడం ఇది నాలుగోసారి. కేసీఆర్ గురువారం సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్లో హన్మకొండ ఆర్ట్స్‌కాలేజీ మైదానంలో దిగారు. ఈ పర్యటనలో ప్రధానంగా వరంగల్ నగరంపైనే దృష్టి పెట్టారు. వస్తూనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, శాకరాసికుంట, శివగిరిప్రసాద్నగర్ బస్తీల్లో పర్యటించారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాత్రి 8.20 గంటలకు హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో బస చేశారు. నేడు పశ్చిమలో.. శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బస్తీల్లో పర్యటించనున్నారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేతగా ఉద్యమకాలంలో కేసీఆర్ వరంగల్ జిల్లాకు తరుచూ వచ్చేవారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇదే పరంపర కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జిల్లాకు నాలుగోసారి వచ్చారు. గతేడాది సెప్టెంబరు 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలకు, డిసెంబరు 21న కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి, అదే నెల 29న జిల్లాకు వచ్చారు. 29న నిర్వహించిన సమీక్షలోనే పరిపాలన విషయంలో కచ్చితంగా ఉంటామని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. త్వరలోనే మళ్లీ వస్తానని రెండు రోజులు జిల్లాలో ఉండి రాత్రి నగరంలోనే బస చేస్తాని అన్నారు. అన్నట్లుగానే పది రోజుల్లోనే మళ్లీ వచ్చారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు ప్రాముఖ్యత ఇస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్, భూపాలపల్లిపై నజర్ తాజాగా జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్.. ప్రధానంగా వరంగల్ నగరం, భూపాలపల్లి నియోజవర్గాలపైనే దృష్టి పెడుతున్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గంలోనే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రెండో దశ పనుల తీరు, మూడో దశ పనుల మొదలుపైన అధికారులతో చర్చిస్తారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనచారి సొంత నియోజకవర్గం కావడంతో కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగానే భూపాలపల్లి నియోజకవర్గంలోనే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సింగరేణి గనులతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రకటించారు.కేసీఆర్ శుక్రవారం స్వయంగా అక్కడికి వెళ్తుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేస్తారని భూపాలపల్లి వాసులు భావిస్తున్నారు. -
ప్రముఖ కవి ఎన్కే కన్నుమూత
1970ల్లో కవిత్వంతో ఉర్రూతలూగించిన కోదండరామారావు శ్రీశ్రీ, చెరబండ రాజు, కాళోజీ సోదరులకు సన్నిహితుడు హన్మకొండ: ఎన్‌కేగా ప్రసిద్ధులైన ప్రముఖ కవి నెల్లుట్ల కోదండరామారావు శనివారం రాత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన ఆయన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1970 దశకంలో విప్లవోద్యమం ఊపిరిపోసుకుంటున్న సమయంలో ఎన్కే తన కవిత్వంతో ఉర్రూతలూగించారు. ఆయన రాసిన ప్రతీ కవిత గోడలపై నినాదంగా కనిపించేది. 1969లో వరంగల్‌లో వచ్చిన తిరగబడు కవుల ఉద్యమంలో ఎన్కే భాగస్వామ్యం వహించగా.. తిరగబడు కవితాసంకలనంలో ఆయన రాసిన ‘లాల్ బనో.. గులామి చోడో బోలో వందేమాతరం’ కవిత ఆనాటి కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విప్లవ కవులు వరవరరావు, చెరబండ రాజు, శ్రీశ్రీ, లోచన్ తదితర మహాకవులతో కలిసి పనిచేసిన నెల్లుట్ల.. మిత్రమండలి సమావేశాల్లో పాల్గొంటూ కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణరావుతో సన్నిహితంగా మెదిలేవారు. సృజన పత్రిక నడిపించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆయన.. కవితలు రాయడమే కాకుండా శ్రోతలను ఉర్రూతలూగించేలా చదవడం, విప్లవ గేయాలను పాడటంలో దిట్ట. తన మిత్రుడు సుధీర్, దేవులపల్లి సుదర్శన్‌రావుతో కలిసి పనిచేసిన ఎన్కే నిర్బంధ కాలంలోనూ తన విలువలు, విశ్వాసాలకు అనుగుణంగానే పనిచేశారు. -
మండే కన్నీటి బిందువు కాళోజీ
హన్మకొండ కల్చరల్ : కాళోజీ నారాయణరావు మండే కన్నీటి బిందువని, నిలువెత్తు మానవత్వానికి ప్రతీకగా నిలిచాడని న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సోదరుల యాది సభ జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వర్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగారి రాజేందర్ మాట్లాడుతూ ఉర్దూ భాష భారతదేశంలోనే పుట్టిందన్నారు. పాకిస్తాన్లో అధికార భాష ఉర్దూ అయినప్పటికీ... ఆ భాషను భారతదేశ ప్రజలే ఎక్కువగా మాట్లాడతారని తెలిపారు. అదేవిధంగా సంస్కృతం హిందూ మతానికి చెందినదిగా భావించడం తప్పన్నా రు. న్యాయవ్యవస్థతోనూ, మనుషులతోనూ, మానవీయ విలువలతోనూ సంబంధం ఉన్న ప్రజల మనిషి పరిపూర్ణ మానవుడు కాళోజీ అని కొనియూడారు.తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ వర్ధంతి సభకు వందలాది మంది వస్తారని ఆశించామని, అలా జరగకపోవడం బాధాకరమేనన్నారు. ప్రస్తుతం కవిత్వం అనేది ఫేస్బుక్ ద్వారా చర్చలో ఉందన్నారు. డాక్టర్ ఎం.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్రావు రాసిన ఉర్దూ సాహిత్యంలోని విశేషాలను వివరించారు. ఎస్.జీవన్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్‌రావుకు ఉర్ధూ అంటే ఎనలేని మక్కువ అని... చెరుకు గడలోని తీపి రసంలా ఉంటుందని అనేవారని గుర్తుచేశారు. కాళోజీ నారాయణరావు విషయానికి వస్తే ప్రజాస్వామ్యం గురించి ఆయన రాసినంతగా ఎవ్వరూ రాయలేరని, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి అడిగేవారని పేర్కొన్నారు. కర్షకా నీ కర్రు కదిలినన్నాల్లే అన్న కవితను ఈనాటి పరిస్థితులలో గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీ అవార్డును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నందున మరో ప్రత్యేక సమావేశంలో అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. పొట్లపల్లి శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కవి లోచన్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, శోభ దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయని విద్మహే, టి.జితేందర్‌రావు, మహ్మద్ సిరాజూద్దిన్, అన్వర్, కుందావజుజల కృష్ణమూర్తి, చెలిమె సుధాకర్, బిల్లా మహేందర్, రంగ చక్రపాణి, పొట్లపల్లి ధరణీశ్వర్‌రావు, రంగు చక్రపాణి, కాళోజీ అభిమానులు పాల్గొన్నారు. -
ధిక్కార స్వరం.. పోరాటమే ఊపిరి
నేడు కాళోజీ వర్ధంతి తప్పు ఎక్కడ జరిగినా చూస్తూ ఉండే రకం కాదాయన. తన కలంతో అది తప్పంటూ ఎలుగెత్తి చాటేవారు. సమన్యాయ పాలన దక్కాలనేది ఆయన అభిమతం. అందుకే నిజాం ప్రభువులతోనూ తలపడ్డారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటారు. కవిగా.. పోరాట యోధుడిగా.. ముందుకుసాగారు. ఆచరణవాదిగా.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆ మహామనీషి మరెవరో కాదు.. కాళోజీ నారాయణరావు. అందరూ కాళన్నగా పిలుచుకునే ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. కాళోజీ.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. గుండెల నిండా ధిక్కారం నింపుకున్న ధీరుడు. చిన్నప్పటి నుంచే సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న మహామనీషి ఆయన. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఈ పేరు మమేకమైపోయింది. లొల్లి లొల్లికి జతకట్టి, లొల్లికెల్ల.. పెద్ద దిక్కైన నీపేరు, పృథ్విలోన.. ఎల్లకాలము గుర్తుండు, చల్లనయ్య.. కరిగి పోతివా కాళన్న, కరుణ హృదయ.. అంటూ నల్ల ఉపేందర్, ఆయన కుమార్తె నల్ల ప్రభావతీదేవి కాళోజీ జీవిత చరిత్రను శతకంగా రాశారు. 9 సెప్టెంబర్ 1914న రంగారావు, రమాబాయి దంపతులకు కాళోజీ నారాయణరావు జన్మించారు. మడికొండలో ప్రాథమిక విద్య, హన్మకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్ప కవి. షాద్ కలం పేరుతో రచనలు చేసేవారు. అన్నదమ్ములిద్దరినీ చిన్న, పెద్ద కాళోజీగా పిలిచేవారు. కాళోజీ నారాయణరావు 15 ఏళ్ల వయసు నుంచే ఉద్యమాల్లోనూ, కవితా వ్యాసాంగంలోనూ మునిగితేలేవారు. ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, నిజాంస్టేట్ కాంగ్రెస్‌లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. 1940లో రుక్మిణీబాయిని వివహం చేసుకున్నారు. 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాళోజీ శతజయంతి ఉత్సవ కమిటీ కాళోజీ స్ఫూర్తిని ముందుతరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రముఖచిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి బి.నర్సింగరావు అధ్యక్షుడిగా, ప్రముఖకవి వరవరరావు గౌరవాధ్యక్షుడిగా, ప్రముఖ మానవహక్కుల వేదిక కార్యకర్త జీవన్‌కుమార్ సమన్వయకర్తగా, ప్రముఖ న్యాయవాదులు కె.ప్రతాప్‌రెడ్డి , కేశవరావుయాదవ్ సలహాదారులుగా కాళోజీ శత జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 2013 సెప్టెంబర్ 9న హన్మకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో కాళోజీ శతజయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామక లక్ష్మణమూర్తికి కాళోజీ పురస్కారం అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తికి, ప్రముఖ ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు జి.భరత్‌భూషణ్‌కు ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తరువాత ఏడాది పాటు తెలంగాణలోనూ, ఆంధ్రాప్రాంతంలోనూ కాళోజీ సాహిత్యంపై సెమినార్లు నిర్వహించారు. బి.నర్సింగరావు దర్శకత్వంలో మన కాళోజీ డాక్యుమెంటరీ నిర్మించారు. అమ్మంగి వేణుగోపాల్, ఎన్.వేణుగోపాల్, బి.నర్సింగరావు ప్రచురణకర్తలుగా కాళోజీ జీవితం-సమగ్ర సాహిత్యం సంపుటాలను వెలువరించారు. వేదకుమార్ అధ్వర్యంలో కాళోజీ జీవితంపై సంక్షిప్తంగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కాళోజీ ఎస్సెన్షియల్ పుస్తకం వెలువరించారు. పాలపిట్ట పత్రిక, దక్కన్ డాట్ కామ్లు ప్రత్యేక సంచికలు వెలువరించాయి. కేయూ తెలుగుశాఖ ఆచార్యులు బన్న అయిలయ్య ప్రజాకవి కాళోజీ కవిత్వం అనే పుస్తకం వెలువరించారు. ప్రముఖ కవి లోచన్ కాళోజీపై వ్యాసాల సంపుటి వెలువరించారు. 2014 సెప్టెంబర్ 9వతేదీన కాళోజీ జయంతి రోజున కాళోజీ పేరిట అతిపెద్ద ఆడిటోరియం నిర్మించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే అరుదైన కవి కాళోజీ నారాయణరావు ఆచరణవాది. ఏంచేసినా ప్రత్యక్ష కార్యాచరణతోనే చేయడం అలవా టు. స్వతహాగా సున్నిత మనుస్కుడైన కాళోజీ తన భావాలను, ధర్మాగ్రహాన్ని కవితలుగా మలిచారు. భారతదేశ సాహిత్య చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు పలు పోరాటాల్లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్లోని దౌర్జన్యాలను, వ్యక్తులను ఎండగడుతూ రన్నింగ్ కామెం టరీలా కవిత్వం రాసిన వాళ్లు కాళోజీ తప్ప మరెవరూ లేరంటే అతిశయోక్తికాదు. అలా రాసిన వాటిలో అణాకథలు(1941), నా భారతదేశయాత్ర(1941, బ్రెయిల్ఫోర్డ్ రచించిన రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం), కాళోజీ కథలు(1943), పార్ధివ్యయము(1946), నాగొడవ(1953), తుదివిజయం.. మనది నిజం(1962), తర్వాత వరుసగా నాగొడవ పరాభవ వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం అంటూ నాగొడవను1967లో ముగించారు. ఆ తర్వాత జీవనగీత(1968 ఖలీల్ జిబ్రాన్ రచించిన ద పొయెట్కి అనువాదం), తెలంగాణ ఉద్యమ కవితలు(1969) తర్వాత మళ్లీ నాగొడవ (యువభారతి- 1974), నాగొడవ(1975-77), ఇదీ నాగొడవ (కాళోజీ ఆత్మకథ -1995), బాపూ!బాపూ!!బాపూ!!!(1995) మొదలైన రచనలతో పాటు అంజలి(ఎన్సీ ఫడ్కే రచించిన గ్రంథానికి అనువాదం), ఖలీల్ జిబ్రాన్ కవితలకు అనువాదాలు, భారతీయ సంస్కృతి(సానె గురూజీ రచించిన మరాఠీ గ్రంథానికి అనువాదం) మొదలైన ఆముద్రిత రచనలు ప్రచురణ కావాల్సి ఉంది. మోహనరాగంలో‘మాతృదేశం’ 1940లో ఒక వారపత్రికలో ప్రముఖ ఆంగ్లకవి సర్ వాల్టర్ స్కాట్ రాసిన ‘లే ఆఫ్ ద లాస్ట్ మిన్‌స్ట్రెల్’ గేయంలోని ‘బ్రీత్స్ దేర్ ఏ మాన్ విత్ సోల్ సో డెడ్, హు హేజ్ నాట్ సెడ్ అన్టు హిమ్సెల్ఫ్, దిస్ ఈజ్ మై ఓన్ నేటివ్ లాండ్’ అనే చరణాలను ప్రచురించి అదే భావంతో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించేలా దేశభక్తి ప్రభోదాత్మక గేయాన్ని రాసి పంపాలని ప్రకటించారట. దీనికి స్పందించిన కాళోజీ ఓ గేయాన్ని రాసి పంపారు. ఈ మాతృదేశ గీతాన్ని 1943 మే 26న హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపనోత్సవం రోజున జరిగిన దశమాంధ్ర మహాసభలో పాడి వినిపించారట. మళ్లీ ఇటీవల నిట్ ఆడిటోరియంలో జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ ఆధ్వర్యంలో కళాశాల కర్ణాటక సంగీత ఉపన్యాసకులు పాలకుర్తి రామకృష్ణశర్మ స్వరపరిచిన ఈ గీతాన్ని విద్యార్థినులు కళ్యాణి, శ్రీవాణి, స్వప్న పాడి వినిపించారు. రామకృష్ణశర్మ , మోహనరాగంలో, మిశ్రమ చాపు తాళంలో ఈ గీతాన్ని స్వరపరిచారు. -
హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ అభివృద్ధి
వరంగల్ : వరంగల్‌లో కాళోజీ హెల్త్ యూనివర్శిటీపై డిప్యూటీ సీఎం రాజయ్య శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ యూనివర్శిటీ రాకతో వరంగల్ దశా-దిశ మారబోతోందన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందబోతుందని రాజయ్య తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని ఆయన అన్నారు. కాగా కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సులర్‌గా సురేష్ చంద్ర నియమితులయ్యారు. ఆయన శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా వరంగల్ జిల్లాలో కాళోజీ పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కాకతీయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ సంస్థకు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. 'కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్' ను వరంగల్‌కు మంజూరు చేస్తున్నట్టు సీఎం కార్యాలయం ఈమేరకు ఒక సంక్షిప్త సందేశం ద్వారా వెల్లడించింది. -
హెల్త్ యూనివర్సిటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: వరంగల్ పట్టణంలో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ, ప్రభుత్వ అధికారులతో గురువారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసే హెల్త్ యూనివర్సిటీకి కాళోజి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా పేరును కేసీఆర్ ప్రతిపాదించారు. కేసీఆర్ ప్రతిపాదనకు అధికారులు ఓకే చెప్పినట్టు తెలిసింది. అత్యాధునికి వసతులున్న హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య బుధవారం తెలుగులో జీవో 67ను జారీ చేశారు. ఈ మేరకు సాంస్కృతికశాఖ సం చాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఘనంగా కాళోజీ జయంతి
నాంపల్లి: గ్రేటర్లో కాళోజీ శతజయంతిని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ యాసకు సాహిత్య గౌరవాన్ని కల్పించిన గొప్ప కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కాళోజీ శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాళోజీ సాహిత్య సేవలను వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, ప్రము ఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి ఉపన్యసించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య స్వాగతం పలికారు. ప్రోగ్రాం ఇన్చార్జ్ ఆర్.రాంమూర్తి వందన సమర్పణ చేశారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేయాలి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవీ ప్రసాద్ కోరారు. కాళోజీ శత జయంతి వేడుకలు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవీ ప్రసాద్, కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, నాయకురాలు రేచల్, హైదరాబాదు జిల్లా అధ్యక్షులు ముజీబ్, నగర అధ్యక్షుడు వెంకట్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ సభ్యులు విజయ్ రావు, నాయకులు యాదగిరి రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దార్శనికుడు.. దోమలగూడ: ప్రజాకవి కాళోజీ మనస్సున్న మనిషి, భవిష్యత్ తరాలకు దార్శనికుడు అని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. దోమలగూడలోని ఏవీ కళాశాలలో తెలంగాణ భాషా సాంస్కతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్, తెలంగాణ భాషా సాంస్కతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రముఖ రచయిత బుక్కా బాలరాజు, గాంధి గ్లోబల్ ఫ్యామిలీ జాతీయకార్యదర్శి గున్నా రాజేందర్‌రెడ్డి, నేటి నిజం పత్రిక సంపాదకులు దేవదాసు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కాళోజీ స్మారక చెస్ టోర్నమెంట్ విజేతలకు ఎల్లూరి శివారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఎన్ఐఎన్లో.. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో తెలంగాణ సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సదస్సు జరిగింది. ఎన్ఐఎన్ డెరైక్టర్ కల్పగం పొలాస అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. మల్లారెడ్డి, కవి, గాయకులు సుద్దాల అశోక తేజ, గోరటి వెంకన్న, పాశం యాదగిరి తదితరులు హాజరై ప్రసంగించారు. డాక్టర్ రాజేందర్రావు, భాస్కరాచారి పాల్గొన్నారు. -
కాళోజీకి ఘన నివాళి
తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జేసీ శర్మన్ తదితరులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన రచనలు ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుచేసుకున్నారు. మహబూబ్‌నగర్ కల్చరల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ను తెలంగాణ రాష్ట్ర తొలికవిగా గుర్తించాలని కలెక్టర్ జీడీ ప్రియద ర్శిని కోరారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కాళోజీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వ హించిన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నిరంతర పోరాటం చేసిన కాళోజీ నిత్య చైతన్యశీలి అని కొనియాడారు. ఆయన ప్రాధాన్యతను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సరసన చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళోజీ తెలంగాణ యాస, భాష, రచనలు, మాటలు ప్రభావితం చేశాయని అన్నారు. ప్రధానవక్తగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య ఎస్వీ రామారావు మాట్లాడుతూ.. కాళోజీ మాటల్లో కల్తీ ఉండదని మహాకవి దాశరథి కితాబునిచ్చారని గుర్తు చేశారు. ఆయన రాసిన మొదటి రచనను 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సమ్మేళనంలో భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆవిష్కరించడం జాతికే గర్వకారణమని అన్నారు. కాళోజీ జీవన గమనాన్ని, కవిత్వాన్ని విడదీయలేమని, ఆయన చెప్పదలుచుకున్న అంశాలను, సందేశాలను కరపత్రాలు, కవితలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరవేశారని గుర్తుచేశారు. ఆంగ్లేయులు, నైజాం నవాబుల పాలనతో పాటు ఆంధ్రాపాలకుల వివక్షను ఎండగట్టి పలుమార్లు జైలుకు వెళ్లారని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ.. నవ తెలంగాణను చూడడానికే కాళోజీ తన కళ్లను దానం చేశారని, ఆయన ఇక్కడ లేకున్నా చూడగలుగుతున్నారని అన్నారు. పీయూ వీసీ భాగ్య నారాయణ, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, మునిసిపల్ చైర్పర్సన్ రాధా అమర్ కాళోజీ సేవలను కొనియాడారు. కాగా ఈ సందర్భంగా నూతన రాష్ట్రంలో తెలుగు విశ్వ విద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అవార్డును పొందిన జిల్లా సాహితీభీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తిని నగదు పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్ రావు, జిల్లా సాంస్కృతిక మండలి ప్రతినిధులు, కవులు పాల్గొన్నారు. -
కాళోజీ ఆశయాన్ని సాధించిన కేసీఆర్
కరీంనగర్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించారని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మండలంలోని రేకుర్తిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ విగ్రహానికి మంత్రి రాజేందర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్, ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమైక్యవాదుల పరిపాలనలో తెలంగాణ భాష, యాస కరువైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాళోజీ శతజయంతిని అధికారికంగా నిర్వహించి గుర్తింపునిచ్చిందన్నారు. ఇంటర్మీడియేట్‌లో ఉండగా కాళోజీ అధ్యక్షతన ఏర్పడిన మూమెంట్ ఆఫ్ స్టూడెంట్ ఫెడరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందన్నారు. తెలంగాణ కోసం, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి సీఎం వెంగళరావును ఓడించాలని కాళోజీ ఇచ్చిన పిలుపు రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించిందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం టీఆర్ఎస్ను స్థాపించినపుడు కాళోజీ ఆశీర్వదించినట్లు చెప్పారు. సమానత్వం, ఆకలి లేని సమాజం కోసం తపించిన కాళోజీ ఆశయసాధనకు ప్రతీఒక్కరు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నందెల్లి పద్మ- ప్రకాశ్, ఎంపీటీసీ రాజశేఖర్, తహశీల్దార్ జయచంద్రారెడ్డి, నాయకులు రహీం, నరేశ్, కిష్టయ్య, అనిల్‌కుమార్, మనోహర్ పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజమే నివాళి: ఉమ కరీంనగర్ : అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు ని జమైన నివాళి అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తు ల ఉమ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మం దిరంలో మంగళవారం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం, తెలంగాణ సాధన కోసం గళమెత్తిన మహామనిషి కాళోజీ అని జెడ్పీ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సభలో జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, సీఈవో సదానందం, జెడ్పీటీసీలు సదయ్య, శరత్‌బాబు, అంబటి గంగాధర్, సరోజ, విమల, నార బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవి అన్నవరం దేవేందర్ కాళోజీపై కవితలు చదివి వినిపించారు. ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి : జేసీ కరీంనగర్‌కల్చరల్ : ప్రతి ఒక్కరు అన్యాయాన్ని ఎదిరిస్తూ, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కవికాళోజీ నారాయణరావు శత జయంతి వేడుకలను మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాళోజీ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు, మూడు ఉద్యమాలకు, మూడు కళలకు ప్రతీక అని సాహితీవేత్త గండ్ర లక్ష్మణ్‌రావు కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, డీపీఆర్వో ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, సీపీఓ సుబ్బారావు, డీఈవో కె.లింగయ్య, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవీందర్రావు, సాహితీ గౌతమి కార్యదర్శి దాస్యం సేనాధిపతి, మాడిశెట్టి గోపాల్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహాకవి.. కాళోజీ !
ఇందూరు : కాళోజీ నారాయణరావు భారతదేశానికి పెద్ద కవిగానే కాకుండా సైద్ధాంతికంగా ఉదారవాది, ప్రజాస్వామ్య వాదిగా ఎన్నో పోరాటాలు చేశారని జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి(సీఈఓ) రాజారాం అన్నారు. మంగళవారం జడ్పీ సమావేశమందిరంలో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఈఓ జ్యోతి ప్రజ్వలన చేశారు. కాళోజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా కాళోజీ దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారని, తనలాగే అన్యాయాన్ని ఎదురించిన వారిని ఆదరించేవారన్నారు. 1914 సంవత్సరంలో జన్మించిన ఆయన పదహారేళ్లలోనే కవిత్వం రాశారని తెలిపారు. కాళోజీ ధ్యాస, శ్వాస మొత్తం అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సును కోరుకునేదన్నారు. మోసం చేసిన వారిని విడిచిపెట్టే మనస్తత్వం కాదన్నారు. అందులో మోసం చేసిన వాడు మనవాడైతే సహించేవారు కాదన్నారు. కాళోజీ జీవితంలో ఉద్యమం ఒక భాగంగా మారి, తరువాత ఉద్యమమే జీవితంగా మారిపోయిందన్నారు. నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గర నుంచి నక్సలైట్లపై హింసను ఖండించే వరకు ఆయన చివరివరకూ పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచన ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం ఇలా ఎలాంటి న్యాయపోరాట ఉద్యమానికైనా కాళోజీ రెండు చేతులతో ఆహ్వానం పలికి ఉద్యమకారుడిగానే కాకుండా కవిగా, కథకుడిగా ఉద్యమాలకు ఆలంబనయ్యారని కొనియాడారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు జైలు జీవితాన్ని సైతం అనుభవించారన్నారు. ప్రజలపై అణచివేత ఛాయలు ఎక్కడ కనిపించినా ధిక్కరించడం ఆయనకు ముందునుంచి అలవాటుగా మారిందని, అదే ఆయుధంగా మలుచుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజాకవిగా గుర్తింపు పొంది కవి సంఘానికి అధ్యక్షపాత్ర పోషించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోకెక్కారని, అందుకే ఆయన మన మధ్య లేకున్నా ఎందరో మందికి ఆదర్శప్రాయుడిగా, స్పూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఆయన బతికున్న సమయంలో తాను చనిపోతే దేహాన్ని ఒక మెడికల్ కళాశాలకు అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న గొప్ప వ్యక్తిగా భారతదేశ చరిత్రపుటలోక్లి ఎక్కారని కొనియాడారు. ఆయన ఆశయాలను మనమందరం నిజం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. -
భారవికి కాళోజీ పురస్కారం
హైదరాబాద్: తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు గొప్ప దార్శనికుడని, దమ్మున్న ప్రజాకవి అని పలువురు ప్రముఖులు కొనియాడారు. కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలో సినీ రచయిత జె.కె.భారవికి కాళోజీ స్మారక పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు మాడుగుల నాగఫణిశర్మ, సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞశర్మ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. -
కలలుగన్న తెలంగాణ రావాలి
* అప్పుడే కాళోజీ వంటి వారికి నిజమైన నివాళి * రవీంద్రభారతిలో కాళోజీ శతజయంతి వేడుకల్లో కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రాంత పురోగతికి ప్రణాళిక రచన జరగాలి. రాష్ర్ట సమగ్రాభివృద్ధికి కొత్త చట్టాలు రావాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ యావ ఎందుకు? కాళోజీ, దాశరథి, జయశంకర్లాంటివారు కలలుగన్న తెలంగాణ సాక్షాత్కారం కావాల్సి ఉంది. అలాంటి తెలంగాణను సృష్టించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అదే దిశలో వాస్తవ దృక్పథంతో ముందుకు సాగుతోంది. ప్రజల కు ఏం కావాలో చెప్పిన మాటలను సిన్సియర్‌గా చేసి చూపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శత జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏం జరిగిందంటూ కొందరు కురచ మనస్తత్వం ఉన్నవారు ప్రశ్నిస్తున్నారని, కానీ ధైర్యంగా సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. మేధావులతో త్వరలో ఓ ప్రజాసంఘాన్ని ఏర్పాటు చేస్తామని, దాని ఆధ్వర్యంలోనే పాలన సాగుతుందని ప్రకటించారు. ‘‘రోడ్డని పలికేవాడికి సడకంటే ఏవగింపు.. ఆఫీసని అఘోరిస్తూ కచ్చీరంటే కటువు. సీరియలంటే తెలుగు.. సిల్సిలా అంటే ఉరుదు. టీ అంటే తేట తెనుగు.. చా అంటే తుర్కము. బర్రె అంటే నవ్వులాట.. గేదంటేనే పాలు. రెండున్నర జిల్లాలదే దండి భాష తెలుగు... తక్కినోళ్ల నోళ్ల యాస త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు. వహ్వారే! సమగ్రాంధ్రవాదుల ఔదార్యమ్ము..’’ అంటూ కాళోజీ మాటలను కేసీఆర్ ఈ సందర్భంగా వినిపించారు. అనంతరం ప్రముఖ కళాకారుడు అంబాజీ రూపొందించిన కాళోజీ చిత్రపటాన్ని, జీహెచ్ఎంసీలో ఉప కమిషనర్‌గా పనిచేస్తున్న యాదగిరిరావు రాసిన కాళోజీ సమగ్ర సాహిత్య పరిశోధన గ్రంథాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూధనచారి, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి, రచయిత అంపశయ్య నవీన్, కవి దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వసలహాదారులు రమణాచారి, గోయల్, రామ్‌లక్ష్మణ్, కాళోజీ కుమారుడు రవికుమార్, కోడలు వాణి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. * రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ‘తెలుగు’ అంటూ మళ్లీ బయలు దేరిన్రు. జొచ్చేటప్పుడు చాలా తియ్యగ మాట్లాడతరు.. జొచ్చినాక మీది తెలుగే కాదంటరు. ఇప్పుడు మళ్లీ తెలుగువాళ్లమన్న పేరుతో అదే జరుగుతుంది. వాళ్లెన్నిజేయాలో అన్ని జేసిన్రు.. ఇంకా మానలేదు. కొట్లాడుకుంటు కూడా ఎట్ల బతకాల్నో తెలంగాణ వాళ్లకు తెలుసు.. మీరే దెబ్బదింటరు. గెలిచి నిలవడం తెలంగాణ రక్తంలోనే ఉంది. * నేను తెలంగాణ తల్లి అంటే బిత్తిరిబిత్తిరైన్రు. అది నేను చెప్పిన మాట కాదు. అప్పట్లోనే దాశరథిలాంటి వాళ్లు చెప్పిందే. చెన్నై రాజధాని సమయంలో వాళ్లు ఆంధ్రమాత అన్నరు. చివరకు ఆ ఆంధ్రమాతను, తెలంగాణ త ల్లిని ముంచి తెలుగుతల్లిని పుట్టిచ్చిన్రు. కాళోజీ ఆవహించాడో ఏమోగాని నేను కోపంతో ఎవని తెలుగుతల్లి అంటే నా మీదకు ఇంతెత్తు లేచిన్రు. * తెలంగాణ యాస అంటే మోటుగా ఉంటుందనే భావన కొందరిలో ఉంది. ఈ యాసను ఘనంగా చాటాలనే సోయి వారిలో రావాల్సి ఉంది. కాళోజీ కలలుగన్న తెలంగాణే కాదు, తెలంగాణ యాస కూడా వర్ధిల్లాలి. కాళోజీ సెటైర్ వేసేవారేమో... ఇటీవల సమగ్ర సర్వే చేసినప్పుడు నగరంలో అదనంగా నాలుగు లక్షల కుటుంబాలు ఇళు ్లకట్టుకుని ఉన్న సంగతి తేలిందని, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఈ విషయమే తెలియదని పేర్కొన్నారు. కాళోజీ బతికి ఉంటే దీనిపై పెద్ద సెటైర్ వేసేవారేమోనని కేసీఆర్ చమత్కరించారు. ఉన్నదే చెబుదాం.. మాయ మాటలొద్దు! పరిపాలన విషయంలో ప్రజలకు వాస్తవాలే చెబుదామని, మంత్రులు దీన్నే పాటించాలని కేసీఆర్ హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఏవో మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాయన్నారు. ‘మా ఉప ముఖ్యమంత్రి రాజయ్య నేను వంద రోజుల్లో అద్భుతాలు చేసిన అని అన్నరు. నేను ఏం జేయలే.. అసలు పనే మొదలుకాలే. దసర నుంచి పని మొదలైతదని నేను మొదటే చెప్పిన. ఇంత గడబిడ ఎందుకు? డంబాచారం చెప్పడం, గోల్మాల్ దిప్పడం నాకు రాదు. మంత్రులు ఎవరు కూడా ఇలా చేయవద్దని చెప్పిన. చెబితే మీరే దెబ్బతింటరని చెప్పిన. రాజయ్య గారు వినకుండా ఇక్కడ హెల్త్వర్సిటీ పెడ్తమని వచ్చినప్పడుల్లా అంటున్నరు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలె. సాధ్యమైతదా? చెయ్యగలిగిందే చెప్పా లె. కాళోజీ అదే చెప్పిండు. అడ్డం పొడుగు మాట్లాడి లేని మాటలు పడుడెందుకు. గత ప్రభుత్వాలన్నీ అదే పని జేసినయ్. ప్రజలను మోసపుచ్చే, మాయామశ్చీంద్ర మాటలు ఎందుకు’ అని కేసీఆర్ అన్నారు. కేశవరావు శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తాను వర్సిటీలో ఎం.ఏ (పొలిటికల్ సైన్స్) చేసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో కేకే ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో కూర్చుని వినేవాడినని చెప్పారు. అప్పుడు కేకే... దేశంలో బంగళాల భారతదేశం, గుడిసెల భారతదేశం రెండూ ఉన్నాయని వ్యాఖ్యానిస్తే ఆంధ్ర మీడియా కార్టూన్లు వేసి పెద్ద రాద్ధాంతం చేశాయని కేసీఆర్ వివరించారు. -
విశ్వకవి కాళోజీ
* తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి * కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో కేసీఆర్ ప్రకటన * వరంగల్‌లో మూడున్నర ఎకరాల్లో కాళోజీ కళా కేంద్రం * రూ.12 కోట్లు మంజూరు చేస్తా.. ఇతర భాషల్లోకి కాళోజీ రచనలు * వంద రోజుల్లో ఏమీజేయలే... దసరా తర్వాతే అసలు పని * నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా.. మూడేళ్లలో నిరంతర విద్యుత్ * మంత్రులకు సీఎం కేసీఆర్ హితవు.. మీడియాకు హెచ్చరికలు సాక్షి, వరంగల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కాళోజీ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ కాళోజీ చేసిన రచనలను ఇతర భాషల్లోకి అనువాదం చేయించనున్నట్లు తెలిపారు. కాళోజీ నారాయణరావు పేరిట సాంస్కృతిక శాఖ నుంచి పురస్కారాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఓ యూనివర్సిటీకి కాళోజీ పేరును పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ముందుగా హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ ఫౌండేషన్ నిర్వహించిన కాళోజీ జయంతి ఉత్సవాల సభలో ప్రసంగించారు. ‘‘కాళోజీ గురించి, ఆయన రచనల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. కాళోజీ ఒక్క వరంగల్ జిల్లాకో, తెలంగాణ ప్రాంతానికో, భారత దేశానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట.. కలం నుంచి జాలువారిన ప్రతి కవితా విశ్వజనీనమైనది. సార్వజనీనమైనది. కాళోజీ ‘నా గొడవ’ అన్నడు. వాస్తవంగా అందులో ఆయన గొడవ ఏమీ లేదు. ఆయన గొంతులో, ఆయన కలంలో జాలువారిందంతా ప్రజల దుఃఖమే. ప్రజల గొడవనే తన గొడవ అని చెప్పిన మహానీయుడు. అందుకే ఆయన విశ్వమానవుడు, విశ్వకవి అయ్యాడు. కాళోజీది రాజీపడని తత్వం. పదవులకో, డబ్బులకో, లొంగని వ్యక్తిత్వం. ఎందుకో అటువంటి వ్యక్తిత్వాలు వరంగల్ జిల్లాలో చాలా ఉంటయి. ఇలాంటి వారిలో కాళోజీ తర్వాత అగ్రగణ్యులు జయశంకర్ సార్. ఏదైనా అంశాన్ని ఎత్తుకోకూడదు. ఎత్తుకుంటే చివరిదాకా పోరాడాలనే తత్వం కాళోజీ నుంచే తనకు వచ్చిందని జయశంకర్‌సార్ అనే వారు. కాళోజీ ఉన్నతమైన శిఖరం. ఆ మహనీయుడు గురించి ఇంతకాలం చెప్పుకోలేకపోయినం. మనకు గొంతులేదు. పరాయిపాలనలో మనం బాధపడ్డం. ఆంధ్రావాళ్లు మామూలు పొట్టోన్ని కూడా పొడుగోన్ని చేసి చూపించిన్రు. మన కాళోజీని, దాశరథిని పట్టించుకోలేదు. మన పాల్కురికి సోమనాథుడే ఆదికవి. కానీ నన్నయ్య ఆది కవి అని అబద్ధాలు చెప్పిన్రు. కాళోజీ కోసం 500 గజాల స్థలం కావాలని గతంలో సలాం కొట్టినా ఇవ్వలేదు. ఇప్పుడు మూడున్నర ఎకరాల్లో అద్భుతమైన భవనం ఏర్పాటు చేసుకుంటున్నం. కాళోజీ పేరు మీద వరంగల్ పట్టణానికి ఇదో కానుక. ప్రపంచ స్థాయిలో ఈ కట్టడం ఉంటుంది. కాళోజీ కళా కేంద్రానికి రూ. 12 కోట్లు మంజూరు చేస్తున్నా. అక్కడే అర ఎకరంలో కాళోజీ ఫౌండేషన్ భవన్ ఉంటుంది. కాళోజీ పుస్తకాలు, ఫొటోలు చరిత్ర అక్కడ ఉంటాయి. కాళోజీ కుటుంబం కొంత ఇబ్బందుల్లో ఉంది. కాళోజీ ఫౌండేషన్ పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాన్నుంచి వచ్చే మొత్తాన్ని కాళోజీ కుటుంబానికివ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత కాళోజీ ఇంటికెళ్లి కలిశాను. కన్నీరు పెట్టుకుని ఆశీర్వదించారు. బిడ్డా మంచి గనే మొదలు పెట్టినవుగని కొసెల్లెదాక కొట్లాడు అన్నరు. ఆయన స్ఫూర్తీ, దీవెనల అనుగ్రహం, ప్రజల పోరుతో తెలంగాణ సాకారమైంది. ఈ సమయంలో కాళోజీ, జయశంకర్ సార్ ఉంటే చాలా సంతోషపడేవారు’’ అని కేసీఆర్ అన్నారు. దసరా తర్వాతే అసలు పాలన మొదలు.. పేదలు 50 గజాల ఇంటి స్థలం కోసం అష్టకష్టాలు పడుతుంటే.. ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు వంద ఎకరాల్లో ఉన్నాయని, దీన్ని సమీక్షించుకోవాలని కేసీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్‌పాత్‌లపై నిత్యం 4 లక్షల మంది పడుకుంటరంటే నేను కన్నీళ్లు పెట్టి ఏడ్చిన. ఇది నగరమా, మనకు సంస్కారం ఉందా... దీనికి నేనో బోడగుండు ముఖ్యమంత్రినా అని బాధపడ్డా. ఈ గొప్పదనానికి.. ఈ మాటలు కేకేతో అన్న. మా వంద రోజుల పాలనలో ఏం జేయలే. అసలు పనే మొదలు పెట్టలే. కొన్ని విధానాలు రూపొందించినం. దసరా నుంచే అసలు పాలన మొదలైతది. ప్రస్తుత పాలనా కాలంలో లక్ష కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కలగాలి. కళ్యాణలక్ష్మి పేరిట పేద కుటుంబంలోని మహిళలకు మేలు చేయనున్నాం. ఏమాయె.. గింత ఆలస్యమా అని పీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య రోజూ మెదక్‌లో మొత్తకుంటాండు. పొన్నాలా... మీ జన్మల దళితులకు భూమిలిస్తమని ఆలోచించిన్రా. కళ్యాణలక్ష్మీ ఆలోచించిన్రా. కుండల ఇంత ఉన్నది బిడ్డ. ఎంత తిందామని ప్రజలనే అడుగుదాం. తెలంగాణ వాటర్ గ్రిడ్ అని తీసుకుంటన్న. నాలుగేళ్ల వరకు మారుమూల పల్లెలో ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా లక్ష్యంగా పని చేస్తున్నాం. కరెంటు విషయంలో నేను ముందే చెప్పిన. నేను 107 మీటింగుల్లో మాట్లాడితే ప్రజలారా ఇదీ పరిస్థితి అని 86 సభల్లో చెప్పిన. దాచిపెట్టలే. ఏడాది తిరిగేలోపు కొంత, రెండేళ్లలో ఇంకొంత మెరుగవుతుంది. మూడేళ్ల తర్వాత రెప్పపాటు సేపు కూడా కరెంటు పోదు. కాళోజీ స్ఫూర్తితో పని చేద్దాం’ అంటూ సీఎం ప్రసంగం సాగింది. తెలంగాణ యాసను ప్రేమించిన వ్యక్తి.. కాళోజీ తెలంగాణ నుడికారాన్ని, యాసను అతిగా ప్రేమించిన వ్యక్తి అని కేసీఆర్ కొని యాడారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ తనకు చెప్పిన ఓ విషయాన్ని సభలో కేసీఆర్ వివరించారు. ‘జయశంకర్ సార్ ఒక పుస్తకం రాసిండు. తెలంగాణలో ఏం జరుగుతోంది అని దాని పేరు. ఏం జరుగుతోంది అని ఆంధ్రోళ్లు అంటరు. తెలంగాణలో ఏం జరుగుతాంది అంటరు. మల్లెపల్లి లక్ష్మయ్య అలాగే టైటిల్ పెట్టిన్రు. సభకు కాళోజీగారు వచ్చిన్రు. కాళోజీ దాసుకునే రకం కాదు. ఏది ఉన్నా బడుగ్గున చెప్పేత్తడు. ఏమయ్యా జయశంకర్.. ఏం జరుగుతాంది అని అన్నడట. నేను పెట్టలేదు అని జయశంకర్ సార్ చెప్పుదామనుకున్నడట. కానీ, పుస్తకమూ నువ్వు రాయలేదని అంటడేమోనని జయశంకర్‌సార్ ఆగిం డట. యాసపై కాళోజీ అలా వ్యవహరించేవారు’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. -
'తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలి'
హైదరాబాద్: కాళోజీ అరుదైన వ్యక్తి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బాష కోసం ప్రాణమిచ్చే మహానుభావుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఓ ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. ఆయన పేరు మీద రవీంద్రభారతిని మించిన ఆడిటోరియం వరంగల్ లో కడతామని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం కోసం వరంగల్ నడిబొడ్డున మూడున్నర ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే రూ.12 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రవీంద్రభారతిలో మంగళవారం రాత్రి జరిగిన కాళోజీ శతజయంతి సమాపనోత్సవంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కలగన్న తెలంగాణ కోసం ధైర్యసాహసాలతో ముందుకు పోతామన్నారు. తమ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. గత్తరబిత్తర చేయాలని కొందరు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తెలంగాణ కళ్లతో చూడాలన్నారు. ఇంటింటి సర్వే చేసినా తప్పుబట్టారన్నారు. ఎంతో మంది ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే చేస్తే తప్పా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ సాధించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. -
సీఎంగా తొలి అడుగు
నేడు కేసీఆర్ రాక కాళోజీ శతజయంతి ఉత్సవాలకు హాజరు కళాకేంద్రానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. వరంగల్ నగరంలో మంగళవారం జరిగే ప్రజాకవి కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలోనే సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లాలో కాళోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ బాలసముద్రంలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది. హైదరాబాద్‌లోని సాంస్కృతిక కేంద్రం రవీంద్రభారతికి రెట్టింపు స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాళోజీ కళా కేంద్రం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కళా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో నిర్వహించే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉద్యమ నాయకుడిగా అనేకసార్లు జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ముఖ్యమంత్రి తొలి పర్యటన కావడంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి పర్యటన ఖరారై వారం దాటినా... ఇంకా హడావుడిగానే పనులు చేస్తున్నారు. కేసీఆర్ తొలి పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్ జిల్లా శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్, హన్మకొండ నగరాలను గులాబీ ఫ్లెక్సీలతో అలంకరించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు పోటాపోటీగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముస్తాబు చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది ఏప్రిల్ 26న చివరిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, నర్సంపేట, పరకాల సభలకు వచ్చారు. సీఎం పర్యటన ఇలా.. ఉదయం : 11 : 40 - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)కి చేరుకుంటారు. 11 : 45 - రోడ్డు మార్గంలో నిట్ నుంచి బయలుదేరుతారు. 11 : 51 - కాళోజీ సెంటర్లోని కాళోజీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11 : 55 - బాలసముద్రంలో కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం : 12 : 05 - బాలసముద్రం నుంచి నిట్‌కు బయలుదేరుతారు. 12 : 10 - నిట్‌లోని అబ్దుల్ కలాం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 12 : 10 నుంచి 12 : 30 వరకు అబ్దుల్ కలాం గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు. 12 : 30 - కాళోజీ శతజయంతి ఉత్సవాల సభకు బయలుదేరుతారు. 12 : 32 నుంచి 1 : 30 వరకు ఉత్సవాల సభలో పాల్గొంటారు. 1 : 30 - నిట్ నుంచి బయలుదేరుతారు 1 : 35 - కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. 1 : 35 నుంచి 2 : 10 వరకు మధ్యాహ్న భోజనం 2 : 15 - లక్ష్మీకాంతరావు ఇంటి నుంచి బయలుదేరుతారు 2 : 20 - హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. -
కాళోజీ ఇజానికి నమస్కారం
సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ పట్టాలు తప్పింది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది. పాండిత్య ప్రధాన సాహిత్యాన్ని మార్గ సాహిత్యం అంటాం. చదువ నేర్వని ప్రజల కోసం రాసే నోటి, రాత సాహిత్యాన్ని దేశీ సాహిత్యం అంటాం. ప్రపంచంలో చాలా మంది కవులను ఈ రెండు విభాగాలలో వింగడించవచ్చు. కాళోజీ నారాయణరావు (9.9.1914- 13.11.2002) మాత్రం ఈ రెండు ధోరణుల కన్నా విలక్షణమైన, విభిన్నమైన కవి. ఎందుకంటే, కాళోజీ ఉర్దూ, ఆంగ్లం, తెలుగుభాషలలో దిట్ట. 1940ల లోనే ఉర్దూ, ఆంగ్లంలలో కవితలు రచించాడు. అణా గ్రంథమాల కె.సి. గుప్త కాళోజీతో కథలు రాయించి ‘కాళోజీ కథలు’ (1946) అచ్చు వేశాడు. వచన రచన, కవిత్వం అతని రెండు కళ్లు, కాని అతను త్రినేత్రుడు. సాహి త్యాన్ని మనోచక్షువుల ద్వారా గ్రహించి, సంభాషణా ప్రక్రియ ద్వారా ఎందరినో సాహిత్య పిపాసులను చేశాడు. కాళోజీ అన్నగారు కాళోజీ రామేశ్వరరావు (1908-1996) ఉర్దూలో జానేమానే షాయర్. వీరిద్దరూ ఎల్ఎల్బీ చేసి వకీలు వృత్తిలో ఉన్నారు. ఆ తరువాత కాళోజీ రాజకీయ సామాజిక సాహిత్య కార్యకర్తగా మారాడు. కాళోజీ చక్కని సంభాషణాప్రియుడు. ఆయనతో కూర్చో వడం అంటే సాహిత్య పండిత సభలో ఉన్నట్టే. సాహిత్యం గురించి అనేక సంగతులు అలవోకగా వివరించేవాడు. సంగీత విషయాలు సదాశివ ముచ్చట్లలో చెప్పినట్టు కాళోజీ ముచ్చ ట్లలో సాహిత్యం జలపాతమయ్యేది. కాళోజీ జ్ఞాపకశక్తి గొప్పది. ఆయా కవులను కలసిన తేదీలతోపాటు, వారి కవిత్వ చరణా లను కూడా చెప్పేవాడు. ఎన్నో ప్రాంతాల నుంచి ఎందరో కవులు కాళోజీని కలవడానికి వరంగల్లు వచ్చేవారు. ఐతే ఆయన ఎన్నడూ తన కవిత్వం గురించీ, పోరాటం గురించీ చెప్పుకోలేదు. కప్పి చెప్పడం కన్నా, విప్పి చెప్పడం ఆయన గుణం. అందుకే కవిత్వ శైలిని, భాషని, విధానాన్ని పక్కన పడేసి తనదైన సాదాసీదా తత్వాన్ని అక్షరాలకు అద్దాడు. వేలాది మంది సాహిత్యేతర పాఠకులు అతడు రాసిన కవిత్వం చదివారు. నిజానికి ‘నా గొడవ’ సంపుటాలు సాహిత్య పరులకన్నా, మామూలు పాఠకులకే ఎక్కువగా అందాయి. సాహిత్య వ్యవస్థని ఇంతగా ధిక్కరించిన కవి కాళోజీ ఒక్కడే. సాహిత్య వ్యవస్థ వెలుపల ఉండి ఆయన కవిత్వం రాశాడు. అందుకే కాళోజీని గొప్పగా ప్రేమించే సాహిత్యకారులు చాలామంది కవిగా ఆయనను ఆమోదించేవారు కాదు. కవిత్వ భావన సామాన్యుడి కళ్లు తెరిపించాలి. ఒక కొత్త ఆలోచన కలిగించి కార్యోన్ముఖ దిశగా కదిలించాలి. ఆ విధంగా వేమన లాగా కాళోజీ అన్ని చట్రాలను, విలువలను, ఆధిపత్యాలను నిరసించాడు. ముఖ్యంగా భాష విషయంలో. వేమన కవిత్వాన్ని ఉచితంగా అందించినట్టే, ‘నా గొడవ’ సంపుటాలు ఉచితంగా పంచిపెట్టాడు. ఎలాంటి క్లిష్టత లేని సరళ భాషలో రాశాడు. భాష పెత్తనాన్ని ప్రశ్నించాడు. వలసవాదానికీ, భాషకూ గల సంబంధాన్ని విప్పి చెప్పాడు. నిజానికి గిడుగు, శ్రీపాదలు ఊహించని కొత్త సరళ భాషను హత్తుకున్నాడు. మాండలికాలే భాషకు ప్రాణవాయువని చెప్పాడు. ప్రతి సమస్యను ప్రజా దృక్పథం నుంచి చూసే నేర్పు కాళోజీ సహజాతం. నిజాంని ‘రాణి వాసములోన రంజిల్లు రాజా’ అని సంబోధిస్తూ ‘ప్రజలను హింసించు ప్రభువు మాకేల’ అని అన్నాడు. దాదాపు ప్రతి ముఖ్యమంత్రి చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కవిత్వం రాశాడు. జలగం వెంగళరావుపై పోటీ చేసి చెక్ పెట్టాడు. ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. పౌర హక్కులకు చిరునామా అయ్యాడు. ప్రత్యేక తెలంగాణ కోసం కాళోజీ ఒక పుట్టు రెబెల్. ఎనభై ఏళ్లు తనని పెంచి పెద్ద చేసిన అన్నను కూడా ఎదిరించాడు. 1946-47లో నిజాం ప్రభుత్వం వరంగల్, గుల్బర్గా జైళ్లలో ఉంచింది. మూడు నెలలు జన్మస్థలం అయిన వరంగల్ నుండి బహిష్కరించింది. చెరసాలను చూసి ఏనాడూ వెరవలేదు. ఎంత పెద్ద నాయకుడినైనా లెక్క చేయలేదు. 1958 నుంచి 60 వరకు శాసన మండలి సభ్యుడిగా ఉండి కూడా రాజకీయాలకు దూరమయ్యాడు. స్వాతంత్య్ర సమరయోధునిగా, గౌరవ డాక్టరేట్ పుచ్చుకున్న వాడిగా, పద్మవిభూషణ్‌గా ఎన్ని పురస్కా రాలు పొందినా తన స్వభావానికి వ్యతిరేకంగా జీవించలేదు. మనసు ఎంత సున్నితమో ఆయన వ్యక్తిత్వం అంత సుదృఢం. చిన్నా పెద్దలను ఒకేలా పలకరించేవాడు. అందరితో హాయిగా ఉండే కాళోజీ ‘పెద్దల’ విషయంలో మాత్రం అతి కటువు. ఆనాడు ఎన్నికలను బహిష్కరించాలని పీపుల్స్‌వార్ చేసిన ప్రకటనని ధైర్యంగా ఖండించాడు. సాహిత్య రంగం, సామాజిక రంగం, రాజకీయ రంగం దేనినీ తన కవిత్వంలో విడిచిపెట్టలేదు. ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినప్పుడల్లా అతని కలం, గళం ఊర్కోలేదు. ‘డెమోక్రసీ డీ రేలైంది’ అని హెచ్చరించాడు. నిజానికి కాళోజీ వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైంది. అటువంటి ‘మనిషి’ అరుదు. సాహిత్య లోకంలో మరీ అరుదు. కాళోజీ తనను తాను విముక్తం చేసుకున్న ఆలోచనా పరుడు. అతడిని క్రాంతదర్శి అనవచ్చు. కులం మతం పట్ల పట్టింపులేదు. సాహిత్యంలో అతనిది పాల్కురికి సోమన మార్గం. ఆ మార్గంకన్నా సులభీకరణ చేసిన దారిలో నడిచింది అతని రచనా వ్యాసాంగం. రూపం వచన కవిత్వమే. కాని గేయలక్షణం ఎక్కువ. అప్పుడప్పుడు విషయ ప్రధానమైన ప్రకటనలా కనిపిస్తుంది. కాళోజీ మొత్తం 500 పేజీల కవిత్వాన్ని ఒక దగ్గరగా చూసినప్పుడు ఆ కవిత్వం మనల్ని వెంటాడటం మొదలవుతుంది. దిగంబరుల కన్నా ఎంతో ముందే తిరుగు బాటు కవిగా కాళోజీని పేర్కొనవచ్చును. తెలంగాణలో తిరుగుబాటు తత్వం పాలక హింసాకృత్యాల వల్లే హెచ్చింది. 70 ఏళ్లుగా అలాంటి హింసని అక్షరీకరించిన కాళోజీ ఒక తిరుగుబాటు సాహిత్య చరిత్రకారుడు. కాళోజీ జీవితం నేర్పిన పాఠం ధిక్కారం. ప్రశ్న. కాళోజీని గుర్తు చేసుకోవడం అంటే నోరులేని ప్రజల తరఫున ప్రశ్నించడమే. రాజ్యాన్నే కాదు. ప్రతి నిర్మాణాన్ని ప్రశ్నించి, హెచ్చరించి ప్రజాస్వామ్యీకరించాలి. విముక్త మేధావి మాత్రమే ఇవాళ సమగ్ర సమాజ అధ్యయనశీలి. అతడే కొత్త పోరాట బీజం. 1950ల లో ‘నా ఇజం’ కవితలో ‘‘నాది నిత్య నూత్న వికసిత విజ్ఞానం’’ అంటాడు. వ్యవస్థలోని ప్రాచీన, ఆధునిక వ్యవస్థలలో ప్రజలను, బలహీనులను అణచివేయడాన్ని ఇష్టపడలేదు. అదే కాళోజీ తత్వం. ఇవాళ ఈ ఆలోచన సమాజంలో ఇంకిపోవాలి. దీనిని ఎదిరించగలిగే సత్తా ప్రజలకు అందించిన నాడు అన్ని రకాల పెత్తనాలు సమసిపోతాయి. దీని వల్ల ప్రజల సత్తా పెరుగుతుంది. అందుకోసమే కాళోజీ కలలు గన్నాడు. (వ్యాసకర్త జానపద సాహిత్య పరిశోధకుడు) - డా॥జయధీర్ తిరుమలరావు -
నూరేళ్ల ‘ధిక్కార స్వరం’!
‘అన్యాయాన్నెదిరిస్తే/ నా గొడవకు సంతృప్తి/అన్యాయం అంతరిస్తే/ నా గొడవకు ముక్తిప్రాప్తి’ అంటూ జనం ఆవేదనలనూ, ఆక్రందనలనూ తన ‘గొడవ’గా ఎంచుకుని, దాన్ని తీర్చడానికే జీవితాంతమూ కృషి సల్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు శత జయంతి నేడు. తన కాలం కన్నా, తన చుట్టూ ఉన్న సమాజంకన్నా ముందుకెళ్లి ఆలోచించడమే కాదు...ఆ ఆలోచనలను ఆచరించే క్రమంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను కాళోజీ నిబ్బరంగా ఎదుర్కొన్నారు. కనుకే ఆయన చిరస్మరణీయుడయ్యారు. మనిషి జీవితంలో ఉద్యమం ఒక భాగం కావటమూ, జీవితమే ఉద్యమంగా మారటమూ కాళోజీలో చూస్తాం. నిజాం రాజ్యాన్ని ప్రతిఘటించడం దగ్గరనుంచి...నక్సలైట్లపై హింసను ఖండించేవరకూ ఆయన చివరివరకూ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆర్య సమాజ్ కార్యకలాపాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ, హైదరాబాద్ విమోచనోద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, పౌరహక్కులు, తెలంగాణ ఉద్యమం...ఇలా ఈ గడ్డను తాకిన, ఊగించిన, శాసించిన ఏ ఉద్యమానికైనా కాళోజీ రెండు చేతులతో ఆహ్వానం పలికారు. ఆవాహనచేసుకున్నారు. ఉద్యమకారుడిగా మాత్రమే కాదు... కవిగా, కథకుడిగా ఆ ఉద్యమాలకు ఆలంబనయ్యారు. ఈ క్రమంలో జైలు జీవితమూ అనుభవించారు. అలాగని ఆ ఉద్యమాలు ఎటు తోస్తే అటు పోలేదు. స్వీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన ఆచరణ ద్వారా ఆ ఉద్యమాల ఉన్నతికి దోహదం చేశారు. అణచివేత ఛాయలు ఎక్కడ కనిపించినా ధిక్కరించడం ఆయనకు ముందు నుంచీ అలవాటు. అందుకే, కాళోజీ ఆగ్రహించినప్పుడు, అభ్యంతర పెట్టినప్పుడు... నిశితంగా విమర్శించినప్పుడు ఏ ఉద్యమమైనా తనను తాను సరిదిద్దుకున్న, సంస్కరించుకున్న సందర్భాలు కోకొల్లలు. అలాగే, తన అవగాహనకు అందని మరేదైనా కోణం అందులో ఆవిష్కృతమై నప్పుడు ఆయన దాన్ని అంగీకరించడానికీ వెనుకాడలేదు. చిత్రమేమంటే ఇన్నింట తన దైన ముద్రవేసినా ఏ సిద్ధాంత చట్రంలోనూ ఆయన ఇమడలేదు. ఏ పార్టీ జెండా మోయలేదు. ‘నాది గొర్రెదాటు వ్యవహారం కాద’ని ప్రకటించారు. కన్నడ, మరాఠీ, తెలుగు ప్రాంతాల కలయికగా ఉన్న హైదరాబాద్ రాజ్యంలో పుట్టడంవల్ల అమ్మనుంచి కన్నడం, నాన్ననుంచి మరాఠీ, ఉర్దూ నేర్చుకుని... చుట్టూ ఉండే సమాజంలో తెలుగును ఔపోసనపట్టి, ఇంగ్లిష్కూడా అభ్యసించి, అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల, రచనలు చేయగల సత్తాను కాళోజీ సొంతం చేసుకున్నాడు. 1914 సెప్టెంబర్ 9న ఇప్పటి కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో ఆయన జన్మించాక కుటుంబం అక్కడినుంచి వరంగల్ జిల్లాలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. ఆయనే ఒకచోట రాసుకున్నట్టు అప్పట్లో తెలంగాణ గడ్డపై సమాంతరంగా సాగిన పలు ఉద్యమాలకు కాళోజీ ఇల్లు కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమాలన్నీ సామాజిక జీవితంలోకి తెచ్చిన విలువల్లోని మంచిని స్వీకరించడంవల్ల కావొచ్చు...కాళోజీకి తనదైన విశిష్ట వ్యక్తిత్వం అలవడింది. ‘నేను కమ్యూనిస్టు వలె చెబుతున్న. నేను సోషలిస్టుగా మాట్లాడుతున్న. నేను హిందువుగా చెబుతున్న అంటరుగానీ మరి మనిషిగా ఆలోచించేదెప్పుడు అన్నదే నా ప్రశ్న’ అని కాళోజీ తన ఆత్మకథలో అనడమే ఇందుకు రుజువు. ప్రజాస్వామ్యంలో అత్యుత్తమ హోదా పౌరుడేనని చెప్పడమే కాదు...ఆ పౌరుడికుండవలసిన హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించి నప్పుడల్లా కాళోజీ ఎదిరించి నిలబడ్డారు. ప్రజాస్వామ్యమంటే అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలేనన్న అభిప్రాయాన్ని కలగజేసి, ఆ తర్వాత పాలనలో ప్రజలకెలాంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా... వారి అభిప్రాయాలకు ఏపాటి విలువా ఇవ్వకుండా వారిని పాలితులుగా మాత్రమే మిగిల్చే అధికారస్వామ్యాన్ని ఆయన మొదటినుంచీ ధిక్కరించేవారు. ‘కలదందురు లోకసభను/ కలదందురు ప్రభుత్వము లోన పంచాయితిలో/ కలదందురు రాజ్యాంగమున/కలదు ప్రజాస్వామ్య మనెడు వింత కలదో? లేదో?’ అంటూ వివిధ సంస్థల్లో ప్రజాస్వామ్యం లుప్తమవుతున్న తీరును దుయ్యబట్టారు. తన ఆప్తమిత్రుడు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక ఆయన అడిగారని కాదనకుండా ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని పొందినా అంతకు ముందువలే ప్రభు ధిక్కారాన్ని నూటికి నూరుపాళ్లూ కొనసాగించిన వ్యక్తిత్వం కాళోజీది. ‘జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ/ సాక్షీభూతుణ్ణిగాను- సాక్షాత్తూ మానవుణ్ణి’అని అన్నట్టే తుదివరకూ తనలోని ఆ మానవుణ్ణి అలానే కాపాడుకుంటూ వచ్చారు. తేట తెలుగు పదాలతో, అవసరమైన చోటల్లా వ్యంగ్యాన్ని, విసుర్లనూ నింపి కవిత్వాన్ని పదునైన ఆయుధం చేయడం కాళోజీ ధోరణి. ‘పెట్టుకునే టోపీ కాదు/పెట్టిన టోపీ చూడు/ఎగరేసిన జండా కాదు/చాటున ఆడించిన దండా చూడు’ అనడం ఆయనకే చెల్లింది. ప్రజాస్వామిక లక్షణాన్ని నిలువెల్లా ఒంటబట్టించుకున్న కవి గనుకే కాళోజీ స్వరం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. సూటిగా తాకుతుంది. వర్తమాన వాస్తవాన్ని పురాణ ప్రతీకలతో హత్తుకునేలా చెప్పడం కాళోజీలా మరొకరికి సాధ్యం కాలేదు. ‘అతిథివోలె ఉండి ఉండి- అవని విడిచి వెళ్లుతాను’అని ఒకచోట అన్నప్పటికీ తాను అతిథిలా ఉండిపోలేదు. జీవితాంతమూ ప్రజల హక్కుల కోసం తాపత్రయపడి... వారి పోరాటాలకూ, జీవితాలకూ, వ్యక్తిత్వాలకూ పెద్ద దిక్కుగా నిలబడ్డారు. కాళోజీ లాంటి వ్యక్తులు చరిత్రలో అరుదుగా జన్మిస్తారు. కాళోజీని స్మరించుకోవడమంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వదలివెళ్లిన విలువలనూ గౌరవించడం. అంతకుమించి ఆచరించడం. అలా ఆచరించగలిగినప్పుడే కాళోజీకి నిజమైన నివాళులర్పించినట్టవుతుంది.