అధికారికంగా కాళోజీ జయంతి
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సెప్టెంబర్ 9న జరిగే కాళోజీ శత జయంతి సందర్భంగా హైదరాబాద్, వరంగల్‌లో ప్రధాన కార్యక్రమాలు, అన్ని గ్రామాలు, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్వర్వులు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సూచించారు. ‘వరంగల్ కాళోజీ ఫౌండేషన్’ నేతృత్వంలో ప్రముఖ కవులు, రచయితలు అంపశయ్య నవీన్, నందిని సిధారెడ్డి, బి.నర్సింగ్‌రావు, నాగిళ్ల రామశాస్త్రి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పి.అశోక్‌కుమార్ తదితరులు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై.. కాళోజీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ, పాఠ్యాంశాలుగా కాళోజీ జీవిత చరిత్ర-రచనలు తదితర అంశాలపై చర్చించారు.
తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళోజీ శత జయంతి సందర్భంగా వరంగల్‌లో కాళోజీ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి స్వయంగా తానే శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కంటే గొప్పగా ఈ భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఇందులో కాళోజీ రచనలు, జ్ఞాపకాలను పదిలపరచాలని సీఎం సూచించారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించే జయంతి వేడుకలో పాల్గొంటానని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు, తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
పాఠ్యాంశంగా కాళోజీ జీవిత చరిత్ర
కాళోజీ శత జయంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆయన జీవిత చరిత్ర, రచనలతోపాటు, తెలంగాణ విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేరుస్తామన్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాలను మారుస్తున్నట్టు తెలిపారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ చిహ్నాలను చెరిపేసి, వారి చిహ్నాలను మనపై రుద్దారని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మనవాళ్ల గురించి మన భావి తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు కేవీ రమణాచారి, బీవీ పాపారావు, ఎంపీ కడియం శ్రీహరి, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.