సాక్షి, హైదరాబాద్ : దేశానికి ఏదో చేయాలనే ఆలోచన నుంచి పుట్టిన ఫెడరల్ ఫ్రంట్ ఓ ప్రకంపనలా జాతీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని పార్టీ ప్లీనరీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. కూనగా ప్రస్థానాన్ని ఆరంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థాయికి ఎదిగిందని చెప్పారు.
‘ప్రాణం బక్కపలుచనిదైనా దేశానికి ఏదో చేయాలనే తపన. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన తర్వాత కేసీఆర్ అంటే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌లకు భయం పట్టుకుంది. మొండివాడు కదా.. పట్టుకుంటే వదలడని వారి భయం. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించాలని, నేను నాయకత్వం వహించాలని నాయకులు కోరారు. నన్ను నాయకుడిగా తీర్మానించారు. గత ఏడాదిన్నర నుంచి కేంద్రం ప్రభుత్వ వైఖరిని చూసిన తర్వాత ఈ దేశంలో జరగవలసింది జరగడం లేదు అని అర్థమైంది.
ఈ మాట నేను ఆషామాషీగా చెప్పడం లేదు. ఎన్నో కఠోరమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. నాకు 64 ఏళ్ల వయసు వచ్చింది. అందరం కలసి తెలంగాణ సాధించుకున్నాం. మా పని మేం చేసుకుంటూ వెళ్తున్నాం. లోటు లేకుండా ఉన్నాం. కానీ ఇక్కడ పుట్టాం కాబట్టి దేశం బాగు కోసం కూడా పోరాడాలి అనిపించింది. ఈ దేశానికి మంచి దారి చూపించడానికి ప్రయత్నిస్తాం. ఎవరికి భయపడం. కేసీఆర్ మోదీ ఏజెంట్ అని రాహుల్, మీ ఫ్రంట్‌కు టెంటే లేదు అని మోదీ అంటున్నారు. మాకు టెంటే లేనప్పుడు మీకు భయం దేనికి?.
సిగ్గపడాలి స్వతంత్రం వచ్చి 71 ఏళ్లు గడిచాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 66 ఏళ్లు పాలించింది. 11 ఏళ్ల పాటు బీజేపీ, ఐదున్నర ఏళ్ల పాటు వేరే ప్రధానులు ఉన్నారు. వాళ్లను కూడా ఈ పార్టీలు బతకనివ్వలేదు. ఒకరితో విసుగొస్తే మరొకరికి పట్టం కడతారు ప్రజలు అనే విధంగా కాంగ్రెస్, బీజేపీల ఆలోచనా ధోరణి ఉంది. అదే వీళ్లకు బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్, బీజేపీల నిషా నుంచి దేశ ప్రజలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం ఏంటో అందరూ తెలుసుకోవాలి.
కర్ణాటకలో ఎన్నికల వల్ల కావేరి నీటిపై వివాదం నడుస్తోంది. కావేరి వివాద పరిష్కారంపై బీజేపీ అసలు ఆలోచించడం లేదు. ఏంటని ప్రశ్నిస్తే దేశంలో నీటి యుద్ధాలు ఎప్పటినుంచో ఉంటున్నాయని సమాధానం ఇస్తున్నారు. మన దేశంలో 65,500 టీఎంసీల నీరు నదుల్లో ఉంది. హిమనీ నదాల ద్వారా 3 వేల టీఎంసీలు, భూటాన్ ప్రాంతం నుంచి మరో 3 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నిజాయితీ ఉంటే నా ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పాలి.
నన్ను విమర్శించే ముందు 70 వేల టీఎంసీల నీరు లభ్యత ఉంటే మీరేం చేస్తున్నారో చెప్పండి. కేవలం 40 కోట్ల ఎకరాల్లో దేశవ్యాప్తంగా పంటలు పండుతున్నాయి. దేశంలో లభ్యత ఉన్న నీటిని ధర్మం ప్రకారం పంచితే 30 వేల టీఎంసీల నీరు మిగులుతుంది. పారిశ్రామిక అవసరాలను 5 వేల టీఎంసీలు వాడినా.. మిగులు 25 వేల టీఎంసీలు ఉంటుంది. నీటి వివాదాలపై ఏర్పాటు చేస్తున్న ట్రైబ్యునల్స్ తీర్పులకు దశాబ్దాల పాటు సమయం పడుతోంది. ఈ లోగా జనరేషన్లు మారిపోతున్నాయి కానీ కష్టాలు తీరడం లేదు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు ముందు 6 నెలల్లో తీర్పు ఇవ్వాలని కేంద్రం ముందు చెప్పకూడదా?.
చెప్పరు. రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఇలా చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ‘హర్ ఎకర్ మే పానీ.. హర్ కిసాన్ కే పానీ’ అనే నినాదంతో దేశ ప్రజల్లోకి వెళ్తుంది. దేశంలో దీన్ని అమలు చేసి చూపిస్తాం. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నడుంబిగిస్తోంది కాచుకోండి. కాంగ్రెస్, బీజేపీ డైలాగ్స్ వింటే పెద్దగా ఉంటాయి. అంతర్జాతీయ సరుకులు రవాణా చేసే లారీ ఎక్స్‌ప్రెస్ హైవేలపై విదేశాల్లో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. మన తెలివికి 26-36 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. చైనాలో లక్ష 23 వేల కి.మీ దూరం పాటు ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటే.. మనదేశంలో మాత్రం 2 వేల కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి.
ఎవరి అసమర్ధత ఇది?. ఎవరి చేతగానీ తనం ఇది?. గూడ్స్ రైళ్ల వేగం చైనాలో గంటకు 80 కిలోమీటర్లు. మనదేశంలో కేవలం 24 కిలోమీటర్లు. ఇది మనవాళ్ల ప్రతిభ. మనదేశంలో లక్షదీవులు ఉన్నా.. టూరిజం కోసం విదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి. విదేశాలు ఇక్కడ ఎన్‌జీవోలకు డబ్బు ఇచ్చి పిల్స్ వేయిస్తే.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం మనకు చేత కావడం లేదు. హైదరాబాద్‌లో సగం ఉండే సింగపూర్‌లోని పోర్టులో 4 కోట్ల కంటైనర్లను హ్యాండిల్ చేస్తారు. మన పక్క దేశం చైనా 19 కోట్ల కంటైనర్లను పోర్టుల్లో హ్యాండిల్ చేస్తోంది.
మనకు ప్రకృతి సిద్ధంగా అద్భుతమైన పోర్టులు ఉండి కూడ ఒక కోటి కంటైనర్లను కూడా హ్యాండిల్ చేయలేని దుస్థితి. కేవలం 87 లక్షల కంటైనర్లను హ్యాండిల్ చేస్తున్నాం. దుఃఖం కలిగేది ఎక్కడంటే ప్రజలకు స్టోరీలు చెబుతూ.. ‘గరీబీ హఠావో’ లాంటి పనికిమాలిన నినాదాలు ఇవ్వడం. చైనా వాళ్లు బంగారం ఏమైనా తింటున్నారా?. 1968లో భారత ఆర్థిక వ్యవస్థ 180 బిలియన్ డాలర్లు. 2016లో చైనా ఆర్థిక వ్యవస్థ 9,504 బిలియన్ డాలర్లు. మనం ఆర్థిక వ్యవస్థ కేవలం 2,405 బిలియన్ డాలర్లు. ఈ మూడు దశాబ్దాల్లో మనం ఏం చేస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.
వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ, ఆరోగ్య శాఖలు కేంద్ర ప్రభుత్వానికి దేనికి?. అవి మీ దగ్గర ఎందుకు ఉండాలో ఒక్క కారణం చెప్పండి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం ఉంది ఎక్కడో నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామంలో ప్రధానమంత్రి వచ్చి పలుగు, పార చేతబట్టి రోడ్డు వేస్తారా?. మరి ఇక్కడి నాయకులు ఏం చేయాలి. వ్యవసాయం ఆయా ప్రాంతాలను బట్టి ఉంటుంది. కేంద్రానికి వ్యవసాయంతో పనేంటి. దేశ రక్షణపై, అంతర్జాతీయ దౌత్యంపై కేంద్రం దృష్టి పెట్టాలి.
దాదాపు 5 లక్షలకు పైగా సైనికులు రోజు అట్టుడుకుతున్న కశ్మీర్‌లో దేవుడా అంటూ పని చేస్తున్నారు. మీ సత్తా అక్కడ చూపించండి. అన్ని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల పారదర్శకత లోపిస్తుంది. విదేశాల్లో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయి. మన సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్తే కంపు కొడుతుంటుంది. మనకు ఇదే వైకుంఠం. ఇదే కైలాసం. దేశంలో ఏ ఎయిర్‌పోర్టుకు పోయినా రన్ వేలు లేవు. గంటల కొద్దీ విమానం గాలిలో తిరగాలి. అనవసరమైన అసమర్ధ విధానాలు ఈ దేశంలో కొలువుదీరి ఉన్నాయి.
మన దేశం ఏ రంగంలో బావుంది చెప్పండి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చంద్రస్వాములు, స్వాములు, సన్నాసులు, ఆశారాంలు, డేరాలు, నీరవ్, లలిత్‌మోడీలను పెంచి పోషించాయి. ఇదంతా మన కర్మ. ఇంత చేసినా మళ్లీ ఆహా కాంగ్రెస్, ఓహో బీజేపీ అని డబ్బా కొట్టాలా?. ఇవి సాగవు.
త్వరలో స్టాలిన్, అఖిలేఖ్‌లతో భేటీ..
అతి త్వరలో డీఎంకే నాయకుడు స్టాలిన్‌ను కలబోతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. దేశం మొత్తం పక్షిలాగా తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్‌తో గుణాత్మక మార్పులు తెస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ సాధన అనంతరం దేశం కోసం పోరాడటానికి డైమండ్స్ లాంటి నాయకులు రెడీగా ఉన్నారు. ‘మీరందరూ దేశం కోసం పోరాడండి. తెలంగాణను వదిలిపెట్టను. హైదరాబాద్ కేంద్రంగానే భూకంపం పుట్టిస్తానని చెబుతున్నా. గులాబీ పరిమణాలను భారతదేశ నలుమూలలకు వ్యాపించజేస్తా. అద్భుతమైన నిర్మాణాలతో భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఏం లేవని మనం వెనకబడ్డాం. అన్ని ఉన్నాయి. పాలకులకు దమ్ము లేదు. దేశ ఎకానమీని అధ్యాయనం చేసే శక్తి వారికి లేదు. ఇప్పటికే అతి విలువైన 7 దశాబ్దాలు పోయాయి. దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైనటువంటి ప్రాతపోషిస్తా.’ అని కేసీఆర ప్లీనరీలో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment