సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలు, ఇతర ఉద్యమకారులు, వ్యవస్థల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలకు మాత్రమే ఆయన పరిమితం అవుతున్నారని విమర్శించారు. ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ తీవ్రంగా ఖండిచారు. ఆయనే గొప్ప అనే విధంగా కేసీఆర్ భాష్యం ఉంటోందన్నారు.
శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి రాక ముందు సరిహద్దులో యుద్ధవిమానాల పైలట్‌గా చేయడం తన అదృష్టమని ఉత్తమ్ చెప్పారు. ప్రజా జీవితంలో నిస్వార్ధంగా పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణ మీద పడి దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ‘నేను, నా భార్య ప్రజా జీవితానికి అంకితం అయ్యాం. మాకు పిల్లలు లేరు. కుటుంబం లేదు. ఇద్దరం ప్రజా జీవితానికే అంకితం అయ్యాం.
కేసీఆర్ నీ లాగా.. క్యారెక్టర్ లేని పనులు చేసి రాజకీయాల్లోకి రాలేదు నేను. మళ్ళీ పిచ్చి, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎక్కువ తెలివి ఉపయోగించకు. 500 కోట్ల రూపాయల జాగాలో 60 కోట్ల రూపాయలు పెట్టి ఎవడబ్బ సొమ్మని ప్రగతి భవన్ కట్టావ్. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది కదా. మీ అబ్బ సొత్తు కాదు. జవాబుదారీ తనం ఉండాలి. దేశం ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి ఇల్లు కట్టుకోలేదు. ప్రధాని ఇల్లు కూడా ఇట్లా ఉండదు. ప్రజల సొమ్ము దుబారా చేస్తూ.. విలాస జీవితం అవసరమా?.
విలాసమైన ఇల్లు, కోట్ల రూపాయల కార్లు.. అంత పెద్ద విలాసవంతమైన ఇల్లు,మన సొమ్ముతో పెళ్లి, పేరంటాలకు ప్రైవేట్ జెట్ విమానాల్లో వెళ్తున్నారు. పనికిరాని చైనా ట్రిప్‌కి ప్రైవేటు జెట్ విమానాలు అవసరమా?. చనిపోయిన రైతులకు, అమరవీరులకు ఇవ్వడానికి పైసలు ఉండవు. సబ్సిడీ ఇవ్వడానికి, బీసీలు, ఎస్సి, ఎస్టీలకు భూమి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు. ప్రజల సొమ్ము కోసం ప్రశ్నించడం ప్రతిపక్ష కర్తవ్యం. కేసీఆర్ తెలంగాణా ముసుగులో అవినీతికి పాల్పడుతోంది. బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, దోపిడీ దార్లు మాత్రమే ప్రగతి భవన్ వస్తున్నారు.
సామాన్య ప్రజలకు ఎంట్రీ లేదు. తెరాస ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు. సినిమా వాళ్లకు, బ్రోకర్లకు తాకట్టు పెడుతున్నారు. సంచులు మోసేది మీరా? మేమా?. ఎన్ని గదులున్నాయో నీకే తెలుసు. లక్ష స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టావా? లేదా?. సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ అంట ఈయన తీస్మార్ ఖాన్ అంట. చైనాను మనల్ని పోల్చుతారా. ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలుసా?. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఎంపీ సీట్లు రావు. ఇంకా ఫెడరల్ ఫ్రంట్ ఏందీ?. తెలంగాణను ఏం ఉద్ధరించావో చెప్పు.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ 4 నెలల్లో ఇస్తాం అని అన్నారు. 4 ఏళ్లు గడచిపోయాయి. కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదు. ఇప్పటివరకూ 10 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కట్టలేదు.
ప్లీనరీ సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం ఖాయం. దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం పెట్టు చాలు. క్యాంపస్‌లోకి పోలేని వ్యక్తి.. దేశాన్ని నడుపుతాడట.’ అంటూ ఉత్తమ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment