సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ వేదికగా దుయ్యబట్టారు. బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని తూర్పారబట్టారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నాయకుల వద్ద సంచులు మోసిన ఉత్తమ్.. టీపీసీసీ ఎలా వచ్చిందో గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
టీపీసీసీ అనే పేరు రావడానికి కారణం గులాబీ జెండా అని మర్చిపోవద్దని సూచించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిందే టీఆర్‌ఎస్. 14 ఏళ్ల అలుపెరగని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అబద్దాలు చెప్పడానికి కూడా తెలివి కావాలి. ఉత్తమ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు అవమానపడ్డారు. అయినా తెలివి లేదు. ఎట్లా మాట్లాడాలో తెలీదు. 50 నుంచి 100 గదులతో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడని యాత్ర చేస్తూ చెబుతున్నారు.
ఉత్తమ్ నీకు ఇదే నా సవాల్. మొత్తం మీడియాను తీసుకుని నువ్వు ప్రగతిభవన్‌కు రా. 15 గదుల కంటే ఎక్కువ లేకపోతే అక్కడే నీ ముక్కును నేలకు రాసి వెళ్లాలి. 16 గదులు ఉన్నా ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, నేను తిరిగి కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకొచ్చాం. అవన్నీ మేం తెచ్చినవే కొత్తగా వీళ్లేం తెచ్చారు అన్నారు.
నేను అప్పుడు బేగంపేట విమానాశ్రయం వద్దే ఉంటా నిరూపిస్తే రాజీనామా చేస్తా అని సవాల్ చేశా. తోకముడిచిన ఉత్తమ్ రాలేదు. ప్రజలు ఏం జరగుతుందో గమనించాలి. కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా హైదరాబాద్‌లోని పెద్దాసుపత్రుల్లో ప్రజలు చచ్చిపోతే అంబులెన్స్‌లో దించిరావాలని మీ జీవితంలో అనుకున్నారా?. రాష్ట్రంలో కంటి తుడుపుగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల కోసం 500 కళాశాలలను ప్రారంభించింది. ఎప్పుడైనా మీ జీవితంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కట్టించాలని ఆలోచించారా?.
మేం చేస్తుంటే మీ కళ్లు ఓర్వలేకపోతున్నాయి. 2014లో ప్రజల ముందు పెట్టిన మెనిఫెస్టోను నూరు శాతం అమలు చేసిన దేశంలోని ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. రాష్ట్రానికి ఇన్ని చేస్తున్న టీఆర్‌ఎస్‌ను చూసి కాంగ్రెస్ సిగ్గుపడాలి. ప్రాజెక్టులపై 250 కేసులు పెడతారా. తెలంగాణ బాగుపడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొట్టాలి.’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment