ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. ఆదాయాభివృద్ధి రేటులో అరుదైన ఘనత సాధించింది. గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్వీయ ఆదాయం (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ)లో 17.2 శాతం సగటు వృద్ధి రేటుతో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు కాగ్ వెబ్‌సైట్‌లో తాజా గణాంకాలను నమోదు చేశారు. 2014 జూన్ నుంచి 2018 మే వరకు ఆదాయాభివృద్ధి వివరాలను కాగ్ వెల్లడించింది.
మొత్తం నాలుగేళ్ల కాలంలో తెలంగాణ సగటున 17.2 శాతం వృద్ధి రేటు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ 2015–16లో 13.7 శాతం, 2016–17లో 21.1 శాతం, 2017–18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించింది. 14.2 శాతంతో హరియాణా, 13.9 శాతంతో మహారాష్ట్ర, 12.4 శాతంతో ఒడిశా, 10.3 శాతంతో పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతంలోపు వృద్ధిరేటు సాధించాయి.
ఆర్థిక విధానాలు.. క్రమశిక్షణ వల్లే : కేసీఆర్
రాష్ట్రంలో అవలంభిస్తున్న ప్రగతికాముక ఆర్థిక విధానాలు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లనే ఆదాయాభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడానికి కారణాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లాంటి నిర్ణయాల తర్వాత కూడా తెలంగాణ సుస్థిరమైన ఆదాయాభివృద్ధితో ఆర్థిక ప్రగతి సాధించడం శుభసూచకమన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత బాగా అమలు చేసుకోవడానికి ఆదాయాభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment