సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యకలాపాలను తాత్కాలికంగా హైదరాబాద్ నుంచే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో ప్రభుత్వ భవనాలు లేకపోవడం... కొత్త భవనాల నిర్మాణం చేపట్టకపోవడంతో పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ నుంచే తాత్కాలిక ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయంలో అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇటీవలే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ టి.వెంకటేశ్వర్‌రావును ప్రభుత్వం నియమించింది. ఆయన తక్షణమే డీఎంఈ కార్యాలయం నుంచే వర్సిటీకి సంబంధించి కార్యకలాపాలు చేపడతారు. అందుకోసం ఆయనకు ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేస్తారు. వరంగల్‌లో భవనాల నిర్మాణం, ఇతరత్రా పనులన్నింటినీ ఆయన ఇక్కడి నుంచే చూసుకుంటారు. వైస్ చాన్స్‌లర్‌ను నియమించే వరకూ ఆయనే కీలకంగా ఉంటారు. ఇదిలావుంటే వర్సిటీని వరంగల్ కంటే హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అన్ని రకాలుగా హైదరాబాద్ అనుకూలమైందని...విద్యార్థులకు ఇది సౌలభ్యంగా ఉంటుందన్న భావన కూడా ఉంది. గతంలో వైద్య మంత్రిగా ఉన్న రాజయ్య వరంగల్‌కు చెందిన వ్యక్తి కావడంతో వర్సిటీని అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారని... ఇప్పుడు పరిస్థితి మారినందున హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని వైద్యశాఖ అధికారులు కొట్టిపారేస్తున్నారు.
80 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం...
విశ్వవిద్యాలయం కార్యకలాపాల కోసం సిబ్బంది నియామకానికి సంబంధించి సీఎం కేసీఆర్ 80 పోస్టులను మంజూరుచేశారు. వాటిని మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తారా? లేక టీఎస్‌పీఎస్‌సీ కింద భర్తీ చేస్తారా.. అనే అంశంపై స్పష్టత రావాలి. ఆ పోస్టులన్నీ వర్సిటీ పరిపాలనాపరమైన పోస్టులే కావడం గమనార్హం.
వర్సిటీ అక్కడ.. పరిపాలన ఇక్కడ
Published Fri, Jul 31 2015 1:58 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement
Advertisement