![Kaloji Narayana Rao 110th Birth Anniversery celebrations at Ravindra Bharathi](/styles/webp/s3/article_images/2024/09/10/kaloji.jpg.webp?itok=-KQ1v8Wv)
పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. ఆయన 110వ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన " బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది. జి.శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం చూపరులను కట్టిపడేసింది. కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు దక్కాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్, లైటింగ్ అద్భుత అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు ప్రశంసలు కురిశాయి.
ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకబృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఆయన కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ టెటా బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment