natakaalu
-
కాళోజీ దిగి వచ్చాడా!.. 'బతుకంతా దేశానిది' ప్రదర్శన ఓ అద్భుతం!
పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. ఆయన 110వ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ సేవలను స్మరించుకున్నారు.ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన " బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది. జి.శివ రామ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నాటకం చూపరులను కట్టిపడేసింది. కాళోజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను కథాంశంగా తీసుకుని నాటకాన్ని మలిచిన తీరుకు ప్రశంసలు దక్కాయి. నటీనటుల హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, ఉత్కంఠ భరిత మ్యూజిక్, లైటింగ్ అద్భుత అనుభవాన్ని పంచాయి. కాళోజీగా అద్భుతంగా నటించిన శివరామ్ రెడ్డి నటనకు ప్రశంసలు కురిశాయి.ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నాటకబృందాన్ని అభినందించారు. యువతరం నాటకాల వైపు అడుగువేయాలని ఆయన కోరారు. ప్రముఖ ఆర్టిస్ట్ మైమ్ మధు, డైరెక్టర్ అజిత్ నాగ్, రంగస్థల దర్శకుడు మోహన్ సేనాపతి, మేచినేని శ్రీనివాసరావు, ఉస్తాద్ ఒగ్గు రవి, డా. ఖాజా పాషా, డ్రీమ్ కాస్ట్యూమ్ కిరణ్, మేకప్ మెన్ మల్లాది గోపాలకృష్ణ టెటా బృందాన్ని కొనియాడారు. ఇలాంటి వేదికపై నాటకం ప్రదర్శించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. -
నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా నాటోత్సవ్ - 8 ప్రారంభం ఎప్పుడంటే..?
నిశుంబిత అంటే పూర్తిగా సాంఘిక నాటకాలకు కేరాఫ్ అనే చెప్పాలి. వీధినాటకాలు నిశుంబిత ప్రత్యేకత. సామాజికంగా ఆలోచింపజేసే కధలను వీరు నాటకాల్లో చూపిస్తారు. నిశుంబితలో కమర్షియాల్టీకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. నిశుంబితలో యాక్టింగ్, డైరెక్షన్ లాంటివి నేర్చుకున్న వందల మంది టీవి, సినిమా లాంటి మాధ్యమాల్లో రాణించారు. ఇప్పుడు నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా నాటోత్సవ్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఏనిమిదో నాటోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 మార్చి 23 నుంచి 27 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. నిశుంబిత 30 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన థియేటర్ వర్క్‌షాప్ ద్వారా నూతనంగా ఎంపికైన వారితో కలిసి ప్రదర్శన ఇస్తున్న నిశుంబిత బృందంలోని రంగస్థల అనుభవజ్ఞులు, నాటక పాఠశాల వ్యవస్థాపకుడు రామ్మోహన్ హోలగుండి నిశుంబిత ఫౌండర్, మెంబర్ ఆలోచనల ద్వారా నాటోత్సవ్ రూపొందించబడింది. నిశుంబిత నుంచి ఎన్నో సాంఘిక నాటకాలు వచ్చాయి. ముఖ్యంగా వీధినాటకాలు నిశుంబిత ప్రత్యేకత అని చెప్పవచ్చు. సామాజికంగా ఆలోచింపజేసే కధలను వీరు నాటకాల్లో చూపిస్తారు. అవార్డు-గెలుచుకున్న కన్నడ నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తన మాగ్నమ్ ఓపస్ నాగమండలకి ప్రసిద్ధి చెందాడు, ఇది కర్ణాటక గ్రామీణ జానపద కథల ఆధారంగా రూపొందించిన గొప్ప నాటకం. దాని తెలుగు అనుసరణ ప్రదర్శించబడుతుంది. నిశుంబిత ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు నాటకం 'కుక్క' ప్రదర్శన ఉంది. ఇది భూస్వాముల కులీన పాలనను వర్ణిస్తుంది. 'మిట్టి కీ ఖిలౌనీ పిల్లల విద్య గురించి చెబితే.. రావణ రావణము భారతీయ ఇతిహాసాలలో విలన్లా ఉన్న రావణుడి గురించి వర్ణిస్తుంది. వుయ్ టూ.. అనేది మహిళా సాధికారత నినాదాల గురించి ఉన్న నాటకం. ఒక పురుషుని మౌనంపై ఆలోచింపజేసే ఏకపాత్రాభినయంతో ఉన్న నాటకం. అవి నాటోత్సవ్ వేదికగా ప్రదర్శితం అవుతాయి. మరిన్ని వివరాల కోసం శ్రీమతి దేవికా దాస్, టీమ్ నిశుంబిత, 9971268729 నుంచి సంప్రదించండి. -
AP: 25 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు
విజయవాడ కల్చరల్: రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా చెప్పారు. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో వైఎస్సార్ కళాపరిషత్ ద్వారా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 20 శాతం చిత్రీకరణ జరపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిర్మాతలు, దర్శకులు సహకరించాలని కోరారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారికి గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగస్థల కళాకారిణి రాజేశ్వరి మాట్లాడుతూ.. కళాకారులకు బస్‌పాస్ రాయితీ ఇవ్వాలని కోరారు. సినిమాలను ఏపీలో కూడా చిత్రీకరించి.. స్థానిక కళాకారులకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఉపాధ్యక్షుడు సుఖమంచి కోటేశ్వరరావు, సభ్యులు కొప్పుల ఆనంద్, బొర్రా నరసయ్య పాల్గొన్నారు. (క్లిక్: త్యాగానికి బహుమతి.. పరిహారం మంజూరు) -
నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు
‘నాటకం తరతరాల నుంచి మానవ సంస్కృతిలో ఒక భాగంగా ఉంటూ వస్తున్నది. మిగిలిన ఏ ఇతర సాహిత్య ప్రక్రియ ఇవ్వలేని ఆత్మతృప్తి నాటకం ఇస్తున్నది’ – ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. ఒక జమీందారీ హయాంలో పెత్తనం చలాయించే రాజోద్యోగులు చేసే దుష్టచర్యలను గ్రహించి విచారించి వారికి దేశ బహిష్కరణ శిక్ష విధించి పరిస్థితులను చక్కదిద్దిన ఇతివృత్తంతో నడిచిన నాటకం ‘నందక రాజ్యము’. గుంటూరు సీమలోని రేపల్లె ప్రాంతానికి చెందిన కారుమూరు గ్రామవాసి వావిలాల వాసుదేవశాస్త్రి ఈ నాటక రచయిత. తెలుగులో తొలి సాంఘిక నాటకం ‘నందక రాజ్యము’. రచనా కాలం 1880. తెలుగునాట శతాబ్ది కిందట కొనసాగిన వృద్ధ వివాహ దురాచారాన్ని ‘నిర్మాణ కాలంలో కల్యాణమా? మరణశయ్య మీద మంగళహారతులా?’ అని ప్రశ్నిస్తూ పానుగంటి లక్ష్మీనరసింహారావు 1910లో రచించిన ‘వృద్ధ వివాహము’ నాటకం ఆనాటి సాంఘిక దురాచారాల్ని నిరసించింది. (చదవండి: కళ్లు తెరిపించే కథా రచయిత్రి) స్వాతంత్య్రోద్యమకాలంలో అమృతసర్ జలియన్‌వాలాబాగ్‌లో 1919 సంవత్సరం ఏప్రిల్ 13న (నేడు వామపక్షాలు మృతవీరుల దినంగా జరుపుకుంటున్న రోజు) జరిగిన ఘోర దురాగతానికి పౌరాణిక రూపమిచ్చి దేశభక్తిని రగిల్చిన నాటకం ‘పాంచాల పరాభవము’. గుంటూరుకు చెందిన న్యాయవాది దామరాజు పుండరీకాక్షుడు 1921లో రాసిన ఈ నాటకం నిషేధానికి గురైంది. నాటక రచనల వలన జైలుపాలైన దేశభక్తుడీ రచయిత. ‘ఈ పంజాబు దుండగాలు ఆరని అగ్రిహోత్రమై మన దాస్య బంధనములను దహించివేయును’ అనే తీవ్ర ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన నాటకం ‘పాంచాల పరాభవము’. 1880లో ప్రారంభమైన తెలుగు నాటకం 2020 వరకూ అంటే ఈ 140 ఏళ్లలో సమాజంతోపాటు నడుస్తూ, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ, సామాజిక చైతన్యాన్ని కలిగిస్తూ ప్రగతిశీల దృక్పథంతో నడిచిందనటానికి నిదర్శనంగా ఈ మూడు నాటకాలను రేఖా మాత్రంగా పరిచయం చేశాను. (చదవండి: జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు) ఈ నూటా నలభై ఏళ్ల కాలంలో తెలుగు సామాజిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సమూహాలకు చేరువైన నూరు నాటకాలను సంకలనం చేసి సుమారు ఐదువేల పేజీలతో ఆరు నాటక సంకలనాలుగా అందించారు వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి. నాలుగు దశాబ్దాలుగా నాటకంతో ప్రయాణిస్తున్న ఈ ఇరువురూ తెలుగు నాటకరంగానికి అందించిన అపూర్వకానుకలు ఈ సంకలనాలు. గతంలో ‘ప్రసిద్ధ తెలుగు నాటికలు’, ‘ప్రసిద్ధ తెలుగు హాస్యనాటికలు’, 108 నాటికలను రెండు సంకలనాలుగా, ‘ప్రసిద్ధ పిల్లల నాటికలు’ సంకలనాన్ని అందించిన చరిత్ర ఈ సంపాదకులకు ఉంది. (మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి, గుంటూరు జిల్లా, తానా ప్రచురణలు – ఉత్తర అమెరికా ప్రచురించిన ఈ సంకలనాలను భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 19 నవంబర్ 2021న హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. తెలుగు నాటకానికి తేజస్సునూ ఓజస్సునూ కలిగించిన వారు గురజాడ వెంకట అప్పారావు. 1897లో తొలి ముద్రణ పొంది 1909లో నూతన జవజీవాలు పోసుకొని ప్రజల చేతికీ, నోటికీ అందిన తొలి నాటకం కన్యాశుల్కం. తెలుగులో వాడుక భాషలో వచ్చిన కన్యాశుల్కం పాశ్యాత్య పోకడలను పోయి ‘సోషల్ కామెడీ’ని అందించింది. సామాజిక ప్రయోజనాలను సాధించింది. గురజాడ మార్గంలో ఆధునిక తెలుగు కథ, గీతం నడిచినట్లుగానే నాటకమూ నడిచింది. (కన్యాశుల్కం అందుబాటులో ఉన్నందున ఈ సంకలనాలలో ఆ నాటకాన్ని సంపాదకులు చేర్చలేదు) అందుకు సాక్ష్యాలు ఈ వంద నాటకాలు. ‘సంఘ సంస్కరణాభిలాషతో ప్రారంభమైన సాంఘిక నాటకం జాతీయోద్యమకాలంలో దేశభక్తి ప్రబోధంగా నిలబడి ప్రజలను ఉద్యమ కార్యోన్ముఖులను చేసింది. స్వతంత్రం ప్రకటించిన తదుపరి భారతదేశంలో చెలరేగిన మత కలహాలను నిరసించింది. కులం, మతంలాంటి సాంఘిక దురాచారాల్ని దుయ్యబట్టింది. బొగ్గుగని కార్మికుల సమస్యలను ఎత్తి చూపింది. స్వాతంత్య్రానంతర కాలంలో స్వదేశీ పాలనలో వేళ్లూనుకొంటున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని, స్వార్థపూరితమైన ఓట్ల రాజకీయాల్ని ఎండగట్టింది. కార్మికులు, కర్షకులు, కూలీనాలీ జనం శ్రమదోపిడీని ఎలుగెత్తి చూపింది. ఆకలి, నిరుద్యోగం, వైవాహిక సమస్యలు, భూమి సమస్య, శ్రమ దోపిడీ, దళారి వ్యవస్థ, రాజ్యహింస, దళిత సమస్యలు, విద్యావిధానంలోని మార్పులు, విద్య కార్పొరేటీకరణ, విద్యార్థులపై ఒత్తిడులను చర్చించింది. పట్టణ ప్రాంతపు ప్రజల సాధకబాధకాలను దృశ్యమానం చేయగలిగింది. పురుషాహంకారం, స్త్రీల సమస్యలు, స్త్రీ, పురుష సంబంధాలలోని లోటుపాట్లు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య, మానవ సంబంధాల్లో లోపిస్తున్న మానవీయత మొదలగు అనేక అంశాలను అభ్యుదయ దృష్టితో చర్చించగలిగింది’. తెలుగు నాటకం – సామాజికత శీర్షికన సంకలన సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ రాసిన ఈ మాటలు ఈ వంద నాటకాల సారాల్ని మన ముందుంచాయి. ఈ మాటలతో పాటు ‘తెలుగు నాటకం నిరాడంబరంగా కొనసాగిందేమో కాని నిష్ప్రయోజనంగా మాత్రం అపఖ్యాతిని మూటగట్టుకోలేదు. తెలుగు నాటకం సామాన్యుల కోసం రాయబడింది. సామాన్యుల ప్రయోజనం కోసం ఆడింపబడింది. సామాజిక అభ్యున్నతి కోసం నిలబడింది’. శివప్రసాద్ చెప్పిన మాటలు తెలుగు నాటక చరిత్రను పరిశీలిస్తున్న వారూ, పరిశోధిస్తున్న వారూ నిజమేనంటారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నట్లు, ఈ వంద నాటకాలు నిస్సందేహంగా ఒకటిన్నర శతాబ్దపు సమాజ చరిత్ర రచనకు విశ్వసనీయమైన ఆధారాలుగా నిలుస్తాయి! ఈ నాటకాల రచయితలు ప్రసిద్ధులు. ప్రతి నాటకమూ ఒక ప్రత్యేకతతో కూడుకున్నదే. అనేకం ప్రదర్శనాపరంగా జయప్రదమైనవే. జీవద్భాషను మాట్లాడినవే. మొత్తంగా తెలుగు సమాజాన్ని మన ముందుంచిన ఈ నాటక సంకలనాలను ఆదరించాల్సిన బాధ్యత తెలుగు సమాజానిది. ఏ అకాడమీలో, పీఠాలో, విశ్వవిద్యాలయాలో చేయ్యాల్సిన ఈ పనిని వారెవరూ చెయ్యకపోయినా, చేస్తారని ఎదురు చూడకుండా అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రజా సాంస్కృతికోద్యమంతో ప్రగాఢ సంబంధాలున్న వల్లూరు శివప్రసాద్, గంగోత్రి సాయి ఎంతో శ్రమకోర్చి సాహిత్యం, సమాజం పట్ల బాధ్యతతో ఈ సంకలనాలను అందించినందుకు మాటల్లో అభినందనీయులు. – పెనుగొండ లక్ష్మీనారాయణ ‘అరసం’ జాతీయ కార్యదర్శి -
World Theatre Day: నాటకం సర్వజనీయం
ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశలు జరుపుకునే రోజు మార్చి 27. ఈ రోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. దాదాపు ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు అరవికివియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ అంగీకరించాక తదుపరి ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్య పూర్తి స్థాయిలో మొదలైంది. రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. ఐక్యరాజ్యసమితి, యునెస్కోలచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాల ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షలు జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగతసారాన్ని ఆ సంవత్సరం సందేశంగా ప్రపంచ రంగస్థలానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్తుడు అందించాడు. అప్పటినుంచి ప్రతీ ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. (నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం) – గాదిరాజు రంగరాజు, రంగస్థల నటుడు, చెరుకువాడ మొబైల్ : 87901 22275 -
సహజ నటుడు.. కర్నూలు అల్లుడు!
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : నటనకు కొత్త భాష్యం చెప్పి నాటక రంగంలో సమూల మార్పులకు నాది పలికిన నటుడు, ప్రయోక్త, నాటక రచయిత బళ్లారి రాఘవగా ప్రసిద్ధికెక్కినారు తాడిపత్రి రాఘవాచార్యులు. కర్నూలు ఆడపడుచును వివాహం చేసుకోవడం, ఇక్కడే న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్, కేసులు వాదించడం ద్వారా ఆయన ఈ ప్రాంతానికి సుపరిచితులయ్యారు. ఆ మహానటుని 140వ జయంతి (శుక్రవారం) సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత. ఈ సందర్భంగా నటులు, ప్రయోక్తలు తమకు స్ఫూర్తిదాయకమైన ఆయన నటనా జీవితంలోని విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. మహాత్మున్నే మైమరిపించారు.. తన నటనా కౌశలత్వంతో మహాత్మున్నే మైమరిపించి రాఘవ మహారాజ్‌కు జై అనిపించుకున్న మహానటుడు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అప్పటికప్పుడు అలవోకగా డైలాగులు చెప్పి ప్రేక్షకులను మైమరింపజేసే సహజ నటుడు బళ్లారి రాఘవ మన కర్నూలుకు సుపరిచితులే. మహాత్మా గాంధీ క్రమశిక్షణ గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు బాగా తెలుసు. ప్రార్థనా సమయానికి బాపూజీ ఎంత ప్రాముఖ్యం ఇస్తారో కూడా తెలుసు. అయినా గాంధీజీతో పాటు నాటకాన్ని చూడాలని ఠాగూరు ముచ్చట పడ్డారట. ఆయన అభ్యర్థనను కాదనలేక ఎట్టకేలకు జాతిపిత ఆయన వెంట ‘దీనబంధు కబీర్’ నాటకాన్ని చూడడానికి వెళ్లారట. నాటకాన్ని చూడటంలో మునిగిపోయిన గాంధీజీ ప్రార్థనా సమయం ఆసన్నమైందని ఠాగూర్ గుర్తు చేసినా ఆయన పట్టించుకోలేదట. పైగా ఆ నాటకం చూడటమంటే ప్రార్థన చేసినట్లే అని నాటకం పట్ల మహాత్ముడు తన గౌరవాన్ని ప్రకటించారట. ముఖ్యంగా ‘దీనబంధు కబీర్’ నాటకంలో ప్రధాన పాత్రదారి నటన ఆయనను ఎంతగానో ఆకట్టుకుందట. పట్టరాని ఆనందంతో ‘రాఘవ మహారాజ్‌కు జై’ అని బాపూజీ నాటకశాలలోనే నినాదాలు చెయ్యడమే అందుకు ప్రబల నిదర్శనం. వృత్తి న్యాయవాద రంగం.. ప్రవృతి నాటకరంగం మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న రాఘవాచార్యులు.. మేనమామ ధర్మవరం కృష్ణమాచార్యులు వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రవృత్తిగా నాటక రంగాన్ని ఎంచుకున్నారు. స్వయంగా నాటక రచయిత అయిన తన మేనమామ ఆధ్వర్యంలో నాటక సమాజంలో పాలుపంచుకోకుండా కోలా చలం నడుపుతున్న ‘సుమనోరమ సభ’ ప్రదర్శించే నాటకల్లో నటించేవారు. ఆ నాటక సమాజం పక్షాన ప్రదర్శించిన రామరాజు చరిత్రలో ఆయన అద్భుత నటనకు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసలు అందుకున్నారు. న్యాయవాద వృత్తిలో బాగా సంపాదించినప్పటికి ఆయన ఎలాంటి ఆస్తులు కొనుక్కోవడం కానీ ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ చేయలేదు. సంపాదనంతా నాటకాల ప్రదర్శనలు, సమాజ సేవకు వినియోగించారని చెబుతారు. గాంధీజీని ఆకర్షించిన అభినయ శీలి బళ్లారి రాఘవ గొప్ప నటుడు. పలు భాషల్లో నాటకాలు ప్రదర్శించారు. షేక్‌ష్పియర్ రాసిన ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. గాంధీజీనే ఆకర్షించిన మహా నటుడు. వృత్తి, ప్రవృత్తుల్లో ఉన్నతంగా రాణించాడు. జాతి ప్రగతికి మూఢాచారుల నిర్మూలనకు తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. రాఘవ సేవలకు గుర్తుగా ఆయన పేరుతో స్టాంప్‌ను విడుదల చేశారు. కర్నూలుతో ఆయనకు అనుబంధం ఉంది. న్యాయవాదిగా కర్నూలు కోర్టుకు వచ్చేవారు. –చంద్రశేఖర కల్కూర, సాహితీ వేత్త త్యాగధనుడు.. రాఘవాచార్యులు బళ్లారి రాఘవ తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికి వెచ్చించిన త్యాగధనుడు. ప్రతి క్షణం సమాజం కోసం పరితపించారు. కళ.. సమాజంలో మార్పు కోసం ఉపయోగపడాలనుకునేవారు. కళను నమ్ముకోవాలి కానీ, అమ్ముకోకూడదని విశ్వసించారు. తెలుగు నాటక రంగం ఉన్నంత వరకు ఆయన పేరు అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. – మమత, తెలుగు టీచర్ -
నంద్యాలలో మినీ నంది నాటకోత్సవం
– 27 నుంచి ప్రారంభం – బ్రోచర్లు విడుదల నంద్యాల: రాష్ట్ర చలన చిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) సహకారంతో స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో ఈ నెల 27 నుండి 29 వరకు మినీ నందినాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ తెలిపారు. స్థానిక మధుమణి కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డు సాధించిన కళాకారులకు సన్మానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు భవనాశి మహేష్, రమేష్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు ఎస్ఆర్ఎస్ ప్రసాద్, రవిప్రకాష్, పెసల శ్రీకాంత్, కరీముద్దీన్ అలియాస్ చందన్ పాల్గొన్నారు. 27వ తేదీ: బంగారు నంది అవార్డు సాధించిన నాటకం జీవితార్థంను గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ సంస్థ కళాకారులు ప్రదర్శిస్తారు. 28వతేదీ: బంగారు నంది అవార్డు పొందిన బాలల సాంఘిక నాటకాన్ని గురురాజ కాన్సెప్ట్ స్కూల్, కళారాధన ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శిస్తారు. డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి చారిత్రాత్మక పద్యనాటకం, కళారాధన రూపొందించిన సైకత శిల్పం సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తారు. ప్రముఖ వైద్యుడు చిత్తలూరి మధుసూదనరావుకు మదర్‌థెరిసా జీవిత కాల సేవ పురస్కారం ప్రదానం చేస్తారు. నెల్లూరుకు చెందిన జ్ఞాన నేత్ర సంఘం అంధుల సంగీత విభావరి ఉంటుంది. 28వ తేదీ: జాతీయ క్రీడాదినోత్సవం, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళం ఏర్పాటు. అనంతరం కవుల సన్మానం. ఆయుర్వేద వైద్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మకు కళారాధన ఆత్మీయ సత్కారం ఉంటుంది. రంగస్థల నటుడు గోపిశెట్టి వెంకటేశ్వర్, పౌరాణిక నటుడు రంగారెడ్డికి పురస్కార ప్రదానం.